గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

విశ్వనగరిగా భాగ్యనగరి!!!

-20 వేల కోట్ల పెట్టుబడులకు షాపూర్‌జీ పల్లోంజీ అంగీకారం
-నిర్మాణబాధ్యతలూ స్వీకరిస్తామని ప్రకటన..
-ఇక నగరం నలువైపులా సూపర్ స్కైవేలు..
-జంక్షన్లు, సిగ్నల్ ఫ్రీ కారిడార్లు
- న్యూయార్క్, లండన్ సిటీలకు దీటుగా రోడ్లు
- అన్ని జంక్షన్లలో మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు
- 50 కేంద్రాల్లో మల్టీలెవెల్ కార్‍పార్కింగ్‌లు
- ట్రాఫిక్ నిమిషంకూడా ఆగకుండా ఏర్పాట్లు
- మరో 9వేల కోట్లతో డ్రెయిన్ల ఆధునీకరణ
- అధునాత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణం
- గ్రీన్‌కవర్ పెంచడానికి ముమ్మరంగా చర్యలు
- శ్మశానవాటికలకు పచ్చతోరణం
- సిగ్నల్ ఫ్రీ రోడ్లుగా 11 రహదారులు, 16 జంక్షన్లు
- 16ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, గ్రేడ్ సెపరేటర్లు
- కేబీఆర్ పార్కు చుట్టూ స్కైవేలు, ఫ్లైఓవర్లు
- అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు
- లీ అసోసియేట్స్ - జీహెచ్‌ఎంసీ బృహత్ప్రణాళిక
భాగ్యనగరాన్ని విశ్వనగరిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నడుం బిగించారు. ఆ సంకల్పానికి గురువారం కీలక ముందడుగు పడింది. విశ్వనగరి ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రఖ్యాత నిర్మాణ రంగ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ముందుకు వచ్చింది. ప్రపంచంలోని అత్యంత ఆధునిక నగరాలకు దీటుగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి లీ అసోసియేట్స్ జీహెచ్‌ఎంసీతో కలిసి ఒక బృహత్ప్రణాళికను రూపొందించింది. నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా వాహనం ఆగకుండా వెళ్లేలా చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రణాళికను అమలుచేసే క్రమంలో రూ.20 వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టడానికి షాపూర్‌జీ కంపెనీ ముందుకొచ్చింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ చైర్మన్ షాపూర్ పీ. మిస్త్రీ, ఎండీ సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు దీక్షిత్, మాన్వి తదితరులు కలిశారు. ముఖ్యమంత్రి సుమారు 9 గంటలపాటు విశ్వనగరి ప్రాజెక్టుపై షాపూర్‌జీ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, బీ వినోద్‌కుమార్ కూడా పాల్గొన్నారు.

kcr-K


ప్రపంచ నగరాలకు దీటుగా:
న్యూయార్క్, లండన్‌లతో సహా ప్రపంచంలో ఏ నగరానికీ తీసిపోనివిధంగా భాగ్యనగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. విశ్వనగరి ప్రాజెక్టులో భాగంగా రానున్న మూడు దశాబ్దాల్లో తలెత్తనున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేయాలని ఆయన షాపూర్‌జీ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. రోడ్లను తగినంతగా విస్తరించడంతోపాటు నగరం నుంచి ఒక్క నిమిషం కూడా ఆగకుండా అన్ని హైవేలకు దారితీసే విధంగా 100 కి.మీ. స్కైవేలు, అన్ని జంక్షన్లలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రోడ్లపై గ్రేడ్‌సెపరేటర్లు ఏర్పాటుచేస్తారు. వేగ నియంత్రణకు స్పీడ్‌గన్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. నగరంలో 50 చోట్ల మల్టీలెవెల్ కార్ పార్కింగ్ భవనాలు నిర్మించాలని, ఒక్కో భవనంలో వెయ్యి కార్లు నిలిపే విధంగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశ్వనగరి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి షాపూర్‌జీ కంపెనీ ప్రతినిధులకు చూపారు. నగరంలో కొత్త సెక్రటేరియట్, అత్యాధునిక పోలీస్ ప్రధాన కార్యాలయం, కళాభారతి తదితర నిర్మాణాల ప్రతిపాదనలను కూడా వివరించారు. విశ్వనగరి ప్రాజెక్టు తమకు బాగా నచ్చిందని షాపూర్‌జీ కంపెనీ ప్రతినిధులు సీఎంకు చెప్పారు. హైదరాబాద్‌పై ముఖ్యమంత్రి విజన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వెంటనే ముందుకు వచ్చారు. యాన్యుయిటీ (ఏడాదికి కొంత చొప్పున) ప్రాతిపదికన తిరిగి చెల్లించే ఒప్పందంపై 20 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని ప్రకటించారు. అంతేగాక స్వయంగా నిర్మాణపనులు చేపట్టడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీటికి సంబంధించి చర్చలు జరుపుతారు.


మౌలిక వసతుల నిర్మాణానికీ సంసిద్ధత:


షాపూర్‌జీ కంపెనీ 150 సంత్సరాలుగా నిర్మాణరంగంలో ఉన్నది. రోడ్డు రవాణా వ్యవస్థను ఆధునీకరించడంతోపాటు నగరంలో ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో నాలుగు గంటలపాటు చర్చించారు. వర్షపునీరు సాఫీగా వెళ్లే విధంగా మరో రూ.9వేల కోట్లతో డ్రెయిన్లను ఆధునీకరించాలని, ఇతర మౌలిక వసతులను నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కూడా పెట్టుబడలు పెట్టడానికి షాపూర్‌జీ కంపెనీ ఆసక్తి చూపించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే అకాంక్షను కంపెనీ ప్రతినిధులు వెలిబుచ్చారు.


మారిపోనున్న నగర రూపురేఖలు:


discription

ప్రస్తుతం ఉన్న డ్రెయిన్లను విస్తరించడంతో పాటు మొత్తం డ్రెయినేజి వ్వవస్థను పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విస్తరించాలని, ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. విశ్వనగరి ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ నగరంలో ఆధునిక వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను నిర్మిస్తుంది. బస్ షెల్టర్లు, బస్ బేలు, నైట్ షెల్టర్లు, ఫుట్‌పాత్ నిర్మాణానికి కూడా జీహెచ్‌ఎంసీ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. నగరంలో గ్రీన్‌కవర్‌ను వీలైనంత ఎక్కువగా పెంచడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. శ్మశానవాటికలలో పార్కుల నిర్మాణం కూడా ఇందులో భాగంగానే చేపట్టనున్నారు. నగరంలో 7,500 నుంచి 10వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా స్థలాలను గుర్తించి, అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని వారిని ముఖ్యమంత్రి కోరారు. ఎ ముఖ్యమంత్రితో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్‌లోని మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి, నాలాల సక్రమ వినియోగం తదితర అంశాలుకూడా చర్చకు వచ్చాయి. వాటినికూడా త్వరలోనే చేపట్టాలని నిర్ణయించారు. 


మొదటిదశలో 1250 కోట్ల పెట్టుబడి:


ప్రాధాన్య క్రమంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సుమారు రూ.1250కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 11 రోడ్లు, 16 జంక్షన్లను సిగ్నల్ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు, 16ప్రాంతాల్లో ైఫ్లెఓవర్లు (గ్రేడ్ సెపరేటర్లు) నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఫ్లైఓవర్లలో పది మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు కాగా, మరో ఆరు సింగిల్ లెవెల్ ఫ్లైఓవర్లున్నారు. పది జంక్షన్లతోపాటు కేబీఆర్ పార్కు చుట్టూ స్కైవేలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. 100 కిలోమీటర్ల పొడవున రోడ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో సిగ్నల్ ఫ్రీ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో మొదటి దశలో ఉప్పల్-మెహిదీపట్నం, జేఎన్‌టీయూ కూకట్‌పల్లి- బయోడైవర్సిటీ పార్కు వరకు కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సుమారు రూ.1200-1300 కోట్లతో కేబీఆర్ పార్కుచుట్టూ గ్రేడ్ సెపరేటర్లతోపాటు మరో ఆరు ప్రాజక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో దుర్గం చెరువు మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నం-45నుంచి ఇనార్బిట్ మాల్‌వరకు వంతెనతోపాటు ఉప్పల్ జంక్షన్, ఎల్‌బీ నగర్, బహదూర్‌పుర, రసూల్‌పుర, బాలానగర్ (నర్సాపూర్ క్రాస్ రోడ్స్) తదితర ప్రాంతాల్లో కారిడార్లు, ఫ్లైఓవర్లు నిర్మించాలని నిశ్చయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం-45నుంచి ఇనార్బిట్ మాల్ వరకు దుర్గం చెరువు మీదుగా నిర్మించే వంతెనకు రూ. 284 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. కేబీఆర్ పార్కు చుట్టూ ప్రతిపాదిత ఆరు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లకు రూ. 515కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు.


విశ్వనగరికి ఇవీ ప్రాజెక్టులు:


184 కి.మీ. పొడవున 11 కారిడార్లు, 364కి.మీ. పొడవున రహదారులు, 1400 కిలోమీటర్ల మేర అంతర్జాతీయస్థాయిలో రోడ్ల పునరుద్ధరణ.


మొదటి ప్రాధాన్యతగా చేపట్టనున్న రోడ్లు, ఫై ్లఓవర్ల, గ్రేడ్ సెపరేటర్ల వివరాలు:


ఉప్పల్ జంక్షన్-సంగీత్ జంక్షన్; రోడ్ నం-45-ఇనార్బిట్ మాల్; కేబీఆర్ పార్కు చుట్టూ మల్టీ లెవెల్, ఫ్లైఓవర్లు, ఇంటర్‌చేంజెస్; ఎల్బీనగర్ జంక్షన్, బహదూర్‌పుర, రసూల్‌పుర, బాలానగర్ (నర్సాపూర్ క్రాస్‌రోడ్స్), బయోడైవర్సిటీ జంక్షన్-కూకట్‌పల్లి, అంబేద్కర్ విగ్రహం (ట్యాంక్‌బండ్)-అఫ్జల్‌గంజ్, ఆబిడ్స్ జంక్షన్-చాదర్‌ఘాట్ జంక్షన్ వయా కోఠీ, హబ్సిగూడ-ఐడీఏ మల్లాపూర్ వయా నాచారం, హయాత్‌నగర్-నల్గొండ క్రాస్‌రోడ్స్, చాదర్‌ఘాట్- పుత్లీబౌలీ- జాంబాగ్- ఏక్‌మినార్, జంక్షన్-నాంపల్లి, పురానాపూల్-ఆరాంఘర్ వయా జూపార్క్; కేబీఆర్ పార్కుచుట్టూ రోడ్లు, కేబీఆర్ పార్కు ఎంట్రన్స్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, మహరాజా అగ్రసేన్ చౌక్, రోడ్ నం-12, ఫిలింనగర్ రోడ్ జంక్షన్, రోడ్-45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి