వీణను మీటి జాతి తెలివిం దగఁ బెంచఁగఁ గోరి, యీ తెలం
గాణము మా దటంచు నవకావ్యము వ్రాసియుఁ దెల్గువారిలోఁ
బ్రాణము నింపి, "దాశరథి" పాటు లవెన్నియొ పొంది, తెల్గు మా
గాణమునందుఁ గ్రొత్త మొలకల్ మొలిపించెను దేశభక్తితో! (1)
నిన్నటి యాంధ్ర రాష్ట్రమును నిర్మితిఁ జేసినవారె మా తెనుం
గన్నలు గోరినట్టి తెలగాణను స్వార్థవిమోహ బుద్ధులై
యన్నును మిన్నుఁ గానక మహాంధ్ర కవుంగిలిఁ జేర్చ, నేఁడు నా
ల్గున్నర కోట్ల తెల్గులకుఁ గొంపలు గాలె స్వరాష్ట్ర హీనతన్! (2)
ఆలన పాలనన్ మఱచి, యాంధ్ర ప్రదేశపు మంత్రు లెందఱో
కాలముఁ బుచ్చుచుండఁ దెలగాణము వెన్కఁబడెన్ గదా! విప
త్కాలము దాపురించె! సరదాలను మాని తెనుంగులార! యీ
నేలయు నింగియున్ మొరయ నిక్కపు భక్తిని జాటి వెల్గుఁడీ! (3)
అదిగదిగో తెలుంగు జను లాకసమంత విశాల చిత్తులై
పద పద మంచు మీ యెదను భక్తి సుమాలను బాదుకొల్పెడిన్ముద మొనఁగూడు కైతలను బొంగులు వారు ప్రయత్నయుక్తితోఁ
బదములు పాడి, పిల్చి రిఁకపై గెలువం దెలగాణ రాష్ట్రమున్! (4)
నాయక ముఖ్యు లెందఱొ ప్రణాళికలన్ రచియించి, రాష్ట్రమున్
న్యాయ పథాన వేగముగ నందఁగ నెంచి, సభల్ విరాజిలన్
జేయు వచో విజృంభణ విశిష్టతలన్ వెలయించి, తెల్గులన్
వేయి విధాల నాదుకొన వేచియు నుండిరి రండురం డిఁకన్! (5)
"నా తెలగాణ! కోటి రతనమ్ముల వీణ" యటంచుఁ బల్కి, తా
నేతగ నుండి, పోరి, చెఱ నిల్చి, "నిజాము పిశాచమా! మహా
భూతమ!" యంచుఁ బిల్చి, మన పూర్వపుఁ దెల్గుల విల్వఁ బెంచు ధీ
దాతయు, శక్తి యుక్తుఁ డగు "దాశరథి" త్వర మార్గదర్శియౌ! (6)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి