గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 02, 2015

ఉక్కు తెలంగాణ...!!!

iron


రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సుమారు 302 మిలియన్ టన్నుల మేర ఇనుప ఖనిజం నిల్వలున్నాయని ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇంతదాకా ఒక్క ఖమ్మం జిల్లా బయ్యారంలో మాత్రమే ఈ నిక్షేపాలున్నాయని భావించారు. అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సర్వేలు జరిపించింది. ఇదే సమయంలో ఇతర జిల్లాల్లో జరిపిన ప్రాథమికస్థాయి పరిశీలనలు తీపి కబురు అందించాయి. తెలంగాణవ్యాప్తంగా భారీ స్థాయిలో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఇది శుభ సంకేతంగా భావిస్తున్నారు.

-రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం నిక్షేపాలు
-ఐదు జిల్లాల్లో ఐరన్ ఓర్
-ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడి
-ఉక్కు పరిశ్రమపై చిగురిస్తున్న ఆశలు
-కొనసాగుతున్న జీ-3 స్థాయి ప్రయోగాలు

ప్రస్తుతం ప్రాథమికంగా లభ్యమైన సమాచారాన్ని గనుల శాఖ ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులు క్రోడీకరిస్తున్నారు. మొత్తం ఐదు జిల్లాల్లోనూ ఈ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయని సమాచారం. 200 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం (జీ-3 లేదా జీ-2 స్థాయిలో) అందుబాటులో ఉంటే పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం ఉంటుందని టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టం చేసింది. కాగా ప్రాథమికంగా జీ-4 స్థాయిలో జరిపిన పరిశోధనల్లో రాష్ట్రవ్యాప్తంగా 302 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్టుగా తేలింది.
అసలు ప్రయోగాలేమిటి..?


ఖమ్మం జిల్లా బయ్యారంలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్నాయని, దీనితో ఇక్కడ స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. అప్పటి నుంచే ఇను ప ఖనిజం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఆయా గనుల్లో ఉన్న ఐరన్ ఓర్ ఏ గ్రేడ్‌తో ఉంది.. ఎంత మొత్తంలో నిల్వలు ఉన్నాయనే ప్రాథమిక సమాచారం సేకరించడానికి ఇక్కడ విస్తృతంగా పరిశోధనలు మొదలు పెట్టారు. 


ఇలా ప్రాథమికంగా భూ ఉపరితలంపై చేసిన ప్రయోగాలను జీ-4 స్థాయిగా పేర్కొంటారు. ఈ స్థాయిలో ఒక్క బయ్యారం (ఖమ్మం)లోనే కాకుండా వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లోనూ ఐరన్ ఓర్ నిక్షేపాలున్నట్టుగా గుర్తించారు. అయితే ఇలా గుర్తించిన ఇనుప ఖనిజం నిక్షేపాల గ్రేడ్ ఒక్కో స్థాయిలో ఒక్కోలా ఉంది. ఈ నిల్వల మొత్తం 302 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని నిర్ధారించారు.


జీ-3 స్థాయి..


ఉపరితలం మీద జీ-4 స్థాయిలో చేపట్టిన ప్రయోగాల్లో వెల్లడైన ప్రాథమిక సమాచారంపై మరింత లోతుగా ప్రయోగాలు చేపట్టడమే జీ-3 స్థాయిగా చెప్పుకోవచ్చు. ఇందులో సుమారు ప్రతి 400 నుంచి 300 మీటర్లకు ఒకచోట డ్రిల్లింగ్ చేస్తారు. బయ్యారంలో ప్రస్తుతం గుర్తించిన 69 చదరపు కిమీ పరిధిలో సుమారు 12 నుంచి 13 బోర్లను డ్రిల్లింగ్ చేశారు. మరో 45 కి.మీ. పరిధిలో చేయాల్సి ఉంది. ఈ డ్రిల్లింగ్ సందర్భంగా ఎంత లోతులో ఎంతమేర ఐరన్ నిక్షేపాలున్నాయనేది గుర్తిస్తారు. ఇది జీ-3 స్థాయి ప్రయోగాలు.


జీ-2 స్థాయి..


ఈ స్థాయిలో ప్రతి 100 మీటర్లకు ఒక బోరును డ్రిల్ చేస్తారు. ఇందులో భూగర్భంలో వెల్లడైన అంశాలను విశ్లేషిస్తారు. ఎంత మందం ఇనుప ఖనిజం ఉంది.. ఏయే గ్రేడ్లలో ఉంది.. ఏయే లోతుల్లో ఉంది అనే సమాచారాన్ని నిర్ధారిస్తారు. దీనివల్ల కచ్చితమైన నిల్వలు, గ్రేడింగ్‌ను లెక్కించవచ్చు. ఆ తరువాత లభించిన ముడిపదార్థాన్ని కెమికల్ అనాలసిస్ (రసాయన విశ్లేషణ) చేస్తారు.


చిగురిస్తున్న ఆశలు..


టాస్క్‌ఫోర్స్ కమిటీ చెప్పినదానిని బట్టి జీ-3 గానీ.. జీ-2 స్థాయిలోగానీ జరిగిన ప్రయోగాల్లో లభించిన సమాచారం ప్రకారం 200 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం లభిస్తే పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం ఉన్నట్టుగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో నిర్వహించిన జీ-4 స్థాయి ప్రయోగాల్లో 302 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం గనులున్నట్టుగా వెల్లడయినందువల్ల జీ-3 స్థాయి పరీక్షల్లో 200 మిలియన్ టన్నులకుపైగానే ఐరన్ ఓర్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా జీ-3 స్థాయిలో (బయ్యారం చుట్టుపక్కల) చేపట్టిన ప్రయోగాల్లోకూడా సానుకూలత కనపడుతుందని అందిన సమాచారం.


భవిష్యత్తులోనూ...


ఇదిలా ఉండగా గతంలో 75 నుంచి 80 శాతం ఇనుము శాతం ఐరన్ ఓర్ ఉంటేనే స్టీలు, ఉక్కు పరిశ్రమలకు అనువైనవిగా ఎంపిక చేసేవారు. అయితే గడిచిన రెండు, మూడు దశాబ్దాల కాలంలో అందివచ్చిన యంత్రాలు, ఆధునికత, సాంకేతికత కారణంగా 62 శాతం ఇనుము శాతం (ఫెర్రస్ పర్సెంటేజీ) ఉన్నా లాభదాయకమని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ శాతాన్ని 45 నుంచి 50 శాతానికి తగ్గించికూడా ఉక్కును ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అంటే ఇప్పుడు చేస్తున్న ప్రయోగాలు భవిష్యత్తులోనూ ఉపయోగపడతాయనే చెప్పవచ్చు. 


ప్రస్తుతం తెలంగాణలోని ఐదు జిల్లాల్లో గుర్తించిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోనే 62 శాతం ఆపైనకూడా ఐరన్ ఓర్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో బయ్యారంలో 10 మిలియన్ టన్నుల ఐరన్‌ఓర్ 42 నుంచి 65 ఫెర్రస్ గ్రేడ్ ఉన్నట్టుగా నిర్ధారించారు. అలాగే మొట్ల తిమ్మాపురం, ఇస్రులాపురం తదితర గ్రామాల పరిధిలో 12 మిలియన్ టన్నులుగా ఉందని గుర్తించిన ఐరన్ ఓర్‌లో 58 నుంచి 62 శాతం ఫెర్రస్ ఉందని గుర్తించారు. వరంగల్ జిల్లా నేలవంచ, బొద్దుగడ్డ, మంచెర్ల, కొంగరగిద్ద (గూడూరు మండలం)లో సుమారు 15 మిలియన్ టన్నులుగా గుర్తించిన ఐరన్ ఓర్‌లో 58 నుంచి 68 శాతం ఫెర్రస్ ఉందని నిర్ధారించారు. 


అలాగే ముప్పవరం, మల్లంపల్లి, పాకాల సరస్సు, గరీబ్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఐరన్ ఓర్‌లో 30 నుంచి 60 వరకు, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో 55 నుంచి 60 శాతం వరకు ఉందని తేల్చారు. ఇందులోనూ హెమటైట్ రకం ఎక్కువగా ఉందని తేలడంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయనే చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాలో సుమారు 86 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్న మాగ్నెటైట్ గనులనుకూడా ఉపయోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.


మాగ్నెటైట్ అయితే..


ఖమ్మం జిల్లా ఉట్లమట్వాడ, సర్కాయ్‌పిల్లు,తత్రాయపల్లి , గోపాల్‌పూర్ గ్రామాలతోపాటు, అటు కరీంనగర్‌లోని యెర్రబల్లి, కొత్తపల్లి, దామెర, అంబర్‌పేట, అర్నకొండ, మల్లాపూర్, చొప్పదండి తదితర ప్రాంతాల్లోనూ కలిపి సుమారు 145 మిలియన్ టన్నుల మాగ్నెటైట్ నిల్వలున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. మిగతా ప్రాంతాల్లో హెమటైట్ రకానికి చెందిన ఇనుక ఖనిజం ఉంది. హెమటైట్ రకం ఖనిజం అయితే స్టీలు ఉత్పత్తికి నేరుగా వాడుకోవచ్చు. అదే మాగ్నెటైట్ అయితే దానిని నేరుగా వాడుకోలేము. ఆధునిక పద్ధతిలో దానిలోని గ్రేడింగ్‌ను పెంచాల్సి ఉంటుంది.


table



శాతాన్ని బట్టి స్టీలు..


62 శాతం ఫెర్రస్ ఉన్న ఖనిజం అయితే 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయడానికి 5 మిలియన్ టన్నుల ఖనిజం అవసరం అవుతుంది. ఒకవేళ 45 శాతం ఫెర్రస్ ఉన్న ఖనిజం అయితే.. 3 మి. ట.ల ఉత్పత్తి కోసం 8 మి. టన్నుల ముడిఖనిజం అవసరం అవుతుంది. అలాగే 38 శాతం గ్రేడ్ అయితే.. 3 మి. ట. కోసం 10 మి. టన్నుల ముడిపదార్థాన్ని వినియోగించాల్సి ఉంటుంది. తెలంగాణలోని 5 జిల్లాల్లో ప్రాథమిక (జీ-4) స్థాయిలో చేపట్టిన పరిశోధనల్లో సగటున (యావరేజీ) 50 నుంచి 55 శాతం వరకు ఫెర్రస్ ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 


దీనినిబట్టే.. జీ-3, లేదా జీ-2 స్థాయిలో చేపట్టే ప్రయోగాల్లో తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన నిల్వలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదీగాక.. 200 మిలియన్ టన్నుల నిల్వలు కావాలంటే.. అవసరం అయితే పక్క రాష్ర్టాల్లోని ఇనుప ఖనిజాన్నికూడా తెచ్చుకోవచ్చు. ఏ రకంగా చూసినా ఉక్కు పరిశ్రమపై ఆశలు చిగురిస్తున్నాయనే చెప్పవచ్చు. ఇక జీ-3, జీ-2 స్థాయి ప్రయోగాలు ఎప్పుడు పూర్తవుతాయా? అని ఎదురుచూడటం ఒక్కటే మిగిలింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...



సింగరేణి బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి,కాబట్టి కొత్తగూడెంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చెయ్యవచ్చును.కేంద్ర ప్రభుత్వం చెయ్యాలంటే ఆలస్యం జరగవచ్చును.ఏదైనా పెద్ద ప్రైవేటు సంస్థని అహ్వానించాలి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

_/|\_ ఏం జరుగుతుందో వేచిచూద్దాం! స్పందించినందుకు ధన్యవాదాలండీ కమనీయంగారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి