గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 07, 2014

కాచిగూడలో కబ్జామేడ?!

-బోనావేకెన్సియా స్థలంలో భారీ భవనం
-రూ.30 కోట్ల భూమి కబ్జాదారుల పాలు
-లింక్ డాక్యుమెంట్ లేకుండా 15 రిజిస్ట్రేషన్లు
-టైటిల్ డీడ్ లేకున్నా జీహెచ్‌ఎంసీ పర్మిషన్
ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని నడిబొడ్డున సర్కారు భూమి కబ్జాదారుల ఖాతాకు చేరిన వైనమిది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు సైతం అమలుకు నోచని బాగోతమిది. కిందిస్థాయి అధికారులు ఎంత తాపత్రయపడ్డా పైస్థాయిలో కుమ్ముక్కు వ్యవహారంతో పట్టపగలు నడిబజార్లో రూ. 30 కోట్ల విలువైన భూమిలో బహుళ అంతస్తుల భవనం వెలిసిన కథ ఇది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు... రాజధాని నడిబొడ్డు కాచిగూడ చౌరస్తాలో ఈ అక్రమ బాగోతం చోటు చేసుకుంది.
kotireddyఇదీ కథ..: కాచిగూడ రైల్వేస్టేషన్ దారిలో దాదాపు 30 కోట్ల విలువ చేసే 2554 గజాల బోనావేకెన్సియా భూమి ఉన్నది. కాచిగూడలోని లింగంపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన 190 వార్డులోని జే బ్లాక్‌లోని టౌన్‌సర్వేనెంబర్ 29లో గల ఈ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమిత్రాబాయ్ అనే మహిళది. అందులో ఒక పాత ఇల్లు ఉంది. ఆమె మరణానంతరం ఈ ఆస్తికి వారసులెవరూ లేకుండా పోయారు. 1974లో వారసులు లేని భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ఏపీ బోనావేకెన్సియా చట్టాన్ని తీసుకువచ్చింది. 1976 నాటికి కూడా ఈ భూమిని ఎవ్వరూ క్లెయిమ్ చేయకపోవడంతో ప్రభుత్వం ఈ ఆస్తిని బోనావేకెన్సియా భూమికింద ప్రకటించి స్వాధీనం చేసుకున్నది. ఈ మేరకు రికార్డుల్లో కూడా వివరాలు నమోదు చేశారు. ఈ చట్టం కింద ప్రభుత్వం ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పటికీ నిజమైన వారసులు ఎవరైనా వచ్చి వారసత్వాన్ని రుజువు చేసుకుంటే స్వాధీనం చేసుకున్న ఆస్తిని వారికి తిరిగి ఇచ్చే వెసులుబాటు ఉంది. అయితే సుమిత్రాబాయ్‌కి వారసులు ఎవరూ లేకపోవడంతో ఈ భూమి తమదంటూ ఎవరూ రాలేదు. 1976 నుంచి 1982 వరకు ఈ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, లావాదేవీలు కానీ జరుగలేదు. ఈ భూమిలో ఉన్న పాత ఇల్లు కూడా శిధిలావస్థకు చేరింది. అయినా స్వాధీనం చేసుకున్న ఈ భూమిని ప్రజాఉపయోగ కార్యక్రమాలకు వినియోగించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు.

అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు

సర్కారు ఈ భూమిని నిరుపయోగంగా వదిలివేయడాన్ని అవకాశంగా తీసుకున్న కొంత మంది కబ్జాదారులు ఈ భూమిపై అనేక డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేశారు. అసలు భూమి యజమాని లేకుండా, భూమి హక్కుదారులు విక్రయించకుండా రిజిస్ట్రేషన్ అధికారులు భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది పెద్ద మిస్టరీ. ఒక భూమిని ఎవరైనా మరొకరికి రిజిస్టర్ చేయాలంటే టైటిల్ డీడ్‌ను ధ్రువీకరించే లింక్ డాక్యుమెంట్ ఉండాలి. కానీ ఈ భూమికి లింక్ డాక్యుమెంట్ లేదు. అయినా రిజిస్ట్రేషన్‌లు చకచకా జరిగిపోయాయి. ఎలాగూ వారసులు లేరు కాబట్టి ఎవరూ అడగబోరనే ధీమా ఇటు కబ్జాదారులకు అటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులకు ఉండి ఉంటుంది. మొత్తానికి 1982 నుంచి వరుసపెట్టి రిజిస్ట్రేషన్లు చేశారు. గుండిమల్లమ్మ అనే మహిళ 1982లో జయలక్ష్మికి విక్రయించినట్లు మొదటి రిజిస్ట్రేషన్ నమోదైంది. కానీ ఈ భూమితో గుండిమల్లమ్మకు ఎలాంటి సంబంధం లేదు. ఆస్తికి యజమాని అయిన సుమిత్రాబాయ్‌కి ఈమెకు సంబంధం లేదు.

ఆమె మల్లమ్మకు విక్రయించినట్టు డాక్యుమెంటు కూడా లేదు. అయినా రిజిస్ట్రేషన్ అధికారులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. తిరిగి 1984 అక్టోబర్ 15వ తేదీన 1982 డాక్యుమెంటుతో ఎలాంటి సంబంధం లేకుండా డీ నర్సింగ్‌రావు అనే వ్యక్తి ఈభూమిని డీ కమలమ్మ, ఎం శ్రీధర్ అనే వ్యక్తులకు విక్రయించారు. మరి జయలక్ష్మి ఏమైపోయిందో తెలియదు. ఆ తర్వాత కేవలం 22 రోజుల తేడాతో1984 నవంబర్7వ తేదీన ఇదే భూమిని సయ్యద్ హిదాయత్ మొయినుద్దీన్ అనే వ్యక్తి ఎలాంటి టైటిల్ డీడ్ లేకుండా సామరాజారెడ్డికి రిజిస్ట్రర్ చేశారు. వీళ్లకూ పైన పేర్కొన్నవారితో సంబంధం లేదు. ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయి. చనిపోయిన భూమి యజమానికి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిపై 1983 నుంచి అక్టోబర్ 2010 వరకు దాదాపు 15 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

అధికారులు ఏం చేస్తున్నారు..?

ఇలా వరుసగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు మాత్రం మౌనం దాల్చారు. ప్రభుత్వం ఒక బోనావేకెన్సియా ఆస్తిని స్వాధీనం చేసుకోగానే ఆ విషయాన్ని అధికారపూర్వకంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం తెలియజేస్తుంది. ఆ భూమి మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరోవైపు ఏ భూమిని రిజిస్టర్ చేయాలన్నా అందుకు సబంధించిన టైటిల్ సరైనవిధంగా ఉంటేనే రిజిస్టర్ చేస్తారు. కానీ ఇవేవి లేకుండా రిజిస్ట్రేషన్ అధికారులు అడ్డగోలుగా రిజిస్టర్ చేయడానికి పరిశీలిస్తే ఇందులో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తున్నది. ఏ రోజైనా వివాదం వచ్చినా దొరకకుండా ఉండేందుకే కబ్జాదారులు కావాలని ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా అనేక రిజిస్ట్రేషన్లు చేసినట్టు అర్థమవుతుంది.

మేలుకున్న అధికారులు..

ఇదిలా ఉంటే ఈ కబ్జాభూమిలో ఆరు అంతస్థుల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో స్థానికంగా కలకలం రేగగానే స్థానిక ఎమ్మార్వో, ఆర్డీఓలు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తి వివరాలు పైస్థాయి అధికారులకు తెలిపారు. హిమాయత్‌నగర్ రెవెన్యూ అధికారి ఈ అక్రమనిర్మాణాన్ని నిలిపివేయించారు. దీనితో భవన నిర్మాతలు తమ సొంత భూమిలో జరుగుతున్న నిర్మాణాలను స్థానిక రెవెన్యూ అధికారులు అడ్డుకుంటూ నోటీస్‌లు ఇచ్చారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాద ప్రతివాదాలను విన్న న్యాయస్థానం ఎమ్మార్వోలు, ఆర్డీఓలకు నోటీస్‌లు ఇచ్చే అధికారం లేదని చెప్పింది. ఈ మేరకు 2011 ఏప్రిల్ నెలలో ఎమ్మార్వో, ఆర్డీఓలు ఇచ్చిన నోటీస్‌లు చెల్లవని చెప్పింది. అదే సమయంలో బోనావేకెన్సియా 1974 చట్టం ప్రకారం టీ ఎస్ నెంబర్ 29కి చెందిన ఈ భూమి బోనావేకెన్సియాకు చెందినదైన పక్షంలో ఆ భూమిని రక్షించడానికి తగిన చర్యలు తీసుకునే అధికారం పై స్థాయి అధికారులకు ఉందని, ఆ మేరకు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.

న్యాయస్థానం అధికారాలను గుర్తుచేసినా....

అయితే న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వాదిస్తూ కబ్జాదారులు.. రెవెన్యూ అధికారుల అభ్యంతరాన్ని తోసిపుచ్చి నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అయితే న్యాయస్థానం తీర్పు ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నోటీస్‌లు ఇవ్వడం.. ఆ యా నోటీసుల ప్రకారం చట్టాన్ని అమలు చేయమని కిందిస్థాయి అధికారులైన ఎమ్మారో, ఆర్డీఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగి ఉంటే ఆ ఆస్తిని కాపాడే అవకాశం ఉండేది. అయితే ఆ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నోటీస్‌లు కానీ,ఆదేశాలు ఇవ్వకపోవడం విచిత్రం. ఈ భూమిపై వాస్తవ పరిస్థితిని నివేదిక రూపంలో హిమాయత్‌నగర్ ఎమ్మారో జిల్లా కలెక్టరు నివేదించినా ఫలితం లేకుండాపోయింది.

ఎన్‌ఓసీ లేకుండానే ..

ఇక జీహెచ్‌ఎంసీది మరో ఎపిసోడ్. నగరంలో ఏదైనా ఒక స్థలంలో ఒక నిర్మాణం చేపట్టాలంటే అందుకు జీహెచ్‌ఎంసీ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం భవనం నిర్మించే వారు జీహెచ్‌ఎంసీకి రెవెన్యూ అధికారులు ఇచ్చే నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసి), భవన నిర్మాణ ప్లాన్‌తోపాటు నిర్థిష్టమైన ఫీజులు చెల్లించి దరఖాస్తు చేయాలి. అయితే ఈ కబ్జాదారులు రెవెన్యూ ఎన్‌ఓసీ లేకుండానే దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు ఎవరికీ ఎన్‌ఓసీ ఇవ్వలేదు. అయినా ఆరు అంతస్తుల భవనానికి జీహెచ్‌ఎంసీ ఆమోదముద్ర పడింది. జీహెచ్‌ఎంసీ అధికారులు కళ్లు మూసుకొని టైటిల్ డీడ్ లేకున్నా, రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీ ఇవ్వకున్నా భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఎలా ఇచ్చారన్నది వారికే తెలియాలి. మొత్తానికి ఇవన్నీ కలిసి దాదాపు 30 కోట్ల విలువ చేసే బోనావేకెన్సియా భూమి కబ్జాదారుల పరమైంది. శ్రీ సాయి బాలాజీ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భవన నిర్మాణాన్ని చకచకా పూర్తి చేస్తున్నారు.

నమస్తే తెలంగాణ చేతికి ఎమ్మార్వో నివేదిక

ఈ భూమి విషయంలో జరిగిన పరిణామాలపై వాస్తవ పరిస్థితిని వివరిస్తూ స్థానిక ఎమ్మార్వో జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక సమర్పించారు. ఈ నివేదిక నమస్తే తెలంగాణ చేతికి చిక్కింది. కబ్జా అవుతున్నదని తెలిసినా కింది స్థాయి అధికారులు మొరపెట్టుకున్నా వారి మొరను ఆలకించేవాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరువయ్యారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం పరాధీనమవుతున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

హైకోర్టు తీర్పును తప్పుదోవ పట్టించారు!

-అక్రమ రిజిస్ట్రేషన్లకు హైకోర్టు ఉద్యోగి సూత్రధారి
-జస్టిస్ రవిశంకర్ ప్రతినిధినంటూ వ్యవహారం
-అమలులో లేని ఆదేశాలు చూపించి రిజిస్ట్రేషన్లు
-సబ్ రిజిస్ట్రార్ లేఖతో వెలుగులోకి
-హఫీజ్‌పేట సర్వే నంబర్ 77 కబ్జాలో కొత్త కోణం
సింగిల్ బెంచ్ తీర్పు చెల్లుబాటు కాదని డబుల్ బెంచ్ స్పస్టం చేసిన తర్వాత కింది పాత తీర్పుకు ఎలాంటి విలువ ఉండదు! డబుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలే అమల్లో ఉంటాయి! కానీ.. మాయగాళ్లకు మాత్రం అదో అడ్డంకి కానేకాదు! డివిజన్ బెంచ్ తీర్పు అమల్లో ఉండగానే.. సింగిల్ బెంచ్ తీర్పును ఉటంకిస్తూ రిజిస్ట్రార్ కార్యాలయాన్నే తప్పుదోవ పట్టించాడో ఘనుడు! పైగా.. తాను హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ప్రతినిధిగా వచ్చానని చెప్పుకొని సబ్ రిజిస్ట్రార్‌నే మోసంచేశాడు! ఎంచక్కా ఆరు రిజిస్ట్రేషన్లు చేసుకుని వెళ్లిపోయాడు!
scanజరిగిన పొరపాటును గుర్తించిన సదరు రిజిస్ట్రార్ ప్రత్యేక లేఖ ద్వారా ఈ విషయాన్ని హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్‌కు దృష్టికి తీసుకురావడంతో దీంతో హైకోర్టు పరిపాలనా కార్యాలయం అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది! హైకోర్టు కోర్టు చరిత్రలో ఇప్పటివరకు ఇలా వివరణ కోరిన దాఖలు లేవని న్యాయనిపుణులు అంటున్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం కోర్టుకు వెళతారు. ప్రజలకు అంతో ఇంతో ఇప్పటికీ న్యాయవ్యవస్థపైనే నమ్మకమున్నది. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా జరిగిన ఈ ఘటన వివరాల్లో వెళితే..

శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 77లోని భూమిలో కబ్జాదారులు అనేక వివాదాలు సృష్టించారు. ఈ భూమిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావించి ఖలీల్, ఖాసీమ్‌అలీఖాన్, అంజుం అరాలు హైకోర్టు సింగిల్ బెంచ్‌కు వెళ్లి తమకు అనుకూలంగా ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్‌లో అప్పీల్ నంబర్ 566/2013 పిటిషన్ కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ధర్మాసనం 2013 జూలై15న సర్వే నంబర్ 77లో దరఖాస్తుదారులకు భూమిని జీరో విలువ కింద రిజిస్ట్రేషన్ చేయాలని డిక్రీ ఇచ్చింది. దీంతో తమ భూమి తమకు కాకుండా పోతుందని భావించిన ప్రతివాదులు 946మంది డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లారు.

అప్పీల్ నంబర్1204/2013 కింద డివిజన్ బెంచ్ దానిని విచారణకు స్వీకరించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కే జైస్వాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కేసు పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించిన తరువాత సింగిల్ బెంచ్ ఇచ్చిన డిగ్రీ చెల్లుబాటు కాదని 2013 డిసెంబర్18న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు కోర్టు ప్రాసెస్‌ను దుర్వినియోగం చేసి కింది కోర్టులో డిగ్రీ తీసుకున్నారు. ఈ సీపీసీ చెల్లుబాటుకాదు అని స్పష్టం చేశారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు నేటికీ అమలులో ఉన్నాయి. ఈ ఉత్తర్వులు అమలులో ఉండగానే హైకోర్టు ప్రతినిధిగా సాయిబాబా అనే వ్యక్తి 2014 మార్చి17 నుంచి 20వ తేదీ వరకు ఆరు రిజిస్ట్రేషన్లు చేశారు. సింగిల్‌బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ డివిజన్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చిన తరువాత సింగిల్‌బెంచ్ ఉత్తర్వులు చెల్లుబాటు కావు. ఎప్పుడైనా పైకోర్టు ఉత్తర్వులే చెల్లుబాటు అవుతాయి.

పై కోర్టు ఉత్తర్వులు అమలులో ఉండగా.. ఏకంగా కోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రవిశంకర్ ప్రతినిధినంటూ సాయిబాబా అనే కోర్టు ఉద్యోగి గండిపేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఏ విధంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించాన్నది అంతు పట్టని ప్రశ్న. సహజంగా ఏ అధికారి అయినా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలంటే భయపడతారు. ఎవరైనా, ఎంతటి పెద్దవారైనా, ఎవరి ఆదేశాలూ అమలు చేయకపోయినా.. కోర్టు ఆదేశాలను మాత్రం తు.చ. తప్పకుండా అమ లు చేస్తారు. కోర్టు ఉత్తర్వులను భారతీయ సమాజం అంత పవిత్రంగా చూస్తుంది.

అలాంటి కోర్టు ఉత్వరులకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ఒక కోర్టు ఉద్యోగి అనుసరించిన తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా భూముల ఆక్రమణలు ఆగకపోతే తమను రక్షించేవారెవరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయిబాబా ఇలా రిజిస్ట్రేషన్లు చేయడంతో డివిజన్ బెంచ్ ఉత్తర్వుల విషయం తెలుసుకున్న గండిపేట జాయింట్ సబ్-రిజిస్ట్రార్ తన చేత ఎందుకు సర్వే నంబర్ 77లో రిజిస్ట్రేషన్లు చేయించారని ప్రశ్నిస్తూ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆర్‌ఎల్‌ఎన్ చార్యులుకు ఈ ఏడాది జూలై 21న ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు అధికారులు ఇప్పటి వరకు కనీస వివరణ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, సెప్టెంబర్ 06, 2014

అవినీతి సీటీవోపై బదిలీ వేటు...!!

-"లంచమిస్తే చారానా-లేకుంటే బారానా"వార్తతో కదిలిన అధికారులు
-ఆయన అక్రమ వ్యవహారాలపై విచారణ
-ప్రాధాన్యంలేని పోస్టుకు తరలింపు
వాణిజ్య పన్నులశాఖలో లంచావతారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీటీవో రవీంద్రనాథ్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీవేటు పడింది. జూబ్లీహిల్స్ సీటీవో అయిన ఆయన అక్రమాలను వెలుగులోకి తెస్తూ "లంచమిస్తే చారానా-లేకుంటే బారానా" అన్న శీర్షికన ఆగస్టు 3న నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంతో అధికారులు స్పందించారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా శుక్రవారం రవీంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆయనను ఫోకల్ పోస్టు నుంచి తొలగించి ప్రాధాన్యం లేని పోస్టుకు పంపారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌ను నియమించారు. కర్నూలుకు చెందిన వాణిజ్యపన్నుల అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి హైదరాబాద్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవారిని హడలెత్తిస్తున్నారని, లంచావతారమెత్తి విచక్షణారహితంగా షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వర్క్ కాంట్రాక్టర్లు, మ్యానుఫాక్చరర్స్, ట్రేడర్స్ ఆయన పేరు చెప్తే పారిపోయే పరిస్థితి నెలకొందని వివరించింది.

ఆయన మొదట అడ్డంగా పన్నులను బాది.. ఆ తర్వాత తన దారికొచ్చిన వారి నుంచి లంచాలు గుంజేవాడని, లంచం ఇవ్వడానికి నిరాకరిస్తే నిజాయితీగా పన్ను కట్టే వారికి భారీగా వడ్డింపులు వేస్తూ వేధించేవాడని వస్తున్న ఆరోపణలను బహిర్గతం చేసింది. పంజాగుట్ట డివిజన్ జూబ్లీహిల్స్ సర్కిల్‌లో పనిచేస్తున్న ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తన జేబులు నింపుకొని సర్కార్ ఖజానాకు గండి కొడుతున్న వైనాన్ని వివరించింది. కొన్ని కోట్ల రూపాయల్లో చేతివాటం ప్రదర్శించినట్లు రవీంద్రనాథ్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బదిలీవేటు వేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

తెలంగాణ గడ్డమీద ఆంధ్రాసాంగా?!

-ఆంధ్రా పత్రికల రుద్దుడు పాలసీ
-ఇక్కడి ఎడిషన్ల నిండా ఆంధ్రా వార్తలు
-అక్కడ మాత్రం మన వార్తలు మాయం
-అక్కడి పార్టీలను బతికించే కుట్రలు
-తెలంగాణ వాళ్లమంటూ ఆంధ్రాకు చందాలు
-ఆ మీడియాకు సర్కారు ప్రకటనలెందుకు?
-ఆ జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇండ్ల స్థలాలెందుకు?
-ఆపేయాలంటున్న తెలంగాణ వాదులు

మీకు మా వార్తలెందుకు? మీది తెలంగాణ పత్రిక కదా!... కొద్ది రోజుల క్రితం ఆంధ్ర శాసనసభలో నమస్తే తెలంగాణ పత్రిక ప్రతినిధికి ఎదురైన ప్రశ్న ఇది. సింపుల్‌గా చెప్పాలంటే మా రాష్ట్రం వేరు. మీ రాష్ట్రం వేరు. మా వార్తలు మీకు అక్కర్లేదు అని చెప్పినట్టు!....
దాని ప్రకారమే అయితే మన రాష్ట్రం కాని ఆంధ్రప్రదేశ్ వార్తలు మనకూ అవసరం లేదు.

కానీ ఈ నియమం తెలంగాణ గడ్డ మీద ప్రచురితమవుతున్న సీమాంధ్ర పత్రికలు పాటించడం లేదు. సరికదా పత్రికల్లో సింహభాగం స్థలం, టీవీల్లో అత్యధిక సమయం ఏపీ వార్తలకు ఏపీకి చెందిన రాజకీయ పార్టీలకు కేటాయిస్తున్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆంధ్రాకు చెందిన ప్రధాన పత్రికలు తెలంగాణ ఎడిషన్లలో ఏపీ వార్తలు గుప్పించి ప్రచురిస్తూ..

ఆంధ్రా ఎడిషన్లలో మాత్రం తెలంగాణ వార్తలకు చోటే ఇవ్వడం లేదు. అక్కడి నాయకులు దగ్గినా తుమ్మినా మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించే పత్రికలు ఇక్కడి నాయకులకు చెందిన ఎంత ప్రధాన వార్త అయినా పట్టించుకోవడం లేదు. ఈ వైఖరి మీద పాత్రికేయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఆయా మీడియాలు, పత్రికలు తెలంగాణకు ఇచ్చే సమయం స్థలం ఆధారంగా వాటిని తెలంగాణ లేదా ఆంధ్రా పత్రికలుగా గుర్తించాలని సీనియర్ పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ గడ్డమీద కూర్చుని ఆంధ్రాపాటలు పాడుతున్న పత్రికలకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ప్రోత్సహకాలు ఇచ్చేకన్నా అచ్చంగా తెలంగాణకు అంకితమైన పత్రికలను ప్రోత్సహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం విధానం రూపొందించాలి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి మూడు నెలలు దాటినా కొన్ని మీడియా సంస్థలు ఆంధ్ర ఆధిపత్య వార్తలనే ఇంకా హైలెట్ చేస్తూ ప్రచురిస్తున్నాయి. ప్రసారం చేస్తున్నాయి. వాటినే తెలంగాణ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. తమ సంస్థలు మద్దతు తెలిపే రాజకీయ పార్టీలను ఇంకా ఇక్కడ సజీవంగా ఉంచడం వాటి ద్వారా ఇంకా ఆంధ్ర పెత్తనాన్ని కొనసాగించడం లక్ష్యంగా పనిచేస్తున్నాయి.

తెలంగాణకు ద్రోహం చేసే విధంగా కొనసాగుతున్న వాటి వైఖరిలో మార్పు కనిపించడం లేదు. వృత్తిపరమైన విలువలకు తిలోదకాలిస్తూ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న ఈ మీడియా సంస్థలపై ప్రభుత్వ పరంగా ఎలాంటి వైఖరి అవలంభించాలనే విషయంపై చర్చ జరగాలి అని ఒక సీనియర్ పాత్రికేయుడు వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి తెలంగాణ వార్తలు, పూర్తి స్థాయి ఎయిర్ టైమ్ (ప్రసారాల సమయం) అందించే మీడియా సంస్థలేవి? సీమాంధ్రకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే సంస్థలేవి? అనే వాస్తవాలను లెక్కలు కట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా సమగ్ర అధ్యయనం చేసి భవిష్యత్తులో మీడియా పరంగా అనుసరించాల్సిన విధానానికి రూపకల్పన చేయాలి అని తెలంగాణ మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.

రాయితీలు తెలంగాణ పత్రికలకే దక్కాలి..
తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా పేరుతో ఇక్కడ కొన్ని పేపర్లు కొనసాగుతున్నాయని, ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే తెలంగాణ పేర్లతో ఉన్న పత్రికలను అక్కడి పాలకవర్గాలు లేదా రాజకీయ పార్టీల నేతలు వాటి ఉనికినే ప్రశ్నించే వారని జేఏసీ నేత ఒకరు పేర్కొన్నారు. తెలంగాణ గడ్డపై పత్రిక నడుపుతూ, తెలంగాణ వాడినని చెప్పుకుంటూ ఆంధ్ర రాజధాని కోసం చందాలు వసూలు చేయడంలోని ఆంతర్యం ఏమిటని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రా ఆధిపత్యాన్ని కొనసాగించేలా పని చేస్తున్న మీడియా సంస్థలను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి? వాటికి ప్రభుత్వ ప్రకటనలు ఎందుకు జారీ చేయాలి? అందులో పని చేసే వారికి ప్రభుత్వ గుర్తింపు (అక్రిడేషన్) కార్డులు ఎందుకు ఇవ్వాలి? హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న వారికి మేలు చేయాలి తప్ప, ఆంధ్రా దుర్భిద్ధితో వ్యవహరిస్తున్న వారికి లబ్ధి చేకూర్చే విషయంలో పునరాలోచన చేయాలని టీజేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కరెంటు కష్టాలకు కారకులెవరు?

వర్షం పడింది. విపక్షాల విమర్శల కు చెక్ పెట్టింది. ప్రకృతి ఆగ్రహాన్ని అధికార పక్షానికి అంటగడదామనుకున్నారు. కానీ కుదరలేదు.జల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది.వ్యవసాయానికి కోత లు చాలా మేరకు తగ్గాయి. పరిశ్రమల కు కోత ఎత్తేశారు. ఇపుడు కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి నుంచి మొదలుకుంటే జగ్గారెడ్డి దాకా వానదేవుణ్ణి ఏమంటున్నారో? అయినా.. 58 ఏళ్ల పాప ఫలితాలను 90 రోజుల్లో తుడిచేసే మంత్ర దండం కేసీఆర్ దగ్గర సైతం ఉండదని ప్రజలకు తెలుసు. కానీ తెలియనిదల్లా ప్రతిపక్షాలకేనా? కళ్లు మూసుకొని పిల్లి పాలు తాగినట్లు, ప్రతిపక్షాలు తమ పాప ఫలితాలపైనే కేసీఆర్‌ను ప్రశ్నించడం ఆశ్చర్యకరం.తెలంగాణ లో విద్యుత్ డిమాండ్ 7260 మెగావాట్లు. 
మొన్నటిదాకా విద్యుత్ లభ్యత 4500 మెగావాట్లు.అంటే 2760 మెగావాట్ల కొరత ఉండిందన్నమాట.ఇపుడు వర్షాలు కురిసి నాగార్జునసాగర్, శ్రీశైలం,ఇతర ప్రా జెక్టులు నిండుకొని జలవిద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఫలితంగా విద్యుత్ కొరతను చాలా మేరకు అధిగమించాం. ఒకవేళ మనకు జల విద్యుత్ సభ్యత లేనపుడు మాత్రమే విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటున్నదని మనం గమనించాలి. అయితే జలవిద్యుత్ లభ్యత లేనపుడు డిమాండ్‌కు తగ్గ ఇతర (బొగ్గు, గ్యాస్ వంటి) విద్యుత్ ఉత్పత్తులను తెలంగాణ ఎం దుకు కలిగిలేదు. దానికి కారకులెవరు?

థర్మల్, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి తెలంగాణలో తక్కువ. అలాగే ప్రైవేటు విద్యుదుత్పత్తి ప్లాంట్లు సీమాంధ్రలోనే ఉన్నాయి. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉన్నా, ఆ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇప్పటివరకు ఏ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేస్తున్నదో ఆప్రాంతానికి యథాతథంగా కొనసాగించాలని విభజన బిల్లు చెపుతున్నది.అయినా సీమాంధ్ర లో ఉన్న ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను అడ్డుకునేందుకు పీపీఏలను రద్దు చేయించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు మనకు తెలిసినవే. ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి జరుగుతు న్న విద్యుత్ సరఫరా యథాతథంగా కొనసాగాలని బిల్లులో చెప్పబడ్డది.ఉమ్మడి రాష్ర్టాన్నేలిన టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో ఉన్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి కేంద్రాల స్థాపన తెలంగాణలో ఎందుకు జరపలేదు? ఆ పాపం ఎవరిది?

బోరుబావులపై ఆధారపడిన తెలంగాణలో విద్యు త్ డిమాండ్ సీమాంధ్రలో కంటే ఎక్కువ. కానీ సీమాంధ్రలో 9500 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుం టే, తెలంగాణలో 7000 మెగావాట్ల ఉత్పత్తి చేయగల కేంద్రాలు మాత్రమే ఉండడం గమనార్హం. వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి కేంద్రాలను స్థాపించని గత ప్రభుత్వాల పాప ఫలితాలను ఇవాళ తెలంగాణ అనుభవిస్తున్నది.ఈ పాపాలకు కారకులైన పార్టీ లే ఇపుడు విద్యుత్ కొరతపై మాట్లాడటం చూస్తుం టే... రాజకీయాలు ఎంత సిగ్గుమాలిన తనానికి దిగజారాయో ఎవరికైనా అర్థమవుతున్న విషయం. మన ప్రాంతం,మన తెలంగాణ అనే సోయి ఈ పార్టీలకు మొదటి నుంచి ఉంటే.. ఇవాళ తెలంగాణ కరెం టు కొరతను ఎదుర్కొనేదే కాదు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలకు 50కి తగ్గకుండా శాసనసభ్యులను తెలంగాణ ప్రాంతం గెలిపిస్తూ వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచిన ఇరుపార్టీల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు సొంత సోయి తప్ప, సొంత ప్రాంతం సోయి ఏనాడూ లేదు.బొగ్గు, నీరు, భూమి లాంటి వనరులన్నీ తెలంగాణలో ఉండగా, థర్మల్‌పవర్ ప్రాజెక్టులను సీమాంధ్రలో ఎందుకు నిర్మించారో ఆరెండు పార్టీలు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదందామా? సింగరేణి బొగ్గు కడప జిల్లాలో ని రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఏటా సుమారు 4 మిలియన్ టన్నుల సరఫరా కొనసాగుతున్నది. బొగ్గు తెలంగాణది. ప్రాజెక్టు సీమాంధ్రది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, గత ప్రభుత్వాలు తెలంగాణలో కావాలని విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను స్థాపించలేదని చెప్పడానికి! బొగ్గు ఎక్కడ ఉందో థర్మల్ పవర్ ప్రాజెక్టుల స్థాపన కూడా అక్కడే జరగాలి. దానితో బొగ్గు రవాణా ఖర్చు కూడా ఆదా అవుతుంది. విద్యుత్ ధర కూడా ఆమేరకు తగ్గుతుం ది. కానీ అలా జరగలేదు.

విభజన బిల్లు సందర్భంగా తెలంగాణ విద్యుత్ కొరతను తీర్చడానికి కేంద్రం కూడా సహకరిస్తుందని ఈ దేశ ప్రధాని హామీ ఇచ్చారు. ప్రధానిగా అపు డు మన్మోహన్ ఉన్నారు. ఇపుడు మోడీ ఉన్నారు. విచిత్రమేమిటంటే.. కేసీఆర్ అడుగలేదు, విద్యుత్ ఇవ్వలేదు అని మొన్ననే కేంద్ర విద్యుత్‌మంత్రి పియూష్ వ్యాఖ్యానించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు రోజులకే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి తెలంగాణ సమస్యలన్నింటిని విన్నవించా రు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు సహకా రం అందించాలని ప్రత్యేకంగా కోరారు.

అలాగే ఎన్‌టీపీసీ కొత్త థర్మల్‌విద్యుత్ ప్లాంట్లను స్థాపించి, సుమారు 4000 మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణకు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన సందర్భంగా తెలంగాణకు హామి ఇచ్చింది. ఇచ్చిన హామీని వేగంగా అమలు చేయాలని కూడా కేసీఆర్ ప్రధానిని కోరారు.అంతేకాదు, గత 90రోజుల్లో టీఆర్‌ఎస్ ఎంపీల బృందాలు, తెలంగాణ విద్యుత్ కొరత తీర్చాలంటూ విద్యుత్‌శాఖ మంత్రితోపాటు అనేక మంది మంత్రులుకు వివరించి, విజప్తులు సమర్పించుకున్న వార్తలు మనం బోలెడు చూశాం.

స్వయాన బీజేపీ ఎంపీ దత్రాత్రేయ సైతం తెలంగాణ విద్యుత్ సమస్యను తీర్చాలంటూ ఇదే కేంద్ర విద్యుత్ మంత్రిని కలిసి విన్నవించి, విజ్ఞాపన పత్రం ఇచ్చినట్లు ఆ మధ్య నమస్తే తెలంగాణ పత్రికలోనే ఓ వార్తను చూశాం. బీజేపీ తెలంగాణలో రైతులను రెచ్చగొడుతూ విద్యుత్ సబ్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేసి న సంఘటనలున్నాయి.ఇపుడు అదే పార్టీకి చెందిన కేంద్రమంత్రే తెలంగాణ విద్యుత్ కొరత సమస్యను ఎవరూ నా దృష్టికి తీసుకురాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడం చూస్తే ఆ మంత్రి రాజకీయ మర్మంతో మాట్లాడుతున్నారని ఎవరికైనా అర్థమవుతుంది. మెదక్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని, టీఆర్‌ఎస్ ను అపవాదు చేసేందుకన్నట్లు ఒక కేంద్రమంత్రి అబద్ధాలు చెప్పే స్థాయికి దిగజారడాన్ని.. స్వయాన బీజేపీ సానుభూతిపరుడు సైతం సమర్థించలేడని ఆ మంత్రి తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది.

ఒక్క హైదరాబాద్ నగరానికే 2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో కేంద్ర పరిశ్రమలు, రక్షణ పరిశ్రమలున్నాయి.అలాగే హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని కూడా. తెలంగాణతో ప్రత్యక్ష సంబంధంలేని ఈ విద్యుత్ వినయోగం సమారు వెయ్యి మెగావాట్ల వరకు ఉంటది. కనీసం ఉమ్మడి రాజధాని, కేంద్ర పరిశ్రమలు, రక్షణ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ విషయంలోనైనా కేంద్ర మంత్రికి తెలియదనుకుందామా? సహకరించే బాధ్యత లేదందామా? ఇవాళ విద్యుత్ సమస్యకు కారకులే విమర్శకులై ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకోవడమే నిజంగా హాస్యాస్పదం.

చంద్రబాబు పాలనలో మొదలైన విద్యుత్ సమ స్య నేటికీ తీరలేదు. ఉచిత విద్యుత్ ముసుగులో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపనకు వైయస్ (కాంగ్రెస్)ఎగనామం పెట్టారు.ఇపుడు తెలంగాణలో విద్యుత్ కొరత సమస్య ఉందని తమకు తెలియనే తెలియదని ఓ కేంద్ర మంత్రి వ్యాఖ్యానిస్తున్నారు.తెలంగాణలో విద్యుత్ సమస్యకు ఏ పార్టీ కారణం కాదందామా? ఇవాళ ఆపార్టీలే ఒంటి కాలిపై లేచి కరెంటు సమస్యను ఎన్నికల సమస్యగా మార్చాలనుకోవడం ఎంత విచిత్రం?

ఏదిఏమైనా, తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఒక విజన్‌తో ఎన్నుకున్నారనడంలో అనుమానం లేదు.ప్రజలు ఆశించిన విజన్‌తో పని చేస్తున్నంత కాలం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. విద్యుత్ సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న మాట నిజం. ప్రతిఏటా విద్యుత్ కొరతను అధిగమిస్తూ మూడేళ్ల వరకు పూర్తిగా అధిగమించి మిగులు విద్యు త్ రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ చెపుతూనే వస్తున్నది. అంతేకాదు, ఆ దిశగానే పనిచేస్తూ ఛత్తీస్‌గఢ్ నుంచి కొత్త కారిడార్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అది పూర్తయితే సుమారు 2000 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.

అలాగే తెలంగాణ సింగరేణి అపార బొగ్గు నిల్వల ఆధారంగా స్వయంగా తెలంగాణ ప్రభుత్వం విద్యు త్ ప్లాంట్లను స్థాపించి కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రణాళిక ఉంది. వర్తమాన కాలంలో సోలార్ విద్యుదుత్పత్తి కూడా అనేక రంగాలలోకి విస్తరించనుంది. ప్రజలు ఒక విజనరీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనే విషయాన్ని మర్చిపోతారని అనుకోలేము. అలాగే ప్రజల విజన్ నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ తప్పటడుగు వేసినా ప్రజలే నిలదీస్తా రు. కానీ ప్రాంతానికి అన్యాయం చేసిన రాజకీయ శక్తులు నిలదీసే నైతకతను ఏమేరకు కలిగి ఉన్నాయనేదే ఎవరినైనా ఆలోచింపచేసే ప్రశ్న.

తెలంగాణ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సంప న్న ప్రాంతమే. సంపన్న ప్రాంతంలో సమస్యలు సృష్టించబడ్డాయి. విద్యుత్ సమస్య కూడా అలాంటిదే. సమస్యను సృష్టించిన రాజకీయ శక్తులే ఇపుడు విమర్శలకు దిగుతున్నాయి. నిధులు, నీళ్లు, నియామకాల్లో తీవ్ర అన్యాయం చేసిపెట్టిన రాజకీయ శక్తులపై పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు కారకులను గుర్తించనంతటి అమాయకులు మాత్రం కారని వారు తెలుసు లేకపోవడమే కొసమెరుపు.

శుక్రవారం, సెప్టెంబర్ 05, 2014

ఫీజు రీయింబర్సుమెంటు మహత్వం...!!

-విద్యార్థులు కరువై కళాశాలలు వెలవెల
- స్వయంగా మరణశాసనం రాసిన గత ప్రభుత్వం.. రీయింబర్స్‌మెంటుతో ప్రైవేటుకు లబ్ధి
- లాభసాటి వ్యాపారంగా ప్రైవేటు కాలేజీలు.. నగదు, సెల్‌ఫోన్లతో యాజమాన్యాల ఎర
- సర్కారు కాలేజీలపై ఏటా కోట్లు వ్యయం.. నిష్ఫలమవుతున్న యూజీసీ నిధులు
- ఫాస్ట్ పథకంలోనైనా మార్పు తేవాలంటున్న విద్యావేత్తలు

విశాలమైన ఆవరణ.. పెద్దపెద్ద గదులు.. భారీ వరండాలు.. గదుల నిండా ఫర్నిచర్.. బ్లాక్ బోర్డులు.. గాలీ వెలుతురుతో ఆహ్లాదకరమైన తరగతులు.. లైబ్రరీ.. ల్యాబ్‌లు.. క్రోటన్ మొక్కల వరుస.. బయట గేటు మీద ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతో సగర్వంగా బోర్డు! ఇదీ ఒకనాటి వైభవం. ఈ కళాశాలలనుంచే మహానాయకులు, అత్యున్నత స్థాయికి ఎదిగిన అధికారులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, సాహిత్యకారులు ఎందరెందరో ఉద్భవించారు. ఈ కళాశాలల్లోనే దేశానికి కొత్త మార్గాలు చూపించిన ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. నేను చదివిన కళాశాల అని రొమ్ము విరుచుకుని సగర్వంగా చెప్పుకోగలిగిన చరిత్ర! నేను పాఠాలు చెప్పాను అంటూ అధ్యాపకులు ఉదహరించగలిగిన వైభవం! సకల సమాజ వర్గాలన్నింటినీ ప్రతిబింబించిన మరో ప్రపంచం. దశాబ్దాలపాటు వెలుగు వెలిగి, లక్షలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దిన ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఇవాళ శిథిలాలయాలుగా మారిపోయాయి. చదివే విద్యార్థులే దొరకక కునారిల్లుతున్నాయి. ప్రైవేటీకరణ మహమ్మారి, ప్రభుత్వమనే మాయలమారి కాసుల వేటలో తెచ్చిన ఒక్క పథకం వాటన్నింటి ఉసురు తీసింది!!
sknr2
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. నిర్వహణకోసం ఏటేటా కోట్ల రూపాయలు వ్యయంచేస్తూ వీటిని నిలబెట్టాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. విద్యార్థులు వీటివైపు కన్నెత్తి చూడటం లేదు. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఏటా ఈ కాలేజీలకు మంజూరు చేస్తున్న కోట్ల రూపాయలు కూడా నిరుపయోగం అవుతున్నాయి. ప్రైవేటు కాలేజీల ప్రకటనల పటాటోపం ముందు ప్రభుత్వ కళాశాలలు కనిపించడం లేదు. ఎదురు డబ్బులిచ్చి ఎర వేయడాలు, సెల్‌ఫోన్లు బహుమతులిచ్చే వ్యాపార సంస్కృతి ముందు ఈ కళాశాలలు వెలవెలబోతున్నాయి. సకల సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వ కళాశాలలు వెనుకబడడం అంటుంచి రేసులోనే లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల దుస్థితిపై కరీంనగర్ జిల్లావ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో ఆ డిగ్రీ కళాశాలలు వెంటిలేటర్‌పై ఉన్న వాస్తవం వెల్లడైంది. తక్షణమే పూనుకొని ఏదో ఒకటి చేయకపోతే అవి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందనే నిజం బయటకు వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓవైపు ఈ కళాశాలలను బతికించేందుకు ప్రయత్నించానన్న ప్రభుత్వమే తన చేతులతోనే వాటి ఆయువును కూడా హరించేందుకు సిద్ధపడింది. పేద విద్యార్థుల కోసమంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమే ఇపుడు ప్రభుత్వ కాలేజీలకు మరణశాసనమైంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో డిమాండ్‌కు తగిన స్థాయిలో లేని సాంకేతిక (ఇంజినీరింగ్) విద్య, వైద్య విద్య, ఇతర వృత్తిపరమైన కోర్సులకు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ఫీజులు చెల్లించడంలో న్యాయం ఉంది. ఎలాగూ సర్కారు కళాశాలలు తగిన స్థాయిలో లేనపుడు విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అది అవసరం కూడా. కానీ ప్రత్యేక పరిస్థితిలో ఆ కోర్సులకోసం ప్రవేశపెట్టిన రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆ అవసరమే లేని కోర్సులకు కూడా వర్తింపచేయడం మాత్రం దారుణం. అప్పటి ప్రభుత్వం కొందరు దళారులతో కుమ్మక్కయి ఈ పథకాన్ని డిగ్రీ కళాశాలలకు సైతం వర్తింపజేసింది.

వాస్తవానికి ప్రభుత్వరంగంలోనే విద్యార్థుల డిమాండ్‌కు సరిపోయినన్ని కళాశాలలున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరిగితే అవసరాన్నిబట్టి ఎన్ని తరగతులనైనా విస్తరించుకునే స్థాయిలో విశాలమైనభవనాలూ ఉన్నాయి. అయినా కాసుల కక్కుర్తితో ప్రైవేటు కళాశాలలకు కూడా ఈ పథకం వర్తింపచేశారు. దానితో ప్రైవేటు కళాశాలలు కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చాయి. నాలుగు డబ్బులు చేతిలో ఉన్న ప్రతివాడూ ఓ కాలేజీ పెట్టేశాడు. నాలుగు గోడలుంటే తరగతి గది. నాలుగు గదులుంటే కళాశాల అన్నట్టు పరిస్థితి తయారైంది. పాతికాపరకా ఇచ్చి లెక్చరర్లను పెట్టుకుని లాగిస్తూ విద్యార్థులకు సర్కారు అందించే సొమ్ముతో కోట్లు సంపాదించడం ప్రారంభమైంది. పోటీ పెరిగి సర్కారు ఇచ్చే సొమ్ములోంచి కొంత డబ్బు ఎదురు చెల్లింపులు, సెల్‌ఫోన్లవంటి ఆఫర్లు పుట్టుకొచ్చాయి. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు చావుకు దగ్గరయ్యాయి.

పది జిల్లాల్లో 113 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు

తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో 113 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 11 చొప్పున ఉండగా, కరీంనగర్‌లో 16, వరంగల్‌లో 13, నిజమాబాద్‌లో 9, మహబూబ్‌నగర్‌లో 18, మెదక్‌లో 15, రంగారెడ్డిలో 5, హైదరాబాద్‌లో 7 కాలేజీలున్నాయి. ఇవన్నీ దాదాపు స్వంత భవనాల్లో ఉన్నాయి. ఈ కాలేజీలకు ఆర్థికశాఖ 2761 అధ్యాపక పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం 1384 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు.

1377 పోస్టులు ఖాళీగా ఉండగా కాంట్రాక్టు విధానంపై లెక్చరర్లు పనిచేస్తున్నారు. ప్రతి కాలేజికి ఒక్క గ్రంథపాలకుడి పోస్టు, క్రీడాఅధ్యాపకుడి పోస్టు, ఒక ప్రిన్సిపాల్ పోస్టు ఉన్నాయి. కాలేజీ నిర్వహణకు 15మంది బోధనేతర సిబ్బంది పోస్టులున్నాయి. ఈ విధంగా 113 కాలేజీల్లో 1800ల మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా మరో 500 మంది ఆఫీసు సబార్డినేట్స్ విధులు నిర్వహిస్తున్నారు. సగటున ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.2కోట్ల దాకా వ్యయం చేస్తున్నది. అన్ని కళాశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టుతో పాటు కనీసం ఇరవై లెక్చరర్ల పోస్టులున్నాయి. డిగ్రీ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ వేతనాలు చెల్లిస్తున్నారు. ఉపన్యాసకుల కనిష్ఠ వేతనమే నెలకు యాభై వేలుగా ఉంది.

ఏ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్‌కైనా కనీస వేతనం లక్ష రూపాయలుంది. బోధనేతర సిబ్బందిని కూడా కలుపుకొంటే ఒక కాలేజీ నిర్వహణకు రెండు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, కరీంనగర్, జగిత్యాల, గోదావరిఖని తదితర పెద్ద పెద్ద కళాశాలలకోసం ఏటా 3నుంచి 4కోట్ల రూపాయలను కేవలం వేతనం కింద చెల్లిస్తున్నది. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఏటా దాదాపు రూ.250 కోట్లు, వేతనాలు కాకుండా ఇతర నిర్వహణ కోసం మరో రూ.100కోట్ల వ్యయం జరుగుతున్నది. దాదాపు అన్ని డిగ్రీ కాలేజీల్లోను ల్యాబ్స్, కంప్యూటర్స్‌వంటి సౌకర్యాలు సమకూరాయి. ప్రతి కాలేజీలోను పదివేలకు తగ్గకుండా పుస్తకాలతో గ్రంథాలయాలున్నాయి.

వెల్లువలా యూజీసీ నిధులు..

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగాన్ని పటిష్ఠం చేసే లక్ష్యంతో యూజీసీ న్యాక్ బృందం ప్రతి కాలేజీలో ప్రయోగశాలలు, క్రీడా పరికరాలు తదితరాలను పరిశీలించి, గ్రేడింగ్స్ ఇస్తుంది. ఏ, బీ క్యాటగిరీల్లోని కాలేజీల్లో వసతులను మరింత మెరుగు పర్చుకునేందుకు ఇతర విద్యా సౌకర్యాల కల్పనకు ఏటా రూ.కోటి మంజూరు చేస్తున్నారు.

అర్హత గల అధ్యాపకులకే అవకాశం..

డిగ్రీ కళాశాలల్లో బోధనకోసం అన్ని అర్హతలున్న అధ్యాపకులను మాత్రమే తీసుకుంటున్నారు. గతంలో పీజీ కోర్సులో 55% మార్కులు సాధించిన వారినే లెక్చరర్ పోస్టుకు అర్హులుగా పరిగణించేవారు. యూజీసీ తెచ్చిన మార్పుల నేపథ్యంలో అర్హతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పీజీతో పాటు జాతీయ స్థాయి ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), లేదా స్లెట్ (స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్), పీహెచ్‌డీ అర్హతగా నిర్ణయించారు. ప్రిన్సిపాల్‌గా ప్రమోషన్ పొందాలంటే అధ్యాపకుడు కచ్చితంగా పీహెచ్‌డీ చేసి ఉండాలనే నిబంధన తెచ్చారు. జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కాలేజీ అధ్యాపకులుగా ప్రమోషన్ పొందాలన్నా పై అర్హతలుండాలి. పీడీ, లైబ్రేరియన్‌సైతం తమ కోర్సులో నెట్, స్లెట్, పీహెచ్‌డీలను సాధించాల్సిందే.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్ కాలేజీలు

రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో వివిధ వర్సిటీలకు అనుంబంధంగా 1400 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు పుట్టుకువచ్చాయి. అర్హత కలిగిన అధ్యాపకులు, ఐదు ఎకరాలకు తగ్గకుండా కళాశాల స్థలం, అన్ని రకాల ప్రయోగశాలలు, గ్రంథాలయం ఉంటేనే డిగ్రీ కళాశాలకు అనుమతిని ఇవ్వాలనే నిబంధనలున్నాయి. అయితే 90% ప్రైవేటు కాలేజీలకు ఇవేవీ ఉండవు. ఒకటి, రెండు కాలేజీల్లో తప్ప, ఎక్కడా నెట్, స్లెట్, పీహెచ్‌డీ అర్హత కలిగిన అధ్యాపకులు లేరు. ఇలాంటి 1400 ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న దాదాపు లక్షన్నర మంది విద్యార్థులకు ఏటా ఫీజు కింద వేల కోట్లను చెల్లిస్తున్నది.

జగిత్యాల ఉదాహరణ..

జగిత్యాలను ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ విశాలమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినాపట్టణంలో ఉన్న ఆరు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న ఆరువేల మంది విద్యార్థులకు (ఒకొక్క విద్యార్థికి ఏటా రూ.పదివేల ఫీజు) రూ.6 కోట్లు ఏటా చెల్లిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీసం 400మంది విద్యార్థులు కూడా లేకుండా పోయారు. ఎలాగూ రీయింబర్స్‌మెంట్ వస్తుంది కదా అని పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరితే రూ.500లను వర్సిటీకి రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. ప్రైవేట్ కాలేజీల్లో చేరితే ఒక్కరూపాయి తగలకపోగా, కాలేజీ నిర్వహకులే ఏడాదికి రెండు నుండి నాలుగు వేలు విద్యార్థులకు ఎదురు చెల్లిస్తున్నారు. సెల్‌ఫోన్ గిఫ్టుగా ఇస్తున్నారు. మొత్తానికి మొత్తం ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుండడంతో కాలేజీ యాజమాన్యాలకు వచ్చిన లాభాల మహిమ అది.

లాభసాటి వ్యాపారం..

గత ప్రభుత్వం అనాలోచితంగా డిగ్రీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే తప్పుడు నిర్ణయంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు లేకుండా పోయారని అధ్యాపకులు, విద్యావేత్తలు వాపోతున్నారు. ప్రభుత్వ కాలేజీలు తక్కువగా ఉన్న ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులకు రీయింబర్స్‌మెంట్ అంటే అర్థం ఉందిగాని, సాధారణ డిగ్రీ కోర్సులకు ఎందుకు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. నూతన రాష్ట్రంలోనైనా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ పథకం స్థానంలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఫాస్ట్ పథకంలోనైనా నిబంధనలు మార్చాలని వారు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఇక నదుల నీళ్లే మంచితీర్థం...!

- తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు వ్యూహరచన
- పది జిల్లాలకు తాగునీరందించే బృహత్‌పథకం
- త్వరలో సీఎం ముందుకు రానున్న నివేదిక
- 2051 నాటి డిమాండ్‌కు తగిన ప్రణాళిక
- గ్రావిటీ, పంపింగ్ విధానాలతో అన్ని గ్రామాలకు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నదులనుంచి నీరందించే బృహత్‌పథకం సిద్ధమైంది. ఈ పథకం ప్రకారం రాష్ట్రంలోని పది జిల్లాలను కలుపుతూ ఒక వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తారు. దీనికి వివిధ నదులనుంచి నీరు సేకరించి ఈ గ్రిడ్ ద్వారా పది జిల్లాల్లో ప్రతి గ్రామానికి ఆ నీరు సరఫరా చేస్తారు. ఈ పథకానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముందుకు త్వరలో రానుంది. రాష్ట్రంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
cm-kcrముఖ్యమంత్రి సూచనల మేరకు సాంకేతిక నిపుణుల నేతృత్వంలో ఈ మహాప్రణాళికకు రూపకల్పన జరిగింది. ఈ నివేదికను జలమండలి ఇన్‌చార్జ్ ఎండీ జగదీశ్వర్ త్వరలోనే సీఎం కేసీఆర్ ముందుంచనున్నారు. ఈ పథకం అమలులోకి వస్తే రాష్ట్రంలో మారుమూల పల్లె నుంచి హైదరాబాద్ నగరం దాకా ఇంటింటికీ నదుల నీరు రక్షిత జలాల రూపంలో అందుతుంది. తెలంగాణ వాటర్ గ్రిడ్‌గా పిలిచే ఈ పథకానికి గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న తాగునీటి గ్రిడ్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తికి 70 లీటర్లు, పట్టణ నగరాల్లో 150 లీటర్ల నీరు అందిస్తారు. ఈ పథకానికి 2021, 2031, 2041, 2051 సంవత్సరాలకు సరిపోయే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు.

ఏ నది నుంచి ఎంత?

TG_water-Gridరాష్ట్రంలో ఉన్న నదుల్లో ఎక్కడి నుంచి? ఏ పాయింట్ నుంచి ఎంత నీటిని తీసుకోవచ్చునన్న దానిపై నిపుణులు అధ్యయనం చేశారు. కృష్ణానది నుంచి జూరాల రిజర్వాయర్, కల్వకుర్తి ఎల్‌ఐఎస్ పాయింట్, శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జునసాగర్ రిజర్వాయర్, పాలేరు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ(పాక్షికం)ల నుంచి నీటిని సేకరించే అవకాశముందని తేలింది. అలాగే గోదావరి నది నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్, ఎల్లంపల్లి/ప్రాణహిత, దేవాదుల ఎల్‌ఐఎస్, దుమ్ముగూడెం ఎల్‌ఐఎస్‌ల నుంచి తీసుకోవచ్చు. ఇక మంజీరా నది నుంచి సింగూరు, నిజాంసాగర్‌ల ద్వారా మంచినీటి సరఫరాకు అవసరమైన నీటిని పొందవచ్చు.

2021నాటికి 122 టీఎంసీలు అవసరం: రాష్ట్రంలో తాగునీటి అవసరాలు గమనిస్తే 2021వరకు 122.04 టీఎంసీలు అవసరమని అంచనా. అందుకోసం జూరాలనుంచి 9.5 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 3 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 6.7 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 33.46 టీఎంసీలు, దుమ్ముగూడెం నుంచి 4 టీఎంసీలు, దేవాదుల నుంచి 8.4 టీఎంసీలు, ప్రాణహిత/ఎల్లంపల్లి నుంచి 32.58 టీఎంసీలు, ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి 13.83 టీఎంసీలు, నిజాంసాగర్ నుంచి 4.35 టీఎంసీలు, సింగూరు నుంచి 5 టీఎంసీలు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి 1.2 టీఎంసీలు తీసుకునే వీలుందని అధికారులు గుర్తించారు.

సరఫరా ఎలా?: ఆయా ప్రాంతాలనుబట్టి గ్రావిటీ ద్వారా ఎంఎస్ పైపులైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. అవసరమైన చోట పంపింగ్ విధానానికి రూపకల్పన చేస్తారు. మెయిన్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్ నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాలకు సరఫరా చేస్తారు. అటునుంచి గ్రామస్థాయి వరకు చేర్చాలని యోచిస్తున్నారు. దీనికోసం పక్కా నిర్వహణ వ్యవస్థలను రూపొందిస్తారు. అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్, డిస్ట్రిక్ట్ గ్రిడ్, మండల్ గ్రిడ్‌లను మెయిన్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు.

బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపు హౌజ్‌లు, విద్యుదీకరణ సదుపాయాలు అనివార్యం. వీటి ఏర్పాటుకు ఏ పాయింట్లు సరైనవో కూడా గుర్తిస్తారు. మెయిన్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి, పైపులైన్ల ఏర్పాటుకు కూడా స్థల సేకరణ జరుపాల్సి ఉంటుంది.
ఏ గ్రిడ్ నుంచి ఏయే జిల్లాలకు?: కృష్ణా డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి(పాక్షికం), నల్లగొండ, ఖమ్మం (పాక్షికం), హైదరాబాద్ జిల్లాలకు మంచినీటిని అం దించొచ్చు. గోదావరి డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి(పాక్షికం), హైదరాబాద్ జిల్లాలకు సప్లయి చేయొచ్చు.

ఇదీ జనాభా పెరుగుదల తీరు..: తెలంగాణలో జనాభా నానాటికీ పెరుగుతోంది. 2021 నాటికి 5.7 కోట్లు అంటే 7 శాతం పెరుగుతుందని అంచనా. 2031 నాటికి 6.1 కోట్లు, 2041 నాటికి 6.6 కోట్లు, 2051 నాటికి 7 కోట్ల దాకా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదే క్రమంలో నీటి వినియోగం కూడా పెరుగుతోంది. 2014 నాటికి 116 టీఎంసీలు, 2021 నాటికి 122 టీఎంసీలు, 2031 నాటికి 130 టీఎంసీలు, 2041 నాటికి 140 టీఎంసీలు, 2051 నాటికి 150 టీఎంసీల నీళ్లు అవసరం అవుతాయని ప్రభుత్వ అంచనా. హైదరాబాద్ ప్రజల దాహార్తికి తీర్చేందుకు నాగార్జునసాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలతో జురాల ప్రాజెక్టులు కీలకం కానున్నాయి.

రంగారెడ్డి జిల్లా విషయానికొస్తే సింగూరు, ఎల్లంపల్లి/ ప్రాణహిత, మహబూ బ్‌నగర్‌కు జురాల, కల్వకుర్తి, శ్రీశైలం, మెదక్‌కు మంజీరా, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎల్లంపల్లి/ ప్రాణహిత, వరంగల్‌కు ఎస్‌ఆర్‌ఎస్‌పీ, దేవాదుల, ఖమ్మంకు నాగార్జున సాగర్-పాలేరు-దుమ్ముగూడెం, కరీంనగర్‌కు ఎస్‌ఆర్‌ఎస్‌పీ/ నిజాంసాగర్/ ఎల్లంపల్లి/ ప్రాణహిత, నిజామాబాద్‌కు నిజాంసాగర్/ ఎల్లం పల్లి/ ప్రాణహిత, ఆదిలాబాద్‌కు ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ప్రాణహిత ద్వారా దాహార్తిని తీర్చవచ్చని అంచనా. 2021 సంవత్సరానికిగానూ జూరాల రిజర్వాయర్ వద్ద 2.50టీఎంసీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం, జూరాల యూనిట్ -2వద్ద 2.50, కల్వకుర్తి పథకంతో 2.50, శ్రీశైలం రిజర్వాయర్ యూనిట్ 1కు 10.00, యూనిట్-2 అదనంగా మరో 10 టీఎంసీల నీటి శుద్ధి కేంద్రం అవసరం.

దీంతో పాటు నాగార్జున సాగర్ రెండు యూనిట్ల ద్వారా 26.50, దమ్ముగూడెం ఫౌండ్ బ్యారేజి వద్ద 5, దేవాదుల (గోదావరి నది) వద్ద ఐదు, ప్రాణహిత 10, ఎల్లంపల్లి బ్యారే జి 5, ఎస్‌ఆ ర్‌ఎస్‌పి రెండు యూనిట్ల వద్ద 20, నిజాంసాగర్ 7.50, సింగూరు రిజర్వాయర్ వద్ద 6.96 టీఎంసీలు కలిపి మొత్తం 82.50 టీఎంసీల సామర్థ్యం కలిగిన వాటర్ ట్రిట్‌మెంట్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.
sarvy

ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఆయన పర్యటన షెడ్యూలు ఉండవచ్చని అధికారికవర్గాలు చెప్తున్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం అపాయింట్‌మెంట్ లభిస్తే ఈ నెల 6,7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలోని పలు సమస్యలు, ఇతర అంశాలపై కేసీఆర్ కేంద్ర మంత్రులను కలువనున్నట్లు సమాచారం. 

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, సెప్టెంబర్ 04, 2014

పట్నంలో ఉండి రుణం తీసుకున్నవారికి గోల్డ్ లోన్ మాఫీ లేదు!!

- సాగులేకున్నా.. ఆ పేరుతో బంగారం రుణాలు
- ఆంధ్రలో వ్యవసాయం.. తెలంగాణలో లోన్లు
- రైతుల రుణాల్లో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు
- ఇలాంటి వారికి మాఫీ వర్తించదన్న అధికారులు
రైతుల రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నకొద్దీ కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రుణమాఫీ కోసం అనుసరించాల్సిన మార్గదర్శకాలు కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీచేసింది. వాటి ప్రకారం అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్న కొద్దీ లొసుగులు వెలుగు చూస్తున్నాయి.
gold
కొంతమంది పట్టణాల్లో నివసించేవారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేయకున్నా, వ్యవసాయ భూమిని చూపించి బంగారం తనఖా పెట్టి పంట రుణాలు తీసుకున్నారని, వాటిని వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడైందని సమాచారం. మరికొందరు తెలంగాణ సరిహద్దుల్లోని ఆంధ్ర జిల్లాల్లో వ్యవసాయం చేసేవారు తమ వ్యవసాయ భూమిని చూపి తెలంగాణలో బ్యాంకు రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇటువంటి వారికి రుణమాఫీ వర్తించబోదని అధికారులు చెప్తున్నారు. పక్కాగా వ్యవసాయం చేస్తూ, వ్యవసాయం కోసమే బ్యాంకుల్లో బంగారం తనఖాపెట్టి రుణం తీసుకున్న రైతులకు మాత్రం రుణ మాఫీని ప్రభుత్వం అమలు చేయనుంది. పాత రుణం చెల్లించకుంటే బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వవని ఆందోళనచెందిన కొందరు రైతులు నిర్ణీత గడువులో రుణాలు చెల్లించినట్లయితే, సదరు రైతుల ఖాతాల్లోకే నేరుగా ప్రభుత్వం నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పట్టణాల్లో నివాసం ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఉన్నట్టు బ్యాంకులకు చూపి రుణాలు పొందిన వారు 10%-12% ఉంటారని అధికారుల అంచనా. అదే విధంగా.. ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నట్లు చూపి తెలంగాణలోని ఏ జిల్లాలో రుణం తీసుకున్నా వారికి కూడా రుణమాఫీని అమలు చేసేదిలేదని అధికారులు అంటున్నారు. ఆంధ్రలో భూమి ఉండి తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్‌వంటిచోట్ల రుణాలు తీసుకున్న వారు కూడా 10%-15% ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ వ్యవసాయ భూమి ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా ఆధారాలను చూపి ఇతర ప్రాంత బ్యాంకుల్లో రుణాలు తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర విభజనతో రెండు రాష్ర్టాలు ఏర్పడటంతో ఏ రాష్ట్ర రైతుల రుణాలు ఆ రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఆంధ్ర రైతులు రుణాలు తీసుకుంటే దానిని భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇలాంటి ఉదంతాలపై కూడా రెవెన్యూ, బ్యాంకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి, బ్యాంకుల ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కబ్జా "భూమి" పూజ!

-అది పక్కా ప్రభుత్వభూమి
-గోపనపల్లిలో వంద కోట్ల విలువచేసే మూడెకరాలు స్వాహా
-రియల్టర్లు, అధికారుల దొంగాట
- 2013 వరకూ దార్గుపల్లి కుటుంబానికి పహాణీ
- ఇప్పటికీ అదే భూమిలో వ్యవసాయం
- 1985లోనే విక్రయించినట్లు డాక్యుమెంట్లు
- 2000 సంవత్సరంలో మరోసారి రిజిస్ట్రేషన్
- టైటిల్ లేకున్నా ఎన్‌వోసీ ఇచ్చిన అధికారులు
- భూమి తమదేనంటున్న పూజ వెంచర్స్
- భారీ స్థాయిలో విల్లాల నిర్మాణం
- ప్రభుత్వానిదే ఈ భూమి అంటున్న హుడా
అది ప్రభుత్వ భూమి! అందులో మూడెకరాలను ఓ దళిత కుటుంబానికి ఇచ్చారు! కాలక్రమేణా ఆ ప్రాంతం కాసులు కురిపించే నేలగా మారింది! రియల్ రాబందుల కన్నుపడింది! కబ్జాకు రంగం సిద్ధమైంది! అందుకు అనుగుణంగా యజమానికాని యజమాని పేరుతో జీపీఏ డాక్యుమెంట్లు పుట్టుకొచ్చాయి! సర్కారీ భూమిని కాపాడాల్సిన అధికారులు మిన్నకున్నారు! తమకు ఆ భూమిపై ఆసక్తిలేదంటూ నిర్లక్ష్యంగా తప్పుకొన్నారు! అడ్డూఅదుపు లేదనుకున్న రియల్టర్లు ఇప్పుడు ఆ భూమిలో బడాబాబుల కోసం విల్లాలు మొలిపిస్తున్నారు! ఈ అక్రమంపై నివ్వెరబోయిన పట్టాదారులు ఇదేం అన్యాయమని అధికారుల దగ్గరకు వెళితే.. అది మీరు ఎప్పుడో అమ్మేశారంటూ పత్రాలు చూపిస్తున్నారు! ఈ కనికట్టు జరిగింది ఎక్కడో కాదు.. నగర శివార్లలో ఐటీ పరిశ్రమ కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లి మండలంలోని గోపనపల్లిలో!
land-scam
గోపనపల్లిలో ఒక దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఎప్పుడో లావణి పట్టా కింద ఇచ్చారు. మిగిలిన భూమి మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. లావణి పట్టా కింద ఇప్పటికీ సదరు దళిత కుటుంబం ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నది. ఇప్పుడు ఆ భూమి విలువ వందకోట్ల పైమాటే! ఆ విలువే ఆ భూమిపై కబ్జాదారుల కన్నుపడేలా చేసింది. అంతే.. భూమి యజమానులకు తెలియకుండా ఆ భూమిలో ఇప్పటివరకూ అరడజను లేఅవుట్లు, వందల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. భూముల విషయంలో అధికారులు చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు కాస్రా పహాణీ ఇచ్చిన అధికారులు.. మరోవైపు ఆ భూమి తమదేనని వాదించే రియల్టర్లకు పాస్‌బుక్‌లు ఇచ్చి, మ్యూటేషన్లూ చేస్తారు. ఈ అధికారుల నిర్వాకం సాక్షిగా కోట్ల రూపాయల విలువైన భూములు అన్యాక్రాంతం అయిపోతాయి. ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లా తప్పించుకుంటారు. గోపనపల్లిలో జరిగింది కూడా ఇదే. తాము అభివృద్ధి చేస్తున్న సర్వే నంబర్ 74 (ఆ), 74 (ఇ)లకు చెందిన మూడెకరాల భూమిని తాము స్థానిక దళితుల నుంచి కొన్నామని, అందుకే ఇక్కడ విల్లాలు నిర్మిస్తున్నామని రియల్టర్లు చెప్తున్నారు.

land-scamతాము తమ భూమిని ఎవరికీ అమ్మలేదని దళిత కుటుంబం మొత్తుకుంటున్నది. లోతుల్లోకి వెళితే.. 1985లోనే ఈ భూమిని ప్లాట్లు చేసి, సురేశ్ అనే వ్యక్తి అమ్మేసినట్లు డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ సర్వే నంబర్ 74 (ఆ), 74(ఇ)లకు చెందిన మూడెకరాల భూమికి అసలు యజమానులెవ్వరు? అన్నది మిస్టరీగా మారింది.

సర్వే నంబర్ 74లో ఉన్నది ప్రభుత్వ భూమే!

గోపనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 74లో 1954-55 కాస్రా పహాణీ ప్రకారం 105 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమిని 74(ఆ), 74(ఇ)గా విభజించి, ఈ రెండు బై నంబర్ల కింద 3 ఎకరాలను ఈ గ్రామానికి చెందిన దార్గుపల్లి గండయ్య తండ్రి చిన్న వీరయ్యకు సాగు చేసుకొని జీవించడానికి ప్రభుత్వం లావణి పట్టా ఇచ్చింది. ఇది 1954-55 కాస్రా పహాణిలోనే స్పష్టంగా ఉన్నది. తండ్రి నుంచి వారసత్వంగా దార్గుపల్లి గండయ్య ఈ భూమిని సాగు చేసుకున్నారు. గండయ్య తదనంతరం ఆయన వారసులు రాములు, శంకరయ్య, నర్సింహ కూడా ఇదే భూమిలో సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నారు. వర్షాకాలంలోగానీ, పని రోజుల్లోగానీ ఇంటికి వెళ్లకుండా రాత్రింబవళ్లు పొలంలోనే ఉండి వ్యసాయ పనులు పూర్తి చేసుకునేందుకు ఈ భూమి వద్దనే చిన్న చిన్న గదులు కట్టుకున్నారు. ప్రభుత్వ రికార్డులలో ఇప్పటికీ కూడా మూడెకరాల భూమి మాత్రమే ప్రైవేట్‌దని ఉన్నది.

1985లోనే వాలిన రియల్ రాబందులు

ఈ భూములను పీక్కు తినడానికి రియల్ రాబందులు అమాంతం వాలాయి. సర్వే నంబర్ 75లో ఉన్న 5 ఎకరాల 37 గుంటల ప్రైవేట్ భూమిని, సర్వే నంబర్ 74లో ఉన్న మూడెకరాల లావణి పట్టా భూమితో పాటు మరికొంత ప్రభుత్వ భూమిని కలుపుకొని మొత్తం 18 ఎకరాల భూమిని కాజేశారు. ఈ 18 ఎకరాల భూమిని బీ సురేశ్ అనే వ్యక్తి 1985 ఫిబ్రవరి 25, మార్చి 27, ఏప్రిల్ 8వ తేదీలపై మూడు జీపీఏలను రిజిస్టర్ చేయించుకున్నారు. ఒకవైపు ఈ భూమిని అమ్మడానికి జీపీఏ హక్కులు సృష్టించుకుంటూనే అమ్మకాలు చేశారు. 1985 జూలై 11న 4802/85 డాక్యుమెంటు ఆనాడు ఈ భూమిపై అమ్మకాలు చేపట్టారనటానికి ఉదాహరణ.

ఆనాడు జరిగిన విక్రయాల తీరు పరిశీలిస్తే అంతా కాగితాలపైనే నడిచినట్లు అర్థమవుతున్నది. అయితే 1985లో 18 ఎకరాల భూమికి జీపీఏ హక్కులను సురేశ్‌కు కల్పించినట్లుగా రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉండగా, 1974లోనే ఈ 18 ఎకరాలపై గ్రామపంచాయతీ లేఅవుట్ చేసినట్లుగా ఉంది. ఈ మేరకు 1974 జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగనాడు ఈ శాంక్షన్‌ను చేస్తూ ఆనాటి సర్పంచ్ మదన్‌మోహన్ దూబ సంతకం చేసినట్లుగా ఉంది. వీటిని పరిశీలిస్తే ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని ప్లాట్లు చేసి అమ్మినట్లుగా అర్థమవుతున్నది.

కానీ గోపనపల్లిలోని తమ భూమిని తాము ఎవ్వరికీ విక్రయించలేదని, నేటికీ ఈ భూమి వారసులం తామేనని దార్గుపల్లి గండయ్య వారసులు అంటున్నారు. కేవలం పక్క సర్వే నంబర్‌లోని ఐదెకరాల భూమిని అడ్డం పెట్టుకొని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి విక్రయించుకున్న తీరు కూడా వెలుగు చూసింది. అయితే ఆనాడు ప్రభుత్వ భూమి అని తెలిసినా కబ్జా అవుతున్న భూమిని కాపాడకుండా రెవెన్యూ అధికారులు ఏం చేశారు? రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేశారు? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అనాడు రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న కీలకమైన అధికారుల అండదండలతోటే సర్కారు భూముల అక్రమదందా జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఒకే భూమిపై రెండుసార్లు రిజిస్ట్రేషన్

దార్గుపల్లి గండయ్యకు చెందిన 3 ఎకరాల భూమిని ఏకమొత్తంగా 2000లలో విక్రయించినట్లుగా డాక్యుమెంట్లు వెలుగు చూశాయి. వాస్తవానికి ఒక సర్వే నంబర్‌కు చెందిన భూమి ఒకసారి రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ అయిన తరువాత మరోసారి అదే భూమిని తిరిగి రిజిస్టర్ చేయడం చెల్లదు. ఆ భూమిపై క్రయవిక్రయాలు మధ్యలో భూమిని కోనుగోలు చేసిన వారికే ఉంటాయి. 1985లో జరిగిన క్రయవిక్రయాల ప్రకారం, ఆనాడు ప్లాట్లుగా ఈ భూమిని కొనుగోలు చేసిన వారు అమ్ముకోవాలి. కానీ ఈ భూమిని ఏకమొత్తంగా ఎవ్వరు అమ్మినా చెల్లదు. అలా రిజిస్టర్ చేయడం చట్టరీత్యా నేరం కూడా.

లేదా.. ఆనాడు సురేశ్‌కు చేసిన జీపీఏను, ఆనాటి క్రయవిక్రయాలను రద్దు చేయాలి. ఇదంతా చేయడమనేది అసాధ్యమైన పని. పైగా 18 ఎకరాల భూమిని కాగితాలపై అమ్ముకొనిపోయిన సురేశ్ అనే వ్యక్తి ప్రస్తుతం సీన్‌లో లేడు. కానీ అనూహ్యంగా ఈ భూమికి కొత్త యజమాని కాగితంపై పట్టుకువచ్చాడు. ప్రస్తుత యజమానుల్లో ఒకరైన నర్సింహ తండ్రి గండయ్య. కానీ.. నర్సింహ అనే వ్యక్తికి నర్సయ్య అనే తండ్రి ఉన్నాడని, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఈ భూమిని అమ్మారని పేర్కొంటూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టుకొచ్చాయి. యజమానికాని యజమాని పేరుతో ఇలా డాక్యుమెంట్లు ఎలా వచ్చాయనేది వేయి డాలర్ల ప్రశ్న.

అన్నీ అనుమానాలే..

దార్గుపల్లి గండయ్య భూమిని, పూజా వెంచర్స్‌కు డెవలప్‌మెంట్ వివాదం సృష్టిస్తే, అధికారులు తానా అంటే తందానా అని వంత పాడుతూ గండయ్య వారసుల నుంచి ఈ భూమిని వేరు చేసే కుట్రను చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దార్గుపల్లి గండయ్యకు రాములు, శంకరయ్య, నర్సింహ్మలు వారసులు కాగా... అధికారులు ఈ భూమిపై వివాదం నేపథ్యంలో జిల్లా కలెక్టరుకు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన పలు నివేదికలలో సర్వే నంబర్లు 74(ఆ), 74(ఇ)లలోని క్లాసిఫికేషన్‌లో పట్టా భూమి అని స్పష్టం చేస్తూ పట్టా కాలమ్‌లో, పొజిషన్ కాలమ్‌లో దార్గుపల్లి గండిగ, చిన్న వీరిగ అని రాశారు, కానీ 2002-2003 నాటికి ఈ రెండు సర్వే నంబర్లలో వారసుల పేర్లు ఎక్కాలి.

కానీ దీనికి విరుద్ధంగా క్లాసిఫికేషన్‌లో పట్టా భూమి కాస్తా లావణి పట్టా అని పట్టా కాలమ్‌లో, పొజిషన్ కాలమ్‌లో దార్గుపల్లి నర్సింహ అని ఎక్కించారు. వాస్తవానికి దార్గుపల్లి గండయ్య మూడవ కుమారుడైన నర్సింహ పేరు రాసినట్లుగా చూపించి, పూజా వెంచర్స్ విల్లాలు నిర్మిస్తున్న భూమిని విక్రయించినట్లుగా డాక్యుమెంటులో ఉన్న దార్గుపల్లి నర్సింహ తండ్రి నర్సయ్య పేరును రియల్టర్లు, అధికారులు కలిసి చాలా ముందుచూపుతో తెరపైకి తీసుకువచ్చారన్న సందేహాలు వెలువడుతున్నాయి. తిన్నగా రికార్డులో దళితులైన అసలు భూ యజమానుల పేరు లేకుండా చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.

2004 వరకు దార్గుపల్లి గండయ్య కుటుంబ సభ్యుల నుంచి భూమిశిస్తును వసూలు చేసిన అధికారులు ఆ తరువాత కావాలనే తిరస్కరించినట్లు తెలుస్తున్నది. మరోవైపు గండయ్య మూడవ కుమారుడైన నర్సింహ పేరుతో 2013 వరకు పహాణీ ఇచ్చారు. మరోవైపు ఇదే సర్వే నంబర్‌పై భూమి యజమానులుగా పేర్కొంటూ పూజా వెంచర్స్‌కు విల్లాలను నిర్మించడానికి అగ్రిమెంట్ ఇచ్చిన లలిత, ఎమ్ సుమంత్‌కుమార్‌ల పేరుతో పహాణీలు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడం గమనార్హం. ఈ సర్వే నంబర్‌పై కేవలం మూడెకరాల భూమి మాత్రమే ఉండగా.. అంతా అధికారుల జాగీరైనట్లు ఆరు ఎకరాలకు ముగ్గురికి పహాణీలు ఇచ్చారు.

శేరిలింగంపల్లి మండల కార్యాలయం సాక్షిగా కుట్ర

1954-55 నాటికే 74 సర్వే నంబర్ బైఫర్‌కేషన్ అయింది. 74(ఆ), 74(ఇ) అంటూ రెండు బై నంబర్లు కేటాయించి 105 ఎకరాల 18 గుంటల భూమిలో ఒక పక్కన మూడెకరాల భూమిని కేటాయించారు. ఈ మేరకు డిక్లరేషన్ కూడా ఉన్నది. కానీ రెవెన్యూ అధికారులు ఈ ల్యాండ్‌ను బైఫర్‌కేషన్ చేయలేదని అంటున్నారు. ఇప్పుడు బైఫర్‌కేషన్ చేస్తున్నామని చెపుతున్నారు.

ఈ మేరకు 74 సర్వే నంబర్‌ను 74(1), 74(2), 74(3)గా విభజిస్తున్నట్లు కొత్త డ్రామాలు ఆడుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. బైఫర్‌కేషన్ అయిన సర్వే నంబర్‌ను మరోసారి బైఫర్‌కేషన్ చేస్తున్నామని చెపుతూ న్యాయవివాదాల్లోకి గండయ్య కుటుంబం నిలబడకుండా ఓడిపోవాలని ముందు చూపుతో కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు ఈ భూమిపై దార్గుపల్లి నర్సింహ తండ్రి నర్సయ్య అనే కుటుంబానికి ఎలాంటి సంబంధం లేకున్నా, దార్గుపల్లి గండయ్య మూడవ కుమారుడి పేరు నర్సింహ కావడంతో ఈ పేరుతో ఒక గందరగోళం సృష్టించి భూమిని కొల్లగొట్టాలని చూస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తున్నారు.

కానీ రాజధాని శివారులోని గోపనపల్లిలో దళితుడైన దార్గుపల్లి గండయ్యకు చెందిన ముగ్గురు కుమారులకు కలిసి ఉన్న మూడెకరాల భూమిని గుంజుకోవడానికి అవీనీతి అధికారుల పూర్తి అండదండలతో బడా బాబులు ప్రయత్నిస్తున్నారు. బడాబాబులు దళితులను భూముల నుంచి వెళ్లగొట్టడానికి చేస్తున్న కుట్రలను అడ్డుకోవడానికి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ దళితులు కోరుతున్నారు. మరోవైపు ఇదే సర్వే నంబర్ పేరుతో దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని అక్రమంగా విల్లాలు నిర్మిస్తున్న భూమిని స్వాధీనం చేసుకోవాలని, ఇందుకు సహకరించిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులను కఠినంగా శిక్షించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.

1954-55 నుంచి గండయ్య కుటుంబానిదే

ramuluదార్గుపల్లి గండయ్య తండ్రి చిన్న వీరయ్య హయాం నుంచి ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో ఉన్నది. 1954-55 క్రాసా పహాణీలో కూడా ఉన్నది. చిన్నవీరయ్య కుమారుడు గండయ్య ఈ భూమిలో బావి తవ్వుకుని కరెంటు మోటరు కూడా నడిపాడు. ఈ భూమికి 1985లోనే కరెంటు మీటరు సర్వీసు కూడా ఉన్నది. ఆ తరువాత బోరు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. గండయ్య తదనంతరం ఆయన కుమారులు దార్గుపల్లి రాములు, శంకరయ్య, నర్సింహలు సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాదికి కూడా భూమిని సాగు చేయడం కోసం బోరుబావి ఆసరాతో నారు పోశారు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పాటు బోరులో నీరు కూడా సరిగ్గా రాక, కరెంటు సరిగా లేక నారు ఎండిపోయి కనిపించింది. ఎండిన నారు పనికిరాదని భావించిన వీళ్లు పశువులు మేయడానికి వదిలారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా భూమి శిస్తు కడుతూనే ఉన్నారు.

ఆ వివరాలు 1974 నుంచి 2004 వరకు భూమిశిస్తు పాసుపుస్తకంలో రికార్డు అయి ఉన్నాయి. అయితే 2004 తరువాత నుంచి భూమిశిస్తు చెల్లించడానికి వెళితే తీసుకోవడం లేదని దార్గుపల్లి గండయ్య కుమారుడు రాములు నమస్తే తెలంగాణకు తెలిపారు. కొంతకాలం తరువాత తమ భూమి సర్వే నంబర్ల పేరుతో భూముల క్రయవిక్రయాలు తమకు తెలియకుండానే జరుగుతున్నాయని గుర్తించిన ఈ కుటుంబసభ్యులు మండల కార్యాలయంలో కాస్రా పహాణీలను తీసుకున్నారు. 2005-2006 నుంచి 2013 వరకు తీసుకున్న పహణీలలో దార్గుపల్లి నర్సింహ, తండ్రి గండయ్య పేరుతో ఇచ్చారు.

ఈ మేరకు నేటికీ రికార్డులలో ఉన్నట్లే లెక్క. కానీ.. ఇక్కడ మరికొందరు ముందుకు వచ్చారు. ఈ భూమిని తాము కొనుక్కున్నామని లలిత, సుమంత్‌కుమార్ అనే వ్యక్తులు ైక్లెమ్ చేస్తున్నారు. వీరు ఏకంగా పూజా వెంచర్స్‌కు ఆ భూమిని డెవలప్‌మెంట్‌కు ఇచ్చేశారు. ఈ మేరకు దార్గుపల్లి నర్సింహ తండ్రి నర్సయ్య, దార్గుపల్లి సత్యమ్మ, దార్గుపల్లి స్వామి, దార్గుపల్లి సత్యనారాయణ, దార్గుపల్లి నరేందర్, దార్గుపల్లి సురేందర్‌ల వద్ద 2000 జూన్ 30వ తేదీన రిజిస్టర్ చేసుకున్నట్లు డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న నర్సింహ కుటుంబీకులు మాత్రం పైన చెప్పినవారెవరూ తమ కుటుంబ సభ్యుల్లోనే లేరని తేల్చి చెబుతున్నారు.

తమ కుటుంబంలో ఎవరెవరున్నదీ చూపిస్తూ కుటుంబ సభ్యుల గ్రూప్‌ఫొటో కూడా టీ మీడియాకు ఇచ్చారు. మరోవైపు తాము కొనుక్కున్నామంటూ లలిత అండ్ అదర్స్ ైక్లెమ్‌చేస్తున్న భూమి హుడా ఆధీనంలో ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ మేరకు సర్వేయర్లు నిర్థారించారు. కలెక్టర్ కూడా ఇచ్చిన ఎన్‌ఓసీని రద్దు చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే అధికారులు ఎన్‌ఓసీ ఇచ్చిన తీరే చాలా అభ్యంతరకరంగా ఉంది. ఈ భూమిపై తమకు ఇంట్రెస్ట్ లేదని అందుకే ఎన్‌ఓసీ ఇస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. ఈ విషయంలో ఒకే సర్వే నంబర్‌పై ఉన్న భూమి తమదేనని ఇద్దరు ైక్లెమ్ చేస్తున్నారని మండల రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు లేఖ రాసి చేతులు దులుపుకున్నారు.

వాస్తవంగా ఈ సర్వే నంబర్ భూమికి యజమానులు ఎవరనే విషయాన్ని తేల్చకుండా అధికారులు అక్రమార్కులకు అవకాశం కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతే కాదు మహావీర్ బిల్డర్స్‌కు చెందిన సంస్థ తమ వెంచర్‌లో 74 సర్వే నంబర్‌కు చెందిన ఎకరంకుపైగా భూమి కలిసిందని, ఈ భూమిని డిమార్క్ చేసి వెనక్కుతీసుకోవాలని కోరినా కూడా శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెనుకాడుతున్న తీరే.. అధికార యంత్రాంగానికి ప్రభుత్వ భూములపై ఉన్న శ్రద్ధ ఏ పాటిదో చెప్పకనే చెబుతున్నది.
scan

బుధవారం, సెప్టెంబర్ 03, 2014

తీరుమారని ఏపీఎండీసీ...!!

- తెలంగాణ ఉద్యోగులకు వేతనాలివ్వకుండా కొర్రీలు

రాష్ట్ర విభజన జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వరంగ సంస్థల్లో సీమాంధ్ర ఆధితప్యం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లో తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష తీవ్రంగా ఉంది. 
వేతనాలు కూడా సమయానికి ఇవ్వకుండా నానా కష్టాలు పెడుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయమేదీ లేదని, సంస్థలో ఉన్న నిల్వలన్నీ ఆంధ్రవేనంటూ వేతనాల చెల్లింపునకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆగస్టు నెల వేతనాలు సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులంతా 30వ తేదీనే అందుకోగా, తెలంగాణ ఉద్యోగులకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఇంకా బిల్లులే తయారు చేయలేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సంస్థ నిధులను 58 : 42 నిష్పత్తిలో పంపిణీ చేయకుండానే కార్యాలయాన్ని విభజించారు. తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అకౌంట్‌ను తెరిచారు. 

కానీ పైసా కూడా విదిల్చకుండానే కార్యకలాపాలను నిర్వహించుకోవాలంటూ కార్యాలయాన్ని వేరుచేశారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే తెలంగాణ నుంచి వచ్చిన ఆదాయమేమీ లేదని సీమాంధ్ర అధికారులు చెబుతున్నారని, వేతనాల బిల్లును మంగళవారం సాయంత్రానికి కూడా రూపొందించలేదని ఓ అధికారి టీ మీడియాకు తెలిపారు. ఏపీఎండీసీకి ఏపీ ప్రభుత్వం నియమించిన ఎండీ శాలినీమిశ్రా లేఖ ప్రకారం అధికారాలను, బాధ్యతలను లాగేసుకొని, సీమాంధ్ర అధికారులకు కట్టబెట్టారు. నిపుణుల కమిటీ డీమెర్జర్ ప్లాన్‌ను ఆమోదించలేదన్న సాకుతో నిధులను తెలంగాణ కార్పొరేషన్‌కు ఇవ్వకుండా కొర్రీ పెడుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఇది ఆంధ్ర అధికారుల మాయ!

-సాగర్‌కు చేరాల్సిన 50వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడులో ఆవిరి!
-శ్రీశైలంలో 1,88,930 క్యూసెక్కుల విడుదల..
-సాగర్‌కు వస్తున్నది 1,35,600 క్యూసెక్కులే
-మిగిలిన నీరు ఎటు పోతున్నది?
-సీమ ప్రాజెక్టులకు వరదనీటినే వదలాలి.. నిబంధనలు పట్టని ఆంధ్రా అధికారులు
-తెలంగాణ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం

ఇది ఆంధ్ర అధికారుల మాయ! వదిలిన నీటిని.. పదిలంగా తరలించుకుపోతున్న కనికట్టు! శ్రీశైలంలో విడుదలైనట్టు చెబుతున్న నీటిలో ఒకటికాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 50వేల క్యూసెక్కులకుపైగా నీరు నాగార్జున సాగర్‌కు రావటం లేదు. మరి ఆ నీళ్లు ఎటుపోయాయి? ఎటుపోయాయంటే.. తెలంగాణ రైతుల పాలిట జల పిశాచిగా దాపురించిన పోతిరెడ్డిపాడుకు! నిజానికి రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ వరద జలాల ఆధారంగా నిర్మించినవే. కృష్ణా జలాలను ముందు నికర జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు, ఆ తర్వాత మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు ఇవ్వాలి. ఆ తర్వాతే వరదనీటి ప్రాజెక్టులకు కేటాయించాలి. అలా చూస్తే.. ముందుగా శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జునసాగర్‌కు పూర్తిస్థాయిలో నీళ్లు వదలాలి. సాగర్ పూర్తిగా నిండిన తర్వాతే.. వరద నీటిపై ఆధారపడిన సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లు వదలాలి. కానీ జరుగుతున్నది మాత్రం అందుకు పూర్తి భిన్నం.
potireddypadu2హైదరాబాద్, సెప్టెంబర్ 2 (టీ మీడియా): శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రిజర్వాయర్ దాదాపుగా సామర్ధ్యం మేర నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి 884.9 అడుగులకు చేరింది. శ్రీశైలం రిజర్వాయర్‌కు 1,86,182 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1,88,930 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అయితే, అక్కడ విడుదలైన నీరు నాగార్జునసాగర్‌కు వచ్చేసరికి కేవలం 1,35,600 క్యూసెక్కులుగా మాత్రమే రికార్డుల్లో నమోదవుతున్నది.

మరి.. మిగిలిన 50,582 క్యూసెక్కుల నీరు ఎటు పోతుంది? అంటే అధికారులు నీళ్లు నములుతున్నారు. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీరు మొత్తం నాగార్జునసాగర్‌కు రావడం లేదు. పై నుంచి పైనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ శ్రీశైలం నుంచి మార్గమధ్యంలో కొంత నీరు ఆవిరైందనుకున్నా, మరీ 50 వేల క్యూసెక్కుల నీరు ఆవిరైందంటే నమ్మడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా లేదన్నది వాస్తవం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా బేసిన్‌లో లేని ప్రాజెక్టులకు ఈ నీళ్లు తరలించుకుపోతున్నారు.

రాయలసీమలోని హంద్రీనీవా, గాలేరు-నగరి, వలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో లేకపోయినా కృష్ణా నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే గత సీమాంధ్ర పాలకుల మాయాజాలం. అసలు కృష్ణా బేసిన్‌లో లేనటువంటి ప్రాజెక్టులకు నీళ్లు ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇంతకాలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 557 అడుగుల నీటి మట్టమే ఉంది. సాగర్ పూర్తిస్థాయిలో నిండాలంటే 590 అడుగులకు చేరుకోవాలి. ఈ పరిస్థితిని విస్మరించిన ఆంధ్ర సర్కార్.. సాగర్‌కు నీటిని విడుదల చేసే పేరుతో పోతిరెడ్డిపాడుద్వారా రాయలసీమలోని వరద నీటి జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు నీళ్లు వదులుతున్నదన్న ప్రచారం జరుగుతున్నది.

ఆది నుంచి వివాదమే..

పోతిరెడ్డిపాడు.. ఈ పేరు తెలంగాణ ప్రజానీకానికి ఏ మాత్రం మింగుడుపడనిది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి పోతిరెడ్డిపాడు వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. కృష్ణా జలాలను కృష్ణానది పరివాహక ప్రాంతం అవతలనున్న సీమాంధ్ర ప్రాంతాలకు తరలించాలన్న ఆలోచనకు ప్రతిరూపమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. భౌగోళికంగా కృష్ణానది పరివాహక ప్రాంతానికి, పెన్నానదికి మధ్య ఉన్న ఎత్తైన ప్రదేశం శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఉన్న రిడ్జ్‌ను కట్ చేస్తే చాలు, అక్కడి నుంచి కృష్ణా బేసిన్‌కు ఆవల ఉన్న సీమాంధ్ర ప్రాంతాలకు గ్రావిటీ మార్గాన నీటిని సునాయసంగా తరలించుకుపోవచ్చు.

మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పటి నుంచీ సీమాంధ్ర నాయకత్వం ఈ మళ్లింపు ప్రయత్నాలు సాగించింది. అయితే ఇది దేశ, అంతర్జాతీయ సూత్రాలకు, సహజ న్యాయానికి విరుద్ధం. అంటే, కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ తదితర క్షామపీడిత ప్రాంతాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే బేసిన్ ఆవలకు నీటిని మళ్లించాలి. 1955లో ఫజల్ అలీ కమిషన్ కూడా తెలంగాణ ప్రజలు తమకు కృష్ణానదిపై ఉన్న స్వతంత్ర హక్కు కోల్పోవడానికి సిద్ధంగా లేరని పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో శ్రీశైలం ప్రాజెక్టు హైడెల్ పవర్ ప్రాజెక్టు మాత్రమేనని, వేరొక పరివాహక ప్రాంతానికి నీళ్లు మళ్లించవద్దని స్పష్టంగా పేర్కొంది.

తెలుగు గంగ పేరుతో..

బచావత్ తీర్పుని అధిగమించడానికి సీమాంధ్ర నాయకత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మద్రాస్ నగరానికి తాగునీటి అవసరాలకు తెలుగుగంగ పేరుతో 15 టీఎంసీల నీటిని 1500 క్యూసెక్కుల సామర్ధ్యం గల కెనాల్ ద్వారా పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ ముసుగులో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో కృష్ణానది పరివాహక ప్రాంతానికి, పెన్నానది పరివాహక ప్రాంతానికి మధ్య ఉన్న మిట్ట కొండల రిడ్జ్‌ను కట్ చేసి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. అయితే తొలుత పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రతిపాదించి.. చివరకు 11,150 క్యూస్కెక్కులుగా మార్చి నిర్మించారు.

దీని ద్వారా వేరొక బేసిన్‌లో నీళ్లు తరలించవద్దన్న తీర్పును బేఖాతరు చేశారు. మద్రాసు నగరానికి తాగునీరు అన్న నెపంతో 1500 క్యూసెక్కుల సరఫరాకోసం ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడి కాలువ, కేసీ కెనాల్‌లకు హెడ్ రెగ్యులేటర్‌గా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 11 టీఎంసీలు మొత్తం శ్రీశైలం కుడికాలువకు కేటాయించుకున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వివక్షపూరితంగా వాదించి తెలుగుగంగకు ప్రాజెక్టుకు 25 టీఎంసీల మిగులు జలాలు కేటాయింపు చేయించుకున్నారు. ఇందులో ఒక్క టీఎంసీ కూడా తెలంగాణకు రాకపోవడం గమనార్హం.

వైఎస్ మాయ..

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోతిరెడ్డిపాడు స్వరూపమే మారిపోయింది. అసలు 11,150 క్యూసెక్కులే అక్రమమని వాదిస్తున్న తరుణంలో, వైఎస్ వచ్చాక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ఏకంగా 40,000 క్యూసెక్కులకు పెంచేశారు. తర్వాత మూడు నెలలకే దానిని 44,000 క్యూస్కెక్కులకు పెంచూ జీవో జారీ చేయగా, ఏ ఒక్క తెలంగాణ ప్రజాప్రతినిధి కనీసం నోరు మెదపకపోవడం గమనార్హం. పోలీసుల రక్షణలో అత్యంత వేగంగా ఈ పనిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. పోతిర్డెపాడు తర్వాత బనకచర్చ రెగ్యులేటర్ ద్వారా మూడు కెనాళ్లుగా మారి, దారి పొడవునా దాదాపు వందలాది టీఎంసీల నీటిని నిలువ చేసుకునే విధంగా రిజర్వాయర్లు నిర్మించుకున్నారు.

ఇక పోతిరెడ్డిపాడు డిజైన్ విషయంలోకూడా పాలకులు చెప్పింది ఒకటి, ఆచరణలో చేసింది మరొకటి. పోతిరెడ్డిపాడువల్ల తెలంగాణకు అపార నష్టం వాటిల్లనుందని దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి మొత్తుకున్నా, నాటి సీఎం వైఎస్ ఖాతరు చేయలేదు. పైగా వరద జలాలను మాత్రమే తీసుకెళ్తుతున్నామని చెప్పిన ప్రభుత్వం, డ్యామ్‌లోని నిలువ నీళ్లను కూడా తీసుకెళ్లే విధంగా మార్చేసింది. పేరుకి 44,000 క్యూసెక్కులు అని చెప్పినా, వాస్తవంగా చూస్తే 1,10,000 క్యూసెక్కులు తరలించుకుపోయే విధంగా డిజైన్ చేశారు. తెలంగాణ ఇంజినీర్లు నెత్తి, నోరు కొట్టుకున్నా సీమాంధ్ర పాలకులు కనీసం పట్టించుకున్న పాపనపోలేదు.

అన్నింటా అన్యాయమే..

పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తెలంగాణకు అన్యాయం చేసిందని టీ ఇంజినీర్లు చెబుతుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలన్న చిత్తశుద్ధిలేని ప్రభుత్వం, ఇక్కడి రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టింది. సీమాంధ్ర పాలకులవల్లే పోతిరెడ్డిపాడు, పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు రావలసిన నీటిని మళ్లించడానికి, తెలంగాణలో విస్తారమైన ప్రాంతాలను ముంచి, కోస్తాంధ్రకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ డబ్బుతో, తెలంగాణ పన్నులతో వాటిని కట్టి నీటిని తన్నుకుపోతుంటే కనీసం న్యాయం కోసం ఎదిరించే వేదికే లేని దుస్థితి నెలకొంది.

మంగళవారం, సెప్టెంబర్ 02, 2014

అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో...!!

- ప్రాజెక్టులెవరివి.. నీటి కేటాయింపులెవరికి?

కృష్ణా బేసిన్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకేమో నీటి కేటాయింపులు లేవు. అదే సీమాంధ్రకి చెందిన సాగునీటి ప్రాజెక్టులు అసలు బేసిన్‌లోనే లేకపోయినా కృష్ణా జలాల కేటాయింపులు జరిగిపోయాయి. రాయలసీమలోని హంద్రీనీవా, గాలేరు-నగరి, వలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టులు అసలు కృష్ణా బేసిన్‌లోనే లేవు. అయినా ఈ ప్రాజెక్టులకు కృష్ణా నీళ్లు వెళ్తున్నాయి. తెలంగాణ ప్రాజెక్టులను ఎండగట్టి, సీమాంధ్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిగాయంటే ఇదంతా సీమాంధ్ర పాలకుల మాయాజాలమే. ఇంతకాలం రాష్ర్టాన్ని పాలించిన వలసపాలకుల వల్ల రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరిగింది. 
నిలదీసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం

ఐదు దశాబ్దాలకుపైగా కొనసాగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు అన్యాయమే జరిగింది. తెలుగు గంగకు 25 టీఎంసీల కృష్ణాజలాలు కేటాయించారు. సీమాంధ్ర పాలకుల కుటిల రాజకీయమే ఇందుకు కారణం. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరిగిన సమయంలో కృష్ణా బేసిన్‌లో లేని ప్రాజెక్టులకు తీవ్రఅన్యాయం జరిగిపోయిందని అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం వాదించింది. కే సీ కెనాల్, కృష్ణా డెల్టా ద్వారా నీటిని తీసుకెళ్తున్నారు కదా? అని ట్రిబ్యునల్ ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది. పైగా రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిపోతున్నదని అప్పటి ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించడంతో ట్రిబ్యునల్ అసహనం వ్యక్తం చేస్తూనే తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. ప్రస్తుతం దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది.

కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులివీ..

కృష్ణా బేసిన్‌లో నికరజలాలపై ఆధారపడి రాష్ట్ర ప్రాజెక్టులు భీమా-1, భీమా-2, కోయల్‌సాగర్ ఉన్నాయి. మిగులుజలాలపై ఆధారపడి ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు ఉన్నాయి. 

వాస్తవానికి ముందుగా నికరజలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు, ఆ తరువాత మిగులు జలాలు, చివరకు వరద జలాలు కేటాయిస్తారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల పాలనలో నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. 1956 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం లేకపోవడంతో, తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతూనే ఉందని టీ ఇంజినీర్లు వాదిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్రభుత్వం లేకపోవడంతో, అడిగేవారే లేరనే ధీమాతో ఇంతకాలం సీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ఆ ప్రాంతపాలకులు గట్టిగా పట్టుబట్టి సాధించుకుంటూనేవున్నారు. 

మీ రాష్ట్రంలో క్షామపీడిత ప్రాంతాల వివరాలు ఇవ్వడంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రశ్నించిన సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ర్టాల్లో వెనుకబడిన ప్రాంతాల వివరాలు తెలిపాయి. కానీ మన రాష్ర్టానికి చెందిన సీమాంధ్ర పాలకులు మాత్రం కృష్ణా బేసిన్‍లో ఉన్నవాటిని వదలి, అసలు కృష్ణా బేసిన్‌లోనే లేని ప్రాజెక్టుల పేర్లు చెప్పి నీటి కేటాయింపులు చేయించుకోవడం గమనార్హం. కృష్ణా బేసిన్‌లో కృష్ణా జలాలపై ఆధారపడి రాబోయే ప్రాజెక్టులు మరికొన్ని ఉన్నాయి. అవి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జూరాల-పాకాల, డిండి ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.

ఐదు వేల కోట్ల భూంఫట్!!

-హఫీజ్‌పేటలో 942 ఎకరాలు గల్లంతు
-ఒక వైపు నిషేధం.. మరోవైపు రిజిస్ట్రేషన్లు
-సర్కారు గెజిట్ బేఖాతర్..
-రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌కెక్కని
-నిషేధ గెజిట్ వివరాలు
-పాత కేసు వివరాలు దాచి కొత్త పిటిషన్లు..
-అయినా కిమ్మనని జిల్లా అధికారులు
హైదరాబాద్ నగర శివార్లలో భూ మాఫియా రెచ్చిపోతున్నది. అవినీతి అధికారుల అండదండలతో నిబంధనలు తుంగలో తొక్కి, ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేసి సొమ్ము చేసుకుంటున్నది. చివరికి ఆయా భూముల క్రయ విక్రయాలు నిషేధిస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్ కూడా ఇక్కడ అమలుకు నోచుకోవడం లేదు. కబ్జాలు, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ యథావిధిగా సాగిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఒక్క హఫీజ్‌పేట గ్రామంలోనే రూ. 5 వేల 652 కోట్ల విలువ చేసే 942 ఎకరాల భూమి హారతి కర్పూరమై పోయింది. ఈ భూములు కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమని సర్కారు జారీచేసిన గెజిట్ చిత్తుకాగితంగా మారిపోయింది.
గజం రూ. 20 వేల చొప్పున..

hafezpet2హైటెక్‌సిటీకి కూతవేటు దూరంలో హఫీజ్‌పేట గ్రామం ఉంటుంది. ఇక్కడ భూమిని ఎవరూ ఎకరాల చొప్పున అమ్మరు. అంతా గజాల లెక్కలే. ఇక్కడ గరిష్టంగా గజం రూ.20 వేల దాకా పలికిన సందర్భాలున్నాయి. ఎకరం భూమి విస్తీర్ణం 4840 గజాలుంటుంది. దీన్ని పౌర అవసరాలకు వాడాలంటే ఇందులో 40% రోడ్డు, ఇతర మౌలిక సదుపాయల కింద తీసివేయాల్సి ఉంటుంది. అపుడు మూడు వేల గజాలు నికరంగా వస్తుంది. ఆ లెక్కన 942 ఎకరాలకు రూ.5 వేల 652 కోట్ల విలువ అవుతున్నది. ఇంత విలువైన భూమి ఇపుడు కబ్జాల పాలైంది. కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారులకే వంత పాడుతున్నది.

అమ్మకాలు నిషేధిస్తూ గెజిట్

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్‌పేట గ్రామంలోని సర్వే నంబర్లు 46, 48, 55, 66, 67, 74, 75, 77, 78, 79, 80, 100, 104, 151లలోని 942 ఎకరాల 15 గుంటల భూమిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరుపకూడదని 2013 సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. 2007 జూన్ 20వ తేదీన జీవోఎంఎస్ 863 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విస్తృత అధికారాలతో ఈ గెజిట్‌ను పబ్లిష్ చేశారు. ఈ సర్వే నంబర్లపై ఎవరైనా తమకు యాజమాన్య హక్కులు ఉన్నట్లుగా భావిస్తే అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చునని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరఫున ఆదేశించారు.

అభ్యంతరాలను ఇంగ్లీష్, తెలుగు భాషలలో ఇవ్వవచ్చునని గెజిట్‌లో వివరించారు. అభ్యంతరాల సమర్పణకు నోటిఫికేషన్ విడుదల చేసిన 30 రోజులవరకు అవకాశమిచ్చారు. ఆ కాల పరిమితి ముగియడంతో మొత్తం భూమిలో సర్కారు గెజిట్ ప్రకారం అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోవాలి. అయితే ఈ భూమిని కబ్జా పెట్టిన భూమాఫియా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేసి ఇష్టారాజ్యంగా అమ్మేసుకుంటున్నది. మరోవైపు ఇందులో 867 ఎకరాల 27 గుంటల భూమిపై సీఎ స్14/58 సివిల్ కేసు కూడా నడుస్తున్నది. అయినా కేసు కోర్టులో ఉండగానే అమ్మకాలు మాత్రం నిరాటంకంగా జరుగుతున్నాయి.

రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో చేరని గెజిట్

వాస్తవానికి భూములపై క్రయవిక్రయాలు నిషేధిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని సర్వే నంబర్ల వారిగా వెబ్‌సైట్లో పొందుపర్చాలి. కానీ ఇక్కడ ఇది అమలు కాలేదు. నిషేధిత జాబితాల్లో ఈ సర్వే నంబర్లను అధికారులు చేర్చలేదు. ఈ మొత్తం భూమిలో ఒక్క సర్వే నంబర్ 77ను మాత్రమే జాబితాలో చూపిస్తున్నారు. గమనార్హమైన విషయం ఏమంటే నిషేధిత జాబితాలో చేర్చిన ఈ ఒక్క సర్వే నంబర్ 77 భూమికి చెందిన భూముల కొనుగోళ్లను కూడా రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటూ పోతున్నది. ఈ ఒక్క ఏడాది వ్యవధిలోనే ఈ సర్వే నంబర్ మీద 16 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే 78,79,80 సర్వే నంబర్లలో కూడా భూముల రిజిస్ట్రేషన్లు నిరాటంకంగా జరిగిపోతున్నాయి.

కోర్టు స్టేను దాచి మళ్లీ పిటిషన్

ప్రభుత్వ గెజిట్‌ను సవాలు చేస్తూ గతంలో కబ్జాదారులు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో న్యాయమూర్తి అన్నింటినీ ఏక మొత్తంగా నిషేధించకుండా ఒక్కో కేసును బట్టి విచారించి నిర్ణయించాలని తీర్పు ఇచ్చారు. అయితే దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఈ స్టే ఇలా ఉండగానే కోర్టునే బురిడీ కొట్టిస్తూ మరో కేసును కింది కోర్టులో వేయడం గమనార్హం. వాస్తవానికి పైకోర్టులో కేసు విచారణలో ఉండగా.. కింది కోర్టులో ఇదే సమస్యపై మరో కేసు వేయడమంటే కోర్టులను మోసం చేసినట్లేనని న్యాయనిపుణులు అంటున్నారు. కానీ ఈ విషయాన్ని ఘనత వహించిన అధికారులు కోర్టుకు తెలియజేయకపోవడంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. హఫీజ్‌పేట భూములపై సర్కారు గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఎవరికైనా అభ్యంతరాలుంటే నెలలోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే రెవెన్యూ అధికారుల వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేయని అధికారులు, గెజిట్ వచ్చిన నెల, రెండు నెలల తరువాత దాదాపు ప్రభుత్వం మీద వంద కేసులు వేశారు.

హైకోర్టు సింగల్ బెంచ్‌లో wp30526/2012 కింద ఈ కేసు వేశారు. అన్ని కేసులను కలిపి విచారించిన న్యాయస్థానం సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్ చేయవద్దని గెజిట్ ఇవ్వడం కన్నా... కేస్‌బై కేసు, (దరఖాస్తులను విడివిడిగా) విచారించి, పట్టాభూములనే కొనుగోలు చేస్తే వాటికి మాత్రమే అనుమతించాలని, తప్పులుంటే తిరస్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు కూడా కబ్జాదారులకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, చిన్న అవకాశం దొరికినా కబ్జాదారులు పెట్రేగిపోతారని భావించిన సర్కారు ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో WA352/2013 అప్పీల్ వేసింది. ఈ అప్పీల్‌ను పరిశీలించిన న్యాయస్థానం డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ భూముల క్రయవిక్రయాలపై విధించిన నిషేధం అమలవుతూనే ఉన్నది.

కానీ అసలు తిరకాసు ఇక్కడే మొదలైంది. ఈ భూములపై కేసు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ జరుగుతున్నది. డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే హైకోర్టులోని మరో సింగిల్‌బెంచ్ వద్ద WP19069/2014 ఫైల్ చేశారు. అయితే ఈ కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రియల్ మాఫియా వేసినప్పుడు, ప్రభుత్వ అధికారులు కోర్టుకు పైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని తెలియజేయాలి. కానీ దీనికి విరుద్ధంగా ప్రభుత్వ అధికారులు మౌనంగా ఉండడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు రూ. ఐదు వేల కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి రియల్ మాఫియా చేస్తున్న అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇదే భూముల మీద రుణాలు!

ప్రభుత్వ భూములు బడాబాబులకు బంగారు బాతుగుడ్లే అవుతున్నాయి. అమ్మిన కాడికి అమ్ముకున్న వాళ్లు ఉన్నట్టే వీటిని ఆస్తుల కింద చూపించి రుణాలు పుచ్చుకుంటున్న ఘనులు కూడా ఉన్నారు. బడాబాబులు ప్రభుత్వ భూమిని ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా ఈ డాక్యుమెంట్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు రుణాలు తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎగవేస్తున్నారు. ప్రభుత్వ భూమిపై ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధంలేకుండా ఒకరికి ఒకరు పరస్పర ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అధికారుల వైఖరీ అనుమానాస్పదంగానే ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తెల్లకాగితాలపై ఒప్పందాలు

సర్వే నంబర్ 78లో 10 ఎకరాల భూమిని కబ్జాదారులు సవేరా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఒక తెల్లకాగితంపై రాసిచ్చారు. దీని ఆధారంగా సవేరా కంపెనీ కోర్టులో పిటిషన్ వేస్తే రెవెన్యూ అధికారులు కనీసం అబ్జెక్షన్ మెమో కూడా వేయలేదు. గమ్మత్తేమిటంటే హఫీజ్‌పేటలోని ప్రభుత్వ భూమిని కాపాడే మహత్తర కార్యక్రమంకోసం ఇక్కడి అధికారులు కోర్టు ఖర్చుల కింద దాదాపు రూ.68 కోట్లు ఖర్చు చేశారు. తెల్లకాగితాలపై రాతలు రాసుకొని కోర్టులకు వెళితే కనీస అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయకుండా ఇంత మొత్తం ఎందుకు ఖర్చు చేశారో తెలియదు.

వాస్తవానికి రెవెన్యూ చట్టంలోని సెక్షన్17-1(ఈ) ప్రకారం తెల్లకాగితాలపై అగ్రిమెంట్లు చెల్లవు. కోర్టులు కూడా వీటిని స్వీకరించవు. అయితే ఇందుకు సంబంధిత పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఆ పని రెవెన్యూ అధికారులు చేయలేదు. సవేరా కంపెనీ ఈ ప్రభుత్వ భూమిలో 20 ఏళ్ల నుంచి ఉంటున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కూడా కూల్చివేసేందుకు యత్నిస్తున్నది.

హెచ్‌ఏఎల్ ఉద్యోగుల భూమి కూడా కబ్జా

ఈ భూములపై జరుగుతున్న వివాదంలో సీఎస్14/58 సివిల్ సూట్ కేసు వివాదంలో సర్వే నంబర్లు 77, 78, 79, 80 ఉన్నాయి. అయితే సర్వే నంబర్ 77లోని భూమిలో 62 ఎకరాల భూమిని హెచ్‌ఏఎల్ ఉద్యోగుల సొసైటీ1981లో కొనుగోలు చేసింది. దీనిపై అనేక వివాదాలు నడుస్తున్నాయి. ఈ భూమిని రియల్ రాబందులు కబ్జా చేసుకొని విక్రయాలు చేసుకుంటున్నారు. హెచ్‌ఏఎల్ ఉద్యోగులు సర్కారును ఆశ్రయిస్తే ప్రభుత్వం ఒక మెమో ఇచ్చింది. ఈ మేరకు 2004కు ముందు కొనుగోలు చేసిన వారిలో అర్హులైన వారికి అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి మ్యూటేషన్ చేయాలని 2004 నవంబర్ 5వ తేదీన మెమో నంబర్ 28908/జేఏ1/ 2004-1 విడుదల చేసింది. ఈ మెమో ప్రకారం సర్వే నంబర్ 77లోని భూమికి ఒక్క హెచ్‌ఏఎల్ హౌసింగ్ సొసైటీ మాత్రమే అర్హత కలిగి ఉందని అంటున్నారు. ఈ సొసైటీకి చెందిన భూమిని కూడా రియల్ మాఫియా గుండాలను పెట్టి అమ్ముకోవడం కొసమెరుపు.

గెజిట్ అమలులో ఉంది: రాజేంద్ర నగర్ ఆర్డీవో సురేశ్

హఫీజ్‌పేట రెవెన్యూ గ్రామంలోని పలు సర్వే నంబర్లలో క్రయవిక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఇచ్చిన గెజిట్ అమలులో ఉందని రాజేంద్రనగర్ ఆర్డీవో సురేశ్ నమస్తే తెలంగాణకు తెలిపారు. ఈ గ్రామలోని పలు సర్వే నంబర్లలోని భూములపై అనేక వివాదాలు నడుస్తున్నమాట వాస్తవమేనన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మారుస్తూ ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. హఫీజ్‌పేటలోని వివాదాస్పద భూములపై ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.
hafezpet3
hafezpet4

సోమవారం, సెప్టెంబర్ 01, 2014

లెవీ విధానంపై కేంద్రం వెనక్కి?

-ఫలించిన తెలంగాణ ప్రభుత్వం కృషి
-కొత్త లేవీని వ్యతిరేకించిన హర్యానా,పంజాబ్, ఏపీ
-50:50 శాతం లేవీ వైపు కేంద్రం మొగ్గు!
భారీగా వరి పండించే రాష్ర్టాల తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం లెవీ సేకరణపై తన ప్రతిపాదనలపై కొంత వెనక్కి తగ్గే అవకాశం కనబడుతోంది. గతంలో 75 : 25 శాతం లెవీ సేకరణ విధానం ఉండేది. రైస్ మిల్లర్లు సేకరించిన 75 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చి మిగతా 25 శాతాన్ని మిల్లర్లు బహిరంగమార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. 
దీనివల్ల సబ్సిడీ బియ్యం పథకం అమలు చేసే రాష్ర్టాలకు వెసులుబాటు ఉండేది. అయితే ఈ పద్ధతిని తలకిందులు చేసి 25 : 75 శాతం లేవీ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం సమాయత్తమైంది. దీనిపై వరి పండించే రాష్ర్టాలనుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 25 : 75 శాతం వల్ల రైతులతోపాటు ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో పడుతుందని, రేషన్ బియ్యం కోసం ఇతర రాష్ర్టాలపై ఆధారపడవలిసి వస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసింది.

ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ మధ్య ప్రస్తావించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఒకే విధంగా ఉండటం, వరి సమృద్ధిగా పండే హర్యానా, పంజాబ్ వంటి రాష్ర్టాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఆ ప్రతిపాదనకు స్వల్ప మార్పులు చేసి 50 : 50 శాతం లేవీ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించవలిసి ఉంది.

సబ్సిడీ బియ్యం పథకానికి దెబ్బ...: ఇప్పటివరకు రైస్ మిల్లర్లు సేకరించిన ధాన్యంలో 75 శాతం ఎఫ్‌సీఐకి ఇచ్చి మిగతా 25 శాతం బహిరంగమార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. దీంతో రైతుల ధాన్యానికి మద్ధతు ధర లభించడంతోపాటు, ప్రజా పంపిణీ వ్యవస్థకు సరిపడా రేషన్ బియ్యం లభించేది. అదనంగా మరో మూడు నెలల కోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని గిడ్డంగుల్లో ముందు జాగ్త్రత్తగా నిలువ ఉండేలా అధికారులు జాగ్రత్త పడేవారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విధానం వల్ల తెలంగాణ రాష్ర్టానికి సంవత్సరానికి 14 లక్షల టన్నుల కొరత ఏర్పడే అవకాశముండేది.

ప్రతిపాదనలకు వ్యవసాయశాఖ అభ్యంతరం: ఇదిలా ఉంటే రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాలశాఖ అధికారులు 2 వేల 3 వందల కేంద్రాలను ఏర్పాటుచేయాలని చేసిన ప్రతిపాదనలకు వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వరి పంట ఉత్పత్తిని అంచనా వేయలేమని, ఇటువంటి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల ప్రతిపాదనలు సరికావని స్పష్టం చేసింది. పంటల మీద ఏ స్పష్టత లేని ఈ సమయంలో ప్రతిపాదనలు తయారు చేయవద్దని కోరింది. మరో 20 రోజుల్లో వరిసాగుపై అంచనాకు రావచ్చని, దీని ఆధారంగా ప్రతిపాదనలు తయారుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడటంతో పౌరసరఫరాలశాఖ అధికారులు తమ ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఏపీఈఆర్సీలో సీమాంధ్ర కుయుక్తి...!

-అడ్డదారుల్లో పదోన్నతుల ఖరారుకు యత్నం
-తెలంగాణ ఉద్యోగులకు మొండిచెయ్యి
అనేక విధాలుగా తెలంగాణ నష్టపోయే చర్యలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరోసారి రాష్ట్ర ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత పీపీఏల వివాదానికి ఆజ్యం పోసింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులను పక్కనబెట్టి, ఆంధ్ర ఉద్యోగులకు అక్రమంగా పదోన్నతులు కట్టబెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా, మరొకరికి పర్సనల్ ఆఫీసర్‌గా పదోన్నతి ఖరారు చేసినట్లు సమాచారం. ఈఆర్సీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీయడమే కాకుండా, తెలంగాణ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే, సీమాంధ్ర ఉద్యోగులకు పదోన్నతులు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది ఆగస్టులోనూ నాటి ఈఆర్సీ ఇన్‌చార్జి చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి (చిత్తూరు) నిబంధనలకు నీళ్లు వదిలి తన అనుయాయులకు (సీమాంధ్ర ఉద్యోగులు) పదోన్నతులు కల్పించారు. మరికొన్ని గంటల్లో బాధ్యతల నుంచి వైదొలిగే ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. 
ఈఆర్సీలో పదేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై క్యాషియర్‌గా వచ్చి చేరిన ఉద్యోగికి ఏకంగా డిప్యూటీ డైరెక్టర్ (పే అండ్ అకౌంట్స్) పోస్టును నాటి ఇన్‌చార్జి చైర్మన్ శేఖర్‌రెడ్డి కట్టబెట్టారు. ఈఆర్సీలో 50మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో అటెండర్లు, డ్రైవర్ల వంటి కిందిస్థాయి ఉద్యోగులకు 14 ఏండ్లుగా ఒక్క పదోన్నతి కూడా దక్కలేదు. కానీ, క్యాషియర్‌గా డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగిని ఈఆర్సీలో విలీనం చేసుకోవడమే కాకుండా అకౌంటెంట్‌గా, అకౌంట్స్ ఆఫీసర్‌గా పదోన్నతులు కల్పించిన తీరుపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈఆర్సీలో పనిచేస్తున్న ఒక్కరిద్దరు ఎస్సీ ఉద్యోగులు పదోన్నతుల కోసం పెట్టుకున్న దరఖాస్తులను బుట్టదాఖలు చేసిన నాటి ఇన్‌చార్జి చైర్మన్, ఈఆర్సీ మెంబర్లు ప్రస్తుతం సీమాంధ్ర అకౌంట్స్ ఆఫీసర్‌కు మాత్రం నిబంధనలు పక్కనబెట్టి డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. త్వరలో సీమాంధ్రలో ఏర్పాటుకానున్న ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అత్యున్నత స్థానంలో కూర్చునేందుకే సదరు ఉద్యోగికి పదోన్నతి కల్పిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!