గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, నవంబర్ 01, 2014

ఇది అనైతికం...!!!

-కృష్ణా బోర్డు తీర్పు ఏకపక్షం
-న్యాయపోరుకు సిద్ధం: మంత్రి హరీశ్
-బాబు, కేంద్రం ఒత్తిళ్లతోనే ఈ తీర్పు
-తీర్పుపై టీ బీజేపీ వైఖరేమిటి?
-కేంద్రంలో తెలంగాణ మంత్రులేరి?
-విద్యుత్ సమస్యపై కేంద్రానికి 30 లేఖలు
-దరఖాస్తులు పెండింగ్‌లో లేవనడం అన్యాయం: హరీశ్
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఇచ్చిన తీర్పు పూర్తిగా ఏకపక్షంగా ఉందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆక్షేపించారు. బోర్డు తన పరిధిలోకి రాని అంశాలపై నిర్ణయం తీసుకోవడం అనైతికమని అన్నారు. బోర్డు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని, తెలంగాణ న్యాయమైన హక్కుల కోసం న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని హరీశ్ ప్రకటించారు. 
కృష్ణా రివర్ బోర్డు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రి హరీశ్‌రావు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. బోర్డు నిర్ణయంపై నిప్పులు చెరిగారు. నీటి పంపకం బోర్డు పరిధిలోకి రాదని, అది ట్రిబ్యునల్ చేయాల్సిన పని అని తేల్చిచెప్పారు. బోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని మండిపడ్డారు. కేవలం ఒప్పందాలను అమలుపరచడం వరకే బోర్డు పని అని గుర్తు చేశారు. బోర్డు ఇచ్చిన తీర్పుపై మరోసారి ఫిర్యాదు చేస్తామని హరీశ్ చెప్పారు.

harish


తీర్పు వెనుక చంద్రబాబు ఒత్తిడి: కేంద్ర ప్రభుత్వంపై ఏపీ సర్కారు ఒత్తిడి తెచ్చి, తీర్పు ఏకపక్షంగా వచ్చేలా చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వంకూడా బోర్డుకు ఫిర్యాదు చేసిందని, అయితే ఏపీ ఫిర్యాదు చేసిన 48గంటల్లో తీర్పు ఇచ్చిన బోర్డు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.

వాస్తవానికి శ్రీశైలంలో ఏపీ ప్రభుత్వ హక్కు కేవలం 33 టీఎంసీలేనని, కానీ అనధికారికంగా 90టీఎంసీలు తీసుకుపోతోందని విమర్శించారు. 65 టీఎంసీలు వాడుకున్నట్లు వాళ్లే చెబుతున్నారని అన్నారు. దీనిపై బోర్డుకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ రైతుల కష్టాలు చూడకుండా తీర్పు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి తీర్పులో స్పష్టంగా కనిపిస్తున్నదని విమర్శించారు.

టీ బీజేపీ నేతల వైఖరేమిటి?


బోర్డు తీర్పుపై తెలంగాణ బీజేపీ నేతల వైఖరేంటని హరీశ్ ప్రశ్నించారు. తెలంగాణ పంటలను ఎండబెట్టే కేంద్రాన్ని సమర్థిస్తారా? కేంద్రాన్ని ఇప్పటికైనా ప్రశ్నించరా? అని నిలదీశారు. రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణకు రావాల్సిన కరెంటు ఏపీ ఇచ్చేలా కేంద్రంద్వారా ఒత్తిడి తేవాలని అన్నారు. తెలంగాణకు 54% కరెంటు ఇవ్వాలని పార్లమెంట్ చెప్పినా ఏపీ అమలు చేయడం లేదని మంత్రి విమర్శించారు.

కేంద్ర జల సంఘం ఆదేశాల ప్రకారం జూలైనుంచి అక్టోబర్ 31వరకే శ్రీశైలం కుడికాలువ నీళ్లు వాడాలని, కానీ నవంబర్ వరకు గతంలో తీసుకుపోయారని అన్నారు. రివర్‌బోర్డు చైర్మన్ కేంద్ర జలసంఘంలో సభ్యుడని, జల సంఘం ఇచ్చిన ఆదేశాలను ఆయనే ఎలా ఉల్లంఘిస్తారని హరీశ్ నిలదీశారు. ఏపీ తప్పులను ప్రశ్నించని బోర్డు ఇలా తీర్పు ఇవ్వడం సరైంది కాదని అభ్యంతరం తెలిపారు. హంద్రీనీవాకు శ్రీశైలం నీటిని తరలిస్తుంటే బోర్డు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

తెలంగాణ రైతులు అధైర్యపడొద్దు


తెలంగాణ రైతులు అధైర్యపడొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఇతర రంగాలకు తగ్గించుకుని రైతులకు కరెంటు ఇస్తామని తెలిపారు. ఎంత ధర పెట్టయినాసరే బహిరంగ మార్కెట్లో కొని ఇస్తామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి మాటలు ఆయన విజ్ఞతకే


తెలంగాణ రాష్ట్రం దరఖాస్తులేవీ తమ వద్ద పెండింగ్‌లో లేవని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్న మాటలు అన్యాయమని హరీశ్ అన్నారు. ఇప్పటి వరకు ఆయనకు 30లేఖలు రాశామంటూ వాటిని మీడియాకు చూపించారు. సీఎం కేసీఆర్‌కూడా కలిశారని తెలిపారు. కేంద్రంలో వంద దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అయినా వాటిని పరిష్కరించడం లేదని విమర్శించారు.

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి లేఖ ఇచ్చారని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదులేవీ తమ వద్ద పెండింగ్‌లో లేవని మంత్రి అనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమ ఉంటే తెలంగాణ ఎంపీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీనియర్ నాయకులున్నా ఎందుకు మొండిచెయ్యి చూపారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐఏఎస్ విభజన ఫైలు ఐదునెలలుగా పెండింగ్‌లో ఉన్నా ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఈ ఫైల్‌ను పరిష్కరించడానికి కేవలం అరగంట సమయం సరిపోతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామని, అయితే ఆయనే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని విమర్శించారు.

3 టీఎంసీలే వాడుకోండి


-రాష్ర్టానికి కృష్ణాబోర్డు ఆదేశాలు
-రెండో తేదీ వరకే విద్యుత్ ఉత్పత్తి
-15న మళ్లీ సమీక్షిస్తామని వెల్లడి

శ్రీశైలం జలాల నుంచి నవంబర్ 2వ తేదీలోపు విద్యుత్ ఉత్పత్తికి మూడు టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాలని కృష్ణా రివర్ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు రాష్ర్టాల వాదనలు, శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, దీర్ఘకాలిక ప్రాతిపదికన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో సమగ్ర ఆపరేషన్ పద్ధతులు, ప్రస్తుతం ఉన్న విద్యుత్, నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్లు బోర్డు తెలిపింది. 
2వతేదీలోపు విద్యుత్ డిమాండ్ కూడా తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న వివాదంపై బుధ, గురువారాల్లో బోర్డు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు రాష్ర్టాల వాదనలు విన్న బోర్డు శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.

అవసరమైతే నవంబర్ 15న మరోసారి కూడా ఈ అంశాన్ని సమీక్షిస్తామని పేర్కొంటూ చైర్మన్ ఆమోదంతో కేఆర్‌ఎంబీ చీఫ్ ఇంజినీర్ ఆర్‌కే గుప్తా పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో రెండ్రోజులుగా జరిగిన సమావేశాల వివరాలను పొందుపరిచారు. ఉత్తర్వుల్లో ఏమన్నారంటే..

ఇతర అవసరాలకంటే తాగు, సాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని గత నెల 21న ఏపీ ప్రభుత్వంనుంచి వచ్చిన నోట్ ప్రకారం కృష్ణా నదీ నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ) అదేరోజున తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా గత నెల 22న కేఆర్‌ఎంబీకి లేఖ ఇచ్చింది. సాగునీటి అవసరాలకు సమానంగా విద్యుత్ ఉత్పాదనను కూడా పరిగణించాల్సిన అవసరముందని, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తమకు రావాల్సిన కరెంటు వాటాను ఇవ్వని దరిమిలా ఇది మరింత కీలకమని ఆ లేఖలో స్పష్టం చేసింది.

ఈ మేరకు అక్టోబర్ 30న జలసౌధలో కేఈఆర్‌ఎంబీ రెండో సమావేశం జరిగింది. ఇందులో బోర్డు సభ్యులతో పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావుకూడా పాల్గొన్నారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన జలాలు, విద్యుత్ అవసరాలను ఆయా రాష్ర్టాల ప్రతినిధులు సమావేశంలో వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరెంటు డిమాండ్ ఉందని, ఆ మేరకే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నామని ఇంజినీర్ ఇన్ చీఫ్ తెలిపారు. ముఖ్యంగా పంటలను కాపాడుకోవటంలో భాగంగా నవంబర్ 2నుంచి శ్రీశైలం నుంచి ఎక్కువస్థాయిలో కరెంటు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుందని, విద్యుత్ డిమాండ్ తగ్గేకొద్దీ ఉత్పత్తిని తగ్గించడంతో పాటు నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి చేపడతామన్నారు.

తద్వారా కొంతకాలానికి శ్రీశైలంలో ఉత్పత్తి అనేది అవసరపడదని ఈఎన్‌సీ తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రకాల భిన్న జీవోలు జారీ చేశారని, రాష్ట్ర విభజన దరిమిలా వాటిని సవరించాల్సిన అవసరముందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నదని స్పష్టంచేశారు. దీంతో బోర్డు అధికారులు దీనిపై ఒక సూచన చేశారు. ప్రస్తుతం ఉన్న నిర్వహణ మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా.. రెండు రాష్ర్టాల సంప్రదింపులతో సాగునీరు, ఇతర అవసరాలకు సంబంధించిన వివరాలపై సమగ్ర అధ్యయనం అవసరమని, దీనితో పాటు అవసరమైన వివరాలు లభ్యమై, నూతన మార్గదర్శకాలను రూపొందించే వరకు ప్రస్తుతం ఉన్న వాటిని రెండు రాష్ర్టాలు గౌరవించాలని బోర్డు సభ్యులు సూచించారు. ఇదే విషయాన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పార్టు-9లోని పేరా 85(8)లో పొందుపరిచినట్లు చెప్పారు.

జులై 10న జరిగిన కృష్ణా నది నిర్వహణ బోర్డు తొలి సమావేశంలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలు వివరాలు సమర్పించాల్సిందిగా పలుమార్లు కోరినప్పటికీ అది ఇంకా పెండింగులోనే ఉందన్నారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన నీటి అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ... జూన్ 2 నుంచి ఇప్పటివరకు జూన్ 24, జులై 11, ఆగస్టు 4న ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా విద్యుత్తు ఉత్పాదన చేపట్టాల్సిందిగా గత నెల 21న జారీ చేసిన బోర్డు లేఖలో స్పష్టం పేర్కొన్నామని అధికారులు తెలిపారు.

లేనట్లయితే ఈ సీజన్‌లో తాగు, సాగునీటి ఇబ్బందులు వస్తాయని తెలిపినట్లు చెప్పారు... అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండువైపులా వాదనలు విన్న తర్వాత ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొని ఈనెల రెండో తేదీ వరకు మూడు టీఎంసీల వరకు నీటిని విద్యుత్తు ఉత్పాదనకు వాడుకోవచ్చనే నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి