-30 వేల ఎకరాలు ఎవరికోసం?
-హుండీ డబ్బులతో సింగపూర్ నిర్మిస్తారా?
-పేద అరుపులు.. పెద్ద మాటలు
- మండిపడుతున్న ఏపీ మేధావులు
-ఆరు వేల ఎకరాల్లో అద్భుతంగా నయా రాయ్‌పూర్
-సింగపూర్ సినిమా ప్రచార పటాటోపమే
-ఆ నగరం వెనుక 195 ఏండ్ల చరిత్ర
-దేశంలో 30 వేల ఎకరాలు
-సేకరించిన రాజధానే లేదు
-హైదరాబాద్‌లో రాజధాని 225.520 ఎకరాలే
-చండీగఢ్ ఉన్నది 114 చ.కి.మీ.లోనే
వేల ఎకరాల్లో రాజధాని.. సింగపూర్.. మలేసియా... ఇవీ ఇవాళ అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న త్రీడీ సినిమా. ఆయన భజన బందం, ఆస్థాన పత్రికలు కూడా యథాశక్తి ఊదరగొడుతున్నాయి. తామేం తక్కువ తినలేదన్నట్టు ఆస్థాన ఎన్నారైలూ సదస్సులు పెట్టి భారీగా చందాలు సేకరిస్తున్నారు. ఇక్కడా హుండీలు. అవి చాలవన్నట్టు పత్రికలు కూడా ఆ కార్యక్రమంలో తలమునకలవుతున్నాయి. ఇంతకీ ఒక రాజధానికి ఎంత భూమి కావాలి? దేశంలో అనేక రాజధానుల వైశాల్యమెంత? ఏపీ జనాభా ఎంత? ఆదాయమెంత? దానికి ఈ 30వేల ఎకరాలకు పొంతన ఉందా? మాట్లాడితే సింగపూర్‌అంటూ జేబులో బొమ్మనేదో తీసి ఇస్తానంటున్న బాబు అసలు సింగపూర్ ఇవాల్టి అభివృద్ధి వెనక కరిగించిన కాలం, అక్కడి పాలకుల అంకితభావం ఎంతో అన్నది గమనించారా? బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే కార్పొరేట్ మూకలను చుట్టు పెట్టుకుని 30 వేల ఎకరాల్లో ఆయన చేసేది రాజధాని నిర్మాణమా? రియల్ ఎస్టేట్ దందానా? ప్రజలు ఏమనుకుంటున్నారు? -హుండీ డబ్బులతో సింగపూర్ నిర్మిస్తారా?
-పేద అరుపులు.. పెద్ద మాటలు
- మండిపడుతున్న ఏపీ మేధావులు
-ఆరు వేల ఎకరాల్లో అద్భుతంగా నయా రాయ్‌పూర్
-సింగపూర్ సినిమా ప్రచార పటాటోపమే
-ఆ నగరం వెనుక 195 ఏండ్ల చరిత్ర
-దేశంలో 30 వేల ఎకరాలు
-సేకరించిన రాజధానే లేదు
-హైదరాబాద్‌లో రాజధాని 225.520 ఎకరాలే
-చండీగఢ్ ఉన్నది 114 చ.కి.మీ.లోనే
దేశంలో 29 రాష్ర్టాలున్నాయి. అందులో ఎన్ని రాజధానులు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి అనేది పరిశీలిస్తే ఏపీ రాజధాని లెక్కల్లో డొల్లతనం బయటపడుతుంది. అనేక రాజధాని నగరాలు కూడా వందల ఏండ్ల కాలక్రమంలో విస్తరించినవే తప్ప ఒకేసారి ఏకంగా ఇంత భూభాగంలో నిర్మించినవి కావు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌కు కొత్త రాజధాని నిర్మించాలని తలపెట్టి సేకరించిన భూమి కేవలం 19 వేల ఎకరాలు. అందులో రాజధాని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆడిటోరియాలు ప్రజల నివాసాలు సహా ప్రజోపయోగ భవనాల సముదాయాలకు కేటాయించింది కేవలం 6 వేల ఎకరాలు. హైదరాబాద్ రాజధాని కేవలం 225.52 ఎకరాలే: వాస్తవానికి హైదరాబాద్ రాజధాని నిర్మాణం కేవలం 225.52 ఎకరాల భూమిలోనే జరిగింది. ఆ పరిధిలో నిజాం రాజులు నిర్మించిన భవనాలే ఇప్పటికీ రాజధాని అవసరాలు తీరుస్తున్నాయి.
వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, మంత్రుల నివాస సముదాయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలన్నీ ఈ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర గవర్నర్ కొలువుదీరే రాజ్‌భవన్ ఉన్నది కేవలం 22 ఎకరాల భూమిలోనే, ఎమ్మెల్యేలు కొలువుదీరే అసెంబ్లీ ఉన్నది ఆరు ఎకరాలు.. 294 మంది ఎమ్మెల్యేలు, 90మంది ఎమ్మెల్సీలు నివాసం ఉండడానికి నిర్మించిన ఎమ్మెల్యేల నివాస సముదాయం రెండు చోట్ల కలిపి కేవలం 18.10 ఎకరాల భూమిలోనే, సచివాలయం ఉన్నది 22.80 ఎకరాల భూమిలో, హై కోర్టు ఉన్నది 2.9 ఎకరాల భూమిలో మాత్రమే.
సింగపూర్ జేబులో వస్తువు కాదు..: రాష్ట్ర విభజనలో హైదరాబాద్ వంటి రాజధానిని కోల్పోయామని తిరిగి ఆ స్థాయి నగరం కావాలంటూ చంద్రబాబు ఎన్నికలనాటినుంచే ప్రచారం ప్రారంభించారు. హుండీలు పెట్టి ఏదో కోల్పోయామన్న భావన రగిలించారు. సెంటిమెంటును రెచ్చగొట్టి సరిగ్గా అలాంటి రాజధాని కచ్చితంగా అవసరం అన్న భ్రమ కల్పించారు. వాస్తవానికి దేశంలో అనేక రాష్ర్టాల్లో రాజధానులు విజయవాడ, విశాఖ కన్నా పెద్దవేం కావు. కొద్దిపాటి పెట్టుబడితో విశాఖ లేదా విజయవాడలనే రాజధానులుగా మార్చుకోగల అవకాశముంది. విజయవాడ రాజధాని కావాలని ఆ నగర ప్రజలు ఆరు దశాబ్దాల క్రితమే కలలు గన్నారు. అయితే హైదరాబాద్‌ను చూపి పక్కదారి పట్టించారు.
తర్వాత సింగపూర్ వంటి రాజధాని అంటూ రంగుల బొమ్మలు చూపించారు. అదేదో తన జేబులో వస్తువు.. తీసి ఇస్తానన్నట్టు ప్రచారం చేశారు. అయితే సింగపూర్ ఆ స్థాయికి చేరడానికి ఎన్నేండ్లు పట్టిందో..ఎంత నిజాయితీతో అక్కడి పాలకులు అభివృద్ధికి పాటు పడ్డారో విస్మరించారు. సింగపూర్ వెనుక 195 సంవత్సరాల కృషి ఉంది. మహాసౌధాలు రావడానికి ఆరేడు తరాలు పట్టింది. ఎంతో నిజాయితీగా చెమటోడ్చి తపించి, త్యాగాలు చేసి కృషి జరిపితే అది సమకూరింది. పారిశ్రామిక వేత్తలు, విద్యాసంస్థల యజమానులు, రియల్ వ్యాపారులను మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెట్టుకుని చంద్రబాబు సర్కారు ఏ మేరకు నిజాయితీ చూపగలదో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. పోనీ వీరేమైనా అద్భుత నగరాల నిర్మాతలా అంటే హైదరాబాద్‌లో అభివృద్ధి పేరిట చేసిన భూదందాలు తెలియనివి కావు. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా, ఇందూ ప్రాజెక్టుల లాంటి భూ కుంభకోణాలు జగద్విదితం.
విజయవాడ, గుంటూరును ముంచి...: వాస్తవానికి రాజధాని వల్ల అదనంగా తరలివచ్చే ఉద్యోగులు ఇతరుల అవసరాలు తీర్చడానికి గుంటూరు, విజయవాడ నగరాలున్నాయి. ఆ నగరాలపై కొంత పెట్టుబడి పెడితే ఇప్పటికే ఉన్నదానికి తాజా అభివృద్ధితోడై ఆ నగరాలు అద్భుతంగా విస్తరిస్తాయి. ఆ నగరవాసుల ఆస్తులకు భారీగా విలువలు పెరుగుతాయి. మరోవైపు తక్కువ భూములు సేకరించి అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, సీఎం క్యాంపు కార్యాలయాలతోపాటు వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం, హైకోర్టు, జడ్జిల క్వార్టర్స్, రాజ్‌భవన్‌లతో పాటు ఇతర ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఖర్చు తగ్గి, త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుంది. ఈ నగరాలనుంచి తాజా రాజధాని ప్రాంతం కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మెట్రోలాంటి సౌకర్యాలు కల్పిస్తే సరిపోతుంది. కానీ నేలవిడిచి సాము చేస్తున్న చంద్రబాబు నాయుడు, లేని ప్రచారాన్ని కల్పించి.. రాజధానిని చుక్కల్లో చూపిస్తున్నారు.
ప్రపపంచలోనే ప్రతిష్టాత్మకమైన రాజధానిని నిర్మిస్తానని ప్రచారం చేస్తూ పచ్చటి పంటలు పండే 30 వేల ఎకరాల భూములను కొల్లగొడుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియ వెనుక కార్పొరేట్ సంస్థల మాయాజాలం ఉందనే ఆరోపణలున్నాయి. టీడీపీ పంచన చేరిన ఈ కార్పొరేట్ సంస్థల యజమానులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వాటికి భారీ మార్కెట్ సృష్టించే పనిలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని అంటున్నారు. రాజధాని భూముల్లో రేపు జాయింట్ వెంచర్ల పేరుతో వీరే, సేకరించిన ఆ భూములను ఆధీనంలోకి తెచ్చుకుంటారనే ప్రచారం జరుగుతున్నది.
డెవలప్‌మెంట్ అథారిటీ చాలు..: రాజధానిని అభివృద్ది చేయడానికి భూసేకరణే అవసరం లేదని, ప్రణాళికాబద్ధ నిర్మాణానికి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తే సరిపోతుందని, పట్టణ నిర్మాణ రంగ నిపుణుల, మేధావుల వాదన. దేశంలో అనేక రాష్ర్టాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి పాటించిన సూత్రం ఇదే.
ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే వరకు భూసేకరణ చేసి, వాటిల్లో నిర్మాణాలు చేపడితే సరిపోతుందని అంటున్నారు. ఆ తరువాత డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా మాస్టర్ ప్లాన్ రూపొందించి, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్, ఎడ్యుకేషనల్, మెడికల్, హైరేజ్ బిల్డింగ్ ఏరియాజోన్, సైబర్‌జోన్, ఎయిర్‌పోర్టు అథారిటీ జోన్‌లంటూ ఇలా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతం ఏర్పాటు చేసి ఇందులోని ప్రాంతాన్ని జోన్లవారిగా విభజిస్తే సరిపోతుందని వారు అంటున్నారు. హైదరాబాద్‌లాంటి నగరం కూడా అభివృద్ధి జరిగింది కూడా ఈ పద్ధతిలోనే. ఆ ప్లాన్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఐటిఐఆర్ ప్రాజెక్టునూ ప్రభుత్వం ప్రకటించింది.
ఆయనదంతా మాయే..: చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారని మేధావులు అంటున్నారు. ఆయనదంతా మాయ. చెప్పేది కొండంత..చేసేది గోరంత..ఒకవైపు నిధులు లేవంటారు. రాజధానికి హుండీలు పెడతారు. చందాలు వసూలు చేయిస్తారు. మరోవైపు కోట్ల ఖర్చుపెట్టి ఉత్సవాలు చేస్తారు. చార్టర్ ఫ్లైట్లు వేసుకుని సింగపూర్ వెళ్తారు. ఆయనలో ఇద్దరు మనుషులున్నారు. ఎలా నమ్మాలి అని గుంటూరుకు చెందిన ఓ మేధావి ప్రశ్నించారు.
రాజధానికోసం 30 ఎకరాల సేకరణ ఎక్కడా జరగలేదు. చత్తీస్‌గఢ్‌లో నయారాయ్‌పూర్‌లో తొలిదశ కింద సేకరించింది ఆరువేల ఎకరాలు. 12 ఏండ్లనుంచి కడుతుంటే ఇప్పటికీ పూర్తికాలేదు. నిధులు లేక చాలా స్థలం ఖాళీగానే ఉంది. అత్యంత ఆధునిక నగరంగా చెప్పే చండీగఢ్ ఇపుడున్నది 114 చదరపు కిలోమీటర్లే. సుమారు 25 లక్షల జనాభా ఆ నగరంలో ఉన్నారు. పరిశ్రమలు, ఆఫీసులు, ప్రజల నివాసాలు అన్నీ ఆ పరిధిలోనే ఉన్నాయి. మరి ఏపీ రాజధానిలో ఎన్ని లక్షల మందిని ఎక్కడనుంచి పట్టుకువచ్చి పెడతారు? అని ఆయన ప్రశ్నించారు.
రాజధానా..రియల్ దందాలా?
ఒక రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలా? రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గహ సముదాయాలను నిర్మించడానికి ఇంత భూమి అవసరమా? ఇన్ని ఎకరాలు ఏం చేస్తారు..ఏం కడతారో ప్రజలకు చెప్పాలి.
-వడ్డే శోభనాద్రీశ్వర్రావు
ప్రభుత్వ భూమి ఉండగా సేకరణ దేనికి?
అసలు భూసేకరణే అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. అవి సరిపోతాయి. స్కూల్స్, హౌజింగ్, అధికారుల నివాసాలకు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లకు, అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమో చెప్పండి ముందు.
-యలమంచలి శివాజీ
అసలు 30వేల ఎకరాలెందుకో చెప్పరేం?
చంద్రబాబు పారదర్శకత పాటించడం లేదు. పార్టీ సొంత కార్యాలయం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సహకరిస్తామని కేంద్రం చెబుతుంటే సింగపూర్‌కు వెళ్లడం దేనికి సంకేతం?
-రామకష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి
ధరలు పెంచడానికే...
రాజధాని ఏర్పాటుకు ఐదు వేల ఎకరాలు చాలు. 30 వేల ఎకరాల భూమి కావాలని ప్రచారం చేయడం వల్ల భూముల ధరలకు రెక్కలు రావడం తప్ప ఒరిగేదేం లేదు.
- కే నారాయణ,సీపీఐ నేత
అడ్డగోలు సేకరణ తగదు
రాజధాని ఏర్పాటుపై నిపుణులు నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా భూ సేకరణ జరపాలి. అడ్డగోలుగా భూములు సేకరించడం సరికాదు.
-తమ్మినేని వీరభద్రం,సీపీఎం నేత
కావాలంటే మేమే చందాలిస్తాం
రాజధాని నిర్మాణం కోసం మా భూములు ఇవ్వం. ఎవడో రాజధానిని నిర్మిస్తానంటే మా భూములెందుకివ్వాలి? బాబుకు కావాలంటే ఎకరాకు లక్ష మేమే చందాలిస్తాం.
-ఉండవల్లి, పినమాక, నిడమర్రు గ్రామాల రైతులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి