గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 04, 2014

ఛీ.. ఛీ.. లాలూచీ...

-మహిళా సంఘాలపేరుతోనూ లూటీ
-అమాయక ఆదివాసులకూ కుచ్చు టోపీ
-అవినీతి బాటకు కొత్త ముగ్గులు
-పాత ఇండ్లకు రంగులేసి పంచుకుతిన్నారు
-లేని ఇండ్లపేర నిధులు మింగేశారు
-అవినీతిపరులే విచారణాధికారులు
-గోదాముల నుంచే మాయమైన సిమెంటు
-ఆస్తులు పెంచుకున్న అధికారులు, నేతలు
-కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమాయకులు
-ఇవీ.. వరంగల్, నల్లగొండ,ఖమ్మం అవినీతి ఇండ్ల కతలు..
అవినీతికి ఏదీ అడ్డు కాదని నిరూపించారు గృహనిర్మాణశాఖ అధికారులు. మహిళా సంఘాలను కూడా వదలిపెట్టలేదు. అమాయక ఆదివాసీలను వంచించారు. సంఘాలతో సంతకాలు పెట్టించుకుని లక్షలకు లక్షలు డ్రా చేసుకున్నారు. బ్యాంకుల్లో జమ అయిన సొమ్మును టోకున కాజేశారు. కొన్నిచోట్ల పాత ఇండ్లకు రంగులు వేయించి బిల్లులు డ్రా చేస్తే.. మరికొన్నిచోట్ల ఇండ్లు నిర్మించకుండానే బిల్లులు ఎత్తుకున్నారు. గోదాములకు వచ్చిన సిమెంట్ బస్తాలను అక్కడి నుంచే మాయం చేశారు. ఇలా అవినీతి బాటకు కొత్త ముగ్గులు వేశారు. కొన్ని గ్రామాలలో గతంలో నిర్మించిన ఇండ్లకు రంగులు వేయడానికి నిధులు మంజూరయ్యాయని చెప్పి రంగులు వేయించి సంతకాలు తీసుకొని కొత్త ఇండ్లు కట్టినట్లు రికార్డుల్లో చూపించి దండుకున్నారు. పైగా జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు చివరకు విచారణ అధికారులుగా అవినీతికి పాల్పడినవారికే బాధ్యతలు అప్పగించిన తీరు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. రాజకీయనాయకులు, అధికారులు కలిసికట్టుగా చేసిన దోపిడిలో సామాన్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఇండ్ల నిర్మాణం పథకంతో లబ్ధి పొందిన అవినీతిపరుల కతలివి..housing

ఇండ్ల నిర్మాణంలో అక్రమార్కులకు ఆశపడినంత అందింది. అవినీతి అధికారులు, నేతలు మిలాఖతై అమాయకులను వంచించారు. నోరులేని ఆదివాసుల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకున్నారు. సమాజంలో సగభాగంగా ఎదుగాలనుకుంటున్న మహిళా సంఘాలనూ మోసపుచ్చారు. అక్రమకూటమి చెలరేగితే.. అందుకు అధికారం తోడయితే ఇక అడ్డేముంది?.. అలాగే సాగింది ఇండ్ల పథకం అమలు తీరు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అవినీతిపరులు రకరకాలుగా అక్రమంగా నిధులు దండుకున్నారు. విచారణలూ తూతూమంత్రమయ్యాయి. సస్పెండ్ చేసినవారిని తిరిగి అంతకుమించి అందలాలెక్కించారు. అసలు అవినీతిపరులనే విచారణాధికారులుగా నియమించారు. దొంగలు దొంగలు ఇండ్లు పంచుకుంటే.. అమాయకులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. న్యాయంకోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలోని మరో మూడు జిల్లాల దొంగ ముచ్చట్లివి..
వరంగల్ జిల్లాలో దొంగల చేతికే తాళాలు..

వరంగల్ జిల్లాలో పేదోళ్ల ఇండ్లకు సర్కారు పెద్దలు గండి కొట్టి సర్కారు సొమ్ము అక్రమంగా పంచుకుతిన్నారు. పై స్థాయి నుంచి పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు కూడా ఇక్కడ దొంగల చేతికే తాళాలు ఇచ్చారు. ఈ జిల్లాలోని, ఏ ఊర్లో చూసిన ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై శాంపిల్‌గా 211 గ్రామాలలో,14003 ఇండ్లపై జరిపిన విచారణలో రూ.33.77 కోట్ల భారీ అవినీతి జరిగినట్లు తేలింది. మొత్తంగా సర్వే చేయిస్తే క్షేత్రస్థాయిలో జరిగిన అవినీతి ఇంతకు మూడురెట్లు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వరంగల్ శివారు ప్రాంతాలలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలిస్తే పాత ఇంటికి రంగులు వేసి బిల్లులు ఎత్తుకున్నట్లు తేలింది. ఈ ఇండ్లు గతంలో ఇదే స్కీమ్‌లో నిర్మించి బిల్లులు తీసుకున్నవి కావడం గమనార్హం. ఈ పద్ధతిలో అధికారులు, నాయకులు కలిసికట్టుగా దోచుకున్నారు. 

మీ ఇండ్లకు రంగులు వేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకొని లబ్ధిదారులకు తెలియకుండా రూ.2.11 కోట్లు కాజేశారు. శాఖాపరమైన విచారణలో చాలామంది అధికారులు దోషులుగా తేలినప్పటికీ, మంత్రులు, నాయకులు వాటాలు పంచుకొని అధికారులను ఒడ్డెక్కించినట్లు ఆరోపణలొచ్చాయి. ఫలితంగా కేవలం రూ.21.15 లక్షలు మాత్రమే తిరిగి వసూలు చేసి మమ అనిపించారు. ఈ జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో మహిళా సంఘాలతో మూకుమ్మడిగా సంతకాలు చేయించుకొని 10 శాతం వారికి ముట్టచెప్పి మిగతా సొమ్మును అధికారులు, నాయకులు కాజేసినట్లు విచారణలో బయటపడింది. 

అసలు పెద్దలను వదిలేసి, అజ్ఞానంతో మోసపోయిన అమాయక ఏజెన్సీ ప్రజలను క్రిమినల్ కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. మహబూబాబాద్, కురవి మండలాల్లో కూడా ఇలాంటి దోపిడీనే కొనసాగిందని వెల్లడైంది. కురవి మండలంలోని అధికారులు డబ్బులు పంచుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని క్రిమినల్ కేసులు పెట్టారు. కానీ సదరు అధికారులు ఆనాటి మంత్రుల అండదండలతో తిరిగి దర్జాగా విధులలో కొనసాగుతున్నారు. ఇంతటి అవినీతిపై నాటి సీమాంధ్ర సర్కారు దొంగలకే తాళాలు ఇచ్చిన సామెతను తలపించే విధంగా వ్యవహరించింది. మరిపెడ, నర్సింహులుపేట, నర్సంపేట, ములుగు, కేసముద్రం, భూపాలపల్లి మండలాల్లో అక్రమాలలో భాగస్వాములైన తహసిల్దార్లనే విచారణ చేపట్టి, అవినీతి సొమ్మును రికవరీ చేయాలని ఆదేశించింది. 

ఈ అవినీతిపర్వంలో 67 మంది ప్రాజెక్టు అధికారులు, 52 మంది రాజకీయ నాయకులు, 21 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, 19 మంది మండల అధికారులు భాగస్వాములైనట్లు నివేదికలు స్పష్టం చేసినప్పటికీ, కేవలం ఆరుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మాత్రమే తొలగించారు. మిగతా వారందరిని తొలుత సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయనాయకుల అండదండలతో వారిని తిరిగి విధులకు తీసుకొని, ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నోటీస్‌లు అందుకున్న సామాన్యులు ఇండ్ల పథకమని అధికారులు వెళితే భయపడే పరిస్థితి వరంగల్ జిల్లాలో దాపురించింది. వాస్తవానికి ఈ జిల్లాలో 8,88,553 ఇండ్లు ఉండగా, మంచి ఇండ్లు 5,17,572 ఉన్నాయి. నివాసయోగ్యమైన ఇండ్లు 3,08,823 ఉండగా, శిథిలావస్థలో 62,158 ఇండ్లు ఉన్నాయని 2011 జనాభా లెక్కల సర్వే చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గృహనిర్మాణ పథకం కింద 4,75,567 ఇండ్లకు నిధులు మంజూరు చేయగా, 2.66 లక్షల ఇండ్లు మాత్రమే నిర్మించారు. ఇంకా 2.07 లక్షలు ఇండ్లు నిర్మించాల్సి ఉంది. 

నల్గొండ జిల్లాలో గోదాముల నుంచే సిమెంట్ మాయం..

గత ప్రభుత్వంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే.. ఇండ్లు కట్టకుండా బిల్లులు ఎత్తుకున్నారు. బ్యాంకుకు ఇందిరమ్మ ఇండ్ల నిధులు వచ్చాయని తెలియగానే ఏకంగా దరఖాస్తులను బ్యాంకుకే తీసుకువెళ్లి, లబ్ధిదారులతో సంతకాలు చేయించుకొని రూ.25 లక్షల బిల్లులు ఎత్తుకుపోయిన వైనం నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో జరిగింది. రేషన్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చి సంతకాలు పెట్టినందుకు లబ్ధిదారులకు రూ.10 వేలు ఇచ్చి ఇందిరమ్మ బిల్లుల మొత్తాన్ని పంచుకుతిన్నారు. 2007 నుంచి ఎలాంటి రికవరీ లేకుండా గడిపేస్తున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని సిమెంట్ గోడౌన్ నుంచి 2496 సిమెంట్ బ్యాగులు, ఆత్మకూరు(ఎస్) మండలంలో 650 సిమెంటు బ్యాగులు మాయమైన ఉదంతం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. 

మేళ్లచెరువు మండలంలో మాజీ మంత్రికి అత్యంత సన్నిహితులైన నాయకుల ఆధ్వర్యంలో రూ.12.03 లక్షల అవినీతి జరిగిందని విచారణ అధికారులు తేల్చి వర్క్ ఇన్‌స్పెక్టర్, ఎంహెచ్‌ఓ, ఎంపీడీఓలను సస్పెండ్ చేసి, సంబంధిత సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్‌లిచ్చారు. ఆలేరు మండలంలో ఎనిమిది ఇండ్లు నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు డ్రా చేసినట్లు విచారణలో తేలింది. ఆత్మకూరు(ఎస్), బీబీనగర్, చందంపేట, చింతపల్లి, చౌటుప్పల్, దామరచర్ల, దేవరకొండ, గుండాల, కోదాడ, మర్రిగూడ, మఠంపల్లి, మోత్కూరు, మునగాల, నార్కట్‌పల్లి, వలిగొండ, మునుగోడు మండలాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే ఇంటి బిల్లులు తీసుకున్నట్లు స్పష్టమైంది. 

తుంగతుర్తి మండలంలోని గుమ్మడవెల్లి, కుక్కడం గ్రామాలలో రూ.1.07 కోట్ల భారీ అవినీతి జరిగిందని శాఖాపరమైన విచారణలో తేలింది. శాంపిల్‌గా 50 గ్రామాలలోని1674 ఇండ్లపై విచారణ జరిపించగా రూ.24కోట్ల మేర అవినీతి జరిగినట్లు తెలింది. ఈ అవినీతిలో పెద్ద ఎత్తున రాజకీయనాయకులు భాగస్వామ్యం కాగా, 38 మంది ప్రాజెక్టు అధికారులు, ఐదుగురు మండల అధికారులు, 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ఇందులో 8మంది అధికారులను సస్పెండ్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. కేవలం రూ.4.46 లక్షలు రికవరీ చేసి చేతులు దులిపేసుకున్నారు. వాస్తవానికి ఈ జిల్లాలో 8,75,432 ఇండ్లు ఉండగా, 5,45,644 మంచి ఇండ్లున్నాయి. నివాసయోగ్యంగా 2,84,430 ఇండ్లు ఉండగా, శిధిలావస్థలో 45,358 ఇండ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో ఇప్పటివరకు 2.99 లక్షల ఇండ్లు మంజూరు కాగా ఇంకా 1.08 లక్షల ఇండ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. 

అవినీతి శాంపిల్..(i)

నిర్వహించింది: 211 గ్రామాల్లో.. 14003 ఇండ్లపై..తేలిన అవినీతి అంచనా: రూ.33.77 కోట్లు
భాగస్వాములు: 67 మంది ప్రాజెక్టు అధికారులు, 52 మంది రాజకీయ నాయకులు, 21 మంది 
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, 19 మంది మండల అధికారులు
తీసుకున్న చర్యలు: ఆరుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు. రూ.21.15 లక్షలు రికవరీ.
తర్వాత సంగతి: మిగతా వారందరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన. ఆ తర్వాత మళ్ళీ విధుల్లోకి తీసుకొని, ఉన్నత స్థానాల అప్పగింత.

అవినీతి శాంపిల్..(ii)

నిర్వహించింది: 50 గ్రామాలలోని1674 ఇండ్లపై..తేలిన అవినీతి అంచనా: రూ.24కోట్లు
భాగస్వాములు: పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, 38 మంది ప్రాజెక్టు అధికారులు, ఐదుగురు మండల అధికారులు, 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు. 
తీసుకున్న చర్యలు: ఎనిమిదిమంది అధికారుల సస్పెన్షన్. రూ.4.46 లక్షలు రికవరీ.
తర్వాత సంగతి: సస్పెండైన అధికారులు తిరిగి విధుల్లోకి.

అవినీతి శాంపిల్..(iii)

నిర్వహించింది: 67 గ్రామాల్లో.. 1921 ఇండ్ల నిర్మాణంపై..తేలిన అవినీతి అంచనా: రూ.32 కోట్లు 
భాగస్వాములు: 17 మంది ప్రాజెక్టు అధికారులు, ఒక మండల అధికారి, ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి 
తీసుకున్న చర్యలు: 19 మంది సస్పెన్షన్. రూ.4.25 లక్షలు రికవరీ
తర్వాత సంగతి: 19 మందిని పేరుకే సస్పెండ్ చేసి.. పూర్తిస్థాయి విచారణ పెండింగ్‌లో ఉండగానే 
తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం.

ఖమ్మం జిల్లాలో విచారణలకే దిక్కులేదు..

ఖమ్మం జిల్లాలో ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై పలు ఆరోపణలురాగా విచారణకు ఆదేశించారు. కానీ పలుచోట్ల ఇప్పటికీ నివేదికలు సమర్పించలేదు. ఖమ్మం శివారు గ్రామాలైన నాగులవంచ, నాగిలిగొండ, తల్లంపాడు, తెల్దారుపల్లి, గుబ్బగుత్తి గ్రామాలలో 175 ఇండ్ల నిర్మాణంలో అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చి, విచారణకు ఆదేశించగా నేటికీ ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు. కల్లూరు మండలంలోని పలు గ్రామాలలో 225 ఇండ్ల నిర్మాణంలో రూ.32 లక్షల మేర అవినీతి జరిగినట్లు విచారణలో తేలినప్పటికీ, సంబంధిత అధికారులు పూర్తి నివేదిక సమర్పించలేదు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో బినామి పేర్లతో రూ.18 లక్షల బిల్లులు ఎత్తుకున్నా ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. అశ్వారావుపేట మండలంలోని సోములగూడెంలో మహిళా గ్రూపులకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే రూ.17.7 లక్షలు పంచినట్లుగా చూపించారు. రికవరీ నోటీస్‌లు అందుకున్న లబ్ధిదారులు బోరుమంటున్నారు. బూర్గంపాడు, పినపాక, ఇల్లందు మండలాల్లో రూ.1.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. పినపాక మండలానికి విచారణ అధికారిగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ను నియమించారు. ఇంత భారీ ఎత్తున జరిగిన అవినీతిపై విచారణ జరిపిన అధికారులు కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ గ్రామాలే ఎక్కువ. 

గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నాయకులు, అధికారులు జిల్లాకు వచ్చిన నిధులను పంచుకుతిన్నారు. ఈ జిల్లాలో శాంపిల్‌గా 67 గ్రామాలలో1921 ఇండ్ల నిర్మాణంపై విచారణ చేయగా రూ.32కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. దానిలో రూ.4.25 లక్షలు రికవరీ అయినట్లు అధికారులు చూపిస్తున్నారు. ఈ అవినీతిలో 17 మంది ప్రాజెక్టు అధికారులతోపాటు ఒక మండలాధికారి, మరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పాల్గొన్నారు. జిల్లా మొత్తంగా ఒకే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తతంగమంతా నడిపించినట్లు తెలియవచ్చింది. ఈ 19 మందిని పేరుకే సస్పెండ్ చేసి, పూర్తిస్థాయి విచారణ పెండింగ్‌లో ఉండగానే తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ జిల్లాలో 2.87 లక్షల ఇండ్లకు నిధులు మంజూరుకాగా 2.22 లక్షలు నిర్మించినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఇంకా 64 వేల ఇండ్లు నిర్మాణం చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ జిల్లాలో 7,47,586 ఇండ్లు ఉండగా, మంచి కండిషన్‌లో 4,79,870 ఇండ్లున్నాయి. నివాసయోగ్యంగా 2,34,183 ఇండ్లు ఉండగా, శిధిలావస్థలో 33,533 ఇండ్లు ఉన్నాయని 2011 జనాభా లెక్కలు చెప్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

పట్టణ గృహనిర్మాణ ప్రాజెక్టు పీ వో బాధ్యతల్లో ఆంధ్రాకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్!

-రంగారెడ్డి జిల్లాలో 12 ఏండ్లుగా కొనసాగుతున్న తంతు
-ప్రాజెక్టు ఆఫీసర్‌గా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి పోస్టు
-ఉన్నతాధికారులపై పెత్తనం.. అప్పనంగా కోట్లు మెక్కుతున్న వైనం!

ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉన్న ఉద్యోగి.. ఎనిమిది నెలలు తిరిగేసరికి జిల్లాస్థాయి అధికారిగా అవతారమెత్తిన వైనమిది. వడ్డించేవాడు మనవాడైతే...అన్న చందంగా ఉన్నతాధికారులు తమ ప్రాంతంవారే కావడంతో ఓ సీమాంధ్ర వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా అందలమెక్కాడు. ఉన్నతాధికారులను బుట్టలో వేసుకొని.. 12 ఏండ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్ నుంచి రంగారెడ్డి జిల్లాలో పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టు అధికారిగా రూపాంతరం చెందిన జే శ్రీనివాస్‌రెడ్డి బాగోతాన్ని వింటే ఎవరైనా ఔరా అనక తప్పదు!!.. కోస్తాంధ్రకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి 2001లో ఔట్‌సోర్సింగ్ ద్వారా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్‌లోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరాడు. 8 నెలలపాటు అదే ఉద్యోగంలో పనిచేశాడు. అతడి పనితీరును గుర్తించిన జిల్లా అధికారులు రాజేంద్రనగర్ డివిజన్ నుంచి రాజీవ్ గృహకల్ప రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. రాజీవ్ గృహకల్పలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు.

ఈ క్రమంలో 2001లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ పేదలకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లకు ఈ పథకం భారంగా మారుతుందన్న ఉద్దేశంతో.. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు గృహ నిర్మాణ ప్రాజెక్టులను రూపొందించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఈ ప్రాజెక్టుల రిపోర్టులను ఎప్పటికప్పుడు అందిస్తూ.. వారిని బుట్టలో వేసుకున్నాడు. దీంతో 2001లో అప్పటి కలెక్టర్ సూచనల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్.. శ్రీనివాస్‌రెడ్డికి రంగారెడ్డి జిల్లా పట్టణ హౌజింగ్ ప్రాజెక్టు బాధ్యతలను అప్పగించారు. అప్పటినుంచి జిల్లాలో రాజీవ్ గృహకల్ప, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వైఏఎంబీఏవై), జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ పునరావాస మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) పథకాల కింద చేపట్టే గృహ నిర్మాణ పథకాల బాధ్యతలను నిర్వహిస్తూ.. జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్‌గా చలామణి అవుతున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్‌గా రూ. 7వేలు వేతనం పొందిన శ్రీనివాస్‌రెడ్డి 12 ఏండ్ల నుంచి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ హోదాలో రూ. 40 వేల వేతనం అందుకుంటున్నాడు. వాహనం అలవెన్సుల కింద నెలకు మరో రూ.25 వేలు రాజీవ్ గృహకల్ప నుంచి అందుతున్నాయి. ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి నెలకు రూ.40వేల వేతనంతోపాటు అలవెన్సులు ఇవ్వడం, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక ప్రత్యేక గది వంటి వసతులు కల్పించడంపై తెలంగాణ హౌజింగ్ శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధం:

రాష్ట్రంలో ఎక్కడైనా పట్టణ గృహనిర్మాణ పథకాన్ని గృహనిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ) పర్యవేక్షిస్తారు. పలు పథకాల్లో లబ్ధిదారుల జాబితాను పీడీ రూపొందిస్తే.. కలెక్టర్ ఆమోదించి.. వారికి ఇళ్లు మంజూరు చేస్తారు. కానీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారుల ఎంపిక కొనసాగింది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టును సృష్టించి దానిలో ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని నియమించారు. జిల్లాస్థాయి అధికారి అయిన పీడీతో సంబంధం లేకుండా అతను నేరుగా లబ్ధిదారులను ఎంపికచేసి నేరుగా కలెక్టర్‌కు జాబితాను పంపి మంజూరు చేయించుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. కాగా, శ్రీనివాస్‌రెడ్డి 12 ఏండ్లుగా కేటాయించిన గృహాలు, వాటి చెల్లింపులపై విచారణ జరిపించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గురువారం, జులై 03, 2014

ఆజామాబాద్‌లో లీజు దందా...పారిశ్రామిక లక్ష్యానికి పాతర!

-పారిశ్రామిక లక్ష్యానికి పాతర
-ఇష్టారాజ్యపు లీజులతో లక్షల కైంకర్యం
-ఉమ్మడి రాష్ట్రంలో స్వాధీనానికి వెనుకడుగు.. నోటీసులుమినహా అడుగుపడని వైనం
-విచారణల్లో అక్రమాలు బయటపడ్డా మౌనం
-136.4 ఎకరాల్లో సగం అన్యాక్రాంతం.. 30 ప్లాట్ల జాడకూడా తెలియడం లేదట

రాజధాని నడిబొడ్డున కోట్లు విలువచేసే సర్కారు భూమి అక్రమార్కుల చేతిలో బందీగా పడిఉంది. పొగగొట్టాలు, సైరన్ మోతలు, వేలమంది కార్మికులతో కళకళలాడాల్సిన ఆ ప్రాంతంలో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. ఏ నిషిద్ధ ప్రాంతమో.. సైనిక శిబిరమో అనిపించేలా తాళాలు వేసిన రేకుల గేట్ల ముందు గూర్ఖాల బూట్ల చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. దశాబ్దాల క్రితం పరిశ్రమలు పెడతామని నమ్మబలికి లీజుల రూపంలో ఆ భూమిని ఆధీనంలోకి తీసుకున్నవారు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచారు. తమకేమాత్రం అధికారంలేని ఆ భూమిని తాతల సొమ్ములాగా ఇతరులకు లీజులకు ఇచ్చుకున్నారు. ఒకడికి ఒకడు లీజు.. వాడు ఇంకొకడికి లీజు! ఇలా ఎవడి చేతిల్లో ఏ భూమి ఉందో తెలియని పరిస్థితి! పరిశ్రమలు గాలికి పోయాయి. ఆశయాలు నీరుగారిపోయాయి. కబ్జాలు పెరిగి ముఫ్పైకి పైగా ప్లాట్ల జాడే తెలియడం లేదు. కనీసం 12 కంపెనీలు ఒక్కక్షణం కూడా కొనసాగే అర్హతను కోల్పోయాయని సర్కారే నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి బాబుల పాలైన ఆ వందల కోట్ల విలువైన భూములన్నీ ఇపుడు విముక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. 
నిజాం హయాంలో పురుడుపోసుకున్న ఆజామాబాద్ పారిశ్రామికవాడకు పరాయి పీడ పట్టింది. పరిశ్రమలు పెడతామని ప్రభుత్వం వద్ద లీజుకు స్థలాలు తీసుకున్న బడాబాబులు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. సబ్ లీజుల పేరుతో దందాలు చేసుకుంటున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి లక్షలు వెనుకేసుకుంటున్నారు. పరిశ్రమలు వదిలేసి కొందరు వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తే మరికొందరు రూ.వందల కోట్ల విలువైన స్థలాన్ని వదలబోమంటూ భీష్మించుకొని కూర్చున్నారు. కొందరు లబ్ధిదారులు వాణిజ్య కార్యకలాపాలను నిర్వర్తిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.

industry
నిబంధనలు పాటించని వారి లీజులను ఏనాడో రద్దు చేయాల్సి ఉన్నా బాధ్యుల ఉదాసీనతతో లక్ష్యం గాడి తప్పింది. మరోవైపు లీజు కాల వ్యవధి ముగిసిన తర్వాత వెనుకకు తీసుకోవాల్సి ఉన్నా ఒక్కటంటే ఒక్క ప్లాటుకూడా వెనుకకు తీసుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సీమాంధ్ర సర్కారు పుణ్యమా అని కనీసం 30 ప్లాట్ల జాడకూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అధికారులు జరిపిన సర్వేలో 12 ప్లాట్లు తక్షణం వెనుకకు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తించినా నాటి సర్కారు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల మద్దతుతో యథేచ్ఛగా రాజ్యమేలిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ర్టావిర్భావంతో గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల అక్రమాలపై ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో తరువాతి వంతు ఎవరిదోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రభుత్వం నుంచి స్థలాలు పొంది వినియోగించని, దారి తప్పిన వాటిని రద్దు చేయాలని ఇప్పటికే సీఎం కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం నుంచి అగ్గువకు భూములు పొంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై త్వరలోనే చర్యలు తప్పవని ప్రభుత్వ వ్యవహారశైలి స్పష్టం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ స్టేట్‌లో తొలి పారిశ్రామికవాడపై ఆసక్తికర చర్చ సాగుతున్నది. దేశంలో ఎవరూ ఆలోచన కూడా చేయని కాలంలో నిజాం రాజ్యంలో పరిశ్రమలకోసం ప్రత్యేకంగా ఓ వాడ పుట్టింది. రాజధాని నగరం పరిశ్రమలతో కళకళలాడాలని ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి దొరకాలనే ఆశయంతో ప్రభుత్వమే భూములిచ్చి పరిశ్రమలకు ఆహ్వానం పలికే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకంగా ఓ ఫండ్ ఏర్పరిచి అనేక వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించిన తరుణంలోనే పారిశ్రామిక వాడ ఆలోచన పుట్టింది. దీని కోసం సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు, ఎంసీహెచ్, సిటీ పోలీసు, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ అధికారులతో కూడిన కమిటీని పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించేందుకు నియమించింది. సదరు కమిటీ ఆజామాబాద్‌లో 134.4 ఎకరాలను గుర్తించింది. ఇండస్ట్రియల్ ట్రస్టు ఫండ్‌తో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. ఈ స్థలాన్ని 86 ప్లాట్లుగా విభజించారు. 1952 డిసెంబరు 29న సిటీ ఇంప్రూవ్‌మెంట బోర్డు ఈ ఇండస్ట్రీయల్ ఏరియాను ఇండస్ట్రియల్ ట్రస్టు ఫండ్‌కు అప్పగించింది. ఆ తర్వాత పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ముందుకొచ్చిన అనేక యాజమాన్యాలకు స్థలాలను లీజుకు ఇచ్చారు.

వివిధ పరిశ్రమలు...

పరిశ్రమలకు ఇచ్చిన స్థలాల్లో 500 గజాల నుంచి 14 ఎకరాల వరకు ఉన్నాయి. వీఎస్‌టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 67,444.89 గజాలు(13.93 ఎకరాలు), అగర్వాల్ ఇండస్ట్రీస్‌కు 35,332.47 గజాలు(7.3 ఎకరాలు), హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్‌కు 18,870.78 గజాలు(3.899 ఎకరాలు), దయారాం సురాజ్‌మాల్ లాహోటి ఆయిల్ మిల్‌కు 17,133 గజాలు(3.54 ఎకరాలు), ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్‌కు 23,489 గజాలు(4.853 ఎకరాలు), బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు 18,825 గజాలు(4.254 ఎకరాలు), కున్ లిమిటెడ్‌కు 16,714 గజాలు(3.453 ఎకరాలు), యూసుఫ్ కంపెనీకి 11,304 గజాలు(2.336 ఎకరాలు) తదితర కంపెనీలకు కేటాయించారు. ఇలా స్థలాలు లీజుకు తీసుకున్న చాలా కంపెనీలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉల్లంఘించారు. ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా(టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) యాక్ట్ 15/1992ను యథేచ్ఛగా ఉల్లంఘించినట్లు పరిశ్రమల శాఖ చెబుతోంది. ప్రభుత్వం నుంచి స్థలాలు పొందిన యాజమాన్యాలు పరిశ్రమలు పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఇతరులకు సబ్ లీజులకు, కిరాయికి ఇచ్చుకున్నారు. పారిశ్రామికవాడను గిడ్డంగులకు, వాణిజ్య కార్యకలాపాలకు, నివాస ప్రాంతాలకు వినియోగించారు. ఇప్పటికీ ఎన్‌కంబరెన్స్‌లో ఈ భూమి ఇండస్ట్రీయల్‌కు మాత్రమేనని స్పష్టంగా ఉంది.

కోర్టుకెక్కిన వ్యవహారం..

అక్రమాలకు పాల్పడ్డ కొందరు స్థలాలను కాజేసేందుకు ఇండస్ట్రీయల్ ఏరియా రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టుకెక్కారు. ఐతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇది లెజిస్లేచర్‌కు సంబంధించిన అంశంగా పరిగణించింది. మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా గుర్తించింది. ఐతే సుప్రీం కోర్టు 2000లో ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియా(టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) యాక్ట్ నెం.1/2000లో కొన్ని మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానికి అపాయింటెడ్ డేట్‌గా 2000 ఫిబ్రవరి 17 గా పేర్కొంది. దాని ప్రకారం లీజు ప్రకారం నడుస్తోన్న సంస్థలకు సదరు స్థలాలను మార్కెట్ ధరలో 75 శాతం తీసుకొని ఫ్రీహోల్డ్ రైట్స్‌ను కల్పించాలని, లేదంటే లీజును పునరుద్ధరించాలని సూచించింది. అయితే ఇది ఎవరైతే అప్పటికే నిబంధనలను ఉల్లంఘించారో వారికి మాత్రం వర్తించదు.

సర్కారు వెసులుబాటు జీవోలు..

ప్రభుత్వం దీని ఆధారంగానే జీఓ నెం.87 తేదీ.20/2/2002ను జారీ చేసింది. అలాగే అపాయింటెడ్ డేట్‌ను 17-02-2000గా నిర్ణయిస్తూ మరో జీఓ నెం.67ను విడుదల చేసింది. ఆ తర్వాత 2003లో ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాకు కొంత వెసులుబాటును కల్పించింది. ఫ్రీహోల్డ్ రైట్స్ పొందడానికి ఫీజుల ఉపసంహరణ, ల్యాండ్ యూజ్ ఫీజు రద్దు, యూఎల్సీ యాక్ట్ నుంచి విముక్తి కల్పించింది. ఎవరైనా ఇతర ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పితే ఏపీఐఐసీ స్థలాలకు 15 నుంచి 20 శాతం వరకు రాయితీని ప్రకటిస్తూ పరిశ్రమల శాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. 2004లోనూ మరో వెసులుబాటుకు అవకాశం కల్పించారు. పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలించే వాటికి లీజు మొత్తాన్ని రద్దు చేయడం, తరలించడానికి ఆసక్తి లేని కంపెనీలపై ప్రీమియంను పెంచాలని నిర్ణయించారు. అది గజానికి రూ.500 వరకు ఉంది. మళ్లీ లీజులు/ ఫ్రీహోల్డ్ పొందేందుకు 77 దరఖాస్తులు అందాయి.

దీనిపై ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. అపాయింటెడ్ డేట్ ప్రకారం దరఖాస్తులను పరిశీలించగా 77లో కేవలం 24 మాత్రమే ఫ్రీహోల్డ్‌కు అర్హత కలిగి ఉన్నాయి. ఐదు దరఖాస్తులను పూర్తిగా తిరస్కరణకు గురయ్యాయి. మిగతా వాటిపై నేటికీ సందిగ్ధత నెలకొంది. దరఖాస్తుల్లో తొమ్మిదింటిని ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఇవ్వకుండా పక్కకు పెట్టారు. 2007 ఫిబ్రవరి 20వ తేదీన పరిశ్రమల శాఖలో దీనిపై ఓ సమీక్షా సమావేశం జరిగింది. అందులో కొందరు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను స్థాపించి కొన్ని ఏళ్ల పాటు నడిపి, ఆ తర్వాత మూసేసినట్లు పేర్కొన్నారు. దీనికి రకరకాల కారణాలను అంచనా వేశారు. మార్కెటింగ్, టెక్కికల్, ఫైనాన్షియల్ సమస్యలను పారిశ్రామికవేత్తలు చూపించినట్లు చర్చించారు. దీని ప్రకారం కొందరు మళ్లీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎలాంటి అనుమతులను ప్రభుత్వం ఇవ్వలేదు.

12 కంపెనీలపై రెడ్ మార్క్..

ప్రభుత్వం నిర్ణయించిన అపాయింటెడ్ డేట్(తేదీ.17-02-2000) ప్రకారం ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలో ప్లాట్లు పొందిన 12 ప్రధాన కంపెనీలు నిబంధనల ప్రకారం నడుచుకోలేదని పరిశ్రమల శాఖ నివేదికను రూపొందించింది. వాటిలో హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ(ప్లాట్ నెం.22), దిగ్విజయ్ ఇండస్ట్రీస్(ప్లాట్ నెం.14/4), బిగ్ యాపిల్ కంప్యూటర్స్(శిదాత్‌రాయ్ గులాబ్ రాయ్) (ప్లాట్ నెం.3, 3/1, 3/7), యూసుఫ్ కంపెనీ (ప్లాట్ నెం.14/1, 24/2), జేపీ అండ్ కంపెనీ (ప్లాట్ నెం.17/1), శివదత్ రాయ్ భూర్మాల్ (ప్లాట్ నెం.13/4), ఇండియన్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వర్క్స్ (ప్లాట్ నెం.18/2), కపాడియా ఇండస్ట్రీస్ (ప్లాట్ నెం.7/3), తారకప్రభు పబ్లికేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ప్లాట్ నెం.7/1), రాం కెమికల్స్ (ప్లాట్ నెం.15/4), వెనేస్కరణ్ ఇండస్ట్రీస్ (ప్లాట్ నెం.14/1, 24/2) ఉన్నాయి. వీటితోపాటు ఇంకా అనేక కంపెనీలు కూడా మార్గదర్శకాలను పాటించలేదని సమాచారం.లీజులు రద్దు చేసి స్థలాలను వాపసు తీసుకోవాల్సిన ప్లాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని పరిశ్రమల శాఖ అభిప్రాయపడుతోంది.

అమ్మో ఆజామాబాదా..!

ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ కారిడార్ గురించి కనీసం చర్చించడానికి కూడా పరిశ్రమల శాఖ అధికారులు భయపడుతున్నారు. దీనిపై వివరాలు అడిగేందుకు టీ మీడియా ప్రయత్నించగా వామ్మో..! దాని గురించి మాట్లాడుకోవడం బాగుండదంటూ ముఖం చాటేశారు. ఏ అంశంపైనానైనా మాట్లాడొచ్చు. దాని గురించి పట్టించుకుంటే ఇంటికి పోవడమేనని అభిప్రాయపడుతున్నారు.ఈ వ్యవహారంలో అక్రమార్కులంతా బడాబాబులు, వారికి నాయకుల వత్తాసు ఉండడమే దానిక్కారణమని సమాచారం. ప్రభుత్వమే ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగితే తప్ప ఇక్కడి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలుస్తోంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గోకుల్.. మరో గురుకుల్...!

-ప్రైవేటుపరమైన నిజాం జాగీరు భూముల్లో సీమాంధ్రుల పాగా
-అనుమతులు నిల్ బహుళ అంతస్తులు ఫుల్
-ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి
-అక్రమనిర్మాణాలపై చర్యలకు రంగం సిద్ధం.. నోటీసులు జారీ
మొన్న లీజు భూములు.. నిన్న గురుకుల్ ట్రస్టు భూములు.. నేడు పైగా భూములు. సీమాంధ్ర భూబకాసురులు కబ్జా పెట్టిన తెలంగాణ భూములు ఒక్కొక్కటిగా చెరవీడుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వలసవాదులు నిర్మించుకున్న ఆధిపత్య ప్రతీకలు కూలుతున్నాయి. గత సీమాంధ్ర ప్రభుత్వాల అండదండలతో రూ.లక్షల కోట్ల విలువచేసే భూములు దర్జాగా కబ్జా పెట్టుకున్న అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. లీజు భూములు, గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఆక్రమణలను కూల్చిన అధికారులు ఇప్పుడు గోకుల్ ప్లాట్స్‌పై దష్టి పెట్టారు. కాలనీలోని 50 అక్రమ నిర్మాణాలను గుర్తించి బుధవారం వారందరికీ స్పీడ్‌పోస్టులో నోటీసులు పంపారు. పోలీసు బందోబస్తు లేని కారణంగా కూల్చివేతలు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. హఫీజ్‌పేట సర్వేనెంబర్ 78లోని 214 ఎకరాల పైగా భూములు నాటి సీమాంధ్ర ప్రభుత్వాల అలసత్వం, అధికారుల అడ్డగోలుతనం కారణంగా పరాధీనమై ఎలా గోకుల్ ప్లాట్స్‌గా మారాయో చూడండి.
buildings

ఇదీ పైగా భూముల కథ..

హైదరాబాద్ సంస్థానంలో నిజాం రెవెన్యూ, రక్షణవ్యవస్థల్లో కీలక విధులు నిర్వహించిన పలువురు సేవకులకు జాగీర్లు, ఇనాములు ఇచ్చారు. ఈ జాగీర్లు అందుకున్నవారిలో నిజాం సైన్యాధికారి ఖుర్షీద్‌జా పూర్వీకులు కూడా ఉన్నారు. వారసత్వంగా వచ్చిన ఆ భూములను ఖుర్షీద్‌జా అప్పట్లో రైల్వేలైన్ నిర్మాణం కోసం ఇచ్చేశారు. దానికి బదులుగా హైదర్‌నగర్, హఫీజ్‌పేట శివారు గ్రామాలను నిజాం ఆయనకు ఇనాముగా ఇచ్చాడు. వీటినే పైగా అనేవారు. ఈ రెండు గ్రామాలపై వచ్చే పన్నులను ఖుర్షీద్‌జాకు నష్టపరిహారంగా చెల్లించేలా ఉత్తర్వులిచ్చాడు. 1949లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సమయంలో జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్స్ 1358ఎఫ్ యాక్ట్ ప్రకారం ఇనాం గ్రామాలైన హైదర్‌నగర్, హఫీజ్‌పేటలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రద్దు చేసిన గ్రామాల జాబితాలో హైదర్‌నగర్, హఫీజ్‌పేట గ్రామాలను సీరియల్ నెంబరు 380, 381గా పేర్కొన్నారు. పలుమార్లు ఈ భూములు ప్రభుత్వ ఆస్తేనని కోర్టులు తీర్పులిచ్చాయి. 

కానీ ఖుర్షీద్ జా వారసులు ఈ రెండు గ్రామాల్లోని భూములు తమవిగా పేర్కొంటూ నిజాంనవాబుకు, అతని అల్లుడు ఖాజీం నవాబ్‌జంగ్‌కు విక్రయించారు. నిజాం మరణానంతరం అతని కార్యదర్శి ఎఫ్.ఇ.దిన్‌షా లిమిటెడ్ పేరిట ఈ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాడు. భూములపై హక్కులు పొందిన ఎఫ్.ఇ.దిన్‌షా లిమిటెడ్ అనంతరం ఎఫ్‌ఈ సైరస్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పేరు మార్చుకుని డాక్టర్ పీఎస్ ప్రసాద్‌ను ఆస్తులకు జీపీఏగా నియమించింది. అనంతరం భూములను ప్రసాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్ సంస్థకు అసైన్ చేసింది. ఈ విధంగా గతంలో న్యాయస్థానాలు ప్రభుత్వ ఆస్తిగా తేల్చిన భూములపై సీమాంధ్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా చివరికి గోల్డ్‌స్టోన్ సంస్థకు హక్కులు సంక్రమించాయి. ఈ భూముల్లోనే 162 ఎకరాల్లో గోకుల్‌ప్లాట్స్ లే ఔట్ చేసి ప్లాట్లు విక్రయించారు. మొత్తం 162 ఎకరాల్లో 1800ప్లాట్లు వేశారు. కేవలం నోటరీ కాగితమే ఆధారంగా ఉన్న ఈ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఆకాశహర్మ్యాలు నిర్మించడం మొదలుపెట్టారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

తల్లి.. తండ్రి..కొడుకు.. మనిషికొక్క ఇల్లు...అంతా అవినీతిమయం...!

-ఇందిరమ్మ ఇళ్లలో కట్టుతప్పిన అవినీతి
-రికవరీలు నామమాత్రం.. సస్పెన్షన్లు పూజ్యం
-ఉత్తుత్తి విచారణలు, ఉత్తుత్తి చర్యలు
-యాక్షన్ తీసుకున్నట్టు యాక్టింగ్, నాలుగు రోజులకే పోస్టింగ్
రాజధాని చుట్టూతా ఉన్న మూడు జిల్లాల్లోనూ నాయకులు అధికారులు నిర్భీతిగా ఇష్టారాజ్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భ్రష్టు పట్టించారు. దొరికినంత మేరా వాటాలు పంచుకున్నారు. అడక్కుండా ఇండ్లు మంజూరు చేసిన వైనాలు, తెలీకుండానే ఇండ్ల నిధులు కైకంర్యం చేసిన వైనాలు రాజధానికి సమీపంలోని జిల్లాల్లోనే చోటు చేసుకున్నాయి. పాత ఇంటికి ఓసారి, రంగులేసి మరోసారి బిల్లులు లేపారంటే ఏ స్థాయికి ఆ అవినీతి చేరిందో చెప్పుకోవచ్చు. చివరకు గహనిర్మాణ సంస్థ శాంపిల్ విచారణలో ఒక్కో గ్రామంలో యూభైలు వందల ఇండ్ల కథ బోగస్ అని బయటపడడంతో ఆశ్చర్యపోవాల్సిన స్థితి. ఇంత జరిగినా అక్రమార్కుల మీద తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఉత్తుత్తి చర్యలతో మమ అనిపించారు. ఫలితంగా అలా వెళ్లిన అధికారులు ఇలా విధుల్లోకి వచ్చేశారు. కొన్ని కేసుల్లో పదోన్నతులు లభించడం దీనికి పరాకాష్ఠ.

మెదక్ జిల్లాలో శాంపిల్ అవినీతే రూ.26 కోట్లు..

మెదక్‌జిల్లాలో గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇండ్ల పథకంలో అవకతవకలపై, శాంపిల్‌గా కేవలం 36 గ్రామాలలో కట్టిన 1787 ఇండ్లను పరిశీలిస్తేనే రూ.26.1 కోట్ల అవినీతి బట్టబయలైంది. జిల్లాలో మొత్తం1225 గ్రామాలలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే కనీస పక్షం రూ.800 కోట్ల రూపాయల అవినీతి బయటపడుతుందని అంచనా. కాగా రెవెన్యూ రికవరీ చట్టం కింద అవినీతి సొమ్ము వసూలు చేయాలని 36 గ్రామాలకు అదేశాలు ఇస్తే వసూలైంది రూ.6.95 లక్షలు. ఈ అవినీతిలో 60 మంది అధికారులు భాగస్వాములు కాగా 17 మంది అధికారులపై చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. ఇందులో ఆరుగురు అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు చెప్పారు. ఒక అధికారిపై క్రిమినల్ కేసు , మిగిలిన 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేసినట్లు చూపించారు. కాగా కొద్ది రోజులకే ఈ అధికారులపై డిపార్ట్‌మెంట్ అధికారులకు, సీమాంధ్ర సర్కారు పెద్దలకు ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకువచ్చి 11 మంది అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ అధికారుల అవకతవకలు పరిశీలిస్తే.. జహీరాబాద్ మండలంలోని ధనసిరి గ్రామంలో 61 మంది అర్హతలేని వారికి, భూచెనెల్లి గ్రామంలో 171 మంది అనర్హులకు నిధులు విడుదల చేసినందుకు ఆ ఏరియాలో పని చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఎఇ) ఉద్యోగం నుంచి ప్రభుత్వం 2009 నంబర్16వ తేదీన సస్పెండ్ చేసింది.

indirammaవిచారణ పూర్తి కాకుండానే 2010 అక్టోబర్ 14వ తేదీన తిరిగి విధుల్లోకి తీసుకుంది. దీంతో అవినీతికి పాల్పడే అధికారులకు ధీమా పెరిగింది. వట్టినాయక్ తండాలో 397 మంది అనర్హులైన లబ్దిదారుల పేరుతో బిల్లులు విడుదల చేసినందుకు మరొక ఏఇని 2008 నవంబర్12వ తేదీన సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసు కూడా నమోదైంది. కేసు విచారణలో ఉండగానే సమైక్య సర్కారు ఎన్నికలకు ఏడాది ముందు 2013 ఏప్రిల్ 30వ తేదీన తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని మంచి పోస్టింగ్ కూడా ఇచ్చింది. పుల్కల్ మండలంలోని కోడూర్ గ్రామంలో అవినీతికి వర్కింగ్ ఇనిస్పెక్టర్‌గా పని చేసిన ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ఇదే అక్రమాలలో భాగస్వాములైన ముగ్గురు డిప్యూటీ ఇఇలు, ఇద్దరు ఏఇలను మాత్రం సస్పెండ్‌చేసి విచారణ పెండింగ్‌లో ఉండగానే 2013 ఫిబ్రవరి 10వ తేదీన తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వాస్తవంగా ఈ జిల్లాలో 6,66,764 ఇండ్లున్నాయి. ఇందులో 4,35,278 మంచి ఇండ్లు కాగా, 2,07,013 నివాసయోగ్యమైనవి. 24,473 శిథిలావస్థలో ఉన్నాయని జనాభా లెక్కల సర్వేలో తేలింది. ఈ జిల్లాలో 3,03,083 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 1,88,440 ఇండ్లు నిర్మించినట్లు రికార్డుల్లో చూపించారు.

రంగారెడ్డి జిల్లాలో రాని ఇంటికి రికవరీ నోటీస్

860 గ్రామాలున్న రంగారెడ్డి జిల్లా రాజధానికి ఆనుకొని ఉన్నది.. రాజధానిలో ఎలాంటి నిర్ణయాలు జరిగినా వెంటనే అమలయ్యేది ఈ జిల్లాలోనే. ఇక్కడ ఇంటి కోసం ఎదురు చూస్తున్న సామాన్యుడికి కట్టిన ఇల్లుకు డబ్బులు వాపస్ ఇవ్వమని ప్రభుత్వం నోటీస్‌లు జారీ చేయడం ఈ జిల్లాలో జరిగిన అవినీతికి పరాకాష్ఠ. అధికారులు, నాయకులు పలు గ్రామాల్లో ప్రజల పేర దొంగ ఐడీకార్డులు, రేషన్ కార్డులు సృష్టించి ఇండ్లు మంజూరు చేయించి, వచ్చిన నిధులను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే విచారణలో అనర్హులకు ఇండ్లు కేటాయించారని తేలి అధికారులు రికవరీ నోటీసులు జారీ చేస్తే అవి అసలు యజమానికి చేరి రచ్చరచ్చయింది. లబోదిబోమని అధికారుల వద్దకు వెళ్లినా వారు డబ్బులు కట్టాల్సిందేనంటున్నారు. ఈ సంఘటనలు తాండూరు, చేవెళ్ల, ధారూర్, దోమ, వికారాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగాయి. ఇక్కడ విచారణ అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారణ జరపలేదని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన నివేదికను పరిశీలిస్తే అర్థమవుతుంది. కంటి తుడుపుగా 20 గ్రామాలలో విచారణ జరిపినట్లు చూపించి కొంత మంది అధికారులకు షోకాజ్ నోటీస్‌లు, మెమోలు జారీ చేసి వదిలేశారు. సదరు అధికారుల నుంచి వివరణలు రాకున్నా రాజకీయ నేతల ప్రమేయంతో పట్టించుకోలేదు. ఈ జిల్లాలో అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో సహా రుజువైన కేసుల్లో కూడా కనీస చర్యలు కూడా తీసుకోలేకపోయారు. హౌసింగ్ కార్పొరేషన్ శాంపిల్‌గా 20 గ్రామాలలో చేపట్టిన విచారణలో ఎనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది.

వికారాబాద్ మండలంలోని బూరుగుపల్లిలో ఎలాంటి ఇంటి నిర్మాణాలు చేపట్టకుండానే, లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం లేకుండానే రూ.6.63 లక్షలు దొంగ బిల్లులు పెట్టి డ్రా చేసినట్లు విచారణలో తేలింది. యాలాల్ మండలంలోని జక్కెపల్లి, బెన్నూర్ గ్రామాలలో డిప్యూటీ ఇఇ, ఎంఏసీ అధికారులు ఇద్దరు కలిసి రూ.5 లక్షల అవినీతికి పాల్పడినట్లు నివేదిక ఇచ్చినప్పటికీ కనీస చర్యలు తీసుకోలేదు. సొమ్మునూ రాబట్టలేకపోయారు. పైగా యాక్షన్ తీసుకోవాల్సిన ఫైల్‌ను తొక్కిపెడుతున్నారు. ఈ జిల్లాలోనే అనేక గ్రామాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే పాత ఇండ్లకు రంగులు దిద్ది పెద్దమొత్తంలో డబ్బులు డ్రా చేసుకున్నట్లుగా నివేదికలు చెపుతున్నాయి. చేవెళ్ల మండలంలోని కాన్పూర్, మీర్జాగూడ గ్రామాలలో రూ.18.35లక్షల అవినీతిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినప్పటికీ నేటికి ఎలాంటి చర్యలు చేపట్టకుండానే సదరు అధికారులను రక్షిస్తున్నారు. ఈ జిల్లాలో మొత్తం 12,63,714 ఇండ్లు ఉండగా, మంచి ఇండ్లు 10,11,828 ఉన్నాయి. నివాసయోగ్యమైన ఇండ్లు 2,37,809 ఇండ్లున్నాయి. శిధిలావస్థలో కేవలం14,077 ఇండ్లు మాత్రమే ఉన్నాయని జనాభా లెక్కల సర్వే చెపుతున్నది. కానీ ఇప్పటి వరకు ఈ జిల్లాలో 3,07,684 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,21,413 ఇండ్లు నిర్మించినట్లు అధికారులు చెపుతున్నారు. ఇంకా 1,49,271 ఇండ్లకు పనులు కూడా మొదలు పెట్టలేదని అంటున్నారు.

పాలమూరు జిల్లాలో ఒకే ఇంటికి నాలుగు బిల్లులు..

కూటి కోసం ఎల్లలు దాటి వలసలు పోయే అమాయక పాలమూరు జిల్లా ప్రజలను కూడా దయలేని దగుల్బాజి అధికారులు అందిన కాడికి దోచుకున్నారు. 1477 గ్రామాలున్న ఈ జిల్లాలో ఇండ్ల నిర్మా ణంలో శాంపిల్‌గా 53 గ్రామాలలోని 1227 ఇండ్లపై హౌసింగ్‌కార్పోరేషన్ అధికారులు విచారణ చేపట్టగా రూ.28.03 కోట్ల భారీ అవినీతి జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ జిల్లాలో అధికారులు, నాయకులు కలిసికట్టుగా మరో రకం అవకతకలకు దిగి రికార్డు సృష్టించారు. ఎక్కడా లేని విధంగా ఒకే కుటుంబంలోని తల్లి, తండ్రి, కొడుకులకు రేషన్ కార్డులు సృష్టించి ఒక్కళ్లకు ఒక్కో ఇల్లు మంజూరు చేశారు. ఒకే ఇంటికి మూడు నాలుగు సార్లు బిల్లులు సృష్టించి దండుకున్న వైనం బయటపడింది. గద్వాల మండలంలోని అనేక గ్రామాలలో నిర్మాణాలు కూడా చేపట్టకుండానే బిల్లులు అధికారులే డ్రా చేసుకున్న వైనం వెలుగు చూసింది. పాత ఇండ్లకు ఒకసారి, రంగులు వేయించి మరోసారి ఇలా ఒకే ఇంటికి డబుల్ బిల్లులు తీసుకున్నారు. అయితే ఈ బిల్లుల సొమ్ము లబ్ధిదారులకు కాకుండా నాయకులకు, అధికారులకు చేరినట్లు నివేదికలో పొందుపర్చారు. మహబూబ్‌నగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న శివారు గ్రామాలలో చేపట్టిన ఇండ్లనిర్మాణంలో రూ.28.22లక్షల మేరకు అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది. నాగర్ కర్నూల్ డివిజన్‌లోని గుమ్మకొండ, అలీపూర్, శైన్‌పల్లి, నగనూల్, నాగర్ కర్నూల్, పెద్దముద్దనూర్, తాళ్లపల్లి, తెల్కపల్లి, వెల్దండ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై చేపట్టిన విచారణలో రూ.1.71 కోట్లు భారీ అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయింది. కానీ నేటి వరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద కేవలం రూ. 17.55 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగారు.

నాగర్ కర్నూల్, బిజినేపల్లి, కొల్హాపూర్ సబ్‌డివిజన్లలోని అనేకమంది రాజకీయ నాయకులు, అధికారులపై క్రిమినల్ కేసులునమోదు అయినప్పటికీ సొమ్మును తిరిగి రాబట్టడంలో గృహనిర్మాణశాఖ ఘోరంగా విఫలమైనట్లు నివేదికలు చెపుతున్నాయి. అయితే ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతిలో 45 మంది అధికారులు, నలుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు భాగస్వాములవుతూ కేవలం 10 మంది అధికారులను మాత్రమే సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. వీరిలోనూ తిరిగి ఏడుగురు అధికారులను ఉద్యోగాలలోకి తిరిగి తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపైనే వేటు వేశారు. ఈ తతంగం అంతా ఇద్దరు రాజకీయ నాయకుల కనుసన్నలలో జరిగినట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. వాస్తవంగా ఈ జిల్లాలో మొత్తం 8,73,859 ఇండ్లు ఉండగా, మంచి కండిషన్‌లోఉన్న ఇండ్లు 5,70,203 ఉన్నాయి, నివాసయోగ్యమైన ఇండ్లు 2,54,888 ఉండగా, శిథిలావస్థలో ఉన్నవి కేవలం 48,768 మాత్రమే ఉన్నాయని జనాభా లెక్కల సర్వే చెపుతున్నది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఈ జిల్లాలో 5.81 లక్షల ఇండ్లు మంజూరు కాగా 3 లక్షల ఇండ్లు పూర్తి చేసినట్లు అధికారులు చెపుతున్నారు. 1.91లక్షల ఇండ్లు ఇంత వరకు ప్రారంభించలేదని, 87 వేల ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని అధికారులు చెపుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

బుధవారం, జులై 02, 2014

ఆంధ్రా పక్షపాతి కమలనాథన్ కమిటీ తీరు విచారణీయం...!

-కమలనాథన్ కమిటీ తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరాలు పట్టించుకోలేదు
-దశాబ్దాల కష్టనష్టాలను పరిగణనలోకి తీసుకోలేదు..
- తెలంగాణ ఉద్యోగ సంఘాల మండిపాటు
-సీఎస్ రాజీవ్‌శర్మతో సచివాలయ ఉద్యోగుల భేటీ..
-కమలనాథన్ కమిటీ తీరుపై ఫిర్యాదు
-సీఎం కేసీఆర్‌ను కలువాలని నిర్ణయం

ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ర్టానికే కేటాయించకుండా ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని ప్రకటించటంపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు కమలనాథన్ కమిటీ పైరవీకారుల కమిటీగా మారిపోయిందని, తెలంగాణ ఉద్యోగుల కనీస డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను మంగళవారం కలిసి కమలనాథన్ కమిటీ తీరుపై ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్రానికి ఉద్యోగుల జాబితాను ఇచ్చిందని విమర్శించారు. ఆప్షన్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులంతా తెలంగాణ రాష్ట్రంలో ఉంటామని కోరుకుంటారని, అదే జరిగితే రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 42 శాతం కన్నా ఎక్కువ అవుతుందని, దాన్ని సాకుగా చూపి తెలంగాణ ఉద్యోగులందరినీ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

nathanతెలంగాణ సచివాలయానికి కేటాయించిన 78 మంది సెక్షన్ ఆఫీసర్లను సులభమైన మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పంపించవచ్చని మొరపెట్టుకున్నా కమలనాథన్ కమిటీ వినిపించుకోలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీప్రసాద్, టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఏ పద్మాచారి, చైర్మన్ రాములు, సెక్రటేరియట్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం నరేందర్‌రావు, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ విమర్శించారు. ఏ చిన్న సమస్యను లేవనెత్తినా తన పరిధిలో లేదంటూ తప్పించుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు స్వచ్ఛందంగా స్వరాష్ట్రానికి వస్తామంటున్నప్పటికీ ఎందుకు అనుమతించటంలేదని ప్రశ్నించారు. అసలు కమలనాథన్ కమిటీ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమలనాథన్ కమిటీ తీరుపైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

సీఎస్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ

ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని కమలనాథన్ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ సచివాలయం ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ రాజీవ్‌శర్మను కలిసి తమ అభ్యంతరాలను వివరించారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1956కు మందు తెలంగాణలో స్థిరపడిన వారినే తెలంగాణ ఉద్యోగులుగా గుర్తించాలని, ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా విభజన జరగాలని కోరారు. సీఎస్‌తో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల క్యాడర్ సంఖ్య ఆధారంగా విభజనకు సీఎస్ ఒప్పుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు మరో రెండు నెలలు ఓపిక పట్టాలని సీఎస్ కోరినట్లు చెప్పారు. జూన్ తర్వాత వచ్చిన పోస్టులను కూడా ఉద్యోగుల పంపిణీలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు సీఎస్ తెలిపారని పేర్కొన్నారు. తప్పుడు ధ్రువపత్రాలు గుర్తించేందుకు ప్రత్యేక కమిటీనీ ఏర్పాటు చేయటంతోపాటు సర్విస్ రిజిస్టర్‌ను మరోసారి పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని, అయితే ఉద్యోగుల అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ చెప్పినట్లు వివరించారు.

క్యాడర్ ఆధారంగానే విభజన జరగాలి: టీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌రావు

క్యాడర్ ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజనకు మరో రెండు నెలలు పట్టే అవకాముందని, తెలంగాణ ఉద్యోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేసేలా ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆప్షన్లు ఇవ్వవద్దు: ఉద్యోగ సంఘం నేత పద్మాచారి

ఉద్యోగుల విభజనలో ఎటువంటి ఆప్షన్లకు అవకాశం ఇవ్వవద్దని తెలంగాణ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరం అధ్యక్షుడు పద్మాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రాజధానిలో ఆప్షన్లు ఇచ్చే అవకాశమే లేదని, ఈ విషయాన్ని గుర్తించాలని కమల్‌నాథ్ కమిటీకీ సూచించారు. ఆప్షన్లు ఇస్తే తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి అర్థమే లేదన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

నెలబాలుడి జనపాలన...!

స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధన దిశగా తదేక దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ నెలరోజుల పాలన దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను సాకారం చేసేబాటలో సాగుతున్నది. పాలనలో ప్రతిరంగంలోనూ ప్రతి అంగుళమూ తెలంగాణ ముద్రవేస్తున్న ఆయన తీరు ప్రజలను ముగ్ధులను చేస్తున్నది. ఒక్కో రంగం మీద ఆయన ఆవిష్కరిస్తున్న విజన్ రేపటి బంగారు తెలంగాణను కళ్లకు కడుతున్నది. అరవైఏళ్ల ఆకాంక్షలకు రూపమిచ్చే సుదీర్ఘ ప్రయాణంలో నెలరోజులు అతి స్వల్పకాలమే. ఈ ముఫ్పై రోజుల పాలనలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అమూల్యమైన కానుక భవిష్యత్తు మీద భరోసా. ఒకవేళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాక మరొకరుంటే మన పరిస్థితి ఏమై ఉండేదో.. సామాన్యుడినుంచి విద్యావంతుల దాకా అంటున్న మాట ఇదే. చట్టసభల్లో పట్టనన్ని సీట్లు గెలిచిన మహానాయకులు చేయలేకపోయింది.. తెలంగాణ సీఎం సాధించింది అదే!
-కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలాన్ని పొడిగిస్తూ జీవో జారీ
-టాటా కంపెనీతో విమాన విడిభాగాల తయారీకి ఒప్పందం. ఆదిభట్లలో శంకుస్ధాపన
-గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి మండలి ఏర్పాటు
-ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజులు అందజేయాలని నిర్ణయం
-తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట.. రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, బోనాలు
-తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై చర్యలకు అసెంబ్లీ తీర్మానం
-గురుకుల్ ట్రస్టు భూముల ఆక్రమణదారులపై చర్యలు. కట్టడాల కూల్చివేత.
-చెరువులు కుంటలు ఆక్రమణపై కొరడా వక్ఫ్ భూములు సహా ప్రభుత్వ భూములను ఆక్రమించిన కబ్జాకోరులపై తీవ్ర చర్యలు
-రైతులకు ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువుల ముందస్తు పంపిణీ
-ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు. డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు ఏర్పాట్లు. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన
-తండాలను పంచాయితీలుగా చేసేందుకు సర్వే
-పాలన మీద ప్రతి అంగుళమూ తెలంగాణ ముద్ర
-మానవీయ విలువలు, మేధావుల భాగస్వామ్యం
-హైదరాబాద్‌లో ఇటు ఆధునీకరణ, అటు వారసత్వ పరిరక్షణ
-తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన కేసీఆర్ నెల రోజుల పాలన


kcr
మన రాష్ట్రంలో మన ప్రభుత్వం నేటికి నెల రోజుల పాలనను పూర్తి చేసుకున్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ ముఫ్పై రోజుల్లో ప్రభుత్వ సారథిగా కనబరిచిన పరిణతి బంగారు తెలంగాణ భవిష్యత్తును ఆవిష్కరించింది. ఉద్యమకాలంలోనే తెలంగాణ మీద తాను రూపొందించుకున్న విజన్‌ను ఆవిష్కరించే క్రమంలో పగ్గాలు చేపట్టిన తొలిరోజునుంచే ఆయన ప్రభుత్వ రథాన్ని పరుగులు తీయిస్తున్నారు. ప్రభుత్వాధికారులకే పాఠాలు చెబుతున్నారు. పాలనలో నూతన విధానాలకు మానవీయ విలువలకు పట్టం కడుతున్నారు. ఈ నెల రోజుల్లో వివిధ రంగాల మీద సీఎం కేసీఆర్ చేసిన పాలనా సమీక్షలు, అందులో తీసుకున్న నిర్ణయాలు దశాబ్దాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రులకే పాఠాలు నేర్పుతున్నాయి. kcr1
సమీక్షలతోనే ముద్ర...

కునికిపాట్లు..నిద్రలు..ఇవి సాధారణంగా ప్రభుత్వ సమీక్షా సమావేశాల్లో గత 60 ఏళ్లుగా ప్రజలు మీడియా ద్వారా టీవీల ద్వారా చూసిన సమీక్షా దృశ్యాలు. కానీ ఇవాళ సమీక్ష అంటే ఓ కొత్త నిర్ణయం. ఓ కొత్త విధానం.ఓ కొత్త సిలబస్. చూపుడు వేలెత్తి ఏ అధికారి మీదో విరుచుకుపడే వీరావేశాల ప్రదర్శన కాదు.. సావధానంగా వినడం.. సంయమనంతో చెప్పడం.. ఇది అధికారులకే కొత్త అనుభవం. జీహెచ్‌ఎంసీ అధికారులకే జనాభా లెక్కలు వివరించినా.. పోలీసుల కష్టాలు పోలీసు అధికారులకే వివరించినా ముఖ్యమంత్రి పాలనా పటిమ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రోగం సరిగా నిర్ధారణ చేయగలిగితే సగం చికిత్స ముగిసినట్టే అనే సామెతను తన సమీక్షల ద్వారా నిజం చేశారు కేసీఆర్. మానవీయ కోణంలో పాలన ఉండాలె అని తాను నమ్మిన సిద్ధాంతాన్ని కార్యాచరణలో పెట్టారు.

భవిష్యత్తుకు మార్గ దర్శకాలుగా సమీక్షలు

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు పరేడ్ గ్రౌండ్స్ నుంచి కేసీఆర్ చేసిన ప్రసంగమే చారిత్రాత్మకం. వివిధ పథకాల విధి విధానాలనే కాకుండా అమలుకు సంబంధించిన కార్యాచరణను సూక్ష్మస్థాయిలో విశదీకరించడం ద్వారా తన పాలన ప్రత్యేకంగా ఉండబోతోంది అని చాటి చెప్పారు. ఆ మరుసటి రోజునుంచే ప్రారంభమైన కార్యాచరణ కొనసాగుతూనే ఉన్నది. సచివాలయంలోని సమతా బ్లాక్‌లోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మొట్ట మొదటి సమీక్ష జీహెచ్‌ఎంసీ పైన. వర్షాకాలం ముంగిట్లో అధికారుల సంసిద్ధత మీద. అదే సమావేశంలో విశ్వనగరంగా రాజధానిని తీర్చి దిద్దాలన్న తన ఆకాంక్షను అధికారుల ముందుంచి ప్రణాళికల రూపకల్పనకు ఆదేశించారు. మురికివాడలు లేని నగరంగా రూపొందించే క్రమంలో రెండు పడక గదుల ఇల్లు పథకానికి తక్షణ సర్వేకు ఆదేశించారు. పచ్చదనం పారిశుధ్యానికి ప్రాధాన్యతనిచ్చారు.మూసీవంటి జీవనదులను పునరుజ్జీవింపచేసుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. రెండో రోజు రెండో సమీక్ష రైతుల రుణమాఫీ మీద. రుణాల వివరాలు స్వయంగా కనుక్కుని తగు ప్రణాళిక రూపొందించుకునే యత్నం.

సంస్కరణలకు పోలీసుల సెల్యూట్..

ముఖ్యమంత్రి సమీక్షల్లో కీలకమైంది పోలీసు శాఖ సమీక్ష. పోలీస్ స్టేషన్లలో స్టేషనరీనుంచి వరల్డ్‌క్లాస్ విధానాల దాకా ఆయన సృశించని అంశం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు వేతనాల పెంపు వంటి శుభవార్త చెప్పింది.. రాష్ట్ర పోలీసుకుటుంబాలన్నీ ఆనందంతో తబ్బిబ్బయిన వారాంతపు సెలవులు మంజూరు చేసిందీ ఈ సందర్భంగానే. హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా అత్యంత సురక్షిత నగరంగా రూపొందించేందుకు ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఇచ్చిన నిధులు పోలీసు అధికారులు తమ జీవితకాలంలో ఏనాడూ ఎదురు చూడని పండగ. సమీక్షలో పోలీసుల ఉద్యోగ, ఆరోగ్య భద్రత వారి కుటుంబాల గురించి మానవీయ కోణంలో సాగిన సమీక్ష పరిశీలించిన ఓ పోలీసు ఉన్నతాధికారి సమావేశానంతరం టీ మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ..ఇంతగా ఉద్యోగుల గురించి.. మరీ ముఖ్యంగా పోలీసుల గురించి మానవీయ కోణంలో ఆలోచించిన ముఖ్యమంత్రిని దేశంలో నేను ఎక్కడా చూడలేదు అని ఆయన కళ్లనీళ్లు పెట్టుకున్నారు.

పౌర సమాజం సలహాలు

సామాజిక అంశాలకు చెందిన రంగాల సమీక్షల్లో మేధావులను భాగస్వాములను చేయడం వారి ఆలోచనలకు పాలనా రూపమివ్వడం ఇదే మొదటిసారి. ప్రభుత్వంలో పలువురు అనుభజ్ఞులను సలహా దారులుగా నియమించారు. వారి విశేష అనుభవాన్ని ప్రజా ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి..

ఉద్యమనాయకుడిగా ఉన్న కాలంనుంచే చెబుతూ వస్తున్న దళితులకు భూమి పథకం అమలుకు ముఖ్యమంత్రి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ మేరకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 500 మండలాల్లో ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించి దళితులకు అసలైన స్వాతంత్య్రాన్ని అందించబోతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపునకు ఉత్తర్వులు జారీ చేశారు. టాటా కంపెనీ విడిభాగాల ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిపారు. బతుకమ్మ బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారు. రంజాన్ పండుగ ఏర్పాట్లకు తొలిసారి భారీ మొత్తాన్ని మంజూరు చేశారు. ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులకు ఊహించని స్థాయి మొత్తాన్ని నజరానాగా ప్రకటించారు. గురుకుల్ భూముల చెర మీద ఆయన ప్రకటించిన యుద్ధం చారిత్రాత్మకం. హైదరాబాద్ వారసత్వ సంపద పరిరక్షణకు భూగర్భమే శరణ్యమని ఎల్‌అండ్‌టీకి స్పష్టం చేశారు. బియాస్ దుర్ఘటనపై స్పందించి తక్షణం హోంమంత్రిని పంపించి అక్కడే మకాం వేయించడం ఇంతకు ముందెన్నడూ జరగనిది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆయన మరణాంతరం బహుశా తొలిసారి ఘన నివాళి జరిపించారు.
నెల రోజులు ఇలా...
kcr2
జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం- ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం-సీఎంతో పాటు పదిమంది మంత్రులు ప్రమాణం-సచివాలయంలో సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన సీఎం- అదే రోజు సమత బ్లాక్‌లో తొలి క్యాబినెట్ భేటీ
జూన్ 3: జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష-వర్షాకాలపు ముందస్తు చర్యలపై ఆదేశాలు-హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం-విజన్ 2050 కి రూపకల్పన.
జూన్ 4: బ్యాంకర్లతో సమీక్ష-రైతు రుణాలపై బ్యాంకుల వారీగా వివరాల సేకరణ-లక్షలోపు రుణాల మాఫీ-30 లక్షల మంది లబ్దిదారులకు రుణాల మాఫీ చేయాలనే నిర్ణయం
జూన్ 5: విద్యుత్తుపై సమీక్ష- మూడేండ్లలోపు మిగులు విద్యుత్తు సాధించాలని అధికారులకు దిశా నిర్దేశం-సౌర విద్యుత్తుకు ప్రోత్సాహం-చత్తీస్ గఢ్‌నుంచి ట్రాన్సిమిషన్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం-విద్యుత్తు ఉత్పత్తికి ప్రయివేట్ రంగాన్ని ప్రోత్సహించేది లేదని నిర్ణయం
జూన్ 6: మద్యం పాలసీపై సమీక్ష-జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులకు నిర్ణయం-లాటరీ విధానంలోనే దుకాణాల కేటాయింపు-సీఎం పేషీలో అదనపు కార్యదర్శిగా స్మితా సబర్వాల్ నియామకం-సీఎం ఢిల్లీ పర్యటన
జూన్ 7: రాష్ట్రపతితో సమావేశం ప్రధానితో భేటీపత్యేక రాయితీ కోసం డిమాండు-పోలవరం ఆర్డినెన్స్‌ను వెనకకు తీసుకోవాలని డిమాండు-14 డిమాండ్లతో కూడిన వినతి పత్రం ప్రధానికి అందజేత.
జూన్ 8: ఢిల్లీలో రెండో రోజు సీఎం-రాష్ట్ర అభివృద్ధి కోసం పలువురితో భేటీ-రైతు రుణాలపై వెనక్కి తగ్గమని స్పష్టం-పోలవరంపై పోరాటం ఆగదని ప్రకటన-ఢిల్లీ పర్యటన ముగింపు.
జూన్ 9: నవ తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభ సమావేశాలు-ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం-శాసన సభ రిజిష్టర్‌లో సంతకం-స్పీకర్‌గా మధుసూదనాచారి నామినేషన్.
జూన్ 10: రెండోరోజు శాసన సభ-సీఎం ప్రసంగం-స్పీకర్‌గా మధుసూదనాచారి బాధ్యతలు-తెలంగాణ శాసన సభ్యునిగా అని ప్రమాణం చేస్తుంటే కండ్లు చెమర్చాయని ప్రకటన-సచివాలయంలో బియాస్ నది దుర్ఘటన పై సమీక్ష.
జూన్ 11: మూడోరోజు అసెంబ్లీ-గవర్నర్ ప్రసంగం-బీఏసీ సమావేశం.
జూన్ 12: నాలుగో రోజు అసెంబ్లీ-పోలవరం ఆర్డినెన్స్‌ను తిరస్కరిస్తూ తీర్మానం. రవాణాశాఖ అధికారులతో సీఎం సమీక్ష-టీజీ బదులు టీఎస్ గా కోడ్ నిర్ణయం.
జూన్ 13: ఐదో రోజు అసెంబ్లీ-సోనియా సహా తెలంగాణ కు సహకరించిన బీజెపీ తదితరులకు సీఎం కృతజ్ఞతలు-సీఎం ప్రసంగం-కలసి నడుద్దాం బంగారు తెలంగాణ నిర్మిద్దామని ప్రతిపక్షాలకు పిలుపు.
జూన్ 14: ఆరోరోజు అసెంబ్లీ-అమరులకు జోహార్లు అర్పించిన సభ-పోలవరాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం.
టీవీ-9, ఏబీఎన్ ఛానళ్ల తీరుపై సభ కన్నెర్ర-చర్యల పై తుది నిర్ణయం స్పీకర్‌దే.
జూన్ 15: డీజీపీతో సచివాలయంలో సీఎం సమావేశం-శాంతిభద్రతలపై సమీక్ష
జూన్ 16: ఫీజు రియంబర్స్‌మెంట్ పై అఖిల పక్షం-తెలంగాణ విద్యార్ధులకే ఫీజు ఇవ్వాలనే నిర్ణయం-బోనాలు, బతుకమ్మ పండులను రాష్ట్ర పండుగలుగా ప్రకటిస్తూ నిర్ణయం-సిమెంట్ కంపెనీ యాజమాన్యాలతో సీఎస్ భేటీ-ధరలు తగ్గించేందుకు చర్చలు-సమాచార ప్రసారాల శాఖ కమిషనర్ గా చంద్రవదన్‌కు బాధ్యతలు
జూన్ 17: పీపీఏలను రద్దు చేయాలని సీమాంధ్ర ప్రభుత్వం నిర్ణయం-కరెంటు కయ్యానికి కాలుదువ్విన చంద్రబాబు-బియాస్ నది ప్రమాదం వివరాలను సీఎం కు తెలిపిన హోం మంత్రి.
జూన్ 18: నీటి పారుదల రంగం పై సమీక్ష-వచ్చే జూన్ నాటికి ఆరు లక్షల ఎకరాల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించిన సీఎం-పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి, డిండి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్-పాల్గొన్న హరీష్ రావు తదితర అధికారులు
జూన్ 19: పోలీస్ వ్యవస్థ అధునీకరణ పై సీఎం సమీక్ష-హైదరాబాద్‌ను సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దాలని పోలీసు అధికారులకు ఆదేశం-గల్లీ గల్లీకి గస్తీతో శాంతి భద్రతల పటిష్టానికి ఆదేశం.
జూన్ 20: విద్యుత్, రుణమాఫీ, పరిశ్రమలపై సీఎం సమీక్ష-ఇతర రాష్ర్టాలనుంచి మిగులు విద్యుత్తు కొనుగోలుకు సూచనలు-పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధికి సింగిల్ విండో పద్దతి-రుణ మాఫీ విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయం
జూన్ 21: పోలీస్ అధికారులతో సమీక్ష-పోలీసు వ్యవస్థ అధునీకరణకు రూ.350 కోట్లు మంజూరుకి నిర్ణయం-పోలీసులకు వారాంతపు సెలవులకు నిర్ణయం. ప్రొ.జయశంకర్ 3 వ వర్థంతికి సీఎం హాజరు.
జూన్ 22: బేగంపేటలోని అధికారిక నివాసానికి సీఎం కుటుంబం- సచివాలయంలో సామాన్యుల సమస్యలు తెలుసుకున్న సీఎం.
జూన్ 23: భూ ఆక్రమణలపై సీఎం సమీక్ష-గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు-పేకాట క్లబ్లులను మూసివేయాలని నిర్ణయం. ఏరోస్పేస్ విడిభాగాల తయారీ కంపెనీకి శంకుస్ధాపన-మేడిన్ తెలంగాణ లక్ష్యంగా అడుగులు.
జూన్ 24: దళితుల అభివృద్ధి కొరకు సీఎం మేథోమధనం-పాల్గొన్న అధికారులు దళిత మేథావులు-గవర్నర్‌తో సమావేశం-సాగర్ నీటి విడుదల పై చర్చ.
జూన్ 25: బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, టీడీపీ, టీచర్ ఎమ్మెల్సీలు, బీఎస్పీ ఎమ్మెల్యేలు.
జూన్ 26: వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్తు సరఫరా పై సమీక్ష-మూడేండ్లలో 30 ప్రాజెక్టులు, 40 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం.
జూన్ 27: జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, అటవీశాఖ అధికారులతో సమీక్ష-తెలంగాణ హరిత హారం కావాలని పిలుపు.
జూన్ 28: పౌర సరఫరాల శాఖ పనితీరు పై సీఎం సమీక్ష- బోగస్ కార్డుల ఏరివేతకు ఆదేశాలు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీపీఎస్సీ) ఏర్పాటు దిశగా గవర్నర్‌తో సమావేశం- ఘనంగా పీవీ 93 వ జయంతి వేడుకలు.
జూన్ 29: అధికారిక నివాసంలో మంత్రులతో సీఎం భేటీ-సీమాంధ్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు పిలుపు-పాలనలో పారదర్శకతపై చర్చ-జెడ్పీచైర్మన్ ఎన్నికల పై చర్చ.
జూన్ 30: సచివాలయంలో పలువురితో విడి విడి సమావేశాలు-మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎంపికకు చర్యలు
జులై 01: మెట్రోరైల్ ఎండీతో సీఎం భేటీ-పనితీరు పై సమీక్ష-చారిత్రక కట్టడాలను ప్రదేశాల విధ్వసం కాకుండా చర్యలపై చర్చ.

ఆశించిన దానికంటే బాగున్నది

తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ పాలనకు నెలరోజులు పూర్తయ్యాయి. ఈ నెల రోజుల పాలనపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం పూర్తిగా లేకపోయినా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ చేస్తున్న కృషిపై వివిధ వర్గాల ప్రజలు సంతోషంతో ఉన్నారు. కేసీఆర్ పాలనపై మేధావుల అభిప్రాయాలు..

ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేక తెలంగాణ పునర్నిర్మాణ లక్ష్యానికి అనుకూలంగా మార్చడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు పార్రిశ్రామికవేత్తల్లో విశ్వాసం కలిగిస్తున్నాయి. టాటా ఏరోస్పేస్ వంటి ప్రముఖ పరిశ్రమలు మన రాష్ట్రంలోకి రావడం తెలంగాణ అభివృద్ధికి సూచికలు. మూడెకరాల భూమి కేటాయింపు దళితుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా ఉంది. ఇదే స్ఫూర్తితో పాలన కొనసాగితేనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం.


ప్రజలు కోరుకునే విధంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నెలరోజుల్లోనే రోజుకు 18 గంటలు పనిచేసి పాలనా యంత్రాంగంపై పట్టు సాధించారు. ఇదే కేసీఆర్ తొలి విజయం. అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో తనదైన పాలన కొనసాగించారు.


ఆశించిన దానికంటే బాగుంది. ఉన్నత స్థాయి లో దార్శినికత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి గా ఉంటే రాష్ట్రంలో ఎటువంటిపాలన ఉంటుందో నెలరోజుల కేసీఆర్ పాలన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
- నరేందర్ రావు,తెలంగాణ సచివాలయ సంఘం అధ్యక్షుడు
కేసీఆర్ నెల రోజుల పాలన అత్యంత పారదర్శకంగా ఉన్నది. తెలంగాణ సమాజానికి దిశా నిర్దేశం చేసిన ఉద్యమ నేత కేసీఆర్. రాష్ట్ర అభివృద్ధికీ అదే స్పూర్తితో ముందుకు వెళ్తాడని ఆశిస్తున్నాము.


టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నెల రోజుల పాలన ఆశాజనకంగా ఉన్నది. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించడం, దళితులకు భూమిని పంచడం, కేజీ టు పీజీ విద్యనందిచాలనుకోవడం, చిన్న నీటి వనరులను అభివృద్ధ్ది పరచాలనుకోవడం, ఇవన్నీ ప్రజానుకూల కార్యక్రమాలే. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే చాలా మెరుగైన పాలన.


దళితులకు భూములివ్వాలనుకోవడం అద్భుతం. అది సుదీర్ఘకాల స్వప్నం. పోలీసు స్టేషన్లలో ప్రశాంతత నెలకొన్నది. ప్రజలు భయంలేకుండా పోలీసుస్టేషన్లకు వెళ్తున్నారు. ఎదపైన దిగులు బండ జరిగి బాధ తొలిగిన ఆశ కనిసిస్తున్నది. సెక్రటేరియట్‌లో ఆంధ్ర పాలకులు తిప్పిన చక్రాన్ని ఆపి సామాన్యులను సచివాలయంలోకి ప్రవేశం దొరికింది. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.


తెలంగాణ కొత్త రాష్ట్రం. పాత రాష్ట్రంలోనయినా కొత్త ప్రభుత్వం వచ్చినపుడు అన్నీ సర్దుకోవాలంటే శ్రమ పడాల్సిందే. కేసీఆర్ వీటిని అధిగమిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కేసీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు. కేసీఆర్ పాలనలో కమిట్‌మెంట్ నిజాయితీ కనిపిస్తున్నవి. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతో ఉన్నారో అవన్ని క్రమంగా నెరవేరుతాయని భావిస్తున్నా.

కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై.. ఆంధ్రా సర్కార్ తొండాట...!

-ఒప్పందం ప్రకారం నీరు చేరలేదంటూ తప్పుడు ప్రచారం
-అడ్డదారిలో ఆదేశాలు జారీ చేయించిన వైనం
-మరోవారం నీరివ్వాలని రివర్‌బోర్డు ఆదేశం
-ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం
-కృష్ణాడెల్టాకు నీరివ్వాలంటే ఎడమకాలువకు నీరు కావాలి
-కేంద్రానికి లేఖ రాయనున్న కేసీఆర్ సర్కార్
నీళ్ల లెక్క బరాబర్ ఉన్నా ఆంధ్ర సర్కార్ తొండికి దిగుతోంది. కృష్ణా డెల్టాకు తాగునీటి విడుదలపై ఆంధ్రసర్కార్ మరో పేచీ పెట్టింది. ముందు ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తాగునీటి అవసరాలకు పూర్తి కోటాను విడుదలచేసినా అది తమకు చేరలేదంటూ తప్పుడు ప్రచారం చేసి కేంద్రాన్ని మాయచేసింది. తాగునీటి ముసుగులో అదనపు నీటిని కొట్టేయడానికి అడ్డదారిలో ఆదేశాలు జారీ చేయించింది. దీనిపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ సర్కార్ కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటే నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీరు వదలాలని కేంద్రానికి లేఖ రాయనుంది. ఆంధ్రసర్కార్ తప్పుడు లెక్కలను నమ్మవద్దని, భౌతికంగా తనిఖీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలని రివర్‌బోర్డు తాత్కాలిక చైర్మన్‌కు సూచించింది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు మరో వారం రోజుల పాటు తాగునీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్యబోర్డు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా ఆదేశాలు జారీచేసింది. ఎలాంటి సమావేశం ఏర్పాటుచేయకుండానే, తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండానే రివర్‌బోర్డు చైర్మన్ ఆదేశాలు జారీచేయడం కలకలం సృష్టించింది.

waterదీనిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు రివర్‌బోర్డు చైర్మన్ పాండ్యతో ఫోన్‌లో మాట్లాడి తమ ప్రభుత్వంతో చర్చికుండా, భౌతికంగా తనిఖీలు చేయకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రివర్‌బోర్డు ఆకస్మిక నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రజలసంఘం ఆధ్వర్యంలోని రివర్‌బోర్డు నిర్ణయాన్ని అమలు చేయడంపై, ఒకవేళ విడుదల చేస్తే ఎంతవరకు విడుదల చేయొచ్చన్న అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటే నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీరు వదలాలని, తమకు కూడా తాగునీటి అవసరముందని తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాయనుంది.

ఆంధ్రసర్కార్ తప్పుడు లెక్కలు

వాస్తవానికి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం 3.6 టీఎంసీ ఫీట్ నీటిని విడుదల చేయాలని గత నెల 25న ఒప్పందం కుదిరింది. కేంద్ర జలసంఘం చైర్మన్, కృష్ణా నది యాజమాన్య బోర్డు తాత్కాలిక చైర్మన్ పాండ్య సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కేంద్ర జలసంఘం సూచించింది. దీనిలో భాగంగా కృష్ణా డెల్టాకు తాగునీరే కాకుండా తెలంగాణకు దాదాపు 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత నెల 25న సాయంత్రం నుంచి నీటిని విడుదల చేస్తోంది. మొదటిరోజు చాలినంత సమయం లేకపోవడంతో 4,539 క్యూసెక్కులను విడుదల చేశారు. రెండోరోజు జూన్ 26న గరిష్ఠంగా 7,536 క్యూసెక్కుల నీటిని, 27న 5,725 క్యూసెక్కులు, 28న 5,700 క్యూసెక్కులను, 29న 5,740 క్యూసెక్కులు, 30న 4,765 క్యూసెక్కులను విడుదల చేశారు. అంటే ఆరురోజుల్లో మొత్తం 2.98 టీఎంసీలను విడుదల చేశారు.

మంగళవారం నాటికే మూడు టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు ఎల్లారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు 3.5 టీఎంసీల నీటి విడుదల పూర్తికానుంది. ముందుగా కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసినప్పటికీ ఆంధ్ర సర్కార్ మాత్రం తప్పుడు లెక్కలతో గారడీ చేసేందుకు యత్నించింది. తెలంగాణ సర్కార్ తమకు ఒప్పందం ప్రకారం కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం లేదని, ఇప్పటివరకు ఒక్క టీఎంసీ నీరు కూడా తమ డెల్టాకు చేరలేదని పేచీకి దిగింది. వాస్తవానికి నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజికి మధ్య 150 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ విడుదలైన నీరు విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి మూడురోజులు పడుతుంది. అంటే 27 లేదా 28 నాటికి విడుదలైన నీరు మాత్రమే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చేరుకుని ఉంటుంది. కానీ ఆంధ్ర సర్కార్ మాత్రం కుట్రలకు పాల్పడుతూ, అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతోంది. అదనపు నీటి విడుదలకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. నిజానికి కృష్ణా డెల్టాలో తాగునీటి అవసరాలకు కేవలం ఒకటి నుంచి రెండు టీఎంసీలు సరిపోతాయని, సాగునీటికి మళ్లించడానికే ఆంధ్రసర్కార్ ఎక్కువనీటి వాటాను అడుగుతోందని తెలంగాణ సర్కార్ వాదించి కేంద్ర జలసంఘాన్ని ఒప్పించడంలో సఫలమైంది.

మానవతా దృక్పథంతోనే తాము తాగునీటిని విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగునీటి పేరుతో సాగుకు మళ్లిస్తుందని ఒక కన్నేసి పెట్టాలని తెలంగాణ సర్కార్ కేంద్ర జలసంఘాన్ని కోరింది. అవసరమైతే నీటి చౌర్యం జరుగుతుందా లేదా అనే విషయాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు. కానీ కేంద్ర జలసంఘం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఎస్‌ఇ స్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించింది. నిజానికి నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. నాగార్జున సాగర్ నీటి నిల్వ 515 అడుగులకు పడిపోయింది. మినిమమ్ డ్రాడౌన్ లెవల్ 510 కంటే కేవలం 4 అడుగుల ఎక్కువ ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే హైదరాబాద్‌కు తాగునీరు కూడా కష్టమే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వర్షాలు లేకపోవడంతో జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుందో లేదోనని రైతాంగం ఆందోలన చెందుతోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండాలని ఇప్పటికే ఆయా చోట్లా రైతులు వరుణపూజలు నిర్వహిస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మంగళవారం, జులై 01, 2014

కాగితాల మీద ఇండ్లు...జేబుల్లోకి నిధులు...గత ప్రభుత్వాల నిర్వాకం!

-హౌసింగ్ స్కాం - 2
-తిననోందే పాపం..
-నాయకులు, అధికారుల సమైక్య కృషి!
-కోట్లకు కోట్లు నిధులు కైంకర్యం
-కాగితాల మీద ఇండ్లు.. జేబుల్లోకి నిధులు
-పాత ఇండ్లకు రంగులు.. కట్టని ఇండ్లకు బిల్లులు
-అదిలాబాద్ జిల్లాలో కాగజ్ మకాన్
-నిజామాబాద్ జిల్లాలో డీఎం మిస్సింగ్
-కరీంనగర్ జిల్లాలో రూ. 20 కోట్లు హాంఫట్
ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రాజకీయనాయకులు, అధికారులు, మధ్యదళారుల పాలిట ధనజాతరగా వర్థిల్లింది. పథకం ప్రకటననుంచి లబ్ధిదారుల ఎంపికలు, మంజూరు, తనిఖీలదాకా అంతా వీరిదే హవా. కొత్తకొత్త దళారులు పుట్టుకువచ్చారు. జేబులో నయాపైసా లేనివాడు లక్షలు కుమ్ముకున్నారు.
indiramma

దోచుకోనివాడిదే పాపం అన్నట్టుగా ఈ జాతర జరిగినంత కాలం కడుపునిండా తిండి, కంటినిండా నిద్రకూడా లేకుండా హడావుడి చేశారు. ఫలితంగా సర్కారు బొక్కసం బక్కచిక్కి పేదదైంది. ఇటు పేదల ఇండ్లు మాత్రం సాకారం కాలేదు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి అధికారులమీద, కాంట్రాక్టర్లమీద చర్యలకు ఆదేశించినా అమలు మాత్రం జరగలేదు. నిజామాబాద్ జిల్లాలో ఆరోపణల తీవ్రత ఉన్న ఓ అధికారిపై చర్యలు తీసుకుందామనుకుంటే ఆయన ఏళ్ల తరబడి కనిపించడం లేదట.

ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, నిజమాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు, కరీంనగర్ జిల్లాలో గ్రామీణులు ఇలా వివిధ వర్గాల ప్రజలంతా ఇందిరమ్మ ఇండ్ల బాగోతంలో బాధితులే. అధికారులు, నాయకులు, మధ్య దళారులు ఎవర్నీ వదిలిపెట్టలేదు. నోరులేని అమాయక ప్రజల సొమ్మును అడ్డంగా, నిలువుగా దోచుకున్నారు. ఉన్నవారికే ఇండ్లు ఇచ్చి సున్నాలు వేయించి బిల్లులు ఎత్తుకున్నారు. కాగితాల మీద ఇండ్ల లెక్కలు రాసి పునాదులైనా తీయకుండా సొమ్ములు జేబులో వేసుకున్నారు. ఒక్కటే రేషన్ కార్డులో ఇద్దరేసి వ్యక్తులకు ఇండ్లు మంజూరు చేశారు. రాజకీయ నాయకులు నీకిన్ని నాకిన్ని పద్ధతిలో కలిసికట్టుగా సర్కారు సొమ్మును పంచుకుతిన్నారు.

హౌసింగ్ అధికారులు జరిపిన ర్యాండమ్ విచారణలో భారీ ఎత్తున అవినీతి వెలుగు చూడగా బాధ్యులైన అందరినీ సస్పెండ్ చేయాలని, తిన్న సొమ్మును కక్కించాలని ఆదేశాలిచ్చారు. అయితే అవన్నీ బేఖాతర్ అయ్యాయి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి చేతులు దులిపేసుకున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రుల అండదండలుండడంతో ఉన్నతస్థాయి అధికారులపై ఈగ కూడా వాలలేదు.

నిజామాబాద్ జిల్లాలో రూ. 42.50 కోట్ల అవినీతి...

నిజామాబాద్ జిల్లాలోని 29 గ్రామాల్లో 2705 ఇండ్ల నిర్మాణాలపై గృహనిర్మాణశాఖ థర్డ్‌పార్టీ ద్వారా విచారణ చేయించింది. ఇక్కడ రూ.42.50 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్ధారించి రికవరీకి ఆదేశించింది. అయితే వసూలైనవి మాత్రం కేవలం రూ.55.17 లక్షలే. కోటగిరి మండలం కొత్తపల్లిలో రూ.44.65 లక్షల అవినీతి జరిగినట్లు తేల్చారు. బాధ్యులైన ఉన్నతాధికారులను శాఖ పరంగా సర్వీసు నుంచి తొలగించినా రాజకీయ నాయకుల అండదండలతో వారు తిరిగి ఉద్యోగాల్లో చేరిపోయారు. 

నిజామాబాద్ శివారు గ్రామాలలో జరిగిన అవినీతిలో సాక్షాత్తూ జిల్లా మేనేజర్ జ్ఞానేశ్వర్‌రావు రూ.53.77 లక్షల అవినీతి జరిపి దొరికిపోయారు. సదరు అధికారిని సర్వీసు నుంచి తొలగిస్తూ 2005లో జీవో నంబర్ 36ద్వారా ఆదేశించారు . కానీ గత తొమ్మిదేళ్లుగా ఇతని ఆచూకీ తెలియదని రికార్డుల్లో చూపిస్తున్నారు. ఈ జిల్లాలో చివరికి బీడీ కార్మికుల గృహనిర్మాణాలను కూడా అక్రమార్కులు వదిలిపెట్టలేదు. కొమ్మరపల్లి మండలంలోని మానాల గ్రామంలో ముగ్గురు అధికారులు రూ. 6.84 లక్షల అవినీతికి పాల్పడినట్లు 
రుజువైంది. అయినా ఆసొత్తును ఇప్పటికీ రికవరీ చేయలేకపోయారు.

రికవరీ చట్టం ప్రయోగించాలని శాఖ అధికారులు ఇచ్చిన తీర్పు ఈ నాటికి అమలు కాలేదు. సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న పలు ప్రభుత్వాలు, రాజకీయనాయకులు, అధికారులు కలిసి కట్టుగా చేసిన నిలువుదోపిడికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. వాస్తవంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5,90,733 నివాసాలుండగా, 3,88,185 మంచి ఇండ్లున్నాయి. నివాసానికి యోగ్యంగా 1,79,831 ఇండ్లు ఉండగా, శిధిలావస్ధలో కేవలం 22,717 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అయినా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కింద 2.80 లక్షల ఇండ్లు మంజూరయ్యాయి. 1.28 వేల ఇండ్లు కట్టామని అధికారులు రికార్డుల్లో రాశారు. ఇంకో 1.52 లక్షల ఇండ్లకు నిధులు మంజూరైనా పెండింగ్‌లోనే ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి.

అదిలాబాద్ జిల్లాలో బోగస్ ఇండ్లు..: అదిలాబాద్ జిలాల్లో 866 గ్రామపంచాయతీలుండగా విచారణ అధికారులు 73 గ్రామాలలో ఇందిరమ్మ అవినీతిపై విచారణ జరిపారు. ఇందులో 2 వేల ఇండ్లనిర్మాణంలో అవినీతి జరిగినట్లు నిర్థారణ అయింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద రూ.29.0 కోట్లు అధికారుల నుంచి వసూలు చేయాలని నోటీస్‌లు ఇచ్చారు. ఈ అవినీతిలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వరకు మొత్తం 92 మంది భాగస్వాములని తేలింది. ఎనిమిది మంది అధికారులు, తొమ్మిది మంది రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను, ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లను, ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసింది. అయితే అధికారులను వదిలేసి కేవలం ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న ఐదుగురు అసిస్టెంట్ ఇంజనీర్లు, 9 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. 

అవినీతి సొమ్మును వసూలు చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. ఇంతదాకా రూ.65.12 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ప్రభుత్వం మారిపోయింది..మనల్ని పట్టించుకునేవారే ఉండరన్న తీరుగా ఉన్నత స్థాయిలోని అధికారులు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అవినీతికి పాల్పడిన అధికారులంతా రిలాక్స్‌గా ఉన్నారు. విచారణ కూడా అన్ని గ్రామాలలో జరపకపోవడం ఉన్నతాధికారులకు పెద్ద రిలీప్. ఏదో శాంపిల్‌గా విచారించారు, కానీ పూర్తి స్థాయిలో విచారణ చేయడం ఎవరికి సాధ్యం కాదని.. ఎలా చేస్తారని ఒక అధికారి ప్రశ్నించడం గమనార్హం. ఈ జిల్లాలోని కొన్ని గ్రామాలలో జరిగిన అవినీతిని పరిశీలిస్తేనే భారీ ఎత్తున అవినీతి బయటపడింది.

ఉదాహరణకు తాళ్లమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో కొన్ని ఇండ్లకు లబ్దిదారుల పేర్లను మార్చి రెండు రెండు సార్లు బిల్లులిచ్చారు. అసలు నిర్మాణాలు చేయకుండానే 10 ఇండ్లకు రూ.73 వేల బిల్లులు సృష్టించి సొమ్మును డ్రా చేసుకున్నారు..13 పాత ఇండ్లకు సున్నాలు వేసి కొత్తవిగా చూపించి రూ.2.60 లక్షల బిల్లులు ఎత్తుకున్నారు. ఒక్క కజ్జర్ల గ్రామంలోనే రూ.3.36 లక్షల అవినీతి జరిగింది. ఈ అవినీతిపై రాష్ట్రగృహనిర్మాణశాఖ మేనేజింగ్ డైరెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. అధికారులు తప్పించుకోవడానికి కింది స్థాయిలో ఉన్న, ఎలాంటి బాధ్యత లేని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు బాధ్యులంటూ తొలిగించి చేతులు దులుపుకున్నారు.

ఫలితంగా అవినీతి సొమ్మును రాబట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే మండలంలోని కోదాడ్ గ్రామంలో నాలుగు ఇండ్లకు పునాదులు కూడా తీయకుండానే రూ.59 వేలు డ్రా చేసుకున్నారు. అసిఫాబాద్ మండలంలో 166 ఇండ్ల నిర్మాణంలో రూ.12.44 లక్షల సొమ్ము చేతులు మారాయి. ఇందులో 31 పాత ఇండ్లను చూపించి రూ.7.20 లక్షలు అమాంతం మింగారు. 61 ఇండ్లకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకుండానే రూ.2.80 లక్షలను డ్రా చేసుకున్నారు. 74 ఇండ్లకు రెండు సార్లు బిల్లులుపెట్టి రూ.2.44 లక్షలు అదనంగా నొక్కారు. ఇలా జిల్లాల్లోని ప్రతి గ్రామంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని తేలింది... ఈ అవినీతిపై అన్ని గ్రామాలలో విచారణ చేస్తే ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి కింది స్థాయి వర్క్ ఇన్‌స్పెక్టర్ల వరకు ఎవరి భాగస్వామ్యమెంతో బయటపడుతుందని అంటున్నారు. 

వాస్తవానికి అదిలాబాద్ జిల్లాలో మొత్తం 6,51,770 ఇండ్లున్నాయి. ఇందులో 4,04,863 మంచి ఇండ్లు ఉండగా, నివాసయోగ్యంగా 2,11,084 ఇండ్లున్నాయి. శిధిలావస్థలో కేవలం 35,823 ఇండ్లు మాత్రమే ఉన్నాయి కానీ ఈ జిల్లాలో 3.81 లక్షల ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2.15 లక్షల ఇండ్లు నిర్మించినట్లు రికార్డులో చూపారు. ఇంకా 1.66 లక్షల ఇండ్లు నిర్మించాల్సి ఉందని హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఉన్న లెక్కలే చెపుతున్నాయి. 

జ్ఞానేశ్వర్రావు కనిపించుట లేదు..

నిజామాబాద్ జిల్లాలో గృహనిర్మాణ శాఖలో మేనేజర్(డీఎం) స్థాయిలో ఉండి కోట్లకు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆర్.జ్ఞానేశ్వర్‌రావుపై ప్రభుత్వ చర్యలు ప్రహసనంగా మారాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన జ్ఞానేశ్వర్‌రావు వద్దనుంచి సొమ్ము రికవరీ చేసి విధుల నుంచి తొలగించాలని 2005లో జీవో నెంబర్ 36 ద్వారా ఆదేశం వచ్చింది. ఈ వ్యవహారంనుంచి బయట పడే క్రమంలో ఆయన హఠాత్తుగా కనిపించకుండా పోయారు. గత తొమ్మిదేళ్లుగా జ్ఞానేశ్వరరావు జాడ తెలియడంల లేదని రికార్డులలో రాస్తూ వస్తున్నారు. 

ఒక సాధారణ వ్యక్తి ఒక్కరోజు కనిపించకుండా పోతేనే ఎంతో హడావుడి జరుగుతుంది. వరుసగా ఆరేళ్లు కనిపించకుండా పోతే సదరు వ్యక్తి చనిపోయినట్లుగా ప్రభుత్వమే ప్రకటిస్తుంది.. కానీ ప్రభుత్వ అధికారి, జిల్లా మేనేజర్ ర్యాంక్‌లో ఉన్న వ్యక్తి తొమ్మిదేళ్లుగా కనపడక పోయినా తదుపరి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారం బయటి సమాజానికి కూడా తెలియదు. పూర్తి స్థాయిలో సీబీఐ విచారణ జరిపితే ఎన్నో అనకొండలు బయటపడతాయని పలువురు చెబుతున్నారు. 

కరీంనగర్ జిల్లాలో మంత్రుల నీడ...

కరీంనగర్ జిల్లాలో 1207 గ్రామపంచాయతీలుండగా, హౌసింగ్ కార్పోరేషన్ అధికారులు 54 గ్రామాలలో 791 ఇండ్లనిర్మాణాలపై మాత్రమే విచారణ జరిపారు. ఈ మాత్రం దాంట్లోనే దాదాపు రూ.20 కోట్ల అవినీతి జరిగినట్లు ధవీకరించారు. రికవరీకి ఆదేశిస్తే వసూలైంది రూ.22.95 లక్షలు మాత్రమే. మహదేవ్‌పూర్ మండలంలోని పలిమెల గ్రామంలో 75 ఇండ్ల నిర్మాణంపై విచారణ చేపట్టగా రూ.15.58 లక్షల అవినీతి నిర్థారించారు. ప్రత్యేక అధికారి ఇంతవరకు ఆ అవినీతిపై ఎలాంటి విచారణ కూడా జరిపించకపోగా కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. 

గత ప్రభుత్వంలో జిల్లాకు చెందిన మంత్రి అండ సదరు అధికారికి ఉండడంతో , సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. ఇదే జిల్లాలో ప్రజల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని, అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు బుక్ చేశారు. కానీ ఈ కేసులు ఏసీబీ వద్ద పెండింగ్‌లో ఉండడం గమనార్హం.భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన కొందరు అధికారులపై కార్పొరేషన్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా కేవలం ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కత్తిరించి లేదా మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

కొంత మంది అధికారుల సస్పెన్షన్‌ను రద్దు చేసి విధులలోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో జిల్లాకు చెందిన మంత్రి అండదండలతోనే ఈ తతంగమంతా జరిగినట్లు అధికార వర్గాలలో చర్చ జరుగుతున్నది. జిల్లాలో మరికొంత మంది ఏఇ/ ఏఓ/ ఎమ్‌హెచ్‌ఓ/వీఓ, రాజకీయనాయకులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టినప్పటికీ గత ప్రభుత్వంలోని పెద్దనాయకుల అండదండలతో తప్పించుకు తిరుగుతున్నారు. వాస్తవానికి కరీంనగర్ జిల్లాలో 9,80,739 నివాసాలుండగా, మంచి కండిషన్‌లో 6,46,998 నివాసాలున్నాయి. నివాసయోగ్యమైన అవాసాలు 2,91,248 ఉండగా,శిథిలావస్థలో కేవలం42,493 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ జిల్లాలో 3.16 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే నిర్మించింది కేవలం 39.335 ఇండ్లుమాత్రమే.. ఇంకా ఈ జిల్లాలో హౌజింగ్ రికార్డుల ప్రకారం ఇంకా 2.77 లక్షల ఇండ్లు నిర్మించాల్సి ఉంది...

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఆంధ్రోళ్ళ జీవోతో భగ్గుమన్న భద్రాచలం!

-ముంపు విలీన జీవోపై వెల్లువెత్తిన ఆగ్రహం..
- ఏజెన్సీలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ఏజెన్సీ విద్యార్థిలోకం గర్జించింది. జీవోను రద్దు చేయాలని విద్యార్థులు, ఉద్యోగులు నిరసన గళం విప్పారు. పోలవరం డిజైన్ మార్చి ముంపును తప్పించాలని డిమాండ్ చేశారు. ముంపును ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని నినదించారు. ప్రజలకు ఆకాంక్షకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. ముంపును తెలంగాణలోనే ఉంచాలని భద్రాచలంలో మూడు రోజులుగా విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.

polavaramభద్రాచలంలో విద్యాసంస్థలను మూసివేసి మానవహారం నిర్వహించారు. పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయాలని కుక్కునూరులో విద్యార్థి, ఆదివాసీ సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. వీఆర్‌పురం, వాజేడు, కూనవరం, దుమ్ముగూడెంలో మండలాల్లో విద్యాసంస్థల బంద్, భారీ ర్యాలీలు కొనసాగాయి. కూనవరం నుంచి వరకు ఉపాధ్యాయ సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయపార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి మంగళవారం నుంచి 5వ తేదీ వరకు ముంపు గ్రామాల్లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జాతాలు, 7న భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14న పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చారు.

పోలవరానికి వ్యతిరేకంగా పాదయాత్ర

పోలవరంపై సమర శంఖారావం మోగింది. ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా గిరిజనులు ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. ఓవైపు పోలవరంపై ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదముద్ర వేయడం, ముంపును తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం జీవోలు జారీచేయడంతో ఆదివాసీలు అగ్ర హిస్తున్నారు.

ఈ ఉద్యమానికి ఛత్తీస్‌గఢ్, ఒడిషా ఆదివాసీలు సైతం జత కలుస్తున్నారు. మంగళవారం ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా పొడియా నుంచి భద్రాచలం గిరిజనులు పాదయాత్ర చేయనున్నారు. 15న భద్రాచలంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు పీపుల్స్ ఎగనెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ సోమవారం భద్రాచలంలో తెలిపారు. పాదయాత్రలో ఆదివాసీ గిరిజన సంఘాలు, ఓయూ జేఏసీ నేతుల, నాయక్‌పోడు, కొండరెడ్లు తెగల నాయకులు పాల్గొననున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

ఆంధ్రోళ్ల ఫీజులు మనమెందుకు కట్టాలె?

-ఆ సొమ్ముతో ప్రాజెక్టులు కట్టుకుంటం
-తెలంగాణ వచ్చినా టీడీపీ మారుతలేదు
-మనవారిపై బాబు కోపం పెంచుకుంటున్నాడు
-త్వరలోనే రుణమాఫీ అమలు
-నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు
-టీఆర్‌ఎస్‌లో చేరిన నిజామాబాద్, మెదక్ జిల్లా టీడీపీ, కాంగ్రెస్ నేతలు
ఇక్కడున్న ఆంధ్ర విద్యార్థులకూ తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వాలని అంటున్నారు. ఆంధ్రోళ్లకు మనమెందుకు ఫీజులు కట్టాలె. తెలంగాణ సొమ్ము తెలంగాణ బిడ్డలే తినాలె. వాళ్లకు ఇస్తే న్యాయం జరుగుతదా..? మన దగ్గర గరీబోళ్లు లేరా? మనం ఇచ్చిన హామీలు అమలుచేయాలంటే పైసలు కాపాడుకోవాలె. మావోళ్లకే మేం ఫీజులు కడుతం అంటే కేసీఆర్‌మీద తప్పు తీస్తున్నారు. వాళ్లకు ఫీజులు కడితే రూ.200 కోట్లు అయితది. ఈ సొమ్మును జుక్కల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చేందుకు ఖర్చుపెడితే మొత్తం పచ్చబడుతది. తెలంగాణ పేదరికం పోవాలనేది కేసీఆర్ తండ్లాట. ఆయన కల కూడా అదే అని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ జేడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను నమ్మిన వారంతా ఇతర పార్టీలకు రాజీనామాలు చేసి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని, తెలంగాణ వచ్చిన తరువాతైనా టీడీపీ మారుతుందనుకుంటే.. చంద్రబాబు ఇంకా తెలంగాణ ప్రజలపై కోపం పెంచుకుంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టి ముంచాలని, పీపీఎలను రద్దుచేసి తెలంగాణను చీకట్లో పెట్టాలని ఆయన చూస్తున్నారని మండిపడ్డారు.

harishrao

తెలంగాణలో టీడీపీ రోజురోజుకు ఖాళీ అవుతున్నదన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రతి సందర్భంలో ప్రయత్నించారని, తెలంగాణను ఆనాడు అడ్డుకున్నా.. మళ్లీ అడ్డుకుంటానని గుంటూరులో ఆయన చెప్పుకున్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారని, అసెంబ్లీలో తెలంగాణ అన్న పదమే వినిపించకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పోరాటం, సకలజనుల సమ్మె, విద్యార్థి, యువకుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందని, వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలని తెలిపారు. కానీ చంద్రబాబు కేసీఆర్ కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ వచ్చిందన్న సంతోషం నుంచి బయటకు రాకముందే పీపీఏలను రద్దు చేయాలనే కుట్రకు బాబు తెరతీశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆయన తెలంగాణను ముంచుతున్నారని, దీనివల్ల 450 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఆంధ్రకు వెళ్లిపోతున్నదని, బాబు ఢిల్లీలో చక్రం తప్పి ఆర్డినెన్స్ తెచ్చుకున్నారని చెప్పారు. పీపీఎల రద్దు వల్ల 5వేల మెగావాట్ల విద్యుత్ కొరత వస్తుందని, ప్రస్తుతం పల్లెల్లో ఉన్న విద్యుత్ కొరతకు చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుకు తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలన్నా కోపం, కసి, ద్వేషం ఉన్నాయని, అందుకే సీఎం కాగానే అక్కసును వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. బాబు తీరు నచ్చకే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరారని, ప్రజలంతా కేసీఆర్‌ను నమ్ముతున్నారని తెలిపారు.

కేసీఆర్‌ది మాటంటే మాటే

కేసీఆర్ ఒక మాటంటే ఆ మాట మీద ఉంటారని, మాట ప్రకారం రూ.18వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పంట రుణాలే మాఫీ చేస్తామని అన్నప్పటికీ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు బంగారంపై తీసుకున్న పంట రుణాలను కూడా రద్దు చేయబోతున్నామని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ అంటూ రుణమాఫీపై కాలయాపన చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో రాబోయే రెండేళ్లలో తొమ్మిది గంటలపాటు విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వెయ్యి మెగావాట్ల సోలార్, ఆరువేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు.

వృద్ధులకు, వితంతువులకు రూ. వెయ్యి పెన్షన్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామన్నారు. భూమిలేని దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమితోపాటు కరెంటు, సాగునీరు కోసం బోరు, మొదటి సంవత్సరం పెట్టుబడిని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు భూ పంపిణీ పేరుతో కొండలు, గుట్టలు, రాళ్లు రాప్పలు ఇచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం సాగుకు అనుకూలమైన భూమినే ఇస్త్తుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ ఎన్నికల ముందు జరిగినట్లుగా ఎన్నికల తరువాత కూడా చేరికలు జరుగుతున్నాయని, దీనికి ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న నమ్మకమే కారణమని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలోకి రావడం అంటే ప్రభుత్వాన్ని బలోపేతం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, భూపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మద్దునూరు, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన వేణుగోపాల్‌రావు, సుభాష్‌గౌడ్, మాణిక్యరెడ్డి, కిషన్, అనిత, గోపాల్, శంకరయ్య, జగన్, రాములు, సంజయ్, రేణుక, బాలమ్మ, నర్సింహులు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మెట్రోపై సీమాంధ్ర మీడియా చేసే ప్రచారం ఒట్టిదే...!

-ఎల్ అండ్‌ టీ సంస్థ వెనుకకువెళ్లదు
-అదంతా సీమాంధ్ర మీడియా ప్రచారమే
-హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి స్పష్టీకరణ
-వైదొలుగుతామన్న కథనాలు వదంతులే: ఎల్‌అండ్‌టీ
తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మెట్రోరైలు ప్రాజెక్టు ఆగిపోతుందంటూ సీమాంధ్ర మీడియా చిలువలు పలువలుగా చేస్తున్న ప్రచారమంతా ఒట్టిదేనని తేలిపోయింది. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టిన దేశంలోని ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ ఆగిపోతుందని, ఆ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగి షాకిస్తుందంటూ సీమాంధ్ర మీడియా ప్రసారం చేసిన కథనాలు ఊహాజనితమేనని రూఢీ అయింది. ఈ కథనాలపై ఎల్‌అండ్‌టీ సంస్థ, హైదరాబాద్ మెట్రోరైలు ప్రతినిధులను ఆరా తీయగా ఇదంతా తప్పుడు ప్రచారమేనని తేల్చిచెప్పారు. ప్రాజెక్టు కొనసాగింపు విషయంలో ఎక్కడా అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా పెంచే మెట్రోరైలు ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణాత్మక సూచనలు చేశారు. ఈ సూచనలను విపరీత కోణంలో చూసిన సీమాంధ్ర మీడియా ఈ ప్రాజెక్టుపై కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నదని, ప్రాజెక్టును అడ్డుకొని.. హైదరాబాద్ అభివద్ధికి ఆటంకం ఏర్పరచాలనే దురుద్దేశంతోనే ఇలాంటి గందరగోళపు కథనాలు, వదంతులు ప్రచారం చేస్తున్నదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
train
శరవేగంగా మెట్రో పనులు

హైదరాబాద్‌లోని మూడు కారిడార్లలో మెట్రో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను నిర్మించనున్నారు. రూ. 14,132 కోట్లతో మెట్రో ప్రాజెక్ట్‌ను ఎల్‌అండ్‌టీ కంపెనీ గుత్తేదారుగా చేపట్టింది. 10 శాతం సర్దుబాటు నిధి క్రింద సుమారు రూ.1400 కోట్లను కేంద్రప్రభుత్వం కేటాయించనుంది. 2012 ఏప్రిల్ 26న ప్రారంభమైన ప్రాజెక్ట్ పనులు నేటికి మూడేళ్లు పూర్తిచేసుకుంటున్నాయి. ప్రాజెక్ట్ కోసం ఎల్‌అండ్‌టీ ఇప్పటివరకు రూ. 3,500 కోట్లు ఖర్చుచేసింది. ఈ క్రమంలో నగరంలోని చారిత్రాత్మక ప్రాంతాలకు నష్టం కలుగకుండా కొన్ని ప్రాంతాలలో భూగర్భ మార్గంలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం సూచనలు చేసింది. దీనిపై ప్రభుత్వమే నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చేయించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులే ఇంకా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఆగిపోతుందంటూ వదంతులు రావడంపట్ల హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్‌ఎంఆర్) వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

మెట్రో ఆగదు.. ఎల్‌అండ్‌టీ పోదు:ఎన్వీఎస్ రెడ్డి, హెచ్‌ఎంఆర్ ఎండీ

మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో ఎలాంటి ప్రతిష్టంభన లేదు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఎల్‌అండ్‌టీ వెనుకకుపోదు. పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కారిడార్ -3లోని స్టేజ్ -1లో నాగోలు-మెట్టుగూడ మార్గంలో ట్రయల్స్, నిర్దేశిత సమయంలోగా కమర్షియల్ ఆపరేషన్స్ చేపట్టడంపై దృష్టిసారించాం. భూగర్భమార్గంపై ప్రభుత్వ సూచనల మేరకు నిపుణుల కమిటీని నియమించాలని మున్సిపల్‌శాఖకు లేఖ రాశాం. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కమిటీని నియమించలేదు. అప్పుడే భూగర్భ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్, ఎల్‌అండ్‌టీ వెనకకుతగ్గుతున్నదని కథనాలు రావడం దురదృష్టకరం. పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు ఇలాంటి పుకార్లు రావడం మా మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. అయినా వెనక్కితగ్గే ప్రసక్తే లేదు.

వైదొలిగే ఆలోచన లేదు:ఎంపీ నాయుడు , ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్ మేనేజర్

మెట్రోరైలు ప్రాజెక్ట్ నుంచి మేం వైదొలుగుతున్నామన్నది అవాస్తవం. అలాంటి అధికారిక ప్రకటన మేం ఎప్పుడూ చేయలేదు. అసలు వైదొలిగే ఆలోచనే లేదు. ఇప్పటికే మెట్రో బోగీలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. కారిడార్ -3లో కారిడార్ -1లో 50 శాతం పనులు పూర్తయ్యాయి. కారిడార్ -2లో 5 శాతం పనులు చేపట్టాం. భూగర్భ మెట్రోను చేపట్టాలంటూ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి లేఖ రాలేదు. లేఖ వస్తే అప్పుడు సాధ్యాసాధ్యాలపై ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తిచేయడానికి రాత్రింబవళ్లు నిబద్ధతతో పనిచేస్తున్నాం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!