గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 26, 2015

చంద్రబాబూ.. ఇక చాలించు!


నువ్వు సరిగా పరుగెత్తలేకపోతే పక్కవాడు పరుగెత్తకుండా చూడు. నీకు మంచి పేరు లేకపోతే పక్కవాడి పేరు చెడగొట్టు. నీకు సమస్యలు ఉంటే పక్కవాడికి సమస్యలు సృష్టించు. నీకు నవ్వు రాకపోతే పక్కవాడిని ఏడిపించు. విజయాలను నీఖాతాలో వేసుకో అపజయాలను అవతలివాడి ఖాతాలో వెయ్యి. నీకు తెలివి లేకపోతే తెలివైనవాళ్లంతా నా శిష్యులేనని ప్రకటించుకో... ఏమిటిదంతా అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అనుచర మీడియా ప్రసంగాలు, ప్రచారాల సారాంశం ఇది. స్వరాష్ట్రంలో ఏడవడానికి ఏమీ లేదు. తెలంగాణను ఉద్ధరిస్తాడట. తెలంగాణ ఇప్పుడు ఇలా మిగులు నిధులతో ఉండడానికి ఆయనే కారణమట. ఇంకా నయం... మహబూబ్‌నగర్ ఇప్పడు ఇలా ఉండడానికి కూడా తానే కారణమని చెప్పలేదు. చెప్పడు. మొదట తన మామ, తర్వాత తానూ దత్తత తీసుకుని మహబూబ్‌నగర్‌కు ఏమి చేశారో ఆయనే కాదు, ఆయనకు చెంచాగిరి చేస్తున్నవారు ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. 
మహబూబ్‌నగర్‌కు కొత్తగా ఒక్క చుక్క నీటిని కూడా తేలేకపోయిన దౌర్భాగ్యపాలన టీడీపీది. కృష్ణానది లోతున ప్రవహిస్తున్నది, మహబూబ్‌నగర్ గడ్డమీద ఉంది. కాబట్టి నీళ్లు ఎలా వస్తాయి అని మంత్రులు ప్రకటించింది చంద్రబాబు పాలనలోనే. శ్రీశైలం రిజర్వాయరుకు ఆ వైపున అన్ని ప్రాజెక్టులనూ వెంటబడి పూర్తి చేసిన చంద్రబాబు, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి మొదలు ఎస్‌ఎల్‌బీసీ వరకు అన్నింటినీ తుంగలో తొక్కారు. ఎంతోపోరాటం చేసి, లోక్‌సభ ఎన్నికకు 485 మంది నామినేషన్లు వేసి నిరసన తెలిపిన తర్వాత కూడా ఎస్‌ఎల్‌బీసీని ముందుకు సాగన్విలేదు. అది పనికి రాని ప్రాజెక్టు అని అదీ నల్లగొండకు వచ్చి ప్రకటించినవాడు చంద్రబాబు మంత్రివర్గంలో నీటిపారుదల శాఖను చూసిన ఆంధ్రా పెద్దమనిషే. మాధవరెడ్డి కొట్లాడి, రాజీనామాకు సిద్ధపడి, పట్టుబడితే చివరకు పుట్టంగండి లిఫ్టుపనులు మొదలు పెట్టారు. చంద్రబాబు మెడమీద మాధవరెడ్డి కత్తిపెడితే ఆ ప్రాజెక్టు అమలయింది. ఇటువంటి చరిత్ర కలిగిన మహానుభావులు తెలంగాణను ఉద్ధరించారట. మళ్లీ అవకాశం ఇస్తే ఇంకా చాలా ఉద్ధరిస్తారట. మహబూబ్‌నగర్ రుణం తీర్చుకుంటాడట. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మద్దతుగా చంద్రబాబుతో ప్రకటన చేయించండి...చూద్దాం...! ఉచ్ఛనీచాలు మరిచిన గుంపునొకదానిని వెంటేసుకుని చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణలో అశాంతిని రాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వీళ్లను జనం కనిపెట్టవలసిన అవసరం ఉంది.
సొంత బలంతో, నాయకత్వ దీక్షాదక్షతలతో, వినూత్నమైన ఆలోచనలతో ఒక ఉద్యమానికి గానీ, ఒక పార్టీకి గానీమార్గదర్శనం చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. మహాఅయితే మంచి మేనేజరుగా పనిచేస్తాడు.ఒక కంపెనీ యజమానిలాగా ప్రవర్తిస్తాడు. అందుకే మంచి నాయకులను చూస్తే భయపడతాడు.ఉద్యమాలను చూస్తే ఈసడించుకుంటాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పనిచేస్తున్నాడు. తెలంగాణలో ఆయనకుంపటిని రాజేయడంలోని ఆంతర్యం ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా ఒకఉద్యమానికి నాయకత్వం వహించాడు. అనేక ఎత్తుపల్లాలను చూశాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.తెలంగాణ విముక్తి యోధునిగా చరిత్రలో నిలిచిపోయారు. 
ఆంధ్రప్రదేశ్‌తో కలిసే నాటికే తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రం. 1969 తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడింది కూడా తెలంగాణ మిగులు నిధులను తెలంగాణలో ఖర్చు చేయకుండా ఆంధ్రాకు మళ్లించడం కారణంగానే. స్వయంగా సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య అప్పటి రాష్ట్ర శాసనసభలో తెలంగాణ మిగులు నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ తర్వాత కూడా అంకెల గారడీ పెరిగిందే తప్ప మారలేదు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు నుంచే తెలంగాణ మిగులు రాష్ట్రం. రాజకీయాల్లోకి వచ్చిన రోజుకూడా తెలంగాణ మిగులు రాష్ట్రమే. కానీ ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం అనిపించుకోగలమనే పాడు నమ్మకం చంద్రబాబుకు, ఆయన అనుచర మీడియాకు బాగా బలపడిపోయింది. ఇప్పటికీ అదే మంత్రాన్ని చదువుతున్నారు. కాస్మొపాలిటన్ నగరంగా, ముందునుంచీ పరిశ్రమలకు కేంద్రంగా, కేంద్ర పరిశోధనా సంస్థలకు నిలయంగా హైదరాబాద్‌కు సహజసిద్ధంగా ఉన్న శక్తిని తమ ఖాతాలో చూపించుకోవడం చంద్రబాబునాయుడుకే చెల్లింది. చంద్రబాబయినా, రాజశేఖర్‌రెడ్డి అయినా, మరో మీడియా బాబయినా హైదరాబాద్ వల్ల బాగుపడ్డారు. హైదరాబాద్ చాలా మందికి చాలా ఇచ్చింది. ఆ క్రమంలో అనివార్యంగా హైదరాబాద్‌కూడా ఎదిగింది. ఎవరయినా హైదరాబాద్‌నుంచి వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందారు తప్ప హైదరాబాద్‌ను తామే ఉద్ధరించామని చెప్పుకోవడం సొంతడబ్బాకొట్టుకోవడమే. హైదరాబాద్ 1930ల దాకా ఢిల్లీ కంటే పెద్ద నగరం. 
ఆనాడే నిజాం నవాబు ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు. అప్పుడే అనేక పరిశ్రమలు ఇక్కడ వెలశాయి. అంటే హైదరాబాద్‌కు సహజసిద్ధమైన బలాలు అప్పటి నుంచే ఉన్నాయి. అప్పటికే హైదరాబాద్ ఒక మహానగరంగా ఎదిగింది కాబట్టే, రాజధానికి అవసరమైన అన్ని హంగులు రెడీమేడ్‌గా ఉన్నాయి కాబట్టే ఆరోజు ఆంధ్ర నాయకులు విశాలాంధ్ర నినాదాన్ని ముందుకు తెచ్చి, తెలంగాణ నాయకులను మాయ చేసి రెండు ప్రాంతాలను కలిపేశారు. నగరం ఆధునీకరణ, విస్తృతి, వయసుతోపాటు పెరిగాయి. అందువల్ల చంద్రబాబు హైదరాబాద్ గురించి అడ్డగోలు క్లెయిములు మానేయడం మంచిది. ఆయన తెలంగాణ గురించి కాన్‌సెంట్రేట్ చేయడం మానేసి ఆంధ్ర రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దడం, అమరావతిని మహానగరంగా నిర్మించడం మీద శ్రద్ధపెడితే అక్కడ ఓటేసిన ప్రజలు సంతోషపడతారు. చంద్రబాబు తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గురించి, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు గురించి అసలు మాట్లాడకపోతే మంచిది. 
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంగా జరిగిన విద్రోహాలకు బ్రాండు అంబాసిడర్ చంద్రబాబు. తెలంగాణ రాష్ట్రం అవతరణకు అడ్డంగా నిలబడిన ముఖ్యుల్లో ఒకడు. 2009 డిసెంబరు 9 ప్రకటన తర్వాత ఆయన వేసిన వేషాలన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణలో అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రత్యక్ష, పరోక్ష కారకుల్లో ఒకరు. ఆయన, ఆయన పార్టీ నాయకులు ఇవ్వాళ తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడుతుంటే హంతకులే సంతాపసభలు జరిపినట్టుగా ఉంది. తెలంగాణ గురించి, తెలంగాణ నాయకత్వం గురించి చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎంత మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అంత కనువిప్పు. తెలంగాణ పాలిట ఆయనది ఇనుపపాదం. కరువులు, కాటకాలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు అన్నీ తారాస్థాయికి చేరింది అప్పుడే. తెలంగాణ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన మహానాయకుడాయన. శాసనసభలో తెలంగాణ పదం పలకడానికి వీలు లేదని నిషేధించిన పెద్ద మనిషి. తెలంగాణ ఉద్యమం మొదలు కాగానే ఆగమేఘాలపై దేవాదులకు వెళ్లి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో వరంగల్ జిల్లాకు నీళ్లిస్తామని ఆ రోజు చంద్రబాబు ప్రకటించారు. అనుచర మీడియా ఆయనను అపరభగీరథుడే అని కీర్తనలు పాడాయి. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబుకు సొంత తెలివితేటలు ఎప్పుడూ లేవు. సృజనాత్మకత అంతకంటే లేదు. అన్నీ కన్సల్టెన్సీ తెలువులే. 
కాపీ కార్యాచరణలే. ఎదుటివారిని తగ్గించి తాను పెరగాలని చూడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అత్యంత జనాదరణ కలిగిన ఎన్‌టిఆర్‌ను జయించింది ఆ కుట్రలతోనే. లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టి పత్రికల్లో రోజుకో కథ రాయించేవాడు. అంతఃపురంలో ఏవేవో జరుగుతున్నాయన్నట్టుగా పుకార్లు వ్యాపింప చేశారు. తెలుగుదేశం సర్వనాశనం అయిపోతున్నట్టుగా ప్రచారం చేయించాడు. పార్టీలో గ్రూపులను తయారు చేసి, కొందరిని ఎన్‌టిఆర్‌కు వ్యతిరేకంగా పోగేశాడు. ఎమ్మెల్యేలను పోగేయడంలో కూడా మీడియాను విపరీతంగా వాడుకున్నాడు. లక్ష్మీపార్వతిని ఒక భూతంగా చూపించి ఒక్కొక్కరినీ ఎన్‌టిఆర్ నుంచి దూరం చేశారు. ఎన్‌టిఆర్ నానాటికీ పతనమైపోతున్నట్టుగా, చంద్రబాబు రోజురోజుకు మేరువుగా ఎదుగుతున్నట్టుగా మీడియా కట్టగట్టుకుని చిత్రీకరిస్తూ వచ్చాయి. చివరికి తెలుగుదేశంను కాపాడడానికి చంద్రబాబు ఒక్కరే దిక్కు అన్న పరిస్థితిని తీసుకువచ్చాడు. అలా టీడీపీని చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏ ఒక్క ఎన్నికలోనూ సొంత నాయకత్వ పటిమతో పార్టీని నడిపించింది లేదు గెలిపించింది లేదు. ఒకసారి అటల్ బిహారీ వాజ్‌పేయి, మొన్న నరేంద్ర మోడీ ఆయనకు కలిసొచ్చిన అదృష్టాలు. ఆపద వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త గాలికోసం వెంపర్లాడడం ఆయనకు అలవాటు.
సొంత బలంతో, నాయకత్వ దీక్షాదక్షతలతో, వినూత్నమైన ఆలోచనలతో ఒక ఉద్యమానికి గానీ, ఒక పార్టీకి గానీ మార్గదర్శనం చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. మహాఅయితే మంచి మేనేజరుగా పనిచేస్తాడు. ఒక కంపెనీ యజమానిలాగా ప్రవర్తిస్తాడు. అందుకే మంచి నాయకులను చూస్తే భయపడతాడు. ఉద్యమాలను చూస్తే ఈసడించుకుంటాడు. ఇప్పుడు కూడా ఆయన అదే పనిచేస్తున్నాడు. తెలంగాణలో ఆయన కుంపటిని రాజేయడంలోని ఆంతర్యం ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్వయంగా ఒక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అనేక ఎత్తుపల్లాలను చూశాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. తెలంగాణ విముక్తి యోధునిగా చరిత్రలో నిలిచిపోయారు. తన పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకువచ్చారు. కొత్త ఆలోచనలతో, ఊహకందని వేగంతో ఆయన పనులు చేసుకుపోతున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో పరుగులు పెట్టిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రప్రదాతగా తన పేరును శాశ్వతం చేసుకునే దిశగా ఆయన భారీ లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నారు. అంతేగాక రాజకీయ శక్తుల పునరేకీకరణతో టీఆర్‌ఎస్‌ను ఒక బలమైన శక్తిగా నిర్మించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. తెలంగాణ విఫలమవుతుందని, చంద్రశేఖర్‌రావు పాలన సాగించలేరని, కరెంటులేక తెలంగాణ అంధకారమయం అవుతుందని, ఆర్థికంగా అస్తవ్యస్థం అవుతుందని కలలుగన్న వాళ్లంతా ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. డ్యామిట్ కథ అడ్డం తిరిగిందేమిటా అని వలపోస్తున్నారు. విపరీతమైన అక్కసును ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై, నాయకత్వంపై అడ్డగోలుగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. రవ్వంత మనుషులు కొండంత నేతలపై విషం చిమ్ముతున్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడలో భాగమే. అయితే కేసీఆర్ ఎన్‌టిఆర్ కాదని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదని చంద్రబాబు, ఆయన పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది.
-kattashekar@gmail.com

(
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి