గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 23, 2015

తొలి పరీక్షలో...గుణాత్మక మార్పు

"తెలంగాణ చరిత్ర, సంస్కృతి మన పాఠ్యపుస్తకాల్లో అవసరం లేదు అని తీర్మానించుకున్న రాష్ర్టాలు ఇప్పుడు పునరాలోచించుకుంటాయేమో  చూడాలి. తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించాలంటే తెలంగాణ గురించి తెలుసుకోకతప్పదనే తత్త్వం బోధపడినంక వారి మనసు, పాఠ్యపుస్తకాలు కూడా మారుతాయేమో.. వేచి చూడాలి."

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక పారదర్శకంగా ఉండాలని, అవినీతికి, పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రతిభ ఆధారంగానే నియామకాలుండాలనేది ప్రభుత్వ నిర్ణయం. అందుకు తగ్గట్టుగానే ఘంటా చక్రపాణి నాయకత్వంలోని బృందం మొదటి పరీక్షను విజయవంతంగా ముగించింది. పరీక్ష రాసిన అభ్యర్థుల మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కూడా ఇది తొలి పరీక్షే. 


gatika

రిజర్వేషన్ నిర్ణయించడం, సిలబస్ ఖరారు చేయడం, ప్రశ్నా పత్రాలు రూపొందించడం తదితర ఘట్టాలన్నీ విజయవంతంగా పూర్తిచేసి తొలి పరీక్షలో మెరుగైన ఫలితం రాబట్టుకున్నారు కమిషన్ సభ్యులు. తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించడం అనేది ఓ సాంకేతిక అంశం. అంతకుమించి విజయం సాధించింది కమిషన్. అది తెలంగాణ ఉద్యోగ నియామకాల ప్రక్రియ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, ప్రముఖ వ్యక్తులు, జీవన విధానానికి సంబంధించి భారతదేశమంతా చదువుకోవాల్సిన అనివార్యతను సృష్టించింది. అది తొలి పరీక్షలో సాధించిన గుణాత్మక మార్పు. 


కొన్నిరోజులుగా మనం దాదాపు అన్ని దినపత్రికల్లో చూస్తున్నాం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, ఆచారాలు, వాడుక పదాలు, విశిష్ట వ్యక్తులు, పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాల గురించి పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వస్తున్నాయి. ఒక్కో పత్రిక రెండు, మూడు పేజీల స్పెషల్స్ కూడాఇస్తున్నాయి. తెలంగాణ ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్ సహా చాలామంది విద్యావంతులు, మేధావులు, అధ్యాపకుల ఇంటర్వ్యూలు, వారు తెలంగాణ గురించి చెప్పిన విషయాలు ప్రముఖంగా ప్రచురితమవుతున్నాయి. చాలామందికి ఈ మార్పు అర్థం కావడం లేదు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకు మాత్రమే స్పష్టంగా అర్థమైంది. ఎందుకీ మార్పు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే సిలబస్ విడుదల చేసింది. అందులో తెలంగాణకు సంబంధించిన సిలబస్ పెట్టింది. దానికి సంబంధించిన విషయాలు, వివరాలు కూడా అందించింది. 


అయితే లోతుగా చదవడం, విశ్లేషణ చేసుకోవడం, చరిత్రను అర్థం చేసుకోవడం, సంస్కృతిపై అవగాహన పెంచుకోవడం కోసం ఈ వ్యాసాలు అవసరమయ్యాయి. ఇప్పటికిప్పుడు చరిత్ర పుస్తకాలు తిరగేయడం సాధ్యం కాదు కాబట్టి (చాలా వరకు అందుబాటులో కూడా లేవు కాబట్టి) అభ్యర్థులకు పేపర్లే దిక్కయ్యాయి. ఫలితంగా తెలంగాణలో రెండు నెలలుగా పేపర్ల సర్క్యులేషన్ పెరిగింది. ఈ నేపథ్యంలో పేపర్లలో కూడా పోటీ పెరిగింది. తెలంగాణకు సంబంధించిన విషయాలు ఎవరు ఎక్కువ రాస్తే వారి పేపరే అమ్ముడుపోయే స్థితి వచ్చింది. అందుకే పత్రికలు తెలంగాణ గురించి పేజీలకు పేజీల సమాచారం ఇస్తున్నాయి. తెలంగాణ వారికి తెలిసినవే అయినప్పటికీ.. ఇంతకాలం మరుగున పడిన చాలా అంశాలు పత్రికల్లో ప్రచురితం కావడం ఒక రకమైన పరవశానికి గురి చేస్తున్నది. 1947గురించి మాత్రమే బాగా తెలిసిన వారికి, ఇప్పుడు 1948 కూడా కొత్తగ పరిచయమవుతున్నది. 


1956 ఘటనలు బాగా గుర్తున్న వారికి 1952ను కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. బ్రిటిష్ పాలన, దోపిడీ గురించి మాత్రమే చదువుకున్న వారికి, భారతదేశ సైనిక పాలన ఘోరాలు కూడా తెలుసుకోవాల్సి వస్తున్నది. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్నే రెండు భాగాలుగా చేసుకుని చదువుకునే వారు, ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చదువుకోవాల్సి వస్తున్నది. రాయల పాలన గురించి, రత్నాల వ్యాపారమే చరిత్రగా మిగిలిన దుస్థితి నుంచి కాకతీయుల సామ్రాజ్యం గురించి, చెక్కిన శిల్పాల గురించి, తవ్విన చెరువుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన మార్పు సాధ్యమైంది. మహాకవి శ్రీశ్రీ పద్యాలే కాదు, ప్రజాకవి కాళోజీ ప్రశ్నల్లో కూడా తెలుగుతనాన్ని, ధిక్కార స్వరాన్ని కొత్తగా వినవలసి వస్తున్నది. అల్లూరి సీతారామారాజు పరాక్రమమే కాదు, కొమురం భీం ధీరత్వంలో కూడా ఆదివాసీల పోరాటాన్ని వెతుక్కుంటున్నారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చినంక జరిగిన మొదటి పరీక్షకు 24 వేల మంది హాజరయ్యారు. అందులో పదివేల మంది ఇతర రాష్ర్టాల వారే. వారిలో ఆరు వేలు ఆంధ్రప్రదేశ్ వారుంటే, నాలుగు వేలు ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర ఇతర రాష్ర్టాల వారున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మొత్తం ఉద్యోగాలు తెలంగాణ వారికే దక్కుతాయి అని అనుకుంటే, వివిధ కారణాల వల్ల టీఎస్‌పీఎస్సీ కూడా పాత రిజర్వేషన్ విధానాన్నే కొనసాగించాల్సి వచ్చింది. 60 శాతం స్థానికులకు, 40 శాతం స్థానికేతరులకు ఉద్యోగాలు కేటాయించింది. ఈ 40శాతం కోటాలో ఉద్యోగాలు సంపాదించడం కోసం చాలామంది ఇప్పుడు తెలంగాణ గురించి కొత్తగా చదువుకోవాల్సి వస్తున్నది. 


కారణమేదైనా సరే, తెలంగాణలో కొలువుల కోసం జరిగే పరీక్షలో తెలంగాణకు సంబంధించిన అంశాలే ఉండటం సహజం. ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాగే ఉంటుంది. కానీ తెలంగాణలోనే కొత్తగా ఎందుకు కనిపిస్తున్నదంటే, ఇవి సాంస్కృతిక దోపిడీ నుంచి బయట పడుతున్న క్షణాలు కాబట్టి. తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలు సాధికారికంగా పతాక శీర్షికలుగా మారిన ఘడియలు కాబట్టి. నిజానికి సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే చరిత్ర, సంస్కృతికి సంబంధించి సమన్యాయం జరగాల్సి ఉండె. కానీ వివక్ష జరిగింది. రాష్ట్ర ఏర్పాటు అంటే సమైక్య రాష్ట్ర ఆవిర్భావమే చెప్పారు తప్ప, ఆంధ్ర, హైదరాబాద్ వేర్వేరు రాష్ర్టాలుగా ఉండేవనే వాస్తవాన్ని కూడా చెప్పలేకపోయారు. ఇవాళ మన చరిత్ర చదువుకునే మన పిల్లలు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిలబస్‌లో తెచ్చిన మార్పుల ఫలితంగా కేవలం పరీక్ష విధానంలోనే కాదు, రేపు విద్యార్థులు ఏం చదువుకోవాలి, ఏం తెలుసుకోవాలనే విషయంలో కూడా అవగాహన వచ్చింది. 


ఇది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సాధించిన మార్పు. సిలబస్ రూపొందించిన వారు, ప్రశ్నాపత్రం తయారు చేసిన వారు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. లోకల్-నాన్ లోకల్ సరిగ్గా నిర్ధారించలేని సమయంలో తెలంగాణలో ఉద్యోగం చేసే వారికి ఇక్కడి స్థానికతపై పట్టున్నదనే విషయం నిరూపించుకోవాల్సిన అనివార్యతను సృష్టించగలిగారు.


ఇక్కడ పుట్టిపెరిగిన వారికే గటక రుచి తెలుస్తుంది. బతుకమ్మ పువ్వు తెలుస్తుంది. పీవీ నర్సింహారావు పుట్టుపూర్వోత్తరం తెలుస్తుంది. దాసి వ్యవస్థ తెలుస్తుంది. కాళోజీ గొడవ తెలుస్తుంది. గద్దర్ గొంతు తెలుస్తుంది. యాదిరెడ్డి త్యాగం తెలుస్తుంది. కేసీఆర్ ఘనత తెలుస్తుంది. 610 జీవో తెలుస్తుంది. సైనిక పాలన తెలుస్తుంది. రంగం భవిష్యవాణి తెలుస్తుంది. ఖమ్మం కిన్నెరసాని తెలుస్తుంది. ఇవన్నీ తెలంగాణ వారి జీవితంలో భాగం. తమ జీవితమే ఓ పాఠ్యాంశమైనప్పుడు చదువు ఎవరికైనా తేలికే. అందుకే టీఎస్‌పీఎస్సీ పరీక్ష ప్రశ్నా పత్రం తెలంగాణ బిడ్డలతో ఆలింగనం చేసుకున్నది. కడుపులో లేకున్నా కావలించుకుందామనుకునే వారికి మింగుడుపడని ముద్దయింది. 


కొసమెరుపు: తెలంగాణ చరిత్ర, సంస్కృతి మన పాఠ్యపుస్తకాల్లో అవసరం లేదు అని తీర్మానించుకున్న రాష్ర్టాలు ఇప్పుడు పునరాలోచించుకుంటాయేమో చూడాలి. తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించాలంటే తెలంగాణ గురించి తెలుసుకోకతప్పదనే తత్త్వం బోధపడినంక వారి మనసు, పాఠ్యపుస్తకాలు కూడా మారుతాయేమో.. వేచి చూడాలి.
జై తెలంగాణ!    జై జై తెలంగాణ!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి