గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, అక్టోబర్ 10, 2015

ప‌సికూన‌పై క‌త్తి ఎత్తిన‌ కంసులు..

 
రాజధాని పేరిట, ప్రాజెక్టులకోసమని రైతులకు ప్రాణప్రదమయిన వేలాది ఎకరాలను ఆక్రమిస్తున్నారు.రాజధాని నిర్మాణంలో అవినీతి బుసలు కొట్టబోతున్నదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయినా, కుడి ఎడమ పార్టీలు తెలంగాణలోనే ఎందుకు గగ్గోలు చేస్తున్నయ్. మోదీయుల పాలనలోని మరాట్వాడాలో, విదర్భలో ఎన్ని సంవత్సరాలయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు ఎందుకు? ఎందుకు నోరు విప్పరు?
వ్యాసకర్త: దేవులపల్లి ప్రభాకరరావు 


హమ్ ఆహ్‌భి కర్తేహైఁ తొ/ హొజాతేహైఁ బద్‌నామ్!
వొ ఖతల్ భి కర్తేహైఁ తొ/ చర్చ నహి హోతా!.... 

ఉర్దూ కవీశ్వరుడు గాలిబ్ రాసిన పై వాక్యాలు పదహారు మాసాల కిందట తెలంగాణ రాష్ట్రం అవతరించిన మరుక్షణం నుంచి పదేపదే జ్ఞాపకం వస్తున్నయ్. మనం ఊపిరి పీల్చినా బద్‌నామ్ అవుతం. వాళ్లు హత్యలు చేసినా చర్చ జరుగదు...ఇది గాలిబ్ వాక్యాల తాత్పర్యం. నాకు ఉర్దూ రాకపోవడం నా దురదృష్టం. నాలుగవ తరగతిలోనే నా తరం వాళ్లకు ఉర్దూ చదువు ఆగిపోయింది. మా అన్నగారు మదన్‌మోహన్ రావు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషలలోఉద్ధండ పండితుడు. ఆయనది ప్రచారం లేని పాండిత్యం. తెలుగులోనికి ఆయన అనువదించిన గాలిబ్ గీతాల సంకలనాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఆయన మాటలే పాఠాలై ఉర్దూతో లవలేశ పరిచయం ఏర్పడింది. 


ఆయన తెలంగాణ ఎప్పుడొస్తది, ఎప్పుడొస్తది అని తహతహలాడేవాడు, కలత చెందేవాడు. తెలంగాణ అవతరణ చరిత్రాత్మక, మహత్తర ఘటనను ఆయన చూడలేక పొయిండు. ఆయనతోపాటు కోట్లమంది ఆరాటపడిన, పోరాడిన వారి కృషి ఫలితంగా తెలంగాణ వచ్చింది. అరవై ఏళ్లు పరాయి పాలనలో నలిగిన, అణగిన, ఛిద్రమయిన తెలంగాణ, ఇప్పుడు పదహారు మాసాలు మాత్రమే నిండిన తెలంగాణ(రాష్ట్రం) ముక్కుపచ్చలారని పసికందు. దేవకి బిడ్డ గొంతు నులుమడానికి ఒక్క కంసుడే కత్తి పట్టిండు. పసిబిడ్డ తెలంగాణ గొంతు నులుమడానికి పదిమంది కంసులు తెలంగాణ అవతరణ క్షణం నుంచే పొంచి ఉన్నారు.


బాల భాస్కర తెలంగాణ కిరణం 2014 జూన్ 2 ఉదయం ప్రసరించిందో లేదో, నవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు వేసిందో లేదో ఆంధ్ర మీడియా విద్వేష విషం కక్కడం మొదలయింది. బిడ్డ తొట్లె తాళ్లకు సర్పాలు చుట్టుకున్నట్టు ఈ కోటీశ్వరుల మీడియా తెలంగాణపై బుసలు కొట్టింది. మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజా ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణ రానేరాదని అబద్ధాల కట్టుకథలను ప్రచారం చేసి, తెలంగాణ యువతీయువకులకు నిస్పృహ కల్గించి ఆత్మహత్యలకు అమానుష ప్రేరణ కల్గించిన మీడియా ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న కసితో, విద్వేషంతో ఈ మీడియా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల ఆత్మహత్యల ప్రచారం ప్రారంభించింది. విద్యుచ్ఛక్తి సరఫరాలేక, వ్యవసాయం దెబ్బతిని తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నది అప్పటి ప్రచారం. రుణమాఫీ పూర్తిగా జరుగలేదని తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నది ఇప్పటి ప్రచారం. ఆంధ్ర మీడియాలో తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు ఇస్తున్నంత స్థలం, సమయం, ప్రాధాన్యం ఇంకే అంశానికి లభించడం లేదు. 


తెలంగాణ రైతులపై ఆంధ్ర మీడియాకు, ఆంధ్ర నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న ఇక్కడి వాళ్లకు ఎంత ఘాటు ప్రేమ! తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఆగిపోతే (రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా) అప్పుడు చచ్చేది ఈ ఆంధ్ర మీడియా వాళ్లే! తాము అడ్డుకున్నా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని పాలనా పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా అస్థిరత్వం పాలు చేసి, పల్లవిస్తున్న తరుణంలోనె తుంచివేయాలన్నది ఆంధ్ర మీడియా, ఆ మీడియాకు పాలుపోసి పెంచుతున్న పొరుగు పాలకుల, వారి పంచమాంగ దళాల అంతిమ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఇక ఏర్పడదని విద్యార్థులు, యువతీ యువకుల ఆత్మహత్యలకు కారణమై న ఆంధ్ర మీడియా, పంచమాంగ దళాలు, ట్రోజన్‌హార్స్‌లు, క్విజ్‌లింగ్‌లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదన్న అనుమానాలు కల్గిస్తూ రైతుల ఆత్మహత్యలకు ఆజ్యం పోస్తున్నారు. 


ఆంధ్ర మీడియా కామెర్లపచ్చకళ్లకు తెలంగాణలో, తెలంగాణ ప్రభుత్వంలో మంచి ఏదీ కన్పించడం లేదు. తెలంగాణ ప్రభుత్వ సమర్థ నాయకత్వం ధైర్యంగా నిలిచి స్వల్ప సమయంలో కొంత వరకు విద్యుచ్ఛక్తి కొరత సమస్యను పరిష్కరించడంతో తెలంగాణ శత్రువులకు చెమటలు పట్టినయ్. కాకతీయ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  మిషన్ కాకతీయ తెలంగాణ రైతుల జీవితాలలో వినూత్న అధ్యాయాన్ని ప్రారంభించగల, తెలంగాణను సస్యశ్యామలం చేయగల, శత్రు మూకలకు చెంపపెట్టుకాగల అపూర్వ పథకం.


పైత్యం ప్రకోపించిన రాతలతో, తాటికాయంత హెడ్డింగులతో తెలంగాణ రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్న ఆంధ్ర మీడియా తెలంగాణలోని ఆంధ్ర కోటరీ పదిహేను మాసాల కిందటి నుంచి తెలంగాణ ప్రగతికి అడ్డుపడుతున్న నిదర్శనాలు అనేకం. హైదరాబాద్‌లోని కొందరు ఆంధ్రులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతి నిర్ణయాన్ని, తీసుకుంటున్న ప్రతిచర్యను హైకోర్టులో (పదిహేను మాసాల నుంచి హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నదెవరో అందరికి తెలుసు) సవాలు చేస్తారు. బెజవాడ లాయర్లు వారి పక్షాన వకాల్తా పుచ్చుకుంటారు. క్షణాలలో స్టే ఆర్డర్లు జారీ అవుతయ్. కోర్టులిచ్చే ప్రతి తీర్పు సవ్యమైనదని చెప్పలేం. బ్యాంకుల జాతీయీకరణను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇందిరాగాంధీ అచంచల ధైర్యంతో బ్యాంకులను జాతీయం చేయకపోతే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉండేది. ఒకవంక ఆంధ్ర మీడియా, ఆంధ్ర లాబీ వికృత చేష్టలు, మరో వంక అవిభక్త హైకోర్టు! ఒక వంక సానుభూతి ఉన్నట్లు నటిస్తూ, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. మరోవంక ఆంధ్ర మీడియా తెలంగాణ ప్రజలను, ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నది. 


తెలంగాణ నష్టాలకు, కష్టాలకు కారణమవుతున్నాయి. అరవై ఏళ్లు పరాయి పాలనతో అన్ని రంగాలలో దోపిడికి గురి అయి, ధ్వంసమై కృశించిన తెలంగాణ పునర్నిర్మాణం సులభం కాదు.అది క్లిష్టమయిన కార్యం. పరాయిపాలకులు, స్థానిక మాజీ పాలకులు గద్దెలు దిగారు గాని వాళ్లు వదిలి వెళ్లిన ఘోర సమస్యలు సర్పాలవలె వెంటాడుతున్నాయి. మన రాష్ట్రం ఏర్పడి పదిహేను నెలలైనప్పటికి విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వివక్షత స్పష్టంగా కన్పిస్తున్నది. 


పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పాలకులు తమకు అన్యాయం జరిగిందని విలపిస్తూ కేంద్రాన్ని వశపరచుకుంటున్నారు. తమది ధనిక రాష్ట్రం అని తెలంగాణ ముఖ్యమంత్రి ఆత్మవిశ్వాసంతో అన్నందుకు అసూయాగ్రస్తులు హేళన చేస్తున్నారు. మూడు రాష్ర్టాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వనివాళ్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చివరి క్షణం వరకు అడ్డుకున్న వాళ్లు...రానున్న రోజుల్లో తెలంగాణలో రాజ్యం తమదేనని కలలు గంటున్నారు. ఎవరు ఎన్ని కలలు గన్నా తెలంగాణ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఉంటుంది. జాతీయ పార్టీ లేబుల్స్ ఉన్న వారి ఎజెండా వేరు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సత్య సంధులు పాలించడం లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్కడ హత్యలు, ఆత్మహత్యలు, అక్రమాలు,వాగ్దాన భంగాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. అక్కడ అరాచకత్వం ప్రబలుతున్నది. 


లంచగొండితనానికి హద్దు లేదు. రాజధాని పేరిట, ప్రాజెక్టుల కోసమని రైతులకు ప్రాణప్రదమయిన వేలాది ఎకరాలను ఆక్రమిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి బుసలు కొట్టబోతున్నదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అయినా, కుడి ఎడమ పార్టీలు తెలంగాణలోనే ఎందుకు గగ్గోలు చేస్తున్నయ్. మోదీయుల పాలనలోని మరాట్వాడాలో, విదర్భలో ఎన్ని సంవత్సరాలయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు ఎందుకు? ఎందుకు నోరు విప్పరు? మనం ఊపిరి పీల్చినా బద్‌నామ్ అవుతం. వాళ్లు హత్యలు చేసినా చర్చ జరుగదు! అని గాలిబ్ అన్నది ఇటువంటి దుష్టనీతిపరులను చూసేనేమో..!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి