వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టి నాలుగేండ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లందిస్తాం. అలా చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగం.. ఇదీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో చేసిన ప్రకటన. ఎంతో ఆత్మవిశ్వాసంతో.. సాహసంతో సీఎం తనకు తాను విధించుకున్న ఈ సవాలును నిజం చేసేందుకు అధికార యత్రాంగం నడుం కట్టింది.
-వాటర్ గ్రిడ్‌కు రైట్ ఆఫ్ వే!
-గుజరాత్ నమూనాలో ప్రత్యేక చట్టం
-న్యాయవివాదాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాటు
-రక్షిత మంచినీరు రాజ్యాంగ బాధ్యతగా పరిగణన
-పైపులైన్లు, రిజర్వాయర్లకు భూమి తప్పనిసరి
-గుజరాత్ నమూనాలో ప్రత్యేక చట్టం
-న్యాయవివాదాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాటు
-రక్షిత మంచినీరు రాజ్యాంగ బాధ్యతగా పరిగణన
-పైపులైన్లు, రిజర్వాయర్లకు భూమి తప్పనిసరి
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు గుజరాత్ నమూనాను అనుసరించాలని భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడానికి రైట్ ఆఫ్ వే చట్టం అమలు చేసింది. అదే నమూనాను ఇక్కడా అనుసరించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రధాన సమస్య భూ సేకరణే..
ఇవాళ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా భూ సేకరణ పెద్ద సమస్యగా ఉంది. ఎవరికి ఏ చిన్న నష్టం కలిగిందని భావించినా కోర్టులను ఆశ్రయించడం, స్టే తీసుకోవడం పరిపాటిగా మారింది. దాంతో అనేక ప్రాజెక్టులు ఏండ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నిలిచిపోతున్నాయి. ఆ పరిస్థితి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ఎదురు కాకుండా భూ సేకరణ జరుపాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
దీని కోసం గుజరాత్ ప్రభుత్వం అనుసరించిన రైట్ ఆఫ్ వే పద్ధతినే స్వీకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు భూసేకరణకు ప్రత్యేక చట్టం తెస్తారు. దీనికింద వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రజా ప్రయోజనాలు, తక్షణ అవసరాలు, అత్యవసరాల కింద ప్రకటిస్తారు. ప్రజలకు రాజ్యాంగం ప్రకారం రక్షిత మంచినీరు అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ క్రమంలో వాటర్ గ్రిడ్‌ను అదే కోణంలో పరిగణిస్తే ప్రాజెక్టుకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండదు.
గుజరాత్‌లో ప్రత్యేక చట్టం..
వాటర్ గ్రిడ్ భూ సేకరణలో సమస్యలు తలెత్తకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. తాగునీటి పైపులైన్లు 1.5 మీటర్ల లోతున వేసుకోవడానికి వీలుగా తీసుకొచ్చిన ఆ చట్టం వల్ల ప్రాజెక్టు అమలులో ఇబ్బందులు తొలిగిపోయాయి. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేశారు. భూ సేకరణలో ఆటంకాలు లేకుండా చేసుకోవడం వల్లే ప్రాజెక్టు సక్సెస్ అయ్యిందని అధికారులు చెబుతున్నారు.
గుజరాత్‌లో వాటర్ గ్రిడ్ కోసం 2684 కి.మీ. మేరకు బల్క్ పైప్‌లైన్లు, 1.20 లక్షల కి.మీ. డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు, 23693 స్టోరేజ్ హైడ్రాలిక్ నిర్మాణాలను చేపట్టారు. 181 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రతి రోజూ 290 కోట్ల లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తున్నారు. 132 పట్టణాలకు, 11545 గ్రామాలకు నీటి సరఫరా అవుతున్న ఈ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు గత అక్టోబర్ 18, 19 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించారు. అందుకే అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయడం ద్వారానే ప్రజలకిచ్చిన హామీని నాలుగున్నరేండ్లల్లో పూర్తి చేయొచ్చునని అంచనా వేస్తున్నారు.
గుజరాత్ భూ సేకరణకు అనుసరించిన విధానం
-రైట్ ఆఫ్ వే విధానాన్ని అనుసరించారు.
-భూములకు వాస్తవ మార్కెట్ ధర లేదా భూమికి భూమి ఇచ్చారు.
-గుజరాత్ వాటర్ సప్లయి అండ్ సీవరేజ్ బోర్డు భూ సేకరణ జరిపింది.
-బాధిత రైతులకు ఏడాది పాటు వచ్చే కూలీని ఏకమొత్తంగా చెల్లించారు.
-500 చ.మీ.లకు రూ.20 వేల వరకు చెల్లించారు.
-పంటలు కోల్పోకుండా నాలుగు నెలలు ముందు నోటీసులు ఇచ్చారు.
-నిర్మాణాలకూ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ లెక్కల ప్రకారం పరిహారం చెల్లించారు.
-సింహభాగం వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ముగించారు.
-చట్టం ప్రకారం ఎవరైనా ఈ ప్రాజెక్టుకు భూమి ఇవ్వడం తప్పనిసరి చేశారు.
ఎక్కడెక్కడినుంచి నీరు..?
కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి ఎక్కడ, ఏ పాయింట్ నుంచి ఎంత నీటిని తీసుకోవచ్చునన్న దానిపై అధ్యయనం చేశారు. ప్రధానంగా కృష్ణా నది నుంచి జూరాల రిజర్వాయర్, కల్వకుర్తి ఎల్‌ఐఎస్ పాయింట్, శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జునసాగర్ రిజర్వాయర్, పాలేరు దగ్గర నాగార్జున్‌సాగర్ ఎడమ కాల్వ(పాక్షికం)ల నుంచి నీటిని తీసుకోవచ్చు. అలాగే గోదావరి నది నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్, ఎల్లంపల్లి/ప్రాణహిత, దేవాదుల ఎల్‌ఐఎస్, దుమ్ముగూడెం ఎల్‌ఐఎస్‌ల నుంచి తీసుకోవచ్చు. మంజీరా నది నుంచి సింగూరు, నిజాంసాగర్‌ల ద్వారా మంచినీటి సరఫరాకు అవసరమైన నీటిని పొందుతారు.
జనాభాకు తగ్గట్లుగా మంచినీటిని సరఫరా చేసేందుకు మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాంతాలను బట్టి గ్రావిటీ ద్వారా ఎంఎస్ పైపులైన్ల ద్వారా చేయాలని నిర్ణయించారు. అవసరమైన చోట పంపింగ్ విధానానికి రూపకల్పన చేస్తారు. మెయిన్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్ నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాలకు సరఫరా చేస్తారు. అటు నుంచి గ్రామ స్థాయి వరకు చేర్చాల్సి ఉంటుంది. దీని కోసం పక్కా నిర్వహణ వ్యవస్థలను రూపొందించాలి.
అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్, డిస్ట్రిక్ట్ గ్రిడ్, మండల్ గ్రిడ్‌లను మెయిన్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపు హౌజ్‌లు, విద్యుదీకరణ సదుపాయాలు అనివార్యం. మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి, పైపులైన్ల ఏర్పాటుకు కూడా స్థల సేకరణ జరుపాల్సి ఉంటుంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి