భద్రగిరిఁ బొంది, మీ పోలవరము నిచట
నిర్మితము సేయఁ గుట్రల నెన్నొ పన్ని,
"మేల్మి బంగారమే యయ్య మే" మటంచుఁ
బల్క, నమ్మెడి వారమే? వదరఁ బోకు!
ఇచటి భద్రాచలాలయ, మిచటి జనులు,
వీరిపై ప్రేమ మీ కున్న వేగిరముగఁ
బోలవరమందుఁ బ్రాజెక్టు పూన్కి నాపి,
ముంపు నందెడి భద్రాద్రి కింపు నిడుఁడు!
పోలవర మిట నిర్మింప మునుఁగు నంచు
నమ్ముఁ డెనుఁబది మూఁడు శాతమ్ము గ్రామ
ములును! మూఁడు లక్షల జనములు నుపాధి
లేక నిర్వాసితులు నయి, లేమిలోనఁ
గూర్పఁ బడుదురు! బాధలఁ గోరఁ దగునె?
ఇరువదియు నైదు వేల యెకరములు గల
యటవి నీటను మున్గును! నటులె రెండు
నూర్ల డెబ్బది యైదగు నూళ్ళు మునుఁగు!
పాపికొండలు, పేరంట్ల పల్లి మునిఁగి,
నీటి కడుపున నివసించు నిజము సుమ్ము!
నేఁడు పదునేను నడుగుల నీటిమట్ట,
మది నలువదియు మూఁడడ్గు లటు పయిఁ జను!
భారి వర్షమ్ము వచ్చిన వరద హెచ్చ
రికయె నల్వదెన్మిది గంటలకును ముందె
జారి యగుచుండ, ప్రాజెక్టుఁ గోరి యిచట
నిర్మితముఁ జేయు తదుపరి నెట్టు లుండు
నో యటంచు నూహింపఁ గదోయి! యితర
ప్రాంత సంబంధముల్ తెగు! వైద్య, విద్య.
గిరిజ నోపాధు లన్ని దుష్కరము లగును!
గిరిజనులఁ గావ మైదాన పరిధులకును
దీసికొని పోవ నేజన్సి వాస చట్ట
మెటులు వారికి వర్తించు? నేది దారి?
సరియె పోనిండు! భరత దేశమ్మునందె
మిగులఁ బ్రాచీన జాతిగ నెగడునట్టి
కొండ రెడ్ల తెగయె యిటనుండి తొలఁగు!
ఎనిమిదౌ గ్రామములు మున్గు నిచట యనియుఁ
బల్కి, "యొడిశా"యె పెట్టె నభ్యంతరమ్ము!
ఇన్ని భద్రాద్రి గ్రామా లవెట్టి దుఃఖ
మందఁగాఁ గోరు దీవు? తమంత తాము
వెలికి వచ్చి, భద్రాద్రినిం గలుప వలదు
నాంధ్రలోపల నంచును నార్తి తోడఁ
బల్కుచుండి రీ ప్రజ! పోలవరము నాపి,
జరుగఁ బోవు విలయమునుం జరుగకుండఁ
గావఁగా నాంధ్రుఁడా నీకుఁ గరుణ లేదె?
కర్కశుండవే? యిఁక నైన గాలి మాట
లాపి, భద్రాద్రి జోలికి రావలదయ!
పోలవరము ప్రాజె క్టదియేల నీకు?
నెన్నొ దుష్పరిణామాలు నున్న దదియ!
నీదు బాగుకోసమె యిట, నాదు బాగు
నాశ మొనరింతువే? యన్యాయమునకు
నడుము కట్టెదవే? దుర్జనుఁడవె నీవు?
మంచివాఁడవు నీవైన, మాన్యతఁ గన,
భద్రగిరి జోలికే రావ వలదు! కోర,
పోలవరము వర మిడదు! ముంపు నిడును!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
4 కామెంట్లు:
సత్యం చెప్పారు.
దాని బదులు నాలుగయిదు చోట్ల చెక్ డ్యాములను కట్టుకొంటే శ్రేయస్కరమని నిపుణులు చెప్పుతున్నారు. తెలంగాణ ప్రజలు అందుకు తమ ఆమోదాన్ని కూడ తెలిపారు.
అది నిజమని సీమాంధ్ర నాయకులకులకు కూడ తెలుసు. కాని దానిని అంగీకరిస్తే, తమ ఆధిపత్యాహంకారాలకు భంగం వాటిల్లుతుందని వారి భావన.
లోగడ మిగులు నీరు చూపడానికి శ్రీశైలం డ్యామును మొండిగా నింపుతూ పోయి, తుదకు కర్నూలు ప్రజలను వరదల్లో ముంచిన ఘన చరిత్ర వారిది.
సీమాంధ్ర నాయకుల పద్ధతి ఇదయితే, సీమాంధ్ర ప్రజలది మరో రకం.
వారు స్పందించాల్సిన సమయంలో స్పందించరు. స్పందించగూడని సమయంలో స్పందిస్తారు.
మీ కవిత బాగుంది. అభినందన!
ధన్యవాదాలు ఫణీంద్రగారూ! మీరన్నది ముమ్మాటికి నిజం. ఇలాంటి తరుణంలో డ్యాం కంటే చెక్ డ్యాంలే మేలైనవి. అది తెలుసుకొని, ఆచరిస్తే, ప్రజలందరికీ మేలు జరుగుతుంది.
Meeru cheppindi akshara satyam. Kavita chala hrudyam ga undi.
ధన్యవాదాలండీ తరంగిణిగారూ! మీ "వేకువరేఖలు" ఎప్పుడు దర్శనమిస్తాయి? తెలుపగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి