గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, నవంబర్ 21, 2014

రోడ్లే లేని ఖ‌నిజాల ఖిల్లా...!

bridge


భారీ డిమాండ్ ఉన్న ఖనిజం నిక్షిప్తమైన చోట పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెంది రూపురేఖలే మారిపోతాయి. అదొక పల్లెటూరు అయినా పట్నాన్ని తలపించేలా మార్పుతథ్యం. కానీ సమైక్యరాష్ట్రంలో వలసపాలకులు కుట్రలకు 25 ఏండ్ల కిందట ఉన్న పరిస్థితులే నేటికీ ఓ గ్రామంలో దర్శనమిస్తున్నాయి.
-డోలమైట్ ఖనిజమున్నా అభివృద్ధి చెందని మాదారం
-ఖనిజం తవ్వుకుని కనీససౌకర్యాలు కల్పించని వైజాగ్‌స్టీల్స్
-రూ.900 కోట్ల ఖనిజం తరలింపు.. రూ.40 కోట్ల రాయల్టీ చెల్లింపు
-25 ఏండ్లుగా గ్రామానికి రాయల్టీ వాటా ఇవ్వని సమైక్య పాలకులు

తెలంగాణ సొమ్ము దోచిపెట్టిన సమైక్యపాలకుల కుట్రలకు బలైందీ డోలమైట్ మాదారం! ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మాదారం గ్రామాన్ని జల్లెడపట్టి డోలమైట్‌ను ఏపీలోని వైజాగ్‌స్టీల్స్‌కు కట్టబెడుతూ వలసపాలకులు రెడ్‌కార్పెట్ పరిచారు. అదే సమయం లో కనీసం ఈ గ్రామంలో సదరు కంపెనీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదా? లేదా? అనే విషయాన్ని గాలికొదిలేసింది. 
గాజువాకను సుందరంగా తీర్చిదిద్దిన స్టీల్‌ప్లాంట్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం చుట్టుపక్కల భారీస్థాయిలో డోలమైట్ నిక్షేపాలు ఉన్నాయి. ముడి ఇనుమును కరిగించగా వచ్చే వ్యర్థాలను తొలగించేందుకు, ఇనుమును కరిగించే కొలిమిలను తయారుచేసేందుకు డోలమైట్‌ను ఉపయోగిస్తారు. ఈ కర్మాగారంలో లోహాలను కరిగించేందుకు ఉపయోగించే కొలిమి నుంచి ఉద్భవించే విపరీతమైన వేడిమిని డోలమైట్‌తో తయారుచేసే ఇటుకలే తట్టుకోగలుగుతాయి. అందుకే డోలమైట్ ఖనిజానికి భారీ డిమాండ్. మాదారంలోని డోలమైట్‌కు హైగ్రేడ్ రా మెటీరియల్‌గా పేరుంది. ఉత్తమ నాణ్యత ఉన్న డోలమైట్‌పై సమైక్యరాష్ట్రంలో వలసపాలకుల కన్ను పడింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసం ఇక్కడ అనుబంధంగా 1989లో ఓ పరిశ్రమ నెలకొల్పారు.

ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.900 కోట్ల విలువైన 75 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసి విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌కు ఎగుమతైంది. 75 లక్షల టన్నుల డోలమైట్‌ను ఉత్పత్తిచేసిన ఈ కర్మాగారం ప్రభుత్వానికి రూ.40 కోట్ల రాయల్టీ చెల్లించింది. ఈ రాయల్టీ నుంచి మాదారం గ్రామ పంచాయతీకి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుచేసిన గాజువాకను సుందరనగరంగా తీర్చిదిద్దిన విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం, అనుబంధ కర్మాగారం నెలకొల్పిన తెలంగాణలోని మాదారం గ్రామాన్ని మాత్రం పట్టించుకోలేదు.

నిబంధనలకు తూట్లు.. నిర్వాసితులకు మొండిచేయి: ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీలో 25 శాతం వాటా స్థానిక సంస్థలకు చెల్లించి ఏజెన్సీ గ్రామాలను అభివృద్ధి చేయాలని జీవో ఎంఎస్ నెంబర్ 49లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అప్పటి సర్కా రు నిబంధనలను తుంగలోతొక్కి తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పటివరకు రూ.40 కోట్ల రాయల్టీని చెల్లించినందున మాదారం పంచాయతీకి రూ.10 కోట్లు రావాల్సి ఉంది. కానీ సమైక్యరాష్ట్రంలో ఒక్కపైసా రాయల్టీలో ఇవ్వలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం మాదారం డోలమైట్ మైన్స్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు మొండిచేయి చూపింది.

210 మంది రైతుల నుంచి 950 ఎకరాల భూమిని సేకరించి కొందరికే ఉద్యోగాలు కల్పించింది. మిగతా నిర్వాసితులు ఎన్నోసార్లు ఆందోళన చేపట్టినా ఫలితం లేకపోయింది. డోలమైట్ మైనింగ్ వల్ల కాలుష్యంతో ఇప్పటికీ రైతులు పంటనష్టపోతూనే ఉన్నారు. గనుల్లో భారీ పేలుళ్ల కారణంగా గ్రామంలో ఇండ్లకు బీటలుబారుతున్నాయి. మాదారంలో ఏ రోడ్డుచూసినా గుంతలూ, గతుకులే. వర్షాకాలంలో పదడుగులు కూడా వేయలేని దుస్థితి గ్రామానిది. కోట్లాది రూపాయల విలువైన ఖనిజాన్ని తరలించుకుపోతున్న వైజాగ్‌స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కనీస బాధ్యతగా రోడ్లను కూడా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలసపాలకుల నిర్లక్షానికి గురైన మాదా రం స్వరాష్ట్రంలోనైనా బాగుపడుతుందని గ్రామస్తులు ఆశిస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి