తెలంగాణ ప్రజలకు, మేధావులకు, బ్లాగు వీక్షకులకు
తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు!
ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి రోజైన సెప్టెంబర్ 9ని ఇక నుంచి తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. కాళోజీకి తెలంగాణ భాష అన్నా యాస అన్నా అపారమైన అభిమానం. ఆయన రచనలన్నీ కొనసాగింది తెలంగాణ మాండలికంలోనే. ఉమ్మడి రాష్ట్రంలో రెండున్నర జిల్లాల భాషనే దండి భాషగా గుర్తించి అదే ప్రామాణికమైన భాష అని గత ప్రభుత్వాలు నిర్ణయించడం ఒక విధంగా తెలంగాణ భాష, యాసలను అగౌరవపరచడమే అని విశ్వసించిన కాళోజీ, రాష్ట్రంలో చెలామణిలో ఉన్న అన్ని మాండలీకాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనే వారు. కాళోజీ కవిత్వంలో మనకు మూడు ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి సరళమైన భాష. రెండవది ధిక్కార స్వరం, మూడవది మానవతావాదం. కాళోజీ తన రచనలలో సరళమైన భాషను ఎంచుకున్నారు కాబట్టే వారు ప్రజలకు దగ్గరైంది. ఒకవేళ కాళోజీ సరళమైన శైలిని ఎంచుకోకపోతే అతని నా గొడవ తన గొడవగానే మిగిలిపోయేది. ఇది మన గొడవగా గానీ మనిషి గొడవగా గానీ మారేది కాదు. అందుకే అతను వేమన వలె అసలు సిసలైన ప్రజాకవి అయ్యారు.
నాది పలుకబడుల భాష, బడిపలుకల భాష కాదు అని గర్వంగా చెప్పిన కాళోజీ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వాడుక భాషలోనే రాయాలి అని చెప్పేవారు. తెలుగు భాషలో ఒక ప్రాంతం భాష ఆధిపత్యం వహించి మిగితా ప్రాంతాల ప్రజల భాషను తక్కువగా చూడడం, న్యూనతకు గురి చేయడం ఎంతమాత్రం అంగీకారం కాదు. కాళోజీకి అన్న విషయాన్ని వారి రచనలే తెలియజేస్తున్నయి. రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు, తక్కినోళ్ల యాస తొక్కి నొక్కబడ్డప్పుడు, ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు అని నినదించారు. తెలంగాణ భాష యాసలను ఎవరు కించపరిచినా సహించేవారు కాదు. కాళోజీ అన్న విషయం...వారు రాయప్రోలు సుబ్బారావు విషయంలో స్పందించిన తీరే ఒక చక్కటి నిదర్శనం. ఉస్మానియా విశ్వవిద్యాల యం తెలుగు శాఖాధిపతిగా పనిచేసిన రాయప్రోలు సుబ్బారావుగారు తరచుగా తెలంగాణ భాష యాసలను కించపరుస్తూ మాట్లాడుతుండేవారు. ఇతను గైర్ ముల్కీ. గైర్ ముల్కీ అయిన సుబ్బారావు తెలంగాణ భాషను కించపరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ ఈ విధంగా స్పందించారు.
లేమావి చిగురులను లెస్సగా మేసేవు
ఋతురాజు వచ్చెనని అతి సంభ్రమముతోడ
మావి కొమ్మల మీద మైమరచి పాడేవు
తిన్న తిండెవ్వారిదే కోకిలా నువు
పాడు పాటెవ్వారిదే కోయిలా?
అని సుతిమెత్తగా చురకలంటించిరి.
కాళోజీకి మాతృభాషపట్ల ఎనలేని గౌరవం. మాతృభాషను ఆదరించక పరభాషపై మోజు పెంచుకుని కన్నతల్లి వంటి స్వభాషను నిరాదరణకు గురిచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ ఈ విధంగా స్పదించారు.
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలునేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా?
ఇది 1942లో రాసిన కవిత. ఇప్పటికి ఇది మనకు వర్తిస్తుంది. పరభాష మనల్ని మనం మనంగా బ్రతుకకుండా చేస్తుంది. పరభాషను భుజాలపై మోస్తూ మన భాషను మనం అగౌరవపరుస్తున్నాం. ఈ వైఖరిని మనం ఎండగట్టాలి అన్న కాళోజీ మాటలు ఈ నాటికీ వర్తిస్తాయి. కొన్నేళ్లుగా కాళోజీ జన్మదినం రోజును తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా ఆయన అభిమానులు జరుపుతున్నారు. కానీ నేడు కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం.
శ్రీశ్రీచే తెలంగాణ లూయి అరగాన్‌గా స్తుతించబడ్డ కాళోజీ ఆలోచనల్లో ఆచరణలో అసలు సిసలైన మానవతావాది. ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అయితే కాళోజీ గొడవంతా సగటు మనిషి గొడవ. అతనికి మానవత్వం పరమావధి. కాళోజీ గొడవ మనిషి గొడవ. కాళోజీకి మానవత్వం పరమావధి. దార్శనిక చరిత్రలో మొదటిసారిగా మానవున్ని కేంద్రంగా చేసి నిర్మించే దర్శనానికి పునాదులు వేసిన తత్త్వవేత్త ప్రొటాగరస్. ప్రొటాగరస్‌తో ప్రారంభమైన మానవతావాదం క్రమంగా అభివృద్ధి చెంది వివిధ రకాల మానవతా వాదాలుగా పరిణామం చెందింది.
అయితే కాళోజీ మాత్రం అన్నిరకాల మానవతా వాదాలను తనలో విలీనం చేసుకున్న వ్యక్తి. అతనిదొక విశిష్ఠమైన మానవతావాదం. అందుకే కాళోజీ తన ఆత్మకథలో ఈ విధంగా అంటాడు. నానా యిజాల అడుగున చూడ నా యిజందే అగుపడును జాడ అని. మానవుడే అన్నింటికి కొలమానం అనే తాత్త్విక చింతనను ప్రొటాగరస్ నుంచి, ప్రశ్నించే స్వభావం వున్నవాడే మనిషి అని చెప్పే దార్శనిక ధోరణి ని ఎం.ఎన్. రాయ్ నుంచి ఈ విధంగా వివిధ దార్శనికుల విషయాలన్నింటిని తనలో జీర్ణం చేసుకున్న వ్యక్తి కాళోజీ. ప్రహ్లాద చరిత్రకు కాళోజీ ఇచ్చిన భాష్యంలో ప్రశ్నించే స్వభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారి రచనలన్నింటిలో మొదటి నుంచి చివర వరకు మానవతావాదానికి సంబంధించిన కోణం ఆవిష్కరింపబడ్డది. మానవుని మూర్తిమత్వ వికాసానికి దోహదపడని ఏ యిజాన్ని అయినా సరే అతడు ఈసడించుకునేవాడు. అతని దృష్టిలో సంఘాలు నియమాలు సాంప్రదాయాలు మనిషిలోని కుళ్లుకు మారురూపాలు. అతను ఆశించిన సమాజం మానవుని మానవుని మాదిరిగా చూడగలిగే సమాజం. అందుకే అతడు ప్రజాస్వామ్య విలువలకు గాని పౌరహక్కులకు గాని భంగం వాటిల్లితే సహించేవాడు కాదు. పౌరహక్కులకు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగినప్పుడు కాళోజీ స్పందించిన విధానాన్ని అపార్థం చేసుకున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. కాళోజీ హింసావాది అని... నక్సలైట్ అని... అనడం జరిగింది. కాళోజీ నా గొడవలో ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు. ప్రతి హింస తప్పు కాదు అని.
హింస, ప్రతిహింస, రాజ్యహింసల మధ్య వ్యత్యాసం నిర్వచనాలు తెలువని వారే కాళోజీని అపార్థం చేసుకున్నది. కాళోజీ తాత్త్విక దృష్టిలో దౌర్జన్యాలను ఎదిరించే ప్రతి మనిషి ఒక ఉగ్రనరసింహుడే. తిరుగుబాటే బతుకుబాటగా మనిషి ఎంచుకోవడానికి కారకులు పాలకులు అని అతని విశ్వాసం. అందుకే కాళోజీ తన ఆత్మకథలో ఈ విధంగా పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు అని. ఎం.ఎన్. రాయ్ జయప్రకాష్ నారాయణ వలె పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఆదరించినవాడు కాళోజీ. ప్రజాస్వామ్య విలువలను తనలో సంపూర్ణంగా జీర్ణం చేసుకున్న వ్యక్తి కాళోజీ. నేను నీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే నీ హక్కు కోసం అవసరమైతే నా జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడుతాను అన్న వోల్తేర్ ప్రజాస్వామిక దార్శనిక భావాలను తనలో సంపూర్ణంగా జీర్ణించుకున్న వ్యక్తి కాళోజీ.
తెలుగు భాషా, సంస్కృతుల వికాసానికి కాళోజీ ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ప్రజా సంస్కృతికి విఘాతం కలిగినప్పుడల్లా తన స్వరాన్ని వినిపించాడు. అణగారిన ప్రజల కోసం తన గళమెత్తాడు. తెలుగు ప్రజల పౌరహక్కుల కోసం శ్రమించాడు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మరిచినప్పుడల్లా వారి ధర్మాన్ని గుర్తు చేశాడు. పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని జయప్రకాశ్ నారాయణ్ గూర్చి కాళోజీ చెప్పిన మాట కాళోజీ జీవితానికి అక్షరాల వర్తిస్తుంది. ఒక దార్శనికుడు మరణించినంత మాత్రాన అతని దర్శనం అంతరించిపోదు. కాళోజీ ఈనాడు భౌతికంగా మన మధ్య లేకున్నా అతని భావాలు మాత్రం మనిషి గొడవగా సగటు మనిషి ఉన్నంతకాలం ఉంటాయి. మన భాష, మన పలుకుబడులకోసం ఇపుడు మన స్వతంత్ర రాష్ట్రంలో కాళోజీ జన్మదినం రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా జరగడం గర్వించతగింది.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి