గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 13, 2014

బడ్జెట్: జైట్లీ చదవని భారీ సంస్కరణలు...!



ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన నోటితో చదవని భారీ సంస్కరణలు బడ్జెట్‍లో దండిగానే ఉన్నాయి. ఆంగ్లంలో బిగ్ టికెట్ రిఫార్మ్స్‍గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పిలిచే ఈ సంస్కరణలే బడ్జెట్ అసలు సారాంశం. జనం మెచ్చే కేటాయింపులు సభలో చదివి తక్షణం ప్రతిపక్షాలు, ప్రజల నుండి విమర్శలు ఎదురయ్యే ప్రతిపాదనలను చదవకుండా ఆర్థికమంత్రి జాగ్రత్తపడ్డారు. తద్వారా పేదలది ఎంతమాత్రం కాని బడ్జెట్‍ని "ఇది పేదల బడ్జెట్" అని ప్రధాని నిరభ్యంతరంగా ప్రకటించే వెసులుబాటును కల్పించారు.

మరీ చిత్రం ఏమిటంటే ఈ సంస్కరణాలన్నీ గత యు.పి.ఏ ప్రభుత్వం ప్రతిపాదించినవే. ప్రతిపక్షంలో కూర్చుని వాటిని విమర్శించిన బి.జె.పి ఇప్పుడు యు.పి.ఏ కంటే వేగవంతమైన లక్ష్యాలను వాటికి ప్రతిపాదించడం ఘరానా మోసం. చట్ట సభల సాక్షిగా చేసిన చెవి కట్టు (కనికట్టు లాగా)!

ఉదాహరణకి డీజెల్ ధరలను పూర్తిగా డీ కంట్రోల్ చేస్తామని అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఇప్పటికే పెట్రోల్ ధరలను డీ కంట్రోల్ చేయడంతో అది సామాన్యుడికి అందుబాటులో లేదు. వ్యవస్థ సృష్టించే వివిధ రకాల ఆటంకాల వలన వాహన ప్రయాణాలు మానుకోలేని మధ్యతరగతి జనం అనివార్యంగా తమ వేతనంలో గణనీయ మొత్తాన్ని ఇంధనం కోసం ఖర్చు చేసి ఇతర ఖర్చులకు డబ్బు మిగుల్చుకోలేని పరిస్థితిలో ఉండగా కాస్త తక్కువకు అందుబాటులో ఉండే డీజెల్‍ను కూడా డీ కంట్రోల్ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. అది కూడా వేగంగా.

మార్చి 2015లోపు డీజిల్ ధరలను పూర్తిగా డీ కంట్రోల్ చేసి మార్కెట్ ఆటు పోట్ల దయా దాక్షిణ్యాలకు జనం అవసరాల్ని వదిలేస్తామని బడ్జెట్ ద్వారా జైట్లీ చెప్పారు. మార్చి లోగా మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గిస్తామని బడ్జెట్ లో మంత్రి పేర్కొన్నారు. అనగా 'డీ కంట్రోల్' అన్న పదం ఉపయోగించకుండా డీ కంట్రోల్ చేశారు. డీజిల్ ధర లీటర్ కు రు. 1/- పెంచినందుకు ప్రతిపక్షాలు విమర్శిస్తే యు.పి.ఏ చేసిన నిర్ణయాన్నే మేము అమలు చేశాం అని సమర్థించుకున్న అరుణ్ జైట్లీ డీజెల్ డీ కంట్రోల్ నిర్ణయాన్ని ఎవరి మీదకు నెడతారు? నెట్టడానికి ఎవరూ లేకనే ఆ నిర్ణయాన్ని చదవడం మానేశారా?

మరో శక్తి వనరు సహజవాయువు ధరలను కూడా వాస్తవికతకు సమీపంగా తెస్తామని చెబుతూ 'కీలెరిగి వాత పెట్టే' విద్యను ఆర్థిక మంత్రి ప్రదర్శించారు. కుటుంబానికి సబ్సిడీ రేట్లకు సంవత్సరానికి 12 సిలిండర్లు ప్రస్తుతం ఇస్తున్నారు. ఈ కోటాను వాస్తవిక స్థాయికి తెస్తామని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆ వాస్తవికత ఏమిటన్నది రహస్యం ఏమీ కాదు. ఇలాంటి చాటుమాటు పదజాలం గత ప్రభుత్వాలు ఉపయోగించినవే. వాస్తవికత అంటే సహజవాయువు వాస్తవ ధరకు దగ్గరగా ఉండే విధంగా సబ్సిడీని నియంత్రిస్తామని చెప్పడం. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏ మేరకు తగ్గిస్తారో, ఎప్పుడు తగ్గిస్తారో చెప్పలేదు. జనం నెత్తిపై గ్యాస్ పిడుగు వేసే అవకాశాన్ని ఆయన అట్టేపెట్టుకున్నారు.

మంత్రిగారికి తెలుసో లేదో గానీ చమురు ఉత్పత్తుల కోసం ప్రభుత్వం వసూలు చేస్తున్న ధరలకు, చమురు దిగుమతి ధరలకు హస్తిమశకాంతరం ఉంది. జనం చెల్లిస్తున్న పెట్రోలు, డీజెల్ ధరల్లో ముప్పాతిక భాగం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులే. మంత్రిగారు చెప్పిన 'వాస్తవికత'ను ఇంధనం ధరలకు అన్వయిస్తే ప్రజలకు భారీ యెత్తున ఉపశమనం కలుగుతుంది. ఇంకో సంగతి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ రెవిన్యూ ఆదాయంలో 35 శాతం చమురుపై పన్నుల వల్లనే సమకూరుతోంది. అనగా ఇంధన ధరల్లో ప్రధాన దోషి అంతర్జాతీయ పరిస్థితులు కాదు, భారత ప్రభుత్వ నిలువు దోపిడీయే కారణం.

డీజిల్ ధరలకు ఆహార ధరలతో నేరుగా సంబంధం ఉంటుంది. భారీ వాహనాలన్నీ డీజెల్‍తో నడిచేవే. కాబట్టి ధాన్యం దగ్గరి నుండి కూరగాయల వరకూ తమ తమ ధరల్లో డీజెల్‍ని మోస్తూ ఉంటాయి. అలాంటి డీజెల్‍ని డీ కంట్రోల్ చేస్తే ద్రవ్యోల్బణం మరింతగా కట్లు తెంచుకోవడం ఖాయం. ముఖ్యంగా ఆహార ధరలు శ్రామిక ప్రజలకు అందకుండా పోతాయి. వారి కొనుగోలు శక్తి మరింతగా పడిపోతుంది. 

సహజవాయువు ధర కూడా ప్రైవేటు కంపెనీల లాభాల కోసం ఆకాశంలో ఉంచారు. ఒక మిలియన్ బ్రిటిష్ ధర్మల్ యూనిట్ సహజవాయువుకు 2 డాలర్ల చిల్లర, రిలయన్స్ కంపెనీకి చెల్లిస్తుండగా, యు.పి.ఏ ప్రభుత్వం కాంట్రాక్టు గడువు ముగియకుండానే 4.2 డాలర్లకు పెంచేసింది. ఒక పక్క రిలయన్స్ కంపెనీ మోసపూరితంగా సహజవాయువు ఉత్పత్తి తగ్గిస్తున్నప్పటికీ కాంట్రాక్టు ప్రకారం జరిమానా వసూలు చేయవలసి ఉన్నప్పటికీ మరోపక్క ధరలను మళ్ళీ రెట్టింపు (8.34 డాలర్లకు) చేశారు. ఇది వాస్తవిక ధర కాదన్న సంగతి మంత్రిగారి దృష్టిలో ఉన్నదా? ఒకేసారి కాకుండా దశలవారిగా ఈ పెంచిన ధరను రిలయన్స్ కు చెల్లిస్తామని ఆర్ధికమంత్రి బడ్జెట్‍కు ముందు రాజ్యసభలో చెప్పారు. తద్వారా యు.పి.ఏ నిర్ణయాన్ని కొనసాగిస్తామన్న హామీని కంపెనీకి ఇచ్చారు. 

సహజవాయువును ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చును బట్టి ధర చెల్లించడం వాస్తవికత. కానీ ఉత్పత్తి ఖర్చును వదిలేసి ప్రపంచ మార్కెట్‍తో సమానంగా ఉండాలనీ, ధరలు తక్కువగా ఉంటే విదేశీ పెట్టుబడులు రావని చెబుతూ ధరలను పెంచడం వాస్తవికత కాకపోగా పచ్చి దగా. అసలు వాస్తవికతను పట్టించుకోని పాలకులు ప్రజల వనరులను ప్రజలకు ఇచ్చే విషయంలో ఉనికిలో లేని సరికొత్త వాస్తవికతను సృష్టించడం దగా కాక ఇంకేమిటి?

ఆర్ధిక మంత్రి చదవని మరో సంస్కరణ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (DBT) లేదా నగదు బదిలీ పధకం. యు.పి.ఏ ప్రతిపాదించిన ఆధార్ కార్డు ద్వారానే ఈ పధకాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ పధకాన్ని బి.జె.పి నిన్నటివరకూ విమర్శించింది. అధికారంలోకి రాగానే స్వరం మార్చింది. సబ్సిడీ మొత్తాన్ని తగ్గించడమే ఈ పధకం లక్ష్యం. ప్రజా పంపిణీ వ్యవస్ధ, గ్యాస్, కిరోసిన్, పంచదార తదితర సబ్సిడీలను వస్తు రూపేణా కాకుండా డబ్బు రూపేణా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడానికి సంకల్పించిన ఈ పధకం పైలట్ దశలోనే సరిగ్గా అమలు చేయలేక యు.పి.ఏ వాయిదా వేసుకుంది. ఆధార్ కు గ్యాస్ సిలిండర్ తదితర సబ్సిడీలకు లంకె పెట్టొద్దని సుప్రీం కోర్టు, హై కోర్టులు ఇటీవల ఆదేశించినా బి.జె.పి ప్రభుత్వం పట్టించుకునే యోచనలో లేదని స్పష్టం అవుతోంది.

ఆర్ధిక మంత్రి ప్రతిపాదించిన మరో తీవ్ర సంస్కరణ చర్య ప్రభుత్వ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రభుత్వరంగ కంపెనీల వాటాల అమ్మకం ద్వారా ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 63,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ 9 నెలల్లో సంపాదించాలని లక్ష్యంగా ప్రకటించారు. మధ్యంతర బడ్జెట్ లో యు.పి.ఏ ప్రతిపాదించిన మొత్తం (రు. 56,000 కోట్లు) కంటే ఇది 7,000 కోట్లు ఎక్కువ. ఇంతవరకు ఈ ఖాతా కింద ప్రభుత్వాలు ప్రకటించిన ఆదాయంలో రు 40,000 కోట్లు అత్యధికం. ఆ లక్ష్యాన్ని సైతం అప్పటి (2012) ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పూర్తి చేయలేదు. ఈసారి లక్ష్యాన్ని పూర్తి చేస్తే అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీలు రికార్డు సృష్టించినవారవుతారు.

తెలిసి చెప్పారో, మర్చిపోయి చెప్పారో తెలియదు గానీ ఈ చర్య జాతీయ ప్రయోజనాలకు ఎలా వ్యతిరేకమో ఆర్ధిక మంత్రి బడ్జెట్ లోనే చెప్పారు. వాటాల అమ్మకం వలన ఇక నుండి ప్రభుత్వం ప్రభుత్వరంగ కంపెనీల ద్వారా వచ్చే లాభాల ఆదాయం పైన ఆధారపడే అవకాశం ఉండదని మంత్రి చెప్పారు. ప్రభుత్వ వాటాలను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవడం అంటే ఆ మేరకు ఆదాయాన్ని ప్రైవేటు కంపెనీలకు వదులుకోవడమే. కాబట్టి ప్రభుత్వాదాయం తగ్గిపోతుంది. ఈ లోటును పన్ను పునాదిని విస్తరించడం ద్వారా పూడ్చుకోవాలని మంత్రి తలపెట్టారు.

ఒకవైపేమో బడ్జెట్ వ్యయంలో అధికమొత్తాన్ని పెట్టుబడి వ్యయానికి, ఆస్తుల సృష్టికి కేటాయించాలని లక్ష్యం ప్రకటిస్తారు. మళ్ళీ అదే చేత్తో దశాబ్దాల తరబడిన భారతీయుల శ్రమతో సృష్టించిన పారిశ్రామిక ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అయినకాడికి అమ్మేస్తారు. ఫిస్కల్ ప్రుడెన్స్ (కోశాగార మెలకువ) గురించి బడ్జెట్ పత్రంలో పదే పదే నీతిబోధలు కావించిన ఆర్ధిక మంత్రి ఇలాంటి జాతి వ్యతిరేక, జాతీయ వ్యతిరేక ప్రతిపాదనలను ఏ కారణం చెప్పి సమర్ధిస్తారు?

పైన చెప్పినట్లు ఆర్ధిక మంత్రి ప్రతిపాదించిన మరో బిగ్ టికెట్ రిఫార్మ్ ఆదాయాన్ని ఆస్తుల సృష్టికి ప్రధానంగా వినియోగించడం. రాష్ట్రాలకు చెల్లిస్తున్న పన్నుల వాటాలో కూడా అధికమొత్తాన్ని పెట్టుబడి ఆస్తుల సృష్టికి వ్యయం అయ్యేలా చూడాలని బడ్జెట్ లో దిశా నిర్దేశం చేశారు. ఇందుకోసం వివిధ ప్రణాళికా స్కీముల్లో వ్యవస్ధాగత మార్పులు చేయడానికి కొన్ని ప్రతిపాదనలను మంత్రి చేశారు. 2/3 వంతు రెవిన్యూ వ్యయం ఆస్తుల సృష్టికి తరలించడం వాటిలో ఒకటి. ఈ అంశంలో మరిన్ని నిర్దిష్ట చర్యలను మునుముందు ప్రకటిస్తారు. బహుశా గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని ఇందులో చేర్చవచ్చు. ఈ పధకాన్ని ఆస్తుల సృష్టికి, వ్యవసాయ అనుబంధంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్ధిక మంత్రి బడ్జెట్ లోనే మరోచోట చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని వృధా ఖర్చులకు వినియోగించడం కాకుండా తిరిగి లాభం వచ్చే విధంగా వ్యయం చేయాలని ఈ చర్యల అంతరార్ధం. స్వతంత్ర పరిశీలనలో ఇది అందమైన ప్రతిప్రాదన. 'చేపలు పట్టడం నేర్పాలి గానీ చేపలు పట్టి ఇవ్వరాదు' అన్న అర్ధంలో చూస్తే ఇది మంచిదే. కానీ మన పాలకుల ఉద్దేశ్యం ఇది కాదు.

ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్త శుద్ధి ఉన్నట్లయితే మిగులు, బంజరు భూములను విచ్చలవిడిగా స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి బదులు భూమిలేని పేదలకు పంచి ఇవ్వవచ్చు. తద్వారా కాగితాలకే పరిమితం అయిన భూ సంస్కరణలను అమలు చేస్తే కోట్లాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ మేరకు అనుబంధ కార్యకలాపాలు కూడా వృద్ధి చెంది ప్రజలకు ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు అభివృద్ధి అవుతాయి. అలాగే ప్రతి యేడూ ప్రైవేటు కంపెనీలకు ఇస్తున్న రు. 6 లక్షల కోట్లకు పైగా పన్ను రాయితీలను తగ్గించి పెట్టుబడి వ్యయానికి తరలించవచ్చు. ప్రభుత్వ సొమ్ముతో మరిన్ని పరిశ్రమలు స్ధాపించి అక్షరాస్యుల నిరుద్యోగాన్ని బాగా తగ్గించవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం అసలు లక్ష్యం వృధా ఖర్చు పేరుతో ప్రజలకు చేస్తున్న నామమాత్ర కేటాయింపులను కూడా వివిధ పేర్లతో కంపెనీలకు తరలించడం.

జి.డి.పితో అప్పుల నిష్పత్తిని బాగా తగ్గించడం ఆర్ధిక మంత్రి ప్రకటించిన మరో సంస్కరణ. ఇది సైద్ధాంతిక ప్రతిపాదన. పశ్చిమ సామ్రాజ్యవాద మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని వారి కోసం చేసిన ప్రతిపాదన. ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ తదితర పెట్టుబడులు పెట్టడానికి విదేశీ బహుళజాతి ద్రవ్య, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు పరిగణనలోకి తీసుకునే స్ధూల ఆర్ధిక సూచికల్లో (మేక్రో ఎకనమిక్ ఇండిసెస్)రుణాలు, జి.డి.పి ల నిష్పత్తి. ఒక దేశం యొక్క రుణం ఆ దేశ జి.డి.పిలో ఎంత శాతం ఉండేదీ ఎఫ్.డి.ఐ లు చూస్తాయి. ఇది ఎంత తక్కువగా ఉంటే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ అంత పటిష్టంగా ఉన్నట్లు పరిగణిస్తాయి. జి.డి.పిలో రుణం శాతం ఎక్కువగా ఉంటే దానిని ఋణ సంక్షోభంగా పరిగణిస్తాయి. దేశ అవసరాల కోసం కాకుండా విదేశీ పెట్టుబడులకు భారతీయ ఆర్ధిక వ్యవస్ధ ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈ ప్రతిపాదన చేయడం తీవ్ర అభ్యంతరకరం. రుణాలపై ఆధారపడడం తగ్గిస్తే అది నిస్సందేహంగా ఆహ్వానించవచ్చు. కానీ అది ప్రజల కోసం, దేశం కోసం కాకుండా విదేశీ కంపెనీల కోసం చేయడమే అభ్యంతరకరం.

బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చదివిన బిగ్ టికెట్ సంస్కరణల్లో ముఖ్యమైనవి ఇన్సూరెన్స్, డిఫెన్స్ రంగాల్లో ఎఫ్.డి.ఐ ల పరిమితిని 26% నుండి 49% శాతానికి పెంచడం. రైల్వే మంత్రి కూడా కేబినెట్ అంగీకారం అనంతరం ఎఫ్.డి.ఐ లకు ఆహ్వానించేందుకు నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఇవి కాకుండా ప్రసంగంలో చదవని సంస్కరణలు పైన పేర్కొన్నవి. ఆర్ధిక మంత్రిగారు ఈ దాపరికాన్ని ఎందుకు ప్రదర్శించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రజలు ఈ మోసాన్ని గ్రహించి నిలదీయడానికి ఉద్యుక్తులు కావాలి.

(వి. శేఖర్‍గారి ’జాతీయ అంతర్జాతీయ వార్తలు’ సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

శనివారం, జులై 12, 2014

కోర్టుకు పోతం,,,!

-పోలవరం ఆర్డినెన్స్‌కు ఆమోదం అప్రజాస్వామికం..
-సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన 
kcr2
పోలవరం ప్రాజెక్టు ముంపు ముసుగులో తెలంగాణలోని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు పార్లమెంట్ ఆమోదం తెలుపడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ను ఉల్లంఘించి ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం న్యాయనిపుణులతో సమాలోచనలు జరుపుతున్నామని కేసీఆర్ వెల్లడించారు. భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడాన్ని టీఆర్‌ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. దీనిపై తాను స్వయంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కలిసి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కోరానని గుర్తుచేశారు. అయినా కేంద్రం అప్రజాస్వామికంగా, మొండిగా వ్యవహరించిందన్నారు.

టీడీపీ,బీజేపీ విప్ జారీచేసి పంతం నెగ్గించుకుంటుంటే తెలంగాణ తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు అడ్డుకుని ఉండాల్సిందన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు ఈ విషయంలో పార్లమెంట్‌లో ఎంత పోరాటం చేసినా కేంద్రం మందబలంతో గొంతునొక్కేసిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ప్రభుత్వాల, ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం ఆ రాష్ర్టాల హక్కులను కూడా కాలరాసిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్డినెన్స్ పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పటికీ భద్రాచలంలోని ఏడు మండలాలను కాపాడుకొనేందుకు ఎలాంటి కార్యాచరణను రూపొందించుకోవాలనే విషయంపై తమ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని అన్నారు. న్యాయనిపుణులు, రాజ్యాంగనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. పోలవరం డిజైన్ మార్చితే ముంపు సమస్యే ఉండదని ముఖ్యమంత్రి చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

భద్రాచలం డివిజన్ ఎవరిది ?

- రాజ్‌నాథ్ వ్యాఖ్యల్లో అవాస్తవాలు
- తప్పుదోవ పట్టించిన సీమాంధ్రులు
- వందల ఏళ్లుగా తెలంగాణలోనే భద్రాచలం డివిజన్
- కాకతీయుల నాటినుంచి అనుబంధం
- రామాలయాన్నీ పోషించిందీ నిజామే
- ఆంధ్ర ప్రభుత్వంలోఉన్నది 80 ఏళ్లే
(సవాల్ రెడ్డి) 
పోలవరం ముంపు గ్రామాల బదలాయింపు బిల్లును పార్లమెంటు ఆమోదించింది. మందబలమా.. మరొకటా అనేది ఎలా ఉన్నా..ఇక భద్రాచలం డివిజన్ తెలంగాణకు గత చరిత్రే. కానీ బిల్లు విషయంలో రాజ్‌నాథ్ చెప్పిన గతంలో ఆంధ్రా వారిదే అనే మాటే అభ్యంతరకరం. ప్రచార సాధనాలను, మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ఆంధ్రులు తాము చెప్పిందే వేదంగా చెలామణి చేసిన చరిత్రలో భద్రాచలం చరిత్ర కూడా వక్రీకరణకే గురైంది. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణదే. వందల ఏళ్ల చరిత్రలో ఆ తాలూకా ఆంధ్రాలో ఉన్నది అతి స్వల్పకాలమే.

ramalayam
చరిత్రను పరిశీలిస్తే కాకతీయుల కాలంలోకూడా భద్రాచలం ఓరుగల్లు సామ్రాజ్యంలో భాగమే. ప్రతాపరుద్రుని కాలంలో పెద మల్లరాజు, చిన్న మల్లరాజు అనే వారు ఇక్కడ వ్యవహారాలు చూసేవారు.1571 నాటినుంచి నుంచి గోల్కొండ నవాబుల కాలంనుంచి భద్రాచలం ప్రాంతం తెలంగాణ సర్కారు ఆధీనంలోనే ఉంది. వారి కాలంలోనే ఇక్కడ తహసీల్దారుగా ఉన్న కంచర్ల గోపన్న రామాలయం కట్టించాడు. ఈ కాలంలో రుస్తుంఖాన్ ఈ ప్రాంత పాలనా వ్యవహారాలు చూసేవాడు. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబుల పాలన అంతమై 1748లో నైజాం నవాబుల పాలన వచ్చింది. 1769లో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాన్ని నైజాం ఇంగ్లీషు వారికి ఇచ్చాడు. అయితే భద్రాచలం తాలూకా ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. 1860లో భద్రాచలం తాలూకాను ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇంగ్లీషు వారికి ఇచ్చాడు అయితే అప్పుడు కూడా అది ఆంధ్రలో కాకుండా మధ్యభారత్‌లో కలిపారు. అప్పుడు ఈ ప్రాంతం భద్రాచలం, రేకపల్లి పేరిట రెండు తాలూకాలుగా ఉండేది. 1874లో మాత్రమే ఇది ఆంధ్రలో చేరింది. పాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్ వారు దీన్ని మధ్యభారత్‌నుంచి గోదావరి జిల్లాలో చేర్చారు. అప్పటినుంచి 1959 వరకు ఉన్న ఈ డివిజన్‌ను తిరిగి తెలంగాణలో చేర్చడానికి ఈ చారిత్రక నేపథ్యమే కారణం. 

భద్రాచలం ఆలయం..

భద్రాచలం ఆలయం తెలంగాణ తహశీలు నిధులతో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్వహణ ఆనాటినుంచి నిజాం సర్కారు రద్దయ్యే దాకా నిజాం ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. భద్రాచలం తాలూకాను ఇంగ్లీషు వారికి ఇచ్చినా ఆలయాన్ని మాత్రం నిజామే ఉంచుకున్నాడు. అంతేకాదు ఆ తాలూకాలో అనేక ప్రాంతాల్లో ఈ ఆలయానికి మాన్యాలు కూడా ఉన్నాయి. బ్రిటిషిండియాలో ఉన్నప్పటికీ ఇవి నైజాం ఆస్తులే. ఈ ఆలయాన్ని ఆంధ్రులు ఏనాడూ నిర్వహించలేదు.

ఆ మాటకు వస్తే 19వ శతాబ్దంలో జమిందారీ రద్దు చట్టం వచ్చేదాక ఆంధ్రలో ఏ ఆలయాన్ని ఈస్ట్ ఇండియా ప్రభుత్వం కానీ, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం కానీ నిర్వహించలేదు. తిరుపతి వంటి ప్రఖ్యాత ఆలయం కూడా మహంతుల నిర్వహణలో కొనసాగింది. ఇంగ్లీషు వారికి భద్రాచలం తాలూకాను ఇచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్వహణకు నిజాం అమీన్ అనే ఒక ఉన్నత ఉద్యోగిని నియమించాడు. ఈ ఆలయ నిర్వహణకు 1915 నాటికే ఏటా రూ. 18 వేలు ఇచ్చేవాడు. ఆలయ ముఖ్య నిర్వాహకుడు అమీన్ కాగా ముగ్గురు గుమస్తాలు, ఐదుగురు పోలీసులు, 12 మంది బంట్రోతులు, 20 మంది అర్చకులు, నలుగురు వేదపండితులు, ఇద్దరు పంచాంగ కర్తలు, 18 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు హరిదాసులు, ముగ్గురు తిరుచూర్ణము వారు, ముగ్గురు వంటల వారు, నలుగరు నాదస్వర వాయిద్యగాళ్లు,ముగ్గురు సాతానులు , 8 మంది రజకులు, ఇద్దరు దేవదాసీలు, మరో 12 మంది ఇతర ఉద్యోగులు ఈ ఆలయంలో ఉండే వారు.

వీరందరికీ నిజాం జీతాలు చెల్లించేవాడు.ఆ రోజుల్లోనే సుమారు రూ 12 వేల వరకు వీరి జీతాలకే సరిపోయేవి. ఆలయ నిర్వహణ పర్యవేక్షణకు ఐదుగురు ధర్మకర్తలతో ఒక మండలి ఉండేది. దేశ విభజన నాటికి ఈ ఆలయ నిర్వహణ వ్యయం రూ.30 వేలకు చేరింది. రజాకార్ల పరోక్ష పాలన కాలంలో కూడా నిజాం ఈ ఆలయానికి నిధులు ఆపలేదు. ఇది భద్రాచలం ప్రాంతంతో తెలంగాణకు ఉన్న అనుబంధం. ఇవాళ చరిత్ర తెలిసీ తెలియని వారు భద్రాచలం ఏదో ఆంధ్ర సొమ్మయినట్టు తెలంగాణ వారు దాన్ని కలిపేసుకున్నట్టు కథలు చెబుతున్నారు. దీనితో పాటు మునగాల ఇతర చిల్లర మల్లర ప్రాంతాల ప్రసక్తి తీసుకువస్తున్నారు. మునగాల మొత్తానికి మొత్తం ఆంధ్రకు చెందింది కాదు.

మునగాల జమిందారు పెద్ద భూస్వామి. ఆయనకు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో భూములున్నాయి. తెలంగాణలో ఆయన మక్తేదారుగా పిలవబడేవాడు. ఆంధ్రలో జమిందారుగా పిలిచే వారు. అందుకే ఆయన భూ వివాదాలు ఇటు హైదరాబాద్, అటు మచిలీపట్నం కోర్టుల్లో నలుగుతూ వచ్చేవి. ఆయన జమీ మొత్తంగా తెలంగాణ ఆంధ్రలో చెరిసగం దాక ఉంటాయి. వాస్తవానికి నిజాంప్రాంతమైన పరిటాలను తీసుకున్నందుకు బదులుగానే మునగాలను నల్లగొండ జిల్లాకు ఇచ్చారు. ఇదీ వాస్తవ దృశ్యం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఫీజు రీయింబర్స్‌మెంట్ పాత జీవో రద్దు!

- అడ్మిషన్లకు మించిన సంఖ్యలో స్కాలర్‌షిప్‌లు
- అక్రమాలకు తెరదించనున్న తెలంగాణ సర్కార్
- స్థానికత మార్గదర్శకాలపై నిపుణులతో సంప్రదింపులు
- కటాఫ్ సంవత్సరం నిర్ధారణపైనా చర్చలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ప్రాంత విద్యార్థులకు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రస్తుతమున్న జీవోను ప్రభుత్వం రద్దుచేయనున్నదని విశ్వసనీయ సమాచారం. దీని స్థానంలో కొత్త జీవో త్వరలో జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నదని తెలిసింది. అత్యంత కీలకంగా మారిన స్థానికత నిర్ధారణకు ఏ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. మర్రి చెన్నారెడ్డి హెచ్చార్డీలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. కొత్త జీవో జారీ విషయంలో చర్చించారు.

feeఈ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై న్యాయ సలహాకోసం అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ, ఇతర సీనియర్ న్యాయవాదులతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. ఇతర రాష్ర్టాల్లో కొనసాగుతున్న విధివిధానాలను, అమల్లో ఉన్న చట్టాలను కూలంకషంగా అధ్యయనం చేస్తున్నారు. స్థానికత విషయంలో 1956ను కటాఫ్‌గా తీసుకోవాలనే డిమాండ్ ఉన్నప్పటికీ ఇతరత్రా అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిధులు తెలంగాణ పేద విద్యార్థులకే చేరాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పుట్టగొడుగుల్లా వచ్చిన కాలేజీలు కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడుతున్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలంటూ మరికొన్ని కనిపిస్తున్నా అవి కూడా ఏదోవిధంగా ప్రభుత్వ ఆర్థికసాయంపైనే మనుగడ సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా పారదర్శక విధానాన్ని పాటించి, స్థానిక విద్యార్థులకు ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వ ఉత్తర్వును రూపొందించేందుకు పరిశీలన జరుగుతోంది.

స్థానికత ధ్రువీకరణ పత్రం జారీలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన విధివిధానాలను పకడ్బందీగా రూపొందిస్తున్నారు. తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల్లో అత్యధికం సీమాంధ్రుల యాజమాన్యంలోనే ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు పలు రకాల మార్కెటింగ్ విధానాలను అవలంబించడం ద్వారా తెలంగాణ విద్యార్థులను ఆకర్షించి, అడ్మిషన్లు పెంచుకుని ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లను వినియోగించుకుంటున్నాయి. వివిధ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యకు మించి ప్రభుత్వం నుంచి జారీ అవుతున్న స్కాలర్‌షిప్‌లు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆధికారులను కాలేజీ యాజమాన్యాలు ప్రలోభాలకు గురిచేసి, తమకు అనుకూలంగా ఎక్కువ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ప్రైవేటు ఇంటర్, డిగ్రీ, ఇతర వత్తి విద్యా కళాశాలల మీద ఉన్నది. మరోవైపు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లను అందుకుంటున్న విద్యార్థుల్లో సీమాంధ్రకు చెందిన వారు కూడా అధికశాతంలో ఉన్నట్లు సమాచారం. ఈ లోటుపాట్లను సవరించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు చెందాల్సిన స్కాలర్‌షిప్‌లను వారికే దక్కేలా, దుర్వినియోగం కాకుండా, సీమాంధ్ర కళాశాలల అక్రమాలకు అడ్డుకట్టవేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శుక్రవారం, జులై 11, 2014

పోలవరంపై సుప్రీంకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం...!

పోలవరం ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన
ఐదో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్టాప్ పోలవరం, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలకు ఒడిషా, చత్తీస్‌గఢ్ ఎంపీలు గళం కలపడంతో లోక్‌సభ ఆందోళనలతో దద్దరిల్లింది.

పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం:ఎంపీ వినోద్
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఐదో రోజు లోక్‌సభ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ 1 మార్చి 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మే 29 న కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగవిరుద్ధమని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ర్టాల సరిహద్దులు మార్చేటపుడు ఆయా రాష్ర్టాల అభిప్రాయాలు తీసుకోవాలన్న నిబంధనను కేంద్రం పాటించలేదని ఆరోపించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో మొదట చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలవరం డిజైన్ మార్చాల్సిందే: ఎంపీ గుత్తా
గిరిజనుల పొట్టగొట్టే పోలవరం డిజైన్ ను మార్చాల్సిందేనని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ మందబలంతో పోలవరం ఆర్డినెన్స్‌ను పాస్ చేయించొద్దని హెచ్చరించారు. పోలవరంపై నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీల అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఏకపక్షంగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించడం రాజ్యాంగవిరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపారు. బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఎంపీలకు మద్దతుగా ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కుట్రపూరితమైన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఖమ్మంలోని ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, పీలేరుపాడు, వీఆర్‌పురంలోని 211 గ్రామాలు ఆంధ్రాలో విలీనమవనున్నాయి. దీంతో 3,267 హెక్టార్ల అటవీ ప్రాంతం ఆంధ్రాలో కలవనుంది. బిల్లు ఆమోదంతో భద్రాచలం పట్టణం మినహా మిగతా ప్రాంతాలు ఏపీలో విలీనం కానున్నాయి. 34 వేల కుటుంబాల్లోని 1,67,796 మంది గిరిజనులు ముంపునకు బలవనున్నారు.

‘గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిన్రు’
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించి గిరిజనులకు తీవ్రమైన అన్యాయం చేసిన్రని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలకు బీజేపీ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. వనరులను కాజేసేందుకే ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుకున్నారని మండిపడ్డారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

‘పోలవరం ఆర్డినెన్స్‌ను చట్టం చేయడం బాధాకరం’
పోలవరం ఆర్డినెన్స్‌ను చట్టం చేయడం బాధాకరమని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలవరం డిజైన్ మార్చి తెలంగాణకు నష్టాన్ని తగ్గించేలా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్రం మాట్లాడాలని సూచించారు. ఆర్డీఎస్ పనులు జరిగేందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఘర్షణ చేస్తే తీవ్ర పరిస్థితులుంటాయని హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం పోలీసు బందోబస్తు పెట్టైనా పనులు జరిపించాలన్నారు. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడుతానని స్పష్టం చేశారు.

స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించిన్రు:ఎంపీజితేందర్‌రెడ్డి
పోలవరం ఆర్డినెన్స్ విషయంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో నడుస్తున్నది మోడీ సర్కారా లేదా చంద్రబాబు సర్కారా అని అనుమానం వస్తున్నదని విమర్శించారు.

‘మూడు రాష్ర్టాల హక్కులను కేంద్రం కాలరాసింది’
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించి కేంద్రం తెలంగాణతోపాటు ఒడిశా,ఛత్తీస్‌గఢ్ ప్రజల హక్కులను కాలరాసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ 3ను ఉల్లంఘించి ఎన్డీఏ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఎంత పోరాటం చేసినా కేంద్రం మందబలంతో వారి గొంతు నొక్కేసిందని మండిపడ్డారు. బీజేపీ, టీడీపీలు విప్ జారీ చేసి పంతం నెగ్గించుకుంటే టీటీడీపీ, బీజేపీ ఎంపీలు అడ్డుకొని ఉండాల్సిందన్నారు. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడాన్ని టీఆర్‌ఎస్ మొదటి నుంచి వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. పోలవరం డిజైన్‌ను మార్చాలని తానే స్వయంగా కేంద్రాన్ని, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేసినా కేంద్రం మొండిగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. భద్రాచలంలోని ఏడు మండలాలను కాపాడుకునే విషయంలో ఎలాంటి కార్యాచరణను రూపొందించుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యమం ఇంకా అయిపోలేదు: మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదని తెలంగాణపై సీమాంధ్రుల దోపిడి ఇంకా కొనసాగుతోందని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలపై చంద్రబాబు దాడి ఇంకా కొనసాగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ వనరులను దోచుకుపోయేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. విద్యా, ఉద్యోగాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని అన్నారు. సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మనం ఇవ్వాలని అనడం సరికాదన్నారు. 

చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడని, తెలంగాణకు కరెంట్ లేకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోసం 7 మండలాలను ముంచారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మనకు మిగిల్చింది సమస్యలేనని తెలిపారు.

చంద్రబాబు సూచనల మేరకే బిల్లు పాస్: డీఎస్
పోలవరం ఆర్డినెన్స్‌ను బిల్లుగా మార్చుతూ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే లోక్‌సభలో బిల్లును ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఆప్రజాస్వామికంగా ఆమోదించారని దుయ్యబట్టారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలపడాన్ని 3 రాష్ర్టాలు వ్యతిరేకించినా ఆగమేఘాల మీద ఆమోదించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. కేంద్రం పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఎవరినీ సంప్రదించకుండా కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారని విమర్శించారు. అసలు చర్చ జరుగకుండా బిల్లును ఆమోదించడం దారుణమన్నారు. నిర్ణయం తీసుకునే ముందు పోలవరం ముంపు బాధితుల ఆమోదం ఉండాలన్నారు. రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా సరిహద్దులను ఎలా మారుస్తారని నిలదీశారు. పోలవరం ముంపు ప్రాంతాలకు చెందిన గిరిజనుల జీవితాలకు విలువే లేకుండా పోయిందా? అని మండిపడ్డారు.

గిరిజనులకళ్లలో ఎన్డీఏ ప్రభుత్వంమట్టికొట్టింది: ఈటెల
పోలవరం ఆర్డినెన్స్‌ను ఆమోదించి ఎన్డీఏ ప్రభుత్వం గిరిజనుల కళ్లలో మట్టికొట్టిందని మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. చంద్రబాబు కుటిల నీతి వల్లే బిల్లు ఆమోదం పొందిందని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయినా సమైక్యవాదుల కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని దుయ్యబట్టారు. గిరిజనుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. రాష్ట్రం విడిపోయినా సమైక్యవాదుల కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంచు భూమిని కూడా వదులుకోం: మంత్రి పోచారం
తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్క ఇంచు భూమిని కూడా వదులుకునే ప్రసక్తేలేదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ లోక్‌సభలో ఎన్డీఏ ప్రభుత్వం బిల్లును పాస్ చేయడంపై మంత్రి మండిపడ్డారు. తెలంగాణ జిల్లాలకు చెందిన ఇంచు భూమిని వేరుచేసినా ఊరుకోమని అన్నారు. ముంపు మండలాలను రక్షించుకునేందుకు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

పోలవరంపై సుప్రీంను ఆశ్రయిస్తాం: బాల్క సుమన్
పోలవరంను కాపాడుకోవడానికి తాము న్యాయపోరాటం చేస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఇవాళ లోక్‌సభలో పోలవరం బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ముంపు మండలాలను కాపాడుకుని, గిరిజనుల హక్కులను రక్షించేందుకు తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. బీజేపీ, టీడీపీలు కుమ్మకై గిరిజనుల హక్కులను కాలరాశాయని దుయ్యబట్టారు. ఇందుకు తగిన ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు.

ఏపీకి అండగా కేంద్రం పోలవరం కుట్ర
పోలవరం ముంపు గ్రామాల విషయంలో అంధ్రప్రదేశ్‌కు అండగా కేంద్ర సర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఇవాళ లోకసభలో పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఎన్‌డీఏ ఆమోదించింది. బీజేపీ, తెలుగు దేశం ఎంపీలకు విప్ జారీ చేసి మందబలంతో బిల్లును ఆమోదించారు. మూడు రాష్ర్టాల ప్రజల హక్కులను హరిస్తూ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకుంది. 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీల అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఏకపక్షంగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించడం రాజ్యాంగవిరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం ముందు నిరసన తెలిపారు. బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఎంపీలకు మద్దతుగా ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కుట్రపూరితమైన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఖమ్మంలోని ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనమయ్యాయి. కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం, పీలేరుపాడు, వీఆర్‌పురంలోని 211 గ్రామాలు ఆంధ్రాలో విలీనమవనున్నాయి. దీంతో 3,267 హెక్టార్ల అటవీ ప్రాంతం ఆంధ్రాలో కలవనుంది. బిల్లు ఆమోదంతో భద్రాచలం పట్టణం మినహా మిగతా ప్రాంతాలు ఏపీలో విలీనం కానున్నాయి. 34 వేల కుటుంబాల్లోని 1,67,796 మంది గిరిజనులు ముంపునకు బలవనున్నారు.

‘పోలవరంపై టీ బీజేపీ, టీ టీడీపీ వైఖరేంటో చెప్పాలి’
పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీఏ సర్కారు బిల్లు చేయడంపై టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. బిల్లు పాస్ కావడం వెనుక బీజేపీ, సీమాంధ్ర పార్టీ టీడీపీ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేస్తోన్న బీజేపీ టీడీపీపట్ల తెలంగాణ బీజేపీ నేతలు, తెలంగాణ టీడీపీ నేతలు తమ వైఖరేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ముంపు మండలాలను కాపాడుకునేందుకు తాము న్యాయ పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

‘పోలవరం విషయంలో న్యాయపోరాటం చేస్తాం’-ముఖ్యమంత్రి కేసీఆర్
పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్‌సభ ఆమోదించటంపై న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం విషయంలో కేంద్రం తీరు అప్రజాస్వామికమన్నారు. కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

పోలవరంపై సుప్రీంకు వెళ్లనున్న రాష్ట్ర ప్రభుత్వం
పోలవరం ముంపు మండలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పోలవరం ప్రాంతాలను రక్షించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. మూడు, నాలుగు రోజుల్లో పోలవరం బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు న్యాయ నిపుణులతో సంప్రదించి పిటిషన్ ముసాయిదాను రూపొందిస్తోంది. ఏపీ పునర్విభజన బిల్లులో లేని అంశాలతో ఆర్డినెన్స్‌ను రూపొందించారని కోర్టుకు తెలుపనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని ఉల్లంఘించిన తీరును కోర్టుకు వివరించనుంది.


రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు తెలంగాణ జేఏసీ పిలుపు
పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టంపై తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు ఈ చట్టాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఇవాళ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విలేకరులతో మాట్లాడారు. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్‌ను బంద్ నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులపై దాడి చేసిందని మండిపడ్డారు. లోక్‌సభలో ఇవాళ జరిగింది అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.



రేపు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ నిరసనలు
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఉద్యమం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రేపటి టీ జేఏసీ బంద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ నేతలు కోరారు.


తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ మద్దతు
రేపటి తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ఈమేరకు పార్టీ నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టాన్ని నిరసిస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ, వామపక్షాలు ఇచ్చిన తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ మద్దతునిస్తుందని వెల్లడించారు. ఈ బంద్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రేపటి బంద్‌కు కాంగ్రెస్, టీయూఎఫ్ మద్దతు
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించడంపై యావత్ తెలంగాణ నిరసనలు వ్యక్తం చేస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ జేఏసీ, వామపక్షాలు ఇచ్చిన రేపటి బంద్‌కు కాంగ్రెస్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌లు మద్దతు ప్రకటించాయి. తాము బంద్‌లో పాల్గొంటున్నామని పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీయూఎఫ్ నేత విమలక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

"సీలేరు బేసిన్ వివరాలు ఇవ్వం..." -ఆంధ్రా సర్కారు నిర్ణయం

- 14న పవర్ పంచాయితీలోనే తేల్చుకుంటాం
- గోదావరి బోర్డుకు స్పష్టం చేసిన ఏపీ సర్కార్ 

విద్యుత్ వివాదాలపై ఆంధ్రా సర్కారు జగమొండిగా వ్యవహరిస్తున్నది. మా విద్యుత్ ఉత్పత్తి మాకే అన్న విధానానికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టంచేసింది. సీలేరు బేసిన్ జల విద్యుత్‌తో తెలంగాణ వాటాపై గురువారం సాయంత్రం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. సీలేరు బేసిన్ (లోయర్ సీలేరు, అప్పర్ సీలేరు) జల విద్యుత్ ఉత్పత్తి వివాదం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) పరిధిలోకి చేరిన విషయం తెలిసిందే. గోదావరి బోర్డు ఆదేశాలను ఏపీజెన్‌కో బేఖాతర్ చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం బోర్డు దృష్టికి తీసుకువచ్చింది. 

దాంతో గోదావరి బోర్డు మెంబర్ సెక్రటరీ జే చంద్రశేఖర్ అయ్యర్ గురువారం హైదరాబాద్‌లో ఏపీ ఇంధన శాఖ, ఏపీజెన్‌కో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనూ ఆంధ్రా సర్కార్ అదే ధోరణిని వ్యక్తంచేయడం గమనార్హం. ఈనెల 14న రెండు రాష్ర్టాల విద్యుత్ వివాదాలపై ఢిల్లీలో జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు లోబడి తాము వ్యవహరిస్తామని, అంతవరకు బోర్డు ఆదేశాలను అమలుచేయలేమని పేర్కొంది. అదే విషయాన్ని రాతపూర్వకంగా తమకు అందజేయాలని గోదావరి బోర్డు ఆంధ్రా సర్కారుకు సూచించినట్లు సమాచారం. 
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

తెలంగాణ వైతాళికుడు.. జల ప్రదాత..నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్‌!

- నేడు నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్‌ జయంతి

- ఇంజినీర్స్ డేగా గుర్తింపునిచ్చిన తెలంగాణ సర్కార్
navab

తెలంగాణ సాగునీటిరంగ వైతాళికుడు, జలరంగ నిపుణుడు నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహద్దూర్‌కు ఎట్టకేలకు మంచి గుర్తింపు లభించింది. తెలంగాణలో సాగునీటిరంగానికి ఆద్యుడిగా నిలిచిన నాటి ఇంజినీర్ అలీ నవాజ్‌జంగ్ జయంతిని ఇంజినీర్స్ డే గా గుర్తిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నవాబ్‌అలీ జయంతి సందర్భంగా తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జలసౌధలో ప్రత్యేక కార్యక్రమం జరుగనుంది.

ఈ సందర్భంగా భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నవాబ్‌అలీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సర్‌ఆర్థర్ కాటన్ ఎలాంటి వారో తెలంగాణకు నవాబ్‌అలీజంగ్ అలాంటి వారని అంటారు. కానీ కాటన్ కంటే నవాబ్ అలీ ఎక్కువ సేవలు చేసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చరిత్రను గుర్తించకపోవడాన్ని మొదటి నుంచి తెలంగాణ ఇంజినీర్లు తప్పుపడుతున్నారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణలో కేసీఆర్ సర్కార్ రావడంతో నవాబ్‌అలీ జయంతిని ఇంజినీర్స్ డేగా ప్రకటించాలన్న వారి డిమాండ్ నెరవేరింది.

తెలంగాణ జల ప్రదాత

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి నిజాంసాగర్ వరకు నవాబ్‌అలీ ముద్ర కనిపిస్తుంది. 1877లో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అలీ.. ఇంజినీర్‌గా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో విశేష సేవలందించారు. ఇంగ్లాండ్‌లోని కూపర్ హిల్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1905నుంచి 1948వరకు తెలంగాణలో సాగునీటిరంగానికి విశేష సేవలందించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్, వైరా, పాలేరు, నిజామాబాద్ పోచారం, డిండి ప్రాజెక్ట్, కరీంనగర్ అప్పర్‌మానేరు, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లకు, ఉస్మానియా దవాఖానా.. ఇలా ఎన్నింటికో రూపకల్పన చేసిన ఆయన సేవలను దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గుర్తించి, జాతీయ ప్రణాళిక కమిషన్ సబ్‌కమిటీ సభ్యులుగా నియమించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఇంజినీర్‌ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంపై ఇంజినీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

కేసీఆర్ శుభాకాంక్షలు

ఇంజినీర్స్‌డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను బంగారు బాటలో నడిపించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్‌జంగ్ జయంతిని ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం మన సంప్రదాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అలీ వంటి ఇంజినీర్లు ఆనాడు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఇంజినీర్లు బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

తెలంగాణ ఇండస్ట్రీపై చిన్నచూపు...!

-రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చేయూత కరువు
-బడ్జెట్‌లో ఒక్క ప్రాజెక్టూ  ఇవ్వని మోడీ సర్కారు
-తెలంగాణ నేతలు వేడుకున్నా కరుణ చూపని జైట్లీ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ప్రకటనలు గుప్పించిన నరేంద్రమోడీ ప్రభుత్వం చివరకు మొండి చేయ్యే చూపింది. పార్లమెంటులో గురువారం మోడీ సర్కారు ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌లో తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఒక్క ప్రాజెక్టును కూడా కేటాయించలేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న నేతల రాష్ర్టాలకు అడిగిందే తడవుగా వరాలు కురిపించిన మోడీ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని గాలికొదిలేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి అనేక ప్రాజెక్టులు కేటాయించిన ఎన్డీయే పెద్దలు, తెలంగాణపై సవతితల్లి ప్రేమను కనబర్చారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ నౌకాశ్రయానికి సమీప ప్రాంతాలను ఫైనాన్షియల్ సెంటర్లుగా గుర్తించారు.

కాకినాడలో హార్డ్‌వేర్ పరిశ్రమ, కృష్ణపట్నాన్ని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మార్చటం, విశాఖపట్నం- చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దేశ వ్యాప్తంగా ఏడు ఇండస్ట్రియల్ పార్కులను ప్రకటించినా తెలంగాణకు ఒక్కటీ దక్కలేదు. రాష్ట్రంలో బయోటెక్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నా పట్టించుకోలేదు. చేనేత, టెక్స్‌టైల్స్ రంగాల్లో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆయా రంగాల అభివృద్ధికి పైసా కూడా విదిలించలేదు. బడ్జెట్‌లో మూడు మెగా హ్యాండ్లూం, టెక్స్‌టైల్స్ క్లస్టర్లను ప్రతిపాదించినప్పటికీ, వాటిని ఇప్పటికే అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ర్టాలకే కేటాయించారు. 
నోటి మాటే.. నిధుల కేటాయింపు లేదు

కేంద్రం తెలంగాణకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా రాష్ర్టాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న నోటి మాటతో సరిపెట్టడంతో తెలంగాణ పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పినప్పటికీ కచ్చితంగా ఏయే రంగాల్లో కేంద్రం తోడ్పాటునందిస్తుందో స్పష్టత ఇస్తే బాగుండేదని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి అన్నారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు వెంచర్ క్యాపిటల్ కింద రూ.10 వేల కోట్లు కేటాయించడం హర్షించదగిన పరిణామమని టిఫ్ ప్రధాన కార్యదర్శి గోపాల్‌రావు అభిప్రాయపడ్డారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గురువారం, జులై 10, 2014

పోలవరం ఆర్డినెన్స్ చట్టంగా మారినా ఎదుర్కొనవచ్చు!

-గవర్నర్, రాష్ట్రపతులకు ప్రత్యేక అధికారాలున్నాయి
-తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రామచందునాయక్
పోలవరం ఆర్డినెన్సు బిల్లుపై చర్చ జరిగి పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందినా రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు ప్రకారం దీని అమలును నిలువరించే అధికారం గవర్నర్‌కు ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి రామచందునాయక్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందనేది నిర్వివాదాంశమని, వారి హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. ఢిల్లీలో బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ద్వారా సుమారు రెండు లక్షల మంది గిరిజనులు జీవనాధారం కోల్పోతారని, నిర్వాసితులవుతారని, పచ్చటి సాగుభూములు ముంపు ప్రాంతాలుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ఆర్డినెన్సు చట్టరూపాన్ని సంతరించుకున్నా గిరిజనుల హక్కులను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు ఈ చట్టం నిరోధకంగా మారుతుందని గవర్నర్ భావిస్తే దీని అమలును నిలువరించడానికి ఆయనకు అన్ని అధికారాలూ ఉన్నాయని అన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఆగని సీమాంధ్ర కుట్రలు...!

-పోలవరం అథారిటీలో తెలంగాణ అవసరం లేదు
-హోంమంత్రికి ఆంధ్ర టీడీపీ ఎంపీలు మెమోరాండం
-సీమాంధ్ర పెత్తనాన్ని సహించం: ఎంపీ సీతారాంనాయక్
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం ముంపుప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకున్న ఆంధ్రనేతల కళ్లు ఇప్పుడు ఖమ్మంజిల్లాలోని బూర్గంపాడుపై పడ్డాయి. ఆ గ్రామాన్ని కూడాఆంధ్రప్రదేశ్‌లో కలుపాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నేతృత్వంలోని ఒక బృందం పార్లమెంటులో రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి 4పేజీల మెమొరాండంను అందజేసింది. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భద్రతకు ఇబ్బంది ఏర్పడిందని, గవర్నర్‌కు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అధికారాలకు అదనంగా అంతర్గత భద్రత, శాంతిభద్రతల పర్యవేక్షణను కూడా ఆయనకు అప్పగించాలని కోరారు.

SITHARAM-NAYAKరాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టువల్ల ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురవుతున్నట్లు 2005లో అప్పటి సాగు నీటిపారుదల విభాగం జారీ చేసిన ఉత్తర్వులోనే రెవిన్యూ గ్రామాల పేర్లు కూడా స్పష్టంగా ఉన్నాయనన్నారు. ఆ గ్రామాలకుతోడు బూర్గంపాడు, సీతారాంనగరం, కొండ్రెక గ్రామాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో మూడో సెక్షన్‌లో స్పష్టంగా ఉందని, పోలవరం ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లులో మాత్రం బూర్గంపాడు పేరు కనబడలేదని, అందువల్లే రాజ్‌నాథ్‌ను కలిశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరమే లేదని చౌదరి స్పష్టం చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో భద్రాచలం పట్టణానికి, రామాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అవసరమైతే కేంద్రం ప్రత్యేకంగా జాతీయ రహదారిని నిర్మిస్తుందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

సీమాంధ్ర పెత్తనాన్ని సహించం: సీతారాంనాయక్

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్సును తీసుకురావడంలో సీమాంధ్ర నాయకుల ప్రవర్తనను యావత్తు తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తున్నదని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ చెప్పారు. ముంపు ప్రాంతాలను పరిరక్షించుకునేందుకు మరో ఉద్యమం చేస్తామన్నారు. పోలవరం డిజైన్ మార్చడం ద్వారా సుమారు 2లక్షల మంది గిరిజనులు నిర్వాసితులు కాకుండా చూడడంతో పాటు ప్రాజెక్టు వల్ల ఒనగూరే ప్రయోజనాలను కూడా సాధించుకోవచ్చునని స్పష్టం చేశారు. గతంలో అనేక ప్రాజెక్టుల్లో నిర్వాసితులైన గిరిజనులకు ఇప్పటివరకూ పరిహారం, పునరావాసం లభించలేదని, ఇప్పుడు పోలవరం విషయంలో ఏ మేరకు న్యాయం జరుగుతుందో కూడా చెప్పడం లేదని అన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోనూ ముంపు ప్రాంతాలు ఉన్నాయని, వాటిని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆర్డినెన్సులు రూపొందించలేదని ఆయన ప్రశ్నించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు నిధులేవీ?

kcrరైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగే బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌లో సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావనే లేదు.

-రైల్వే బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ పెదవి విరుపు
-బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేసిందని వ్యాఖ్య
కేంద్ర రైల్వే బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెదవి విరిచారు. తెలంగాణకు కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించక పోవడంపై ఆయన అసంతప్తి వ్యక్తంచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, కాజీపేట డివిజన్ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్లో ఏండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీని కేంద్రం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించక పోవడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు రూ.20 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు.

ఎక్కువ స్టాపులపై రైల్వే మంత్రి ఆందోళన

రైళ్ల స్టాపుల సంఖ్య పెరగడంపై సదానందగౌడ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ స్టేషన్లలో ఆగడం కారణంగా రైళ్ల ప్రయాణ సమయం పెరిగిపోతున్నదన్నారు. ఈ స్టాప్‌ల సంఖ్యపై సెప్టెంబర్‌లో పునఃపరిశీలిస్తామన్నారు. వ్యాపార లాభదాయకత, నిర్వహణ సాధ్యాసాధ్యాల ఆధారంగా పునఃసమీక్షిస్తామని, అదే సమయంలో కొత్త స్థానాల్లో రైళ్లను ఆపడంపై కూడా పరిశీలిస్తామని చెప్పారు. రైళ్ల స్టాపులు ఇలాగే కొనసాగితే ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ప్యాసింజర్లుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

బుధవారం, జులై 09, 2014

తెలంగాణ సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర


ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు తొందరగా విడుదల కాకుండా అడ్డుకొని ఉద్యోగుల కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందులపాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలకు తెరలేపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయస్థాయిలో తనకున్న లాబీయింగ్ బలంతో మార్గదర్శకాలను తొక్కిపెడుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. మార్గదర్శకాలపై ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సూచనలను కూడా చంద్రబాబు పట్టించుకోవటంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మార్గదర్శకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఏపీ పెద్దలు సందిగ్ధంలో పడ్డారు. ఉద్యోగుల విభజన పూర్తయితే తెలంగాణ సర్కార్ పరిపాలనలో మరింత వేగం పెరుగుతుందని పసిగట్టిన చంద్రబాబు, ఉద్ధేశపూర్వకంగానే అడ్డుపడుతున్నట్లు తెలుస్తున్నది. పదేండ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నందున సీమాంధ్ర ఉద్యోగులు ఏ రాష్ట్రంలోనైనా పనిచేసేందుకు సిద్ధపడటం కూడా సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలకు మింగుడుపడటం లేదు. మరోవైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల డిమాండ్లకు విభజన కమిటీ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాలను కుట్రలతోనే తొక్కిపెడుతున్నట్లు ఉద్యోగసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. విద్యుత్తు సమస్య, నాగార్జునసాగర్ నీటివిడుదల, పోలవరం ఆర్డినెన్స్, హైదరాబాద్‌లో గవర్నర్‌గిరీ వంటి వివాదాలకు తోడు...ఉద్యోగుల విభజనను కూడా వివాదంగా మార్చేందుకు సీమాంధ్ర సర్కార్ కుట్ర చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

నరసింహన్‌ను సాగనంపుతారా?

-చాపర్ డీల్ స్కాం కేసులో గవర్నర్‌వైపు సీబీఐ చూపు
-నేడు ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్న దర్యాప్తు సంస్థ!
-ఇదే కేసులో బెంగాల్, గోవా గవర్నర్లు రాజీనామా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌ను వీడక తప్పదా..? పదవినుంచి దిగిపోవాలని మోడీ ప్రభుత్వం ఆదేశిస్తుందా..? అగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ డీల్ స్కాం కేసు పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. రూ.3600కోట్లతో వీవీఐపీలు ప్రయాణించేందుకు అనువైన 12 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గవర్నర్ నరసింహన్‌ను బుధవారం ప్రశ్నించాలని భావిస్తున్నదని సమాచారం. ఇదివరకే ఈ కేసులో పశ్చిమబెంగాల్, గోవా గవర్నర్లు ఎంకే నారాయణన్, బీవీ వాంఛూలను దర్యాప్తు సంస్థ విచారించింది. ఆ తర్వాత వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అగస్టా హెలికాప్టర్లలో కీలకమైన సాంకేతిక మార్పులకు 2005, మార్చిలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనుమతి ఇచ్చింది. టెండర్‌లో పేర్కొన్న అర్హతలకన్నా తక్కువ సాంకేతిక పరిజ్ఞానానికి ఆ సమావేశం ఆమోదం తెలిపింది.

NARASIHANఫలితంగా హెలికాప్టర్లు చేరాల్సిన గరిష్ఠ ఎత్తును సదరు కంపెనీ గణనీయంగా తగ్గించింది. కనీస అర్హతగా పేర్కొన్న గరిష్ఠ ఎత్తు తగ్గించడం వల్ల అగస్టావెస్ట్‌ల్యాండ్ కంపెనీకి అయాచితంగా లబ్ధి చేకూరినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ కీలకమైన నాటి సమావేశంలో మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే ఈ కేసుతో సంబంధమున్న వివిధ విభాగాల అధిపతులను ప్రశ్నిస్తున్నది. సాంకేతిక మార్పులకు ఆమోదం తెలిపిన నాటి సమావేశంలో జాతీయ భద్రతాసలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)గా ఎంకే నారాయణన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చీఫ్‌గా బీవీ వాంఛూ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతిగా నరసింహన్ పాల్గొన్నారు. ఇప్పటికే ఈ కేసులో నారాయణన్, వాంఛూలను సీబీఐ ప్రశ్నించింది. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. తాజాగా నాటి సమావేశంలో పాల్గొన్న నరసింహన్ బుధవారం ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నది. దీంతో చాపర్ డీల్ స్కాంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న గవర్నర్ల జాబితాలో నరసింహన్ మూడోవ్యక్తి కానున్నారు. ఈ కేసులో నరసింహన్‌ను సాక్షిగా సీబీఐ ప్రశ్నించనున్నది.

నరసింహన్‍ను ప్రశ్నిస్తే.. కీలకమైన విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. సీబీఐ ప్రశ్నించిన తర్వాత నరసింహన్ పదవిలో కొనసాగుతారా..? లేక సహచరుల వలె రాజీనామా బాట ఎంచుకుంటారా..? ఇప్పటికే యూపీఏ పాలనలో నియమితులైన గవర్నర్లు పదవులు వీడాలని ఆదేశాలు జారీ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం.. నరసింహన్ విషయంలో ఏ వైఖరి అవలంబిస్తుంది..? అన్నది వేచి చూడాల్సిందే. కాగా, ఈ కేసులో భారత వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన సమీప బంధువులు, యూరప్‌కు చెందిన ఓ దళారితోపాటు 13మందిని నిందితులుగా సీబీఐ చేర్చింది. గరిష్ఠ ఎత్తు తగ్గించేందుకు వైమానిక దళ చీఫ్‌గా త్యాగి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తున్నది. ఈ క్రమంలో హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దర్యాప్తు సంస్థ సేకరిస్తున్నది. ఈక్రమంలోనే కేసుకు సంబంధమున్నదని భావిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఉమ్మడిలోనే భూమాయ...!

-ఐటీ కంపెనీలకు అక్రమంగా స్థలాల గడువు పొడిగింపు 
-పరిశ్రమలు పెట్టకపోయినా అక్రమార్కుల కబ్జాలో వేల ఎకరాలు 
-అగ్గువ భూముల్ని అనుభవించడమెలా?
-ఆ జాబితాలో 50 ఎకరాలకు పైగా పొందిన సంస్థలు 40కిపైగానే 
-రైతుల నోట్లో మట్టి కొట్టి.. బడాబాబులకు పంచిన ఏపీఐఐసీ 
-వినియోగంలో లేని భూముల స్వాధీనానికి ఏదీ దారి..?
-సీఎం కొరడాకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్కారు ఉత్తర్వులు
అంతన్నాడింతన్నాడే గంగరాజు.. హస్కన్నడు.. బుస్కన్నాడే...అన్నట్లుగా ప్రభుత్వానికి చేతిలో వైకుంఠాన్ని చూపిన కొన్ని మాయదారి సంస్థలు తెలంగాణలో కోట్ల విలువైన ఎకరాల భూమిని అగ్గువ ధరకు కొట్టేశాయి. భూమి వచ్చే వరకు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతాం.. వేలమందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన సదరు సంస్థలు, ఆ తర్వాత పత్తా లేకుండా పోయాయి.

open-land
ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలు గడిచినా ఆ జాగలో చిన్న ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు. మరి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది..? ఇచ్చిన భూమి లాక్కుని.. మాట తప్పినందుకు చర్యలు తీసుకోవాలి అంటారా..? అక్కడే సెజ్‌లో కాలేశారు. ఈ తతంగమంతా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. భూమి తెలంగాణది.. ఇచ్చింది సీమాంధ్ర ఆధిపత్య సర్కారు.. ఇంకేముంది దొరికింది దోచేసుకో అన్నట్లుగా వ్యవహరించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిని జప్తులో ఉంచుకున్న కంపెనీలపై చర్యలు తీసుకోవడం పక్కన బెట్టి.. లీజు గడువు పెంచుతూ వారిపట్ల అవ్యాజమైన ప్రేమను కురిపించింది. 

సీమాంధ్ర అక్రమార్కులు కలలోకూడా ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, పూర్తి మెజారిటీతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకాచకా జరిగిపోయాయి. అధికారం చేపట్టిన నాటినుంచి అన్ని విభాగాలపై పూర్తిస్థాయి సమీక్షలు చేసిన సీఎం కే చంద్రశేఖర్‌రావు రాష్ర్టాభివద్ధికి ఇతోధికంగా దోహదం చేసే పారిశ్రామీకరణపై దృష్టి పెట్టారు. ఇందులోభాగంగానే గత ప్రభుత్వాలు అప్పనంగా దోచిపెట్టిన అక్రమ భూ కేటాయింపులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ విషయంలో రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు సైతం ఔరా! అనేట్లుగా కార్యాచరణను అమలు చేస్తున్నారు.

అక్రమ భూ కేటాయింపుల్లో రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే భూములను స్వాధీనం చేసుకుంటున్నా.. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) పేరిట ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) కట్టబెట్టిన, రాసిచ్చిన వేలాది ఎకరాలను మాత్రం స్వాధీనం చేసుకునేందుకు చట్టాలు అడ్డువస్తున్నాయి. దీనికంతటికీ ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలుస్తున్నది. భూములు తీసుకుని పనులు ప్రారంభించని సంస్థల వెనుక రాజకీయ పెద్దలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడాబాబులు ఉండడం వల్లే ఒప్పందాలను ఉల్లంఘించినా ఏపీఐఐసీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయినట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలపై త్వరలోనే విధి విధానాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి సర్కారు భారీ కుట్రకు తెర లేపింది. హైదరాబాద్ చుట్టూ తమ అస్మదీయులకు కేటాయించిన భూముల రక్షణకు కొత్త ఎత్తుగడలు అమలు చేసింది.

ప్రభుత్వ షరతులను అమలు చేయలేకపోయాం. కనికరించండంటూ అగ్గువ ధరలకు భూములు పొందిన ఐటీ కంపెనీలు మొర పెట్టుకోవడమే ఆలస్యం.. అవాజ్యమైన ప్రేమను కురిపించేశారు. గజం ధర రూ.10వేల నుంచి రూ.50వేల వరకు పలికే వేల ఎకరాలను షరతులు ఉల్లంఘించిన కంపెనీలకే హక్కు భుక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలు నామమాత్రపు ఫీజు చెల్లిస్తే చాలు.. గడువు పెంచుతామంటూ దొంగ చేతికి తాళాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడున్నదని తెలిసి..ఉమ్మడి పాలకులు అక్రమాలకు పాల్పడిన సంస్థల యాజమాన్యాలతో రాజీ కుదుర్చుకొని వెసులుబాటు కల్పించారు. ఈమేరకు నామమాత్రపు ఫీజుతో ఐదారేళ్లు గడువు పెంచుకోవచ్చునంటూ ఉమ్మడి రాష్ట్ర ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి సంజయ్‌జాజు తేదీ 20-01-2014న జీవో నంబర్ 3ను జారీ చేశారు. భూములు ఏపీఐఐసీవి అయినా.. ఈ విషయంలో ఐటీఅండ్‌సి ప్రత్యేక శ్రద్ధ చూపడం అనుమానాలకు తావిస్తున్న విషయం.

ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో కనీసం 30 శాతం కూడా వినియోగించకపోతే వెనక్కి తీసుకుంటామని ఐటీ అండ్ సీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ ఏ ఒక్క స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఏపీఐఐసీ సెజ్‌లు, ఐటీ/ఐటీఈఎస్ లేఅవుట్లను ఎక్కువగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లోనే ఉన్నాయి. అత్యంత ఖరీదైన స్థలాలను అగ్గువ ధరలకు పొందిన సంస్థలు ఆ భూములను వదులుకోలేక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సానుకూలంగా మలుచుకున్నట్లు సమాచారం. ఎలాంటి ఫీజులు చెల్లించకుండా వందల ఎకరాలపై యాజమాన్యపు హక్కులను అనుభవిస్తున్న సంస్థలూ లేకపోలేదు. వీటన్నింటిపై తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందో వేచి చూడాలి.

నోటీసులతో సరిపెట్టిన ఏపీఐఐసీ

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని, స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి స్థలాలు పొందిన సంస్థలపై నిఘా ఉంచాల్సిన ఏపీఐఐసీ.. ఆ సంస్థల అడుగులకు మడుగులు ఒత్తుతున్నది. ఏమాత్రం ఒత్తిడి తేకుండా నోటీసులు జారీ చేసేసి.. చేతులు దులిపేసుకుంటున్నారు. నోటీసులకు సంస్థల యాజమాన్యాలు సమాధానాలిచ్చినా, ఇవ్వకపోయినా పట్టించుకోని అధికారులు.. గడువు పెంచడంలో మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1889 సంస్థలు ప్రభుత్వ స్థలాలు వినియోగించకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఏపీఐఐసీ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 1500 వరకు తెలంగాణలోనే ఉండటం గమనార్హం. చాలా కాలానికి 83 సంస్థలకు కేటాయించిన 3602 ఎకరాలను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిలో 48 సంస్థలు తెలంగాణలో ఉండగా మిగతావి సీమాంధ్రకు చెందినవి.

స్వాధీనానికి ఏమీ లేదు..!

ఏపీఐఐసీ ద్వారా స్థలాలు పొంది వినియోగించని సంస్థలు ఏమీ లేవు. కొన్ని ఉన్నప్పటికీ వాటికి షరతులను అమలు చేసేందుకు గడువు ఉంది. కొన్నింటి గడువు పూర్తయినా.. ఆయా సంస్థల విజ్ఞప్తి మేరకు పొడిగించాం. ఇప్పటికిప్పుడు ఏ సంస్థ నుంచి స్థలాన్ని స్వాధీనం చేసుకోలేం. చాలావాటికి వెసులుబాటు కల్పించాం. ప్రభుత్వం కూడా అలాంటి ఆదేశాలు జారీ చేయలేదు అని ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ అన్నారు. వినియోగించని స్థలాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేయగా టీ మీడియాతో ఆయన తీవ్రస్వరంతో పై విధంగా స్పందించారు. ఆ ఆదేశాలేవీ తమకు వర్తించదన్నట్లుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వినియోగించని సంస్థల జాబితా కూడా అందుబాటులో లేదని ఖరాఖండీగా చెప్పారు.

ఎన్నో సంస్థల చేతుల్లో ఖరీదైన స్థలాలు

-సైబరాబాద్ పార్కులో ఎమ్మార్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు కింద ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ లిమిటెడ్‌కు 2002, నవంబర్ 6న 258.36 ఎకరాలు కేటాయించారు. దీనిపై అనేకమైన ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సాగిస్తున్నది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అలాగే శంషాబాద్ పార్కులో ఇందు టెక్ జోన్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2006లో 250 ఎకరాలు కేటాయించారు. దీనిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దీంతో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నది. 
-బ్రాహ్మణి ఇన్‌ఫ్రా టెక్‌కు 2006లో 250 ఎకరాలు కేటాయించగా.. తాజాగా లేఅవుట్‌ను జీహెచ్‌ఎంసీకి పంపారు. 
-గోపన్‌పల్లిపార్కులో విప్రో లిమిటెడ్‌కు 20-3-2006న 101.30 ఎకరాలు కేటాయించారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏకంగా 20 ఏళ్లు గడువు పొడిగించారు. 
-మణికొండలో ల్యాంకోహిల్స్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు 17-8-2005న 100 ఎకరాలు కేటాయించగా 83.29 ఎకరాలను స్వాధీనం చేశారు. మరో రెండేళ్ల పాటు గడువు ఇచ్చారు.
-మంచిరేవుల పార్కులో రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్‌కు 80.27 ఎకరాలను 2007, అక్టోబర్ 6న ట్రేడ్ టవర్ అండ్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను నిర్మించేందుకు కేటాయించారు. ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 
-శంషాబాద్ హార్డ్‌వేర్ పార్కులో కెటలైటిక్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు 50 ఎకరాలను 2000, జూలై 24న సాఫ్ట్‌వేర్ వర్కింగ్ ఇన్‌స్టిట్యూషన్‌ను నిర్మించేందుకు కేటాయించగా 20 ఎకరాలు మాత్రమే వినియోగించుకున్నారు. 
-శంషాబాద్ హార్డ్‌వేర్ పార్కులో జేటీ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2005లో 70 ఎకరాలు హార్డ్‌వేర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌కు ఇచ్చారు. స్థలాన్ని రద్దు చేసేందుకు సిఫార్సు చేశారు. కానీ అమల్లోకి రాలేదు.
-ఆగాఖాన్ ఫౌండేషన్‌కు 2005, ఆగస్టు 19న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్‌ను నిర్మించేందుకు 100 ఎకరాలను, సెజ్ ఫ్యాబ్‌లో సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2007లో మరో 100 ఎకరాలు అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకింగ్ ప్లాంట్‌కు ఉచితంగా ఇచ్చారు.
-సెజ్ ఫ్యాబ్ సిటీలో ఎక్స్ ఎల్ టెలికాం ఎనర్జీ లిమిటెడ్‌కు 2008లో 50 ఎకరాలను సోలార్ సెల్స్ అండ్ సోలార్ మాడ్యూల్స్ తయారీకి కేటాయించగా పాక్షికంగానే వినియోగించుకున్నారు. దీనికి కూడా 2015 వరకు గడువును పొడిగించారు.
-కేఎస్‌కే సూర్య ఫొటోవాల్టిక్ వెంచర్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2008లో 50 ఎకరాలు కేటాయించగా నాటినుంచి ఈ స్థలం ఖాళీగానే ఉంది. 
-జీడిమెట్ల బయోటెక్ పార్కులో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు 2005లో 100 ఎకరాలు కేటాయించగా అది కూడా ఖాళీగా ఉంది. దీనికి షోకాజ్ నోటీసులు ఇచ్చిన అధికారులు అంతటితో తమ పని అయిపోయిందని.. చేతులు దులిపేసుకున్నారు. 
-తూఫ్రాన్‌లో 2007లో ఎంఎల్‌ఆర్ మోటార్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు 125 ఎకరాలు, హిందూజా ఫౌండ్రీస్ లిమిటెడ్‌కు 60 ఎకరాలు, లోకేష్ మిషన్స్ లిమిటెడ్‌కు 50 ఎకరాలు కేటాయించగా ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయి.
-దామరగుంటలో ఎన్వీ డిస్ట్రిలరీస్ అండ్ బ్రూవరీస్ లిమిటెడ్‌కు 2010లో 132 ఎకరాలు కేటాయించారు. లక్కంపల్లిలో స్మార్ట్ ఆగ్రో లిమిటెడ్‌కు 371.43 ఎకరాలు, పెద్దాపూర్‌లో ఇన్‌వేవ్ డెక్కన్ బ్రూవరీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు 2009లో 68.02 ఎకరాలు, జెడ్చర్లలో ఎస్వీకేఎం నిమిస్ యూనివర్సిటీకి 89.99 ఎకరాలు, ఇబ్రాహీంపట్నంలో వైట్‌గోల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పింటెక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్‌కు 135 ఎకరాలు, వరంగల్‌లోని మడికొండ టెక్స్‌టైల్ పార్కులో కాకతీయ టెక్స్‌టైల్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ పొదుపు అండ్ పరపతి పరస్పర సహకార సంఘానికి 2011లో 50 ఎకరాలు కేటాయించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మంగళవారం, జులై 08, 2014

సాగర్ గుట్టు సీమాంధ్రులకెరుక...!

- హక్కులకు మించి ఆంధ్రాకు సాగర్ నీరు
- వాస్తవానికి కుడి, ఎడమకు 132.. డెల్టాకు 80 టీఎంసీలే
- ఇస్తున్నది కుడి కాల్వకు 196.. కృష్ణా డెల్టాకు 199 టీఎంసీలు
- క్రస్టుగేట్లతో 155 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీలోకి!
- ఎడమ కాల్వకు 177.. ఎస్‌ఎల్‌బీసీకి 35 టీఎంసీలు
- శ్రీశైలం నుంచి రాయలసీమకు అక్రమంగా తరలింపు
- శ్రీశైలం, సాగర్ ఖాళీ చేసి తాగునీటి పేరుతో కట్టుకథ
నీరు పల్లమెరుగు.. మేం జలాల దోపిడెరుగు అన్నట్లుగా ఉంది సీమాంధ్రుల తీరు. ప్రాజెక్టుల్లోని నీళ్లను తోడేయటం.. హక్కులకు మించి వాడేయటం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం.. చివరికి కొత్త కుట్రలు, కట్టు కథలకు తెరలేపటం వారికే చెల్లింది. శ్రీశైలం నుంచి రాయలసీమకు.. నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రాకు నీళ్లను తరలించి తమ ప్రాంత ప్రాజెక్టులు నిం పేసుకున్న సీమాంధ్రులు.. కేటాయింపులను పక్కన పెట్టి వాటాలకు మించి నీటిని వాడుకున్నారు. తాజాగా తాగునీటి పేరుతో కట్టు కథలు చెప్పి మళ్లీ దోపిడీకి తెరలేపారు. ఏటా చేసినట్లే.. తాజాగా కృష్ణా నీటిపై కట్టు కథ చెప్పి నీటి దోపిడీ చేసేస్తున్నారు.

sagar
ఆగని నీటి దోపిడీ: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి సీమాంధ్రకు నీటి దోపిడీ నిరంతరాయంగా సాగుతున్నది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు విరుద్ధంగా నీటి తరలింపు సాగుతున్నది. అక్రమంగా నీటిని తరలించి.. తాగునీటి అవసరాలంటూ మళ్లీ ఒత్తిడి చేసి నీటిని తీసుకెళ్లటం వారికే చెల్లుతున్నది. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నీటిని అడ్డగోలుగా అక్రమ పద్ధతిలో తరలించిన సీమాంధ్రులు తాజాగా తాగునీటి కోసం అదే పనిగా తీసుకెళ్తున్నారు. సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల పేరిట 7.2 టీఎంసీల నీటిని తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. గతనెల 25న 3.6 టీఎంసీలకు కృష్ణా బోర్డు నుంచి అనుమతి పొందగా, ప్రకాశం బ్యారేజీకి నీరు చేరలేదనే సాకుతో మరో వారం రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున మరో 3.6 టీఎంసీల నీటికి అనుమతి పొందారు.

దీని ప్రకారం మంగళవారం సాయంత్రంతో నీటి విడుదల గడువు ముగుస్తుండగా సోమవారం మధ్యా హ్నం వరకు 6.1 టీఎంసీల నీరు వదిలినట్లు సాగునీటి శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధాన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా 5,871 క్యూసెక్కుల నీరు వదులుతుండగా.. బుధవారం వరకు నీటి విడుదల కొనసాగే అవకాశాలున్నాయి. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513.7 అడుగులకు (138.03 టీఎంసీలు) పడిపోయింది. 510 అడుగులు డెడ్ స్టోరేజీ కాగా మరో మూడు అడుగులు (ఐదు టీఎంసీలు) నీరు వాడుకునే వీలుంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పీ కింద 93 చెరువులు, ఎడమ కాల్వ కింద చెరువులు, రిజర్వాయర్లు నింపేందుకు 4 టీఎంసీల నీరు అవసరం. హైదరాబాద్ తాగునీటికి నిత్యం 900 క్యూసెక్కుల చొప్పున ఇస్తుండగా ఇది నిరంతరాయంగా వదలాల్సిందే. 510 అడుగులకు చేరితే ఏఎమ్మార్పీ మోటార్లు నడిచే పరిస్థితి లేదు. డెడ్‌స్టోరేజీకి తగ్గకుండా నిల్వలు కొనసాగించాల్సిన అవసరం ఉంది.

అడ్డగోలుగా నీటి తరలింపు: ఉమ్మడి రాష్ట్రంలో కాకి లెక్కలు చూపి నిరాటంకంగా సీమాంధ్రకు నీటిని తరలించారు. గత గణాంకాలు ఇవే స్పష్టం చేస్తుండగా.. 2013-14లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2013, ఆగస్టు 2న కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయగా ఆగస్టు 7న డెల్టాకు నీరు విడుదల చేశారు. అప్పటికి సాగర్ నీటి మట్టం 585.04 అడుగు లు. ఆగస్టు 18 నుంచి సాగర్‌లో 590 అడుగుల మేర నీరు ఉండేలా చూశారు. ఈ నీటిలో కుడి, ఎడమ కాల్వలకు చెరో 132 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు, డెల్టాకు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 152 టీఎంసీల నీరు వదలాలని బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలున్నాయి. ఈ సాకుతో ఆంధ్రాకు అడ్డగోలుగా నీటి విడుదల చేసి సాగర్‌ను ఖాళీ చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వాయర్లు నింపేసుకున్నారు.

కుడి కాల్వకు 196 టీఎంసీలు వదిలారు. హక్కుకు మించి 64 టీఎంసీలు ఎక్కువగా తీసుకున్నారు. డెల్టాకు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 199 టీఎంసీలు వెళ్లాయి. ఈ లెక్కన 47 టీఎంసీలు అదనంగా తరలించారు. క్రస్టుగేట్ల ద్వారా మరో 155 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి చేరినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రస్టుగేట్లతో కాకుండా కుడి కాల్వ, డెల్టాకు హక్కుకు మించి 111 టీఎంసీలు తీసుకెళ్లారు. అదే ఎడమ కాల్వకు 177 టీఎంసీలు వదలగా.. ఎస్‌ఎల్‌బీసీకి 35 టీఎంసీలే ఇచ్చారు.

సాగర్ నుంచి నీటి విడుదల అడ్డగోలుగా సాగటంతో డెడ్ స్టోరేజీకి చేరింది. తాజాగా తాగునీటి పేరుతో నీరు తీసుకెళ్లటంతో మన రాష్ట్ర తాగు, సాగునీటికి ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్టుకు తాగునీటి కోసం లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు అక్రమంగా నీటిని తరలించి ప్రాజెక్టును ఖాళీ చేశారు. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 834.20 అడుగులకు చేరింది. శ్రీశైలం డెడ్‌స్టోరేజీకి చేరటంతో సాగర్‌కు నీటి విడుదలకు అవకాశం లేదు. శ్రీశైలం నిల్వలను ఎస్‌ఆర్‌బీసీ ద్వారా గోరకల్లు, అవుకు, తెలుగుగంగ ద్వారా వెలుగోడు, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్లు నింపుకోగా.. తెలుగుగంగ నుంచి అక్రమ కనెక్షన్లు ఇచ్చి కండలేరు (68.03 టీఎంసీల సామర్థ్యం), సోమశిల (73.898 టీఎంసీల సామర్థ్యం) ప్రాజెక్టులు నింపుకున్నారు.

ప్రస్తుతం కండలేరులో 15.09 టీఎంసీలు, సోమశిలలో 17.9, వెలిగొండలో 3.3 టీఎంసీల నీరు ఉంది. ఈ లెక్కన మొత్తం 36 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది. ముందస్తు వ్యూహంతో నీటి దోపిడీ చేశారు. 841 అడుగుల వరకు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటి దోపిడీ సాగింది. ఇక ప్రాజెక్టు నీటి మట్టం 834 అడుగులకు చేరటంతో పోతిరెడ్డిపాడు నుంచి ఆపేసినా.. హంద్రీనీవా ద్వారా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 834 అడుగుల నీటి మట్టం తప్పనిసరిగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

sagar2
నీటి దోపిడీ నిరంతరాయంగా సాగుతున్నది: మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి

శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్ల నుంచి ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఎక్కువ నీటిని తరలించటం నిరంతరాయంగా సాగుతున్నది. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పుడే తమ ప్రాంత రిజర్వాయర్లు నింపుకోవడం సీమాంధ్రుల ముందస్తు వ్యూహం. చెన్నైకి తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు పూర్వ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక చెరో 5 టీఎంసీల చొప్పున ఇస్తుండగా ఇందులో తెలంగాణ వాటా 1.7 టీఎంసీలు. అక్రమ కనెక్షను ఇచ్చిన కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు 6.6 టీఎంసీలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌కు 3.7 టీఎంసీలే ఇస్తున్నారు. వాటా మరింత పెంచుకోవాల్సి ఉంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

అంతసీను లేదు! సెక్షన్ 8 చెప్పిందేమిటి?

-గవర్నర్‌కు ఉన్నది బాధ్యతలే.. అధికారాలు కావు..
-వాటిని అవసరమైతేనే వినియోగించాలి
-తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించడం తప్పనిసరి
-గవర్నర్‌కు ఇచ్చింది బాధ్యతలే...
-అసలు బిల్లులో కనపడని ఉమ్మడి పోలీస్ బోర్డు
-చంద్రబాబు లేఖకు వంత పాడుతున్న కేంద్ర ప్రభుత్వం
-గవర్నర్ పాలనపై సీమాంధ్రుల పగటి కలలు
KTRపచ్చమూకల ప్రచార పటాటోపంలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రుల అక్రమ ఆస్తుల రక్షణే ధ్యేయంగా వారు ముందుకు తెచ్చిన విభజన చట్టంలోని సెక్షన్- 8 పస ఏమిటో తేలిపోయింది. ఉమ్మడి రాజధానిలో పోలీసుశాఖను పూర్తిగా గవర్నర్‌కు అప్పగించాలని విభజన చట్టంలో ఉందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదన పచ్చి అబద్ధమని తేలిపోయింది.

పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్న హైదరాబాద్‌లో సర్వం గవర్నర్ చేతిలో ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. పునర్వవ్యవస్థీకరణ బిల్లులోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని శాంతి భద్రతలు, పోలీస్ వ్యవస్థ మొత్తం గవర్నర్ చేతిలో ఉండాలంటూ చంద్రబాబు చేసిన వాదన అంతా కుట్రపూరితమేనని రుజువైంది. ఎందుకంటే సెక్షన్ 8లో ఎక్కడా కూడా పోలీస్ వ్యవస్థను గానీ, శాంతి భద్రతలను గానీ ఏకపక్షంగా గవర్నర్‌కు అప్పగించాలని లేదు. అయినా సీమాంధ్ర పెట్టుబడిదారులు, మీడియా మాత్రం సెక్షన్ -8 కింద గవర్నర్ సర్వాధికారి అంటూ విషప్రచారం చేస్తున్నారు. అత్యున్నతమైన పార్లమెంట్ రూపొందించిన చట్టాన్నే అపహాస్యం చేస్తున్నారు.

section
బాధ్యతలకు అధికారాలకు తేడా తెలియదా?..
ఈ సెక్షన్ చెప్పిందల్లా గవర్నర్‌కు కొన్ని బాధ్యతలున్నాయనే... అధికారాలున్నాయని కాదు. "రెస్పాన్సిబిలిటీ" అనే పదానికి అర్థం "బాధ్యత" అని మాత్రమే. అది అధికారం కాదు. బాధ్యత అంటే ఆ విధులన్నీ తన చేతిలోకి తీసుకోమని కాని, తెలంగాణ ప్రభుత్వ అధికారాలకు కొర్రీ పెట్టాలని కాదు. ఇదే సెక్షన్‌లోని 3వ నిబంధన కింద తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించాలన్న నిబంధన ఉంది.

అది చెబుతున్నదేమిటి? గవర్నర్ సూపర్‌పవర్ కాదనే. అన్నింటినీ తెలంగాణ మంత్రి మండలితో సంప్రదించి తీరాలనే. అదే సమయంలో ఏపీ మంత్రిమండలిని సంప్రదించాలన్న నిబంధనలేక పోవడం ఎవరి స్థాయి ఏమిటో స్పష్టంగానే వివరించింది. సహజంగానే ఇరు రాష్ర్టాల ప్రజలు నివసిస్తారు కాబట్టి వారి రక్షణ విషయంలో అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో అవసరమైన పక్షంలో వినియోగించే నిమిత్తం వీటి పొందు పరిచారే తప్ప ఈ సెక్షన్ స్ఫూర్థి గవర్నర్ పాలన సాగించాలని కాదు. అదే ఉద్దేశమై ఉంటే బిల్లులో పదేళ్లపాటు గవర్నర్ పాలన ఉంటుందని నేరుగానే పేర్కొనేవారు. రేపు ఏదైనా శాంతి భద్రతలకు భంగం వాటిల్లిన పక్షంలో సీమాంధ్ర ప్రజలకు రక్షణ ఇచ్చే ఉద్దేశంతోనే ఈ సెక్షన్ చేర్చారు.

ఉమ్మడి పోలీస్ బోర్డు ఎక్కడినుంచి వచ్చింది?...

వాస్తవం ఇదికాగా చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలకు కేంద్ర హోంశాఖ కూడా వంత పాడుతోంది. అసలు బిల్లులోని సెక్షన్-8లో కనిపించని ఉమ్మడి పోలీస్ బోర్డు వ్యవహారాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. విభజన బిల్లులో ఈ పోలీస్ బోర్డుకు సంబంధించిన అంశమే లేదు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిని ప్రభుత్వ కార్యకలాపాల నిమిత్తం, రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు ఉపయోగించుకునేలా ఏర్పాటుచేశారు.

అంతే కానీ ఉమ్మడి రాజధానిలోని పోలీస్ వ్యవస్థ మొత్తం గవర్నర్ కింద పనిచేయాలని, వివిధ పోలీసు అధికారులు ఆయనకే రిపోర్ట్ చేయాలని లేదు. ఇక హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లా ఎస్పీ పరిధిలోని అధికారుల బదిలీలు, నియామకాలు, పదోన్నతులు కల్పించే అధికారం గవర్నర్‌కు ఇవ్వాలనేది ఎక్కడినుంచి వచ్చిందో హోంశాఖకే తెలియాలి. ఎందుకంటే హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లా. విభజన చట్టంలో హైదరాబాద్ జిల్లాను తెలంగాణ రాష్ట్రం కింద చేర్చారు. కాబట్టి దీనిపై ఎలాంటి అధికారాలు గవర్నర్‌కు కేటాయిస్తున్నట్టు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పేర్కొనలేదు. పైగా అదే చట్టంలో విభజన తర్వాత అప్పటిదాకా ఉమ్మడి రాష్ర్టానికి ఉన్న అధికారాలు విభజన తర్వాత ఆయా ప్రాంతాలకు పరిమితమైన రూపంలో ఆ అధికారాలు యథాతథంగా కొనసాగుతాయనే అంశం చట్టంలోని 11వ నిబంధన కింద ఉంది. అంటే హైదరాబాద్ మీద తెలంగాణ ప్రభుత్వ అధికారం తిరుగులేనిది.

చంద్రబాబు లేఖ రాశారు.. హోంశాఖ సిపార్సు చేసింది...

తెలంగాణతో ఏమాత్రం సంబంధం లేని ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖతో కేంద్ర హోంశాఖ హుటాహుటిన సిఫారసులు పంపడం మొదలుపెట్టింది. విభజన బిల్లు, ఫెడరల్‌స్పూర్తికి విరుద్ధంగా హైదరాబాద్‌లో ఉమ్మడి పోలీస్ బోర్డు ఏర్పాటుచేయాలని చంద్రబాబు కోరితే దానికి వంత పాడుతూ పోలీస్ బోర్డు ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సర్క్యులర్ పంపింది. దానిలో జనాభాకు అనుగుణంగా ఇరు రాష్ర్టాల అధికారులుంటారని కూడా పేర్కొంది. తన అధికారాలపై క్లారిటీ ఇవ్వాలని అడిగిన గవర్నర్‌కు ఆ మేరకు స్పష్టత ఇచ్చేబదులు విషయాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేసింది.

ఆక్రమణ కూలిస్తే గుర్తొచ్చింది...

పార్లమెంటులో ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆవిర్భావం లాంఛనమే. మధ్యలో అనేక నెలలు గడిచాయి. జూన్ 2న ఆవిర్భావం జరిగింది. అది జరిగి దాదాపు నెల గడిచింది. ఇంతకాలం గవర్నర్ పాలన మీద, అధికారాల మీద ఎవరూ మాట్లాడలేదు. చంద్రబాబుకు అసలే గుర్తుకు రాలేదు. కానీ గురుకుల్ భూముల్లోకి తెలంగాణ సర్కారు బుల్డోజర్లు అడుగు పెట్టిన తర్వాత హఠాత్తుగా అందరికీ గవర్నర్ అధికారాలు గుర్తొచ్చాయి. అంటే సీమాంధ్రుల లక్ష్యం ఏమిటో.. వారికి వంత పాడే పచ్చ మీడియా వైఖరి ఏమిటో స్పష్టమవుతుంది. 
ఎట్టిపరిస్థితిలో అక్రమ కబ్జాలను చెర విడిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉక్కు సంకల్పం చూసి బెదిరిపోయినందునే సీమాంధ్రులు ఈ ప్రతిపాదన తెచ్చారన్నది స్పష్టం. ఇందులో సీమాంధ్ర సామాన్య ప్రజల ప్రయోజనాలు లేవు. అడుగు భూమి లక్షలు పలికే ప్లాట్లలో పేదలున్నారని పచ్చ మీడియా ప్రదర్శించే పైత్య ప్రకోపాల్లో నిజాయితీ లేదు. గురుకుల్, గోకుల్ ప్లాట్లలో పేదలుంటారా లేదా అనేది పచ్చ మీడియా పరిజ్ఞానానికి సంబంధించిన అంశం. ఉన్నదల్లా వందల కోట్ల వ్యాపారుల ప్రయోజనాలు. వారికి అండగా నిలిచి చంద్రబాబు తన నిజస్వరూపమేమిటో చాటుకున్నారు. కేవలం పెట్టుబడి దారుల కోసమే చంద్రబాబు ఉమ్మడి పోలీస్ బోర్డు, గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇదే క్రమంలో భూ పరిపాలన కూడా గవర్నర్ చేతికి తెచ్చి దొడ్డిదారిలో హైదరాబాద్‍ను ఏలాలనే కుట్ర తప్ప ఇందులో నిజాయితీ కనిపించదు.

ఇంతకీ సెక్షన్ 8 ఏం చెప్పింది...

- సెక్షన్ 8(1)...సెక్షన్ 8లోని మొదటి అంశం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంనాటినుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పరిపాలన సాగించే క్రమంలో..ఇక్కడ నివసించే ప్రజలకు స్వేచ్ఛ, ప్రాణ రక్షణ, ఆస్తుల భద్రతకు సంబంధించి రక్షణ కల్పించే విషయంలో గవర్నర్ ప్రత్యేక బాధ్యతను కలిగి ఉంటారు.
-సెక్షన్8(2)...ప్రత్యేకించి.. ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణ వంటి అంశాలపై ఆయన తన బాధ్యతలను విస్తరించవచ్చు.
- సెక్షన్8(3)..ఈ విధుల నిర్వహణలో గవర్నర్ తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించిన తర్వాతనే, తన వ్యక్తిగత నిర్ణయం మేరకు తగు చర్యలు తీసుకోవచ్చు.
-సెక్షన్ 8 (4)..ఈ విధుల నిర్వహణకోసం కేంద్రం ఇద్దరు సలహాదారులను నియమిస్తుంది.

కొసమెరుపు...

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాడు ఆ పార్టీ వెల్లడించిన సిద్ధాంతాల్లో అసలు గవర్నర్ల వ్యవస్థే రద్దు చేయాలన్న వాదన ఉంది. దాన్ని పచ్చ మీడియా ఆనాడు ప్రత్యేక కథానాలు వేసి మరీ ప్రచారం చేసింది. నాదెండ్ల సంక్షోభం అనంతరం ఎన్టీఆర్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక వేదికల మీద గవర్నర్ల వ్యవస్థే రద్దు చేయాలని డిమాండ్లు చేస్తూ వచ్చారు. పలువురు టీడీపీ ఎంపీలు కూడా పార్లమెంటు వేదికపై ఈ డిమాండ్లు వినిపించారు. చంద్రబాబు అధికారం చేపట్టాక కూడా అనేక సార్లు ఈ డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆ విధానం కేంద్రం గవర్నర్ల ద్వారా పరోక్షంగా పాలించడానికి వ్యతిరేకమని ఘోషించారు. కానీ ఇవాళ ఆ వ్యవస్థే చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు, పచ్చ మీడియాకు కూడా ముద్దు వస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఆర్డీఎస్‌ విషయంలో సీమాంధ్ర నేత అరాచకం

-ప్యాకేజీ-1 పనులనుఅడ్డుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
-మహబూబ్‌నగర్‌కు మేలు చేసే పనులపై రాయలసీమ నేతల దౌర్జన్యం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో మహబూబ్‌నగర్, కర్నూల్ జిల్లాల మధ్యలో ఉన్న రాజోలి డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)పై వివాదం మరోసారి రాజుకుంది. తెలంగాణకు మేలు చేసే ఆర్డీఎస్ ఆధునీకీరణ పనులను ఆదివారం కర్నూలు జిల్లాలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులతో వచ్చి అడ్డుకున్నారు. కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి పనులను నిలిపివేయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్‌పై వలసపాలకులు వివక్ష ప్రదర్శించడంతో తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు మొదటి నుంచి అన్యాయం జరుగుతోంది. కర్నూలు జిల్లా నేతలు ఆర్డీఎస్ తూములను పగులగొట్టి బలవంతంగా రాయలసీమకు అనేక ఏళ్లుగా నీళ్లు తరలించుకుపోతున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, 30 వేల ఎకరాలకు మించడం లేదు. 

ardinence
ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ ఈ సమస్యను ఎత్తిచూపడంతో తప్పని పరిస్థితుల్లో,ఆర్డీఎస్ వివాదానికి పరిష్కారంగా హెడ్‌వర్క్స్‌లోని ప్యాకేజీ -1, 2 పనులను ఉమ్మడిరాష్ట్రంలో చేపట్టారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో ఆధునికీకరణ పనులకు రూ.92 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కర్ణాటక పరిధిలో పనులు చేపట్టేందుకు రూ.72కోట్లు, తెలంగాణ పరిధిలో పనులకు రూ.20 కోట్లను కేటాయించారు. ఆ పనులు ఆరేళ్లుగా కొనసాగుతున్నాయి. 1, 2 ప్యాకేజీల్లో పనులు 15 రోజులుగా ముమ్మరంగా పూర్తిచేస్తున్నారు. 1వ ప్యాకేజీ పనుల్లో భాగంగా ఆనకట్టను పటిష్ఠపరిచే పనులు చేపట్టారు. గతంలో 60 మీటర్ల మేర పనులు పూర్తవగా మిగిలిన 40మీటర్ల ఆనకట్టకు స్టీల్ అమర్చేపనులు ప్రస్తుతం చేపట్టారు. 

విషయం తెలుసుకున్న మంత్రాలయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన అనుచరులతో ఆదివారం కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకుని కర్ణాటక అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్యాకేజీ-1 పనులను నిలిపివేయించారు. కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ రామయ్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కర్ణాటక సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ఆనకట్ట దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆగస్టు నెలాఖరుకు పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో కాంట్రాక్టర్ ఉండగా, పనులు నిలిపివేయడంతో ఈ ఏడాది కూడా సాగునీరు అంతంతమాత్రమే అందే అవకాశాలు ఉన్నాయని పాలమూరుల రైతులు ఆందోళనకు గురువుతున్నారు.

చంద్రబాబు హయాం నుంచే దౌర్జన్యాలు

తెలంగాణ రాష్ట్రం వచ్చినా సీమ నేతలు ఫ్యాక్షన్ సంస్కృతి వీడలేదని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ 2003-04లో చంద్రబాబు ప్రభుత్వం 194 జీవో విడుదల చేస్తూ ఆనకట్టను పటిష్టపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ, అదే ప్రభుత్వంలోని సీమనేతలు దౌర్జన్యంగా ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ షట్టర్లను ధ్వంసం చేశారని గుర్తుచేశారు. సీమ నాయకుల దౌర్జన్యాలతో ఆనకట్ట పూర్తిగా దెబ్బతిని పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. నైజాంకాలంలోనే ఆర్డీఎస్ ఆనకట్టను 1095 అడుగులకు పెంచుకునేలా ఉత్తర్వులున్నా సీమాంధ్రపాలనలో ఆర్డీఎస్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని వాపోయారు. ప్యాకేజీ-1 పనులను అడ్డుకున్న విషయాన్ని ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పనులను సాఫీగా జరిగేలా చూడాలని కోరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

పరిశ్రమల శాఖలో సీమాంధ్రుల ఆధిపత్యం...!

తెలంగాణ ఏర్పాటై నెల దాటుతున్నా కొన్ని శాఖల్లో ఇంకా సీమాంధ్ర అధికారుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ర్టాలకూ ఏయే కార్యాలయాలు ఎక్కడుండాలన్న దానిపై భవనాల కేటాయింపులు పూర్తయ్యాయి.

కానీ పరిశ్రమల శాఖలో సీమాంధ్ర అధికారులు మాత్రం సీట్లు వదలబోమంటున్నారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు కారిడార్లలో కూర్చొని విధులు నిర్వర్తించాల్సి వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు కేటాయించిన చాంబర్‌ను సీమాంధ్ర అధికారులు ఖాళీ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిషనర్ రజత్‌కుమార్ గతంలో కూర్చున్న చోటును వదలేందుకు ససేమీరా అంటున్నారు. తెలంగాణకు ఇన్‌చార్జీ కమిషనర్‌గా నియమితులైన ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ తన కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కానీ జాయింట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లకు కూర్చునేందుకు స్థానాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. కారిడార్‌లో, ఇతరుల చాంబర్లల్లో కూర్చొని ఫైళ్లు చూస్తున్నామని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. పైగా రెండు రాష్ర్టాల పరిశ్రమల శాఖలు ఒకే భవనంలో ఉండడం వల్ల గోప్యత కరువవుతోందని ఆందోళన చెందుతున్నారు.

తాత్కాలికమే శాశ్వతమా?
రాష్ట్ర విభజన నేపథ్యంలో చేపట్టిన తాత్కాలిక ఉద్యోగుల కేటాయింపు, బాధ్యతల అప్పగింతలను పరిశ్రమల శాఖలో శాశ్వతం చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖలో నలుగురు జాయింట్ డైరెక్టర్లు ఉండగా ఒక్కరికే అన్ని బాధ్యతలను అప్పగించారు. మిగిలిన ముగ్గురికి నామమాత్రపు పనులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఇన్సెంటివ్స్‌వంటి కీలక బాధ్యతలను ఒక్కరే చూస్తుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కమిషనర్ జోక్యం చేసుకొని సరైన రీతిలో పని విభజన చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!