గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 24, 2014

క్యాడర్‌స్ట్రెంత్‌లో అన్యాయం...!

-రాష్ట్ర పోస్టులు జిల్లా జాబితాలో, జిల్లా పోస్టులు రాష్ట్ర జాబితాలో...
తెలంగాణ ఉద్యోగసంఘాల అభ్యంతరాలు 
ఆయుష్, ట్రెజరీస్ ఎకౌంట్స్, గణాంక, వైద్యం ఆరోగ్యం, టూరిజం, రోడ్లు, భవనాలు, నీటిపారుదల, దేవాదాయం తదితర శాఖలలోని రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోస్టులపై కమలనాథన్ కమిటీ అవగాహనారాహిత్యంతో క్యాడర్‌స్ట్రెంత్ జాబితా ప్రకటించిందని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. 56 శాఖాధిపతుల కార్యాలయాలలో జరిగిన అన్యాయాలను వివరిస్తూ మెంబర్‌సెక్రటరీ పీవీ రమేశ్‌కు టీఎన్జీవో నగరశాఖ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ ముజీబ్, ట్రెజరీస్ ఎకౌంట్స్ టీఎన్జీవో అధ్యక్షులు ఎన్ నరేందర్‌రావు, ఎకానమిక్స్, స్టాటిస్టిక్స్ విభాగం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వేణుమాధవ్ తదితరులు విజ్ఞాపనలను అందచేశారు. 
ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తీరులో శాఖాధిపతుల కార్యాలయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఫలితంగా కొన్ని పోస్టులు ఒకసారి రాష్ట్రస్థాయిలోకి, మరోసారి జిల్లాస్థాయిలోకి మారిపోతున్నాయని వారు ఎత్తిచూపారు.

ఇవీ లోపాలు...

దేవాదాయశాఖలో అక్రమంగా తెచ్చుకున్న సూపరింటెండెంట్‌పోస్టులను రాష్ట్రస్థాయి జాబితాలో ప్రకటించారని, అదే సమయంలో ఆయుష్‌శాఖలోని నిజామియా జనరల్ హాస్పిటల్ ఉద్యోగులను, సిటీకాలేజీ ఉద్యోగులను మాత్రం జిల్లాక్యాడర్‌లో చేర్చారని జేఏసీ నాయకులు వివరించారు. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ శాఖ నుండి వివిధ శాఖలు గణాంకాల అవసరాల కోసం డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకున్న అధికారుల కేటగిరీలను నిర్ణయించడంలో కనీస పద్ధతులు పాటించలేదన్నారు. ఈ శాఖలో ఒకే క్యాడర్ ఉన్న ఉద్యోగులను కొన్ని శాఖలవిషయంలో రాష్ట్రస్థాయి ఉద్యోగులుగా, మరికొన్నింట జిల్లా అధికారులుగా పరిగణించారన్నారు. ఇదేవిధంగా పశుసంవర్ధకశాఖ, సహకారశాఖ, హార్టికల్చర్, పురావస్తుశాఖ, సిరీకల్చర్ శాఖలలోని పోస్టులను తారుమారు చేశారని విమర్శించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, ఆగస్టు 23, 2014

సత్యం స్కాంలో టీవీ9 శ్రీని(వాస)రాజు...!

-చార్జిషీటులో పేరును చేర్చిన సెబీ..
-2000 సంవత్సరంలోనే కుంభకోణానికి బీజం!
-ఆ సమయంలో సత్యం డైరెక్టర్‌గా శ్రీనిరాజు..
-షేర్లు అమ్మి రూ.2 వేల కోట్లు ఆర్జించిన డైరెక్టర్లు
-ఆ నిధుల నుంచే టీవీ9 చానల్ ప్రారంభం?
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దేశంలో అతిపెద్దదైన ఈ కార్పొరేట్ అకౌంటింగ్ కుంభకోణానికి 2000 సంవత్సరంలోనే బీజం పడిందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అంటున్నది. ఈ స్కాంలో టీవీ9 ప్రమోటింగ్ సంస్థ ఐల్యాబ్స్ ప్రమోటర్, ప్రముఖ ఏంజిల్ ఇన్వెస్టర్ చింతలపాటి శ్రీనివాసరాజు (శ్రీనిరాజు) పేరును కూడా ఈ నెల తొలినాళ్లలో నమోదు చేసిన చార్జిషీటులో చేర్చింది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు, శ్రీనిరాజుతోపాటు మొత్తం 13మంది, వారికి చెందిన కొన్ని సంస్థలు కలిసి కుంభకోణం సమయంలో రూ.2000 కోట్లకు పైగా సంపాదించారని నియంత్రణ మండలి వెల్లడించింది. 
sriవీళ్లందరికీ ముందునుంచే సత్యం వాస్తవ ఆర్థిక పరిస్థితి తెలిసినప్పటికీ మౌనంగా ఉన్నారని, ఆ సమయంలో క్రమంగా తమ వాటా షేర్లను విక్రయించి భారీగా లాభపడ్డారని చార్జిషీటులో పేర్కొంది. ఈ నేరారోపణలు రుజువైతే గరిష్ఠంగా వీరికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రామలింగ రాజుకు తోడల్లుడైన శ్రీనిరాజు 2003కు ముందు సత్యం బోర్డు సభ్యునిగా కూడా ఉన్నారు. సెబీ చార్జిషీటులో ఆయన పేరును ఏ11గా చేర్చింది. ఆయనకు చెందిన సంస్థలు చింతలపాటి హోల్డింగ్స్‌ను ఏ12గా, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను (గతంలో మేటాస్ ఇన్‌ఫ్రా) ఏ 13గా చేర్చింది. కుంభకోణం జరిగినకాలంలో (2000 నుంచి 2009 వరకు) ఆరోపితులంతా కలిసి కోటిన్నర షేర్లను విక్రయించారని సెబీ పేర్కొంది.

శ్రీనిరాజు, ఆయనకు చెందిన కంపెనీలు కలిసి ఈ సమయంలో సత్యంకు చెందిన 73 లక్షల షేర్లను విక్రయించాయని చార్జిషీటులో తెలిపింది. కుంభకోణం చోటు చేసుకున్న సమయంలోనే శ్రీనిరాజు తండ్రి దివంగత అంజి రాజు కూడా 2.5 లక్షల సత్యం షేర్లను విక్రయించారని వెల్లడించింది. తద్వారా వచ్చిన నిధుల నుంచే శ్రీనిరాజు టీవీ9 చానల్‌ను స్థాపించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 2004లో టీవీ9 బ్రాండ్‌నేమ్‌తో శ్రీనిరాజు తెలుగు న్యూస్ చానెల్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంస్థ 7 ప్రాంతీయ భాషల్లో న్యూస్ చానళ్లు కలిగిఉంది.

ఇప్పటికే టీవీ9లో కొంత వాటాను విక్రయించిన శ్రీనిరాజు.. తనపేరిట వాటాలను మొత్తంగా విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం కంపెనీ విలువ మదింపు ప్రక్రియ సాగుతున్నది. కానీ తెలుగు చానెల్ ప్రసారాలను తెలంగాణ ఎంఎస్‌వోలు నిలిపివేసిన నేపథ్యంలో మదింపుకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా తెలుస్తున్నది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టీవీ9 రూ.400 కోట్ల మేర పలుకవచ్చని అంచనా.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, ఆగస్టు 22, 2014

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం!

-నమస్తే తెలంగాణకు పాసులు ఇవ్వకపోవడం దారుణం
-ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపాటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, టీజీవో చైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కోసం నమస్తే తెలంగాణ విలేకరులకు పాస్‌లు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలన్నింటికీ పాస్‌లు జారీచేసిన ఏపీ ప్రభుత్వం నమస్తే తెలంగాణకు మాత్రమే పాస్‌లు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ పత్రికను అవమానపర్చేవిధంగా పాస్‌లు ఇవ్వబోమని చెప్తే కుదరదని హెచ్చరించారు. 
Srinivas-goud
నమస్తే తెలంగాణను పక్కనపెట్టడమంటే ప్రజాస్వామ్యంలో ప్రత్రికలకు ఉన్న స్వేచ్ఛను కాలరాయడమేనని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో నమస్తే తెలంగాణ దినపత్రిక ఆవిర్భవించిందన్నారు ఆంధ్ర అధికారులు, నేతలు, పాలకుల కుట్రలు పటాపంచలు చేసి ప్రజలకు వాస్తవాలను అందించిందన్నారు. ఆంధ్రా నాయకుల కుతంత్రాలను వెలుగులోకి నమస్తే తెలంగాణ తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ సంపదను అక్రమంగా దోచుకుంటున్న అధికారుల గుట్టురట్టు చేసిందన్నారు.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకై.. ఉద్యమ పంథాతో ఆవిర్భవించిన పత్రికకు అసెంబ్లీ కవరేజ్ పాస్‌లు ఇవ్వకపోవడమంటే తెలంగాణ ప్రజల గుండెలను గాయపర్చడమేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఊడ్చేది తెలంగాణ వారే, లైట్లేసిది తెలంగాణ వారే, నీళ్లుపట్టేది తెలంగాణవారే కానీ కవరేజ్‌కు వెళ్లే నమస్తే తెలంగాణ పాత్రికేయులకు పాస్‌లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసేవిధంగా విభజన ప్రక్రియను నవంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని కమల్‌నాథన్ కమిటీని కోరారు.

రెండు రాష్ర్టాల సీఎంలు సమావేశమైనప్పుడు ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. జిల్లా, జోనల్ పోస్టుల విషయంలో కమల్‌నాథన్ కమిటీ ఎటూ తేల్చలేకపోతున్నందున కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40,378మంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని డిమాండ్ చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

దర్గా భూములపై కబ్జా పడగ!

-జూబ్లీహిల్స్‌లో సీమాంధ్రుల బాగోతం
-323 ఎకరాల భూములు హాంఫట్
-మార్కెట్ విలువ రూ.ఆరువేల కోట్లు!
-స్వాధీనం చేసుకోవాలని ముస్లింల డిమాండ్
హైదరాబాద్‌లోని అత్యంత సంపన్న నివాస ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో 323 ఎకరాల అక్రమ భూకైంకర్యం బయటపడింది. దశాబ్దాలపాటు దాచిపెట్టిన నిజం పురాతన రికార్డుల ద్వారా వెలుగు చూసింది. ఈ భూముల విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.6 వేల కోట్లని అంచనా.
darga-land01దర్గాకు చెందిన ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వక్ఫ్‌బోర్డుకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే షేక్‌పేట్ మండలంలోని సర్వే నంబర్లు 92, 102 ప్రకారం హకీంపేట్ గ్రామంలోని హకీముల్ ములుక్ ముసవీ అల్ మారుఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్‌షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4448 గజాలు, దర్గా నిర్వహణ వ్యయం కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని కేటాయించారు. ఈ మేరకు కితాబుల్ అవుఖాఫ్, మున్‌తఖబ్ ప్రకారం కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ పాలకులు కూడా వక్ఫ్ భూమిగా గుర్తించారు. హిజ్‌ర్రీ సంవత్సరం 1321, ఫస్‌లీ సంవత్సరం 1903లో నిజాం ప్రభుత్వ ఉమురే మజహబీ (ధార్మిక వ్యవహారాల శాఖ) రికార్డుల ప్రకారం ఫైల్ నం 786/4 బాబుల్ అవుకాఫ్/1321 ఫసలీ, మున్‌తఖబ్ నం.1254/1321ఫసలీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1903లో నిజాం ప్రభుత్వం ఈ భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారించింది.

darga-land01
ఆక్రమణలు ఇలా...

హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అనంతరం 1960 తరువాత సర్వే నిర్వహించారు. ఏం జరిగిందో తెలియదు గానీ.. సర్వేలో దర్గాకు సంబంధించిన పూర్తి భూములను వక్ఫ్ గెజిట్‌లో చేర్చకుండా కేవలం దర్గా కట్టడం, దర్గాకు ఆనుకొని ఉన్న మసీదు, దర్గా ప్రాంగణాన్ని మాత్రమే నమోదు చేశారు. వక్ఫ్ సర్వే ఫారంలోని అటాచ్ ప్రాపర్టీ కాలమ్‌ను పూర్తిగా వదిలేసి, దర్గాకు కేవలం 4,448 గజాల వక్ఫ్ భూమి ఉన్నట్లు రికార్డులో నమోదు చేశారు.

దర్గా అటాచ్ ప్రాపర్టీ 323.18 ఎకరాల భూమిని ఉద్దేశపూర్వకంగానే నమోదు చేయలేదు. వక్ఫ్ గెజిట్‌లో 323.18 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో గత నలబై ఏళ్లలో సీమాంధ్ర రాజకీయ నాయకులు, వక్ఫ్ బోర్డు ఉన్నత అధికారులు కుమ్మకై నకిలీ దస్తావేజులు సృష్టించి దర్గా భూమిని పలు సీమాంధ్ర వ్యాపార సంస్థలకు, సినిమారంగ ప్రముఖులకు, సీమాంధ్ర రాజకీయ నాయకుల బంధువులకు తక్కువ ధరలకు విక్రయించారు. ప్రస్తుతం ఆ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ, కన్వెన్షన్ సెంటర్లతో పాటు సీమాంధ్ర ప్రాంత వ్యాపారుల నివాసాలున్నాయి.

రికార్డును సరిచేసిన వక్ఫ్ బోర్డు

ఈ విషయాన్ని గమనించిన పలు ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు ఈ భూముల విక్రయాలు, కేటాయింపులపై వక్ఫ్ బోర్డుకు ఫిర్యాదు చేశాయి. అయితే సీమాంధ్ర పాలకులు ఫిర్యాదులను పట్టించుకోకుండా తమకు అనుకూలంగా ఉండేవారికి చౌక ధరలకే భూములను కేటాయిస్తూ వచ్చాయి. ఇదిలాఉండగా 2011లో అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖుసురోపాషా వక్ఫ్ బోర్డు టాస్క్‌ఫోర్స్‌ను పంపించి భూమికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. భూమి వివరాలు మున్‌తఖబ్, కితాబుల్ అవుఖాఫ్(వక్ఫ్ భూమి అధార పుస్తకాలు) తదితర రికార్డులన్నీ కూలంకషంగా తిరగేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మున్‌తఖబ్, కితాబుల్ అవుఖాఫ్ ప్రకారం మొత్తం భూమి 4448 గజాలు, 323 ఎకరాల 18 గుంటలు ఉన్నట్లు గుర్తించారు.

1960 అనంతరం జరిగిన సర్వేలో దర్గా కట్టడానికి సంబంధించిన భూమిని నమోదు చేసి, దర్గా మొత్తం భూమిని అటాచ్‌మెంట్ కాలంలో నమోదు చేయకపోవడంతోపాటు, వక్ఫ్ గెజిట్‌లో కేవలం 4448 గజాలుగా నమోదు చేసి తప్పు చేశారని గుర్తించారు. ఈ విషయాన్ని వక్ఫ్ బోర్డు సమావేశం దృష్టికి తెచ్చారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములు తిరిగి వక్ఫ్ రికార్డులో నమోదు చేసుకునేందుకు 1998 వక్ఫ్ యాక్టు సెక్షన్ 40 అవకాశం ఇస్తున్నది. దీంతో ఈ సెక్షన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ చట్టానికి 2013లో అమెండ్‌మెంట్ చేసి.. సదరు భూమిని వక్ఫ్ రికార్డుల్లో నమోదు చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానంలో మున్‌తఖబ్, కితాబుల్ అవుఖాఫ్‌లో ఉన్న భూమిని వక్ఫ్ గెజిట్‌లో నమోదు చేయడానికి ఈ భూమికి సంబంధించిన అధారాలతో కమిషనర్ (ప్రింటింగ్)కు పంపారు. భూమికి సంబంధించిన అధారాలను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్ అన్యాక్రాంతమైన భూమికి సంబంధించిన పూర్తి వివరాలను కొత్త గెజిట్‌లో నమోదు చేస్తూ ఇటీవల ప్రచురించారు. ప్రస్తుతం కొత్త గెజిట్‌లో ఈ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

భూములు రక్షించాలి..

గ్రేటర్‌లో మాయమైన కోట్ల విలువైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని దక్కన్ వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు ఉస్మాన్‌అల్ హజ్రీ, హాస్ ఇండియా చైర్మన్ తారిక్ ఖాద్రీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర పాలకులు ఇష్టానుసారం భూములను విక్రయించి కోట్ల రూపాయలు దండుకున్నారని మండిపడ్డారు. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్యాక్రాంతమైన వక్ఫ్‌భూములను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో తప్పు జరిగింది

గతంలో తప్పు జరగడంలో కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తి వివరాలు గెజిట్‌లో నమోదు కాలేదు. వక్ఫ్ యాక్టు సవరణతో తిరిగి ఈ భూమి వక్ఫ్ గెజిట్‌లో నమోదు అయ్యింది. ప్రస్తుతం ఉన్న పాత సర్వే నం.92, కొత్త సర్వే నం.102 వక్ఫ్ మున్‌తఖబ్, కితాబుల్ అవుఖాఫ్, కొత్త వక్ఫ్ గెజిట్ ప్రకారం 4448 గజాలు, 323 ఎకరాల 18 గుంటల భూమి వక్ఫ్ భూమిగా నమోదయ్యింది. ఈ భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ శాఖ, వక్ఫ్ బోర్డు జంట సర్వే కోసం షేక్‌పేట్ తహశీల్దార్‌కు లేఖ రాశాం. అతిత్వరలో సర్వే నిర్వహించడంతో పాటు హద్దులు నిర్ణయించి భూమిని స్వాధీనం చేసుకుంటాం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

తెలంగాణ ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులు తెలంగాణకే...!

-రెండు రాష్ర్టాలలో సూపర్‌న్యూమరీ పోస్టులు
-ఖాళీలలోకి డిప్యూటేషన్ పద్ధతిలో సీనియర్లు
-ఉభయ రాష్ర్టాల సీఎస్‌ల భేటీలో కీలక నిర్ణయాలు!
-సామరస్యంగా, స్నేహపూర్వకంగా విభజన
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు సంబంధించిన అనేక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. రెండు రాష్ర్టాల ఉద్యోగుల మధ్య ఘర్షణను పెంచవద్దని, సామరస్య వాతావరణంలో, స్నేహపూరితంగా విభజన జరుగాలని ఇద్దరు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆదివారం జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం ఉద్యోగుల విభజన అంశాన్ని ప్రధాన కార్యదర్శులకు అప్పచెప్పాలని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కీలకభేటీలో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఉద్యోగుల విభజనకు సంబంధించిన పలు అంశాలపైన పరస్పర అవగాహనకు వచ్చి, ఒప్పందాలపై సంతకాలు కూడా చేసినట్లు సమాచారం.
ప్రధానంగా అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి బట్వాడా చేసిన నాలుగో తరగతి, లాస్ట్‌గ్రేడ్ ఉద్యోగులను తెలంగాణ రాష్ర్టానికి బదిలీ చేసేందుకు ఏపీ సీఎస్ అంగీకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ర్టానికి రాష్ట్రస్థాయిలో 58:42 నిష్పత్తిలో ఉద్యోగులను విభజించేందుకు, 42% ఉద్యోగులను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకారాలు కుదిరినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.

రెండు రాష్ర్టాలలో మిగులు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు సూపర్‌న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసుకోవాలని అనుకున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఖాళీలు ఏర్పడినట్లయితే రెండేండ్లలో రిటైర్‌కానున్న సీనియర్ ఉద్యోగులను డిప్యూటేషన్ పద్ధతిలో మార్చుకోవడానికి ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యోగ సంఘాలు తెలియజేసిన అభ్యంతరాలన్నింటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్కార్ స్పందించినట్లు అధికారులు చెప్పారు.

ఇద్దరు ఉన్నతాధికారుల మధ్యన కుదిరిన అంగీకారాల ప్రకారమే ఫైనల్ మార్గదర్శకాలు ఉండాలని కూడా కమలనాథన్ కమిటీకి వివరించాలని ఇద్దరు పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు తుది మార్గదర్శకాలను తయారుచేసి, వాటిపైన ఇద్దరు సీఎస్‌లు సంతకాలు చేసినట్లు తెలిసింది. వీటిని కమలనాథన్ అంగీకరించిన తర్వాత వాటిని కేంద్రహోంశాఖకు పంపిస్తారు. మార్గదర్శకాలపై ప్రధాని ఆమోదముద్ర తప్పనిసరి. అందుకని ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ మొదటివారానికే పూర్తి చేయాలనే సంకల్పంతోనే ఇద్దరు ప్రధానకార్యదర్శులు వేగంగా స్పందిస్తున్నట్లు తెలుస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, ఆగస్టు 21, 2014

పోలవరం ఫైళ్లు కనబడకపోవడంలో ఎవరిమాయ ఉంది...?

-పోలవరం వివరాలు కోరిన స.హ. దరఖాస్తుదారునికి కేంద్ర పర్యావరణశాఖ సమాధానం
-కనుమరుగైన కీలక సమావేశాల తీర్మానాలు
-అటవీ భూముల మళ్లింపుపై అనుమానాలు
-నిధులు కేటాయింపులోనూ స్పష్టత లేదు




పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అటవీభూములు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు ఎప్పుడు వచ్చింది? ఏ సమావేశంలో ఈ భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు? ఎన్ని ఎకరాల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం కేటాయించారు? అటవీ తొలగింపు అనుమతులు ఎప్పుడిచ్చారు? ఇవేకాదు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ విషయమూ ఎవరికీ తెలియదు.
ఆఖరుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులకు కూడా! నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల సరిహద్దుల్లో నిర్మాణమవుతున్న వివాదాస్పద ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ ఒక్క ఫైలు కనిపించడం లేదట. సమాచార హక్కు చట్టం కింద ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కోరిన ఓ దరఖాస్తుదారుడికి సాక్షాత్తూ కేంద్ర పర్యావరణ, అటవీమంత్రిత్వ శాఖ అధికారులు ఇచ్చిన నిర్లక్ష్యపు సమాధానమిది. జాతీయహోదా పొందిన ఓ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లు కనిపించడం లేదంటే నమ్మశక్యమేనా? అసలు అవి ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆది నుంచి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో వివాదాలు.. మరెన్నో అనుమానాలు.. వివిధ ప్రాంతాల మధ్య ఆందోళనలు. 73 ఏండ్ల క్రితం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన వచ్చినప్పటి నుంచీ అంతే. పోలవరం డిజైన్‌పై తెలంగాణ, ఒడిశా మొదటినుంచీ ఎన్నో అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఆంధ్ర పాలకులు వాటిని కొట్టిపారేస్తూ వస్తున్నారు.

రాష్ట్ర విభజన జరిగే సమయంలో కేంద్ర ప్రభుత్వం హడావుడిగా జాతీయహోదా కూడా కట్టబెట్టేసింది. ఈ వివాదస్పద ప్రాజెక్టు గురించి ఇప్పుడో ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా పర్యావరణ అనుమతుల విషయంలో తెలంగాణ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్ర పాలకులు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సవ్యంగా ఉన్నాయంటూ దబాయిస్తూ వస్తున్నారు. అసలు ఆ అనుమతులు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎప్పుడొచ్చాయి? అన్న విషయాలు తెలుసుకునేందుకు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అధికారులు ఫైళ్లు కనిపించడంలే దంటూ విస్తుగొలిపే సమాధానం పంపారు.

పోలవరం వివరాలు చెప్పండి..

సికింద్రాబాద్ న్యూమెట్టుగూడవాసి డీ సురేష్‌కుమార్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వివరాలు కావాలంటూ గత జూన్ 12న సమాచార హక్కు చట్టం కింద కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను కోరారు.

అవి:
1.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ భూములు కేటాయించాలంటూ వచ్చిన దరఖాస్తు (ఫారమ్ ఏ),
2. దానితోపాటు వచ్చిన అనుబంధ వివరాల కాపీ,
3. ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతులకు సంబంధించిన అన్ని ఫైల్ నోటింగ్స్,
4. ప్రాజెక్టుపై చర్చించిన అన్ని ఎఫ్‌ఏసీ సమావేశాల మినిట్స్,
5. అజెండా వివరాలు,
6. ప్రాజెక్టుకు స్టేజ్-1, స్టేజ్-2 ఫారెస్ట్ క్లియరెన్స్ అనుమతుల మంజూరుకు సంబంధించిన వివరాలు,
7. భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీఎఫ్‌వో(లు) ఇచ్చిన నివేదిక కాపీ, 8. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు

ఇవ్వాలని సురేశ్‌కుమార్ దరఖాస్తు చేశారు.

వివరాలు లేవట...

పోలవరం ప్రాజెక్టు వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద సురేశ్‌కుమార్ పెట్టిన దరఖాస్తుకు జూలై 25న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు సమాధానం పంపారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలేవీ తమ మంత్రిత్వ శాఖ వద్ద లేవని, ఆ సమాచారం కోసం అన్వేషిస్తున్నామని, దొరకగానే వివరాలు పంపుతామని పేర్కొంటూ న్యూఢిల్లీలోని ఇందిర పర్యావరణ్ భవన్ నుంచి ఓ లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించిన భూములు లేదా మళ్లించిన అటవీ భూముల విషయంలో ఏదో గోల్‌మాల్ జరిగిం  దనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

-కేంద్ర మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఎంతో భద్రంగా ఉండాల్సిన ఈ కీలకఫైళ్లు ఏమయ్యాయి?
-అధికారులు ఇంత నిర్లక్ష్యపూర్తింగా కోరిన సమాచారం లభ్యం కావడం లేదని ఎలా చెప్పగలుగుతున్నారు?
అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.

-లేకపోతే.. పోలవరం ప్రాజెక్టుకు భూముల కేటాయింపులో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న ఉద్ధేశంతోనే వివరాలు వెల్లడించడం లేదా?
అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

రిజిస్ట్రేషన్ శాఖలో లీకువీరులు...!

-కబ్జాదారులకు ముందుగానే చేరుతున్న సమాచారం
-సీమాంధ్ర ఉద్యోగుల పెత్తనం వల్లే అంటున్న తెలంగాణ ఉద్యోగులు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వానికి చెందిన రహస్యాలు కబ్జాదారులకు చేరుతున్నాయి.. ఈ శాఖలోని కీలకస్థానాల్లో ఎక్కువగా సీమాంధ్రులే ఉండటంతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు ముందే బయటకు పొక్కుతున్నాయి.. భూకబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న క్రమంలో కొన్ని భూములకు సంబంధించి దస్తావేజులు, ఇతర సమాచారం కబ్జాదారులకు చేరిపోతున్నదని తెలంగాణ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి అర్హులైన అధికారులు ఉన్నా.. కీలకస్థానాల్లో వారిని నియమించకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదని వారు చెప్తున్నారు. జాయింట్ ఐజీ మొదలుకొని అడిషనల్ ఐజీ కంప్యూటర్స్ వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సీమాంధ్రులదే పెత్తనం కొనసాగుతున్నది. నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ వంటి కీలమైన స్థానాల్లోనూ వారు తిష్ఠవేశారు.

దీంతో ఆ శాఖకు చెందిన రహస్యాలు ఆంధ్రప్రదేశ్ అనుకూల శక్తులకు చేరుతున్నాయని తెలంగాణ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల ట్రస్ట్ భూములకు సంబంధించిన సమాచారం ముందే బయటకు పొక్కిందని చెప్తున్నారు. బడ్జెట్ నివేదికలు తయారవుతున్న ప్రస్తుత తరుణంలో సీమాంధ్ర వారు ముఖ్యమైన పదవుల్లో ఉండటం వల్ల ప్రభుత్వానికి ఆర్థికపరంగా కూడా నష్టం జరిగే ప్రమాదముందని అంటున్నారు. ఆదాయ అంచనాలను ఒక్కసారిగా తగ్గించడమో లేదా పెంచడమో చేయడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుందని చెప్తున్నారు. సర్కార్ ఖజానాకు దాదాపు రూ. 6,700కోట్ల ఆదాయం అందిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖలో కీలక స్థానాల్లో తెలంగాణ అధికారులుండాల్సిన అవసరముందని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, ఆగస్టు 20, 2014

పంపకంలో ఏదీ నిజాయితీ?

-ఏపీఐఐసీ, టీఎస్‌ఐఐసీల మధ్య వార్
-కొనసాగుతున్న ఆంధ్రా ఆధిపత్యం
రాష్ట్ర విభజన అనంతరం కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగుల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఏపీఐఐసీ సంస్థ ఆస్తుల పంపిణీ, బాధ్యతల అప్పగింతలో అది కొట్టవచ్చినట్టు కనబడింది. విచిత్రంగా టీఎస్‌ఐఐసీలో కూడా ఆంధ్రా అధికారులే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ వంటి బాధ్యతలను కూడా ఆంధ్రా అధికారికే అప్పగించారు. అలాగే ఏపీకి సొంత భవనాలు అట్టిపెట్టుకున్న అధికారులు తెలంగాణకు లీజు భవనాలిచ్చారు.
bhavanఆస్తుల పంపిణీ బాధ్యతలను ముగ్గురు ఆంధ్రా అధికారులు చీఫ్ ఇంజినీర్ ఆర్ చెంచయ్య, జీఎం పర్సనల్ టీవీ రమణమూర్తి, సీజీఎం ఫైనాన్స్ సత్తిరాజు నిర్వహించారు. దాంతో ఆంధ్రాకే అంతా అనుకూలమైంది. టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్ రంజన్ తెలంగాణకు న్యాయం చేయలేక పోయారని ఉద్యోగులు అంటున్నారు. 

ఇక పరిశ్రమల కమిషనరేట్‌లో తెలంగాణకు కేటాయించిన చాంబర్లలో ఆంధ్రా కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. ఆంధ్రా కమిషనర్ తెలంగాణకు కేటాయించిన గదిలో తన ఛాంబర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బషీర్‌బాగ్ పరిశ్రమల భవన్ 4, 5, 6 అంతస్తుల్లో కొనసాగుతుండగా, ఐదోది ఏపీఐడీసీకి సంబంధించినది. ఐతే సొంత ఆస్తి కింద ఉన్న అంతస్తులు ఏపీఐఐసీకి కేటాయించి, లీజు అంతస్తును తెలంగాణకు ఇచ్చారు. అంటే తెలంగాణ ప్రభుత్వం దీనికి ప్రతి నెలా కిరాయి చెల్లించాల్సిందేనన్న మాట! ఇక ఆంధ్రా అధికారులు అవసరానికి మించిన స్థలాల్లో ఛాంబర్లను ఏర్పాటు చేసుకున్నారు. సగటున ఆంధ్రా ఉద్యోగులకు 412 చ.అ. దక్కితే తెలంగాణ ఉద్యోగులకు కేవలం 165 చ.అ.లు కేటాయించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఉన్నత విద్యపై ఆంధ్రా పెత్తనం

-టీఎస్‌సీహెచ్‌ఈ ఏర్పాటైనా పెత్తనమంతా ఏపీసీహెచ్‌ఈదే
-తెలంగాణ రాష్ట్ర ఫైల్స్ కూడా ఆంధ్రా అధికారుల వద్దకే

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాటైనప్పటికీ ఉన్నత విద్యలో పెత్తనమంతా ఆంధ్రా విద్యా మండలి చేతుల్లోనే కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఫైళ్లు కూడా ఆంధ్రా అధికారులే చూస్తున్నారు. తెలంగాణ అధికారులకు ఒక్క ఫైల్ కూడా పంపడం లేదని సమాచారం. దీంతో తెలంగాణ విద్యా మండలి చైర్మన్, అధికారులు, సిబ్బంది, అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీఎస్‌సీహెచ్‌ఈకి అధికారులను నియమించినా అధికారాలు మాత్రం కట్టబెట్టలేదంటున్నారు. విద్యా మండలి అధికారులు రోజూ సందర్శకుల మాదిరిగా టీఎస్‌సీహెచ్‌ఈకి వచ్చిపోతున్నారు. కనీసం చాయ్, బిస్కెట్లకు కూడా తెలంగాణ అధికారులకు డబ్బుల్లేని దుస్థితి ఏర్పడిందని, తెలంగాణ విద్యా మండలికి కావాల్సిన ప్రతి పైసా తమ జేబు నుంచే ఖర్చు చేస్తున్నామని అధికారులు వాపోతున్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలిలో 52:48 నిష్పత్తి ప్రకారం ఆస్తులు, నిధులు పంచుకోవాల్సి ఉంది. కాని ఈ విషయంలో ఆంధ్రా సర్కారు ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో కూడా తమ పెత్తనం చెలాయించాలని ఆంధ్రా సర్కారు ఆదేశాల మేరకు మండలి విభజన ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.


ఆస్తులపై తప్పుడు లెక్కలు..!ఏపీ ఉన్నతవిద్యా మండలికి దాదాపు రూ.180 కోట్ల వరకు నిధులు ఉన్నాయని తెలిసింది. వీటిలో బ్యాంకు బ్యాలెన్స్‌తో పాటు పలు బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. బాండ్ల రూపంలో కూడా అనేక నిధులు ఉన్నట్లు తెలిసింది. ఏయే బ్యాంకులలోఎన్నెన్ని బాండ్లు, నిధులున్నాయనే అంశంపైనా ఆంధ్రా అధికారులు తప్పుడు లెక్కలు చూపించే పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిధుల స్వాహా కోసమే విభజన ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారాలు, ఆస్తుల పంపకానికి అనుమతివ్వాలని టీఎస్‌సీహెచ్‌ఈ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యా శాఖ కార్యదర్శులు సమావేశం కావాలి. మండలి విభజన గురించి కూలంకషంగా చర్చించి విభజన ప్రక్రియ ముగించాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో పొందుపరిచిన ఉన్నత విద్యా మండలి, ఇంటర్మీడియట్ బోర్డును వీలైనంత త్వరగా విభజించాలని తెలంగాణ విద్యావేత్తలు రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యకుపై నిర్ణయాలలో టీఎస్‌సీహెచ్‌ఈ పాత్ర ఉండాలే తప్ప ఆంధ్ర విద్యామండలి ప్రమేయం ఉండకూడదని పేర్కొంటున్నారు. ఆంధ్ర అధికారులను కట్టడి చేయాలంటే విద్యా మండలి విభజనను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నేత పీ మధుసూధన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శికి వారం క్రితమే లేఖ రాశామని టీఎస్‌పీహెచ్‌ఈ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, ఆగస్టు 18, 2014

మెట్రో అలైన్‌మెంట్ మార్పు ఖాయం!

- పబ్బులు, క్లబ్బుల పని పడతాం
- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం కేసీఆర్

UPPAL-DEPTO
హైదరాబాద్ నగరంలో చేపట్టిన మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రస్తుత అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కోఠి వద్ద మెట్రోరైల్ మార్గాన్ని సుల్తాన్‌బజార్ మీదుగా కాకుండా, ఉమెన్స్ కాలేజ్ వెనుక నుంచి చేపట్టాలని సూచించామన్నారు. ఇక అసెంబ్లీ ముందునుంచి కాకుండా వెనుకవైపు నుంచి రైల్‌లైన్ నిర్మించాలని మెట్రోరైల్ అధికారులను ఆదేశించినట్లు కేసిఆర్ తెలిపారు. హైదరాబాద్‌తోపాటు నగర శివార్లలో పేకాట క్లబ్బులు, పబ్బులను క్రమంగా నిరోధిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను రెండుగా విభజించాలనే అంశంపై న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ, ముంబై తరహాలో కార్పొరేషన్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించామని సీఎం చెప్పారు. రెండు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనలో కూడా పెద్దగా వివాదాలు రావన్నారు. కేవలం వందల సంఖ్యలో ఉద్యోగులు తెలంగాణవారు ఆంధ్రాకు, ఆంధ్రావారు తెలంగాణకు కేటాయిస్తే రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు సూపర్ న్యూమరీ పోస్టులు కల్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం తెలిపారు.
అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్నారు. గురుకుల్ ట్రస్టు భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొనగలరా? అని కేసీఆర్ ప్రశ్నించారు. పైగా భూముల్లో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన అక్రమాలున్నాయని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు వైపులా బస్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలాలి, వట్టి నాగులపల్లి వద్ద మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రజలకు మెరుగైన రవాణ వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

"సయోధ్యతో ముందుకు" -కేసీఆర్

-సుహృద్భావ వాతావరణంలో ఇరువురు సీఎంల చర్చలు
-తెలంగాణకు ఈ భేటీ శుభపరిణామం.. ఇరు రాష్ర్టాలు కలిసిసాగితేనే అభివృద్ధి
-ఏదైనా అంశముంటే ఇద్దరం కలిసి ఢిల్లీపై ఒత్తిడితెస్తం: కేసీఆర్
- భవనాల కేటాయింపు, ఉద్యోగుల పంపిణీ, అధికారుల నియామకాలపై అవగాహన
- గవర్నర్‌కు ఒక్క అధికారం కూడా అదనంగా లేదు
- విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు

గవర్నర్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తనకు మధ్య శాసనసభా భవనాల కేటాయింపు, ఉద్యోగుల పంపిణీ, అధికారుల నియామకాలపై ప్రధానంగా చర్చ జరిగిందని తెలిపారు. ఈ మూడు అంశాలపై ఇరువురి మధ్య సయోధ్య కుదిరిందన్నారు. గవర్నర్ నరసింహన్‌తో భేటీ అనంతరం ఆదివారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
kcr-babuతెలుగు ప్రజలు కలిసి మెలిసి ఉండాలి, రెండు రాష్ర్టాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలన్నదే తన అభిమతమని గవర్నర్ సమక్షంలో చెప్పినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. చిన్న చిన్న విషయాల్లో కలహించుకుంటే చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుందని భావించి తానే ఒక అడుగు ముందుకువేసి చర్చలకు సంసిద్ధత వ్యక్తంచేశానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య సమస్యలుంటే ఇద్దరం కలిసి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళితే సమస్యల పరిష్కారం సులువవుతుందని చంద్రబాబు నాయుడుకు సూచించానని కేసీఆర్ చెప్పారు. రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత చిన్న చిన్న విషయాల్లో వివాదాలకు పోవడం మంచికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీలో తెలంగాణ కార్యదర్శి కూర్చున్న కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కావాలని అడిగారని, అది వారికి అనువుగా ఉంటుందని ఆంధ్ర అసెంబ్లీ కార్యదర్శికి కేటాయించేందుకు అంగీకరించామని, మరో కార్యాలయంలో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ కూర్చుంటారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రెండు రోజులు క్లాష్ వచ్చిందని, ఏపీవారిని 7వతేదీ వరకు కుదించుకోవాలని కోరామని, అందుకు వారు అంగీకరించినట్లు తెలిపారు. శాసనసభ భవనాలను రెండు రాష్ర్టాలకు కేటాయించే విషయంలో వివాదాలు లేకుండా పరిష్కరించుకున్నామన్నారు. ఉద్యోగుల పంపిణీ విషయంలో కూడా కమలనాథన్ కమిటీ, ప్రత్యుష్‌సిన్హా కమిటీలపై ఆధారపడే కంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు కూర్చొని నిబంధనల ప్రకారం పంపిణీ చేసుకుంటే బాగుంటుందనే ఒప్పందానికి వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు.

మొత్తం 67 వేల స్టేట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయని, ఇందులో 22 వేలు ఖాళీలు ఉన్నాయని ఆయన చెప్పారు. పంపిణీ చేసుకోవాల్సింది 45 వేలేనని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో పరిష్కారం కాని విషయాలుంటే ముఖ్యమంత్రుల వద్దకు తీసుకురావాలని రెండు రాష్ట్రాల సీఎస్‌లకు సూచించామని చెప్పారు. తెలంగాణలో ఉన్న నాక్, నిథమ్ వంటి సంస్థలకు విభజన బిల్లులోని నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వమే డైరెక్టర్లను నియమిస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్లను నియమించే అధికారంలేదని, ఇందుకు చంద్రబాబు అంగీకరించినట్లు చంద్రశేఖర్ రావు తెలిపారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారిని నియమించాలనుకుంటే జాయింట్ డైరెక్టర్‌ను మాత్రమే నియమించాలని, ఒకే స్థాయి అధికారులను రెండు ప్రభుత్వాలు నియమించరాదని చర్చల్లో అంగీకారం కుదిరినట్లు కేసీఆర్ చెప్పారు.

అఖిల భారత సర్వీసు అధికారులను ప్రత్యూష్ సిన్హా కమిటీ విభజన ప్రకారం తెలంగాణ సీఎస్, డీజీపీలు ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే వారిని తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగేలా ఎన్‌ఓసీ ఇవ్వాలని కూడా అహ్లాదపూర్వక వాతావరణంలో చంద్రబాబు నాయుడును అడిగానని , అందుకు ఆయన నవ్వుతూ అంగీకరించారని చంద్రశేఖర్ రావు తెలిపారు. రెండు రాష్ర్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఇంకా రెండు, మూడు సార్లు కూడా చర్చలు జరుతామని తెలిపారు. తెలంగాణ రాష్ర్టానికి ఎగుమతులు, దిగుమతుల కోసంఒక పోర్టు కావల్సి వస్తుందని, అందుకు తెలంగాణకు దగ్గర ఉన్న బందర్ పోర్టును కేటాయించాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని, అందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏ అంశమొచ్చినా కలిసి, కూర్చుని మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నం. ఏదైనా అంశం వస్తే ఇద్దరం కలిసి ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తేవాలని అనుకున్నం.

ఇది శుభ పరిణామం. రెండు తెలుగు రాష్ర్టాలు విడిపోయినా మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నం. అని కేసీఆర్ చెప్పారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న గవర్నర్ల కంటే తెలంగాణ గవర్నర్‌కు ఒక్క అధికారం కూడా ఎక్కువలేదని, ఇందులో ఎవరూ అపోహ పడాల్సిన అవసంలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు ఎలాంటి అధికారాలు ఉండాలో తెలంగాణ గవర్నర్‌కు కూడా అలాంటి అధికారాలే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుంది కానీ, అదనంగా అధికారాలు రుద్దాలని చూస్తే ఒప్పుకోమని సీఎం స్పష్టం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

"సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి" -చంద్రబాబు

- ఇరు రాష్ర్టాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం కుదిరింది
- ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చేనెల ఏడో తేదీ వరకు
- తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చల అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు

రెండు రాష్ర్టాల మధ్య నెలకొన్న సమస్యలు తొలుగుతాయన్న నమ్మకం కలిగిందని.. తెలంగాణ రాష్ట్ర సీఎం కే చంద్రశేఖర్‌రావుతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నేను, కేసీఆర్ ఇద్దరం మిత్రులమే.. శత్రువులం కాదు. గతంలో ఇద్దరం కలిసి పనిచేశాం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్ర ప్రజల కోసం సమగ్ర సర్వే చేస్తున్నది. ఒక రాష్ట్రం చేపట్టే కార్యక్రమాలపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడటం సరికాదు. 
babuఆ రాష్ట్ర ప్రజలకు ఏమి చేయాలనేది.. ఆ ప్రజలు మ్యాన్‌డేట్ ఇచ్చారు. ఆ మేరకు చేస్తారు అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన నివాసంలో మీడియాకు చర్చల సారాంశాన్ని వివరించారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. మొదటిసారి జరిగిన ఈ భేటీలో అధికారులు/ ఉద్యోగుల విభజన, షెడ్యూల్ 9, 10తోపాటు ఈ రెండు షెడ్యూళ్లలో లేని అంశాలపై చర్చ జరిగిందన్నారు.

హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, పీపీఏలపై మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడుతూ.. ఒక్కో ప్రభుత్వం ఒక్కో తీరును అనుసరిస్తుందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తాను కూడా అమలుచేయడం లేదని, కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలనే తీసుకుంటుందని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పక్క రాష్ట్రం తీసుకునే నిర్ణయాలపై మాట్లాడకూడదని అన్నారు. భేటీలో స్కాలర్‌షిప్ అంశం చర్చకు రాలేదని తెలిపారు. కేంద్ర సర్వీస్ అధికారుల విషయం ప్రత్యూష్ కమిటీ చూసుకుంటుందన్నారు. లాటరీలో అధికారులు ఏ రాష్ర్టానికి వస్తే.. ఆ రాష్ర్టానికి పని చేయాలన్నారు.

ఉద్యోగుల సమస్యలపై స్థాయీ చర్చలు: విభజనలో ఆలస్యం అవుతుండటంతో అధికారులు పూర్తి స్థాయిలో పని చేయలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల విభజన అంశం కమలాథన్ కమిటీ చూస్తుందని.. ఈ విషయంలో రెండు రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలు సమావేశమై ఎవరికీ అన్యాయం జరుగకుండా సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఇద్దరు సీఎంలు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

రెండు రాష్ర్టాలను కేంద్రం అభివృద్ధి చేయాలి: ఇరు రాష్ర్టాలు అభివృద్ధి చెందేలా కేంద్రం చొరవ తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇదే విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసినట్లు తెలిపారు. రెండు రాష్ర్టాలకు సంబంధించిన అంశాల్లో వివాదాలకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా ముందుకు పోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పుంజుకునేవరకు సహకరించాల్సిన అవసరం ఉందని.. నిధుల విషయంలో పూర్తి సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి రెండున్నర నెలలు అవుతున్నా పాలనపై దృష్టి పెట్టలేదన్నారు. తాను గెస్ట్‌హౌస్ నుంచేపాలన సాగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ఆంధ్రలోని అన్ని పోర్టులు వినియోగించుకోవచ్చు..: హైదరాబాద్‌ను అందరం కలసి అభివృద్ధి చేశామని, 10 ఏళ్ల తరువాత అన్ని హక్కు లు తెలంగాణకే చెందుతాయని చంద్రబాబు అన్నా రు. తెలుగు వారు అంతటా ఉన్నారని, ప్రత్యేక ఉద్యమాల నేపథ్యం లో సెక్షన్ (8)ను తీసుకున్నారని వివరించారు. కేంద్రం తాను చెప్పిన అంశాలకు గైడ్‌లైన్స్ ఇవ్వలేదని.. స్పష్టత లేకపోవడంతో ఇవన్నీ వచ్చాయని అన్నా రు. తమ సమావేశంలో కొన్ని విషయాల్లో లోతుగా చర్చించామని.. మరికొన్ని సమస్యలపై తరువాత చర్చించాలని అనుకున్నామని తెలిపారు. నౌకారవాణా నిమిత్తం బందరుపోర్టు కావాలని కేసీఆర్ కోరారని..

అన్ని పోర్టులు వినియోగించుకోవచ్చునని తెలిపినట్లు చెప్పారు. కేసీఆర్ తనకు కొత్త కాదని చెప్పిన చంద్రబాబు.. రాజకీయాల్లో కొన్నిసార్లు, కొన్ని విధానాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజాప్రయోజనాల రీత్యా ఏది మంచిదో ఆ దిశగా ముందుకెళ్తామని చెప్పారు. మొదటిసారి జరిగిన చర్చల్లో కాన్ఫిడెన్స్ పెరిగిందని, అపోహలు తొలగిపోయాయని అన్నారు. తాను ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలని కోరినట్లు చెప్పారు. కేసీఆర్ తెలుగువాడేనని, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పని చేశారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆంధ్రా అధికారులే ఎక్కువగా ఉన్నారని, వాళ్లు వెళ్లిపోతే ఇబ్బందేనని కేసీఆర్ అన్నట్లు చంద్రబాబు తెలిపారు. 1956 రూల్స్ అమలు చేద్దామన్నా కేసీఆర్ చేయలేరని, ఎవరూ చట్టాలకు అతీతం కాదన్నారు. 8వ తేదీన వినాయక చవితి ఉండడంతో అసెంబ్లీ సమావేశాలను 7వ తేదీకి కుదించుకోవాలని కేసీఆర్ కోరారు. దీంతో తాము సమావేశాలను ఆలోపు ముగించేలా చూడాలని స్పీకర్‌ను కోరాం. తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసుకుంది. ఇలాంటి విషయాల్లో ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి అని చంద్రబాబు అన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, ఆగస్టు 17, 2014

హైదరాబాద్ ఆస్తులన్నీ తెలంగాణవే...!

- కాదంటే ఉద్యమమే: శ్రీనివాస్‌గౌడ్
- స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ: దేవీప్రసాద్‌రావు
- నిపుణుల కమిటీకి తేల్చిచెప్పిన తెలంగాణ ఉద్యోగ సంఘాలు
ఏ రాష్ట్రంలోని ఆస్తులను ఆ రాష్ర్టానికి కేటాయించాలి. ఏపీకి చెందిన 13 జిల్లాల నుంచి అంగుళం జాగ వద్దు. తెలంగాణ పది జిల్లాల నుంచి గజం ఆంధ్రాకు కేటాయించినా సహించబోం అని తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల విభజన అత్యంత గోప్యంగా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నాయి. డీమెర్జర్ కాపీలను సంఘాలకు అందించాలని డిమాండ్ చేశాయి.
devi-prasad
తమ మనోగతానికి విరుద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థల విభజన చేపడితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించాయి. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శనివారం హైదరాబాద్‌లోని పరిశ్రమల భవన్‌లో ప్రభుత్వ రంగ సంస్థల విభజన నిపుణుల కమిటీని కలిశారు. ఈ సందర్భంగా టీజీవో వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. నిపుణుల కమిటీ వ్యవహారం తెలంగాణకు అనుకూలంగా లేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో 1956కు ముందున్న ఆస్తులన్నీ తెలంగాణవేనని స్పష్టం చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ మాట్లాడుతూ.. చట్టంలో 9, 10 షెడ్యూల్‌లో పొందుపర్చిన ప్రభుత్వ రంగ సంస్థల విభజనను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ ఎన్ శివాజీ మాట్లాడుతూ.. విభజన లోపభూయిష్టంగా ఉందని, ఆఖరికి హైదరాబాద్‌లోని ఆస్తులను కూడా 58 : 42 నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

విభజనపై భేటీ..

రాష్ట్రం విడిపోయినా ప్రభుత్వ రంగ సంస్థలను విభజించకుండా కాలయాపన చేస్తుండడంపై నాయకులు కమిటీ చైర్‌పర్సన్ షీలాబేడీని ప్రశ్నించగా.. అంతా చట్ట ప్రకారం చేస్తామంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఇదే విషయమై కమిటీలో తెలంగాణకు చెందిన అధికారి ఏకే గోయల్‌ను టీ మీడియా అడిగినప్పుడు విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చిందని చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

అక్రమార్కులకు గుండెదడ...!

- బినామీ పేర్లతో రెండో ఇల్లు..ప్రభుత్వ ఉద్యోగులకూ ఇండ్లు
- ఇందిరమ్మ ఇండ్ల విచారణలో బయటపడుతున్న నకిలీలు
cid
ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో నకిలీల భరతం పట్టేందుకు రంగంలోకి దిగిన సీఐడీ విచారణతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణలో రోజుకో చోట కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన మహాముత్తారం మండలం పెగడపల్లిలో శనివారం సీఐడీ డీఎస్పీ ఎం మహేందర్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. పెగడపల్లి పంచాయతీ పరిధిలోని పెగడపల్లి, ప్రేంనగర్, ఆంజనేయపల్లి, మామిడిగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో మొదటి విడతగా 400 ఇండ్లు మంజూరయ్యాయి. 
55 ఇండ్లు అనర్హులకు కేటాయించినట్లు థర్డ్‌పార్టీ విచారణలో తేలింది. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి అక్రమఇండ్లపై గ్రామంలో ఇంటింటా తిరుగుతూ విచారణ చేపట్టారు. చాలామంది గ్రామంలో నివసించడం లేదని ఉద్యోగరీత్యా కొందరు, మరికొందరు బినామీ పేర్లు సృష్టించి గృహాలు మంజూరు చేసుకున్నట్లు గుర్తించారు. 30 మంది వరకు ఉద్యోగులు, మిగతావాళ్లు బినామీలు ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని సీఐడీ డీఎస్పీ మహేందర్ హెచ్చరించారు. మంథని, హుజురాబాద్ నియోజకవర్గాల్లో అత్యధిక అక్రమాలు జరిగాయని తేలడంతో అక్కడే ముందుగా విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.

హౌసింగ్ అధికారులపై సీఐడీ ఆగ్రహం
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలపై సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. శనివారం గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో హౌసింగ్ అధికారులను విచారించారు. ఇండ్ల మంజూరు ఎలా చేశారని డీఈ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులపై ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని డీఎస్పీ బాలూజాదవ్, లిఖితపూర్వక ఆధారాలు, రికార్డులు ఇవ్వాలని సూచించారు. గడువుకోరటంతో డీఈపై మండిపడ్డారు. 2007-08లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ఏర్పాటైన ఎంహెచ్‌వో కమిటీలో ఎంపీడీవో, తహసీల్దార్లతో పాటు సర్పంచ్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. అప్పట్లో పనిచేసిన అధికారులందరినీ విచారిస్తామని, పేర్లు, సెల్ నెంబర్ల జాబితా ఇవ్వాలనిఆదేశించారు. అక్రమాల్లో బాధ్యులైన అధికారులు,ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు, మధ్యవర్తులు, బినామీ కాంట్రాక్టర్లపైనా కఠిన చర్యలు ఉంటాయని సీఐడీ డీఎస్పీ బాలూజాదవ్ స్పష్టంచేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

అక్రమ కాలేజీలపై కొరడా...!


- సగం ఇంజినీరింగ్ కళాశాలలకు మంగళం
- అక్రమాలను బయటపెట్టిన టాస్క్‌ఫోర్స్ నివేదికలు
- ప్రమాణాలకే పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం
- నిబంధనలు పాటించని కళాశాలల్లో ప్రవేశాలు లేనట్లే
- తెలంగాణలో అందుబాటులో 141 ఇంజినీరింగ్, 61 ఫార్మసీ కాలేజీలు
- రెండు రాష్ర్టాలలో కలిపి 460 ఇంజినీరింగ్, 172 ఫార్మసీ కాలేజీలు 
- నేటి నుంచే వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం


రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తెలంగాణ పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్న రాష్ట్రసర్కారు సాంకేతిక విద్యలో ప్రమాణాలకే పెద్దపీట వేయాలని ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నది. అందుకే కోళ్లఫారాలలో కొనసాగుతున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలకు నడుం బిగించింది. ఇక ఆ కళాశాలలు మూతపడే అవకాశాలున్నాయి.
ఇటీవల జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీల తనిఖీలలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అసలు రంగు బయటపడింది. కళాశాలలు ఏఐసీటీఈ ప్రమాణాలు కచ్చితంగా పాటించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల ప్రకారం టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తనిఖీలు పూర్తి చేశాయి. కమిటీల నివేదిక ప్రకారం.. ప్రస్తుతం జేఎన్టీయూ, హైదరాబాద్ పరిధిలో తెలంగాణలో కొనసాగుతున్న 315 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కేవలం 141 కాలేజీలకు మాత్రమే యూనివర్సిటీ గుర్తింపు ఉందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వర్సిటీ అనుమతి ఉన్న కాలేజీలను మాత్రమే ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో చేర్చుతామని ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంపు తెలంగాణ, సీమాంధ్ర అధికారులు డాక్టర్ రఘునాథ్, శ్రీనివాస్ పేర్కొన్నారు.


మిగిలిన 174 కాలేజీలను వెబ్‌కౌన్సెలింగ్ జాబితాలో చేర్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనుమతులు పొందని 174 కాలేజీలు కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏర్పాటైనవేనని, వాటిలో పిల్లలకు నాణ్యమైన విద్య అందక వారు ఇంజినీర్లుగా పనికిరాకుండా పోతారని కమిటీలు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మరో 61 ఫార్మసీ కాలేజీలకు అనుమతులున్నాయి. జేఎన్‌టీయూ అధికారుల వ్యాఖ్యలను బట్టి త్వరలో జరుగనున్న రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో కూడా ఈ 174 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది.

ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్...ఆదివారం ఉదయం దాదాపు 9 గంటల నుంచి ప్రారంభం కానున్న తొలివిడత వెబ్‌కౌన్సెలింగ్‌లో



తెలంగాణ, సీమాంధ్రకు కలిపి 460 ఇంజినీరింగ్ కాలేజీలు, 172 ఫార్మసీ కాలేజీలు అందుబాటులో ఉంటాయి. రెండు రాష్ర్టాల్లో కలిపి మొత్తం 2,53,964 సీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మాత్రం 1,84,575 సీట్లకు బదులుగా కేవలం 85,455 సీట్లను మాత్రమే చేర్చుతామని కౌన్సెలింగ్ క్యాంపు అధికారులు తెలిపారు.

18,564 ఫార్మసీ సీట్లలో కేవలం 10,910 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ విధానంలో సీమాంధ్రకు చెందిన ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలు కూడా ఉన్నాయి. ఇవికాక ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలలో కలిపి ఇంజినీరింగ్‌లో 7,184, ఫార్మసీలో 600 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, ఆగస్టు 15, 2014

అనారోగ్యశ్రీకి చికిత్స కావాలి!

-సదుపాయాల కల్పనే సరైన మందు
-జనంలో నమ్మకం పెంచాలన్న నిపుణులు
-కొద్దిపాటి నిధులతో ఏడు వైద్య కళాశాలలు
-ఇబ్బందులు తీర్చితే ప్రైవేటుకు దీటుగా సేవలు
-ఉదాహరణగా నిలిచిన కరీంనగర్
ఒకనాడు కార్పొరేట్ ఆస్పత్రులు లేవు. స్థానిక వైద్యులు, లేదంటే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులే మొత్తం ప్రజారోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రభుత్వాస్పత్రుల్లోనే చికిత్స చేయించుకునేవారు. కానీ ఈ రోజు పరిస్థితివేరు. ఒకప్పుడు అందరికీ వైద్యం అందించిన సర్కారీ దవాఖానల్లో ఇప్పుడు వైద్యం అందుబాటులో లేకుండాపోయింది! కనీస వసతులు మృగ్యమయ్యాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోనీ ప్రైవేటు వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులకంటే గొప్పా? అంటే అదేమీకాదు! కేవలం మౌలిక వసతులు, ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రభుత్వాస్పత్రులు కునారిల్లుతున్నాయి. తగినన్ని ఆస్పత్రులు, వాటిలో అవసరమైన వసతులు కల్పిస్తే ప్రజల్లో ప్రజావైద్యం మీద నమ్మకం పునరుద్ధరించవచ్చు. ఇది అసాధ్యం కూడా కాదు. కరీంనగర్‌లో స్మితా సబర్వాల్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఆస్పత్రుల్లో వసతులపై దృష్టి పెట్టి గణనీయ ప్రగతి సాధించారు. జిల్లాలో ప్రతి కాన్పునూ ప్రభుత్వాస్పత్రిలోనే చేయించి రికార్డు సాధించారు. కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించాలనేది ఆరోగ్యరంగ నిపుణుల సూచన!
ఆరోగ్యశ్రీ విషయం ఎలా ఉన్నా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బాగా విస్తరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రభుత్వరంగంలో మెరుగైన వైద్యం అందడం లేదనే కారణంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యానికి లక్షలు పోస్తూ అప్పులపాలవుతున్నారు. కొన్ని రకాల జబ్బులు వచ్చినపుడు కుటుంబాల ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై ధీమా లేకపోవడంతోపాటు అన్ని రకాల వైద్య సేవలు సర్కారీ దవాఖానల్లో లేకపోవడం కూడా జనం ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టటానికి మరో కారణం. ఫలితంగా కార్పొరేట్ ఆస్పత్రులు కోట్ల రూపాయలు ప్రజలనుంచి పిండుకుంటున్నాయి. పేద మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయి వారి జీవితాలు దశాబ్దాలు వెనక్కి పోతున్నాయి.

stethascopఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ పథకానికి జనం ఆకర్షితులయ్యారు. ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతున్నదన్న భావన వారిలో నెలకొంది. ఇదే కారణంతో అనేక మంది అర్హత లేకపోయినా తెల్ల రేషన్ కార్డులకు ఎగబడ్డారు కూడా. అయితే.. చాలా తక్కువ మందికి.. తక్కువ వ్యాధులకు మాత్రమే పనికి వచ్చే ఒక పథకం పేరుతో యావత్ రాష్ట్రానికి, సకల సమస్యలకు పరిష్కారం చూపే ప్రభుత్వ వైద్య రంగాన్ని బలి చేశారన్నది మాత్రం వాస్తవం. ఆరోగ్యశ్రీ పథకానికి ఏటా వెచ్చించే మొత్తంలో కొంత భాగాన్ని వినియోగిస్తే జిల్లాకో గొప్ప ఆస్పత్రి కట్టి.. పేద ప్రజలందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంది.
రూ.500 కోట్లు వెచ్చిస్తే ఏడు వైద్యకళాశాలలు...

తెలంగాణలో ఇపుడు కేవలం ఐదు వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వైద్యకళాశాలలు విస్తరించాలన్న జ్ఞానం గత ఉమ్మడి రాష్ట్ర పాలకులకు లేక పోయింది. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో, ఎంజీఎం మెడికల్ కాలేజీ వరంగల్‌లో, ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్‌లో, రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్‌లో ఉన్నాయి. కాగా కరీంనగర్ జిల్లా ఆస్పత్రి పడకల సామర్థ్యం ఇప్పటికే 350గా ఉంది. కేవలం 50 పడకలు పెంచితే దీనిని మెడికల్ కాలేజీ ఆస్పత్రిగా మార్చవచ్చు. అలాగే మహబూబ్‌నగర్, కింగ్‌కోఠి, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీ ఆస్పత్రులుగా మార్చే వీలుంది.

ఒక పడక ఏర్పాటుకు సుమారు రూ.12 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన 50 పడకలకు రూ.6 కోట్లు అవసరం. వైద్య కళాశాల ఆస్పత్రిలో 15 శాతం పడకలు ఐసీయూకే కేటాయిస్తారు. ఒక ఐసీయూకు సుమారు రూ.25 లక్షలు అవుతుంది. 300 పడకల్లో 15 శాతం అంటే 45 పడకలు ఐసీయూకోసం కేటాయిస్తే, దీనికయ్యే ఖర్చు రూ.11.25 కోట్లు. ఒక్కో ఆస్పత్రికి వైద్య పరికరాల కోసం సుమారు రూ.30 కోట్లు, మెడికల్ కాలేజీ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు, ఆధునీకరణ కోసం రూ.5 కోట్లు ఖర్చవుతాయని అంచనా. 250 పడకల ఆస్పత్రిని 300 పడకల వైద్య కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడానికి అయ్యేఖర్చు రూ.62 కోట్లు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పడకలున్నాయి.

అందుకని పడకలకయ్యే ఖర్చు మినహాయిస్తే మిగతా వాటికయ్యే ఖర్చు రూ.56 కోట్లు. సంగారెడ్డి, కరీంనగర్ జిల్లా, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రులను వైద్యకళాశాలలు మార్చడానికి అయ్యే ఖర్చు రూ. 24.8 కోట్లు. 200 పకడలున్న తాండూరు, కింగ్‌కోఠీ ఆస్పత్రులను 300 పడకలుగా అప్‌గ్రేడ్ చేయడానికి అయ్యే ఖర్చు రూ.136.50 కోట్లు. కరీంనగర్ జిల్లా వైద్య కళాశాలకయ్యే ఖర్చుతో కలిపితే మొత్తం రూ.440.50 కోట్లు. అంటే కళాశాలల అనుమతులకోసం అయ్యే ఖర్చుతో కలుపుకుని రూ.500 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో 7 వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పాటు చేయవచ్చు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీకి చేసిన కేటాయింపులు రూ.950 కోట్లు. అంటే అంతకు తక్కువ మొత్తంతోనే శాశ్వతంగా వైద్య సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉన్నదన్నమాట. సాధారణంగా ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి 500 పడకలను పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేస్తుంది.

పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రశంసలు ఏ స్థాయిలో ఉన్నాయో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అసలు ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దుచేయాలని గట్టిగా వాదిస్తున్నవారు కూడా ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని దశలవారీగా రద్దుచేయాలి. అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన నిధులతో ఉచితంగా సమర్థవంతమైన వైద్యసేవలు అందించాలి అని ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ తన పుస్తకం యాన్ అజెండా ఫర్ ది నేషన్ పుస్తకంలో సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ఇన్స్యురెన్స్ పథకం ప్రాథమిక ఆరోగ్యంపై కాకుండా నెట్‌వర్క్ ఆస్పత్రులపై దృష్టిపెట్టింది. దీనివల్ల వాటికే లాభం చేకూరుతుంది. ఫలితంగా ప్రాథమిక స్థాయిలో చికిత్స, నివారణ, ప్రమోషన్ సేవలపై దృష్టి ఉండదు. దీర్ఘకాలంలో ఆరోగ్యం మెరుగుదల ఉండదు. సంప్రదాయ బీమా పథకాలు ఆరోగ్యంతో పోలిస్తే తక్కువ ఫలితాలనిస్తున్నాయి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతున్నది అని ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసిన హైలెవల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ రిపోర్ట్ ఆన్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

అయితే ఇప్పటికిప్పుడు ఆరోగ్యశ్రీ చికిత్సలను ఆపేయలేం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత కూడా ఉంది. ఇప్పటి నుంచి స్పెషలిస్టులను తయారు చేసుకుంటే వీళ్లు అందుబాటులోకి వచ్చే సరికి మూడు, నాలుగేళ్లుపడుతుంది. అందుకని ఇప్పుడు పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీలు, మెడికల్ కాలేజీలను నడపాలి. దీంతో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుతుంది. ఇదే క్రమంలో ప్రభుత్వ స్పెషలిస్టులను ఇప్పటి నుంచి తయారు చేస్తే మూడేళ్లుపడుతుంది. వెంటనే ఆరోగ్యశ్రీని తీసేయడానికి వీలుకాదు. ప్రైవేటు భాగస్వామ్యంతో నెమ్మదిగా ప్రభుత్వ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి.

సూక్ష్మస్థాయినుంచి పరిశీలించాలి..

తెలంగాణ ప్రభుత్వమైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ వ్యవస్థను సూక్ష్మస్థాయి నుంచి సమీక్షించాలని నిపుణులు కోరుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ పథకాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమీక్ష చేయాలని చెబుతున్నారు. ఏ ప్రభుత్వమైనా అందరికీ సమగ్రమైన వైద్యసేవలు అందించినప్పుడే ప్రజల మెప్పుపొందే అవకాశముంది. ప్రజల సొమ్ముతో ప్రైవేటు ఆస్పత్రులద్వారా కల్పించే వైద్యసేవలను తక్కువ ఖర్చుతో ఆయా ప్రాంతంలో ఉండే వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అందిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు 30 పడకల ఆస్పత్రులను 100 పడకలకు పెంచి, జిల్లాకు ఒక వైద్యకళాశాల ఏర్పాటు చేసి, అన్ని మౌలిక వసతులు సమకూరిస్తే అందరికీ ఉచితంగా వైద్యం అందుతుందని, దీనివల్ల వైద్యవ్యవస్థలో ఇంతవరకు ఉన్న అసమతుల్యత పోయి సమతుల్యం నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్ని మౌలిక వసతులు ఉంటే వైద్యులు కూడా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారని అంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

67 ఏండ్ల పాపాలను 67 రోజుల్లో కడుగలేం!

-విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి
-కేసీఆర్‌పై పొన్నాల, జానా విమర్శలు పీసీసీ కుర్చీకోసమే
-అధ్యక్షుడిని ఎన్నుకోలేని నిస్సహాయస్థితిలో టీటీడీపీ
-విపక్షాలపై విరుచుకుపడిన మంత్రి హరీశ్‌రావు
ఈ అరవయ్యేడు ఏండ్లు అధికారంలో ఉన్నది మీరే. ఇన్నేళ్లలో మీరు చేయలేని అభివృద్ధిని 67 రోజుల్లో చేయాలని పసిగుడ్డులాంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. తెలంగాణకు మీరు చేసిన అన్యాయాలు, ఇంతకాలం చేసిన పొరపాట్లు సవరించడం అంత సులువైన పనేనా? ఇంతకాలం మీరు చేసిన పాపాలను కడగడం 67 రోజుల్లో సాధ్యమవుతుందా? అని రాష్ట్ర నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు కాంగ్రెస్, టీడీపీ నేతలపై తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం కొద్దిసమయంలోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. మంత్రిమండలిలో ఏకంగా 40కి పైగా అంశాలు ఆమోదిస్తే.. వాటిల్లో పది అంశాల అమలు మొదలైందని తెలిపారు. అసలు ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతికత లేదని స్పష్టం చేశారు. విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
harish
తెలంగాణలో నాలుగేండ్లుగా రైతులు నష్టపోతే వాళ్లకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పించడం చేతకాలేదు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అనంతపురంలో కరువు వస్తే రైతులకు పరిహారం ఇచ్చారు. కానీ తెలంగాణకు నయాపైసా ఇవ్వకుంటే మేమే వాళ్ల చాంబర్ల ఎదుట ధర్నా చేశాం. కానీ అధికారంలో ఉన్న జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కనీసం నోరు తెరచి అడిగారా? ఆ రోజు మీకు చేతగాక ఇప్పించకపోతే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు హామీ ఇవ్వకున్నా రూ.405 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు. ఇది కేసీఆర్ చేసిన తప్పా? పీసీసీ కుర్చీని కాపాడుకునేందుకు పొన్నాల, దానిని దక్కించుకోవాలని జానారెడ్డి పోటీపడి మరీ ఈ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

అసలు మీరు గత ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని హరీశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అతి తక్కువగా నల్లగొండ జిల్లాలో కేవలం 3,791 ఎకరాల భూమిని మాత్రమే దళితులకు పంపిణీ చేశారు. ఇన్నేళ్లు ఆ జిల్లాను ఏలిన జానారెడ్డి, మోత్కుపల్లి దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాలి...అని మంత్రి హెచ్చరించారు. పంద్రాగస్టున ముఖ్యమంత్రి దళితులకు భూ పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారని, ఇది కేవలం అంకురార్పణ మాత్రమేనని చెప్పారు. ఈ పథకాన్ని రానున్న ఐదేండ్లూ కొనసాగిస్తామన్నారు. ఎర్రకోటపై మోడీ జాతీయ జెండా ఎగురవేస్తే లేని తప్పు.. కేసీఆర్ గోల్కొండ కోటపై ఎగరవేస్తే ఎలా అవుతుందని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. అసలు ఈ విమర్శ చేసే వారిది అజ్ఞానమా? మూర్ఖత్వమా? అని వ్యాఖ్యానించారు. దాశరథి, పీవీ నర్సింహారావు, జయశంకర్, అలీ నవాబ్‌జంగ్ వంటి తెలంగాణ బిడ్డల పుట్టిన రోజులను ఘనంగా నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.

చంద్రబాబు బొమ్మను ఎందుకు తగులబెట్టరు?

తెలంగాణ సీఎం దిష్టిబొమ్మను టీఎన్‌ఎస్‌ఎఫ్ దహనం చేయడం, దానికి టీ టీడీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం ప్రకటించడంపై హరీశ్ నిప్పులు చెరిగారు. ఇంతవరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రకటించని ఏపీ సీఎం చంద్రబాబు బొమ్మలను ఎందుకు తగలబెట్టడంలేదు? ఇది రాజకీయం కాదా? అని నిలదీశారు. ఇప్పటివరకు ఏపీ సీఎం ఆ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడి కుర్చీ కోసం మీలో మీరు కొట్లాడుకుంటుండ్రు. మీకో నాయకుడు లేడు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు. మీరు తెలంగాణపై కుట్ర చేస్తున్న సీమాంధ్రుల పక్షమా? తెలంగాణ ప్రజల పక్షమా? తేల్చుకోండి అన్నారు.

చవకబారు విమర్శలు మానుకోండి

ఎవరూ ఊహించనిరీతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు ఇప్పటికైనా చవకబారు విమర్శలు మానుకోవాని ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి అన్నారు. ఈ సర్వే ద్వారా బీసీ గణన కూడా జరి గి, వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీలకు ఏదో చేస్తానని గొప్పలు చెప్పే చంద్రబాబు.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి, శాసనసభ, శాసనమండలిలో బీసీలను ఎందుకు నాయకుడిగా చేయలేదని ప్రశ్నించారు. సమావేశం లో మరో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ కూడా ఉన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కేసీఆర్ చేసిందీ...చేస్తున్నదీ...చేయబోయేదీ...?

kcr-campగోల్కొండ కోటలో ప్రభుత్వం 68వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించింది. నవతెలంగాణలో తొలిముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర ప్రజలకు స్వాంతత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... భారత జాతీయ ఉద్యమ చరిత్రను స్మరించుకోవాల్సిన సమయమిదన్నారు. 

తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ మకుటాయమానం:తెలంగాణ చరిత్రకు రాజధాని హైదరాబాద్ మకుటాయమానమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నవ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. బ్రిటన్ పార్లమెంటులో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బ్రిటీష్ పాలనలో గాంధీజీని గౌరవిస్తూ విగ్రహం ప్రతిష్ఠించడం గర్వకారణం. శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కళా నైపుణ్యానికి ప్రతీక గోల్కొండ కోట. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్ర, వైడూర్యాల వ్యాపార కేంద్రం ఈ గోల్కొండ కోట అని కొనియాడారు.

ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన అన్ని హామీలను పటిష్టంగా అమలు పరిచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గోల్కొండ కోట నుంచే దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ ఎర్రజొన్న రైతులు తాము తీవ్రంగా నష్టపోయామని విన్నవించారు. వారి విజ్ఞప్తి మేరకు 18 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.

ఆటోల, ట్రాక్టర్ల పన్ను రద్దు చేశాం:ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఆటో పన్నును రద్దు చేశాం. అదేవిధంగా వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీల పన్ను బకాయిలను కూడా రద్దు చేశాం.

క్రీడాకారులకు తగురీతిలో ప్రోత్సాహం:రాష్ట్రంలో క్రీడాకారులను తగు రీతిలో ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒలంపిక్స్, ఆసియన్, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు రూ. 3 లక్షలు. పోటీల్లో స్వర్ణం గెలిస్తే 50 లక్షలు, రజతానికి 25 లక్షలు, కాంస్యానికి 15 లక్షల ప్రోత్సాహం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

12శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి:గిరిజనులకు, ముస్లీంలకు ఇచ్చిన మాటకోసం 12 శాతం రిజర్వేషన్ల కోసం కమిటీ ఏర్పాటు. ఐదు వందల జనాభా ఉన్న గిరిజనతండాలు, ఆదివాసీ గూడాలను పంచాయతీలుగా మారుస్తాం. అలాగే మైనార్టీల అభివృద్ధికి వెయి కోట్లు. వక్ఫ్ బోర్డుకు జూడిషియల్ అధికారులను కల్పిస్తాం. దళిత క్రైస్తవుల సమస్యలు పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం. చర్చిల నిర్మాణానికి కలెక్టర్ నిబంధన తొలగిస్తాం.

దసరా నుంచి పింఛను పెంచి ఇస్తాం:దసరా, దీపావళి మధ్యకాలంలో వృద్ధులకు, వితంతువులకు రూ. వెయ్యి పింఛను అందించనున్నాం. అదేవిధంగా వికలాంగులకు రూ. 1500 పింఛను ఇస్తాం. గీతకార్మికులకు లబ్ది చేకురే విధంగా దసరా నుంచి నగరంలో కళ్లు దుకాణాలను తెరిపిస్తాం. రైతులకు 18 వేల కోట్ల రుణమాఫీకి ఆర్‌బీఐ సహా ఇతర బ్యాంకులతో చర్చలు. స్థానిక సంస్థలకు అధికారాలు అప్పగించి జవాబుదారీతనం పెంచుతాం.

త్వరలోనే ఉద్యోగాల భర్తీ:పోలీస్ శాఖలో అతితర్వరలోనే 3,600 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పాం. అందుకు అనుగుణంగానే స్పెషల్ ఇంక్రిమెంట్ ను మంజూరుచేశాం. అదేవిధంగా నిరుద్యోగుల కోసం టీఎస్ పీఎస్ ద్వారా అతిత్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

క్రీడాకారులను సన్మానించిన సీఎం కేసీఆర్హైదరాబాద్ : గోల్కొండ కోట వేదికగా కామన్వెల్త్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులను సీఎం కేసీఆర్ సన్మానించారు. సైనా నెహ్వాల్, జ్వాత గుత్తా, పుల్లెల గోపిచంద్, జరీన్, మమతా పూజారి, గురుసాయి దత్, కశ్వప్, పీవీ సింధును శాలువాలతో కేసీఆర్ సత్కరించారు. ఈ సందర్భంగా వారికి నగదు ప్రోత్సహకాలను సీఎం అందించారు.

పూర్ణ, ఆనంద్‌లను సన్మానించిన కేసీఆర్హైదరాబాద్ : గోల్కొండ కోట వేదికగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దళిత బిడ్డలు పూర్ణ, ఆనంద్‌తో పాటు కోచ్ శేఖర్‌బాబును సీఎం కేసీఆర్ సన్మానించారు. శాలువాలతో సత్కరించి రూ. 25 లక్షల నగదు ప్రోత్సహకాన్ని అందజేశారు. పూర్ణ, ఆనంద్‌ను సీఎం సన్మానించిన వేళ అక్కడ ఉన్న వారంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ఒక్కసారిగా అందరిలో ఉత్సహం పెల్లుబికింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

తెలంగాణ సత్వర సమగ్రాభివృద్ధికోసమే ఈ సమగ్ర కుటుంబ సర్వే...!



బ్లాగు వీక్షకులకు, తెలంగాణ సోదరులకు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


ఏ అభివృద్ధి వ్యూహం రచించాలన్నా, అమలు చేయాలన్నా ఆ సమాజ సూక్ష్మ వివరాలు సమగ్రంగా తెలిసి ఉండటం అవసరం. ఈ అవగాహనతోనే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న రీతిలో సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రజా సంక్షేమపథకాలు అసలైన లబ్ధిదారులకు చేరేందుకు ఈ సర్వే గణాంకాలను ప్రాతిపాదిక చేయనున్నది. ఇందుకని ఈ నెల 19న దాదాపు మూడు లక్షల అరవై తొమ్మిదివేల ప్రభుత్వోద్యోగులను, ప్రైవేటు విద్యాసంస్థల ఉద్యోగులను, మొదటిసారిగా పోలీసులను కూడా సర్వేలో భాగస్వాములను చేస్తున్నది. నాలుగో తరగతి ఉద్యోగులను కూడా ఎన్యూమరేటర్లుగా రంగంలోకి దించుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మారుమూల పల్లెనుంచి పట్నం దాకా ఒకే రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి సకల సన్నాహాలను చేస్తున్నది. 

స్వతంత్ర భారతంలో ఇప్పటికి ఒక్కసారి కూడా జనాభా గణనలో భాగంగా కులాల వారు ఎంత మంది ఉన్నదీ లెక్కలు తీయలేదు. ఇక ఉప కులాల లెక్కింపు లేనే లేదు. గంప గుత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీల గణన ఆధారంగానే రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దీంతో ఆయా కులాలకు, ఉపకులాలకు తగిన ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు అందడం లేదనే వాదనలున్నాయి. సంక్షేమ పథకాలు అందించాలంటే ఎంత మంది పేదలున్నారు, వారి వృత్తులు ఏమిటి? వారి అభివృద్ధికి ఎటువంటి వ్యూహాలు రచించాలె, వాటిని నిర్దేశిత సామాజిక వర్గాలకు ఎట్లా అందించాలే అంశంపై స్పష్టత కొరవడింది.

పేదల కన్నా, తెల్ల కార్డుల సంఖ్య ఎక్కువగా ఉండడం, మరోవైపు ఇంకా తెల్లకార్డులు అందని పేదలు ఉండడం విచిత్రం. కోట్లాది రూపాయల ప్రజా ధనం అర్హులైన పేదలకు అందకుండా ఇటువంటి నకిలీ పేదలకు చేరుతున్నది! సీమాంధ్ర పాలనలో పేదల అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాలను ఆశించి వేల కోట్ల రూపాయలు పలారం మాదిరిగా పంచిపెట్టారనేది ఇప్పుడు బోధపడుతున్నది. ఈ నేపథ్యంలో పేదల అవసరాలు గుర్తించి, వారి అభివృద్ధి కోసం నిధులను పూర్తిగా సద్వినియోగం అయ్యేలా చేయడానికి సమగ్ర సర్వే అవసరమైంది. ఇటువంటి సదుద్దేశంతో, సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం చేయడానికి తోడ్పడాలే తప్ప దీనిపై లేనిపోని అనుమానాలు కలిగించడం తగదు.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలసిన అవసరం ఉన్నది. కొందరు పనిగట్టుకుని ఈ సర్వేను తప్పు పడుతున్నారు. లేనిపోని భయాలను ప్రచారం చేస్తున్నారు. రేషన్లు కార్డులు తొలగించడానికి, సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి ఈ సర్వే చేపట్టినట్టుగా పుకార్లను పుట్టిస్తున్నారు. ఒక ప్రాంత ప్రజలను గుర్తించడానికి ఈ సర్వే చేపట్టినట్టు కూడా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తద్వారా కొన్ని వర్గాలను భయ భ్రాంతులను చేయాలనే కుతంత్రం సాగుతున్నది. మరి కొందరైతే ఒక్క రోజులో ఇది అయ్యే పని కాదని అపశకునాలు పలుకుతున్నారు. వ్యక్తుల ఆదాయ పన్ను, బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, పౌరసత్వం అనేవి కేంద్రం పరిధిలోని అంశాలని, రాష్ట్రం ఆ సమాచారాన్ని సేకరించడం అక్రమమని చెప్పుకొస్తున్నారు. సవివరమైన, వాస్తవ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండటం పట్ల ఎందుకు భయమో వారికే తెలియాలి.

నిజానికి సర్వేలకు ఈ భరతావనిలో సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ప్రజానుకూల పాలన చేయాలనుకున్న పాలకులంతా జనాభా గణనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా మొఘల్ చక్రవర్తి అక్బర్ దేశంలో మొదటిసారి 1581లో జనాభా గణన చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ఆతర్వాత కాలంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ పాలన కాలంలో 1790 ప్రాంతంలో బ్రిటిష్ ఇండియాలో జనాభా గణన ప్రారంభించారు. స్వతంత్ర భారతావనిలో ఎన్నో దఫాలుగా సర్వేలు నిర్వహించినా అన్నింటికీ పునాదిగా ఉన్న గ్రామం, దాని స్వరూప, స్వభావాల వివరాలు సమగ్రంగా ఎప్పుడూ సేకరించలేదు.

ఆయా సందర్భాల్లో ప్రజలనుంచి వచ్చిన డిమాండ్లు, పాలకుల అవసరాల కనుగుణంగానే సర్వేలు నిర్వహించారు. దీంతో భారతీయ సమాజానికి ప్రతిబింబంగా చెప్పుకునే గ్రామానికి సమగ్ర చిత్ర పటం ఎప్పుడూ రూపు కట్టలేదు. కాబట్టే ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసమని ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా అవి అసలు లబ్ధిదారులకు చేరడం లేదు. పేదరికం రూపుమాసి పోవడం లేదు. ఈ అనుభవాల నేపథ్యం నుంచే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేకు రూపకల్పన చేసింది. కుటుంబ సమగ్ర సమాచారం లక్ష్యంగా సర్వే చేపడుతున్నది.

ఈ సర్వేకు నోడల్ సంస్థగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వ్యవహరిస్తున్నది. రెవెన్యూ యంత్రాంగం కీలక భూమిక పోషిస్తున్నది. ఈ సర్వే వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ ,కుల, నివాస, ఆదాయ, జనన ధృవీకరణ పత్రాలకు ఆధారంగా చేస్తున్నది. అలాగే ఈ హౌజ్ హోల్డ్ సర్వే, ఆధార్ కార్డులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో. నెం. 5ను తెచ్చింది. దీన్ని బట్టి ఈ సర్వే వివరాలు ఎంత కీలకమైనవో తెలుస్తున్నది. కాబట్టి కొందరు దుర్బుద్ధితో మాట్లాడే వంకరమాటలకు మోసపోకుండా ఈ సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, ఆగస్టు 14, 2014

ఇది ఎన్డీఏ-2 కాదు.. యూపీఏ-3!

-గత ప్రభుత్వ నిర్ణయాలనే అమలుచేస్తే కొత్త ప్రభుత్వమెందుకు..?
-సొంత పార్టీలో ఉనికి కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
-కిషన్‌రెడ్డి, పొన్నాలపై కేటీఆర్ ఫైర్
యూపీ ఏ ప్రభుత్వం రూపొందించి, ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలనే బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని బీజేపీ నేతలు పేర్కొనడంపై పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్ణయాల నే అమలు చేస్తామంటే కొత్త ప్రభుత్వమెందుకుని ప్రశ్నించారు. ఎన్డీఏ-2, బీజేపీ ప్రభుత్వమని చెప్పుకునే బదులు యూపీఏ-3అని పేరు పెట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. తాజ్‌బంజారాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య చేస్తున్న విమర్శలపై తీవ్రం గా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉనికి ప్రదర్శించుకునేందుకు.. పార్టీ హైకమాండ్ దగ్గర మెప్పు కోసమే పొ న్నాల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 
tarakకొంతమంది రాజకీయ నిరుద్యోగులు, సొంతపార్టీలో ప్రాధాన్యంలేని వారుచేసే విమర్శలను పెద్ద గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో కనీసం 10 మంచి నిర్ణయాలు తీసుకోలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 66రోజుల్లోనే కీలకమైన 43 నిర్ణయాలను తీసుకొని వాటి అమలుకు ప్రయత్నిస్తున్నది...అని మంత్రి తెలిపారు. సర్వేపై ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ప్రభుత్వం నిర్వహించే సర్వేపై ప్రజలకు లేని ఇబ్బంది ప్రతిపక్ష పార్టీ నేతలకు ఎందుకని ప్రశ్నించారు.

హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం కల్పించే విషయం ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉందని, దానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని చెప్తున్న కిషన్‌రెడ్డి.. ఆరోపణలు చేసేముందు ఆ బిల్లును స్పష్టంగా చదవాలని సూచించారు. హైదరాబాద్‌పై ఇతరుల పెత్తనం చెలాయించాలంటూ, పరాధీనం చేయాలంటూ ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు కిషన్‌రెడ్డి లేఖలు రాయడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. 

వెంకయ్యనాయుడు రాసిచ్చిన మాటలు చదివే ముందు అందులో ఏముందో ఒకసారి చూసుకుని చదవాలని సూచించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రూపొందించేటప్పుడే తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలను టీఆర్‌ఎస్ వ్యతిరేకించిందని కేటీఆర్ గుర్తుచేశారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే అంశంపై యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నామని చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!