గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, నవంబర్ 11, 2014

లీజులపై సీమాంధ్ర సర్కార్ అడ్డగోలు జీవోలు...!!!

lease


సీమాంధ్ర పాలన తెలంగాణను కొల్లగొట్టింది. హైదరాబాద్ జిల్లాలో నిజాం, బ్రిటిష్ కాలం నాటి లీజు భూములను కూడా అబ్బసొత్తులాగా అమ్మేసుకున్నారు. పాత జీవోలు పాతరేశారు. కొత్త జీవోలు పుట్టించారు. ఉన్న జీవోలు తుంగలో తొక్కారు. ఎప్పుడో 1930లోనే నిజాం ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమున్నత ఆశయంతో పౌరుల నివాసాలు.. వ్యాపారం నిమిత్తం అతి తక్కువ ధరకు భూములను లీజుకు ఇచ్చారు. ఇటు నగరం అభివృద్ధి జరగడంతో పాటు అటు భూములు కూడా సర్కారు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
-నిజాంనాటి లీజు భూములను..అబ్బసొత్తులా అమ్ముకుంటున్నారు !
-అక్రమార్కులకు హక్కులిచ్చి అడ్డంగా దోచిపెట్టిన సమైక్య సర్కార్
-ఇప్పటికే 3 వేల పైచిలుకు లీజులు క్రమబద్ధీకరణ
-రూ.లక్ష కోట్ల విలువైన భూములు పరాధీనం
-తాజాగా ఎంఓయూతో విక్రయాలు
మిగిలిన 510 లీజు భూములు విలువ రూ.600 కోట్లకు పైమాటే
-స్వాధీనపరుచుకోవాలంటున్న తెలంగాణవాదులు

అయితే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర సర్కార్, అధికారులు నియమ నిబంధనలకు పాతరేసి భూములు అన్యాక్రాంతం చేశారు. లీజు ఉల్లంఘించిన వారినుంచి భూములు స్వాధీన పరుచుకునే హక్కులు ఉన్నా బేరాలు పెట్టుకుని వారికే అర్పించుకున్నారు. ఇంతదాకా ఇలాంటి మూడువేల పైగా లీజు భూములు సర్కారు చేయి దాటి పోయాయి. లక్ష కోట్లకు పైగా విలువైన భూమి పరాధీనమై పోయింది. 
ఈ అక్రమాలకు సీమాంధ్ర అధికారులు కూడా సహకరించారు. లీజు భూములను రక్షించవలిసిన ఎస్టేట్ అధికారే కబ్జాదారులకు అనుకూలంగా సర్కారుకు నివేదిక పంపడంతో కొత్త జీవోలు వచ్చి ఉల్లంఘనులు ఎంఓయూతో తమ భూములు అమ్ముకుంటున్నారు. ఇంకా రూ.600 కోట్ల విలువైన భూములు లీజు ఉల్లంఘనుల చేతిలో ఉన్నాయి. కనీసం వాటినైనా దక్కించుకోవాలని తెలంగాణవాదులు కోరుతున్నారు.

లీజు భూములు అంటే.. : 1930 ప్రాంతంలో నిజాం సర్కార్ రెట్రో సీడెడ్ ప్రాంతంగా పేరొందిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని పౌర నివాస సముదాయాలు, వ్యాపార కూడళ్ల (బ్రిటీష్ ఇండియా గవర్నమెంటు పటాలాల) నిమిత్తం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలోని మిలటరీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా సాధారణ ప్రజలకు 90 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది.

లీజు కొనసాగించేందుకు ప్రతి 30 సంవత్సరాలకోసారి రెన్యువల్ చేసుకోవడం వంటి అనేక నిబంధనలు విధించింది. 1945 నాటికి ఈ భూములతో పాటు కంటోన్మెంటు భూములను సైతం బ్రిటీష్ ప్రభుత్వం తిరిగి నిజాం సర్కారుకు ఇచ్చేసింది. ఆ సమయంలో బ్రిటీష్ రెసిడెంట్లకు నిజాం ఇచ్చిన హామీ మేరకు లీజుదారుల నుంచి ఆ భూములను నిజాం స్వాధీనం చేసుకోలేదు. ఆ తరువాత నిజాం ప్రభుత్వం భారతదేశంలో విలీనం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగిపోయాయి. 1978లో జీవో నెం.169 (రెవిన్యూ) తేదీ 21.5.1978 ద్వారా ఆంధ్రప్రదేశ్ (సికింద్రాబాద్ ప్రాంతం) భూ పరిపాలన రూల్స్ 1976ను జారీ చేసి ఆ లీజు భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు.

అపుడు కూడా లీజు కాలపరిమితి పూర్తి కాలేదు కాబట్టి వారిని కొనసాగించారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌కు లీజు భూముల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. 1930- 1970 మధ్య కాలంలో హైదరాబాద్ జిల్లాలో 6,500 లీజు భూములున్నట్లు రికార్డులుండగా,1991నాటికి అవి 2,249 కి తగ్గిపోయింది. తర్వాత కాలంలో లీజు భూములు యజమానుల వారసుల మధ్య విభజనలు కూడా జరగడంతో వాటి సంఖ్య 2,304కి చేరింది.

దోచిపెట్టిన సీమాంధ్ర సర్కార్..


ఇదిలా ఉంటే బంగారు బాతులాంటి ఈ విలువైన భూముల అజమాయిషీ చేజిక్కడంతో సీమాంధ్ర పాలకులు వాటిని సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. కుంటి సాకులు, గుడ్డి సాకులతో దొడ్డిదారి జీవో తెచ్చి వాటిని లీజు దారులకే శాశ్వతంగా కట్టబెట్టడం మొదలుపెట్టారు. సక్రమంగా లీజు రెన్యూవల్స్‌ను పాటిస్తున్నారు.. అనే కారణాలు కూడా చూపి లక్షల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ధారాదత్తం చేశారు. ఈ క్రమంలో 1994వ సంవత్సరంలో 816 జీఓ ఇచ్చారు. దీనిప్రకారం ప్రభుత్వానికి క్రమం తప్పకుండా ఫీజు చెల్లిస్తూ, 30 సంవత్సరాల కొకసారి రెన్యూవల్ చేసుకున్న వారికి ఫ్రీహోల్డ్ (లీజు భూములపై శాశ్వత హక్కుదారుగా) చేసుకునేందుకు అనుమతినిచ్చేశారు.

అంటే ఈ సాకుతో ఈ భూములను పందేరం చేశారన్నమాట. ఈ దెబ్బకు 3 వేలమందికి ఖరీదైన భూములు దఖలు పడ్డాయి. అక్కడికీ ఇంకా సగం మంది మిగిలిపోవడంతో 2005 డిసెంబర్ 31న మళ్ళీ 816జీఓ ఒకటి తెచ్చి తిరిగి క్రమబద్ధీకరణకు అనుమతినిచ్చేశారు. ఈసారి 1,737 మంది భూములు సొంతం చేసుకున్నారు. 57 మంది లీజుదారుల దరఖాస్తులు మాత్రం ఇతర కారణాలతో రద్దయ్యాయి. మొత్తంగా 567 లీజుదారులు లీజు రెన్యువల్ విధానం కింద ఇంకా కొనసాగుతున్నారు. తర్వాత 2006లో 1976 లీజు రూల్స్‌లోని సెక్షన్ 17ను ప్రభుత్వం 177జీఓ జారీ చేసి సవరణ చేసింది.

ఈ సవరణ ప్రకారం లీజుదారులు లీజు కాలం ముగిసే తేదీకి రెండు నెలల ముందుగా లీజు రెన్యూవల్‌కు దరఖాస్తు చేయాలి. లేదా లీజు రెన్యూవల్ కాలం ముగిసిన తేదీకి ఒక నెలలోపు దరఖాస్తు చేసినట్లయితే తగు జరిమానాతో లీజులను రెన్యూవల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే మిగిలిన ఈ భూములను సమర్పించుకోవడానికి రంగం సిద్ధం చేశారన్నమాట.

జీరా ప్రాంత లీజులు..: సికింద్రాబాద్‌లోని ఈ మొత్తం లీజు ప్రాంతాలకు ఇక్కడే ఉన్న జీరా లీజు ప్రాంతానికి కొంత వ్యత్యాసం ఉన్నది. మిగతా సికింద్రాబాద్ లీజు స్థలాలు అప్పటి నిజాం ప్రభుత్వం బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి బదిలీ చేసినవి. కాని జీరా ప్రాంతం అప్పటి హైదరాబాద్ భగత్ జిల్లా తాలుకాదార్ ద్వారా భూసేకరణ జరిపి టౌన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ ద్వారా మిలటరీ ఎస్టేట్ అధికారికి అప్పగించారు. ఈ లీజు భూమి (జీరా ప్రాంతం) భూసేకరణపై అప్పటి పర్ పెచ్యువల్ లీజుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు దాఖలు చేశారు.

2002లో సుప్రీంకోర్టు తుది తీర్పు జారీ చేసి సదరు భూమి భూసేకరణపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పు జారీ అయిన తర్వాత జీరా ప్రాంత లీజుదారులు తమకు కూడా యాజమాన్య హక్కుల మార్పిడి అవకాశాన్ని ఇవ్వాలని దరఖాస్తు చేశారు. అయితే జీరా ప్రాంత లీజుదారులు ప్రభుత్వానికి అద్దె చెల్లించకపోగా, రెన్యూవల్‌ను కూడా సక్రమంగా చేయలేదు. దీంతో ఈ దరఖాస్తులను సీసీఎల్‌ఏ పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడ మొత్తం126 లీజులు ఉన్నాయి.

ఉల్లంఘలకు జేసీ వత్తాసు..


సీమాంధ్ర పాలకులే కాదు.. అధికారులు కూడా తక్కువ తినలేదు. సీమాంధ్ర పాలనలో ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వహించిన జేసీ శ్రీధర్ ఉల్లంఘనులతో చేతులు కలిపి పదవికి ఉన్న సర్వహక్కులను పాతరేశారు. లీజు నియమాలను అతిక్రమించిన లీజుదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం 1989లో జీఓ ఎంఎస్‌నెంబర్ 109ను, 2002లో జీఓ ఉంఎస్ నెంబర్ 832ను, 2006లో జీఓ ఎంస్ నెంబర్ 177లను విడుదల చేసింది. అయితే చేతివాటంకు అలవాటుపడిన సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర అధికారులు ఒక్క ఉల్లంఘనుడికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయలేదు. ఒక్క లీజు భూమి వెనక్కి తీసుకోలేదు. లీజులు రెన్యువల్ చేసుకున్నా లేకున్నా కండ్లు మూసుకున్నారు. పైగా జేసీ శ్రీధర్ తానే లీజుదారుల తరుపున వకాల్తా పుచ్చుకొన్నట్టు వ్యవహరించారు.

భూములు స్వాధీనం చేసుకుంటే లీజుదారులకు నష్టం వాటిల్లుతుందంటూ సీసీఎల్‌ఏకు లేఖ రాశారు. ముందే కూడబలుక్కున్నట్టు అప్పటి సీమాంధ్ర పాలకులు దాన్ని అంగీకరించారు. ఈ వెసులుబాటుతో లీజు ఉల్లంఘనులు ఎంఓయూతో అగ్గువకు విలువైన ప్రభుత్వ భూములను ఇతరులకు విక్రయించుకుంటున్నారు. లీజు నిబంధనల ప్రకారం లీజు భూములను కొనడం అమ్మడం నేరం. అయినా అధికారులు స్పందించలేదు.

లోకాయుక్త మొట్టికాయలు..


లీజు భూముల్లో జరుగుతున్న అక్రమాలపై సమాచార హక్కు కార్యకర్త నాగిళ్ల శ్రీనివాస్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. విచారణకు హాజరైన ఎస్టేట్ అధికారులు లోకాయుక్తకు పొంతన లేని సమాధానాలిచ్చి గడువుకావాలని కోరారు. లోకాయుక్త అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి జీఓ నెం. 177 పరిధిలోకి వస్తున్న లీజులలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి ఆ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లీజు రెన్యూవల్ విధానంలో కొనసాగుతున్న మొత్తం 567 లీజు కేసులలో 510 లీజులు జీఓ 177 పరిధిలోనికి వచ్చాయి. అంటే 510 మంది లీజుదారులు లీజు రూల్స్‌ను అతిక్రమించారు. నిర్ణీత సమయంలో రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకోలేదు.

ఈ కేసులలో ఇప్పటి వరకు 347మంది లీజుదారులకు షోకాజ్ నోటీసులు జారీచేయడం జరిగింది. మరో 163 మంది లీజుదారులకు షోకాజ్ నోటీసుల జారీ ప్రకియ కొనసాగుతోంది. నోటీసు అందిన నెల రోజులలోపు వారి లీజు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ తీసుకొని వారి లీజులను రద్దుచేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కనీసం ఈ భూముల విషయంలోనైనా దృఢంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి