గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, అక్టోబర్ 12, 2015

అంతర్రాష్ట్ర వివాదరహితంగా ప్రాజెక్టులు...!!!

-రీడిజైనింగ్‌పై కసరత్తు
-నీటిపారుదల కీలక అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
- వీలున్నంత వరకు మన భూభాగంలోనే ముంపు
-గరిష్ఠస్థాయిలో గోదావరి జలాల వినియోగం
-తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో సంప్రదింపులు
- మేడిగడ్డ వద్దనే భారీ బ్యారేజీకి సంకేతాలు
-తుపాకులగూడెంవద్ద బ్యారేజీతో దేవాదులకు జీవం
గత అనుభవాలు, రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించే లక్ష్యం వెరసి అంతర్రాష్ట్ర వివాదాలు లేకుండా గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పొరుగు రాష్ర్టాలతో సంప్రదింపులు, ఒప్పందాల పేరుతో సమయం వృథాకాకుండా సాధ్యమైనంత మేరకు తెలంగాణ భూభాగానికే ముంపు పరిమితమయ్యేలా నిర్మాణాలు చేపట్టి, గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించడానికే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం పలు ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల నీటి లభ్యతకు మార్గం సుగమంచేయడం, ఖమ్మం జిల్లాలోని రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై చర్చించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారని తెలిసింది.



గరిష్ఠంగా గోదావరి వినియోగం


తెలంగాణ ప్రభుత్వం ఆదినుంచి గోదావరి జలాలను గరిష్ఠంగా బీడు భూములకు మళ్లించాలనే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌లో భారీ బ్యారేజీ నిర్మాణానికి చాలాకాలంగా సాంకేతిక కసరత్తు చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలానికి తుమ్మిడిహట్టి బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం మొదటినుంచి చెప్తున్నది. ఈ మేరకు తుమ్మిడిహట్టి నిర్మాణంపై మహారాష్ట్రతో సంప్రదింపులు మొదలుపెట్టాల్సిందిగా సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారని తెలిసింది. అయితే ఈ విషయంలో సమావేశం అవుదామని కోరుతూ నాగపూర్ సీఈకి లేఖ కూడా రాసినట్టు ప్రాణహిత-చేవెళ్ల సీఈ హరిరాం సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నెల 25న బ్యారేజీ నిర్మాణంపై సమావేశం జరిగే అవకాశముందని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 152 మీటర్లతో చర్చలు ప్రారంభించి.. సాధ్యమైనమేరకు అంశాన్ని కొలిక్కి తీసుకురావాల్సిందిగా సీఎం సూచించినట్లు తెలిసింది.


మేడిగడ్డ వద్ద భారీ బ్యారేజీ


గతంలో అనుకున్నట్లుగా మేడిగడ్డవద్ద భారీ బ్యారేజీ ప్రతిపాదనపై సీఎం చర్చించారు. గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడ నీటి లభ్యత బాగానే ఉందని ఇప్పటికే వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 160 రోజుల పాటు ఇక్కడ నీటి లభ్యత ఉంటుందని, వరద ప్రవాహం 102 మీటర్ల స్థాయిలో ఉంటే.. వంద మీటర్ల స్థాయి వరకు బ్యారేజీ నిర్మించవచ్చని వ్యాప్కోస్ తన నివేదికలో స్పష్టంచేసింది. ఈ మేరకు వంద మీటర్ల స్థాయిలో భారీ బ్యారేజీ నిర్మాణం మేలనే అభిప్రాయం సమీక్షలో వ్యక్తమైనట్లు తెలిసింది. ఇక్కడ కూడా మహారాష్ట్రతో సంబంధం లేకుండా వీలైతే.. 99 మీటర్లవరకు బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. ఈ స్థాయిలోనూ పది టీఎంసీల వరకు నీటినిల్వ సామర్థ్యం ఉండనుంది. దీంతో దాదాపుగా దీనివైపే సీఎం మొగ్గుచూపినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మేడిగడ్డనుంచి ఎల్లంపల్లివరకు కాలువ అలైన్‌మెంట్‌పై గతంలో కొన్ని క్లిష్టమైన పాయింట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో లైడార్ సర్వే నివేదిక ఆధారంగా సదరు అలైన్‌మెంట్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. 


ఇచ్చంపల్లిపైనా చర్చ


సమీక్షలో భాగంగా ఇచ్చంపల్లిపై కూడా సీఎం చర్చించారు. వాస్తవంగా ఇక్కడైతే ప్రాణహిత, ఇంద్రావతి రెండు నదులనుంచి నీటి లభ్యత ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు అనగానే ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్లనుంది. తద్వారా ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ర్టాల ఒప్పందం (ట్రైపార్టీ) తెరపైకి వస్తుంది. దీంతో ఏ రాష్ట్రం ఎలా స్పందిస్తుందో తెలియని స్థితి. దీనిద్వారా కాలయాపన జరిగే అవకాశముందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అందుకే ప్రస్తుతానికి మేడిగడ్డ వద్ద భారీ బ్యారేజీ ప్రతిపాదనతోనే ముందుకు పోయేలా సూచనలు చేశారని సమాచారం.


తెరపైకి తుపాకులగూడెం


సమీక్షలో దేవాదుల ప్రాజెక్టుకు జీవం పోయడంపై చర్చించారు. ఏ రూపంలోనైనా దేవాదులకు నీటి లభ్యత ఉంచితేనే ఆ ప్రాజెక్టు మనుగడ సాధిస్తుందనే భావనతో మొదటినుంచి తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్‌పై దృష్టిసారిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కంతనపల్లి ప్రాజెక్టుపై సీఎం చర్చించారు. ఇదికూడా అంతర్రాష్ట్ర అంశంతో ముడిపడి ఉంది. ముంపు పొరుగు రాష్ట్రంలో ఉండనున్నందున ఆ రాష్ట్రంతో సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. అయితే ఇలా కాకుండా కంతానపల్లికి పైకి ఉన్న దేవాదులనుంచి దిగువన సుమారు 10-12 కిలోమీటర్ల దూరంలో ఉండే తుపాకులగూడెంవద్ద బ్యారేజీ నిర్మాణానికి సీఎం మొగ్గు చూపినట్లు తెలిసింది. 


ఇక్కడ దాదాపు 85మీటర్ల మేర బ్యారేజీ నిర్మిస్తే... నదిలోనే (రివర్ పోర్షన్) ముంపు ఉంటుంది. పైగా ఇక్కడ ఇంద్రావతి నీళ్లు ఉండటంతోపాటు ఆవలివైపు కూడా తెలంగాణ భూభాగమే కావడంతో ఇక్కడ అంతర్రాష్ట్ర వివాదం అంశమనేది ఉండదు. దీంతో తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మిస్తే దేవాదులకు నీటి లభ్యత ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిసింది. అదేవిధంగా మేడిగడ్డ వందమీటర్ల స్థాయిలో ఉంటే తుపాకులగూడెం 85మీటర్ల స్థాయి.. వెరసి తేడా 15 మీటర్లు మాత్రమే ఉన్నందున మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు లేనపుడు తిరిగి తుపాకులగూడెంనుంచి లిఫ్టుద్వారా నీటిని తరలించే అవకాశమూ ఉంటుందని అనుకున్నట్లు తెలిసింది. అవసరమైతే ఎస్సారెస్పీ నుంచి వచ్చే కాకతీయకాలువ కూడా సమాంతరంగా ఉంటున్నందున అందులోకి కూడా తరలించే అవకాశం ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు చెప్తున్నారు.


వ్యాప్కోస్‌కు దుమ్ముగూడెం సర్వే బాధ్యత


ఖమ్మం జిల్లాలోని రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల రీడిజైన్‌పైనా చర్చ జరిగింది. రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెంద్వారా.. కిన్నెరసాని, రోళ్లపాడు, మార్లపాడు అలా దిగువకు నీటిని తరలించే డిజైన్‌పై సర్వే చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాప్కోస్ సీఎండీని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే ఇందిరాసాగర్‌ద్వారా నిర్మించిన కాలువలు కొంతమేర ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నా.. మరికొంత వ్యవస్థ తెలంగాణలో ఉంది. దీంతో ఆ వ్యవస్థ వృథాగా ఉండకుండా.. రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెంద్వారా ఇందిరాసాగర్‌లోని కాలువలను అనుసంధానించే డిజైన్‌పైనా సర్వే చేయాలని సూచించినట్లు తెలిసింది. 


మరోవైపు ఇప్పటివరకు జరిగిన లైడార్ సర్వే వివరాల్ని సీఎం కేసీఆర్ వ్యాప్కోస్ సీఎండీ శంభు ఆజాద్ నుంచి అడిగి తెలుసుకున్నారు. ఏయే లింకులపై సర్వే చేశారు? భారీ బ్యారేజీలకు సంబంధించి ఎక్కడెక్కడ చేశారు? అనే వివరాలు తెలుసుకున్నారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ఈఎన్సీ మురళీధర్‌రావు, ప్రాణహిత-చేవెళ్ల సీఈ హరిరాం, వ్యాప్కోస్ సీఎండీ శంభు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి