గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 16, 2015

ఏపీ.. పీజీ.. పితలాటకం!

- హైదరాబాద్‌లో వైద్య పీజీ కౌన్సెలింగ్‌పై కిరికిరి
- సాంకేతిక సాకులు చూపుతూ అడ్డుపుల్ల
- ఎంసెట్‌లో సాధ్యమైనపుడు ఇక్కడేం సమస్య?
- ప్రశ్నిస్తున్న తెలంగాణ అధికారులు
- సీఎస్‌తో చర్చించాక తుది నిర్ణయం
వైద్య పీజీ కౌన్సెలింగ్‌పై ఏపీ అధికారులు కొత్త పేచీ పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే కౌన్సెలింగ్ అయినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా హైదరాబాద్‌లో నిర్వహించడం సాధ్యంకాదంటూ కిరికిరి చేస్తున్నారు. ఆధునికయుగంలో.. ఇంత పరిజ్ఞానం అందుబాటులో ఉండగా అదెలా సాధ్యం కాదనేది తెలంగాణ అధికారుల వాదన. ఏపీ అధికారులు చూపుతున్న సాకులపై ముఖ్య కార్యదర్శితో సంప్రదించి, తుది నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరున జరిగే మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చేపట్టనుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు విజయవాడలోనే ఈ ప్రక్రియ జరుగుతుండేది. వాస్తవంగా ఇది ఆన్‌లైన్‌లో జరిగే కౌన్సెలింగ్ అయినందున ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఎన్ని కేంద్రాల్లోనైనా నిర్వహించేందుకు ఆస్కారముంది. 

రాష్ట్రం విడిపోయిన దరిమిలా ప్రస్తుత ఏడాదికి ఉమ్మడిగా ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా.. హైదరాబాద్‌లోనూ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య విద్య అధికారులు కసరత్తుచేశారు. దీంతో తెలంగాణ విద్యార్థులు విజయవాడదాకా వెళ్లకుండా.. హైదరాబాద్‌లోనే కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. పైగా ఆన్‌లైన్ విధానం కావడంతో పెద్ద సమస్య ఏమీ ఉండదని అధికారులు చెప్తున్నారు. కానీ ఏపీ అధికారులు మాత్రం అందుకు అడ్డుపుల్ల వేస్తున్నారు. హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం సాధ్యం కాదంటూ సాంకేతిక సాకులు చూపుతున్నారు. ఈ మేరకు ఏపీ వైద్య విద్యా సంచాలకులు రవిరాజు ప్రకటన కూడా చేశారు. 

ఎంసెట్‌లో ఎలా సాధ్యమైంది?: ఏపీ అధికారుల వాదనపై తెలంగాణ అధికారులు విస్మయం...

...వ్యక్తంచేస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఎక్కడైనా కౌన్సెలింగ్ నిర్వహించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఏపీ అధికారులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా గతంలోనూ ఎంసెట్‌లో భాగంగా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఉండేది. ఆన్‌లైన్ విధానం కావడంతో దూర ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు ఉండకుండా వరంగల్‌లో కూడా మరో కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీంతో ఒకేసారి హైదరాబాద్, వరంగల్‌లో కౌన్సెలింగ్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. తద్వారా నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల విద్యార్థులు హైదరాబాద్ దాకా రాకుండా వరంగల్‌లోని కేంద్రంలో హాజరయ్యేవారు.


ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నపుడు పీజీ కౌన్సెలింగ్‌లోనూ అది సాధ్యం అవుతుంది కదా! అని తెలంగాణ అధికారులు అంటున్నారు. దీనివల్ల తెలంగాణకు చెందిన విద్యార్థులు విజయవాడదాకా వెళ్లే అవసరం లేకుండా హైదరాబాద్‌లోనే కౌన్సిలింగ్‌లో పాల్గొనే సౌలభ్యం ఉంటుందన్నారు. ఏపీ అధికారుల వాదనపై వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సతీష్ చందాతో సంప్రదించి, తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్య్హంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి