సీమాంధ్ర బేహారులకు ఇప్పుడు గవర్నర్ మీద కోపం వచ్చింది! కేంద్రాన్ని, గవర్నర్‌ను చేతిలో పెట్టుకొని తెలంగాణను పరోక్షంగా పాలించాలనే కల కూడా భగ్నం కావడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. కేంద్రాన్ని తిట్టలేక, అత్తమీది కోపం దుత్తమీద తీసినట్టు గవర్నర్‌పై తమ అక్కసునంతా వెళ్ళగక్కుతున్నారు. తెలంగాణ ఏర్పాటును దశాబ్దాలుగా అడ్డుకున్నాం, చివరికి తెలంగాణ ఏర్పాటయినా, ఏ రాష్ర్టానికి లేనంతగా అనేక బంధనాలు విధింపచేశాము- అనేది వారి ధీమా. అక్కడ బీజేపీ మా మిత్రపక్షమే. ఇక్కడ గవర్నర్ మా మాట వినక తప్పదు, ఇక మనం ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట- ఇదీ సీమాంధ్ర బాబుల మనోగతం. కానీ తీరా గవర్నర్ నరసింహన్ తమ చేతిలో కీలుబొమ్మ కాదనే వాస్తవం అనుభవానికి వచ్చే సరికి తోక మీద లేచి చిందులు వేస్తున్నారు! అడ్డగోలు రాతలు రాస్తున్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ శంకర్‌దయాల్ శర్మ తిరుమల కొండ పైకి ఎన్ని పాదయాత్రలు చేసినా తప్పుపట్టని వారు ఇప్పుడు నరసింహన్ దేవాలయాలకు వెళ్ళడాన్ని కూడా ఒక పెద్ద నేరంగా చిత్రీకరిస్తున్నారు. గవర్నర్‌లు మా మాట వినకపోతే ఎంతకైనా తెగిస్తాం అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగే చౌకబారు వ్యాపార లాబీలకు- ఇటువంటి కుప్పిగంతులను ఏ మాత్రం లక్ష్యపెట్టని గవర్నర్ నరసింహన్ వైఖరి మింగుడు పడడం లేదు.
తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో ఇదే గవర్నర్ నరసింహన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సీమాంధ్ర పెత్తందారులు ఇప్పుడు తెగడ్తలకు దిగడానికి కారణం ఏమిటి? తెలంగాణను రాచి రంపాన పెట్టాలనే చంద్రబాబు ఎత్తుగడలకు గవర్నర్ మద్దతు ఇవ్వడం లేదు.
తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో ఇదే గవర్నర్ నరసింహన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సీమాంధ్ర పెత్తందారులు ఇప్పుడు తెగడ్తలకు దిగడానికి కారణం ఏమిటి? తెలంగాణను రాచి రంపాన పెట్టాలనే చంద్రబాబు ఎత్తుగడలకు గవర్నర్ మద్దతు ఇవ్వడం లేదు.
అయినదానికి కానిదానికి ఏపీ మంత్రులు గవర్నర్ దగ్గరకు వెళ్ళి తెలంగాణ మీద ఒత్తిడి తేవాలంటే ఆయన అంగీకరించడం లేదు. తెలంగాణ రాష్ర్టానికి విద్యుత్ ఇవ్వకుండా హింసించి పైశాచిక ఆనందం పొందిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తాలంటే ఏ గవర్నర్ అయినా అంగీకరిస్తారా! ఇంతకాలం అన్యాయంగా నీటిని దోచుకున్నది చాలక, ఇంకా దోచుకుంటాం, తెలంగాణ పోలీసులతో వీధిపోరాటం చేస్తాం అంటే గవర్నర్ మద్దతు ఇవ్వాలా? తటస్థంగా ఉంటూ చర్చల ద్వారా పరిష్కరించుకోమని హితవు చెప్పడమే నేరమా? రాష్ట్ర విభజన తరువాత కూడా విద్యారంగంతో సహా, అనేక రంగాలలో పెత్తనం సాగించాలని చూడడం ఎందుకు? తాము కేంద్రం ద్వారా తెలంగాణలోని విమానాశ్రయం పేరు మార్పించవచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం పేరు మార్చుకోవద్దట. ఈ తలాతోక లేని వాదనలకు తలూపకపోవడం గవర్నర్ తప్పట!
రాష్ట్రపతి, గవర్నర్ పదవులకు ఉన్న రాజ్యాంగ పరిమితులు అందరికీ తెలిసినవే. బ్రిటన్ రాజ్యాంగ పరిణామక్రమంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఎల్లప్పుడు ప్రభుత్వం ఉండే విధంగా చూసేందుకు రాష్ట్రపతి పదవి అవసరమైంది. ప్రభుత్వం ఏర్పడడానికి దోహదపడాలే తప్ప ప్రభుత్వంపై పెత్తనం చేసే అధికారం రాష్ట్రపతికి ఉండదు. రాష్ట్రంలోనైతే గవర్నర్ కేంద్రానికి ప్రతినిధిగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ప్రతినిధి కనుక కేంద్ర ప్రతినిధి కాదంటూ కథనాలు రాయడం సీమాంధ్ర ఆస్థాన రచయితల అజ్ఞానానికి పరాకాష్ఠ. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. కానీ సీమాంధ్ర పెత్తందారులు తమ పెత్తనం సాగాలనుకున్నప్పుడు గవర్నర్ మిథ్య అంటూ, తెలంగాణను అణగదొక్కడానికి మాత్రం గవర్నర్ క్రియాశీల పాత్ర వహించాలని వాదిస్తున్నారు. రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏవైనా చిక్కులు ఎదురైతే రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చర్చించుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఇరువురిలో ఏ ఒక్కరికి విజ్ఞత లేకున్నా గొడవ తప్పదు.
విభజన చట్టం అమలుకు సంబంధించిన కొన్ని వివాదాలలో రెండు రాష్ర్టాలు ఏకాభిప్రాయానికి రానట్టయితే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కానీ సాధారణంగా రెండు రాష్ర్టాల మధ్య లేదా కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య తలెత్తే వివాదాలను న్యాయస్థానం పరిష్కరిస్తుంది. వివాద స్వభావాన్ని బట్టి గవర్నర్ రెండు రాష్ర్టాలకు సూచనలు ఇవ్వగలరే తప్ప, ఆ పదవికి విభజన చట్టం ప్రత్యేకాధికారాలు ఇవ్వలేదు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని సవరించాలె. ఈ మాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా, తమ మాట వినడం లేదనే అహంకారంతో సీమాంధ్ర నాయకులు, మీడియా రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్దమనిషిని తూలనాడడం వారి తలబిరుసుతనాన్ని సూచిస్తున్నది. తమ మాట వినని గవర్నర్‌లను అవమానించి పంపగలమని సీమాంధ్ర వ్యాపార లాబీ అనుకుంటుండవచ్చు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ వ్యవస్థలు ఇటువంటి అరాచక శక్తులను తట్టుకొని నిలబడుతున్నాయి. వ్యవస్థలను, విలువలను ధ్వంసం చేసే ఈ చీడపురుగుల ఆటలు సాగవు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి