గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 13, 2015

భూగర్భ జలశోక నివారణ చర్యలివి...!!!

-వంద మండలాలు.. వెయ్యి గ్రామాల్లో
-మోగుతున్న ప్రమాద ఘంటికలు
-హైదరాబాద్, వరంగల్ నగరాల్లో భయానకంగా భవిష్యత్ చిత్రం
-ఆశరేపుతున్న మిషన్ కాకతీయ
-దారి చూపుతున్న కర్ణాటక మోడల్
-పట్టణజ్యోతిలో భూగర్భజల సిరుల ఎజెండా
నదుల నీటిని సమైక్య పాలకులు యథేచ్ఛగా కొల్లగొట్టుకుపోయారు. నీరులేక.. వేరే దారిలేక భూగర్భ జలాలే తెలంగాణ రైతులకు దిక్కయ్యాయి. అందుకే తెలంగాణలో ఏ పొలంలో చూసినా గొట్టపు బావులే! దశాబ్దాల వాడుక ఫలితంగా దేశంలోనే అత్యంత ప్రమాదకర లోతులకు పడిపోయాయి తెలంగాణ భూగర్భ జలాలు! 115 మండలాల్లోని 1057 గ్రామాలు ఇప్పుడు ప్రమాదపుటంచున నిలబడ్డాయి. మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మహాయజ్ఞంతో గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా కొంత ఆశావహ పరిస్థితులు నెలకొంటున్నాయి.


water


అయితే.. అటు హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో, పట్టణప్రాంతాల్లోనూ అనేక చెరువులు, కుంటలు కబ్జాలకు గురై, పూడుకుపోయి.. మాయం అయిపోవడంతో భవిష్యత్ దృశ్యం భయానకంగా కనిపిస్తున్నది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం మార్గాన్వేషణ చేస్తున్నది! ఆ క్రమంలోనే కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని భావిస్తున్నది. కర్ణాటకలో నీటి కోసం బోరు వేసుకున్న ప్రతి కుటుంబం.. భూగర్భ జలాలు తిరిగి రీచార్జ్ అయ్యేందుకు వీలుగా వర్షపు నీరు తిరిగి భూమిలోకి వెళ్లిపోయేలా మరో బోరును కూడా ఏర్పాటుచేసుకోవడం తప్పనిసరి. 


ఇటువంటి విధానాన్ని రాష్ట్రంలో అనుసరించడంవల్ల భూగర్భ జలాలు సాధారణ స్థాయిలో ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనిని తొలుత హైదరాబాద్‌లో చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితోపాటు ఇటీవలి గ్రామజ్యోతి కార్యక్రమంలో సహజవనరుల పరిరక్షణ కమిటీ తరహాలోనే త్వరలో చేపట్టనున్న పట్టణజ్యోతి కార్యక్రమంలోనూ భూగర్భ జలాల పరిరక్షణను ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా ముందుకు తేనుంది. 


ఇదీ మన వినియోగం


దేశంలో భూగర్భ జలాలను అత్యధికంగా వినియోగిస్తున్నది మన రాష్ట్రంలోనే. రాష్ట్రవ్యాప్తంగా 13లక్షల వ్యవసాయ బావులు, 17లక్షల గొట్టపు బావులతో మొత్తం వ్యవసాయ నీటి వినియోగంలో 74శాతం భూగర్భజలాలే కావడం విశేషం. దీంతో ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా విపరీత పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ పెట్టుబడులకు రైతాంగం ఎక్కువ భాగం నీటికే కేటాయించడం, అదీ దశాబ్దాల తరబడి లెక్కకుమించిన బోర్లు వేయడంతో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎక్కువమంది పరిమితికిమించి నీటి వనరులు లేకపోవడంవల్ల, వేసిన బోర్లతో పెరిగిన అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అంచనావేయడం గమనార్హం. అయితే తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉన్నాయని వాటర్‌బోర్డు అంచనాలు స్పష్టం చేశాయి.


line


భూగర్భజలాల లెక్క ఇదీ


రాష్ట్రంలో భూగర్భజలాల వినియోగం దశాబ్దాలకాలం నుంచి పెరిగిపోవడం వల్ల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడాలేకుండా ఆందోళనకర స్థాయికి చేరింది. రాష్ట్రంలో 115 మండలాలు, 1057 గ్రామాల్లో భూగర్భజలాల వినియోగం ప్రమాదపుటంచున ఉందని భూగర్భజల శాఖ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. భూగర్భజల శాఖ పరిభాషలో ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ (అతి వినియోగం) ఉన్న మండలాలు 42ఉన్నాయి. సంక్లిష్ట స్థాయిలో 8మండలాలు, పాక్షిక సంక్లిష్టంలో 65మండలాలు ఉన్నాయి. అతి వినియోగం ఉన్న మండలాలు అత్యధికంగా మెదక్‌లో 14, కరీంనగర్‌లో 12, వరంగల్‌లో 10 ఉన్నాయి.


రాష్ట్రవ్యాప్తంగా 1057 గ్రామాలను భూగర్భజల శాఖ అతి వినియోగ గ్రామాలుగా పేర్కొంది. ఇందులో అత్యధిక గ్రామాలు మెదక్ జిల్లావి. ఇలాంటి గ్రామాల్లో వాల్టా చట్టం ప్రకారం ఎటువంటి బోర్లు వేయకూడదు. కానీ నిబంధనను తుంగలోకి తొక్కి బోర్‌వెల్ యజమానులు ఇష్టారీతిగా బోర్లు వేస్తున్నారన్న ఆరోపణ ఉంది. ఏ జిల్లాకు ఆ జిల్లా రిగ్ యజమానులకు భూగర్భజల శాఖ ఆ గ్రామాలు, మండలాల స్థితిగతులపై సమాచారం అందిస్తే ఆ జిల్లాల వారు కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చి బోర్లు ఇష్టారీతిగా వేస్తున్నారు.


ఫలితమివ్వని పథకాలు


జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను, హెచ్చరికలను, సూచనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భజలాల మట్టాన్ని పెంచేందుకు దశాబ్దాలకాలంగా చేపట్టిన పథకాలు అంతగా ఫలితాన్ని ఇవ్వలేదని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. అడవుల్లో చేపట్టిన చెక్‌డ్యామ్‌లు, వాటర్‌షెడ్ పథకాలు మినహాయించి ఇతర పథకాలు అంతగా ఫలితాలు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశాల్లో భూగర్భజలాలను పెంచడం ఒకటి. అయితే అది పదేండ్లపాటు కొనసాగినా, ఇంకనూ కొనసాగుతున్నా దానివల్ల వచ్చిన ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అదీ కాకుండా ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్‌లో చేపట్టిన పాంపాండ్స్‌గానీ, ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ పథకాలుగానీ, ఆర్‌ఐడీఎఫ్, హరియాలి లాంటి స్కీమ్‌లుగానీ అనేకం ప్రవేశపెట్టినా పరిస్థితి ఏ మాత్రం మారకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.


మిషన్ కాకతీయతో చిగురిస్తున్న ఆశలు


రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) పథకంతో ఉపరితల జలాలతోపాటు భూగర్భజలాలూ పెరుగుతాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10బేసిన్ల (బేసిన్ అంటే 120నుంచి 125చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం)లో మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పరివాహక ప్రాంతాల్లో శాస్త్రీయ అధ్యయనం చేసి భూగర్భజలశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ జిల్లా రఘునాథ్‌పల్లి బేసిన్‌ను అధ్యయనం చేసింది. రఘునాథ్‌పల్లి బేసిన్ పరిధిలో రెండు మండలాలున్నాయి. రఘునాథ్‌పల్లి మండలంలో 12 గ్రామాలు, నర్మెట్ట మండలంలో మూడు గ్రామాలో 42 చిన్నతరహా చెరువులు ఉన్నాయి. తొలి దశ మిషన్ కాకతీయద్వారా 11 చెరువులను పునరుద్ధరించారు. 


రఘునాథ్‌పల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో పెద్ద చెరువులు, బానోజీపేట గ్రామంలో పోచమ్మకుంట, కన్నాయిపల్లిలో కొత్త చెరువు, వెల్ది గ్రామంలో ధర్మారెడ్డి చెరువు, నిడిగొండలో అర్థచెరువు, నర్మెట్ట మండలం మల్లక్కపేట గ్రామంలోని పెద్ద చెరువులను భూగర్భజల శాఖ ప్రభావ (ఇంపాక్ట్) అంచనాల పరిశోధన చేసింది. పరిశీలన సందర్భంగా కేవలం చెరువులను చూడడమేకాకుండా వ్యవసాయ బావులను, గొట్టపు బావులను కూడా పరిశీలించారు. ఈ చెరువులు 40నుంచి 100ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్నవి కావడం విశేషం. 


సాధారణ వర్షపాతం, వాస్తవ వర్షపాతం, మిషన్‌కాకతీయ కన్నా ముందు ఉన్న నీటి మట్టాలు, ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలు, ఆయా చెరువుల్లో తీసిన పూడిక లోతు, విస్తీర్ణం, ఆయకట్టు, ఆయా చెరువుల కింద సాగయ్యే పంటలు, ఆయా చెరువుల నీటి వినియోగం, ఉన్న పశు సంపద తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని భూగర్భజలశాఖ అధ్యయనం చేసింది. భూగర్భజల శాఖకు అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం వర్షపాతం 22శాతం తక్కువగా నమోదైన రఘునాథ్‌పల్లి బేసిన్‌లో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం వల్ల భూగర్భ నీటి మట్టాలు పెరిగాయని తేలింది. 


రఘునాథ్‌పల్లి మండలంలో సాధారణ వర్షపాతం 330.10మి.మీ కాగా, ఈ సారి కురిసిన వర్షం 255.6 మి.మీ. అదే నర్మెట్ట మండలంలో సాధారణ వర్షపాతం 294.1మి.మీ, కురిసిన వర్షపాతం 230.మి.మీ. అంటే సాధారణ వర్షపాతంకంటే దాదాపు 22శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయినా ఈ రెండు చోట్ల భూగర్భ నీటి మట్టాలు గతంతో పోలిస్తే 0.8మీటర్ల నుంచి 2.35మీటర్లకు పెరిగాయని అధ్యయనంలో స్పష్టమైంది. ఈ పైలట్ ప్రాజెక్టు తొలిదశ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 9బేసిన్లను సాధ్యమైనంత తొందరగా తులనాత్మక అధ్యయనాలు చేయాలని భూగర్భజలశాఖ భావిస్తున్నది. 


బస్తీల్లో పరేషాన్


గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో భూగర్భజల వినియోగమే కాదు, ఆ జలాల పరిరక్షణ చేపట్టాల్సిన అనివార్యతలున్నాయి. హైదరాబాద్, వరంగల్‌లాంటి మహానగరాల్లో విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాల్టా ప్రకారం 120 మీటర్ల కంటే అధికలోతు నుంచి నీటిని తోడకూడదు. హాఫ్ హెచ్‌పీ పంపులతోనే నీటిని తోడాలి. అయితే జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో కనీసం 300-500 మీటర్లలోతుకు, కొన్ని ప్రాంతాల్లో 1000 మీటర్ల కంటే లోతునుంచి కూడా నీటిని తోడేస్తున్నారని భూగర్భజలశాఖ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఈ పరిస్థితి మారేందుకు, తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే పట్టణజ్యోతిలో భూగర్భ జలశాఖ వనరుల పరిరక్షణ ఆవశ్యతను తెలిపే కార్యక్రమంగానీ, కమిటీగానీ చేపడితే తప్ప పరిస్థితిలో మార్పు ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.


కర్ణాటక విధానం ఆలోచిస్తున్నాం


భూగర్భ జలాల పరిరక్షణ అనివార్యతల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల, చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జల నీటిమట్టాలు పెరుగుతున్నట్టు శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటకలో ప్రతి ఇంటికీ విధిగా రెండు బోర్లు వేసుకోవాలని చట్టం ఉంది. ఒక బోరు ద్వారా నీటిని తోడుకుంటే మరో బోరు భూగర్భ జలాల రీచార్జ్‌కి ఉపయోగించాలి. పడిన ప్రతి వాననీటిబొట్టు భూమిలోకి ఇంకే విధంగా ప్రణాళికల్ని అక్కడ పక్కాగా అమలు చేస్తున్నారు. 


ఇక్కడా అటువంటి విధానం అమలు చేసేందుకు, ముఖ్యంగా ఇంటింటికీ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ తీసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రజలకు భూగర్భ జలాలపై విస్తృత అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఒక మాస్ క్యాంపెయిన్ తీసుకోవాలి. నీటి పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల చేపట్టిన గ్రామజ్యోతిలో ప్రకృతి వనరుల పరిరక్షణ కమిటీని వేయడం అందులో భాగమే.జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి