అనుమానమే నిజమైంది. ఏపీ ప్రభుత్వం దొంగచాటుగా గుండ్రేవుల దగ్గర సాగిస్తున్న భూముల సర్వే గుట్టురట్టయింది. ఈ సర్వే పనులను గద్వాల ఆర్డీవో అబ్దుల్ హమీద్ బుధవారం నిలిపివేయించారు. వడ్డేపల్లి మండలం చిన్నధన్వాడ, పెద్దధన్వాడ మధ్య పంట పొలాలను, నదీపరివాహక ప్రాంతాలను గుట్టుచప్పుడు కాకుండా సర్వే చేస్తున్న విషయాన్ని ఈ నెల 10న నమస్తే తెలంగాణ.. చంద్రబాబు నీటి కుట్ర శీర్షికన ప్రచురించింది.
-నిజమైన నమస్తే తెలంగాణ కథనం
-పనులను నిలిపివేయించిన గద్వాల ఆర్డీవో
-పనులను నిలిపివేయించిన గద్వాల ఆర్డీవో
కొందరు ఆంధ్ర అధికారులు సర్వే చేస్తూ వెళ్లగా.. మరికొందరు భూముల్లో డ్రిల్లింగ్ చేసి మట్టి నమూనాలను వెలికితీసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నది ఒడ్డున గుడారాలు వేసుకొని మరీ ఈ పనులు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో హమీద్.. వెంటనే పనులు నిలిపేసి అక్కడినుంచి వెళ్లాల్సిందిగా వారిని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్ర సమయంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు అమలుచేయడానికి వీల్లేదంటూ కర్నూలు జిల్లా అధికారులకు ఫోన్లో స్పష్టంచేశారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లడానికి అంగీకరించారు.
కొంతకాలంగా ఈ పనులు జరుగుతున్న వడ్డేపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం పసిగట్టలేకపోవడం గమనార్హం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో 100ను విడుదల చేస్తూ కర్నూలు జిల్లా సీ బెళగల్ గ్రామ సమీపంలో గుండ్రేవుల జలాశయాన్ని ప్రతిపాదించారు. ఈ పనులను చేపట్టిన ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థ రూ.50 లక్షల ఖర్చుతో సర్వే డిజైన్‌ను రూపొందించి 20 రోజుల కిందట కర్నూలు జలమండలి అధికారులకు నివేదించినట్లు తెలిసింది. తుంగభద్ర వరదల సమయంలో కర్నూలు ముంపునకు గురికాకుండా ఉండటానికి 20 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉన్న గుండ్రేవుల జలాశయాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.
ఈ రిజర్వాయర్ ఆనకట్ట 40 మీటర్లు కాగా.. 18 అడుగుల మట్టికట్టను నిర్మించి నీటిని నిల్వ చేయనున్నారు. దీనివల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 4 గ్రామాలు, కర్నూలు జిల్లాలో 8 గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆ కన్సల్టెన్సీ నివేదించినట్లు తెలిసింది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి