గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, నవంబర్ 09, 2014

అల్మాస్‌గూడలో అక్రమార్కుల అబ్రకదబ్ర!

almasguda-lands


-30 ఎకరాల గైరాన్ సర్కారీ భూమి మాయం
-విలువ రూ.100 కోట్లకు పైనే.. రెవెన్యూ మాయాజాలం ..
-రికార్డుల్లో భూమి.. క్షేత్రంలో అదశ్యం
-అబ్బసొత్తులా అమ్మేసుకున్న స్థానిక నాయకులు..
- ఆశీర్వదించిన రాష్ట్రస్థాయి నాయకగణం
-ఈ భూమికే పట్టాలిచ్చిన సమైక్య సర్కారు..
- 772 కుటుంబాల పరిస్థితి అయోమయం
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పాలన అనే పేరుతో నడిపిన అరాచకం అంతా ఇంతా కాదు. రాజధాని నగరంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో జీహెచ్‌ఎంసీకే తెలియదు. రాజధాని చుట్టుపక్కల ఏ ప్రభుత్వ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదో రెవెన్యూ యంత్రాంగానికే తెలియదు. ఒక చట్టం, ఒక నిబంధన, ఒక జీవో, ఓ పద్ధతి.. ఓ క్రమశిక్షణ.. ఏవీ లేకుండా రెవెన్యూ విభాగంలో సాగిన పాలన చూస్తే ముక్కున వేలేసుకోవాలి. ఇంతోటి పాలనకు హైదరాబాద్‌కు మేమే ఊడబొడిచామంటే.. కాదు.. మేమే ఊడబొడిచామంటూ బిల్డప్‌లు. వాస్తవమేమంటే సీమాంధ్రుల పాలనలో అడ్డదారిలో రాత్రికి రాత్రి కోట్లు గడించాలనుకున్న ప్రతివాడూ సర్కారు, రెవెన్యూ అధికారుల అండదండలతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సర్కారుభూములు కొల్లగొట్టాడు.

almasguda-lands

దానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సహా అంతా సరసమైన ధరలకు తమ సేవలను సమర్పించుకున్నారు. వెరసి వేల కోట్ల విలువైన భూములన్నీ హారతి కర్పూరమై పోయాయి. ఇవాళ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమి క్షేత్రస్థాయిలో ఉండదు. క్షేత్ర స్థాయి పొజిషన్‌లో ఉన్న వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో ఉండవు. రికార్డుల్లో ఉన్న నక్షాకు క్షేత్రస్థాయి భూమి సరిహద్దులకు సంబంధమే ఉండదు. దీనికి తాజా ఉదాహరణ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం అల్మాస్‌గూడలో సర్వే నం.138 భూమి వ్యవహారం. ఇక్కడ గైరాన్ సర్కారీ కింద 65.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో ఏకంగా 30 ఎకరాలు మాయమైంది. దాని విలువ ఎంత తక్కువ వేసుకున్నా... వంద కోట్లు!

ఇలా బయటపడింది...


ప్రభుత్వ రికార్డుల ప్రకారం అల్మాస్‌గూడ సర్వే నెం.138లో 65.03 ఎకరాలు గైరాన్ సర్కారీ కింద ప్రభుత్వ భూమిగా ఉంది. గతంలోనే ఇందులో రాజీవ్‌గహ కల్ప ఇండ్లకు 16.17 ఎకరాలు, శ్మశానవాటికకు 5 ఎకరాలు, రహదారులకు 2.05 ఎకరాలు, పార్కుకు 1 ఎకరం, డీఎం హౌజెస్‌కు 0.20 ఎకరాలు, ఇందిరమ్మ ఇండ్ల కింద 9.05 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. పోతే ఇంకా 30కి పైగా ఎకరాల భూమి ఉండాలి. ఇక్కడ ప్రభుత్వం జీఓ నెం.493 కింద పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించి అర్హులను గుర్తించింది. మొదటి దఫా 697 మందికి ప్లాట్ల కోసం 9 ఎకరాలను కేటాయించింది.

వాస్తవంగా రాజధాని, దాని చుట్టు పక్కలా ఇండ్ల పట్టాలు ఇవ్వవద్దని ఓ ప్రభుత్వ జీవో ఉంది. అయినా మంత్రుల స్థాయిలో పైరవీలు చేసి స్థానిక నాయకులు ఈ పట్టాల కార్యక్రమం మంజూరు చేయించారు. ఈ పట్టాల లేఅవుట్ రెవెన్యూ సిబ్బంది చేయాలి. అయితే ఇక్కడ నాయకులు తమ పైరవీలు, పలుకుబడితో తామే ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. అయితే ప్రభుత్వ భూమి బోలెడంత ఖాళీ ఉంది కాబట్టి 9 ఎకరాలకు బదులు 12 ఎకరాల్లో లేఅవుట్ చేశారు. 697 ప్లాట్లకు అదనంగా తామే సొంతంగా మరో 259 ప్లాట్లు వేసి ఒకరి ప్లాటు మరొకరికిగా అమ్మేసుకున్నారు. లక్షల రూపాయలు చేతులు మారాయి. రెవెన్యూ అధికారులు కూడా వారికి సంపూర్ణంగా సహకరించారు.

