పోలవరము ప్రాజెక్టుకై పూని యిచటి
"భద్రగిరి మా"దటంచును బలుకుచుండ్రి!
మాయఁ దెలియని వారల, మాయ చేసి,
మోసగింపఁగఁ దలచిరి మోసకాండ్రు!
మాయఁ దెలియని వారల, మాయ చేసి,
మోసగింపఁగఁ దలచిరి మోసకాండ్రు!
వేగిరముగ నాగార్జునసాగరంపు
నెడమ కాల్వపై యధికార మెడఁదఁ దలఁచి,
"మాదె మునగాల"యంచును మండుచుండ్రి!
యట్లె "శ్రీశైల ప్రాజెక్టు నాంధ్రభూమి
లోననే కట్టి, రిట మీకు దాని మీద
నెట్టి యధికారమే లేదు; నిలువకుఁ డిట"
యంచుఁ బలుకుచు, విద్యుత్తు నడుగకుండ,
నీర మడుగకుండఁగ జాగ్రత్త నెఱపుచుండ్రి!
మా తెలంగాణ కొలువుల నీతిమాలి,
కొల్లగొట్టిన రీతులు తెల్లమగు న
టంచు భయపడి, "యెన్‍జివో"లందఱ నిట
రెచ్చగొట్టుచు నుండిరి రీతి లేక!
హైదరాబాదు భూమిపై యాధిపత్య
ముంటకై, దాని యభివృద్ధి మొత్తమునకు
"మేమె" కారణ మంచును మిడుకుచుండ్రి!
యెన్ని వేషాలు వేసిన, నేమి వదర,
నవియ కేంద్రమ్మునకును సువిదితమోయి!
రాష్ట్ర విభజన తథ్యమ్ము! ప్రజలమైన
మాకుఁ దెలగాణ రాష్ట్ర సమ్మాన మందఁ
జేయు దినము సమీపానఁ జేరుచుండె!
కేంద్ర మిచ్చిన మాటను క్షేమ మెంచి,
వేగ నెరవేర్చుచున్నట్లు విదిత మాయె!
కాని, సీమాంధ్ర నేతలు క్షణము క్షణము
నక్కజిత్తులతో దాని నాపఁ బూని,
చిత్ర చిత్రంపు వ్యూహాలఁ జెలఁగుచుండ్రి!
యైన నన్నియు వ్యర్థమ్ము లగును సుమ్ము!
బూదిలోఁ బడ్డ పన్నీరు పోలిక యగు!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
guruvu garu namaskaram...
mee padya rachanaavidanam chala baagundi telangaana kosam mee vanthu krushiki dhanyavadaalu....
ధన్యవాదాలు నాగరాజుగారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి