గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 28, 2014

సీమాంధ్ర సిబ్బందిని సాగనంపండి

 
-నమస్తే తెలంగాణ ఎఫెక్ట్..
-జేఎన్టీయూహెచ్‌లో ఆందోళన
-వీసీని అడ్డుకున్న ఉద్యోగులు, విద్యార్థులు
-విధాన నిర్ణయాలకు కమిటీ ఏర్పాటు
VP-Rameshwararaoసీమాంధ్ర ప్రాంతానికి చెందిన డైరక్టర్లను, సిబ్బందిని పంపేయాలంటూ కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్ వద్ద విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బదిలీల్లో వల్లమాలిన ప్రేమ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనంతో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్, కిందిస్థాయి సిబ్బంది కదం తొక్కారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సిబ్బందిని వెంటనే పంపించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అడ్మినిస్ట్రేటీవ్ భవనం ముందు బైఠాయించారు.

తెలంగాణ కోటాలో పదవులు దక్కించుకున్న జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు స్వస్థలం జగ్గయ్యపేటని, అతనితోపాటు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 12 మంది డైరక్టర్లు, 22 మంది బీవోఎస్‌లు, 20 మంది హెచ్‌ఓడీలను వెంటనే సాగనంపాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీసీ రామేశ్వరరావుకు వర్సిటీ సిబ్బంది, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవల జరిపిన అధ్యాపక నియామకాలను కూడా రద్దు చేసి వెంటనే రీ నోటిఫికేషన్ జారీచేయాలని, అందులో కూడా తండ్రి స్థానికత ఆధారంగా తిరిగి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్‌ను రద్దు చేసే అధికారం తనకు లేదని రామేశ్వరరావు చెప్పడంతో వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఆయనను ఘెరావ్ చేశారు.

దీంతో చేసేదేమీలేక వీసీ రోడ్డుపైనే కూర్చుండిపోయారు. వివిధ విభాగాల డైరక్టర్లు వచ్చి విద్యార్థులు, సిబ్బందిని సముదాయించారు. ఆ తర్వాత తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉన్నతాధికారులు వీసీ చాంబర్‌లో సమావేశమయ్యారు. సీమాంధ్ర సిబ్బందిని పంపించి వేస్తామని, అధ్యాపకుల భర్తీ రీ నోటిఫికేషన్ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతవిద్యాశాఖ మండలి చైర్మన్‌‍లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమావేశమనంతరం వీసీ తెలపడంతో విద్యార్థులు శాంతించారు. యూనివర్సిటీలో విధాన నిర్ణయాలపై పరిశీలనకు తెలంగాణకు చెందిన నలుగురితో వీసీ ఓ కమిటీ వేశారు.

కమిటీ చైర్మన్‌గా టీకేకే రెడ్డి, సభ్యులుగా పరీక్షల విభాగం సంచాలకుడు కూరపాటి ఈశ్వర్‌ప్రసాద్, ఎస్‌ఐటీ డైరక్టర్ గోవర్ధన్, కెమిస్ట్రీ హెచ్‌ఓడీ వెంకటరమణారెడ్డిలను నియమిస్తూ వీసీ రామేశ్వరరావు ఉత్తర్వులు జారీచేశారు. శాశ్వత, తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీతోపాటు బదిలీల ప్రక్రియను, అడ్మినిస్ట్రేటివ్ డైరక్టర్లు, బీవోఎస్ చైర్మన్ల నియామకాలను ఈ కమిటీ పరిశీలించి, ఆమోదించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని వీసీ రామేశ్వరరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ సిబ్బంది, నాన్‌టీచింగ్ సభ్యులు, విద్యార్థి నేతలు తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శుక్రవారం, జూన్ 27, 2014

స్థానికత నిరూపణకై...కటాఫ్...1956...!

-విద్యార్థుల స్థానికతకు ఇదే ప్రమాణం
-పోగొట్టుకున్న చోటే వెతికి పట్టుకుంటున్న తెలంగాణ
- అసలైన తెలంగాణ పిల్లలకే ఫీజులు..
-సూత్రప్రాయంగా నిర్ణయించిన పభుత్వం
- స్థానికతను విద్యార్థులే నిరూపించుకోవాలి..
- వారం రోజుల్లో విధానపరమైన నిర్ణయం
collegeతెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం 1956 అమలులోకి వస్తే.. పూర్వం స్థిరపడిన వారికే ఫీజులు చెల్లిస్తే తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర పిల్లల సంఖ్య భారీగా బట్టబయలయ్యే అవకాశం ఉంది. సీమాంధ్రలో కూడా తెలంగాణ విద్యార్థులు 18 వేలమంది చదువుతున్నారని అధికారులు గుర్తించారు. వీరికి తెలంగాణ ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని ఇప్పటికే ప్రకటించింది. జూలై మొదటివారంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ లోగా ఫీజుల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌పై విధి విధానాలు రూపొందించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. 
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. అవును తెలంగాణ తనను తాను పోగొట్టుకున్న 1956 దగ్గరే తనను వెతుక్కోవాలి. అందుకే విద్యార్థుల స్థానికత నిర్ధ్దారణకు ఆ 1956నే ప్రామాణికంగా నిర్ధ్దారించబోతున్నది. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వంనుంచి తెలంగాణలో నివాసం ఉంటున్న తెలంగాణవాసుల పిల్లలకే ఫీజు పథకం వర్తింపజేయాలని సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోరే విద్యార్థుల తల్లిదండ్రులు, తాతలు తెలంగాణకు చెందినవారని విద్యార్థులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను విద్యార్థులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా కేవలం నిజమైన తెలంగాణ పిల్లలు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి చెందినవారమని నిరూపించుకోగలరు. 1956 తర్వాత వలస వచ్చినవారు, సీమాంధ్రులు తెలంగాణ స్థానికతను నిరూపించుకోలేరు. ఇప్పటి వరకు సీమాంధ్రులు ఉమ్మడి రాష్ట్రంలో దొంగ సర్టిఫికెట్లతో, నకిలీ తెలంగాణ స్థానికతతో చొరబడి తెలంగాణ ఉద్యోగాలు, విద్యావకాశాలు కొల్లగొట్టిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. స్థానికతపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నిజాం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనలపై సవివరంగా చర్చించింది. ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలో పుట్టిన బిడ్డ తాను పుట్టే నాటికి తండ్రి 15 ఏళ్లు తెలంగాణలో నివాసం ఉండాలి. ఇది నిబంధన. ఈ నిబంధనలో కొన్ని మార్పులు చేస్తూ ఆరు దశాబ్దాలుగా తెలంగాణలో నివాసంలో ఉన్న వారికే అనగా 1956కు పూర్వం తెలంగాణలో నివాసం ఉన్న వారికే ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అడ్వకేట్లు, విద్యావేత్తలతో చర్చించి వారం రోజుల్లో ఫీజుల పథకంపై విధానపరమైన నిర్ణయానికి రావాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మన రాష్ట్ర విద్యార్థులు ఆంధ్రాలో చదువుతున్నా ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. సంక్షేమ శాఖ అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణలో సీమాంధ్ర విద్యార్థులు 39 వేల మంది వరకూ చదువుతున్నారు.
అసలైన తెలంగాణ వారికే...ప్రభుత్వ నిర్ణయమే అమలులోకి వస్తే అసలైన తెలంగాణ వాసుల బిడ్డలకే ఫీజుల పథకం వర్తించే అవకాశం దక్కుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో స్థానికత అనే అంశాన్ని భ్రష్టు పట్టించి ఇష్టారాజ్యంగా సీమాంధ్రులు తెలంగాణలో చొరబడ్డారు. బస్‌స్టాండ్‌లో కాలు పెట్టినవాడల్లా స్థానికుడే అనే రీతిలో స్థానికత అంశాన్ని నవ్వులపాలు చేశారు. కేవలం నాలుగు సంవత్సరాలు చదివిన వాడల్లా స్థానికుడినేనంటూ తయారయ్యారు.
అడ్మిషన్లు యధాతథమే..ఆంధ్ర ప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పదేళ్లపాటు ప్రస్తుతం అమలు అవుతున్న అడ్మిషన్ల విధానం కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని గౌరవిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తారు. అయితే విద్యార్థుల ఫీజుల అంశం ఆయా రాష్ర్టాల ఇష్టాన్ని బట్టే ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి తనకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోజాలదు. ఈ నేపథ్యంలో అడ్మిషన్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా, ఏఒక్క తెలంగాణ విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్భంద విద్య అందించేందుకు ఒక అధ్యయన కమిటీ వేయాలని నిర్ణయించింది. కమిటీ అధ్యయన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సమీక్షా విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, కళాశాల విద్యా కమిషనర్ శైలజారామయ్యర్, పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ పాల్గొన్నారు.
సుప్రీం తీర్పుకు పట్టాభిషేకం..రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రజల ప్రాథమిక హక్కులను హరించేందుకు కాదు 1972 అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు చెల్లుతాయని తీర్పు ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానమిది. సరిగ్గా ఈ హక్కునే ఉమ్మడి రాష్ట్రం హరించింది. 1919లో నిజాం ఇచ్చిన స్థానికత ఫర్మానాను కాలరాచింది. పుట్టుక ద్వారా కానీ, నివాసం ద్వారా కానీ 15 ఏళ్లు ఈ నేలతో బంధం ఉన్నవాడికే ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయని ఆ ఫర్మానా శాసించింది. 1950లో అమలులోకి వచ్చిన రాజ్యంగం కూడా భారత భూభాగం, సంస్థానాల్లో ఉన్న చట్టాలు కొనసాగుతాయని హామీ ఇచ్చింది. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా పెద్దమనుషుల ఒప్పందానికి చట్టబద్దత కల్పించింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బొంబాయి రాష్ట్రాలకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తూ 371 ఆర్టికల్‌కు సవరణ చేసింది. ఇవన్నీ తెలంగాణ స్థానికతకు విలువనిచ్చినవే. వీటన్నింటినీ మించి 1972లో అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చిరస్మరణీయం. అయినా సీమాంధ్రులు కుట్రపూరితంగా స్థానికతను నీరుగార్చారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సంపూర్ణం కాకపోవచ్చు గానీ సంస్మరణీయమే. సుప్రీం తీర్పును శిరసావహించడమే.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కబ్జా రాయుళ్ళ దాహానికి చెరువులు కూడా గాయబ్!

-ఒకప్పుడు వెయ్యి చెరువులతో కళ కళలాడిన రాజధాని..
-వ్యవసాయానికి నీరందించిన పట్నం నీటి వనరులు
-మచ్చుకైనా కనిపించని నాటి వైభవం.. ప్రతి చెరువూ కబ్జా ..
-పేరుకే మిగిలిన బతుకమ్మకుంట, నాగమయ్య కుంట..
-పాతాళానికి భూగర్భ జలాలు.. నదీ జలాలే దిక్కు..
-పునర్నిర్మాణంతోనే నగరానికి తప్పనున్న ముప్పు
చార్‌సౌ సాల్ కా షహర్ హైదరాబాద్.. ఒకప్పుడు తాగునీటి కోసం అల్లాడలేదు! అలనాడు భాగ్యనగరం వేయి సరస్సులకు నిలయం. తాగడానికి నీళ్లుకాదు.. పంట పొలాలకు నీళ్లిచ్చిందీ తెలంగాణ గుండెకాయ! హుస్సేన్‌సాగర్‌లో పడవలు తిరిగాయి..కానీ ఇప్పడు నదీంకాలనీ బోటింగ్ స్పాట్‌గా మారింది! ఇప్పటిలా వానొస్తే రోడ్లన్నీ నదులను తలపించలేదు! బండిపై పోతున్న మహిళ ఉన్నట్టుండి మ్యాన్‌హోల్‌లో పడి మతిచెందిన దాఖలాలు ఒకప్పడు లేవు! నాలుగు వందల ఏళ్ల కిందటే నిజాం పాలకులు రాజధానిని పద్ధతి ప్రకారం అభివద్ధి చేశారు. హైదరాబాద్ దినదినాభివద్ధి చెందుతుందన్న ముందుచూపుతో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. కనీస సౌకర్యమైన తాగునీటికి ఇబ్బందు లు రావొద్దనే ఉద్దేశంతో నగరం చుట్టూ సరస్సులు తవ్వించారు.

madhapur
ప్రజల కోసం ఏర్పాటు చేసిన చెరువులు, కుంటలతో మంచి నీటివసతి కల్పించడమే కాకుండా, వ్యవసాయానికి కూడా నీరందించారు. నిజాంకాలంలో నగరం చుట్టూ దాదాపు నాలుగు వేల చెరువులు, కుంటలుండేవి. ఆనాడు నగరంలో ఉన్న వేలాది నీటి వనరులు నేడు పదుల సంఖ్యకు చేరుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఫలితంగానే వానొస్తే వణుకు! లోతట్టు ప్రాంతాలు జలమయం! ఎండాకాలమైతే గింత గాలి రాదు. చెట్టు చేమా మాయమైంది. అభివద్ధి ముసుగులో చెరువులను కబ్జాచేసి కోట్లు కూడబెట్టుకున్న వలస పాలకుల ఉక్కుపాదాల కింద నగరం అస్తిత్వాన్ని కోల్పోయింది. సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో చెరువు లు, కుంటలు పునరుద్ధరిస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్తునా ప్రస్తుతం నాటి చెరువుల ఆనవాళ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు!

గతమెంతో ఘనం

ఉపగ్రహ ఛాయాచిత్రాల సహకారంతో 1996లో పరిశీలించగా రాజధానిలో 1004 చెరువులు, కుంటలు ఉన్నట్లు తేలింది. 2000 సంవత్సరంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 169 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా వరకు ఆక్రమణకు గురైనట్లు తేల్చా రు. నగరం నడిబొడ్డున ఉన్న నాగమయ్య, పటేల్, బతుకమ్మకుంటలు బస్తీలుగా మారాయి. లింగంపల్లి చెరువు సుందరయ్య పార్కుగా మారింది. యూసుఫ్‌గూడ చెరువు కబ్జాకు గురై కాలనీలుగా, కొంత కష్ణకాంత్ పార్కుగా మారింది. ఎల్లారెడ్డిగూడ చెరువుకు ఆనవాళ్లు కూడా లేవు. శివార్లల్లోనూ అదే దుస్థితి. దాదాపు రెండు వేల చెరువులు, కుంటలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

అల్వాల్‌లోని కొత్తచెరువు, చిన్నరాయుని చెరువు, బోయిన చెరువు, సరూర్‌నగర్, సఫిల్‌గూడ, మియాపూర్, కాప్రా చెరువు, నల్లచెరువు, పెద్ద చెరువు, రంగదామిని చెరువు, కూకట్‌పల్లిలోని మైసమ్మచెరువు, అంబర్ చెరువు, పటేల్ చెరువు, గోపిచెరువు, దుర్గం చెరువు.. ఇలా వం దల సంఖ్యలో అక్రమార్కుల కబంధహస్తాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మియాపూర్‌లోని గంగారం చెరువులో సినిమా థియేటర్లే ఏర్పాటయ్యాయన్న ఆరోపణలున్నా యి. కాప్రా చెరువును కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేసుకున్నారు. సమైక్యరాష్ట్రంలో నగరం చుట్టు ఉన్న విలువైన చెరువులు, కుంటలను కబ్జాలు చేసి కబ్జాదారులు కోట్లు గడిస్తే, వాటిని నమ్ముకుని బతికిన రైతులు చిరునామా లేకుండాపోయారు.

పేరుకే కుంటలు..

ఉన్నవన్నీ ఇళ్లే: నగరంలో వందల్లో ఉన్న చెరువులు సగానికిపైగా ఉనికి కోల్పోయాయి.రూపురేఖల్లేకుండా బడా బాబులు రాజకీయ అండదండలతో కబ్జాచేసినా పట్టించుకోవడం లేదనడానికి అధికారుల లెక్కలే నిదర్శనం. హైదరాబాద్ జిల్లా పరిధిలో చెరువులను కబ్జా చేస్తున్నప్పుడు రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తర్వాత సర్వే చేసి అన్యాక్రాంతమయ్యాయంటూ చర్యలకు పూనుకున్నారు. అప్పటికే కబ్జాకోరులు, బడాబాబులు కోర్టుకెక్కి స్టే తెచ్చుకున్నారు. ఆక్రమిత స్థలాలు చెరువు పరిధిలోనిదేనని తెలిసినా కోర్టుకెళ్లి కాలయాపన చేస్తున్నారని రెవెన్యూ యంత్రాం గం అంటోంది. ఇప్పటికైనా అధికారులు ఉదాసీనంగా వ్యవహ రిస్తే కబ్జాకోరుల సొంతమవడం ఖాయం. అన్యాక్రాంతమైన చెరు వు విస్తీర్ణం వందల ఎకరాల్లోనే ఉంటుందని అంచనా. బతుక మ్మకుంట ప్రాంతానికి వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు, చెరువు, కుంట ఏదీ కనిపించదు.

list
ఇప్పుడక్కడ ఉన్నవన్నీ ఇళ్ల్లే. అఫ్జల్‌సాగర్, ఖాదర్‌బాగ్‌కుంట, సూరారం చెరువు, శల్కంచెరువు, ఎర్రకుంట, అంబర్‌చెరువుల పరిస్థితి అంతే! ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న ఈ చెరువులపై ఏళ్ల క్రితమే పెద్దల అండదండలున్న వ్యక్తులు కబ్జాచేశారు. నగరంలో చెరువులు ఉంటేనే భూగర్భ జలాలు సమద్ధిగా లభిస్తాయి. మహానగరంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. సరూర్‌నగర్ చెరువు విస్తీర్ణం 1229.36 ఎకరాలు. దానికి రెండు కిలోమీటర్ల దూరంలోని నిర్మలానగర్‌లో 540 అడుగుల లోతుకు బోరు వేస్తేగానీ తడి కనిపించలేదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. చెరువులను కాపాడుకుంటేనే భవిష్యత్‌లో కనీసం నీళ్లు దొరుకుతాయి. గురుకుల్ ట్రస్ట్ భూముల మాదిరిగానే చెరువు అక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుని తిరిగి సరస్సులను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంది. లేకుంటే బోరుబావులను మరిచిపోవాల్సిందే. కష్ణా, గోదావరి నీటిపైనే నగరం మొత్తం ఆధారపడితే పదిహేనురోజులకోసారి పది బిందెలు కూడా దక్కే పరిస్థితి ఉం డదు. ఐటీఐఆర్ ఏర్పాటుతో వచ్చే పాతికేళ్లలో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోతుంది. ప్రపంచ చిత్ర పటంలో రాష్ట్ర రాజధాని ప్రముఖస్థానాన్ని ఆక్రమిస్తుంది. కానీ ఆ గొప్ప వెంటనే భయంకరమైన నీటికొరత ప్రమాదం పొంచి ఉంది.

అడుగడుగునా కబ్జాలే:

వేల కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన భాగ్యనరగంలో బతుకులకు భరోసా లేకుండా పోయింది. ము మ్మాటికీ చెరువులను కబ్జా చేసిన ఫలితమే ఇది. వర్షమొస్తే కాలు బయట పెట్టలేనిదుస్థితి. ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగొచ్చే వరకు నమ్మకం లేదు. కాస్త వర్షానికే జలమయమయ్యే రోడ్లు, పొంగిపొర్లే నాలాలు. అంతుచిక్కని మ్యాన్‌హోళ్లు.. నగరంలోని చెరువులు, కుంటలు, నాలాలు మాయమవడంతో నీరు పోయే దారిలేకే ఈ తిప్పలు. చెరువులు లేక ఆలస్యంగానైనా మురికి కాల్వల గుండా నీరంతా వెళ్లిపోతోంది. దీంతో వర్షం కురిసినా భూగ ర్భ జలాలు వద్ధి చెందే అవకాశమే లేకుండా పోతోంది. అవినీతి అధికారులు, రాజకీయ అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆడిన నాటకానికి సహజ వనరులన్నీ విధ్వంసానికి గురయ్యాయి. వందల చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. పాలకులు రూపొందించిన నిబంధనలను, ఉత్తర్వులను, చట్టాలను తుంగలో తొక్కేశారు. సహజవనరులను కాపాడాలన్న కనీస స్పహ లేని స్వార్థపరుల చేతుల్లో గ్రేటర్ హైదరాబాద్ చిక్కి శల్యమైంది. నగర వాసులకు కష్ణా, గోదావరి జలాలే శరణ్యమయ్యా యి. కానీ ఒకప్పటి గండిపేట నీళ్లు ఏమయ్యాయి? జంట జలాశయాలుగా పేరున్న హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు ఎందుకు సరిపాడా తాగునీటిని అందించలేకపోతున్నాయి. వందల ఏళ్ల పాటు జనాన్ని కాపాడిన ఆ నీటివనరులు ఎవరి స్వార్థం వల్ల బలైంది? ఇలాంటి సందేహాలకు సమాధానం అవినీతి, అక్రమా లే! నగరం, నగరం చుట్టూ ఉన్న ఏ చెరువైనా కబ్జాకాకుండా ఉందేమో చెప్పండని ఎవరినైనా అడిగితే సమాధానం ఉండదు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ రికార్డుల్లో మాత్రమే చెరువులు, వాటి విస్తీర్ణాలు పకడ్బందీగా కనిపిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో ఒక్కచెరువు కూడా కబ్జాకు అతీతంగా లేదు. నగరం నడిబొడ్డున ఉన్న చెరువులు ప్రస్తుతం స్విమ్మింగ్ ఫూల్స్‌గా దర్శనమిస్తున్నాయి. పెద్దోళ్లు కబ్జాచేసి ప్లాట్లు చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. దాంతో కాలనీలు, బస్తీలు ఏర్పడ్డాయి. కొన్ని చెరువులైతే రికార్డులకే పరిమితమయ్యాయి. శివార్లల్లో కొందరు ఎమ్మెల్యేలు, వారి వారసులతో సహా కబ్జాకోరుల జాబితాలో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చెరువులను రక్షించాలని, భూగర్భజలాలను కాపాడాలంటూ లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలు, కోర్టులకెక్కి హక్కులను సాధించాయి. వాటిని అమలుచేసేందుకే అధికార యం త్రాంగం సిద్ధంగా లేదన్న విమర్శలున్నాయి. శేరిలింగంపల్లి మండలంలో అప్రతిహాతంగా సాగే కబ్జాల పర్వాల్లో పలుమార్లు లోకాయుక్త రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు మొట్టికాయలు వేసింది. కానీ ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ మాదాపూర్ సమీపంలోని దుర్గం చెరువు అనేక కబ్జాలకు గురై నీటి మడుగులా మారింది.

ఏవీ నివేదికలు..

ఏక్కడ అమలు?: ఎన్ని చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయో, ఎన్ని నాలాలు ఆక్రమణకు గురయ్యా యో అధికారికంగా సమర్పించిన నివేదికలు భయోత్పాన్ని కలిగిస్తున్నాయి. పరిష్కారాలను వెతికాల్సిన అధికారులు మౌనం వహిస్తున్నారు. 2000లో వచ్చిన విపత్తును దష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కిర్లోస్కర్ కన్సల్టెన్సీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ నగరంలో 1500 నాలాలు కబ్జాకు గురయ్యాయని, నాలాలు కుచించుకుపోయాయని, లోతు బాగా తగ్గిందని, చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయని తేల్చింది. పుష్కరకాలం గడిచినా చర్యల్లేవ్! ఉప్పల్ మండలం బండ్లగూడ చెరువులోనే కొందరికి పట్టాలు జారీచేశారు. అక్కడ ఇండ్లు కట్టుకున్న బడుగులకు వర్షాకాలంలో రోజుకో యుగంగా కనిపిస్తుంది. చాలాచోట్ల నీటి వనరులు, ఎఫ్‌టీఎల్ పరిధిలోనే పట్టాలిచ్చిన ఉదంతాలున్నాయి. నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించిన పాలకులే ఈ దాష్టీకానికి పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గురువారం, జూన్ 26, 2014

తెలంగాణ బిడ్డలకే ఫీజులు చెల్లిస్తాం

-స్థానికతను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తది
-కళాశాలల పాత బకాయిలు ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ర్టాలు ఇవ్వాలి
-విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి



రాష్ట్రప్రభుత్వం తెలంగాణ బిడ్డలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తుందని, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చెల్లించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు గందరగోళం సృష్టించి ఆ ప్రాంత విద్యార్థులకు ఫీజు చెల్లించాలనడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు వర్తించదని తెలిపారు. ఆ రాష్ట్ర పిల్లలను వారే చదివించుకోవాలని సూచించారు. స్థానికత అనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. అడ్మిషన్లు గతంలో ఏ విధంగా జరిగాయో అదే విధంగా జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.

jagadeesh
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంచాలా.. తీసివేయాలా.. అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కళాశాలల యాజమాన్యం కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను చేర్పించుకునే సమయంలో ఆలోచించుకోవాలని సూచించారు. చేరబోయే విద్యార్థి ఏ రాష్ట్రానికి చెందినవారో ముందుగానే తెలుసుకొని అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. కళాశాలల పాత బకాయిలను ఏ రాష్ట్ర విద్యార్థులకు ఆ రాష్ట్రాలే చెల్లించాలన్నారు. సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్‌ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

గతంలో ముల్కీ నిబంధనలు ఉల్లంఘించినందుకే గైర్ ముల్కీ ఉద్యమం వచ్చింది. అసలు తెలంగాణ ఉద్యమమే స్థానికత అంశంగా జరిగింది. స్థానికులకే ఉద్యోగాలు అన్నట్లుగా స్థానిక విద్యార్ధులకే ఫీజు రీ యింబర్స్‌మెంట్ సరైన విధానం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగ్గది. అయితే కొందరు కుట్రపూరితంగా కావాలనే దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పన్నులతో వచ్చిన రాబడిని ఇతర ప్రాంత విద్యార్థులకు ఎలా ఖర్చు చేస్తాం? నాటి ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అప్పటి సీమాంధ్ర నేతలు కుట్రలతో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయించారు. 

అనంతరం తెలంగాణ ప్రయోజనాల కోసం 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. వాటినీ తుంగలో తొక్కారు. లోకల్ అంశం వచ్చిన ప్రతిసారీ తెలంగాణలో గందరగోళం రేకెత్తిస్తున్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఫీజు భరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా వివాదం చేయడం అనైతికం. కేంద్ర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజులను భరిస్తున్న తరహాలోనే రెండు రాష్ట్రాలు వ్యవహరించాలి. తెలంగాణ బిడ్డలుగా ఏ రాష్ట్ర విద్యార్థికి అన్యాయం జరగొద్దన్నదే మా అభిమతం.
- దేవీ ప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షుడు

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

వీరి హయాంలోనూ విశృంఖలంగా చెలరేగిన కబ్జాలు!

-పెద్దాయన, తమ్మయ్య, యువరాజా, బామ్మర్ది..
-ఆ గణం.. ఈ గణం.. అందరూ దోచుకు.. పంచుకుతిన్నారు
-నియమాలు బేఖాతర్.. నేనున్నానంటూ హుకుంలు
-గురుకుల్ భూముల గ్రహణంలో అందరూ అందరే
గురుకుల్ ట్రస్ట్ భూములు మింగేయడంలో పార్టీలు వేరైనా సీమాంధ్ర పాలకులు తమ నైజం ఒకటేనని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబునాయుడు, కాంగ్రెస్‌కు చెందిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమ వర్తనను ఆచరించి చూపారు. 627 ఎకరాల ట్రస్ట్ భూమిలో 300 ఎకరాలు చంద్రబాబు హయాంలో సంతర్పణ కాగా, అనంతరం 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరింతగా చెలరేగిపోయారు. మిగిలిందంతా మింగేశారు. తనతోపాటు తనవారికి పెద్ద మనసుతో పంచి ఇచ్చారు. పెద్దాయన, తమ్ముడు, యువరాజా, బామ్మర్ది, కడప గూండాలు, అనుచర గణం.. మనకెదురేమిటంటూ అందనివి కూడా దోచుకున్నారు. పంచుకు తిన్నారు.

YSR
అందరూ అందరేనని స్పష్టం చేశారు. చట్టాలను, నియమాలను కాలదన్నారు. నేనున్నాను కదా అని రాజఠీవితో సెలవిచ్చి, ఆజ్ఞాపించి రాజావారు అధికారులతో కానిపనులు చేయించారు. బాధ్యత మరిచి, విజ్ఞత లేకుండా ప్రవర్తించారు. ప్రభుత్వపరంగా అక్రమాలకు పాల్పడి కోర్టుల్లోనూ వక్రీకరణలకు పాల్పడ్డారు. అప్పుడు మూటగట్టుకున్న పాపం ఇప్పుడు వెన్నాడనుంది. సేవాసంస్థ భూములు కండ్ల ముందరే దోపిడీదారుల వశమవుతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయినవారు.. ఇప్పుడు ఆ దోపిడికోటలు కూలుతుంటే సంబురపడుతున్నారు. తెలంగాణలో సీమాంధ్ర పాతకాలకు పాతర వేసే రోజులను చూసి మురిసిపోతున్నారు.

అధికారారంభంలోనే..

అక్కడివన్నీ అక్రమ నిర్మాణాలే.. దాదాపు 300 ఎకరాల భూమిలో వేల కోట్ల రూపాయల నల్ల డబ్బుతో వెలిసిన భవంతులు.. చట్టాన్ని చుట్టంగా మార్చుకొని, అధికారులను కీలు బొమ్మలుగా చేసుకున్న బడా బాబులు రాజధాని నడిబొడ్డున హైటెక్‌సిటీ సమీపంలో కళ్లు జిగేల్ మనేలా విలాస భవనాలు నిర్మించుకున్నారు. ఆక్రమించిన ప్రాంతమంతా భారీ సెంటర్లు, అపార్ట్‌మెంట్లు, భవనాలతో హైటెక్ కల్చర్‌ను సంతరించుకుంది. ఇదంతా ఆ పెద్దాయన.. వైఎస్ మాహాత్మ్యమే. చంద్రబాబు పాలన పతనానంతరం వైఎస్ అధికారంలోకి రాగానే అప్పటిదాకా అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న శక్తులు చెలరేగిపోయాయి. భూముల కబ్జాలను తమ సహజ హక్కుగా భావించాయి. అప్పటికే సంతర్పణ అవుతున్న గురుకుల్ ట్రస్ట్‌భూములపై వైఎస్ అనుచరగణాలు అమాంతం రాబందుల్లా వాలాయి. కడప గూండాలు గడపగడపకు దిగారు. రాయలసీమ ముఠాలు భారీ ఎత్తున భవంతులు నిర్మించుకున్నాయి. దీనికి ఏకంగా వైఎస్‌ఆర్ హిల్స్ పేరు పెట్టారు. కబ్జా భూములకు వైఎస్ పేరు చెపితే అంతా మాఫీ అన్నట్లుగా వ్యవహరించారు. వైఎస్ క్యాబినెట్‌లోని పలువురు మంత్రులు, నేతలు భూములు మింగేశారు. వైఎస్ తమ్ముడు వివేకా దాదాపు ఎకరం స్థలంలో ఇంటిని నిర్మించుకున్నారు. అక్కినేని నాగార్జున ఫాం హౌస్ పేరుతో ఆరు ఎకరాలు కొనుగోలు చేసి, దీనికి మరో మూడు ఎకరాలు కబ్జా చేసి 9 ఎకరాల భూమిలో ఎన్ సెంటర్ నెలకొల్పారు.

వైఎస్ కొడుకు జగన్మోహన్‌రెడ్డి చేతిలో దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే గురుకుల్‌ట్రస్ట్ భూములు బందీ అయ్యాయి. ఆయన వివిధ బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వైఎస్‌ఆర్ హిల్స్ కాలనీకి వెళ్లే 100 ఫీట్ల రోడ్డుకు ఇరువైపులా దాదాపు జగన్‌కు చెందిన ఆస్తులే ఉన్నాయి. ఇక్కడ అనేక భవనాలకు ఎలాంటి పక్కా డాక్యుమెంట్లు లేవు. బినామీలైన నాగం తిరుపతిరెడ్డి కిశోర్‌రెడ్డి, ఎం రమణారెడ్డి తదితరుల పేర్ల మీద ఈ ఆస్తులున్నాయి. రమణారెడ్డి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఈయన దాదాపు మూడువేల గజాల భూమిని ఆక్రమించారు. ఎలాంటి కాగితాలు లేకుండా ఆర్‌ఆర్ రెసిడెన్సీ పేరుతో అక్రమంగా ఫ్లాట్లు నిర్మించి విక్రయించారని, భూమి యజమానులు వస్తే బెదిరించి ఎంతో కొంత చెల్లించి వెళ్ళగొట్టారని సమాచారం. ఏపీపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన రిపుంజన్‌రెడ్డి, మరికొందరు జగన్‌కు బినామీలు. కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలకు చెందిన అనేక మంది ఈ భూముల కబ్జాలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారులే. ఒక సమయంలో వేయి మందికిపైగా సాయుధగూండాలు పహారా కాసేవారు.

ఈ గణం.. ఆ గణం..

ఆక్రమిత భూముల్లో వైఎస్ చిన్న తమ్ముడు సుధీకర్‌రెడ్డి (సినీనటుడు మోహన్‌బాబు వియ్యంకుడు), వైఎస్ బామ్మర్ది రవీంద్రనాథరెడ్డికి 11/30 సర్వే నంబర్‌లో చెరో రెండువేల గజాల భూమి ఉంది. వైఎస్ తోడల్లుడు మల్లికార్జున్‌రెడ్డికి సైతం ఇక్కడ అనేక భూములున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి తన అన్న వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రే ఎకరం భూమిని కబ్జా చేసి అధికార దర్పంతో ఏకంగా కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించి, భారీ ఇల్లు కట్టుకున్నారు. హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే మెయిన్‌రోడ్డు మీద దాదాపు ఎకరం స్థలాన్ని ఆక్రమించాడు. వివేకా ఎకరం భూమిని కబ్జా చేస్తే ఆయన అనుచరులు ఏకంగా ఐదెకరాల ట్రస్ట్ భూమిని మాయం చేశారు. సర్కారులో తమ పలుకుబడిని ఉపయోగించి మాయచేసి అధికారికంగా పర్మిషన్లు తీసుకొని భవనాలు నిర్మించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పుల్లారెడ్డికి సర్వే నంబర్ 11/33లో నాలుగువేల గజాల భూమి ఉంది. దీనికి ఎలాంటి డాక్యుమెంట్ లేదు.


ట్రస్ట్ భూములను ప్రజాహితం కోసమే వినియోగించాలి

బన్సీలాల్ వ్యాస్ తెలంగాణ అణగారిన వర్గాల ప్రజలను వృద్ధిలోకి తీసుకురావడానికి చదువనే మార్గాన్ని ఎంచుకొని ఏర్పాటు చేసినదే గురుకుల్ ట్రస్ట్. ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ట్రస్ట్‌ను వృద్ధి చేయడానికి ఆయన మామ బద్రీనాథ్ తన భూమిని దానం చేశారు. అటువంటి ట్రస్ట్ భూమిని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రావడంతో ఆయన అనుచరులు, బంధువులు దురాలోచన చేసి మొత్తం కబ్జా చేయడం దారుణం. ఇది తెలంగాణ ప్రజల జీవితాలను ధ్వంసం చేయడంతప్ప మరేమీ కాదు. ఈ ట్రస్ట్ భూమి విలువ ద్వారానే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించవచ్చు. వేల కోట్ల రూపాయల భూములను వైఎస్ నాయకత్వంలో కబ్జా చేయడం వలసవాద ఆధిపత్యానికి నిదర్శనం. ట్రస్ట్ భూములతోపాటు, తెలంగాణకు చెందిన సంపదను రక్షించుకోవడానికి స్వీయ రాజకీయ అస్తిత్వం చాలా ముఖ్యం. ఇది తెలంగాణ రాష్ట్రం ద్వారానే సాధ్యం. ట్రస్ట్ ఆస్తులతో పాటు, సంస్థలను ట్రస్ట్‌కు అప్పగించాలి. తెలంగాణ ప్రజల హితం కోసం ఆస్తులను ఉపయోగించి, దీనిద్వారా ప్రజాహిత కార్యక్రమాలు చేపడతాం.

ఇంకా అదే వంకర బుద్ధి బయటపెట్టుకుంటున్నారు!

-సీజీఎస్ కోటాలపై ఆంధ్రా సర్కారు మరో కిరికిరి
-జీవో నంబర్ 20లో తప్పులున్నాయనే వితండ వాదన
-హైదరాబాద్ విద్యుత్ వినియోగంపై వివాదం
-అదీ సీమాంధ్రులవల్లనే అనే వాస్తవం విస్మరణ
-టీ మీడియాకు చిక్కిన ఆంధ్రా సర్కార్ లేఖ
దోపిడీకి అలవాటుపడ్డ ఆంధ్రా బాబుల బుద్ధి మారడంలేదు. తెలంగాణ తప్పదనుకున్నప్పుడు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ)గా మార్చాలని నానా యాగి చేసిన సీమాంధ్రులు నేడు హైదరాబాద్ విద్యుత్ వినియోగాన్ని సైతం వివాదాస్పదం చేయాలనుకుంటున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై వివాదాన్ని లేవనెత్తి తెలంగాణపై విషం కక్కిన ఆంధ్రా సర్కారు కొత్తగా మరో కిరికిరి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల (సీజీఎస్) విద్యుత్ ఉత్పత్తి విభజనలో తెలంగాణకు ఎక్కువ వాటా ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని ఇంకో కయ్యానికి దిగింది. సెంట్రల్ జనరేషన్ స్టేషన్ల నుంచి ఇరు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) కొత్త కేటాయింపులు జరపాలంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి ఈ నెల 21వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శికి రాసిన ఆ లేఖ (నంబర్ 1895) టీ మీడియా చేతికి చిక్కింది. కేంద్రం సీజీఎస్ విద్యుత్‌ను తెలంగాణకు 53.80 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.20 శాతం చొప్పున కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 షెడ్యూల్ 12లోని నిబంధన (సీ-6) ప్రకారం సీజీఎస్ విద్యుత్ కేటాయింపులు జరిపిన తీరును ఆంధ్రా సర్కార్ తప్పుబట్టింది. సమైక్యరాష్ట్రంలో కరెంటు కోతలు (లోడ్ రిలీఫ్) రాష్ట్రవ్యాప్తంగా ఒకేరీతిలో అమలు చేయలేదని, సీమాంధ్రలో విద్యుత్ కోతలు విధించి మరీ హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలకు కోతలు లేకుండా కరెంటు వినియోగం (సరఫరా) జరిగిందనే అంశాన్ని ఏపీ ప్రభుత్వం అందులో ప్రస్తావించడం గమనార్హం. నాటి అంచనాల ఆధారంగా ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ విద్యుత్ వినియోగం గణనీయంగా నమోదైందని, దాంతో తెలంగాణకు సీజీఎస్ కోటా ఎక్కువగా నిర్దేశించారని, ఇది సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుబట్టింది.

వాస్తవానికి కేంద్ర కేటాయింపులకు సహేతుక ఆధారాలున్నాయి. జిల్లాలు, ప్రాంతాల (ఆంధ్రా, తెలంగాణ)వారీగా ఐదు సంవత్సరాల విద్యుత్ వినియోగం ఆధారంగా సీజీఎస్ విద్యుత్ కేటాయింపులను నిర్దేశిస్తూ విభజనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబర్ 20) జారీచేసింది. దాని ఆధారంగా కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ మే 30వ తేదీన కేటాయింపులు జరిపింది. అయితే ఈ నిర్ణయం సమంజసంకాదని, దానివల్ల విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆంధ్రా సర్కార్ ఆ లేఖలో అభిప్రాయపడింది. 2008-09 సంవత్సరం నుంచి 2012-13 వరకు ఐదేండ్లపాటు డిస్కమ్‌లవారీగా జరిగిన విద్యుత్ అమ్మకాల వివరాల గణాంకాలను సదరు లేఖతో జతచేశారు. సీమాంధ్ర జిల్లాల్లో గత ఐదేండ్ల కరెంటు కోతల(లోడ్ రిలీఫ్)ను పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఆంధ్రాకే సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల విద్యుత్ కోటా ఎక్కువగా వస్తుందని పేర్కొంది. వీలైనంత త్వరలో సీజీఎస్ కోటా మార్పులు చేస్తూ ఉత్తర్వులను జారీచేయాలని ఏపీ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తిచేసింది.

హైదరాబాద్‌లోనూ సీమాంధ్రుల వినియోగమే అధికం..

హైదరాబాద్ విద్యుత్ వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన వివాదంపై తెలంగాణ సర్కారు ఆచితూచి వ్యవహరించాలని యోచిస్తున్నది. ఏపీ సర్కార్ పన్నుతున్న కుట్రలను దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా ఎనిమిది జిల్లాల విద్యుత్తు కనెక్టెడ్ లోడ్ ఒక్క గుంటూరు జిల్లా కనెక్టెడ్ లోడ్‌తో సమానం. గత ఐదేండ్ల కాలంలో కర్నూలు, అనంతపురం జిల్లాల విద్యుత్ వినియోగమే అధికం. ఆంధ్రాసర్కారు ఈ వాస్తవాలను విస్మరిస్తున్నది. 2008-09 సంవత్సరంలో జారీచేసిన జీవో నంబర్ 53 ప్రకారంగా నాటి ఏడు జిల్లాలతో కూడిన సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కర్నూలు, అనంతపురం జిల్లాల విద్యుత్ వినియోగం 12.45 శాతంగా ఉంది.

అయితే 2013నాటికి ఆ రెండు జిల్లాల (కర్నూలు, అనంతపురం) వాటా 18.5 శాతానికి మారింది. గత ఐదేండ్లుగా సెంట్రల్ పవర్ డిస్కమ్ పరిధి తెలంగాణలోని ఐదు జిల్లాలలో మితిమీరిన కోతలు విధించి మరీ కర్నూలు, అనంతపురం జిల్లాకు విద్యుత్తు మళ్ళించిన విషయాలను ఆంధ్రా సర్కారు విస్మరిస్తున్నది. ప్రపంచబ్యాంకుతో లోపాయికారీగా ఒప్పందాలు కుదుర్చుకుని విద్యుత్‌రంగంలో సంస్కరణలకు ఆజ్యంపోసినవారే ఇప్పుడు తెలంగాణ విద్యుత్‌రంగ విచ్ఛిన్నానికి యత్నించడం దురదృష్టకరమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక మరో గమనార్హమైన వాస్తవమేమిటంటే.. హైదరాబాద్‌లో కూడా సీమాంధ్రులు ఉండే ప్రాంతాల్లోనే విద్యుత్ వినియోగం అధికంగా ఉండటం. తెలంగాణ జేఏసీ నిర్వహించిన ఒక సర్వే ద్వారా ఈ వాస్తవం వెలుగుచూసింది. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజానీకం ఉండే ప్రాంతాల విద్యుత్ వినియోగం, సీమాంధ్రులు ఉండే ప్రాంతాల విద్యుత్ వినియోగం వివరాలు సర్వే ద్వారా వెలుగులోకి వచ్చాయి. అంటే హైదరాబాద్‌లో పెరుగుతున్న విద్యుత్ వినియోగం నిజానికి సీమాంధ్ర విద్యుత్ వినియోగమనేది సుస్పష్టం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ప్రస్తుత తెలంగాణకు ముల్కీ రూల్సే ముద్దు!

-స్థానికతకు ఆ పద్ధతినే అనుసరించాలి
-ఇంకా సీమాంధ్రకు పెద్దపీట సరికాదు
-మనవి మనకేనంటున్న తెలంగాణవాదులు
-స్థానికతపై రగులుతున్న విద్యార్థి యువతరం
-నాలుగేండ్లు చదివితే లోకలైతే మన సంగతేంది?
-ఇప్పటికే లక్ష ఉద్యోగాలు కొల్లగొట్టిన సీమాంధ్రులు
-ఇంకా వారి పిల్లలకు అడ్మిషన్లు, ఫీజులా?
-అసలైన తెలంగాణ స్థానికులను గుర్తించాలివారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి
-ఫీజులకే కాదు.. అన్నింటికీ వర్తింపజేయాలని డిమాండ్
-సానుకూలంగా స్పందించనున్న ప్రభుత్వం
-ముల్కీ అమలు చేయాలనే నిర్ణయం?

నీళ్లు.. నిధులు.. నియామకాలు.. ఈ మూడింటిలోనూ తెలంగాణ దగాపడింది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు వివక్షను భరించలేక మన సొంత రాష్ట్రం కోసం తెగించి పోరాటానికి దిగి తెలంగాణను సాధించుకున్నరు. మన తెలంగాణ మనకయింది. సంబురం. కానీ.. ఏ ఆశలతో విద్యార్థులు, ఉద్యోగులు రగిలిన మంటతో, ఉరుకులెత్తిన ఉత్సాహంతో ఉద్యమించారో ఆ ఫలితాలు ఇప్పుడు అందాలి కదా.. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ పరాయి పాలన నియమాలే కొనసాగితే ఎలా?.. ఇంకా ఆంధ్రోళ్లు స్థానికుల విద్యావకాశాల్లో చొరబడితె ఎట్ల?.. ఈ గడ్డపై మమకారం లేనివారు.. అనుబంధం పెంచుకోనివారు.. దోపిడీకి పాల్పడి భూములు కొల్లగొట్టి.. ఉద్యోగాలను కాజేసినవారు..

ఇప్పటికీ ఇక్కడ నాలుగేండ్లు చదివితేచాలు 85 శాతం స్థానికుల కోటాలోనే విద్యాసంస్థల్లో చేరొచ్చు.. అలాగే ఉద్యోగాలు పొందొచ్చు అంటే ఎలా?.. ఇది ఒప్పం గాక ఒప్పం.. అంటున్నారు తెలంగాణవాదులు. ఆ నియమాలు చెల్లవుగాక.. చెల్లవంటోంది విద్యార్థి యువత. కొత్త పద్ధతులు కావాలె అని ప్రజలు కోరుకుంటున్నరు. తమ బిడ్డలు ఇకనైనా కొలువుల్లో చేరితే మురిసిపోతమంటున్నరు. ఇది న్యాయమైన కోర్కె. మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కదులుతున్నది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లోకల్ ఎవరు వివాదం కొనసాగుతున్నది. ఇందుకోసం స్థానికత నియమాలను మార్చాలనుకుంటున్నది. ఆంధ్రపాలనలోని నాలుగేండ్లకు బదులు నిజాం హయాంలో రూపొందించిన పుట్టుక నుంచి 15 ఏండ్లు ముల్కీ నిబంధనను అమలుపరుచాలనుకుంటున్నది. ముల్కీ విధానాన్ని కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే కాదు.. అన్నింటికీ వర్తింపజేయాలని తెలంగాణవాదులు కోరుతున్నరు.
Students
తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రుల గురించి మనకెందుకింత తండ్లాట?.. మన రాష్ట్ర విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తూ.. సీమాంధ్ర విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాలా?.. నాలుగేండ్లు ఇక్కడ చదువంగనే స్థానికులెట్లయితరు? సీమాంధ్ర పాలకుల స్వార్థ విధానాలు ఇంకా అమలుకావాల్నా?.. నిజాం హయాంలో విదేశాల నుంచి సిపాయిలను భర్తీ చేసుకున్నప్పుడు స్థానికులు ఆందోళన చేస్తే.. నిజాం ప్రభుత్వం అసలైన స్థానికత అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచిస్తూ ముల్కీ నిబంధనలు రూపొందించింది. కానీ వాటిని ఆంధ్రోళ్లు పట్టించుకోలేదు. వివిధ పద్ధతుల్లో తెలంగాణ స్థానికుల లక్ష ఉద్యోగాలు కొల్లగొట్టారు. ఆ లక్ష ఉద్యోగాలే తెలంగాణ నిరుద్యోగులకు వస్తే ఇప్పటికి ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడేటివి?.. మన నోటికాడి కూడు గుంజుకున్నరు.. అలాంటివారికి తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్లు కల్పించి ఫీజులు చెల్లించాలా?.. ఇది ప్రతి తెలంగాణ విద్యార్థి, సగటు తెలంగాణవాది మాట. అప్పటి నిజాం హయాంలో అనుసరించిన స్థానిక అర్హత విధానాన్ని పాటించడం మేలని ఇప్పుడు పలువురు తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. అసలు ముల్కీ నిబంధనలు ఏమిటి?.. ఎందుకు రూపొందాయి?.. ఆ నిబంధనలు ఏమిటో ఒకసారి పరిశీలించి చూస్తే..

ముల్కీ ప్రకారం.. పుట్టుక నుంచి 15ఏండ్లు

నిజాం కాలంలో ఎవరు స్థానికులు? ఎవరు స్థానికేతరులు?.. అనే అంశంపై పూర్తి స్థాయి స్పష్టత ఉంది. హైదరాబాద్‌లో పుట్టుక నుంచి 15 ఏళ్లు స్థానికంగా నివాసం ఉంటేనే వారు హైదరాబాద్ లోకల్ అని నిజాం సర్కారు స్థానికతపై నిర్వచనం ఇచ్చింది. నిజాం సర్కారు ఆ కాలంలో అవసరాల కోసం విదేశాల నుంచి సిపాయిలను తీసుకునేది. అలా వచ్చినవారి పిల్లలకే నిజాం సర్కారు ఉద్యోగాలు ఇస్తున్నదంటూ అప్పట్లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం జరిగింది. దీంతో నిజాం సర్కారు స్పందించి లోకల్ ఎవరు? నాన్ లోకల్ ఎవరు? అనే అంశంపై పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చింది. ఈ లోకల్ నిబంధన ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ ఐదేండ్ల వరకు కొనసాగింది. ఆ తర్వాత ఆంధ్రా సర్కారు స్థానికతకు వక్రభాష్యాలు చెప్పి తెలంగాణవారి నోట్లో మన్ను కొట్టింది.

1974-75లో రాష్ట్రపతి ఉత్తర్వులు..

1969లో ముల్కీ అమలు చేయాలని తెలంగాణ ఉద్యమం, 1971-72లో ముల్కీ రద్దు చేయాలని జై ఆంధ్రా ఉద్యమం కొనసాగాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎం సిక్రీతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముల్కీ రూల్స్‌ను సమర్థించింది. అయినప్పటికీ ఆ తర్వాత 1973లో కేంద్ర ప్రభుత్వంపై సీమాంధ్రుల ఒత్తిడి కారణంగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ముల్కీ రూల్స్ రద్దు చేసింది. ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇరు ప్రాంతాల ప్రజలను తప్తిపరిచే విధంగా అప్పుడు ఉమ్మడి రాష్ర్టాన్ని ఆరు జోన్లుగా విభజించారు. ఉద్యోగాల భర్తీలో పోస్టుల స్థాయిని వర్గీకరించి జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్రస్థాయి క్యాడర్లుగా ఏర్పాటు చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు.

విద్యావకాశాల్లో స్థానికత

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు, అడ్మిషన్లకు స్థానికత వేరు వేరుగా ఉంది. వివిధ వత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో 85శాతం స్థానిక విద్యార్థులకు, 15 శాతం ఓపెన్ మెరిట్ కోటాగా అడ్మిషన్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రవేశాలు కల్పించే సమయంలో క్వాలిఫయింగ్ పరీక్షకు ముందు నాలుగేండ్లు ఏ జిల్లాలో చదివితే ఆ విద్యార్థిని ఆ జిల్లా లోకల్ విద్యార్థిగా పరిగణిస్తున్నారు. ఈ ప్రకారం ఉదాహరణకు హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌లో ప్రవేశం కోరే విద్యార్థులు అంతకుముందు ఏడేండ్లలో నాలుగేండ్ల్లు.. అంటే ఇంటర్, పది, తొమ్మిది తరగతులు హైదరాబాద్‌లో చదివి ఉంటే చాలు స్థానిక కోటాలో సీటుకు అర్హులవుతున్నారు. హైదరాబాద్ లోకల్ కోటాలో ప్రవేశాలు పొందాలంటే లేదంటే 6 నుంచి 12 తరగతుల్లో నాలుగేండ్లు హైదరాబాద్‌లో చదివితే చాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా నాలుగేండ్లు చదివినవారు స్థానికులుగా 85 శాతం కోటాలో ప్రవేశాలు పొందుతున్నారు.

ఉద్యోగాల్లో స్థానికత

ఉద్యోగాల విషయానికి వస్తే 4 నుంచి 10 తరగతుల వరకు నాలుగేండ్లు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో వారిని స్థానికులుగా గుర్తిస్తున్నారు. ఇవి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉత్తర్వులు. నాలుగేండ్లు తెలంగాణలో చదివినంతమాత్రాన సీమాంధ్రులు తెలంగాణవారు ఎలా అవుతారు?.. ఇంకా పాత ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలు అమలు చేస్తే స్వచ్ఛమైన తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే పాత జీవోలను అమలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

డిగ్రీలో నాన్‌లోకల్ ప్రవేశం, పీజీలో లోకల్ గుర్తింపు

ఇంజినీరింగ్ ఫార్మసీ డిగ్రీ కోర్సులు, బీటెక్, బీ ఫార్మసీ, ఇతర డిగ్రీ కోర్సుల్లో ఓపెన్ మెరిట్ కోటా 15 శాతంలో అడ్మిషన్లు పొందిన సీమాంధ్ర విద్యార్థులు పీజీకి వచ్చేసరికి లోకల్ కోటాగా మారిపోతున్నారు. వత్తివిద్యా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేపటప్పుడు క్వాలిఫయింగ్ పరీక్షకు ముందు ఏడేండ్లు ఎక్కడ చదివారనేది పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ఏడేండ్లలో నాలుగేండ్లు ఏ జిల్లా, ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలో లోకల్ విద్యార్థి అవుతారు. సీమాంధ్రకు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లో 15 శాతం ఓపెన్ మెరిట్‌లో బీటెక్, బీ ఫార్మసీలో ప్రవేశం పొందితే ఎంటెక్, ఎంఫార్మసీకి వచ్చేసరికి లోకల్ విద్యార్థులుగా మారుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సీమాంధ్రులను కూడా లోకల్ విద్యార్థులుగా పరిగణిస్తున్నందున వారికి తెలంగాణ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాల్సి వస్తుంది. ఇది మరీ దారుణమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

తల్లిదండ్రుల స్థానికతను గుర్తించాలి

1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో పనిచేసిన సీమాంధ్ర ఉద్యోగుల సర్వీసు రికార్డులు పరిశీలించాలి. సర్వీసు రికార్డుల్లో ఉన్న తండ్రి స్థానికత ఆధారంగా స్థానికతను గుర్తించాలి. ఉద్యోగులు కానివారు, వ్యాపారులు, ఇతర వర్గాల ప్రజల స్థానికతను గుర్తించాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల స్థానికతను గుర్తించాలి. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అయితేనే వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని నిజమైన స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఓపెన్ మెరిట్ కోటాకు నాన్ లోకల్ కోటాగా వక్రభాష్యం

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ కొలువులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులుగా విభజించారు. జిల్లా పోస్టుల్లో స్థానికులకు 80 శాతం, జోనల్‌లో స్థానికులకు 70శాతం, మల్టీ జోనల్‌లో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కల్పించాలి. ఓపెన్ మెరిట్ కోటాలో జిల్లా స్థాయి పోస్టులకు 20 శాతం, జోనల్‌లో 30, మల్టీ జోనల్ పోస్టుల్లో 40శాతం ఇవ్వాలి. కానీ సీమాంధ్ర పాలకులు ఓపెన్ మెరిట్ కోటాకు కూడా వక్రభాష్యం చెప్పారు. ఓపెన్ మెరిట్ కోటా అంటే నాన్‌లోకల్ కోటానే అంటూ వాటిని ఆంధ్రావారితో భర్తీ చేశారు. ఆ రకంగా సుమారు లక్ష మంది తెలంగాణ స్థానికుల ఉద్యోగాలను కొల్లగొట్టారు. ఇదే పెద్ద అన్యాయమైతే.. ఇంకా ఇప్పుడు వారి పిల్లలకు అడ్మిషన్లు కల్పించడం, తెలంగాణ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడం సరికాదని తెలంగాణవాదులు అంటున్నారు.

ప్రభుత్వ నిర్ణయం సరైందే..

ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా సమర్థనీయం. గతంలో ముల్కీ రూల్స్‌లో కూడా ఇదే నిబంధన ఉంది. సీమాంధ్రులు ఒక కుట్ర ప్రకారం ముల్కీ రూల్స్‌ను రద్దు చేయించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. అదే పరిస్థితి మళ్లీ ఉత్పన్నం కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీ యింబర్స్‌మెంట్ విషయంలో తండ్రి ఇక్కడివాడై ఉండాలని నిబంధన పెట్టడం హర్షించదగ్గదే. దీనివల్ల తెలంగాణపై ఆర్థిక భారం తగ్గి, స్థానికులకు న్యాయం జరుగుతుంది. ముల్కీ నిబంధనల్లో 15 ఏళ్లు ఇక్కడే ఉండి ఉంటే స్థానికుడనే నిబంధన ఉండేది. దాన్ని మళ్లీ తెరపైకి తేవడం ఆహ్వానించదగ్గ పరిణామం.


ఇంకా దోపిడి సాగదు...

ఇప్పటికి జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, ఉల్లంఘనలు చాలవా? మళ్లీ తెలంగాణ ప్రజల సొమ్ముపై ఆశ ఎందుకు? ఎవరి నిబంధనలు వారే నిర్దేశించుకోవాలి. రెండు రాష్ర్టాలు, రెండు ప్రభుత్వాలు ఉన్నప్పడు వరి వ్యయం వారే భరించాలనడం అన్యాయమా? ఇంకా మీ ఆటలు సాగవు. స్థానికులంటే తెలంగాణలో తెలంగాణ తల్లిదండ్రులకు పుట్టినవారే.


లక్ష ఉద్యోగాలు.. ఇంకా ఫీజులా?

దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులు సుమారు 26వేల మంది ఉన్నట్లు తేల్చారు. 1969లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినప్పటికీ బ్రహ్మానందరెడ్డి సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతానికి పంపించకుండా అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవరకు వారు తెలంగాణలోనే కొనసాగారు. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల సమయంలో తెలంగాణ ఇంజినీర్లు 30 మంది సీమాంధ్రలో పనిచేసేందుకు పోతే ఆ సీమాంధ్రులు అడ్డుకున్నారు. దాంతో మళ్లీ స్థానికత అంశం తెరపైకి వచ్చింది.

ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ అప్పుడు జయభారతిరెడ్డి కమిషన్ వేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సుమారు 56 వేల మంది ఉద్యోగులు తెలంగాణ స్థానికుల ఉద్యోగాలను చేజిక్కించుకున్నట్లు వెల్లడయింది. వారిని వెనుకకు పంపించాలని నివేదికలో పేర్కొన్నారు. దాంతో 1985 డిసెంబర్ 30న ఎన్టీఆర్ 610 జీవో విడుదల చేశారు. కానీ ఇంతవరకు ఆంధ్రా ఉద్యోగులు వారి ప్రాంతానికి వెళ్లలేదు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ స్థానికుల ఉద్యోగాలు కొల్ల్లగొట్టి తెలంగాణలో సెటిలయ్యారు. అలాంటివారి పిల్లలకు ఇక్కడ లోకల్ స్టేటస్ ఇచ్చి వారికి ఫీజులు ఇవ్వాలా?.. అనేది వివాదాస్పదంగా మారింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

విభజన ప్రక్రియ జాప్యంపై సీఎస్ సీరియస్...

-వారంలోగా పూర్తి చేయాలని ఆదేశం
వివిధశాఖల్లో జరుగుతున్న విభజన ప్రక్రియ జాప్యంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సీరియస్ అయ్యారు. వారంలో ప్రక్రియ పూర్తి చేయాలని అన్నిశాఖల ముఖ్య కార్యదర్శులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి 20 రోజులకు పైబడుతున్నా.. విభజనకు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. అన్నిశాఖల్లో సిబ్బందిని నియమించుకోవాలని, చాంబర్లు, పేషీల ఏర్పాటు పూర్తిచేయాలని సూచించారు. కంప్యూటర్లతోపాటు ఇతర సౌకర్యాలను త్వరితగతిన కల్పించి, పాలన సజావుగా సాగేలా చూడాలని, నిబంధనల ప్రకారం బదిలీ అయిన ఉద్యోగులు సత్వరమే తమ స్థానాల్లో విధులు నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. తెలంగాణకు సంబంధించిన ఫైళ్లు అన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

సమాచారం ఎప్పుడు కోరితే అప్పుడు తెచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఫైళ్లు, సిబ్బందిని ఇక్కడినుంచి వెంటనే ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బీ బ్లాకులోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీఏడీ, టూరిజం, ఎల్ బ్లాకులోని ఐటీ డిపార్టుమెంట్ ఫైళ్లు ఇంకా ఖాళీకాకపోవడం పట్ల ఆయన అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని విభాగాలు, కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థలు, విభాగాలకు తెలంగాణ లోగోతో ఉన్న బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సలహాదారులకు వాహనాలు, పేషీలను సిద్ధం చేయాలని సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున కీలకశాఖలైన వైద్య, విద్య, వ్యవసాయం, ఆర్థిక, రెవెన్యూ, నీటిపారుదల, రోడ్లు-భవనాలవంటి శాఖలు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. వారంలో వీలైనంత త్వరగా పూర్తి స్థాయి సమాచారాన్ని ఉంచుకోవాలని సూచించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

బుధవారం, జూన్ 25, 2014

వలసపాలకుల హయాంలో దారితప్పిన జలం!


-కనుమరుగవుతున్న గొలుసుకట్టు చెరువులు
-మరమ్మతుల్లేక చెరువులకు చేరని వర్షపు నీరు 
-పనికిరాకుండా పోయిన 80 శాతం చెరువులు 
-పొలాలు తడవక అరిగోస పడుతున్న రైతాంగం
-ఆధునీకరిస్తే వ్యవసాయానికి పూర్వవైభవం

రాష్ట్రంలోనే తక్కువ నీటివనరులున్న జిల్లా రంగారెడ్డి! ఈ జిల్లాలో పెద్ద నదుల్లేవ్! ప్రాజెక్టుల ఊసే లేదు! జిల్లాలో అత్యల్పంగా 9 శాతం మాత్రమే నీటివనరులు ఉన్నాయి. ఉన్నదల్లా మూసీ, ఈసీ వంటి చిన్ననదులే. వాటి కింద గొలుసుకట్టు చెరువులు..కుంటలే. మూసీ, ఈసీ నదిలో పారే నీటిని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల ద్వారా హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నారు. వర్షపునీటిపై ఆధారపడి నిర్మించిన గొలుసుకట్టు చెరువులపైనే జిల్లా రైతాంగం ఆధారపడుతోంది. కానీ నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువుల ఆలనాపాలనా లేక చిన్ననీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 

సీమాంధ్ర పాలకులు అరచేతిలో స్వర్గం చూపి అభివృద్ధి ముసుగులో నగర శివార్లలో సొంతలాభం కోసం నెలకొల్పిన పరిశ్రమలు, సెజ్‍ల వల్ల భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. ఈ క్రమలో పేరెన్నికగల వందలాది చెరువులు, కుంటలు కబ్జాకు గురై కనుమరుగయ్యా యి. శిఖం భూముల కబ్జాలు..వరదకాలువలు పూడుకుపోవడంతో దాదాపు 80 శాతం చెరువుల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న వందలాది చెరువులు, కుంటలు కబ్జాకు గురై ఉనికి కోల్పోయాయి. మరోవైపు...ఉన్న చెరువులు సీమాంధ్రుల పాలనలో మరమ్మతులకు నోచుకోక నోళ్లు వెళ్లబెట్టడంతో, అన్నదాతలు సాగు మరిచిపోయి, పక్కనే ఉన్న పట్నంలో కూలిపనులకు వెళ్తున్నారు.

చెరువుల ఖిల్లా..అయినా సాగునీరు కొరతే
జిల్లాలో 5 వేల చెరువులు, 255 కుంటలున్నాయి. వీటిలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 271 చెరువులు, పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 2344 చెరువులున్నాయి. వీటి కింద మొత్తం 2.8 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. జిల్లాలో ప్రధానమైన చిన్ననీటి వనరులు.. ఇబ్రహీపట్నం పెద్దచెరువు, మహేశ్వరం మండలం కొంగర రావిర్యాల చెరువు, శామీర్‌పేట్ పెద్దచెరువు, బషీరాబాద్ మండలం మైల్వార్ అక్కాలమ్మ చెరువు.. ఇలా ప్రతి మండలంలో ఎన్నో చెరువులున్నాయి. ఒక్కో చెరువుకింద గరిష్ఠంగా 1500 ఎకరాల నుంచి కనిష్ఠంగా 100 ఎకరాల వరకు ఆయకట్టు సాగయ్యేది. 

మొత్తం 1.97 లక్షల ఎకరాలకు సాగునీరుందుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి లక్ష ఎకరాలకు(7 శాతం) మాత్రమే సాగునీటి లభ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రాజెక్టుల విషయానికొస్తే.. జిల్లాలో కోట్‌పల్లి, జుంటుంపల్లి, లఖ్నాపూర్. సాలార్‌నగర్, సర్పన్‌పల్లి, నందివాగు ప్రాజెక్టు, మధ్య, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద 270 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. జిల్లాలో అతి ముఖ్యమైన కోట్‌పల్లి మధ్యతరహా ప్రాజెక్టు కింద 9500 ఎకరాల ఆయకట్టు ఉంది. జుంటుంపల్లి ప్రాజెక్టు కింద 2000 ఎకరాలు, లఖ్నాపూర్‌ప్రాజెక్టు కింద 2600 ఎకరాల ఆయకట్టుంది. 

మరమ్మతులపై అంతులేని నిర్లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులు పంటలకు నీరందిస్తున్నాయి. వీటి నిర్వహణ, అభివృద్ధికోసం గత పాలకులు నిధులు కేటాయించలేదు. ఇక చెరువుల సంగతి చెప్పనక్కర్లేదు. కనీస మరమ్మతులకు నోచుకోక చిన్ననీటివనరులు దిక్కులేనివయ్యాయి. వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఒక చెరువు అలుగునిండి మరో చెరువుకు నీరు చేరేలా వర్షపునీరు వృథా కాకుండా నిజాం రాజులు దూరదృష్టితో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల లక్ష్యం నెరవేరకుండా పోయింది. అరకొర నిధులు, తూతూ మంత్రపు పనులతో సీమాంధ్ర పాలకులు సరిపెట్టారు. దీనికితోడు కాంట్రాక్టర్ల అక్రమాలు, అధికారుల అవినీతి వల్ల చిన్ననీటివనరుల అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడింది. దీంతో వేలాది ఎకరాలకు నీరందించాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు ఎందుకూ పనికిరాకుండాపోతున్నాయి. వర్షాకాలంలో కొద్దిపాటి నీటితో కళకళలాడినా..ఎండాకాలంలో ఎండిపోతున్నాయి. 

గొలుసుకట్టు చెరువుల నిర్మాణంలో కీలకమైన వరద కాలువలు, ఫీడర్ ఛానెల్స్‌కు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలావరకు ఉనికి కోల్పోయాయి. దీంతో వరదనీరు ఒక్కో చెరువు నుంచి మరో చెరువులోకి వెళ్లే పరిస్థితి లేకుండా దారులు మూసుకుపోయాయి. వరదనీరు చెరువుల్లోకి కాకుండా జనావాసాలను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో కొద్దిపాటి నీరుచేరినా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించలేకపోతున్నాయి. దీంతో రైతాంగానికి వర్షాధార(మెట్ట) పంటలు, బోరుబావుల కింద కూరగాయ తోటలే దిక్కయ్యాయి. 

ఇలా చేస్తే సాగునీటి కష్టాలకు పరిష్కారం
పెద్దేముల్ మండలం కోట్‌పల్లి మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కింద 9500 ఆయకట్టు ఉంది. జైకా నిధులతో మరమ్మతులు చేపడతామని చెబుతున్నా పనులు ముందుకు సాగడంలేదు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తే లక్ష్యం నెరవేరుతుంది. తాండూర్ నియోజకవర్గంలోని జుంటుపల్లి ఉద్దండరావు చెరువు కింద 386 ఎకరాల ఆయకట్టుంది. సీబీటీ కింద రూ.25 లక్షలు మూడేళ్ల క్రితం మంజూరవగా రూ.10 లక్షలతో మట్టిపనులు చేసి వదిలేశారు. పరిగి మండలంలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు కింద 2,600 ఎకరాలు, గండీడ్ మండలంలోని సాలార్‌నగర్ ప్రాజెక్టు కింద 1,300 ఎకరాలు సాగవ్వాలంటే మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. బషీరాబాద్ మండలం మైల్వార్ అక్కాలమ్మ చెరువును ప్రాజెక్టుగా మార్చితే 550 ఎకరాలకు నీరందుతుంది. 

కాశీంపూర్ పంచాయతీ బహద్దూర్‌పూర్ పీరోని చెరువును కూడా ప్రాజెక్టుగా మార్చితే వెయ్యి ఎకరాలకు నీరందుతుంది. పెద్దేముల్ మండలం నాగులపల్లి, బంట్వారం మండలం రొంపల్లి మధ్య రూ.3 కోట్ల అంచనాతో 494 ఎకరాలు ఆయకట్టుకు నీరందించాలని కొత్తగా మల్కదాన్ నిర్మించాలని ప్రతిపాదించారు. నిధులు మంజూరై మూడేళ్లు గడిచినా స్థలసేకరణ సమస్యతో పనులు జరగడం లేదు. ఇందూర్ సమీపంలో రూ.కోటి వ్యయంతో అస్తవ్యస్తంగా చెరువు నిర్మించడంతో వృథాగా మిగిలింది. తాండూరు మండలం చెంగోల్ వద్ద అల్లాపూర్ చెరువును ప్రాజెక్ట్‌గా మార్చితే 300 ఎకరాలకు నీరందించవచ్చు. శామీర్‌పేట పెద్దచెరువు 300 ఎకరాలకు సాగునీరిస్తోంది. అభివృద్ధి చేస్తే 1200 ఎకరాలకు నీరందుతుంది. వికారాబాద్ నియోజకవర్గంలో సర్పన్‌పల్లి ప్రాజెక్టు కింద 4600 ఆయకట్టుంది. ప్రస్తుతం 1000 ఎకరాలకూ నీరందడం లేదు. 

కొంపల్లి చెరువు, కామారెడ్డిగూడ, మద్గుల్‌చిట్టంపల్లి చెరువు, మోమిన్‌పేట్ మండలం మల్‌రెడ్డిగూడెం, ఎన్కతలలోని చిన్న చెరువు, పెద్ద చెరువు, నందివాగు ప్రాజెక్టు, అయిమ చెరువుల కింద 3062 ఎకరాల ఆయకట్టుంది. ప్రస్తుతం 1000 ఎకరాలకు కూడా నీరందడంలేదు. మర్పల్లి మండలంలోని చెరువుల కింద 3757ఆయకట్టుండగా,1000 ఎకరాలకే నీరందుతోంది. బంట్వారం మండలంలోని చెరువుల కింద 890 ఆయకట్టు ఉంటే 150 ఎకరాలకే నీరందుతోంది. ధారూరు మండలం లో చెరువుల కిందట 2,832 ఎకరాల ఆయకట్టు ఉంటే, 600 ఎకరాలకు నీరందుతుంది. మహేశ్వరం మండలం రావిర్యాలలో 240 ఎకరాలు, కొంగరకుర్ధులో 750 ఎకరాలు, ఇబ్రహీంపట్నం ఆదిభట్లలో 1200 ఎకరాలు సాగునీరందేది. ప్రస్తుతం ఈ చెరువులో చుక్కనీరు లేదు. బాగుచేస్తే చుట్టుపక్కల 7 గ్రామాలకు సాగునీరు అందుతుంది. కాబట్టి తక్షణమే ఈ కాలువలను ఆధునీకరిస్తే చివరి పొలాలకు నీరు చేరుతుంది. మన గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం చేకూరుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

జై తెలంగాణ అన్నందుకు కక్షసాధింపు


-ప్రాధాన్యం లేని చోట్ల పోస్టింగులు
-సర్వీసు రికార్డుల్లో ప్రతికూల రిమార్కులు
-తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర ఉన్నతాధికారుల దుశ్చర్య
-ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామంటున్న ఉద్యోగులు

జై తెలంగాణ అని ఉద్యమించినందుకు తెలంగాణకు చెందిన యూనిఫాం సర్వీసు ఉద్యోగులపై సీమాంధ్ర ఉన్నతాధికారులు సాగించిన కక్షసాధింపు ఇది.. డిసిప్లినరీ ఫోర్స్‌లో పనిచేస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎలా ఉద్యమిస్తారంటూ వారు తెలంగాణ ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా వెనుకడుగు వేయకపోవటంతో ఏకంగా తెలంగాణ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టుల్లో వ్యతిరేక రిమార్కులు రాశారు. తెలంగాణ కోసం గళమెత్తిన ఉద్యోగుల పదోన్నతులు ఆలస్యమయ్యేలా కుట్రలకు తెగించారు. దీంతో కొంతమంది అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగి ఈ రిమార్కులను తీసివేయించుకోగలిగినా చాలామంది ఇప్పటికీ వాటివల్ల ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి.. తమకు న్యాయం చేయాల్సిందిగా కోరాలని భావిస్తున్నారు. 

మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో పోలీస్, జైళ్లు, అగ్నిమాపక, అటవీ, రవాణా, తూనికలు కొలతలు, ఎక్సయిజ్ శాఖలాంటి యూనిఫాం సర్వీసుల్లో పనిచేస్తున్న తెలంగాణ సిబ్బంది సైతం ఉద్యమంలోకి దూకాలనుకున్నారు. అయితే, ఉన్నత స్థానాల్లో సీమాంధ్ర అధికారులే ఎక్కువగా ఉండటం...డిసిప్లినరీ ఫోర్స్ కావటంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటారేమోనన్న భయంతో చాలామంది ఆ పని చేయలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లోనూ కొందరు ఉద్యోగులు ధైర్యంగా ముందుకొచ్చారు. 2009, డిసెంబర్‌లో యూనిఫాం సర్వీసెస్ జాయింట్ యాక్షన్ కమిటీని ప్రారంభించి ఉద్యమంలో తమదైన పాత్ర పోషించారు. దాంతో అప్పట్లో అధికారంలో ఉన్న సీమాంధ్ర పాలకులు.. సీమాంధ్ర ఉన్నతాధికారులు వారిపై కన్నెర్ర చేశారు. జై తెలంగాణ అని నినదించిన ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. 

ప్రస్తుతం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటిండెంట్‌గా ఉన్న కొలను వెంకట్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ ఉదంతాలే దీనికి నిదర్శనం. యూనిఫాం సర్వీసెస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరితోపాటు మరికొంతమందిని అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. వీరిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని కుట్రలూ చేసింది. ఇందులోభాగంగానే ఉన్నత స్థానాల్లోని సీమాంధ్ర అధికారులు చాలామంది తెలంగాణ ఉద్యోగులను అంతగా ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించారు. అంతే కాకుండా వారి సర్వీసులకు సంబంధించిన వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టుల్లో వ్యతిరేకంగా రిమార్కులు రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు అత్యంత కీలకం. ఇందులో వ్యతిరేకంగా రిమార్కులు ఉంటే ప్రమోషన్లు రావటంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో తమ సర్వీసు రికార్డుల్లో నమోదుచేసిన వ్యతిరేక రిమార్కులను తొలగించే అంశాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళతామని బాధిత ఉద్యోగులు చెప్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గురుకుల్ ట్రస్ట్ భూముల పందేరంలో "బాబు"దే బడాషేర్!

-గురుకుల్ ఖాతాలో బాబుదే సింహభాగం
-చంద్రబాబు హయాంలోనే సగం పందేరం
-స్వయంగా 5 ఎకరాలు కొని విక్రయించిన వైనం
-ట్రస్ట్ భూములు దేవాదాయానికి బదలాయించిందీ ఆయనే

రెండు దశాబ్దాల పోరాటఫలం రాజధాని నడిబొడ్డున గురుకుల్ ట్రస్ట్ భూములకు విముక్తి ప్రారంభమైంది. మంగళవారం ఆ భూముల్లోని అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిన్నటిదాకా జబ్బలు చరిచిన భూకబ్జాదారుల గుండెలు పగిలాయి. గురుకుల్ ట్రస్ట్ భూమి అంటే అక్షరాలా 12 వేల కోట్ల విలువైన ఆస్తి. సీమాంధ్ర పాలకులు, పైరవీకారులు, కబ్జాదారులకు బంగారు బాతుగుడ్డు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే బందిపోటు దొంగలకన్నా దారుణంగా దోపిడీకి తెగబడ్డ భూమి. ఎక్కడో ఉత్తర భారతంలో పుట్టి ఇక్కడి పేద పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ఓ ధన్యజీవి ఇచ్చిన యావదాస్తిని "ఒక్క భాష-ఒక్క జాతి" అంటూ పక్కకు చేరిన సీమాంధ్రులు నిస్సిగ్గుగా దోచుకున్నారు. 

అయ్య జాగీరులా అడ్డికి పావుశేరుగా అమ్ముకున్నారు. ఒకటి కాదు రెండు కాదు..627 ఎకరాలు. ఉత్తరాంధ్ర..కోస్తా.. సీమ ప్రాంతాలు వేరు కావొచ్చు కబ్జాలు మాత్రం ఒకటే. ఎవడికి దొరికింది వాడు ఆక్రమించేసుకున్నారు. ఒక్క ఎకరా కూడా మిగల్లేదు. భూముల విలువ పెంచుకునేందుకు హైటెక్కుల సోకులు అద్దారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రులే కబ్జాలను ప్రోత్సహించారు. వారు కుటుంబ సభ్యులు, సోదరులు, బావలు, బామ్మర్దులు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టి ఆకాశహర్మ్యాలు లేపేశారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు. కబ్జాల క్రమబద్ధీకరణకు చట్టాలు మార్చారు. కోర్టు తీర్పులు చెత్తబుట్టపాలు చేశారు. ఏ ప్రయోజనం కోసం ఆ భూములు ఉద్దేశించారో ఆ గురుకులంలో పేద పిల్లలు ఆకలితో మాడుతుంటే.. ఆక్రమించిన వారు ఐదు నక్షత్రాల ఆహారశాలలు నిర్మించుకున్నారు. 


చంద్రబాబు హయాంలోనే గ్రహణం....
గురుకుల్ ట్రస్ట్ భూములను టోకున పందేరం చేసిన ఘనత చంద్రబాబు సర్కారుదే. అప్పటిదాకా కొద్దికొద్దిగా కరుగుతూ వచ్చిన భూమిలో ఏకంగా 300 ఎకరాలు పందేరం చేసింది బాబు సర్కారు. భూములను నామమాత్రంగానైనా పర్యవేక్షించే అధికారం కూడా లేకుండా చేసేందుకు ఏకంగా ట్రస్ట్ బాధ్యతలు ప్రభుత్వానికి బదిలీ చేసింది కూడా ఆయన సర్కారే. చంద్రబాబు సర్కారే దాదాపు 300 ఎకరాలను స్వాధీనం చేసుకొని న్యాక్, హైటెక్స్‌లను నిర్మించింది. పనిలో పనిగా నోవాటెల్ హోటల్‌కు100 ఎకరాల భూమిని పందేరం చేసింది. మరో 30 ఎకరాలను హుందాయ్‌‍షోరూమ్‌కు కట్టబెట్టింది. మిగిలిన భూములు ఆశ్రితుల పరమయ్యాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే ఐదెకరాలు కొనుగోలుచేస్తే, ఆయన సతీమణి ఒక ఎకరం కొనుగోలు చేశారు. తర్వాత కారణాలేమైనా బాబు వాటిని అమ్మేశారు. ముఖ్యమంత్రే కొనుగోలు చేస్తున్నారన్న ఉద్దేశంతో అనుమతులు లేకున్నా ఈ భూమిని కొనేందుకు అనేకమంది ఎగబడ్డారు. ఇలా సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సగం ట్రస్ట్ భూములను సర్కారు పద్ధతుల్లో లాక్కున్నాడు. మరో వైపు ఘట్‌కేసర్ గురుకుల్ ట్రస్ట్‌ను ట్రస్ట్ సభ్యులు నిర్వహించలేరంటూ 1998లో ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను స్వీకరిస్తూ దేవాదాయ శాఖకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. 

ట్రస్ట్ రద్దు చేసి ఆ భూముల బాధ్యతను దేవాదాయ శాఖకు బదలాయించారు. దేవుడి మాన్యాలనే రక్షించలేని దేవాదాయ శాఖ రాజధాని నడిబొడ్డున కోట్ల విలువచేసే భూమిన రాజకీయ రాబందులనుంచి రక్షించగలదంటే ఎవరూ నమ్మరు. కానీ బాబు సర్కారు మాత్రం నమ్మింది. ఫలితం కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పైగా ఆ భూముల విలువలు పెంచుకునేందుకు ప్రభుత్వం హైటెక్కుల భవనాలు నిర్మించింది. ఆక్రమించు.. విలువ పెంచు.. అమ్మి సొమ్ము చేసుకో... ఇదే సీమాంధ్రులు మొదటినుంచి పాటిస్తూ వచ్చిన వ్యాపారసూత్రం. ఇదే సమయంలో అంతకు ముందు ట్రస్టు సభ్యుడు కిషన్ లాల్ చేసిన అమ్మకాలు, ఇచ్చిన జీపీఓలు చీకాకు పెట్టడంతో కిషన్‌లాల్ చేపట్టిన అమ్మకాలు చెల్లవంటూ 30 సెప్టెంబర్ 2000 సంవత్సరంలో ప్రభుత్వం 703 జీవో జారీ చేసింది. ఇందులో మరో ఎత్తుగడా ఉంది. ఆక్రమించుకున్న భూములన్నీ అక్రమం కావడంతో అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. 

సర్కారు వాటిని క్రమబద్ధం చేయాలన్నా సమస్యే. ఈ జీవోను అడ్డు పెట్టుకుని భూములు కొన్న వారు కోర్టుకువెళితే జీవోపై స్టే వస్తుందని, తర్వాత పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని భావించారని చెబుతారు. అయితే న్యాయస్థానం మరో రకంగా స్పందించింది. 2003లో హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి తాను ఇచ్చిన తీర్పులో ప్రభుత్వం ఇచ్చిన జీవో 703 సరైనదేనని ధ్రువీకరించారు. 1987 వరకు జరిగిన క్రయవిక్రయాలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని తీర్పు చెప్పారు. ట్రస్ట్ భూములు అమ్మడానికి, కొనడానికి కూడావీలు లేదని చెప్పారు. ఎవరైనా కొన్నా, అమ్మినా వాటిని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ తీర్పు అమలు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత ఈ భూములను పట్టణ భూగరిష్ట చట్టం పరిధిలోకి తెచ్చి కబ్జాలకు చట్టబద్ధత కల్పించేందుకు యత్నించారు. మొత్తానికి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో చంద్రబాబు హయాం 300 ఎకరాలు మింగేసింది. 

ఆనాటి గురుకుల్ ట్రస్ట్ సభ్యులు వీరే...
-వినాయకరావు కేశవ్ కరోట్కర్
( హైదరాబాద్ రాష్ట్ర మంత్రి)
-పండిట్ నరేంద్రజీ
-కొత్తూరి సీతయ్య గుప్తా
-శ్రీమతి జానకీ దేవి
( దివంగత వ్యాస్ భార్య)
-లక్ష్మినారాయణ గుప్తా(ఐఏఎస్)
-రాంగోపాల్ సుఖ్‌దేవ్ రాథి
-బి. కిషన్‌లాల్
( హైదరాబాద్ నగర మేయర్)
-పండిట్ సూర్యకరణ్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

దురాక్రమణలు కూలుతున్నాయ్...!

-గురుకుల్ ట్రస్ట్ భూముల విమోచనలో తొలి అడుగు
-అక్రమ నిర్మాణాలపై అధికారుల ఉక్కు పాదం 
-భారీ బందోబస్తు మధ్య 16 భవనాల కూల్చివేత
-నేడూ కొనసాగనున్న కూల్చివేతలు 
-బల్దియా కమిషనర్, సైబరాబాద్ సీపీ పర్యవేక్షణ 
-అక్రమార్కులకు టీడీపీ ఎమ్మెల్యే గాంధీ మద్దతు
-కూల్చివేతలు అడ్డుకునేందుకు విఫలయత్నం
-అక్రమనిర్మాణాలకు విద్యుత్, నీటి సరఫరా బంద్
-గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆదేశం

బుల్డోజర్లు కదులుతుంటే అక్రమార్కుల గుండె అదిరింది! అక్రమ నిర్మాణాలను జేసీబీలు పొడిచి పొడిచి కూలగొడుతుంటే.. రానున్న రోజులు తల్చుకుని కబ్జాకోరుల వెన్ను జలదరించింది! మన రాష్ట్రంలో మన అస్తిత్వం పరిపాలనా పగ్గాలు చేపడితే ఏం జరుగుతుందో అరవై ఏళ్ల గోస అనుభవించిన సగటు తెలంగాణ పౌరుడికి భరోసా ఏర్పడింది! ఈ మూడు సన్నివేశాలకు నాందిగా నిలిచింది మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్టు భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపర్వం!! వలస పాలన అవకతవకల అవశేషాలను ఎలా తుడిచి పెట్టనుందీ తెలంగాణ ప్రభుత్వం చెప్పడమే కాదు.. చేసి చూపిస్తున్నది! నగరంలోని అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకించి గురుకుల్ ట్రస్ట్ భూములలోని అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెర్ర చేసిన మరుసటి రోజే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది! దశాబ్దాల సీమాంధ్ర పాలనలో ఉనికి కోల్పోయి.. పరాధీనమై.. రియల్ ఎస్టేట్ల ఆక్రమణకు గురైన గురుకుల్ ట్రస్ట్ భూముల విమోచనకు తొలి అడుగు పడింది.

మాదాపూర్‌లోని గురుకుల్ ట్రస్ట్ భూములలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత మంగళవారం ఉదయం మొదలైంది. భారీ సంఖ్యలో పోలీసుల భద్రత నడుమ మున్సిపల్ అధికారులు, సిబ్బంది కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షించారు. గ్రేటర్ అదనపు కమిషనర్లు (ప్లానింగ్) రఘు, వెంకట్రామిరెడ్డి, జోనల్ కమిషనర్ అలీం బాషా, సిటీ చీఫ్ ప్లానర్ రాముడు సారథ్యంలో ఐదు బందాలుగా ఏర్పడి, 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తొలి దశలో మొత్తం 21 అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు బుధవారం కూడా కూల్చివేతల పర్వాన్ని కొనసాగించే అవకాశం ఉంది. గురుకుల్ ట్రస్ట్ భూములలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు మూకుమ్మడిగా దండయాత్ర చేశారు. 

దాదాపు వందకు పైగా సిబ్బందితో గ్రేటర్ కమిషనర్‌తోపాటు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ కార్యాలయంలోని ఇతర విభాగాల అధికారులు పోలీసు బందోబస్తుతో కూల్చివేతలకు పూనుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మాదాపూర్ డీసీపీ క్రాంతిరాణా, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, దాదాపు 250 మంది కానిస్టేబుళ్లతో మున్సిపల్ అధికారులకు రక్షణగా నిలబడ్డారు. ఉదయం 6 గంటలకు అయ్యప్ప సొసైటీకి చేరుకున్న అధికారులు, సిబ్బంది ఐదు బందాలుగా విడిపోయి కూల్చివేతలు ప్రారంభించారు. సిబ్బందితోపాటు 4 జేసీబీలు, 3 హిటాచీ బ్రేకర్లు, 5 కంప్రెషర్లతో కూల్చివేతలు కొనసాగించారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి అక్రమ నిర్మాణదారులు ప్రయత్నించారు. వారికి మద్దతుగా స్థానిక శేరిలింగంపల్లి ఎమ్మెల్యేతోపాటు కార్పొరేటర్లు, ఇతర నాయకులు నిలిచారు. కానీ పోలీసులు ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేసి, కూల్చివేతలకు ఎలాంటి ఆటంకం తలెత్తకుండా చూశారు.


కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే గాంధీ ఆందోళన...
స్థానిక శాసనసభ్యుడు అరెకపూడి గాంధీ అక్రమ నిర్మాణాలను ఆపాలంటూ ఉన్నతాధికారులతో వాదనకు దిగారు. గ్రేటర్ కమిషనర్ సోమేశ్ కుమార్‌తో వాగ్వాదానికి దిగిన గాంధీ.. కూల్చివేతలను ఆపకపోతే తమ తడాఖా ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను దింపి తేల్చుకుంటామని కమిషనర్‌ను బెదిరించారు. ప్రజాప్రతినిధులై ఉండి అక్రమ నిర్మాణాలకు మద్దతు పలకడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణదారులకు ఎమ్మెల్యే మద్దతు పలకడంపై స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు టీడీపీ కార్పొరేటర్లు రంగారావు, భానుప్రసాద్, కాంగ్రెస్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకోవడానికి యత్నించారు. కార్పొరేటర్లను కూడా పోలీసులు అరెస్టు చేసి తరలించారు. 


విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు ఉండవు...
గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సహకారం అందకుండా చూడాలని గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయాలని ట్రాన్స్‌కో, జలమండలి అధికారులను ఆదేశించారు. వీటితోపాటు బుధవారం నుంచి గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై తీసుకుంటున్న చర్యలు, నిఘా ఏర్పాటుపై ప్రతి రోజూ తనకు నివేదిక అందజేయాలని వెస్ట్‌జోన్ కమిషనర్ అలీం బాషాను సోమేశ్‌కుమార్ ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు కొనసాగితే బల్దియా టోల్‌ఫ్రీ నెంబర్ 040-21111111లో సమాచారం అందించాలని కోరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఎన్జీ రంగా వర్సిటీని వెంటనే విభజించండి

-తెలంగాణ వచ్చినా వర్సిటీలో సీమాంధ్రులదే పెత్తనం
-దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తాం
-తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల అసోసియేషన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వెంటనే విభజన ప్రక్రియను చేపట్టాలని వర్సిటీ తెలంగాణ శాస్త్రవేత్తల అసోసియేషన్ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వర్సిటీలో ఇంకా సీమాంధ్ర అధికారుల పెత్తనమే కొనసాగుతున్నదని, వారు ఇటీవల అక్రమంగా బదిలీలు చేపట్టారని పేర్కొంది. మంగళవారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వాసుదేవ్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పడి.. వ్యవసాయ అభివద్ధ్దికి విస్తతమైన పరిశోధనలు జరుగాల్సి ఉందన్నారు. ఎన్జీ రంగా వర్సిటీలో సీమాంధ్ర పాలకులు, అధికారుల ఆధిపత్యం వల్ల తెలంగాణలో వ్యవసాయం ఎన్నో ఏళ్లు వెనుకకుపోయిందన్నారు. వర్సిటీలోని కొనసాగుతున్న వివక్ష, అన్యాయంపై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలను కలిసి వివరిస్తామని తెలిపారు.

ngrana
డాక్టర్ బీ విద్యాసాగర్ మాట్లాడుతూ.. వర్సిటీకి చెందిన తెలంగాణలోని ఆస్తులు, నిధులు, ఉద్యోగాలు, కళాశాలలు, విస్తరణ కేంద్రాలు, పరిశోధన కేంద్రాలు.. తెలంగాణకే చెందాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమ బదిలీలను నిలిపివేయాలన్నారు. వ్యవసాయ వర్సిటీలో జరుగుతున్న కుట్రలు, అన్యాయాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. డాక్టర్ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూవ్యవసాయ విశ్వవిద్యాలయంలో తెలంగాణకు చెందిన సీనియర్లను ఉపకుపలపతిగా నియమించాలన్నారు. డాక్టర్ గోవర్ధన్ మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన అధికారులు అక్కడికి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నా ఉపకులపతి వారిని బదిలి చేయటం లేదని వివరించారు. డాక్టర్ సదాశివరావు, జీవన్‌రావు మాట్లాడుతూ జై తెలంగాణ అన్నందుకు ఈ మధ్యకాలంలో ఓ శాస్త్రవేత్తను అక్రమంగా బదిలి చేశారని తెలిపారు. వర్సిటీలో కొత్తగా భర్తీ చేసే పోస్టుల్లో తెలంగాణ వారినే నియమించాలనిలేదంటే జూలై 1 నుంచి వర్సిటీలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఆంధ్రా తాగునీటికై 3.5 టీఎంసీలు చాలు!

-డెల్టాకు తాగునీటికే నీరు.. కేంద్ర జలసంఘం ఆదేశం
-తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభావం
-రోజు 6వేల క్యూసెక్కుల చొప్పున 3.5 టీఎంసీల కేటాయింపు
-నీటి విడుదల సమయంలో తెలంగాణకు విద్యుత్
ప్రతిఏటా తాగునీటి అవసరాల ముసుగులో సాగుకు నీరు మళ్లించుకుంటున్న సీమాంధ్రకు మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. సమైక్య సర్కారు కొనసాగినంతకాలం అడిగేవాడు లేక తాగునీరు పేర పంటలు తడుపుకొని తెలంగాణను ఎండపెడుతూ వచ్చిన ఆనవాయితీకి తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంతకాలం గాలిలో దీపంలా ఉన్న తెలంగాణ సాగర్ ఆయకట్టు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు నడుం బిగించింది. డెల్టాలో తాగునీటి పేరిట గాయి చేసి 10 టీఎంసీలు కావాల్సిందేనన్న ఏపీ వాదనను కేంద్ర జలసంఘం చైర్మన్ ముందు తెలంగాణ సమర్థంగా తిప్పికొట్టింది. ఫలితంగా ఇపుడు 10 టీఎంసీల స్థానంలో 3.5 టీఎంసీల నీటితోనే ఏపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమైక్య రాష్ట్రంలో నదులకు నదులే మళ్లించుకున్న సీమాంధ్రకు తెలంగాణ దిమ్మదిరిగే పాఠం చెప్పింది. ఇక తెలంగాణను విస్మరించి కృష్ణమ్మ బిరబిరా ఆంధ్రకు పరుగులు తీయదన్న సత్యాన్ని బోధపరిచింది.

కృష్ణా డెల్టాలో తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల నీరు కావాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో కేంద్ర జలసంఘం ఏకీభవించలేదు. డెల్టా తాగునీటికి 10 టీఎంసీల నీరు అవసరం లేదని కేంద్ర జలసంఘం చైర్మన్, కృష్ణావాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌కూడా అయిన ఏబీ పాండ్య తేల్చిచెప్పారు. తాగునీటి అవసరాల కోసం వారంపాటు రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున 3.5 టీఎంసీల నీటిని వాడుకునేందుకు మాత్రమే అనుమతించారు. అదే సమయంలో ఈ నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిచేసి దానిని తెలంగాణ ప్రాంతానికి వినియోగించాలని అధికారులకు సూచించారు. మొదటి నుంచి సీమాంధ్ర సర్కారు కృష్ణాజలాల విషయంలో తొండి వాదనలకు దిగుతూనే ఉంది. తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కావాలంటూ రకరకాల పద్ధతుల్లో లాబీయింగ్ చేసి కరువు సీజన్‌లో నారుమళ్ల కోసం నీటిని తీసుకువెళ్లడానికి ప్రయత్నించింది. ఈ ఎత్తుగడలు గమనించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు గవర్నర్‌ను కలుసుకున్నారు.

tmc
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఉన్న వాస్తవ నీటి నిల్వల పరిస్థితిని ఆయనకు వివరించారు. తాగునీరు మినహా భిన్నంగా వెళితే నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుందని లెక్కలతో సహా వివరించారు. మరోవైపు సాగునీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అధికారులతో సమావేశమై రిజర్వాయర్ల పరిస్థితిని సమీక్షించారు. నాగార్జున సాగర్‌లో నీటి నిల్వలు అనూహ్యంగా పడిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోరిన 10 టీఎంసీల నీటిని ఇవ్వలేమని తెలంగాణ సర్కారు సీమాంధ్రకు తేల్చి చెప్పింది. కానీ 10 టీఎంసీల నీరు కావల్సిందేనని ఏపీ వివాదానికి దిగడంతో జాతీయ జలవనరుల సంఘం ఛైర్మన్ పాండ్య మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చారు. ఉదయం 10గంటలకు సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సాగునీటిశాఖ ముఖ్య కార్యదర్శిలతో భేటీ సమావేశమాయ్యరు. తెలంగాణ ప్రభుత్వం తమ అభ్యంతరాలను ఆయనకు వివరించింది. కృష్ణా డెల్టాలో మంచినీటి అవసరాలను తీర్చడానికి ఒకటి నుంచి రెండు టీఎంసీలు సరిపోతాయని, తాగునీటి పేరుతో సాగుకు నీటిని వాడుకోవాలనే కుట్ర దాగి ఉందనే అనుమానాన్ని పాండ్య ముందు వ్యక్తం చేశారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. శ్రీశైలంలో కనిష్ఠ స్థాయి అంటే 834అడుగుల నీరు ఉన్నందున నీటి విడుదలకు మార్గదర్శకాలు ఒప్పుకోవని చెప్పారు. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 517అడుగులకు పడిపోయింది. సాగర్ కనిష్ట నీటి మట్టం 510అడుగులు. ఆ తర్వాత చుక్కనీరు వదలడానికి వీల్లేదు. ఇప్పడు ప్రాజెక్ట్‌లో 7 అడుగులలో కేవలం 13టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. డెల్టాకు తాగునీటికే 10 టీఎంసీలు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఆధ్వాన్నంగా మారుతుందని వివరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు 2 టీఎంసీల నీరు సరిపోవన్నారు. తాగునీటికే 5 టీఎంసీల నీరు సరిపోతుందని చెప్పారు. డెల్టా ప్రాంతంలో వరినార్లు వేయలేదని ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. ఇరు ప్రభుత్వాల నుంచి సమాచారంను సేకరించిన అనంతరం పాండ్య గవర్నర్‌ను కలిశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తాగునీటి కోసం రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల పాటు 3.5టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు సరఫరా చేయాలని చెప్పారు. వారం రోజుల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోని నీటి మట్టాన్ని పరిశీలించి , అప్పటికీ వర్షాలు పడకపోతే పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

నీటి విడుదలకు ఓకే:

కేంద్ర జలవనరుల సంఘం మంగళవారం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కృష్ణా డెల్టా పరిధిలోని సీమాంధ్ర ప్రాంతానికి ఆరువేల క్యూసెక్కుల నీటిని ఏడు రోజులపాటు విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఈ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని షరతు విధించింది. ఈ మేరకు తగిన యంత్రాంగాన్ని కేంద్ర జలవనరుల సంఘం ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కోరింది. ఈ విధానంలో లోటుపాట్లు ఉంటే తరువాతి దశలో నీటి విడుదలపై తాము పునరాలోచించుకోవాల్సి ఉంటుందని కేంద్ర జలసంఘం చైర్మన్‌కు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి బీ అరవింద్‌రెడ్డి రాసిన లేఖలో స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ కుడి కాల్వకు రిజర్వ్ చేసిన నీటిని తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ఎద్దడి ఎదురైనపుడు వినియోగించుకుంటుందని లేఖలో పేర్కొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

పీపీఏల లొల్లి ఫట్

-ఏపీజెన్‌కో కొనుగోలు ఒప్పందాల రద్దు ఏకపక్షమన్న సీఈఏ
-జూన్ 2 నాటికి ఉన్న యథాతథస్థితికి ఆదేశం
-బెంగళూరు ఎస్‌ఆర్‌పీసీ భేటీలో వాడివేడిగా వాదనలు
తెలంగాణను సంక్షోభంలోకి నెట్టాలనుకున్న ఆంధ్ర సర్కారు దవడ పగిలింది. సాంకేతికాంశాల సాకుతో విద్యుత్ రంగంలో పీపీఏలు రద్దుచేసిన ఆంధ్రాబాబుల చెవులు మెలిపెట్టి తెలంగాణ తన కోటా తాను సాధించుకుంది. ముంచుకొచ్చిన సమస్యను మౌనగంభీర ముద్రతోనే ఎదుర్కొని తానేమిటో తెలంగాణ సర్కారు నిరూపించుకుంది. కేంద్రం జేబులో ఉన్నంత మాత్రాన దేశంలో వ్యవస్థలన్నీ దాసోహం కాబోవనే సందేశం బెంగళూరు సమావేశం విస్పష్టంగా ప్రకటించింది. ఈ విజయం రాబోయే అనేక వివాదాల్లో తెలంగాణకు ఇది ముందస్తు శుభసంకేతమై నిలిచింది.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై పేచీపెట్టిన ఆంధ్రాసర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. జూన్ 2వ తేదీ నాటి యథాతథస్థితి (స్టేటస్‌కో) కొనసాగించాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఏపీజెన్‌కో, ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్‌ఎల్‌డీసీ)ను ఆదేశించింది. ఏపీ సర్కార్ పీపీఏల వివాదంపై మంగళవారం బెంగళూరులో సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) సమావేశాన్ని నిర్వహించింది. వారం రోజులుగా పీపీఏల విద్యుత్ వివాదంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వివాదం మరింత జటిలమైతే ఏకంగా దక్షిణాది రాష్ర్టాల సదరన్ పవర్ గ్రిడ్‌కు ముప్పు పొంచి ఉండడంతో సదరన్ రీజనల్ పవర్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

project
సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఏపీ జెన్‌కో, తెలంగాణ జెన్‌కో, రెండు రాష్ర్టాల లోడ్ డిస్పాచ్ సెంటర్ల ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరుకాగా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ) ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. కమిటీ ముందు ఇరు రాష్ర్టాల ప్రతినిధులు వారి వారి వాదనలను సుదీర్ఘంగా వివరించారు. ఏపీజెన్‌కో, ఏపీఎస్‌ఎల్‌డీసీ ప్రతినిధులు ఇప్పటివరకు చెప్పిన వాదనలనే ఎస్‌ఆర్‌పీసీ ముందు ప్రస్తావించారు. తెలంగాణ ఎస్‌ఎల్‌డీసీ ప్రతినిధులు సాయిరాం, సురేష్‌బాబు, తెలంగాణ సదరన్ పవర్ డిస్కమ్ డైరెక్టర్ రఘుమారెడ్డి వాస్తవ పరిస్థితులను కమిటీకి వివరించడంతో పాటు ఆంధ్రా విద్యుత్ సంస్థల నక్కజిత్తుల చర్యలను ఎండగట్టారు.

ఏకపక్ష నిర్ణయాలు చెల్లవన్న కేంద్ర అధికారులు..

పీపీఏల వివాదంపై పూర్తి అవగాహనకు వచ్చిన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేషనల్ లోడ్ డిస్పాచ్‌సెంటర్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల అనుసరిస్తున్నామన్న ఏపీ జెన్‌కో, ఏపీఎస్‌ఎల్‌డీసీల వాదనతో విభేదించారు. జాతీయ సమగ్రత దృష్ట్యా అత్యవసర సర్వీసుల విషయంలో రాష్ర్టాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని స్పష్టంచేసినట్లు తెలిసింది. అంతే కాకుండా విద్యుత్ చట్టం-2003, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లలోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్లు సమాచారం. ఇరు రాష్ర్టాల మధ్య తలెత్తిన పీపీఏల వివాదంపై కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ తుది నిర్ణయం తీసుకునేంత వరకు జూన్ 2వ తేదీ వరకు అమలులో ఉన్న స్థితిని యధాతధంగా కొనసాగించాలని సదరన్ రీజనల్ పవర్ కమిటీ మెంబర్ సెక్రెటరీ ఎస్.ఆర్.భట్ నిర్దేశించారు. పీపీఏ వివాదానికి తెరలేపిన ఆంధ్రాసర్కార్ చర్య సరైంది కాదని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన సదరన్ రీజియన్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ), నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ) ఇప్పటికే ఏపీజెన్‌కో, ఏపీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎపీఎస్‌ఎల్‌డీసీ)ల దృష్టికి తీసుకువచ్చాయి. అయినా సరే తమ నిర్ణయం తమదేనంటూ ఆంధ్రా సంస్థలు మొండిగా వ్యవహరిస్తూ వచ్చాయి.

విద్యుత్ విభజనపై ఆంధ్రా రాద్ధాంతం

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం వినియోగాన్ని బట్టి విద్యుత్ విభజన జరిగింది. తెలంగాణ ప్రాంత వ్యవసాయరంగం భూగర్భజలాలపై ఆధారపడి ఉండడం, రాజధాని చుట్టూ పారిశ్రామిక కేంద్రాలు, హైదరాబాద్ జంటనగరాలు, సైబరాబాద్ పట్టణీకరణ తదితర కారణాలతో తెలంగాణ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ద్వారా మొత్తం విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణకు 53.89 శాతం, సీమాంధ్రకు 46.11 శాతం వాటాల నిర్ణయం జరిగింది. రాష్ట్ర విభజన క్రమంలో భాగస్వాములైన నిపుణులు వివాదాలకు ఆస్కారం లేకుండా పూర్తిస్థాయిలో కసరత్తు చేసి విద్యుత్ విభజన చేశారు.

భౌగోళికంగా ఎక్కడి విద్యుత్ ప్రాజెక్టు ఆ రాష్ర్టానికి చెందండంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏల) ప్రకారం విద్యుత్ లభ్యత ఇరు రాష్ర్టాలకు ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారపగ్గాలు చేపట్టిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడం ఇప్పట్లో సాధ్యం అయ్యే అవకాశం లేకపోవడంతో ప్రజానీకం దృష్టిని మళ్ళించేందుకు విద్యుత్ వివాదానికి ఆజ్యం పోసినట్లుగా భావిస్తున్నారు. మిగతా అంశాలన్నీ జనాభా ఆధారంగా విభజించినప్పుడు విద్యుత్ విభజన సైతం జనాభా ఆధారంగానే ఉండాలని సీమాంధ్ర సీఎం వాదన. ఇప్పటి వరకు ఈఆర్సీ జెన్‌కో పీపీఏలకు అనుమతివ్వని విషయాన్ని గుర్తించిన చంద్రబాబు పీపీఏలు అమలులో లేనందున అవి కొనసాగుతున్నట్లు కాదని, ఏపీ జెన్‌కో సమర్పించిన పీపీఏ ప్రతిపాదనలను ఈఆర్సీ పరిశీలించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో సదరు పీపీఏలను ఏపీ జెన్‌కో రద్దు చేసుకుంటున్నట్లుగా ఈఆర్సీకి గత మంగళవారం లేఖ రాసి వివాదానికి తెరలేపింది.

రద్దు రాద్ధాంతంతో తెలంగాణకు కష్టాలు

ఆంధ్రా సర్కార్ పీపీఏల రద్దు రాద్ధాంతంతో తెలంగాణకు వారం రోజులుగా కరెంటు కష్టాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే రుతుపవనాల రాక మరింత జాప్యం కావడంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో పీపీఏల పేచీతో ఆంధ్రాసర్కార్ 460 మెగావాట్ల(10మిలియన్ యూనిట్లు) విద్యుత్తును అడ్డుకోవడంతో తెలంగాణ విద్యుత్‌లోటుతో అతలాకుతలం అవుతున్నది. ఫలితంగా అధికారికంగా మూడు గంటల నుంచి ఆరు గంటల పాటు కరెంటు కోతలను ప్రభుత్వం అమలుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మూడు గంటల పాటు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో మూడు గంటల పాటు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటల పాటు, మండల కేంద్రాల్లో ఆరు గంటల పాటు, గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు గంటలకు పైగా కరెంటు కోతలను అమలు అవుతున్నాయి.

పీపీఏ నిప్పుల కుంపటి రాజేసి ఏపీఈఆర్సీ

రాష్ట్ర విభజనకు ముందు నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు(డిస్కమ్స్) ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనలను ఏపీఈఆర్సీ తిరిగి వెనక్కి పంపించి పీపీఏల నిప్పును రాజేసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. గత ఐదారు సంవత్సరాలపాటు ఏపీజెన్‌కో, డిస్కమ్‌లు కుదుర్చుకున్న పీపీఏలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిందనేది నగ్నసత్యం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2014-15)కు సంబంధించి నాలుగు డిస్కమ్‌లు ఈఆర్సీకి అందజేసిన విద్యుత్ ఛార్జీల పెంపుదల ప్రతిపాదనల నిర్ణయం తీసుకోలేదు. అంతే కాకుండా రాష్ట్ర విభజన నేపధ్యలో తెలంగాణ ప్రాంతంలోని రెండు డిస్కమ్‌ల పరిధిలో భౌగోళిక మార్పులు చోటుచేసుకున్నాయనే కారణంతో ఈఆర్సీ డిస్కమ్‌ల టారీఫ్ ఆర్డర్లను వెనక్కి పంపించింది.

దాంతో ఆంధ్రాసర్కారు మదిలో దురాలోచన రేకెత్తింది. 2009-10 ఆర్ధిక సంవత్సరం నుంచి 2013-14 ఆర్ధిక సంవత్సరం వరకు ఏపీజెన్‌కో పీపీఏలు ఈఆర్సీ ఆమోదం లేకున్నా డిస్కమ్‌ల టారీఫ్ అర్డర్లను ఈఆర్సీ ఆమోదించడం వల్ల ఏపీజెన్‌కో పీపీఏలకు ఆమోదం లేదనే అంశమే ఎక్కడా ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. ఎప్పుడైతే ఈఆర్సీ డిస్కమ్‌ల టారీఫ్ ఆర్డర్లను వెనక్కి పంపించిందో ఏపీజెన్‌కో పీపీఏలకు ఈఆర్‌సీ అమోదంలేదు అనే కుట్రకు తెరతీసినట్లయ్యింది. దాంతో ఏపీజెన్‌కో పీపీఏలు ఇంకా ఆమోదం పొందలేదు కనుక భౌగోళికంగా మా ప్రభుత్వం పరిధిలో ఉన్న ఏపీజెన్‌కో విద్యుత్ ఉత్పత్తిని మా ప్రభుత్వం ఆజమాయిషీలోని రెండు డిస్కమ్(విశాఖపట్నం, తిరుపతి)లకే విద్యుత్తును అందజేస్తామంటూ తిరకాసు పెట్టేందుకు ఆస్కారాన్ని ఏపీఈఆర్సీ కల్పించినట్లయ్యింది. పీపీఏల వివాదం కాస్తా ముదిరిపోవడంతో ఏపీఈఆర్సీ నాలుక కరుచుకుని ఏపీజెన్‌కో నాలుగు డిస్కమ్‌లతో పీపీఏలు కుదుర్చుకున్నందున జెన్‌కో, నాలుగు డిస్కమ్‌లు అంగీకరిస్తే తప్ప పీపీఏలు రద్దుచేయడం సాధ్యంకాదనే వాదనతో ఈఆర్సీ ఏపీజెన్‌కోకు ప్రత్యుత్తరం పంపించింది. అయినా ససేమిరా అంటూ ఏపీజెన్‌కో, ఏపీఎల్‌డీసీలు తమవైఖరిలో ఎలాంటి మార్పులేదని గిరిగీసుకున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!