ఇక స్థానిక నాయకులు అక్కడ ఆరేళ్లుగా ప్లాట్లు వేస్తూ విక్రయాలు యధేచ్ఛగా సాగిస్తూ ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా.. ఇచ్చేసి కోటీశ్వరులయ్యారు. చాలా మంది బడానాయకగణానికి ఇందులో వాటాలు ఉన్నాయి. ఆ సొమ్మునే కొందరు ఎన్నికల ఖర్చుకు వినియోగించారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పక్కనే ఉన్న స్థలం కావడంతో హాట్ కేక్‌ల్లాగా అమ్ముడుపోయింది. నగరంలో ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేక అనేక మంది మధ్య తరగతికి చెందిన వారు రూ.లక్షలు వెచ్చించారు. ఐతే ఏదో పట్టా కాగితాలు ఇచ్చేసి నాయకగణం చేతులు దులిపేసుకుంది. కలర్ జిరాక్స్‌తోనే ఈ తతంగం నడిపారు.

ప్రభుత్వ పట్టాలకూ అదనపు నంబర్లు తగిలించి...


ఇది బాగానే జరిగింది. ప్రభుత్వం ఇక్కడ రెండోదఫా 13.12 ఎకరాలు పంపిణీ చేయాలని సంకల్పించింది. 772 ప్లాట్లకు లబ్ధిదారులను గుర్తించి రెవెన్యూ వారు పట్టాలు మంజూరు చేశారు. అయితే అప్పటికే ఇక్కడ భూముల్లో ప్లాట్లు లేఅవుట్ చేసి నాయకులు లక్షల రూపాయల చొప్పున వెలగట్టి అమ్ముకున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న నక్షా ముందు పెట్టి దాంట్లోనే గీతలు గీసి ఇది నీకు ఇది నాకు అంటూ దుకాణం పెట్టి డబ్బులు చేసుకున్నారు. కొన్నవారికి అవే కలర్‌జిరాక్స్‌లు ఇచ్చారు. ఈలోగా లబ్దిదారుల ఎంపిక, పట్టాల మంజూరు జరిగింది. తీరా లేఅవుట్ చేయడానికి క్షేత్రస్థాయికి వెళితే అక్కడ సరిపడా భూమి లేదని అధికారులకు వెల్లడైంది. అంటే ప్రభుత్వ భూమి అప్పటికే గుట్టు చప్పుడు కాకుండా కబ్జాదారుల పాలైందన్న మాట.

మిగిలిన కొద్దిపాటి స్థలంలో ప్లాట్లు వేసినా పట్టాలు మంజూరైన లబ్దిదారులకు సరిపోయే స్థితిలేదు. అప్పటికే రెవెన్యూ యంత్రాంగం జారీ చేసిన పట్టాల స్థలంలోని ప్లాట్లకు బై వన్ బైటూ అంటూ రాసి అమ్మేసుకున్న నాయకులు ఈ కొత్త మంజూరు ముందుకు రావడంతో తెల్లముఖం వేశారు. ఎట్లాగూ ప్లాట్లు చేశామన్న భరోసాతో మధ్య తరగతి వర్గాలకు ఒక్కొక్కరి దగ్గర రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల దాకా వసూలు చేశారు. రెవెన్యూ యంత్రాంగం జారీ చేసిన పట్టాలను కలర్ జిరాక్స్‌లు తీసి కొనుగోలు చేసిన వారికి అంటగట్టారు. నిజమైన అర్హులు తెర మీదికి రావడంతో కొనుగోలు చేసిన వారికి ప్లాట్లు చూపించలేకపోయారు. ప్లాట్లు విక్రయించిన కొందరు నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఎన్నికలు అయిపోగానే పొజిషన్ ఇప్పిస్తామంటూ హామీలు గుప్పించారు.

2008 నుంచి సాగుతోన్న ఈ దందాలో పట్టాలు(నకిలీ, అసలు) పొందిన 700కు పైగా మందికి ఇప్పటిదాకా పొజిషన్ ఇవ్వలేదు. ప్లాట్లు చూపించాలంటూ నాయకుల వెంట పడుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ప్లాట్లు చేసేందుకు స్థలమే లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమైక్య రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్వోలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిచింది. మరో అక్రమానికి తెర తీస్తే గానీ అక్రమార్కులు బయట పడే మార్గం లేదు. ఐతే తెలంగాణ రాష్ట్రంలో వారి పప్పులు ఉడకడం లేదు.

అసలెవరో.. నకిలీలెవరో


ఇక ఈ మొత్తం సర్వేలో పొజిషన్ తీరు దారుణంగా ఉంది. ప్రభుత్వం మొదటి దఫా 697 మంది అర్హులను, ఆ తర్వాత 772 మందిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి జాబితాలోని వారికి ప్లాట్లు చూపించారు. రెండో దఫా వారికి ఉత్త పట్టా కాగితాలే మిగిలాయి. ఇక్కడ నాయకులు లేఅవుట్ చేసి ప్రభుత్వం జారీ చేసిన పట్టాలకు కూడా బై వన్ బైటూ అంటూ వేసి అమ్ముకున్నారు. కొనుగోలుదారులు ఇందులోనే నాయకులు ఇచ్చిన కలర్ జిరాక్స్‌లతో రూపొందించిన పట్టాల ఆధారంగా ఇండ్లు నిర్మించుకున్నారు. ఇపుడు మొత్తం క్షేత్రస్థాయిలో చూస్తే ప్రభుత్వం జారీ చేసిన అసలు లబ్ధిదారులకు బదులు స్థానిక నాయకులు జిరాక్స్ కాపీలతో అమ్మగా కొన్న అనర్హులే ఎక్కువ మంది పొజిషన్‌లో ఉన్నారని తేలిసింది. అంతేకాదు రెవెన్యూ అధికారుల జాబితాలో పేర్కొన్న పేర్లు, రేషన్‌కార్డుల నెంబర్లకు కూడా పొంతన కుదరడం లేదు. ఉదాహరణకు ప్లాట్ నెం.818ని జాబితాలో జే రాజ్యలక్ష్మి(రామకష్ణారావు)కు కేటాయించారు.

కానీ పట్టా మాత్రం ఎన్ బ్రహ్మచారి పేరిట జారీ చేశారు. ఇలా వందల సంఖ్యలో వ్యత్యాసాలు ఉన్నాయని సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కొనుగోలు బాగోతం బయట పడుతుంది. ఇంకా ఈ స్థలంలో చాలా కాలంగా వ్యవసాయం చేసిన దళిత రైతులకు స్థానిక నాయకులే ఎకరాకు రూ.16 లక్షల వరకు ఇచ్చేసి వారిని వెళ్లగొట్టారని తెలిసింది. ఇంకా కొందరు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. స్థలం సర్కారుదే అయినా అనాదిగా తాము ఈ భూములను నమ్ముకొని ఉన్నామంటున్నారు.

రికార్డుల్లోనూ అయోమయం..:
సరూర్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం మొదలు కలెక్టరేట్ వరకు సర్వే నెం.138పై గందరగోళం నెలకొని ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ లేఖ నెం.ఇ4/1407/2013, తేదీ.3-3-2014 ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సరూర్‌నగర్‌కు ఉత్తర్వును జారీ చేశారు. దానిలో సర్వే నెం.లో రాజీవ్‌గహ కల్పకు 16.17 ఎకరాలు, గ్రేవ్‌యార్డుకు 5 ఎకరాలు, రోడ్లకు 2.05 ఎకరాలు, పార్కుకు 1 ఎకరం, డీఎం హౌజెస్‌కు 0.20 ఎకరాలు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలకు 9.05 ఎకరాలు కేటాయించినట్లుగా పేర్కొన్నారు. కానీ మొత్తం విస్తీర్ణాన్ని 65.05 ఎకరాలుగా పేర్కొన్నారు.

అదశ్యమైన 30 ఎకరాల స్థలం ఏమైందో అందులో ప్రస్తావించలేదు. ఇదే సర్వే నెంబరులో భూమి మాయమైందని తమ దర్యాప్తులో తేలిందని సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్ తేదీ.24.05.2013న జిల్లా కలెక్టర్‌కు లేఖ నెం.బీ/1113/2013 ద్వారా వివరించారు. పలు అంశాలకు కేటాయించినది పోగా మిగిలిన స్థలం అన్యాక్రాంతమైనట్లు పలువురు సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సమాచారం ప్రకారం స్పష్టమైంది. రూ.వంద కోట్లకు పైగా విలువజేసే 30 ఎకరాల స్థలం ఏమైందో క్షేత్ర స్థాయి దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన కొందరు ఇపుడు ఈ అంశం మీద నోరు విప్పడం లేదు.

అవును.. ఫిర్యాదులున్నాయి...! -అధికారుల ఉవాచ


అవును.. నిజమే. అల్మాస్‌గూడ సర్వే నెం.138పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. రికార్డుల్లోనూ వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమే. కేటాయింపులను సరిగ్గా రికార్డుల్లో పొందుపర్చలేదు. కేటాయింపులు పోగా చాలా వరకు అన్యాక్రాంతమైందని తెలుస్తోంది. 772 మందికి పట్టాలు గతంలో ఇచ్చారని చెబుతున్నారు. ఐతే ఎవరు అసలు, ఎవరు నకిలీలో గుర్తించాల్సిన అవసరం ఉంది.

స్థానిక నాయకులు కేటాయించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో లే అవుట్ చేసినట్లు సమాచారం ఉంది. ఐతే దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించేందుకు అనుమతి కోసం ఆర్డీఓకు లేఖ రాశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ప్రతి పట్టాను పరిశీలిస్తాం. నకిలీలను గుర్తిస్తాం. అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. దర్యాప్తుకు ఏకంగా టీములను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించాం. నాయకుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. త్వరలోనే విచారణ చేస్తాం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి