గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, డిసెంబర్ 25, 2014

ఉమ్మడి విద్యామండలిలో...ఆంధ్రా జులుం...!?


క్రైస్తవ సోదరులకు
క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు!

ఉన్నత విద్యామండలిలో ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో తెలంగాణ ఉద్యోగులపై ఆంధ్ర అధికారులు జులుం ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్‌ఈ)కి సహకరిస్తున్నారన్న సాకుతో ఉద్యోగుల జీతాలను నిలిపేస్తున్నారు. ఉమ్మడి నిధుల్లో తెలంగాణకు సంబంధించిన 48 శాతం నిధులున్నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
21వ శతాబ్దపు గురుకులానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సత్యనారాయణకు నవంబర్ నెల జీతం ఇంకా ఇవ్వలేదు. ఉమ్మడి విద్యామండలి జీతం తీసుకొంటూ.. తెలంగాణ విద్యామండలికి పనిచేస్తున్నారని సాకులు చూపిస్తున్నారు. ఆయన పేరును ఉద్యోగుల రిజిస్టర్ నుంచి తొలగించారు. బయోమెట్రిక్ యంత్రం నుంచి తన వేలిముద్రలను కూడా తొలగించినట్లు సత్యనారాయణ వెల్లడించారు. గురుకులానికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఆయన, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఆయన 2004లో టీఆర్‌ఎస్ తరఫున ఎంపీగానూ పోటీచేశారు. 2007లో 21వ శతాబ్దపు గురుకులానికి కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత...
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటైనా... దానికి సిబ్బంది, విధులు, నిధుల విభజన జరుగలేదు. దీంతో టీఎస్సీహెచ్‌ఈకి సత్యనారాయణ...తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

అటు విభజన పూర్తికాకపోవడంతో ఉమ్మడి ఉన్నత విద్యామండలి తరఫున సమాచారహక్కు చట్టం, మానవ వనరుల అభివృద్ధి విభాగం వంటి కార్యకలాపాలు కూడా సత్యనారాయణ పరిధిలోనే కొనసాగుతున్నాయి. 


ఇప్పుడు దాన్నే సాకుగా చూపిస్తూ ఆయన నవంబర్ జీతాన్ని నిలిపివేసి ఆయనను మానసికంగా ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఉమ్మడి విద్యామండలిలో పనిచేస్తున్న తెలంగాణ సిబ్బంది తెలంగాణ విద్యామండలి కోసం పని చేయవద్దంటూ ఏపీ అధికారులు హుకుం జారీచేశారు.

ఒకవేళ అలాచేస్తే రెగ్యులర్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బంది జీతాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పందించారు. రెండు, మూడు రోజుల్లో జీతాల చెల్లింపుపై సానుకూల నిర్ణయం రాకపోతే పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75 ప్రకారం చర్యలు తీసుకొంటామని టీఎస్సీహెచ్‌ఈ చైర్మన్ పాపిరెడ్డి, వైస్‌చైర్మన్లు వెంకటాచలం, మల్లేశం హెచ్చరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, డిసెంబర్ 24, 2014

ఏపీఎండీసీ నిధుల పంపకానికి...ఆంధ్రా సర్కారు...నో...

-నిధుల సర్దుబాటుకు ససేమిరా
-రుణమిస్తూ గట్టెక్కించే యత్నం
-అడ్డదారిలో ఏపీఎండీసీకి 15 కోట్లు విడుదల
ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)లో పుష్కలంగా ఉన్న నిధులను జనాభా ప్రాతిపదికన పంచడానికి మనసొప్పని ఆంధ్రా ఆధిపత్యం వైపరీత్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని నిబంధనలను తుంగలో తొక్కి, తెలంగాణకు రావాల్సిన వాటాను పంచకుండా ఏవో సాకుల్ని ఏపీ ప్రభుత్వం చూపుతున్నది. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థల నిధుల పంపకాల్లో విభిన్నంగా వ్యవహరిస్తున్నది.
ఏపీఎండీసీలో రూ.700 కోట్లకు పైగా నిధులు బ్యాంకు ఉమ్మడి ఖాతాల్లో నిల్వ ఉన్నాయి. 
వాటిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాలని చట్టం చెబుతున్నది. అయినా డీమెర్జర్ ప్లాన్‌ను ఆమోదించకుండా, నిపుణుల కమిటీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆరు నెలలు పూర్తయినా నిధులను మాత్రం ఇవ్వకుండా తప్పించుకునేందుకు కుట్రలు సాగిస్తున్నారు.
జీరో బ్యాలెన్స్‌తోనే తెలంగాణ ఉద్యోగుల విభజన చేపట్టడంతో, ఆర్థిక ఇబ్బందుల మధ్య తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్ర ఖాతాల్లోని నిధులను దొడ్డిదారిన డ్రా చేస్తున్న ఉదంతాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంతో ఆంధ్రా సర్కారు రూట్ మార్చింది. 

అడ్డదారుల్లో నిధులను వినియోగించుకోవడం సాధ్యం కాకపోవడంతో జీఓ నం.400, తేదీ.17-12-2014 ద్వారా తాజాగా ఏపీఎండీసీకి ఆంధ్రా సర్కారు రూ.16 కోట్లు రుణంగా ఇచ్చింది.
ఓ సంస్థకు ప్రభుత్వమే రుణమిచ్చిన వైనం ఎక్కడా జరగలేదని, ఇదే తొలిసారిగా అధికారులు చెప్పుకుంటున్నారు.
తమ ప్రాంతం నుంచే ఆదాయం అత్యధికంగా వస్తున్నదనే ఏకైక కారణాన్ని తెర మీదికి తీసుకొస్తూ, ఉమ్మడి ఖాతాల్లోని నిధులను జనాభా ప్రాతిపదికన పంచుకోవడానికి మాత్రం ముందుకు రాకపోవడం గమనార్హం.

19 ప్రభుత్వ రంగ సంస్థల్లో
ఒకటీ, రెండు సంస్థలకు మాత్రమే ఆంధ్రా ప్రాంతం నుంచి ఆదాయం ఎక్కువగా వస్తున్నదని,
మిగిలిన అన్ని సంస్థలకూ తెలంగాణ పది జిల్లాల నుంచే 70 శాతానికి పైగా నిధులు సమకూరుతున్నాయని
అధికారులు పేర్కొన్నారు.

అన్ని సంస్థల నుంచి జనాభా ప్రాతిపదికన 5 శాతం వాటా ఆంధ్రాకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నష్టపోతున్నది.
కానీ ఏపీఎండీసీలో మాత్రం జనాభా ప్రాతిపదికన కాకుండా లొకేషన్ పద్ధతిన పంచాలని కోరుకోవడం అనైతిక చర్య అని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఇకనైనా చట్ట ప్రకారం రూపొందిన ఏపీఎండీసీ డీమెర్జర్ ప్లాన్‌ను ఆమోదించేందుకు ప్రయత్నించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్యోగులు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, డిసెంబర్ 23, 2014

ముంపు తెలంగాణలో.. పరిహారం ఆంధ్రలో...???!!!

-పులిచింతలలో మునిగిన మన అటవీ భూములపై సీమాంధ్ర కుట్ర
-నల్లగొండ జిల్లాలో ముంపునకు గురైన 375 హెక్టార్లు
-పరిహారంగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూమి కేటాయింపు
పులిచింతల ప్రాజెక్టు.. కృష్ణానదిపై నల్లగొండ-గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మితమైన జలాశయం. రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో 13,915 ఎకరాలు తనలో కలిపేసుకున్న ఈ ప్రాజెక్టు మన రాష్ర్టానికి ఒరగబెడుతున్న ప్రయోజనం శూన్యం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం 13 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో దీన్ని నిర్మించారు సీమాంధ్ర పాలకులు. 1988లో ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి శంకుస్థాపన చేసుకుని, 2004లో వైఎస్ చేతులతో మరోసారి శిలాఫలకం వేయించుకుంది. 

pond


2006లో అన్ని అనుమతులూ తెచ్చుకుని కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చుకుంది. 2013 డిసెంబర్ 7న అసంపూర్తి నిర్మాణాన్నే ఆగమేఘాల మీద ప్రారంభించారు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. రూ.1850 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురైన నల్లగొండ జిల్లాకు ఉపయోగం లేదు.

నిర్మాణం డిజైన్‌నే తమకు అనుకూలంగా మలుచుకున్న నాటి పాలకుల దుర్బుద్ధి ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పరిహారం విషయంలో ఇక్కడి ప్రాంతంపై చిన్నచూపు చూడడమే కాదు.. కోల్పోయిన అటవీ భూములకు పరిహారంగాను సీమాంధ్రలో భూములు కేటాయించడం వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలను బలపరుస్తున్నది.

-తెలంగాణకు 375 హెక్టార్ల అటవీ భూమి నష్టం
పులిచింతల ప్రాజెక్టులో నల్లగొండ జిల్లాలోని మేళ్లచెర్వు, మఠంపల్లి, నేరేడుచర్ల మండలాల్లో 13,915 హెక్టార్ల భూమి ముంపునకు గురైంది. మూడు మండలాల్లో 13 గ్రామాలు నిర్వాసిత పల్లెలుగా మారాయి. ఈ ముంపునకు గురైన భూముల్లో జిల్లాలోని 375.27 హెక్టార్ల అటవీ భూములు కూడా ఉన్నాయి. గుంటూరు జిల్లా వైపు సైతం 13 గ్రామాలను ముంపునకు గురి చేసిన ఈ జలాశయం బ్యాక్ వాటర్‌లో అక్కడ కూడా భారీగానే భూములు నీట మునిగాయి. మన రాష్ట్రం వైపు 375 హెక్టార్ల అటవీ భూమితోపాటు ఏపీలోని గుంటూరు జిల్లాలో కూడా 793 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురైంది.

ఎక్కడైనా అటవీ భూములు ప్రాజెక్టుల్లో నీట మునిగినప్పుడు పరిహారంగా డబ్బులు కాకుండా తిరిగి భూమినే ఇవ్వాలని అటవీశాఖ కోరుతున్నది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితుల్లోనే.. నాటి సమైక్య ప్రభుత్వం పరిహారంగా మొత్తం 1168.27 హెక్టార్లకు బదులు 1170 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు అప్పగించింది. అప్పగించిన భూమి మొత్తం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగపాయ గ్రామంలో 587, 588 సర్వే నంబర్లలో ఉంది. రాష్ట్ర విభజన జరగక ముందు జరిగిన ఈ కేటాయింపుతో తెలంగాణ 375 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయినట్లయ్యింది.

అటవీశాఖకు పరిహార భూ కేటాయింపుల కోసం పులిచింతల ప్రాజెక్టు వ్యయం నుంచి కోట్లాది రూపాయలను నాటి ప్రభుత్వానికి చెల్లించి మరీ 1170 హెక్టార్ల భూమి కొనుగోలు చేశారు. నాటి పాలకులు, అధికారులు కుమ్మక్కై కుట్ర పూరితంగానే ప్రకాశం జిల్లాలో భూ కేటాయింపు చేసినట్లు తెలుస్తున్నది. అనవసరంగా మన రాష్ట్రంలోని వ్యవసాయ భూమిని అటవీశాఖకు ఇవ్వడం ఎందుకన్న ఆలోచనతో ఇక్కడి అధికారులు నాడు మిన్నకుండి పోయినట్లు సమాచారం.

నాటి అలసత్వం ఫలితం.. నేడు తెలంగాణ రాష్ర్టానికి చెందిన 375 హెక్టార్ల అటవీ భూమి పక్క రాష్ట్రం లెక్కల్లోకి చేరిపోయింది. ఉపయోగం అంతా తమ ప్రాంతానికే ఉండడంతో ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని నిర్వాసితుల బాగోగులన్నీ చూసుకుంటున్న ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే.. ప్రకాశం జిల్లాలో కేటాయించిన భూమిలో 375 హెక్టార్లను మన రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదికి బదిలీ చేసుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, డిసెంబర్ 08, 2014

ఆప్కోలో తెలంగాణ ఉద్యోగులపై దాడిచేసినా.. ఆంధ్రా ఉద్యోగులపై చర్యలు శూన్యం!!!

-తెలంగాణ అధికారిపై చేయిచేసుకున్న వ్యక్తికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన ఆంధ్రా అధికారులు

ఆప్కో లో తెలంగాణ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులపై దాడులు జరిగినా ఆప్కోలోని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పైగా దాడుల జరిపిన ఆంధ్రా సిబ్బందికే వత్తాసు పలుకుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కైరంకొండ యాదగిరి అనంతపురంలో డిస్ట్రిక్ట్ట్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. బదిలీపై రిలీవ్ కావడానికి గత సెప్టెంబర్ 10న అనంతపురం వెళ్లిన ఆయనపై ఆప్కో సేల్స్ మేనేజర్ ప్రకాశ్, మరో ఉద్యోగి దాడికి పాల్పడ్డారు. దీంతో భయాందోళనకు గురైన యాదగిరికి గుండెపోటు వచ్చింది. వెంటనే దవాఖానలో చేర్చడంవల్ల ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఆయనకు సికింద్రాబాద్ డీఎంవోగా పోస్టింగ్ ఇచ్చారు. 
దాడికి పాల్పడిన ప్రకాశ్‌ను సస్పెండ్‌చేసి ఆ తర్వాత నామమాత్రపు దర్యాప్తు జరిపారు. చివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆంధ్రా ఉన్నతాధికారులు పోస్టింగ్ ఇచ్చారు. ఆప్కో అనంతపురం డైరెక్టర్ శ్రీనివాసులు ప్రోద్బలంతోనే అతనికి క్లీన్‌చిట్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడికి పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై రాష్ట్ర ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆప్కోను వెంటనే విభజించి, సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రాష్ర్టానికి రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, డిసెంబర్ 07, 2014

చిక్కులు లేని భూసేకరణ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం!!!

water


వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టి నాలుగేండ్లలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లందిస్తాం. అలా చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగం.. ఇదీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో చేసిన ప్రకటన. ఎంతో ఆత్మవిశ్వాసంతో.. సాహసంతో సీఎం తనకు తాను విధించుకున్న ఈ సవాలును నిజం చేసేందుకు అధికార యత్రాంగం నడుం కట్టింది.
-వాటర్ గ్రిడ్‌కు రైట్ ఆఫ్ వే!
-గుజరాత్ నమూనాలో ప్రత్యేక చట్టం
-న్యాయవివాదాలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాటు
-రక్షిత మంచినీరు రాజ్యాంగ బాధ్యతగా పరిగణన
-పైపులైన్లు, రిజర్వాయర్లకు భూమి తప్పనిసరి

వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకు గుజరాత్ నమూనాను అనుసరించాలని భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడానికి రైట్ ఆఫ్ వే చట్టం అమలు చేసింది. అదే నమూనాను ఇక్కడా అనుసరించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ప్రధాన సమస్య భూ సేకరణే..


ఇవాళ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా భూ సేకరణ పెద్ద సమస్యగా ఉంది. ఎవరికి ఏ చిన్న నష్టం కలిగిందని భావించినా కోర్టులను ఆశ్రయించడం, స్టే తీసుకోవడం పరిపాటిగా మారింది. దాంతో అనేక ప్రాజెక్టులు ఏండ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నిలిచిపోతున్నాయి. ఆ పరిస్థితి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ఎదురు కాకుండా భూ సేకరణ జరుపాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

దీని కోసం గుజరాత్ ప్రభుత్వం అనుసరించిన రైట్ ఆఫ్ వే పద్ధతినే స్వీకరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు భూసేకరణకు ప్రత్యేక చట్టం తెస్తారు. దీనికింద వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రజా ప్రయోజనాలు, తక్షణ అవసరాలు, అత్యవసరాల కింద ప్రకటిస్తారు. ప్రజలకు రాజ్యాంగం ప్రకారం రక్షిత మంచినీరు అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ క్రమంలో వాటర్ గ్రిడ్‌ను అదే కోణంలో పరిగణిస్తే ప్రాజెక్టుకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండదు.

గుజరాత్‌లో ప్రత్యేక చట్టం..


వాటర్ గ్రిడ్ భూ సేకరణలో సమస్యలు తలెత్తకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. తాగునీటి పైపులైన్లు 1.5 మీటర్ల లోతున వేసుకోవడానికి వీలుగా తీసుకొచ్చిన ఆ చట్టం వల్ల ప్రాజెక్టు అమలులో ఇబ్బందులు తొలిగిపోయాయి. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేశారు. భూ సేకరణలో ఆటంకాలు లేకుండా చేసుకోవడం వల్లే ప్రాజెక్టు సక్సెస్ అయ్యిందని అధికారులు చెబుతున్నారు.

గుజరాత్‌లో వాటర్ గ్రిడ్ కోసం 2684 కి.మీ. మేరకు బల్క్ పైప్‌లైన్లు, 1.20 లక్షల కి.మీ. డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు, 23693 స్టోరేజ్ హైడ్రాలిక్ నిర్మాణాలను చేపట్టారు. 181 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రతి రోజూ 290 కోట్ల లీటర్ల నీటిని ప్రజలకు అందిస్తున్నారు. 132 పట్టణాలకు, 11545 గ్రామాలకు నీటి సరఫరా అవుతున్న ఈ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు గత అక్టోబర్ 18, 19 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించారు. అందుకే అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయడం ద్వారానే ప్రజలకిచ్చిన హామీని నాలుగున్నరేండ్లల్లో పూర్తి చేయొచ్చునని అంచనా వేస్తున్నారు.

గుజరాత్ భూ సేకరణకు అనుసరించిన విధానం


-రైట్ ఆఫ్ వే విధానాన్ని అనుసరించారు.
-భూములకు వాస్తవ మార్కెట్ ధర లేదా భూమికి భూమి ఇచ్చారు.
-గుజరాత్ వాటర్ సప్లయి అండ్ సీవరేజ్ బోర్డు భూ సేకరణ జరిపింది.
-బాధిత రైతులకు ఏడాది పాటు వచ్చే కూలీని ఏకమొత్తంగా చెల్లించారు.
-500 చ.మీ.లకు రూ.20 వేల వరకు చెల్లించారు.
-పంటలు కోల్పోకుండా నాలుగు నెలలు ముందు నోటీసులు ఇచ్చారు.
-నిర్మాణాలకూ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ లెక్కల ప్రకారం పరిహారం చెల్లించారు.
-సింహభాగం వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ముగించారు.
-చట్టం ప్రకారం ఎవరైనా ఈ ప్రాజెక్టుకు భూమి ఇవ్వడం తప్పనిసరి చేశారు.

ఎక్కడెక్కడినుంచి నీరు..?


కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి ఎక్కడ, ఏ పాయింట్ నుంచి ఎంత నీటిని తీసుకోవచ్చునన్న దానిపై అధ్యయనం చేశారు. ప్రధానంగా కృష్ణా నది నుంచి జూరాల రిజర్వాయర్, కల్వకుర్తి ఎల్‌ఐఎస్ పాయింట్, శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జునసాగర్ రిజర్వాయర్, పాలేరు దగ్గర నాగార్జున్‌సాగర్ ఎడమ కాల్వ(పాక్షికం)ల నుంచి నీటిని తీసుకోవచ్చు. అలాగే గోదావరి నది నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్, ఎల్లంపల్లి/ప్రాణహిత, దేవాదుల ఎల్‌ఐఎస్, దుమ్ముగూడెం ఎల్‌ఐఎస్‌ల నుంచి తీసుకోవచ్చు. మంజీరా నది నుంచి సింగూరు, నిజాంసాగర్‌ల ద్వారా మంచినీటి సరఫరాకు అవసరమైన నీటిని పొందుతారు.

జనాభాకు తగ్గట్లుగా మంచినీటిని సరఫరా చేసేందుకు మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాంతాలను బట్టి గ్రావిటీ ద్వారా ఎంఎస్ పైపులైన్ల ద్వారా చేయాలని నిర్ణయించారు. అవసరమైన చోట పంపింగ్ విధానానికి రూపకల్పన చేస్తారు. మెయిన్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్ నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాలకు సరఫరా చేస్తారు. అటు నుంచి గ్రామ స్థాయి వరకు చేర్చాల్సి ఉంటుంది. దీని కోసం పక్కా నిర్వహణ వ్యవస్థలను రూపొందించాలి.

అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌మిషన్ గ్రిడ్, డిస్ట్రిక్ట్ గ్రిడ్, మండల్ గ్రిడ్‌లను మెయిన్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపు హౌజ్‌లు, విద్యుదీకరణ సదుపాయాలు అనివార్యం. మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి, పైపులైన్ల ఏర్పాటుకు కూడా స్థల సేకరణ జరుపాల్సి ఉంటుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, డిసెంబర్ 03, 2014

కంచె భూములు ఖ‌తం చేసిన సీమాంధ్ర అక్రమార్కులు!!!

pakala


రాజధాని శివారులో ఎక్కడ సర్కారు భూమి కనిపించినా ఆక్రమించుకున్న సీమాంధ్రులు రాజేంద్రనగర్ మండలం పుప్పాల్‌గూడలోని సర్కారు కంచె భూములతో ఆటలాడుకున్నారు. కంచె భూమిగా రికార్డుల్లో ఉన్నా దొంగ సర్వే నంబర్లతో కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేశారు. తమది కాని భూమిని అనేక నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా కోర్టు రద్దు చేసిన తర్వాత కూడా ఆ దందా యథేచ్ఛగా కొనసాగించారు. అంతటితో ఆగకుండా సదరు భూమినే బ్యాంకులో హామీగా పెట్టి రుణాలు తీసుకుని జెండా ఎత్తేశారు.
-పుప్పాల్‌గూడలో సీమాంధ్రుల దందా
-ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు..
-కోర్టు రద్దు చేసినా బేఖాతర్
-కుదువబెట్టి విదేశీ బ్యాంకుకు టోకరా

ఈ పకడ్బందీ వ్యవహారంలో అధికారులంతా శక్తివంచనలేకుండా సహకరించారు. సీమాంధ్ర బాబులు అడ్డదారుల్లో కోటీశ్వరులైతే.. బ్యాంకులు అంతే స్థాయిలో దివాలా తీశాయి. కోట్ల రూపాయల విలువైన భూములు లిటిగేషన్లలో పడ్డాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని పుప్పాల్‌గూడ రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 452లో 190 ఎకరాల ప్రభుత్వ భూమి కథ ఇది. సేత్వారు రికార్డుల్లో ఈ భూమి 452/1 కింద 178 ఎకరాల 2 గుంటలు, 452/2 కింద మరో 15 ఎకరాల 37 గుంటల భూమి సర్కారు కంచె భూమిగా నమోదైఉంది.

ఈ ప్రభుత్వ భూమిమీద కన్నేసిన సీమాంధ్రబాబులు ఇక్కడ సర్వే నంబర్‌కు బై నంబర్లు ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని రకరకాల రికార్డులు సృష్టించారు. ఈ సర్వే నంబర్‌లోని 452/2 కింద ఉన్న 15 ఎకరాల 37 గుంటల భూమిని కాజేశారు. ఈ వ్యవహారంలో లేని భూమి ఉన్నట్లుగా, ఉన్న భూమిని లేనట్లుగా కనికట్టు చేశారు. వాస్తవానికి 452 సర్వే నంబర్‌ను రెండు భాగాలుగా 453/1, 452/2గా మాత్రమే రెవెన్యూశాఖ రికార్డుల్లో బైఫర్‌కేషన్ చేసింది.

నాటి సేత్వారురికార్డుల్లో కూడా ఇలాగే వివరాలు నమోదు చేశారు. ఈ భూమిని కాజేసిన సీమాంధ్ర బాబులు నంబర్‌ను రెండు భాగాలుగా 453/1, 452/2గా మాత్రమే రెవెన్యూశాఖ రికార్డుల్లో బైఫర్‌కేషన్ చేసింది. నాటి సేత్వారు రికార్డుల్లో కూడా ఇలాగే వివరాలు నమోదు చేశారు. ఈ భూమిని కాజేసిన సీమాంధ్ర బాబులు ఈ 452/2 సర్వే నంబర్‌లోని 15.37 గుంటల భూమిని 452/3 అని కొత్త సర్వే నంబర్ సృష్టించి అనేక రకాలుగా రిజిస్ట్రేషన్లు చేశారు. 1997 నుంచి మొదలైన ఈ రిజిస్ట్రేషన్లపర్వం 2009వరకు నిరాటంకంగా కొనసాగింది. 452/3పీ అనే కొత్త నంబరు పుట్టించి ఈ భూమిని గజాల చొప్పున రిజిస్ట్రేషన్లు చేశారు.

ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2000లో డాక్యుమెంట్ నంబర్ 7090/2000 పేరుతో సర్వే నంబర్ 452/3 పేరున 15 ఎకరాల 37 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసే వరకు వెళ్లింది. ఇదిలా ఉంటే ఈ భూమి పాత రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో స్థానిక దళితుల స్వాధీనంలో ఉంది. దళితులు ఈ భూమికి శిస్తుకూడా చెల్లిస్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న భూమి పరాధీనం అవుతుందని గమనించిన దళితులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం కొత్త రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. ఈ మేరకు క్యాన్సలేషన్ డీడ్ 2004 జనవరి 22వ తేదీన రిజిస్టర్ అయింది.

కొత్త కుట్రలతో..ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు


భూమి రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో కొద్ది రోజులు గప్‌చుప్‌గా ఉన్న బడాబాబులు ఆ తర్వాత మళ్లీ తమ కార్యకలాపాలు ప్రారంభించారు. 452/3,452/2 అంటూ మళ్లీ రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ భూమికి రిజిస్ట్రేషన్స్ రద్దు అయిన విషయం వెబ్‌సైట్లో కూడా పొందు పరిచారు. అయినా అధికారులు మళ్లీ రిజిస్ట్రేషన్లు ఎలా కొనసాగించారన్నది ఎవరికీ అర్థంకాని చిదంబర రహస్యం. 2009 వరకు ఈ భూమిపై రిజిస్ట్రేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక భూమిని రిజిస్టర్ చేసే ముందు సబ్‌రిజిస్ట్రార్లు లింక్ డాక్యుమెంట్లను, ఈ భూమి యాజమాన్యాన్ని ధ్రువీకరించే డాక్యుమెంట్ల ఫ్లోను పరిశీలించాలి. ఆ తరువాతే రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ అధికారులు దీన్ని పాటించలేదు. ఇలా ఈ భూమిపై మరో ఐదు రిజిస్ట్రేషన్లు జరిగాయి.

బ్యాంకులకు బురిడీ..


ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఈ దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఆనోటా ఈనోటా పొక్కుతుండడంతో ఇలా కాదనుకుని ఈసారి బ్యాంకుల మీద పడ్డారు. ఇందుకోసం లేని కంపెనీలను సృష్టించారు. కర్నూలు అడ్రసుతో రిజిస్టర్ అయిన కాకతీయ ల్యాండ్‌సేకప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 2007లో తెరపైకి తీసుకు వచ్చారు. 2000 సంవత్సరంలో కోర్టు ఏ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిందో అదే డాక్యుమెంటును హామీగా పెట్టి ఐడీబీఐ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. 2000 తరువాత తాము అక్రమ పద్ధతుల్లో రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్లను కూడా ఈ అవగాహన ఒప్పందంలో చేర్చారు.

ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లలో ఉన్న వ్యక్తులు వేరు.. అవగాహన కుదుర్చుకున్న వారూ వేరు. అయినా ఈ డాక్యుమెంట్లతో ఐడీబీఐ బ్యాంకుకు చెందిన సెక్యూరిటీ ట్రస్ట్ ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ లిమిటెడ్‌తో అప్పటి వరకు సీన్‌లో లేని పీవీ రమణారెడ్డి అనే వ్యక్తికి అవగాహన ఒప్పదం డాక్యుమెంటును రిజిస్టర్ చేశారు. ఇక ఈ అవగాహన ఒప్పందం డాక్యుమెంట్లను కుదువబెట్టి ఐడీబీఐనుంచి 13,400 వేల డాలర్ల(రూ.60 కోట్లు)కు గ్యారెంటీ తీసుకున్నారు. ఈ బ్యాంకు గ్యారెంటీని ముంబైలోని విదేశీ బ్యాంకు అయిన డ్రాయిష్ బ్యాంకు బ్రాంచ్‌లో కుదువబెట్టి అక్కడినుంచి ఆ మొత్తాన్ని వివిధ రూపాలలో కాజేశారు. ఇప్పుడు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చిన ఐడీబీఐ చిక్కుల్లో పడింది.

ఇలా హైదరాబాద్‌లో ప్రభుత్వ భూమితో విదేశీ బ్యాంకులకూ కన్నంవేశారు. తీసుకున్న ఈ రుణాన్ని ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సదరు బ్యాంకు అధికారులు ఏవిధంగా రుణ బకాయిని వసూలు చేసుకోవాలో అర్థంకాక సతమతమవుతున్నట్లు తెలిసింది. కొసమెరుపు ఏమిటంటే 2007 సంవత్సరంలో ఇలా బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాత కూడా ఈ ప్రబుద్ధులు నకిలీ పత్రాలతో ఈ భూమిమీద మరో రెండు రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఇపుడు అంతా టోకున లబోదిబోమంటున్నారు.

ఇది వివాదాస్పద భూమి: రాజేంద్రనగర్ ఆర్డీవో సురేశ్‌బాబు


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండంలోని పుప్పాల్‌గూడ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్452/2 వివాదాస్పద భూమిగా 2010 నుంచి రికార్డులో ఉంది. ఈ మేరకు 28-05-2010లోనే అప్పటి జాయింట్ కలెక్టర్ ఇది వివాదాస్పద భూమిగా ఆదేశాలు ఇస్తూ నమోదు చేయించారు. దీనిపై వివాదాలుంటే సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు లేవు. వాస్తవానికి ఈ భూమి అసల్ సేత్వారి రికార్డులో కంచె సర్కారీ అని రాసి ఉంది.

1950లో దేవరకొండ సాయన్న, వెంకయ్యలపేర్ల మీద పట్టా అయినట్లుగా రికార్డులో ఉంది. అయితే దీని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి 1954-55 కాస్ర పహణి, 1955-56 చేపాలా పహణిలు అందుబాటులో లేవు. ఈ భూమిపై అనేక లావాదేవీలు జరిగినట్లుగా రికార్డులో ఉంది. గతంలో ఈ సర్వే నంబర్ పేరు తప్పు పడింది. దీనిని ఆ తరువాత కరెక్టు చేశారు. ప్రస్తుతం ఈ భూమి ఖాళీగా ఉంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

"చంద్రబాబు ప‌చ్చి మోస‌కారి" -మంత్రి జగదీశ్ రెడ్డి

chandrababu


విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన 54 శాతం విద్యుత్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఇవ్వడం లేదు. ఏపీలో మాత్రం 24 గంటల కరెంటు ఇస్తున్నాడు. ఇంత పచ్చిగా ఒక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న బాబు తీరుపై జనంలో అలజడి మొదలైంది. మోసాలకు త్వరలో ప్రతిఫలం అనుభవించక తప్పదు అని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం నల్లగొండ జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

-ఏపీ పాలన పక్కనపెట్టి బాబు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు
-సీమాంధ్ర మీడియాది పక్షపాత ధోరణి: మంత్రి జగదీశ్‌రెడ్డి
ఎలాంటి హామీలు నెరవేర్చని చంద్రబాబు, అన్ని పనులు చేస్తున్న కేసీఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీచేయకుండా బాబు మోసాలకు పాల్పడుతున్నా సీమాంధ్ర మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ మోసం సీమాంధ్ర మీడియాకు పట్టదా? ఇంత అన్యాయం జరుగుతున్నా అక్కడి ప్రజల గురించి పట్టించుకోరా అని బాబు పక్షపాత వైఖరిని నిల దీశారు. చంద్రబాబు ఏమీ చేయకున్నా సొంత మీడియా గుంపుతో ఏదో చేశాననే ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు.

మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, తొమ్మిదేండ్ల పాలనా అనుభవంతోనే అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారని చురకలంటించారు. ఆ రాష్ర్టాన్ని పరిపాలించకుండా సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఎద్దేవాచేశారు. సీమాంధ్ర మీడియా కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని హెచ్చరించారు. తెలంగాణ పది జిల్లాలో జరిగిన ఆత్మహత్యలు ఏపీలోని ఒక్క అనంతపురంలో జరిగితే సీమాంధ్ర మీడియా ఒక్క ముక్కా రాయడం లేదని, ఇక్కడ మాత్రం పేజీలు నింపి, తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, డిసెంబర్ 02, 2014

60 ఏండ్లను మరిపించిన 6 నెలలు...!!!

killa

ఆరు నెలలే! కానీ.. అరవై ఏండ్ల కష్టాలను.. వివక్షను.. రాసిపెట్టుకో.. రూపాయి కూడా ఇవ్వను.. అని విషం చిమ్మిన అనుభవాలను అధిగమించగలమన్న విశ్వాసాన్ని కల్పించిన సమయం!! ఇది మన పాలన! యాచించే దశ నుంచి.. శాసించే దశకు తెలంగాణ చేరుకున్న సందర్భానికి ఆరు నెలలు నిండిన సందర్భం! పాలించేది కేసీఆరే అయినా.. ముద్ర మనదే! మన తెలంగాణదే! ఏ పథకం చేపట్టినా సమగ్ర పరిశీలన.. 

విశ్లేషణ.. పక్కా ప్రణాళిక! ఎవరెన్ని విమర్శలు చేసినా.. భావి బంగారు తెలంగాణ

నిర్మాణానికే రాళ్లెత్తుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలంటే వాయిదా వేసుకుని పోడానికే అన్న పరిస్థితిని మార్చి.. ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధమని ప్రకటించి, చర్చించిన తెగువ! ఆ తెగువకు పునాది.. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే! ఆ సాహసానికి ఊపిరి.. తెలంగాణ ఇకనైనా బాగుపడాలన్న తపనే! ఆ తపనలోంచి వచ్చినవే అనేకానేక ప్రజా సంక్షేమ పథకాలు..

month


టీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయాల్లో ముఖ్యమైంది రైతు రుణాల మాఫీ. లక్ష రూపాయల వరకున్న పంటరుణాలు మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాల్లో తొలి విడతగా రూ.4250 కోట్లను విడుదల చేసింది. బోనస్‌గా ఇన్‌పుట్ సబ్సిడీ బకాయలు, నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులకు రూ.11.5 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. వడగండ్లు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారంగా రూ.480 కోట్లు విడుదల చేసింది.

pinchan

ఆసరా పింఛన్లు..


టీఆర్‌ఎస్ మరో ముఖ్య వాగ్దానం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ల పెంపు. కేసీఆర్ సీఎం అవ్వగానే ఇచ్చిన మాటకు కట్టుబడి వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తంగా 25 లక్షలకు పైగా పింఛన్‌దారులను గుర్తించారు.

water

నీటి పారుదల..


పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల..
ఎడారిలా మారుతున్న తెలంగాణ భూముల్లో నదీజలాలను మళ్లించే కృషిలో భాగంగా అధికారంలోకి రాగానే మొట్టమొదటగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్వేకు ఆదేశించింది. జూరాల వద్ద దాదాపు లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నందున వరద నీటి లభ్యత బట్టి ఈ నీటిని జూరాల నుంచి వరంగల్ జిల్లా పాకాల వరకు గ్రావిటీ ద్వారా మళ్లించే పథకాన్ని కూడా చేపట్టనున్నారు.

slbc


ఎస్సెల్బీసీ ప్రాజెక్టు..


ఈ ప్రాజెక్టు చిక్కుముడిని ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కరించింది. ఎస్సెల్బీసీ టన్నెల్ విషయంలో ఎలాంటి అపోహలకు అవకాశమివ్వకుండా ఆ జిల్లాలకు చెందిన ప్రతిపక్షనేతలతో సీఎం సంప్రదింపులు జరిపి నిర్ణయానికి వచ్చారు.

char

హైదరాబాద్...


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఐటీఐఆర్‌లాంటి ప్రాజెక్టులు వస్తుండడంతో దాదాపు 2 కోట్ల జనాభా నివసించేందుకు వీలుగా, భవిష్యత్ అవసరాలన్నీ తీర్చేలా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నగర పోలీసుశాఖకు జీపీఎస్, ఇంటర్నెట్‌తో కూడిన ల్యాప్‌టాప్, ఇతర ఆధునిక వసతులతో రూ.350 కోట్లతో కొత్త వాహనాలు సమకూర్చింది. లక్ష కెమెరాలతో నిఘా ఉంచాలని నిర్ణయించింది. నగరంలో మహిళలపై, మహిళా ఉద్యోగులపై అఘాయిత్యాలు జరగకుండా షీ టీమ్స్‌పేరిట ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేశారు. అభివృద్ధి పయనంలో భాగంగా నగరాన్ని వై ఫై సిటీగా మార్చేందుకు పూనుకుంది. హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు రూ.100 కోట్లు కేటాయించింది. దాని పరిసరాల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించనుంది. మెట్రోమార్గాలను పెంచడంతో పాటు నగరం నలుమూలలనుంచి ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించనున్నారు.

sport

క్రీడలు..


రాష్ట్రంలో క్రీడారంగానికి గతంలో ఏనాడూ ఎరుగనంత ప్రోత్సాహం లభిస్తున్నది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే వారికి ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.25 లక్షలు, కాంస్యం సాధించినవారికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. క్రీడాకారుల కోచ్‌లకు కూడా క్రీడాకారులతో సమానంగా నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది. ఎవరెస్టు అధిరోహించి రాష్ర్టానికి గర్వకారణంగా నిలిచిన గిరిజన, దళిత బిడ్డలైన పూర్ణ, ఆనంద్‌లకు చెరో రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం అందించింది.

gunpark

ఉద్యమకారులు, అమరవీరులు..


తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడత 462 మంది అమర వీరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఉద్యమకారులపై సీమాంధ్ర సర్కార్ బనాయించిన అక్రమ కేసుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది.

ఉద్యోగులు..


ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సకల జనుల సమ్మె లాంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించింది. పీఆర్సీపై చర్చలు జరుగుతున్నాయి. హెల్త్‌కార్డులు మంజూరు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయనున్నారు.

గల్ఫ్ బిడ్డలకు చేయూత..


పుట్టి పెరిగిన ఊర్లో పని దొరకని దుర్భర పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోవడంకోసం గల్ఫ్‌లాంటి దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కేరళ తరహా ప్యాకేజీని అందించాలని నిర్ణయించింది.

సంచలనం.. సమగ్ర సర్వే


తెలంగాణలో ఎవరి పరిస్థితి ఎలా ఉంది? అని తెలుసుకోవడం కోసం ఆగస్టు 19న ఇంటింటి సర్వే చేపట్టారు. నాలుగు కోట్ల జనాభా సమగ్ర వివరాలను 24 గంటల్లో చేపట్టడం ద్వారా కేసీఆర్ సంచలనం సృష్టించారు. హైదరాబాద్‌లో కూర్చుని తయారు చేసే ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదనే ఉద్దేశంతో మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాటిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారు. మేధావులు, నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో సలహా మండలి ఏర్పాటు చేస్తున్నారు.

auto

ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను రద్దు


నిరుపేద, మధ్య తరగతి నిరుద్యోగ యువకులకు జీవనాధారమైన ఆటోలపై పన్ను రద్దు చేస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేశారు.

ఆరోగ్యానికి ఆర్థిక దన్ను


గత 60ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ లేని విధంగా ఆస్పత్రుల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేసింది తెలంగాణ సర్కారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు చెరో రూ.100 కోట్లు కేటాయించింది. సుల్తాన్ బజార్, పేట్ల బురుజు మెటర్నిటీ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.50 కోట్లు, నీలోఫర్ ఆస్పత్రికి రూ.30 కోట్లు, కింగ్‌కోఠీ దవాఖానకు రూ.25కోట్లు, కంటి, మానసిక, ఛాతి, ఈఎన్‌టీ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.40కోట్ల నిధులు కేటాయించారు. నిమ్స్‌కు రూ.135.98 కోట్లు కేటాయించగా ఆస్పత్రి ఆధునీకరణ పూర్తయింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రులను నిమ్స్‌స్థాయిలో ఆధునీకరించేందుకు చెరో రూ.10కోట్లు కేటాయించారు.

పీహెచ్‌సీల అప్‌గ్రేడ్‌కు రూ.44 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, సీహెచ్‌సీల బలోపేతానికి రూ.74 కోట్లు కేటాయించారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీకి రూ.92కోట్లు, ఆదిలాబాద్ రిమ్స్‌కు రూ.25కోట్ల వరకు, బోధనాసుపత్రుల్లో భవనాలు, వసతుల మెరుగుకు రూ.152 కోట్లు కేటాయించటంతో అదనపు మెడికల్ సీట్ల రెన్యువల్‌కు ఇబ్బంది లేకుండా పోయింది.

భవిష్యత్ ప్రణాళికలు..


ఉమ్మడి ప్రవేశాలతో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం అరికట్టేందుకు వరంగల్‌లో కాళోజీ పేరుతో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కేటాయించింది. తెలంగాణకు ప్రత్యేక మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు జరుగనుంది. రాష్ర్టానికి మంజూరైన ఎయిమ్స్ ఏర్పాటుకు హైదరాబాద్ పరిసరాల్లో స్థల పరిశీలన జరుగుతున్నది. దీనివల్ల 100 మెడికల్ సీట్లతో పాటు 960 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందనున్నాయి. ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి కొత్తగా ఏర్పాటుచేసే దవాఖానను సర్కారు పరిధికి ఇవ్వాలని ప్రతిపాదించింది.

welfare

సాటిలేని సంక్షేమం..


ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమ మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్నారు. జూన్ 2న సీఎంగా పదవి చేపట్టాక పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన సమావేశంలోనే సీఎం తన నిర్ణయం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీల సంక్షేమం శాఖల నిర్వహణను సవాలుగా స్వీకరించి సంక్షేమానికి కొత్త అర్థాన్నిస్తున్నారు.

దళితులకు మూడెకరాలు


ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చి అందులో బోరు, మోటారు, కరెంట్ కనెక్షన్ లాంటి వసతులు కూడా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 1220 ఎకరాల భూమిని 465మందికి పంపిణీ చేశారు.

marriage

కల్యాణలక్ష్మి..


దళితులు గిరిజనులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకానికి రూపకల్పన చేసి నిరుపేద దళిత, గిరిజన ఆడపిల్లల పెండ్లికి రూ.51 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నది.

minority

మైనార్టీల అభివృద్ధి..


విద్య,ఉద్యోగాల్లో వెనకబడిపోయిన మైనార్టీలకు సహాయం కోసం ముస్లిం కుటుంబాల్లో పెండ్లిళ్లకు షాదీ ముబారక్ పేరిట రూ.51వేలు అందించే పథకం ప్రారంభించింది.

గిరిజన సంక్షేమం..


గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తండాలు, ఆదివాసి గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా ప్రకటించింది.

బీసీల సంక్షేమం..


చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వెలుగులు నింపే దిశగా..


రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో విద్యుత్‌పై చిగురిస్తున్న ఆశలు... కొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో విద్యుత్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. అధికారం చేపట్టిన ఆరు నెలల కాలంలోనే అనూహ్యమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యుత్‌లోటునుంచి మిగులు రాష్ట్రంగా తెలంగాణను మార్చేలా ప్రణాళికలు అమలుచేస్తున్నది.

-ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం 1000 మెగావాట్ల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు.
-బహిరంగ మార్కెట్‌లో 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మూడు ప్రైవేటు పవర్ ప్రాజెక్టులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
-తక్షణ విద్యుత్ అవసరాలకు 500 మెగావాట్ల సోలార్ పవర్ కోసం టెండర్లు ఆహ్వానించగా 108 మంది 1,892 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
-వచ్చే ఏడు సంవత్సరాల విద్యుత్ అవసరాల కోసం 2000 మెగావాట్లకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
-తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా వచ్చే ఐదేండ్లలో 20,000 మెగావాట్ల ఉత్పత్తికి వీలైన చర్యలు ప్రభుత్వం చేపట్టింది.
-సోలార్ పంపుసెట్లు ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయించింది.
-జెన్‌కో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి వార్షిక బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయింపులు జరిపింది.
-కొత్తగూడెం(800మెగావాట్లు),మణుగూరు (1080 మెగావాట్లు) ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను బీహెచ్‌ఇఎల్‌కు అప్పగించింది.
-ఎన్టీపీసీ 4000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు ఇప్పటికే కొన్ని భూములను కేటాయించింది.
-సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న 1200 మెగావాట్ల ప్రాజెక్టు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి సాధించేలా చర్యలు తీసుకున్నది.
-కేటీపీఎస్ 600 మెగావాట్ల పవర్‌ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!