గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 19, 2015

ఈ రాతలు... చారిత్రక తప్పిదాలు!

తెలంగాణ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నది. కానీ ఏ ఒక్క చరిత్రకారుడు కూడా తెలంగాణ చరిత్రలోని ప్రధాన ఘట్టాలను ఒక పుస్తకంగా రాసి ప్రచురించలేదు. అయితే మార్కెట్‌లో దాదాపు అరడజను పుస్తకాలున్నాయి. వాటిని ఔత్సాహిక మేధావులు రాశారు. ఇద్దరు ముగ్గురు తెలంగాణ చరిత్రను స్థాలీపులాక న్యాయంగా సమీక్ష చేశారు. కానీ వారెవరూ ప్రామాణిక ఆధారాలైన శాసనాలు, నాణేలు, పురావస్తు తవ్వకాలు, సమకాలీన గ్రంథాలు, రాత ప్రతులు, ఇటీవలి ఆధారాలు,నిరూపిత అంశాలను లెక్కలోకి తీసుకోలేదు. 

satya

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను నిపుణుల సహాయంతో సమీక్షించి ఆగస్టు 31న ప్రకటించింది. ఈ కొత్త సిలబస్‌లో తెలంగాణ చరిత్రకు సంబంధించి రాష్ట్ర సాధన అనే ప్రధానాంశాన్ని ఒక ప్రత్యేక పేపర్‌గా చేర్చారు. దీంతో గ్రూప్-1 పరీక్షలో 33 శాతం తెలంగాణ చరిత్ర కు ప్రాధాన్యం ఇచ్చినైట్లెంది. పరీక్ష అభ్యర్థులు చదవాల్సిన సుమారు 10 సబ్జెక్టుల్లో తెలంగాణ చరిత్రకు ఇంతటి ప్రాముఖ్యం రావడంతో ఈ సబ్జెక్టును చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. అది సరైందే కూడా. కానీ మార్కెట్‌లో తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ పబ్లిషర్స్, ప్రైవేట్ వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు రాసి ప్రచురించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ప్రైవేట్ పబ్లికేషన్స్ వల్ల విద్యార్థులు అప్రామాణికమైన అంశాలు చదివి నష్టపోతున్నారు.


విచిత్రమైన విషయమేమంటే తెలంగాణ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నది. కానీ ఏ ఒక్క చరిత్రకారుడు కూడా తెలంగాణ చరిత్రలోని ప్రధాన ఘట్టాలను ఒక పుస్తకంగా రాసి ప్రచురించలేదు. అయితే మార్కెట్‌లో దాదాపు అరడజను పుస్తకాలున్నాయి. వాటిని ఔత్సాహిక మేధావులు రాశారు. ఇద్దరు ముగ్గురు తెలంగాణ చరిత్రను స్థాలీపులాక న్యాయంగా సమీక్ష చేశారు. కానీ వారెవరూ ప్రామాణిక ఆధారాలైన శాసనాలు, నాణేలు, పురావస్తు తవ్వకాలు, సమకాలీన గ్రంథాలు, రాత ప్రతులు, ఇటీవలి ఆధారాలు, నిరూపిత అంశాలను లెక్కలోకి తీసుకోలేదు. ప్రొఫెషనల్ చరిత్రకారులు చేయవలసిన ఈ పనులను వారు చేయలేదని విమర్శించడం తగదు. కనీసం వారు ప్రజలకు, విద్యార్థులకు కొంత సమాచారాన్నైనా చేరవేయగలగడం అభినందనీయం.


తెలంగాణ చరిత్రలోని ప్రాచీన, మధ్య యుగాలకు సంబంధించి ప్రామాణిక పుస్తకాల రచన జరగాలి. ఆధునిక యుగానికి సంబంధించి ప్రామాణిక పుస్తకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. గౌతమ్ పింగ్లే, వెంకటరామారావు రాసిన పుస్తకాలు వాటిని వీలైనంత ప్రామాణికంగా సంక్షిప్తీకరించాయి. మొత్తం తెలంగాణ చరిత్రను సంక్షిప్తీకరించిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పుస్తకాన్ని ఇటీవల తెలుగు అకాడమీ ప్రచురించింది. 


అయితే ఈ ఇంటర్మీడియట్ పుస్తకంతో సహా ప్రైవేట్ పుస్తకాలు, ఈ మధ్య దినపత్రికల్లో వస్తున్న వ్యాసాల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించి బేసిక్ అంశాలు కూడా తప్పులతో వచ్చాయి. వాటివల్ల ఒక పుస్తకంలో ఒక లాగా, మరో పుస్తకంలో మరోలా చదివి విద్యార్థులు గందరగోళ పడకుండాఉండాలని కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.


చరిత్ర మొత్తం ఒక పూర్తి నిడివి గల సినిమా అనుకుంటే అందులో ఒక నిమిషం చరిత్రకు మాత్రమే లిపి/రాత ఆధారాలున్నాయి. లిపి ఆధారాలు లేని చరిత్ర పూర్వయుగాన్ని ఎవరూ రాయడం లేదు. పురావస్తు శాఖ దగ్గర వంద సంవత్సరాల కిందటి నుంచి భద్రపరుస్తున్న వార్షిక నివేదికలు, తవ్వకాల రిపోర్టుల ఆధారంగా ఆ చరిత్రను రాయాలి.


ఎప్పుడో ఏడు దశాబ్దాల కిందట... కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో తవ్వకాలు జరుగకముందు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు గొర్తి వెంకటరావు రాసినట్లుగా ఇప్పటికీ ఆయన రాసినట్లే శాతవాహనులు క్రీ.పూ.271లో అధికారంలోకి వచ్చారని రాస్తున్నారు. ఇది చారిత్రక తప్పిదం. ఇలా రాసినవారెవరూ కనీసం కోటిలింగాల తవ్వకాల రిపోర్టును కూడా చూసి ఉండరు. మరి ప్రసిద్ధి గాంచిన చరిత్రకారిణి రొమిలా థాపర్ మాత్రం కోటిలింగాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని పెద్దబొంకూరు, ధూళికట్ట, మెదక్ జిల్లాలోని కొండాపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల రిపోర్టులను అధ్యయనం చేసి పదమూడేళ్ల కిందట తెలంగాణ/ శాతవాహన చరిత్రను భారతదేశ చరిత్రతో సమన్వయం చేసి శాతవాహనులు క్రీ.పూ.80 ప్రాంతంలో కోటిలింగాలలో అధికారంలోకి వచ్చారని, క్రీ.పూ.50 ప్రాంతం నుంచి శాతకర్ణి అనే రాజు సామ్రాజ్యాన్ని నిర్మించాడని ఎర్లీ ఇండియా అనే పుస్తకంలోని 226వ పుటలో రాసింది.


శాతవాహనుల తరువాత వచ్చిన రాజులు ఇక్ష్వాకులు. వీరు నాగార్జునకొండ చుట్టుపక్కలున్న కృష్ణా-గుంటూరు మండలంలోనే అధికారం నెరిపారని ఇప్పటి వరకు భావించారు. కానీ ఇటీవల నల్గొండ జిల్లాలోని ఫణిగిరిలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బయటపడిన బ్రాహ్మీలిపి శాసనాలు ఇక్ష్వాకులు ఖమ్మం, నల్గొండ జిల్లాలను కూడా పాలించిన తెలంగాణ రాజులని,వారి పాలనా కాలం కూడా ఇంతవరకు భావించినంత తక్కువ కాలం కాదని తెలియజేశాయి. పైగా ఆ తవ్వకాలు క్రీ.శ. ఒకటి నుంచి ఐదవ శతాబ్దాల మధ్య కాలంలో తెలంగాణలో వికసించిన బౌద్ధశిల్ప కళా చాతుర్యాన్ని, తెలంగాణకు రోమన్ దేశంతో గల వాణిజ్య సంబంధాలను కూడా విశదం చేశాయి. వీటన్నింటినీ కొత్త తెలంగాణ చరిత్రకారులు అధ్యయనం చేసి అధ్యాయాలు రాయాలి.


ఇక్ష్వాకుల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చి కృష్ణా నది ఉత్తరాన మొదలుకొని మధ్య భారతదేశంలోని నర్మదా నది వరకు అధికారం నెరిపిన విష్ణుకుండిన రాజుల తొలి నివాసం ఇప్పటి వరకు భావించినట్టు గుంటూరు జిల్లాలోని వినుకొండ కాదు. మన తెలంగాణ చరిత్రకారుడు బి.ఎన్. శాస్త్రి రాసినట్టు మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాదు (అమరావతి) ప్రాంతం- వారి ఇతర రాజధానులు నల్గొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం, రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట. ఇంతవరకు భావించినట్టుగా వీరు తమ రాజ్యాన్ని క్రీ.శ. 624 వరకు పాలించలేదు. ఇటీవల కొత్తగా లభించిన తాండిపూడి తామ్ర శాసనాలు విష్ణుకుండినులను క్రీ. శ. 569లో పృథ్వీ మహారాజు అనే రాజు నిర్మూలించి ఖమ్మం,నల్గొండ, గోదావరి జిల్లాలను క్రీ.శ 617 వరకు పాలించాడని తేల్చాయి.


విష్ణుకుండినుల తర్వాత మూడు ప్రధాన రాజవంశాలు, సుమారు పది స్థానిక రాజవంశాలు తెలంగాణను పరిపాలించాయి. ఈ కాలం ఐదు శతాబ్దాలు. రెండువేల ఒక వంద సంవత్సరాల చరిత్రలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర తీసేయదగింది కాదు. ఐనా సిలబస్‌లో ఈ చరిత్రను ఒకే అధ్యాయంలో పేర్కొన్నారు. కారణం రాష్ట్రస్థాయి చరిత్రను ఈ కాలంలో నిర్మించలేము అనేది. కానీ స్థానిక చరిత్రను రాయడం/చదవడం వల్ల ఆయా స్థానికులు ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు కాబట్టి ఈ యుగ చరిత్రను విస్మరించకూడదు. కనీసం ఈ యుగ సాంస్కృతిక అంశాలను సిలబస్‌లో పేర్కొనడం ముదావహం. ఈ యుగానికి సంబంధించి తెలంగాణ జిల్లాల్లో వందలాది శాసనాలు దొరికాయి. అలాంటివి ఐదు జిల్లాల సంపుటాలుగా కూడా ప్రచురించబడినాయి. వాటిని కూలంకషంగా అధ్యయనం చేసి రాయాలి.


ప్రసిద్ధి గాంచిన కాకతీయ యుగం తర్వాత తెలంగాణను (ఆదిలాబాద్ జిల్లా మినహా) రాచకొండ పద్మనాయక రాజులు పాలించారు. ఈనాటి ఆంధ్రలో వీరి సమకాలికులు రెడ్డి రాజులు. ఇప్పటి వరకు ఈ ఇరువురి యుగానికి రెడ్డి రాజుల యుగం అని పేరు. రెడ్డి రాజులు తెలంగాణను పాలించలేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా 14,15 శతాబ్దాల తెలంగాణ చరిత్రకు నాయక యుగం అని పేరు పెట్టాలి. కాకతీయ యుగానికి పండితారాధ్య చరిత్ర అనే సమకాలీన గ్రంథం ఎలాంటి వివరాలు అందిస్తుందో నాయక యుగానికి సింహాసన ద్వాత్రింశిక మొదలైన గ్రంథాలు అలాంటి వివరాలు అందిస్తాయి. బహమనీ, కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ యుగాల చరిత్రకు సంబంధించి స్టేట్ ఆర్కైవ్స్‌ను, సాలర్‌జంగ్ మ్యూజియంలో ఉన్న పర్షియన్, అరబిక్, ఉర్దూ, ఇంగ్లీష్ రాతప్రతులను కనీసం వాటి ఇంగ్లీష్ అనువాదాలను సంప్రదించి ఆయా అధ్యాయాలు రాయాలి. ప్రొఫెషనల్ చరిత్రకారుల బృందం పై విషయాలను దృష్టిలో పెట్టుకొని రాస్తున్న పుస్తకం తెలుగు అకాడమీ ద్వారా మరికొన్ని రోజుల్లో రానుంది. ఓరియంట్ బ్లాక్‌స్వాన్ పబ్లిషర్స్ ద్వారా ఇంకొక ప్రామాణిక చరిత్ర రానుంది.
జై తెలంగాణ!    జై జై తెలంగాణ!1 కామెంట్‌:

కమనీయం చెప్పారు...కాలక్రమంలో చరిత్రలో కొత్తవిషయాలు బైట పడుతూ ఉంటాయి. వాటిని రికార్డు చేస్తూ ఉండాలి.రెండు రాష్ట్రాలున్నవి కాబట్టి ,వేరువేరు చరిత్రలు రాసుకో వచ్చును.కాని, రెండింటికీ దగ్గరసంబంధం ఉందికాబట్టి,తెలుగు వారందరికీ ఒక common history కూడా రాసుకోవలసిన అవసరం కూడా ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి