గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 19, 2015

వీటికి అనుమతులేవి బాబూ...?

-తెలంగాణ ప్రాజెక్టులంటే కండ్లల్లో నిప్పులా?
-బేసిన్‌లో లేకున్నా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర మీది
-జలదోపిడీకి సింగిల్ విండోగా పోతిరెడ్డిపాడు
-ఒక్క శ్రీశైలం నుంచే ఆరు ప్రాజెక్టులు!
-జల సంఘం అనుమతి లేదు.. బచావత్ అవుననలేదు పర్యావరణ, హైడ్రాలజీ ఆమోదాలూ లేవు
-ఎగువ రాష్ర్టాల అభ్యంతరాలనూ వినలేదు
-60 ఏండ్లుగా సాగుతూ వస్తున్న మాయా జలం
-హక్కులున్న తెలంగాణ ప్రాజెక్టుల మీద గగ్గోలు
-తెలంగాణకు నీరడ్డడమే లక్ష్యం



మీ భూమిలో మీరు పంట వేసుకుంటే అన్యాయం.. అక్రమం! మీ స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే ఘోరం.. నేరం. అదే మేం పరుల భూమిని ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తే మాత్రం భేష్. పక్కింటి వాళ్ల స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటే ఆహా, ఓహో!.. ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనల తీరు. అసలు అక్రమ ప్రాజెక్టులు అంటే ఏమిటో చంద్రబాబుకు గానీ, ఆయనకు భజన చేసే ఈనాడుకు గానీ తెలుసా అన్న సందేహం కలుగుతున్నది. ఎలాంటి అనుమతులు లేకపోయినా, కనీసం బేసిన్‌లో లేకపోయినా, ఎలాంటి నీటి కేటాయింపులు లేకపోయినా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జబర్దస్తీగా నిర్మించుకోవడాన్ని అక్రమ ప్రాజెక్టులు అంటారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఎలాంటి అధికారం లేని, కనీసం బేసిన్‌లో కూడా లేని ప్రాంతాల్లో, జల సంఘం, బచావత్, పర్యావరణ, హైడ్రాలజీ సహా ఏ అనుమతులు లేకుండానే సీమాంధ్రులు భారీ ప్రాజెక్టులను నిర్మించుకున్నారు. వాటికి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీల్లో కృష్ణా జలాలను దోచుకెళ్లిపోతున్నారు. ఇదంతా సీమాంధ్రకు మేలు చేసేది కాబట్టి.. ఏపీ సీఎం చంద్రబాబుకు గానీ ఆయన భజన బృందానికి గానీ అది తప్పుగా అనిపించడం లేదు. కానీ కృష్ణా బేసిన్‌లో ఉండి.. సర్వహక్కులు కలిగిన తెలంగాణలో ఇవాళ ఏదైనా ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటే చాలు ప్రపంచం మొత్తం తల్లకిందులైపోయినట్లు గగ్గోలు పెడుతున్నారు. కృష్ణా బేసిన్‌లో లేని ప్రాంతాలకు ఆ నదీజలాల్లో 52 శాతం నీటిని పట్టపగలు బహిరంగంగా దోచుకుని తీసుకు వెళుతున్న విషయం ఆ ప్రాంత పాలకులకు తెలియదా?


potireddypadu

పోతిరెడ్డిపాడు..: చెన్నై (ఒకప్పటి మద్రాస్)కి తాగునీటి పేరుతో మొదలైన కృష్ణా జలాల తరలింపు సీమాంధ్ర నీటి దోపిడీకి రాజమార్గంగా మారింది. తెలంగాణ బిడ్డ, దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) బతికి ఉన్నంత కాలం పోతిరెడ్డిపాడుని వ్యతిరేకిస్తూనే వచ్చారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ దోపిడీ విశ్వరూపం దాల్చింది. అప్పటి వరకు పోతిరెడ్డిపాడు ద్వారా సీమాంధ్రకు రోజుకు 11 వేల క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వెళుతుండగా, వైఎస్ దానిని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. పోతిరెడ్డిపాడుని తొలుత నాలుగు స్లూయిస్‌లతో నిర్మించగా వైఎస్ కొత్తగా మరో 10 స్లూయిస్‌లు నిర్మించారు. కొత్తవి నిర్మించగానే పాత స్లూయిస్‌లను మూసి వేస్తామని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, తెలంగాణ ప్రాంతానికే చెందిన పొన్నాల లక్ష్మయ్య సెలవిచ్చారు. కానీ నిర్మాణం జరిగిన తర్వాత, అటు పాతవి, ఇటు కొత్తవి యధావిధిగా కొనసాగుతున్నాయి తప్ప లక్ష్మయ్యగారు కిమ్మనలేదు. ఫలితంగా ఇవాళ రోజుకి 55 వేల క్యూసెక్కులు తరలిపోతున్నాయి. అంటే రోజుకు 5 టీఎంసీల చొప్పున నెలకు 150 టీఎంసీలు. పోతిరెడ్డిపాడు నుంచి 18 కి.మీ దూరంలో బనకచర్ల రెగ్యులేటర్ ఉంది. ఈ 18 కి.మీ లైనింగ్ చేస్తే రోజుకి కనీసం 13 టీఎంసీలు తరలించుకుపోయే ప్రమాదం ఉందని తెలంగాణ రిటైర్డు ఇంజనీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నమస్తే తెలంగాణతో ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి వరకు 45 వరద రోజులుగా ఉంటే వైఎస్ వచ్చిన తర్వాత 30 రోజులకు కుదించారు.


ఒక్క ప్రాజెక్టుకూ అనుమతి లేదు..


కృష్ణా వరద జలాలపై కేవలం శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఆర్‌బీసీ)కి తప్ప మిగిలిన సీమాంధ్రలోని ఒక్క ప్రాజెక్టుకు అటు బచావత్ నుంచి కానీ ఇటు కేంద్రం జల సంఘం నుంచి, పర్యావరణ శాఖ, హైడ్రాలజీ తదితర ఏ ఒక్క విభాగం నుంచి అనుమతులు లేవు. ఏవీ లేకుండానే గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగోడు, తెలుగుగంగ, కేసీ కెనాల్, కేసీ కెనాల్ లిఫ్ట్, సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నిర్మించారు. ఇందులో వెలుగోడు ఒక్కటే ప్రస్తుతం చివరి దశలో ఉంది. 


కేసీ కెనాల్ కట్టుకథ...


కేసీ కెనాల్ అంటే కర్నూలు-కడప కాలువ. ఇది తుంగభద్ర నది ఆధారంగా నిర్మించారు. దీనికి 39.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. కానీ ఇవాళ వినియోగిస్తున్న జలాలు 70 టీఎంసీలు. ఎలా వచ్చాయి? పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల వరకు వెళ్లిన తర్వాత ఎడమ వైపు తెలుగు గంగకు, కుడివైపు ఎస్‌ఆర్‌బీసీకి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య నుంచి నిప్పులవాగు ద్వారా కేసీ కెనాల్‌కు 10 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించుకున్నారు. సీమాంధ్ర పాలనలోనే కొత్తగా కేసీ కెనాల్ లిఫ్ట్ అంటూ మరో 10 టీఎంసీలు కూడా కేటాయించుకున్నారు. అప్పట్లో జపాన్ బ్యాంక్ ద్వారా రూ.1200 కోట్ల నిధులు పొంది కెనాల్‌ను ఆధునీకరించుకున్నారు. ఫలితంగా 8 టీఎంసీల నీళ్లు మిగులుతాయని అంచనా వేశారు. అంటే వాస్తవ కేటాయింపు 39 టీఎంసీలు 31.9 టీఎంసీలకు తగ్గాలి. కానీ వాస్తవ వాడకం చూస్తే కేసీ కెనాల్‌కు సుమారు 70 టీఎంసీల నీరు మళ్లించుకుంటున్నారని తెలంగాణ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఎక్కడ 39.9 టీఎంసీలు? ఎక్కడ 70 టీఎంసీలు? ఉమ్మడి రాష్ట్రంలో అడిగేవాళ్లు లేక ఇష్టారాజ్యం కొనసాగింది.


ఏ నీరైనా ప్రవహించేది అటే..


రీ-జనరేటడ్ వాటర్ కింద బచావత్ ట్రిబ్యూనల్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 11 టీఎంసీలు కేటాయించింది. న్యాయంగా వీటిని అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి. అయితే ఈ 11 టీఎంసీలు, కేసీ కెనాల్ ఆధునీకరణ వల్ల మిగిలిన 8 టీఎంసీలు. అంటే మొత్తం 19 టీఎంసీలు నాటిపాలకులు ఒక్క ఎస్‌ఆర్‌బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ)కే కేటాయించుకున్నారు. అప్పట్లో ఎస్‌ఆర్‌బీసీ ఆధునీకరించేందుకు ప్రపంచబ్యాంక్ లోన్ కోసం సీమాంధ్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే బెనిఫిట్ కాస్ట్ రేషియో కింద తీస్తే (అంటే కిలోమీటర్ పారితే ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది) ఎస్‌ఆర్‌బీసీ నుంచి 56 కిమీ దూరంలోని గోరకల్లు వరకు ఒక్క ఎకరం కూడా లేదు. దీంతో లోన్ రాలేదు. అప్పుడు ఎస్‌ఆర్‌బీసీకి, తెలంగాణలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీని జోడించి ఏపీ-2 ప్రాజెక్టు కింద లోన్ పొందిన ఘనవీరులు సీమాంధ్రులు. అదే ఎస్‌ఎల్‌బీసీ విషయానికి వస్తే ఇంత వరకు పూర్తి కాలేదు. ఏనాడు ఎస్‌ఎల్‌బీసీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీ కెనాల్‌కు ఇన్ని నీళ్లు పోతున్నా, ఇంకా చాలదన్నట్లు రాజోలిబండపై పేచీకి వస్తరు. 


స్వర్ణముఖి కాదు... చంద్రముఖి


చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి పేరిట ఒక నది ఉంది. ఇందులో 365 రోజుల్లో ఒక్క రోజు కూడా నీళ్లు ఉండవు. దీనిమీద బారేజ్ ఉంది. గమ్మత్తుగా చుక్క నీరు ఉండని ఈ నది పరిధిలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇపుడు 42 చెరువులు మండు వేసవిలో కూడా నీళ్లతో కళకళలాడుతుంటాయి. కారణం ఏమిటంటే... మద్రాస్‌కు తాగునీరు పేరుతో తీసుకెళుతున్న తెలుగు గంగ కాలువకు లింకులు ఏర్పాటు చేసుకుని నింపుకుంటున్నారు. ఏనాటికైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే కష్టమని ముందుగా ఊహించి సోమశిల, కండలేరు ప్రాజెక్టుల ద్వారా వందల కిమీ లింకు కెనాల్స్ నిర్మించుకున్న ఘనత సీమాంధ్ర పాలకులది. 


అక్రమంగా నిర్మించుకున్న రిజర్వాయర్లు..


ఈ ప్రాజెక్టులే కాదు ఎస్‌ఆర్‌బీసీ(శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్)కి కింద అవుకు (5 టీఎంసీ), గోరకల్లు (20 టీఎంసీ), గాలేరు-నగరి ప్రాజెక్టు కింద చిత్రావతి (10 టీఎంసీ), గండికోట (10 టీఎంసీ), బ్రహ్మంగారి మఠం (30 టీఎంసీ), వెలిగోడు (12 టీఎంసీ)... ఇవన్నీ అనుమతులు లేకుండా నిర్మించుకున్న రిజర్వాయర్లే. పైకి ఎన్ని కథలు చెబుతున్నా.. ఇవన్నీ కృష్ణా జలాలపై ఆధారపడినవే. వీటన్నింటికీ మూలం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ. 1,90,000 ఎకరాలు ఆయకట్టు ఉన్న ఎస్‌ఆర్‌బీసీకి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని కేటాయించుకున్న సీమాంధ్ర పాలకులు, 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న తెలంగాణ పరిధిలోకి వచ్చే ఎస్‌ఎల్‌బీసీ(శ్రీశైలం లెప్ట్ బ్యాంక్ కెనాల్)కి మాత్రం రోజుకి 4 వేల క్యూసెక్కులు మాత్రమే కేటాయించారు. 


శ్రీశైలం కబ్జాకు యత్నం..


ఈ ఘోరాలు అన్ని చాలవన్నట్లు 2011లో శ్రీశైలం డ్యామ్‌ను పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం కూడా జరిగింది. దానిని గుర్తించి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆ విషయాన్ని బహిర్గతం చేయడంతో తోక ముడిచారు. శ్రీశైలం ఎగువ భాగాన సిద్ధేశ్వరం వద్ద కృష్ణా నది ఇరుకైన కొండల మధ్య నుంచి ప్రవహిస్తుంది. అక్కడ వీయర్ (బ్రిడ్జి) నిర్మించి సుమారు 50 టీఎంసీల నీరు ఎప్పుడూ ఉండేలా చూడాలని సీమాంధ్ర పాలకులు ఎత్తుగడ వేశారు. అంటే 50 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చిన తర్వాతే శ్రీశైలం డ్యామ్‌లోకి నీరు వెళుతుంది. లేదంటే సిద్ధేశ్వరం దగ్గరే నిలుపుకుని వీయర్ ద్వారా సీమకు నీళ్లు మళ్లించుకోవచ్చు. 


తెలంగాణ వాడుతున్నది 1 టీఎంసీ మాత్రమే


బేసిన్‌లోని లేని సీమాంధ్ర ప్రాజెక్టులకు శ్రీశైలంనుంచి వందలు, వేల టీఎంసీలు నీళ్లు పోతుంటే, కృష్ణా బేసిన్ ఉండి, నికల జలాలు, వరద జలాలపై పూర్తిగా హక్కు కలిగిన తెలంగాణ బిడ్డలు ఇప్పటి వరకు వాడుకుంటున్నది ఎంతో తెలుసా? కేవలం ఒక్క టీఎంసీ మాత్రమే. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం! కృష్ణా నికర, వరద జలాలపై ఆధారపడి తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కల్వకుర్తి తప్ప ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదు. కల్వకుర్తి కూడా ఒక పంపుని ట్రయిల్ రన్ పేరుతో నడుపుతున్నారు. ట్రయిల్ రన్ పేరుతో శ్రీశైలం నుంచి గత ఏడాది కాలంగా ఇప్పటి వరకు కేవలం ఒక టీఎంసీ మాత్రమే వాడుకున్నారు. శ్రీశైలం డ్యామ్ నిర్మాణంలో తెలంగాణ 56 శాతం మునిగిపోతే , ఆంధ్రా 44 శాతమే ముంపునకి గురైంది. 


ఏమిటీ వివిక్ష ?


కృష్ణా బేసిన్‌లో లేని సీమాంధ్ర ప్రాజెక్టులకు ... బేసిన్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల కేటాయింపులు ఇవి.
ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, భీమా పరిధిలో రిజర్వాయర్లు ప్రతిపాదనల్లో ఉన్నప్పటికీ... ఇంత వరకు ప్రాజెక్టులే పూర్తి కాకపోతే, ఇక రిజర్వాయర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక బేసిన్‌లో లేని సీమాంధ్ర ప్రాజెక్టులకు 30 వరద రోజులు పెట్టుకుని, తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం 90 రోజులు కేటాయించడంలో సీమాంధ్ర పాలకుల కుటిలతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.
అంటే 30 రోజుల వరద నీటి వల్ల ప్రాజెక్టులను వెంటవెంటనే త్వరగా నింపుకోవచ్చు. అదే 90 రోజులు అంటే చాలా ఆలస్యం అవుతుంది.


ఇదిగో అక్రమాలు..


listt

పెన్నా నదిని ఆధారం చేసుకుని సోమశిల ప్రాజెక్టు నిర్మించామని సీమాంధ్ర పాలకులు చెప్తుంటారు. 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సోమశిలకు 50 టీఎంసీలు శ్రీశైలం నుంచే తరలిస్తున్నారు. కండలేరు ప్రాజెక్టును సమీపంలోని వాగుని ఆధారంగా చేసుకుని నిర్మించామంటారు. ఆ వాగులో కేవలం 3.5 టీఎంసీలు మాత్రమే లభ్యమవుతుంటే ప్రాజెక్టును మాత్రం 68 టీఎంసీల సామర్థ్యంతో కట్టారు. మిగిలిన నీరెక్కడినుంచి వస్తుంది? ఇక గాలేరు-నగరి..గాలేరు అనే నది కర్నూలు జిల్లాలో ఉండగా, నగరి అనేది చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ రెండు నదులను కలుపుతూ నిర్మించారేమో అనుకోవద్దు.. ఇదీ కృష్ణా జలాలు మింగేయడానికే. సీమాంధ్ర కదా కృష్ణమ్మ పోతిరెడ్డిపాడు నుంచి 390 కి.మీ దూరంలో ఉన్న నగరి వరకు బిరాబిరా వెళుతుంది. అలాగే హంద్రినీవా. హంద్రి కర్నూలు జిల్లాలో ఉంటే, నీవా చిత్తూరు జిల్లాలో ఉన్న నది. ఇక్కడికి కూడా కృష్ణా నది 610 కి.మీ సుదూరం ఉరకలెత్తి ప్రవహిస్తుంది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, జూన్ 18, 2015

ఇది...ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు...!!!

దేశంలో క్రైమ్‍ను క్రైమ్‍గా నిర్ధారించడానికి దశాబ్దాల కాలం పడుతున్నది. పట్టుబడ్డ రాజకీయ నాయకులెవ్వరూ స్వయంగా రాజీనామా పెట్టే సంస్కారం మన దేశంలో లేదు. నీలం సంజీవరెడ్డి ఒక్కరు మాత్రం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక చిన్న పొరపాటు పబ్లిక్‌గా సర్‌ఫేస్ అయితే తనకు తానే రాజీనామా పెట్టారు. సభ్య దేశాల్లో ఈ రివాజును పాటిస్తారు. కోర్టుల చుట్టూ తిరగరు. ప్రభుత్వాన్ని కాపాడమని కాళ్లా వేళ్లా పడరు. రాజీనామా చేస్తే తప్పు చేసిన వారికి శిక్ష తగ్గడమే కాకుండా పబ్లిక్ సింపతీ, ఇమేజ్ పెరుగుతుంది. శిక్షపడక ముందే బాబు సభ్య సమాజ సంస్కారాన్ని పాటిస్తే మంచిది. 



చంద్రబాబు నాయుడు వెటరన్ రాజకీయవేత్త. అతి తెలివైన, చురుకైన రాజకీయ వ్యవహారకర్త (మ్యానిపులేటర్), గ్రేట్ సర్‌వైవర్ కూడా. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎగుడు దిగుడులను తరిచి చూసి నిలదొక్కుకున్న ఘటనా ఘటన సమర్థుడు. ఆయన చేయదల్చుకున్న డర్టీ పొలిటికల్ పథకాన్ని ఆయన స్వయానా ఎప్పుడు చేయడు. తన చేతికి మైలంటకుండా ఇతరులతో చేయిస్తాడు. ఎందుకో ఈసారి ఏ ఖర్మనో ఏమో ఆయనే స్వయంగా అనూహ్యంగా అడ్డంగా దొరికిపోయాడు.


మన హిందూ ధర్మశాస్త్రం తన కోపమే తన శత్రువని చెబుతున్నది. ఈర్ష్య, ద్వేషం, అసూయ, అనవసరమైన పగ, కక్ష, వైరం స్వీయ పతనానికి కారణమవుతాయని మన శాస్త్రాలు చెబుతున్నవి. భస్మాసుర శాపగ్రస్థ పతనం గుణపాఠం, ఒక తార్కాణం. పక్క రాష్ట్రంపై పగ, కసి బాబును ఈ దశకు చేర్చిందని భావించడంలో తప్పు లేదు.


రాజ్య విస్తరణ, సామ్రాజ్యవాదం పాతకాలం నాటి బూజుపట్టిపోయిన రాజకీయ సిద్ధాంతం. దాన్ని అనాక్రనిజం అంటారు. అనగా కాలం చెల్లిన పాత మూస పద్ధతి. అది బాబుకు అత్యంత సంతృప్తినిచ్చే సిద్ధాంతం. ఆయన జీవితాశయం సామ్రాజ్య విస్తరణ. రాజులకు ఇచ్చే ట్రైనింగ్‌లో మొదటి పాఠం రాజ్య విస్తరణ లేని రాజ్యం రాజ్యమే కాదు. దీన్ని బాబు బాగా ఒంట పట్టించుకున్నాడు. అందుకే పదే పదే రెండు రాష్ట్రాలపైన జెండా మనదే, 2019 ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రప్రభుత్వాలు మనవే అంటూ ఇదేమాట పదేపదే సంధిప్రేలాపనలా చెప్పుతూనే వున్నాడు. 


యూనివర్సిటీ విద్య చదివిన బాబుకు ది ప్రిన్స్ తెలిసే ఉంటుంది. ఆయనకు ’ది ప్రిన్స్’ అనే రాజకీయ సిద్ధాంత గ్రంథం మ్యాక్‌వెల్లి రాసింది తెలిసే వుంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం ’రాజకీయ అవసరాలకు అనైతిక పద్ధతులు అవలంబించవచ్చు. అధికారం పొందవచ్చు. దాన్ని అమలు చేయడంలో కూడా అదే పద్ధతి పాటించవచ్చు. రాజకీయ అగత్యానికి అవసరానికి నైతిక విలువలు అడ్డు కాకూడదు. వాటిని పాటించవలసిన అవసరం లేదు’ అని మ్యాక్ వెల్లి సిద్ధాంతం చెబుతున్నది. బాబు దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్టు ఆయన రాజకీయ చరిత్ర తెలుపుతున్నది.


మ్యాక్‌వెల్లి సిద్ధాంతం ఆరువందల సంవత్సరాల కిందటిది. ఆ రోజుల్లో దాన్ని ఎవరు పాటించారో తెలియదు. పాటించిన వారు మాత్రం చరిత్రహీనులై పోయుంటారు. ఆంధ్రాలో ఇప్పుడు కాంట్రాక్టర్ల, సంపన్నుల, వ్యాపారవేత్తల సిండికేట్ ప్రభుత్వం కొనసాగుతున్నది. ఒకప్పుడు కర్నాటకలో, ఆంధ్రాలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా, కర్నాటక, ఆంధ్ర రాజకీయాలను శాసించే దశకు చేరింది. ఆ సిండికేట్‌లో ఆంధ్రకు ఆనాటి ముఖ్యమంత్రి కూడా ఒక ముఠా సభ్యుడు. వారంతా ధన బలంతో కుల బలంతో దేశ రాజకీయాలను శాసించడానికి పార్లమెంటు సభ్యులను కూడా వశపరచుకొనడానికి కోట్లాది ధన రాసులను వెచ్చించాలని పథకం వేశారు. అదే ప్లాన్‌ను ఈ రోజు చంద్రబాబు ఆంధ్ర రాజకీయ బిజినెస్ దళం ఆపరేట్ చేయాలని, ఆమలు చేయాలని, తమ నెట్‌వర్క్‌ను ఆరు రాష్ట్రాలకు విస్తరింపచేయాలని ఆరాటపడుతున్నది. బాబు కూడా తన విస్తరణ ప్లాను బయటపెట్టాడు.


మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనకు ఆంధ్ర మనీ ఫ్రెషర్ గ్రూపులుగా ఎలా మారుతారో, చట్ట సభలపై ఆధిపత్యం కోసం సంఖ్యా బలాన్ని ఎలా సమీకరించుకుంటారో...ప్రదర్శిస్తారో...వాడుతారో తేటతెల్లంగా తెలిసిపోయింది. అందుకే ఆయన ’ఇల్లీగల్ అక్యుమ్యులేషన్ అండ్ అక్విజిషన్ ఆఫ్ మనీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పాలిటీషియన్స్ ఇజ్ ఏ బిగ్ త్రెట్ టు పార్లమెంటరీ డెమాక్రసీ’ అని బహిరంగంగా చెప్పారు కొంత మంది సన్నిహితులతో. ఆంధ్రా మనీ బ్యాగులు తన క్యాబినేట్‌లో చొరబడడానికి నానా తిప్పలు పెట్టేవారని తాను ఎన్నో సార్లు వారిని ప్రతిఘటించానని చెప్పారట. కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఆర్జించిన వేల కోట్ల ధనానికి ఔట్‌లెట్ కార్యక్రమమే నోటుకు వోటు పథకం. ఈ మాస్టర్ ప్లాన్‌కు సీఈఓ ఎవరో అందరికీ తెలిసిందే.


బాబు తెలంగాణపై దండయాత్ర గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని స్పీడు పెంచారు. రెండు మూడు నెలల కొకసారి మందీ మార్బలంతో వందలాది మంది పోలీసు బలగాలనీడన బస్సు యాత్రలు చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగులు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజాబలం ముందు చంద్రబాబు అద్దె మైకుల బలం ఒక్క పైసాతో కూడా సమానం కాదు. అయినా కేసీఆర్ సహనంతో ఓపిక పడుతున్నాడు. తగిన సమయంలో జవాబు చెప్పటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా వున్నది.


బాబు ఎన్నికలైన తర్వాత అధికార బలాన్ని వాడుకొని తెలంగాణకు సీలేరు నుంచి పవర్‌కట్ చేయించారు. శాసన సభ్యులతో మంత్రులతో అధికారులతో పోలీసు బలగాల సహాయంతో కత్తులు, కొడవళ్ళతో, లాఠీలతో జనాన్ని తీసుకుపోయి ఆర్‌డీఎస్, శ్రీశైలం, సాగర్ గేట్లను తెరచి నీళ్ళు తోడుకపోయారు. మూడు లక్షల ఎకరాల తెలంగాణ భూభాగాన్ని అర్ధరాత్రి చెప్పాచేయక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్నాడు. పోలవరం డ్యాం ఎత్తును పదే పదే కేంద్ర అనుమతులు లేకుండా పెంచుకుంటూ పోతున్నారు. ఇదివరకు అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులకు...శ్రీశైలం,సాగర్ నీరును తరలించుక పోతానంటున్నారు. తెలంగాణలో చేపట్టిన తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులకు అడ్డు కాలేస్తున్నారు.


ఇంతకు ఆంధ్రలో టీడీపీ బలమెంత? ఆ ప్రభుత్వం చివరి వరకు నిలుస్తుందా? అనుమానమే. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన కాంగ్రెస్ గుంపు, బీజేపీ, జగన్ గ్రూపు దళితులు, బీసీల కాంబినేషన్ ఆంధ్రా ప్రభుత్వ వ్యాపార రాజకీయ సిండికేట్‌కు వ్యతిరేకంగా జతకట్టే అవకాశం మెండుగా కనిపిస్తున్నది. డిప్యూటీ చీఫ్ మినిష్టర్ కె.ఇ.కృష్ణమూర్తి, దివాకర్ రెడ్డి, బీసీ వర్గాలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.కాపులు దళితులు ఏనాడూ బాబు వర్గంతో కలసి నడిచే అవకాశమే లేదు. కాబట్టి బాబు బడాయి అధికారదర్పం చెల్లదు.


బాబుది ఊసరవెల్లి పోలిక. బతుకు దెరువుకు ఎన్నో రంగులు మార్చడం, ఆయన ప్రకృతి. గత రెండు దశాబ్దాలుగా ఆయన జతకట్టని పార్టీ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, మజ్లీస్, బీజేపీ, టీఆర్‌ఎస్, మర్రి చెన్నారెడ్డి రెబల్ పార్టీ. అన్ని పార్టీల జెండా మెడనేసుకొని తిరిగిన ఘనత బాబుది. అందుకే బీజేపీ అంత సులభంగా ఆయనను నమ్మదు. బాబును తెలంగాణ బీజేపీ అంటరాని వాడిగా చూస్తున్నది. మొన్న శాసనసభ పోలింగులో కూడా వారి వోటును బీజేపీకి వేయక నోటా ఆఫ్షన్ తీసుకున్నది.


బీజేపీ పొత్తుతో తాను ఎన్ని పాపాలైనా చేసి బయటపడగలనని బాబు నమ్ముతున్నాడు. ఈ మధ్య ఆయన మాటల్లో దురుసు, కాఠిన్యం పెరిగింది. మితిమీరిన నీలుగుడు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ఆయన కుసంస్కారంతో కొన్ని కులాలను పేరు పేరున పదే పదే దూషిస్తున్నాడు. దీపం కింది చీకటి దీపానికి కనబడదు. గాజు బంగ్లాలో వున్నవారు బయటకు రాళ్ళు విసిరితే పరిణామాలు ఎట్లుంటాయో తెలియవలసిన అవసరం లేదా?


బాబు నిత్యం వల్లించుతున్న మాట.. ’నేనే తెలంగాణకు కర్త, కర్మ, క్రియను’ అని. తెలంగాణ అభివృద్ధి అంతా నా చలవే. రాష్ట్రాన్ని గతంలో పాలించిన ఏడుగురు ముఖ్యమంత్రులు బూర్గుల, వెంగళరావు, పీవీ నరసింహారావు, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి, ఎన్‌టీఆర్.. వారెవ్వరూ హైదరాబాద్‌కు ఏమాత్రం అభివృద్ధి చేయలేదా? హైదరాబాద్ డెవలప్‌మెంట్ అంతా బాబు చలువేనా ? ఎవరైనా నమ్ముతారా?


రాజధాని నిర్మాతలు, హైదరాబాద్ రాజులు ఆసిఫ్ జాహీలు, బహమనీయులు, కాకతీయులు, రెడ్డి రాజులు, వెలమ రాజులు వారెవ్వరూ ఎలాంటి అభివృద్ధి చేయలేదనడం మూర్ఖత్వం, అజ్ఞానం.

తెలంగాణ అభివృద్ధి అంతా నిజంగా చంద్రబాబు నాయుడే చేస్తే ఎక్కడ అభివృద్ధి చేశాడు? ఎంత పెట్టుబడితో చేశాడు? ఆ పెట్టుబడి మూలధనం ఎక్కడిది? ఆయన చేసిన అభివృద్ధి లిస్ట్ శ్వేత పత్రం ప్రచురించాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.


దేశంలో క్రైమ్‍ను క్రైమ్‍గా నిర్ధారించడానికి దశాబ్దాల కాలం పడుతున్నది. పట్టుబడ్డ రాజకీయ నాయకులెవ్వరూ స్వయంగా రాజీనామా పెట్టే సంస్కారం మన దేశంలో లేదు. నీలం సంజీవరెడ్డి ఒక్కరు మాత్రం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక చిన్న పొరపాటు పబ్లిక్‌గా సర్‌ఫేస్ అయితే తనకు తానే రాజీనామా పెట్టారు. సభ్య దేశాల్లో ఈ రివాజును పాటిస్తారు. కోర్టుల చుట్టూ తిరగరు. ప్రభుత్వాన్ని కాపాడమని కాళ్లా వేళ్లా పడరు. రాజీనామా చేస్తే తప్పు చేసిన వారికి శిక్షతగ్గడమే కాకుండా పబ్లిక్ సింపతీ, ఇమేజ్ పెరుగుతుంది. శిక్షపడక ముందే బాబు సభ్య సమాజ సంస్కారాన్ని పాటిస్తే మంచిది. రాజీనామా చేసి తాను తప్పు చేయలేదని రుజువు చేసుకోవడం గౌరవంగా వుంటుంది. ప్రజలు ఆ నిర్ణయాన్ని హర్షిస్తారు, నీరాజనం పలుకుతారు.

chalapathi










-వ్యాసకర్త: సీనియర్ రాజకీయవేత్త


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



అవును.. సెక్షన్ 8 జాన్తా నై!

-శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం
-తేల్చిచెప్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 163
-బిల్లు ఆమోదం సమయంలోనే గుర్తుచేసిన జైట్లీ
-గవర్నర్‌కు ఎలా అప్పగిస్తారని ఆనాడే నిలదీత
-సెక్షన్ 8 అమలుకు కోర్టుకెళ్లినా ప్రయోజనం లేదు
-స్పష్టంచేస్తున్న న్యాయ నిపుణులు


ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని క్లాజ్ 8లో హైదరాబాద్ రెండు రాష్ర్టాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు మాకేమీ ఇబ్బంది లేదు. శాంతి భద్రతలకు న్యూట్రల్ ఏజెన్సీగా.. గవర్నర్ ఇన్‌చార్జిగా ఉండటానికీ అభ్యంతరం లేదు. నాకున్న ఒకే ఒక భయం.. అదే నా అభ్యంతరం ఏమిటంటే.. మీరు శాంతి భద్రతల అధికారాన్ని ఒక సాధారణమైన చట్టం ద్వారా గవర్నర్ చేతుల్లో ఎలా పెడతారు? గత ఏడాది ఫిబ్రవరి 20న పార్లమెంట్‌లో రాజ్యసభ విపక్ష నేత, న్యాయ నిపుణుడు అరుణ్‌జైట్లీ వేసిన ప్రశ్న!

arun


హైదరాబాద్‌లో శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడం ఏ విధంగానూ వీలుగాని పనిగా తేలిపోతున్నది. అసలు ఇది పసలేనివాదనే కాకుండా.. రాజ్యాంగబద్ధమైనది కాదని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తేల్చిచెప్తున్నారు. 

యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమోదం పొందిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్‌ను పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ, శాంతి భద్రతలను గవర్నర్ అజమాయిషీలో ఉంచేలా సెక్షన్ 8లో పేర్కొన్నారు. నిజానికి శాంతి భద్రతలు, పోలీసింగ్ అనేది రాష్ర్టాల పరిధిలోని అంశం. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయితే.. ఆనాడు యూపీఏ ప్రభుత్వం బిల్లు సమగ్రంగా బిల్లు తీసుకురాకపోవడంతో ఈ సెక్షన్ చేరింది. దీన్ని అమలు చేయాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. నిజానికి రాజ్యాంగం ప్రకారం అలా అమలు చేసే అవకాశాలే లేవని న్యాయ నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఒకవేళ సెక్షన్ 8 అమలు పేరుతో కేంద్రం ఏవైన ఆదేశాలు జారీ చేసినా అవి సుప్రంకోర్టులో న్యాయపరీక్షకు నిలబడవని వారంటున్నారు. 


రాష్ర్టాలకు దఖలు పర్చిన శాంతి భద్రతల అధికారాలను, పోలీస్ పవర్స్‌ను ఒక సాధారణ చట్టంద్వారా గవర్నర్‌కు కట్టబెట్టాడాన్ని, దాని అమలుకు డిమాండ్ చేయడాన్ని సుప్రీం కోర్టు మరో మాట లేకుండా కొట్టిపారేస్తుందని అంటున్నారు. నిజానికి ఇది చట్టవ్యతిరేకమని ఆనాడు తెలంగాణ బిల్లు ఆమోదం పొందే క్రమంలో పార్లమెంటులో జరిగిన చర్చలో నాటి రాజ్యసభ విపక్ష నేత, ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ విస్పష్టంగా చెప్పారు. లొసుగులతో కూడిన చట్టాన్ని ఆమోదిస్తున్నారని ఆనాడే హెచ్చరించారు. శాంతి భద్రతలు అనేవి రాష్ర్టానికి సంబంధించిన అంశమని, దీనిని గవర్నర్ చేతిలో ఎలా పెడతారని నిలదీశారు. ఆ సమయంలో అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగంలో సెక్షన్ 8 గురించి చేసిన వ్యాఖ్యలు కింది విధంగా ఉన్నాయి. 


మేం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పూర్తి చట్టబద్ధంగా, సరైన పద్ధతుల్లో జరగాలని కోరుకుంటున్నాం. మీరు ప్రతిపాదించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని క్లాజ్ 8లో హైదరాబాద్ రెండు రాష్ర్టాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. పదేండ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు మాకేమీ ఇబ్బంది లేదు. శాంతి భద్రతలకు న్యూట్రల్ ఏజెన్సీగా.. గవర్నర్ ఇన్‌చార్జిగా ఉండటానికీ అభ్యంతరం లేదు. 


నాకున్న ఒకే ఒక భయం.. అదే నా అభ్యంతరం ఏమిటంటే.. మీరు శాంతి భద్రతల అధికారాన్ని ఒక సాధారణమైన చట్టం ద్వారా గవర్నర్ చేతుల్లో పెడతారా? మంత్రిమండలికి గవర్నర్ సలహా ఇవ్వవచ్చునని రాజ్యాంగంలోని 163వ అధికరణం స్పష్టంగా చెప్తున్నది. మంత్రిమండలి సలహాకు అనుగుణంగా పని చేయాలని సుప్రీం కోర్టు తీర్పులు పేర్కొంటున్నాయి. శాంతి భద్రతలు, పోలీసు పవర్స్‌పై అధికారాలు రాష్ర్టాలకే ఉంటాయి. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. 


నాటి విపక్ష నేతగా జైట్లీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమని పలువురు న్యాయ నిపుణులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళితే ఎన్డీయే ప్రభుత్వం నుంచి ఏపీ నేతలకు ఇదే సమాధానం లభిస్తుంది తప్పించి.. కొత్తగా ఎలాంటి హామీ దొరికేందుకు ఆస్కారమే లేదని వారు పేర్కొంటున్నారు. దీనిపై కోర్టుకు వెళ్లినా.. శాంతి భద్రతలను గవర్నర్‌కు కట్టబెట్టడం రాజ్యాంగ వ్యతిరేకం కనుక సుప్రీం కోర్టు కూడా అందుకు విస్పష్టంగా తిరస్కరిస్తుందని వారు చెప్తున్నారు.


సెక్షన్-8 అమలు డిమాండ్ అర్థంలేనిది: పీపీ రావు


సెక్షన్-8లో గవర్నర్ బాధ్యతలను స్పష్టం గా వివరించినందున మళ్లీ కేంద్రం నుంచి ఆదేశాలు అవసరం లేదు. చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే సెక్షన్-8 కూడా అమలులోకి వచ్చినట్లే. ప్రస్తుత డిమాండ్లు అర్థం లేని వి. విభజన చట్టంతో ఈ సెక్షన్‌ను విడిగా చూ డలేం. 


హైదరాబాద్‌లో ప్రజల ప్రాణానికి హాని ఏర్పడినప్పుడు, స్వేచ్ఛకు, ఆస్తులకు భంగం కలిగినప్పుడు శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గత ఏడాది కాలంలో ఎలాంటి ఘటనలు జరగలేదుకాబట్టి సెక్షన్-8 గురించి చర్చించడం అసందర్భం. శాంతిభద్రతలకు విఘాతం లేని ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్‌కు ఈ సెక్షన్ ద్వారా లభించే అధికారాలు, బాధ్యతల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గవర్నరే స్వయంగా పరిస్థితులను అంచనా వేసుకుని నిర్ణయం తీసుకుంటారు. అది కూడా తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గంతో సంప్రదింపులు జరిగిన తర్వాతే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు.


ప్రత్యేక పరిస్థితుల్లోనే గవర్నర్‌కు బాధ్యతలు


-ఎస్ రామచంద్రరావు, మాజీ అడ్వకేట్ జనరల్ 
దేశానికి దిక్సూచి రాజ్యాంగం. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు రాజ్యాంగానికి కట్టుబడాల్సిందే. రాజ్యాంగంలో శాంతి భధ్రతల బాధ్యత అంశాన్ని రాష్ర్టాల జాబితాలో చేర్చారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు విధించే రాష్ట్రపతి పాలన సమయంలోనే శాంతిభద్రతల బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వకుండానే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్-8ని చేర్చారు. దాని ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, అంతర్గత సెక్యూరిటీ, స్వేచ్ఛ, వ్యక్తుల ఆస్తులకు భంగం వాటిల్లినప్పుడు గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య,ఆస్తుల సమస్యగానీ తలెత్తలేదు. ఏపీ సీఎం సెక్షన్-8ని అమలు చేయాలని డిమాండ్ చేయడం అర్ధరహితం.


అధికారాల బదలాయింపు లేదు


-గండ్ర మోహన్‌రావు, సీనియర్ న్యాయవాది
ఉమ్మడి రాజధాని భూభాగంలో కొన్ని అంశాలపై గవర్నర్‌కు కేవలం కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పచెప్పారు. కానీ పూర్తిస్థాయి అధికారాలను బదలాయించలేదు. ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించే సమయంలో తెలంగాణ మంత్రిమండలితో చర్చించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. శాంతిభద్రతలను రాష్ట్ర పరిధి నుంచి ఇతరులకు బదలాయించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ అలా బదలాయించాలంటే ఏకంగా రాజ్యాంగాన్ని
సవరించాల్సి వస్తుంది. 


కేసు నుంచి తప్పించుకునేందుకే


- సందేళ్ల భూమయ్య, అడ్వకేట్
ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే సెక్షన్-8 అంశాన్ని లేవనెత్తుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ తెలంగాణకు ఈ నిబంధన వర్తించదనుకుంటే అది ఏలా సాధ్యమో చంద్రబాబే చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ చట్టాలైనా రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉండాలనే మౌలిక విషయాన్ని మర్చిపోవడం దురదృష్టకరం. చేసిన తప్పును ఒప్పుకోకుండా రాజ్యాంగ సంక్షోభం స్పష్టిస్తామని చంద్రబాబు విధేయులు ప్రకటనలు చేయటం శోచనీయం. 


ఏపీ పోలీసులకు తెలంగాణలో అధికారం లేదు


- కే రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ 
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8లో ఏపీ పోలీసులకు , ఏపీ ప్రభుత్వానికి హైదరాబాద్‌పై అధికారం ఉంటుందని పేర్కొనలేదు. పాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నప్పటికీ, భూ భాగాల కేటాయింపు విషయంలో హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్ర పరిధి జాబితాలోనే చూపారు. రాష్ర్టాల్లో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపైనే ఉంటుంది. కాబట్టి హైదరాబాద్‌లో శాంతిభద్రతల బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై మాత్రమే ఉంటుంది. ఏపీ సీఎంకు తెలంగాణ పోలీసులే రక్షణ కల్పిస్తారు. సచివాలయం, ఇతర భవనాల వద్ద ఆంధ్ర పోలీసుల మోహరింపు సరికాదు. హైదరాబాద్ ఆస్తులపై ఏపీ ప్రభుత్వానికి యాజమాన్య హక్కులు ఉండవని పదో షెడ్యూల్ సంస్థలపై అధికా రం విషయంలో ఇటీవల హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. 


గవర్నర్‌కు అధికారాలు కావు, బాధ్యతలే: మాడభూషి శ్రీధర్


ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 ద్వారా గవర్నర్‌కు లభించినవి బాధ్యతలే తప్ప అధికారాలు కావు. తెలంగాణ రాష్ట్ర అధికారాలేవీ గవర్నర్‌కు బదిలీ కాలేదు. తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించకుండా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోరాదు. రెండు రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్నందున ఏపీ మంత్రివర్గం సలహాలు ఇచ్చేటప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఇవ్వరాదనేది కూడా గుర్తుంచుకోవాలి. శాంతిభద్రతలు, భవనాల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపులు మాత్రమే గవర్నర్ బాధ్యతగా ఉంటాయి. 


ఈ పరిధికి వెలుపల ఉండే అవినీతి, లంచాలు తదితరాలకు సెక్షన్-8 వర్తించదు. వ్యక్తిగత నిర్ణయాన్ని తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉన్నప్పటికీ తగిన కారణాలను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉండరాదు. ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు, అధికారులకు హైదరాబాద్‌లో నివసించటానికే తప్ప నగరంపై అధికారాలు, హక్కులు ఉండవు. గవర్నర్ నిర్ణయాన్ని సమీక్షించాలని కోరే హక్కు పౌరులకూ ఉంది. సమీక్ష చేసే అధికారం హైకోర్టు,సుప్రీంకోర్టులకు ఉంది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



బుధవారం, జూన్ 17, 2015

ఇది...ఈనాడా...ఆంధ్రానాడా???

-కరువు జిల్లాలకు నీళ్లిద్దామంటే..ఈనాడుకు, చంద్రబాబుకు ఎందుకింత కడుపుమంట?
-లేని జలజగడాల ఎత్తిపోత ఎందుకు?
-సమైక్య జీవోలకే ప్రాణం పోస్తే..ఈనాడుకు ఎందుకింత ఉలికిపాటు?
-పసిపిల్లలను అమ్ముకునే దేవరకొండకు పచ్చని తోరణం
-కడదామంటే ఈనాడు ఎందుకిలా వలపోస్తున్నది?
-ఫ్లోరైడుతో వంగికుంగి అలమటిస్తున్న జనానికి
-ఇన్ని మంచినీళ్లిద్దామంటే ఈనాడు ఎందుకు ఉడుక్కుంటున్నది?
-వలసల జిల్లా పాలమూరుకు తాగునీరు, సాగునీరు అందించాలని
-ప్రయత్నిస్తే ఈనాడు ఎందుకింత మంటపెడుతున్నది?
-తెలంగాణ సొమ్ముతో, హైదరాబాద్ ఆదాయంతో సోకుచేసుకునే
-ఈనాడు ఆంధ్రా పాట ఎందుకు పాడుతున్నది?
-కృష్ణా జలాలు ఆంధ్రాకేగానీ తెలంగాణ ప్రజలకు వద్దా?
-కోటిమందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్‌కు నీళ్లు తీసుకొచ్చేందుకు
-ఆలోచన చేస్తే ఈనాడు ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నది?
-అసలు జల జగడం ఎక్కడిది? చర్చ ఎవరితో?
-ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన
-కృష్ణా నది నీటి హక్కులపై నేటి నుంచి వరుస కథనాలు..






తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్న సోయి, జ్ఞానం ఇంకా ఆంధ్ర నాయకత్వానికి, ఆంధ్ర పత్రికలకు కలిగినట్టు లేదు. పొద్దునలేస్తే తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నవీ లేనివీ వండివార్చుతున్నరు. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు లొల్లిపెడుతున్నరు. ఐదున్నర దశాబ్దాలపాటు మూడు తరాల తెలంగాణ ప్రజలను ఎండబెట్టి, కరువులు, వలసలు, ఫ్లోరైడు పీడన, పిల్లల అమ్మకాలు, రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులపాలు చేసిన పాపాన్ని కడుక్కోకపోగా, ఇంకా సమైక్య రాష్ట్రంలోనే ఉన్నట్టు, తెలంగాణపైన వారికి ఇంకా ఏదో పెత్తనం మిగిలి ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిండి, పాలమూరు ప్రాజెక్టులు చట్టవ్యతిరేకమని కేంద్రానికి లేఖలు రాస్తరు. వెంటనే ఈనాడు పత్రిక గోడెక్కి గాయిగాయి చేస్తది. 


enadu


రాతలు కోతలు ప్రచారాలు సాగిస్తది. ఈనాడు ఇలా దొంగేడుపులు ఏడవడం ఇదే మొదటిసారికాదు. ఒకసారి శ్రీశైలం ఎడమగట్టు కూడా ఆంధ్రదే అని రాసింది. మరోసారి శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తే మంచినీటికి కటకట వస్తుందని వాపోయింది. కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఆంధ్ర ఆగమైపోతుందని ఇప్పుడు బెంగపడుతున్నది. అబద్ధానికి నోరెక్కువ అని సామెత. 


సమైక్యాంధ్ర నాయకత్వం, సమైక్య పత్రికలు నోరుపెట్టుకునే ఇంతకాలం తెలంగాణను శాసించాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అవే పెడబొబ్బలు, అరుపులతో తెలంగాణ ప్రజలపై స్వారీ చేయాలని చూస్తున్నాయి. చంద్రబాబునాయుడు, అంతకుముందు వారి మామ మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. దత్తత జిల్లాకు చంద్రబాబు చేస్తున్న మేలు ఇదా? అని మహబూబ్‌నగర్ వాసులు ప్రశ్నిస్తున్నారు.


ఒకటి వైఎస్ ఇచ్చినది.. మరోటి కిరణ్ ఇచ్చినది..


విచిత్రం ఏమంటే 2007 జూలై 7న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం డిండి ఎత్తిపోతలకు 1.3కోట్లతో పాలనాపరమైన అనుమతినిస్తూ జీవో విడుదల చేసినప్పుడు ఈనాడు ఏడవలేదు. 2013 ఆగస్టు 8న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కరువు జిల్లాకు 70 టీఎంసీల నీటిని తీసుకునే ఉద్దేశంతో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 6.91 కోట్ల ఖర్చుతో పాలనాపరమైన అనుమతులు ఇచ్చినప్పుడు కూడా ఈనాడు ఎటువంటి రాతలు రాయలేదు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను 2007లోనే అప్పటి మంత్రి జానారెడ్డి నల్లగొండ మునుగోడులో జరిగిన ఒక సభలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డికి సమర్పించారు. అప్పుడు కూడా ఈనాడు నోరు మెదపలేదు.


enadu1


ఇప్పుడు మాత్రం తెగ ఉడికిపోతున్నది. అప్పుడయినా ఇప్పుడయినా తెలంగాణ తీసుకుంటున్నది తనకు హక్కుగా ఉన్న కృష్ణా నదీ జలాలనే. కానీ ఇందులో ఏదో పెద్ద జగడం ఉన్నట్టు సీను క్రియేట్ చేసి, వివాదం సృష్టించి తెలంగాణ నోట్లో మట్టికొట్టాలన్న తాపత్రయం ఈనాడు రాతల్లో పదేపదే వ్యక్తం అవుతున్నది. ప్రాజెక్టులు మొదలుపెట్టినట్టు మొదలుపెట్టడం, జీవోలు ఇవ్వడం, వివాదాల్లో జొప్పించడం, ప్రజలను ఏమార్చడం సమైక్య ప్రభుత్వాల నాయకులకు చెల్లింది. ఆ జీవోలే ఉరితాళ్లవుతాయని వారు గుర్తించలేదు అని నీటిపారుదల నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. 


ఇంతకాలం ఆంధ్రకొక నీతి, తెలంగాణకొక నీతి అన్నట్టుగా నడిచింది. ఇప్పుడు కూడా అలాగే నడవాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.మరి పట్టిసీమకు అనుమతులేవి? గోదావరిపై చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పట్టిసీమకు అనుమతులేవీ అని ప్రశ్నిస్తే సంసారం చేయడానికీ కేసీఆర్ అనుమతి కావాలేమో! అని ఆంధ్ర ముఖ్యమంత్రి వెటకారం ప్రదర్శిస్తారు. గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ఉద్దేశించిన పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టాలంటే కచ్చితంగా తెలంగాణ ఆమోదం కావాలి. గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీటిని మళ్లించే పనయితే, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో 45 టీఎంసీల నీటిని నది ఎగువన ఉన్న ప్రాంతాలకు-అంటే తెలంగాణకు సర్దుబాటు చేయాలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. 


అదే విధంగా కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు కృష్ణలో సర్దుబాటు చేయాలని బచావత్ నివేదికలో పొందుపరిచారు. బచావత్ ఆదేశాల ప్రకారం ఆ 45 టీఎంసీలు లెక్కచెప్పకుండా పట్టిసీమను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తే చంద్రబాబు ఇష్టంవచ్చినట్టు మాట్లాడారు. ఇవ్వాళ గొంతెండిన ప్రాంతాలకు, కరువుతో అలమటిస్తున్న ప్రాంతాలకు నీరివ్వడానికి తెలంగాణ నడుంబిగిస్తే ఆ ప్రాజెక్టులకు అనుమతులేవి అని ఈనాడు, చంద్రబాబు కూడబలుక్కుని ప్రశ్నిస్తున్నరు. 


ఇదేమీ నదిపై ఆనకట్ట కాదు


తెలంగాణ ఆంధ్రతో కలవకపోయి ఉంటే ఎంతో బాగుపడి ఉండేది. తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినవారే లేరు. అయినా అక్కడి పరిస్థితులు గమనించి మేమే జూరాల ప్రాజెక్టును మంజూరు చేస్తున్నం. ఈ ప్రాజెక్టుకు 18 టీఎంసీల నీటిని కేటాయిస్తున్నం అని జస్టిస్ బచావత్ 1974లో పేర్కొన్నారు. ఆంధ్ర నాయకుల దుర్మార్గాలను ఏ నివేదికను కదిలించినా పట్టిస్తాయి. కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంత అంటే సమైక్య ప్రభుత్వాలు ఒకసారి 296 టీఎంసీలు అని చెప్పాయి. మరోసారి 368 టీఎంసీలు అని చెప్పాయి. ఈ వివరాలన్నీ జీవోల్లో, శాసనసభలో నీటిపారుదల మంత్రులు చేసిన ప్రసంగాల్లో ఉన్నవే. ఇప్పుడు కొత్తగా మేమేమీ కనిపెట్టినవి కాదు. 


ఇందులో 90 టీఎంసీలు మన చెరువులు కుంటలల్లోని నీటిని లెక్కేసి చెప్పారు. ఆ 90 టీఎంసీలు పోతే మిగిలిన 206 టీఎంసీలకూ లేక 278 టీఎంసీలకు ప్రాజెక్టులవారీగా లెక్కలు చెప్పాలిగా! ఈ ఐదున్నర దశాబ్దాల్లో తెలంగాణలోని అన్ని కృష్ణా ప్రాజెక్టుల కింద కలిపి 100 టీఎంసీలకు మించి ఎన్నడూ వాడుకోలేదు. ప్రాజెక్టులు లేవు. ఉన్న ప్రాజెక్టుల కింద నీళ్లు దక్కనివ్వలేదు అని నీటిపారుదల నిపుణుడు వివరించారు. 


నీళ్లు, నిధులు, నియామకాలకోసం కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. స్వరాష్ట్ర ఉద్యమానికి సారథ్యం వహించిన కే చంద్రశేఖర్‌రావే ముఖ్యమంత్రి కావాలని ఇక్కడి ప్రజలు కోరుకున్నారు. ఆయనయితేనే తెలంగాణ కలలను సాకారం చేయగలరని ప్రజలు భావించారు. ఆయన ఇప్పుడు తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టి తీరాలని ఆయన పట్టుదలతో ముందుకెళుతున్నారు అని ఆయన చెప్పారు.


కడుతున్నవేవీ కొత్తవి కాదు


తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదికి అడ్డంగా కొత్త ఆనకట్టలు కట్టడం లేదు. కొత్త ప్రాజెక్టులు నిర్మించడం లేదు. శ్రీశైలంలో నీళ్లు లభించినప్పుడు తమకు హక్కుగా కేటాయించిన నీటిని తీసుకోవడానికి ఎత్తిపోతల పథకాలను ప్రారంభిస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదీ జలాలను తిరిగి రెండు రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ వాదన వినాలని సుప్రీంకోర్టు బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. ట్రిబ్యునల్ తెలంగాణ వాదనలు విని కృష్ణా నీటిని పునఃపంపిణీ చేయాల్సి ఉంది. 


నీటి కేటాయింపుల విషయం తేలకుండా కృష్ణా బోర్డు చేయగలిగింది ఏమీ లేదు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చకుండా కృష్ణా బోర్డు ఏ అంశంపై చర్చిస్తుంది? అని నీటిపారుదల నిపుణుడొకరు ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏవైనా ప్రాజెక్టులు చేపట్టాలంటే అనుమతులు కావాలి. విభజనకు ముందే రూపకల్పన ప్రాజెక్టులకు ఎటువంటి ఆంక్షలు లేవు.


జటిలం చేసేందుకు ఈనాడు కుట్ర


కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ పరిశీలించని జలవివాదాలు ఏవైనా తలెత్తితే కేంద్రం కొత్తగా ఒక ట్రిబ్యునల్‌ను వేయాలి అని పునర్విభజన చట్టంలోని 84 సెక్షన్ 3(4) స్పష్టంగా పేర్కొంది. కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడింది. అంతేకాదు ఒకే రాష్ట్రంగా పరిగణించి నివేదికను రూపొందించింది. ఇప్పుడు రెండు రాష్ర్టాలుగా విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్ర మధ్య నీటి పంపిణీ సమస్యను ట్రిబ్యునల్ పరిశీలించలేదు. ఎవరి వాటా ఎంతో తేల్చలేదు. 


అది తేల్చాలని తెలంగాణ కోరుతున్నది. ఐదున్నర దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని తెలంగాణ కోరుతున్నది. ఒకవైపు ఇటువంటి ప్రయత్నాలు కొనసాగుతుంటే మరోవైపు ఈనాడు వంటి పత్రికలు తరచూ లేని వివాదాలను ముందుకు తెచ్చి, సమస్యను జటిలం చేయాలని చూస్తున్నాయి. ఆంధ్ర యాజమాన్యాల్లో నడుస్తున్న పత్రికలు బతికేది హైదరాబాద్ ఆదాయంతో. నడిచేది ఇక్కడి పాఠకుల సొమ్ముతో. కానీ వారు నిత్యం ఆలోచిస్తున్నది, రాస్తున్నది ఆంధ్ర పక్షపాతంతో. ఒక్క రోజయినా తెలంగాణ మేలుకోరి ఒక్క వార్తయినా ఈ పత్రికలు రాస్తున్నయా? వీళ్లు ఇంకా ఎప్పుడు మారుతరు? ఏమిటి వీళ్ల ధీమా? అని తెలంగాణ జర్నలిస్టు, రచయిత ఒకరు ప్రశ్నించారు.


ఒక్కటీ నిలిచేది కాదు


ఈనాడు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ లేఖలోని ఏ అంశం కూడా నిలబడేది కాదు. ఎందుకంటే ఏపీ సర్కారు చెప్పినట్లు.. ఇవి కొత్త ప్రాజెక్టులు కావు. ఆ లేఖలో రాసిన మొదటి పాయింటు.. విభజన చట్టం-2014 లోని సెక్షన్ 84(3) ప్రకారం కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిశీలనకు, కేంద్ర జల సంఘం అంగీకారానికి పంపాలి.. ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తెలపాలి.. అని పేర్కొన్నారు. సరిగ్గానే చెప్పారు. కొత్త ప్రాజెక్టులు ఏవి నిర్మించినా పై ప్రక్రియ నడవాల్సిందే. కానీ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రస్తుత రెండు ప్రాజెక్టులు కొత్తవి కాదే! గత ప్రభుత్వంలో పరిపాలన అనుమతులు జారీ అయిన ప్రాజెక్టులే! ఈ నేపథ్యంలో ఈ పాయింట్ ఎట్టిపరిస్థితుల్లోనూ చెల్లుబాటు కాబోదు. 


తదుపరి.. సెక్షన్ 85(8)డీ ప్రకారం కృష్ణా, గోదావరిలో కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం జరిగిన కేటాయింపులపై ఎలాంటి ప్రభావం ఉండదన్న నిర్థారణకు వచ్చిన తర్వాతనే పరిగణనలోకి తీసుకోవాలి.. అని పేర్కొన్నారు. ఇదీ సరైనదే. ఈ రెండూ కొత్త ప్రాజెక్టులు కావన్న సమాధానమే దీనికీ వర్తిస్తుంది. మూడో పాయింటులో విభజన చట్టం 11వ షెడ్యూలులోని ఏడవ పేరాలో ఏముందో చెప్పారు. అందులోనూ కొత్తగా చేపట్టే ప్రాజెక్టులనే రాశారు. 


కృష్ణా ట్రిబ్యునల్-2 కాలపరిమితిని కూడా లేఖలో ప్రస్తావించారు. నిజానికి కృష్ణా ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ర్టానికి కేటాయింపులు చేసింది తప్పించి.. ఉమ్మడి రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు విడిగా కేటాయింపులు జరుపలేదు. రాష్ట్ర విభజన దరిమిలా కృష్ణా ట్రిబ్యునల్‌లో తెలంగాణ మరో భాగస్వామిగా చేరింది. కృష్ణా ట్రిబ్యునల్ పరిశీలించని జల వివాదాలు ఏవైనా తలెత్తితే కేంద్రం కొత్తగా ఒక ట్రిబ్యునల్ వేయాలని విభజన చట్టంలోని 84వ సెక్షన్ 3(4) స్పష్టంచేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ర్టాలుగా విడిపోయి రీత్యా తన వాటా ఎంతో తేల్చాలని తెలంగాణ కోరుతున్నది. ఇందుకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. చివరి అంశంలోనూ తన అభ్యంతరం కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపైనేనంటూ ఏపీ స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో ఈ లేఖకు విలువెక్కడిదని నీటిపారుదల నిపుణులు ప్రశ్నిస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


మంగళవారం, జూన్ 16, 2015

ఒంటరినై పోయాను...ఇక ఇంటికి (ప్రజల్లోకి) ఏమని పోను?

ఏకాకి బాబు!

chandra


ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకాకిగా మారిపోతున్నారు. కేంద్రంలో పెద్దలను కలిసినా ఫలితం లేకపోవడం, గవర్నర్ వద్దే తేల్చుకోవాలని సలహా ఇవ్వడంతో ఇక ఈ కేసు నుంచి తనను బయటపడేసే బాధ్యతను ఏపీ పోలీసుల నెత్తిపైనే పెట్టినట్లు తెలుస్తున్నది. ఎంత ఆగ్రహంతో ఊగిపోతూ ఆదేశాలు ఇస్తున్నప్పటికీ.. వారు సైతం కేసు బలంగా ఉన్న నేపథ్యంలో చేతులెత్తేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు చంద్రబాబు రాజీనామాకు విపక్షాలు మూకుమ్మడి గొంతుతో డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు స్వపక్షంలో అసమ్మతిరాగం పెరుగుతున్నది.
-నరసింహన్‌ను కలిసిన సీఎం కేసీఆర్
-బాబు ఫోన్ ట్యాపింగ్‌కు ఆస్కారమే లేదు
-నగరంలో శాంతి భద్రతల సమస్య లేదు
-సెక్షన్ 8 ప్రసక్తే ఉత్పన్నం కాదని వివరణ
-ఓటుకు నోటు కేసులో మూసుకుపోయిన దారులు
-జోక్యం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విముఖత
-బయటపడేయాలని సొంత పోలీసులపై బాబు ఒత్తిడి
-చేతులెత్తేస్తున్న ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు
-గవర్నర్ సలహాదారులను పిలిపించడంపై రగడ
-బాబు రాజీనామాకు కాంగ్రెస్, లెఫ్ట్ డిమాండ్

ఇవి సరిపోవన్నట్లు.. గవర్నర్ సలహాదారులను చంద్రబాబు తన ఇంటికి పిలిపించుకుని వారికే సలహాలు ఇవ్వడం కొత్త వివాదానికి దారితీస్తున్నది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలిసి దాదాపు గంటన్నరపాటు చర్చలు జరుపడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపింది. పలు ఇతర అంశాల ప్రస్తావనతోపాటు ఓటుకు నోటు కేసు, హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు వంటి అంశాలు కూడా ఉభయుల మధ్య చర్చకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

వివాదం రేపుతున్న సలహాదారులతో భేటీ


ఓటుకు నోటు కేసులో తన పేరు చార్జిషీటులోకి ఎక్కడం ఖాయమని తేలిపోవడంతో కేంద్రాన్ని సంప్రదించిన బాబుకు.. అక్కడి నుంచి వచ్చిన సలహా ఆయన పరిస్థితిని పెనం నుంచి పొయ్యిలో పడేసినట్లయింది. ఈ విషయంలో మాట్లాడేందుకు రావాలని గవర్నర్ ఆహ్వానించినప్పటికీ.. తానెందుకు వెళ్లాలన్న అక్కసుతో వెళ్లకుండా.. ఆయన సలహాదారులను ఇంటికి పిలిపించుకున్నారు. ఒక గవర్నర్‌కు సలహాదారులుగా ఉన్నవారిని ఒక ముఖ్యమంత్రి పిలిపించుకోవడం ఏంటనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తున్నది. పైగా వారిని తప్పుదోవ పట్టించేందుకు బాబు ప్రయత్నించారన్న ఆరోపణలు భారీస్థాయిలో వినిపిస్తున్నాయి.

పాలనపరంగా, లేదా ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు గవర్నర్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు సలహాదారులను కేంద్రం నియమించింది. ఆ బాధ్యతల్లో ప్రస్తు తం మాజీ ఐపీఎస్ మహంతి, మాజీ ఐఏఎస్ శర్మ ఉన్నారు. అయితే వీరు కేవలం గవర్నర్‌కు మాత్రమే సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గవర్నర్ సూచనల మేరకు ఇరు రాష్ర్టాల ప్రభుత్వాధికారులకు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రొటోకాల్‌ను పక్కనపెట్టిన చంద్రబాబు.. ఆ ఇద్దరు సలహాదారులను తన ఇంటికి పిలిపించుకోవడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

పైగా సెక్షన్ 8 అమలుకు గవర్నర్‌పై ఒత్తిడి తేవాలని, ఆ మేరకు ఆయనకు సూచనలివ్వాలని చెప్పడమేకాకుండా.. తాను చెప్పే అంశాలను గవర్నర్‌కు చెప్పి అమలు చేయించాలని పదే పదే సలహాదారులపై బాబు ఒత్తిడిచేశారని గవర్నర్ కార్యాలయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నేరుగా గవర్నర్ పిలిస్తే వచ్చి ఆయనే ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా! మాకేంటి ఈ గోల? అని గవర్నర్ కార్యాలయం అధికారులు
వాపోతున్నారు. అసలు గవర్నర్ సలహాదారులపై చంద్రబాబు పెత్తనమేంటన్న ప్రశ్నలను కూడా విపక్షాలు లేవనెత్తుతున్నాయి.

ఏపీ పోలీసులపై తీవ్ర ఒత్తిడి!


కేంద్రం పట్టించుకోకపోవడంతో సొంత పోలీసులపైనే ఆధారపడుతున్న చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో తనను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే కేసు బలంగా ఉన్న నేపథ్యంలో ఏపీ అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రోజుకు నాలుగైదుసార్లు ఏపీ డీజీపీ, ఏసీబీ డీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌తో సమావేశమవుతున్న చంద్రబాబు.. తనను బయటపడేసేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలంటూ ఆదేశాలు ఇస్తున్నారని తెలిసింది. నోటీసులిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి? నోటీసులు తీసుకోకుంటే ఏమవుతుంది? నోటీసులు లేదా సమన్లు ఇస్తే స్టే తెచ్చుకోవాలా? అన్న పలు అంశాలపై మార్గాలు వెతకండి అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడని ఏపీ పోలీసు వర్గాలు తెలిపాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లలో నోటీసులు ఇప్పించేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ నుంచి నాకు నోటీసులు వస్తే ప్రతిగా మనం కూడా నోటీసులు ఇవ్వాలి అని స్పష్టంచేసినట్లు తెలిసింది. చంద్రబాబు ఆగ్రహావేశాలతో ఏపీ పోలీసులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. తాను తప్పుచేసి కూరుకుపోయి.. తమను కూడా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు.

ముప్పేట విమర్శల దాడి


ఓటుకు నోటు కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామాకు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ కేసులో బాస్ చంద్రబాబేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. ఏ-1 రేవంత్‌రెడ్డి కాదని, చంద్రబాబేనని అన్నారు. చంద్రబాబు రాజీనామా చేసి, విచారణ ఎదుర్కొని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజలకు చెందాల్సిన సొమ్ము దోపిడీ చేస్తూ తెలంగాణలో టీడీపీనీ బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

అందులోభాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి తెరతీశారని విమర్శించారు. తాను అవినీతిలో కూరుకుపోయి గవర్నర్‌పై విమర్శలు చేయడం తగదని చంద్రబాబుకు హితవు పలికారు. సీపీఐ సీనియర్ నేత కే నారాయణ కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో టేపులు కూడా దొరికిపోయిన తర్వాత ఏపీ సీఎం ఎంత దబాయించినా ప్రయోజనం లేదని నారాయణ అన్నారు. చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. వీడియో, ఆడియో టేపులు బయటపడడంతో చంద్రబాబు దిక్కుతోచక ఇతర అంశాలు ముందు పెట్టి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎత్తుకున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేనప్పటికీ అభ్యర్థిని నిలబెట్టడమే టీడీపీ చేసిన తప్పిదమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామనే ధీమా ఉండటం వల్లే అభ్యర్థిని నిలిపిందని అర్థమవుతున్నదని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు బుకాయింపు ధోరణి విడనాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత చూసుకోవాలని, ముందు తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయవిచారణకు సిద్ధం కావాలని హితవు పలికారు. ఆరోపణలు రుజువుచేసుకోకుండా దీనిని రెండు రాష్ర్టాల సమస్యగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య చిచ్చురేపడం సరికాదన్నారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. టీవీ చానళ్లలో ప్రసారమైన టేపుల వాయిస్‌ను వింటే క్లియర్‌గా అర్థమవుతుందన్నారు.

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్


ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఢిల్లీ పెద్దలను గవర్నర్ కలిసివచ్చిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాష్ర్టాల సీఎంలతో గవర్నర్ మాట్లాడే అవకాశం ఉందని రెండు రోజుల ముందే వార్తలు వచ్చాయి. అయితే.. గవర్నర్ పిలిచినా చంద్రబాబు ఆయనతో సమావేశం జరిపేందుకు వెళ్లలేదు. ఈ తరుణంలోనే గవర్నర్‌ను కలిసిన కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ఓటుకు నోటు వ్యవహారం, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు రుజువు చేసే ఆడియో టేపులు బయటపడిన విషయం, రాజధానిలో సెక్షన్ 8 అమలు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

చంద్రబాబు సంభాషణల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని గవర్నర్‌కు కేసీఆర్ స్పష్టం చేశారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌లకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పారని, చట్ట ప్రకారం స్వతంత్రంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారని సమాచారం. కావాలనే తమ ప్రభుత్వంపై, తనపై ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు, ఇతర మంత్రులు విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు కేసీఆర్ తెలిపారని సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారాన్ని రెండు రాష్ర్టాల మధ్య వివాదంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తమ వద్ద ఉన్న సమాచారాన్ని గవర్నర్ ముందు కేసీఆర్ ఉంచినట్టు తెలుస్తున్నది.

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు అంశాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు, ఇతర నేతలు ఈ డిమాండ్ చేస్తున్నది కేవలం తమ ప్రభుత్వంపై బురదజల్లాలనే కుట్ర, అక్కసుతోనేనని కేసీఆర్ స్పష్టంచేసినట్లు సమాచారం. గడిచిన ఏడాదికాలంలో నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్న విషయాన్ని గవర్నర్‌కు గుర్తు చేసిన కేసీఆర్.. సెక్షన్ 8 ఆలోచనకే ఆస్కారం లేదని అన్నట్లు తెలిసింది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వ పరంగా తాము కంకణబద్ధులై ఏర్నామని స్పష్టంచేసినట్లు తెలుస్తున్నది. ఇదే సందర్భంలో ఇద్దరు గవర్నర్ సలహాదారులు ఏపీ సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా కలవడాన్ని నరసింహన్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్ళినట్టు సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


సోమవారం, జూన్ 15, 2015

నడిస్తే రాజభోగం...నడవకపోతే అరాచకం...



ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా కేంద్రానికి రాసిన లేఖ ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నది. హైదరాబాద్‌లో అరాచకం ఉందట. అభద్రత ఉందట. ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారట. ఇంత స్వేచ్ఛగా అబద్ధాలను చెలామణి చేసే నాయకుడు మరొకరు కనిపించరు. నడిస్తే రాజభోగం, నడవకపోతే గందరగోళం. సాగితే తన గొప్పతనం, సాగకపోతే ఎదుటివాడి అరాచకం. చంద్రబాబు మారడు. మారలేడు. ఆయన జీవితంలో తప్పులు ఒప్పుకున్న సందర్భంగానీ, తప్పులు గుర్తించిన సందర్భంగానీ, పశ్చాత్తాపపడిన సందర్భంగానీ ఇంతవరకు చూడలేదు. నిన్న కొందరు బాధితులు వచ్చారు. విలేకరుల సమావేశం పెట్టారు. రేవంత్‌రెడ్డి గోపనపల్లిలోని తమకు చెందిన 4000 గజాల భూమిని ఎలా కబ్జా చేశాడో వివరించారు. విషాదం ఏమంటే ఆ బాధితులు గుంటూరు జిల్లా వారు. కబ్జాలు యథేచ్ఛగా జరిగింది సమైక్య పాలనలోనే. కబ్జాకోరులంతా ఉంది టీడీపీ, కాంగ్రెస్‌లలోనే. 

హైదరాబాద్‌లో నిజమే అరాచకం ఉండేది:
హైదరాబాద్‌ను అరాచకాల రాజధానిగా మార్చిన చరిత్ర టీడీపీదే. ఇక్కడ ఫ్యాక్షనిస్టు హత్యలు జరిగింది టీడీపీ హయాంలోనే. ఉన్నట్టుండి మనుషులు మాయమైంది టీడీపీ పాలనలోనే. రాయలసీమకు బయలుదేరినవారు మహబూబ్‌నగర్ హైవే వెంట శవాలుగా తేలింది చంద్రబాబు రాజ్యంలోనే. విచిత్రంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలోనే ఎమ్మార్వో కార్యాలయాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. భూమి రికార్డులు దగ్ధం చేయడం, కొత్త రికార్డులు సృష్టించడం, ప్రభుత్వ స్థలాలకు పత్రాలు తయారు చేయడం, వందల ఎకరాల భూములు కబ్జా చేయడం ఇదంతా బాబు పాలనలోనే మొదలయింది. రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబు స్టైలు పాలనను కొత్త పుంతలు తొక్కించారు. ఇద్దరిదీ క్విడ్ ప్రో క్వోనే. ఇద్దరిదీ ఇచ్చి పుచ్చుకునే పద్ధతే. చంద్రబాబు స్మార్టుగా చేశాడు. రాజశేఖర్‌రెడ్డి నేకెడ్‌గా చేశాడు. చంద్రబాబు దొరకలేదు. రాజశేఖర్‌రెడ్డి దొరికేట్టు చేశాడు. భవనాలు, లేఅవుట్లు, భూముల క్రమబద్ధీకరణ పేరిట చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన జీవోలు, కొల్లగొట్టిన భూములపై విచారణ వేయడానికి ఒక్క కమిషను చాలదు. చంద్రబాబు అన్యాక్రాంతం చేసిన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులపై విచారణ చేస్తే ఆయన హైదరాబాద్‌కు చేసిన ద్రోహం బట్టబయలవుతుంది. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి పాలనలో నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతాయి. హంతకులెవరో దేశానికి తెలుస్తుంది. పత్రికల్లో వస్తుంది. కానీ విచారణలో నిర్దోషులుగా బయటపడతారు. అరాచకం అంటే ఇదీ.

కానీ చంద్రబాబుది ఇప్పుడు దొరికిపోయిన దొంగ మానసిక స్థితి. తన మీదికి వస్తున్న ప్రమాదపు రైలును ఎటో మళ్లిద్దామని ఢిల్లీదాకా వెళ్లి లడ్డూలిచ్చి లాబీయింగ్ చేసి వచ్చాడు. వారేమీ కరుగలేదు. చలించలేదు. ఈయన కథలు బాగా అర్థం చేసుకున్నవారు కదా. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని తెలుసు. ఈయన ఎంత గాలివాటం మనిషో కూడా వారికి తెలుసు. ఈయన ఎప్పుడెప్పుడు ఏం నాటకాలు ఆడారో రికార్డులతో సహా నరేంద్ర మోదీకి తెలుసు. అందుకే వారు విన్నారు కానీ కనికరించలేదు. బీజేపీకి చంద్రబాబు వ్యవహారం అర్థం అయింది. అందుకే రాష్ట్రంలో కూడా ప్రతిచిన్న విషయానికీ గళమెత్తే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఇతరులు కొద్ది రోజులుగా మీడియా ముఖం చూడడం మానేశారు. చంద్రబాబును సమర్థించడానికి వారి వద్ద మాటలు లేవు. కనీసం వారు రేవంత్‌రెడ్డి కూతురు నిశ్చితార్థంలో కనిపిస్తారేమోనని అందరూ చూశారు. అంటే వారికి ఇది బురద అని అర్థమయింది. బురదకు దూరంగా ఉండాలనీ అర్థమయింది. ఢిల్లీ పెద్దలకూ అదే నివేదించారని తెలుస్తున్నది. మోడీ ఎటువంటి హామీలు ఇవ్వలేదు కాబట్టే చంద్రబాబు ఇక్కడికి రాగానే లేఖాస్త్రం సంధించాడు. చంద్రబాబు తన దుఃఖాన్ని ఆంధ్ర ప్రజలందరి దుఃఖంగా, తన నేరాన్ని అందరి నేరంగా మల్చాలని చూస్తున్నారు. గవర్న ర్ నిన్ననే ఢిల్లీలో ఒక మాట చెప్పి వచ్చారు. 

అంతా ప్రశాంతంగా ఉంది. విభజన విద్వేషాలు లేవని చెప్పారు. గవర్నర్ అక్కడ ఈ మాట చెప్పి వచ్చిన మరుసటిరోజు చంద్రబాబు ఇక్కడ అరాచకం కొనసాగుతున్నదంటూ లేఖ రాశాడు. ఈ రెండు అభిప్రాయాల మధ్య దూరమెంతో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ఢిల్లీ పెద్దలు. హైదరాబాద్‌లో అరాచకం ఉందంటూ చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాస్తున్న సమయానికి హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో తెలంగాణ పారిశ్రామిక విధానం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. వందలాది మంది పారిశ్రామిక వేత్తలు, వివిధ కం పెనీల సీఈఓలు అందులో పాల్గొన్నారు. వారు కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెబుతున్నారు. హైదరాబాద్ తమ పెట్టుబడులకు అనువైన కేంద్రమని ప్రకటించారు. ఐటీసీ దేవేశ్వర్ వంటి వారు అక్కడికక్కడే 8000 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించారు. రుయా గ్రూపు రైల్వే బోగీల కోచ్ ఫ్యాక్టరీని ఆంధ్రలో కాకుండా తెలంగాణలో పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబాబు లేఖారాతలకు, వాస్తవికతకు మధ్య ఎంత అంతరం ఉందో దీన్నిబట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబునాయుడు ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేవంత్‌రెడ్డితో తనకు సంబంధంలేదని, ఆయనంతట ఆయన ఈ ఆపరేషను చేశారని, తనకు తెలియకుండా తన పేరు వాడుకున్నారని చెప్పడానికి ఒకింత అవకాశం ఉండె. కానీ మరుసటిరోజే బాబుగారు మాట్లాడిన ఫోను సంభాషణ బయటికి వచ్చింది. అందుకే ఇప్పుడు మింగలేని కక్కలేని బాధ. ఇప్పుడయినా రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి వెలివేసి, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని పార్టీలో కొందరు పెద్దలు సలహాలిస్తున్నారు. అది ఇంకా ప్రమాదకరమని చంద్రబాబుకు తెలుసు. రేవంత్‌రెడ్డిని పార్టీకి దూరం చేస్తే, ఆయన ఊరుకుంటాడా? రేవంత్‌రెడ్డి అప్రూవరుగా మారి బాబే ఈ పని చేయించడానికి న్యాయస్థానం ముందు చెబితే, చంద్రబాబు కటకటాలు చూడాల్సి వస్తుంది. అందుకే దొరికిపోయి, కేసుల పాలు చేశాడని రేవంత్‌రెడ్డిపై ఎంత కోపం ఉన్నా, దానిని అదిమి పట్టుకుని ఆయన బిడ్డ నిశ్చితార్థానికి మంత్రివర్గాన్నంతా తరలించారు. పెదబాబు, చినబాబు ఏకచ్ఛత్రాధిపత్యంపై ఇంతకాలంగా గుర్రుగా ఉన్న టీడీపీ సీనియర్లు, సీనియర్ మంత్రులు చంద్రబాబుకు వచ్చిన కష్టం పట్ల కాస్త సంతోషంగా ఉన్నారు. భలే ఇరుక్కున్నాడు. తగిన శాస్తి జరిగింది. ఈయనకు కేసీఆరే మొగుడు వంటి వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులున్నారు. చంద్రబాబు ఇటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటాడని జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఊహించలేదు. ఇరుక్కున్నదే తడవుగా ఆయన ఆంధ్రలో విజృంభిస్తున్నారు. 

ఇంతకాలం తనొక్కడే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అటువంటి కూపంలోనే చిక్కుకున్నారు. చంద్రబాబు ఎందులో గొప్ప అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దొంగతనం గురించి ప్రచారం చేస్తూ ఊరూవాడా కలియదిరుగుతున్నాడు. జనం నమ్ముతారా లేదా అన్నది తర్వాత. కానీ ఆయన పని ఆయన చేసుకుపోతున్నారు.

ఇదే అదనుగా జగన్‌కు, కేసీఆర్‌కు పొత్తు పెట్టి ఆంధ్రలో విద్వేషాలు రెచ్చగొట్టాలని చంద్రబాబు, ఆయన చెంచా మీడియా ప్రచారం చేస్తున్నది. చంద్రబాబు పాపాలకు అండగా అక్కడ జనాన్ని సమీకరించాలని వారంతా తాపత్రయపడుతున్నారు. జగన్ కు తెలంగాణకు సంబంధం లేదు. జగన్ పార్టీ తెలంగాణలో ఇర్రిలవెంట్ అయిపోయింది. జగన్ ఇక్కడ ఏమీ పుల్లలు పెట్టడడం లేదు. ఆయన సోదరి యాత్రలు చేసి నా, ఆయన యాత్రలు చేసినా ఇక్కడ జనం పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. జగన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం తెలంగాణకు గానీ, టీఆరెస్‌కు గానీ రాలేదు. జగన్ పొత్తు పెట్టుకోవలసిన అవసరం కానీ, పంచాయితీ పడవలసిన అవసరం కానీ తెలంగాణకు లేదు. 

తెలంగాణకు వ్యతిరేకంగా సమస్యలు సృష్టిస్తున్నది, గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నది, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నది చంద్రబాబు ఒక్కరే. కొందరు రోగ్ నేతలను పోషించి నిత్యం అడ్డగోలు కూతలతో తెలంగాణ ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నది చంద్రబాబే. తెలంగాణ ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఉండనీయనిది చంద్రబాబే. చంద్రబాబు తెలంగాణ ఏర్పడడాన్ని, సమస్యలు లేకుండా ముందుకు సాగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. కరెంటు లేక అల్లకల్లోలం అవుతుందని ఊహించారు. అది జరుగలేదు. తమ చెంచా మీడియాను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వంపై కృత్రిమ ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. తెలంగాణ విఫలమవుతుందని, కేసీఆర్ నిభాయించుకోలేరని, 2019లో మళ్లీ మనమే గెలుస్తామని ఒక ఎండమావిని ప్రచారంలో పెట్టి హైదరాబాద్‌లో నిత్యం కుంపటిని రాజేయాలని చూశారు. చంద్రబాబు స్వయంగా చెంచా మీడియాకు చెబుతున్నారో లేక చెంచా మీడియానే చంద్రబాబుకు చెబుతున్నదో, అదీగాక ఇద్దరూ ఒకే అజ్ఞానపు వేవ్‌లెన్త్‌తో ఆలోచించి మాట్లాడుతున్నారో తెలియదు. అవేవీ జరుగలేదు. జరిగే అవకాశం లేదు. చంద్రబాబును సమర్థించే పత్రికల్లో ఒక పత్రికాధిపతి మరో పత్రికాధిపతి గురించి చెప్పినట్టుగా ఒక మాట వాడుకలోకి వచ్చింది. ఆయన సలహాలు విన్నోడెవడూ బాగుపడలేదు అని పెద్ద పత్రికాధిపతి అన్నట్టు చెబుతున్నారు. అది నిజమో కాదో తెలియదు. కానీ విద్వేషోన్మాదం ఎప్పుడూ ఎవరికీ మేలు చేయలేదు. చేయదు. వాళ్లు ఎవరికయినా భష్మాసురులవుతారు. చంద్రబాబు వదిలించుకోవాల్సింది ఇంట్లో పనిచేసే తెలంగాణ పనిమనుషులను, సిబ్బందిని, పోలీసులను కాదు, ఎప్పుడూ వంకర ఆలోచనలు చేసే సలహాదారులను. చంద్రబాబుకు సంకటం వచ్చింది బయటివాళ్లవల్ల కాదు, తన మనుషులు అనుకున్న తమ్ముళ్ల నుంచి.

మరొక్క అంశం... ఇప్పుడు చంద్రబాబు ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రో, మంత్రులో ఇరుక్కుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వారి చానెళ్లు ఎలా వ్యవహరించేవి? భూమ్యాకాశాలు ఏకం చేసి టీఆరెస్ ప్రభుత్వం దిగిపోవాలని కత్తికట్టి నాట్యం చేసేవి. ఉన్నవీ లేనివీ పోగేసి అన్ని గుదిగుచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంతగా నవ్వులపాలు చేయాలో అంతగా నవ్వులపాలు చేసేవి. ’చూశారా, తెలంగాణ వాళ్లకు పరిపాలించుకోవడం రాదు. తెలంగాణ విఫలమవుతోంది చూడండ” అని ప్రచారం చేసేవి. నిన్న మొన్న కూడా కొందరు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల మీద చిన్న చిన్న విషయాలకే రోజంతా పేరిణి శివతాండవం చూపించిన ఈ పత్రికలు, చానెళ్లు ఇంత పెద్ద నేరం జరిగితే ఎందుకు తేలుకుట్టిన దొంగల్లా, కుడితిలో పడిన బల్లుల్లా వ్యవహరిస్తున్నాయి. ఆ పత్రికలు ఇప్పుడు చంద్రబాబు పక్షాన రోజూ డిఫెన్సు ఆడుతున్నాయి. చంద్రబాబును సమర్థించడానికి, ఆయన తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. టాపింగ్ ఎలా తప్పో వాదిస్తున్నాయి. తెలంగాణ పోలీసులు చేసిన ఆపరేషనులో తొర్రలు కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. దొంగతనం చేసిన వారిని వదిలేసి, దొంగను పట్టుకున్నవారి గురించి వేలెత్తి చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ ఆంధ్ర అనుకూల స్వభావాన్ని ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శిస్తున్నాయి. ఈ పత్రికలు ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి తమ వార్తలను వండుతున్నాయనడానికి ఇంతకంటే నిదర్శం ఏముంటుంది? నిజానికి ఎవరేం చేసినా తెలంగాణ ఏర్పాటు ఎన్నటికీ విఫల ప్రయోగం కాజాలదు. స్వరాష్ట్ర ఫలితాలను ఇప్పటికే చవిచూస్తున్నది. భవిష్యత్తంతా తెలంగాణదే.



వ్యాసకర్త: కట్టాశేఖర్ రెడ్డి
kattashekar@gmail.com

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



ఆదివారం, జూన్ 14, 2015

రేవంత్ తప్పు చేస్తే నన్నెందుకు లాగుతారు?



-ఇండియాటుడే టీవీ ఇంటర్వ్యూలోచంద్రబాబు
-రాజ్‌దీప్ సూటి ప్రశ్నలకు సమాధానాలు దాటవేత
-ఇంటరాగేట్ చేయడానికి ఏసీబీ ఎవరని కస్సుబుస్సు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తప్పు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు.. మాటలో మాటగా ఈ వాస్తవాన్ని ఒప్పేసుకున్నారు. తమ ఎమ్మెల్యే తప్పుచేస్తే తననెందుకు లాగుతున్నారని అమాయకంగా ప్రశ్నించారు. సంభాషణల్లో బయటపడిన గొంతే మీదేనా? వాయిస్ టెస్ట్‌కు, లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమేనా? అని రాజ్‌దీప్ ఎంత సూటిగా ప్రశ్నించినా.. డొంక తిరుగుడు సమాధానాలతో తప్పించుకున్నారు. ఇది కట్ అండ్ పేస్ట్, మానిప్యులేషన్ అన్నచంద్రబాబు.. అదే విషయంలో మళ్లీ ప్రశ్నించగా.. ఏమో తనకు తెలియదని బదులిచ్చారు. గొంతు మీదేనా? అని మరోసారి ప్రశ్నిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలాబలాలపై వివరణ ఇచ్చారుకానీ.. అసలు సంగతి చెప్పనేలేదు. ఒక కార్యకర్త తప్పుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని, కానీ తననెందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. మీరు టీడీపీ అధ్యక్షులుకనుక.. టెలిఫోన్ సంభాషణల్లో మీ గొంతు ఉన్నదికనుక.. అని రాజ్‌దీప్ పేర్కొనగా.. తనకూ ఏసీబీ ఉందని, తనకూ పోలీసులు ఉన్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే తప్పనిసరిగా ప్రతిస్పందించారు. అంతేకానీ.. తన గొంతును నిర్ధారించేందుకు మాత్రం చంద్రబాబు ముందుకు రాకపోవడం విశేషం.


రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి, చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది...




రాజ్‌దీప్: ఓటుకు నోటు కుంభకోణంలో బయటికి వచ్చిన ఆడియో సంభాషణల్లో గొంతు మీదేనని తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. అది మీ గొంతు కాదంటూ మీరు ఖండిస్తున్నారు!

చంద్రబాబు: అది నా గొంతేనని మొదట వాళ్లు ఎలా చెప్పగలరు? ఇది పూర్తిగా అవాస్తవం.


ఇది మీ గొంతా? కాదా? అది వేరేవాళ్ల గొంతా?



ఇది కల్పించినది. దీనిని మొదట కేసీఆర్‌కు చెందిన టీ న్యూస్ చానల్ లీక్ చేసింది. ఆయనకు ఎక్కడినుంచి సమాచారం వచ్చింది? ఇది మొదట ఆయన సమాధానం చెప్పాలి. మీరే (కేసీఆర్) సృష్టించి.. మీరే నాపై బురదజల్లుతున్నారు.

అది మీ గొంతు కాదని చెప్తున్నారా? ఎందుకంటే.. ఈ సంభాషణను ఎవరు విన్నా.. అది చంద్రబాబునాయుడు గొంతేనని చెప్తున్నారు.



ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో అనేక మార్గాలు ఉన్నాయి. కట్ అండ్ పేస్ట్, వక్రీకరించడం..

అది కట్ అండ్ పేస్ట్, వక్రీకరణ అని మీరు చెప్తున్నారా?



ఏమో నాకు తెలియదు. మేం ఈ విషయాలన్నీ కనిపెట్టాలి.

ఏసీబీ విచారణకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా?



ఏసీబీ ఏమిటి? నన్ను ఇంటరాగేట్ చేయడానికి మీరెవరు? ఇదొక రాష్ట్రం. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని. మీరు వేరొక రాష్ట్రం ఏసీబీ. ఇది ఉమ్మడి రాజధాని ఈ రోజు. ఉమ్మడి రాజధానిలో మీకు నాపై అధికారాలు ఎక్కడివి?

ఏసీబీ విచారణలో భాగంగా మీకు సమన్లు ఇవ్వాలని వారు అనుకుంటున్నారు.



మీరెవరు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు నా ఫోన్లు ట్యాప్ చేయలేరు. హైదరాబాద్‌లో నా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు.

తాము ఏపీ సీఎం ఫోన్లు ట్యాప్ చేయలేదని పేర్కొంటూ ఏసీబీ నాకు ఈ రోజు ఒక ఎస్‌ఎంఎస్ పంపింది.



నేనేకాదు.. నా ప్రజల సంగతేంటి? మా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు.

మీరు దానిని నిరూపించగలరా?



మేం నిరూపిస్తాం. మీరే చూస్తారు. విచారణకు డిమాండ్ చేస్తున్నాం.

పోన్ ట్యాపింగ్ సంగతిని పక్కన పెడితే.. మీ గొంతు విషయంలో స్పష్టతకు వద్దాం. విడుదలైన టేపులో గొంతు మీదేనని తేలిపోతున్నది. మీరు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ అన్నీ నెరవేరుస్తామని చెప్పారు. మీరు ఆ ఆడియో విషయంలో వాయిస్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నారా?




ఈ విషయంలో మరికొన్ని అంశాలు చూడాలి. తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌ఎస్ స్ట్రెంత్ ఎంత? ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు? వారికి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టారు. వారికి 85 మంది ఎమ్మెల్యేలు కావాలి. ఆ ఓట్లు ఎక్కడి నుంచి సంపాదించారు? దానికి మొదట సమాధానం చెప్పాలి.

సో.. మీ ఎమ్మెల్యేలను వల్లోవేసుకున్నారని అంటారా?



వలలో వేసుకోవడమే కాదు.. మా ఎమ్మెల్యేలతో వారు రాజకీయ బేరసారాలకు పాల్పడ్డారు. మోసం చేశారు. బెదిరించారు.

కానీ.. మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా కెమెరాలకు చిక్కారు.



మీరు పూర్తిగా పొరబడుతున్నారు. టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు బీజేపీ సభ్యులున్నారు. మొత్తం 20. మాకు ఎమ్మెల్సీ గెలవడానికి 17మంది చాలు. ఇది ఎన్నికల కమిషన్ ప్రచురించిన ఎలక్టోరల్ రోల్‌లో ఉంది. రెండోది.. కాంగ్రెస్‌కు 21 మందితోపాటు అదనంగా ఒక ఇండిపెండెంట్ మద్దతు ఉంది. వైసీపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీఎస్పీకి ఇద్దరు ఉన్నారు. వాళ్లు (టీఆర్‌ఎస్) టీడీపీకి చెందిన ఐదుగురిని, కాంగ్రెస్‌కు చెందిన నలుగురిని, ఇద్దరు వైసీపీ, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.

మీరు చెప్పేది ఒప్పుకుంటాను.. కానీ.. నేను అడిగేదేమంటే.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ మీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారు. అరెస్టయ్యారు. అదే స్టీఫెన్‌సన్‌తో మీరు మాట్లాడినట్లు వచ్చిన ఆడియోలో హామీలన్నీ నెరవేరుస్తామని మీరు చెప్పారు.



వారు స్టింగ్ ఆపరేషన్ చేశారు. ప్రతి ప్రభుత్వం ఎమ్మెల్యేలపై ఇలా చేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది?

మీ ఎమ్మెల్యే ఎందుకు 50 లక్షలు తీసుకునివెళ్లారు?



అది వేరే విషయం..

అదే విషయం..



కాదు.. కాదు.. దానిపై విచారణ జరపొచ్చు. కానీ నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు?

మీకు సమన్లు ఇస్తామంటున్నారు. నన్ను అరెస్టు చేయండని మీరు సవాలు చేయగలరా?



వారికి ఏసీబీ ఉంది. నాకు ఏసీబీ ఉంది. వారికి పోలీసులున్నారు. నాకు పోలీసులున్నారు. ఉమ్మడి రాజధానిలో మీరు ఇవన్నీ ఎలా చేయగలరు? ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తారు? ఎలా బెదిరిస్తారు?

మీరేమో మీ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. వాళ్లేమో ఓటుకు నోట్లు ఇస్తున్నారని అంటున్నారు.



కామన్ క్యాపిటలంటే అర్థం ఏమిటి? సెక్షన్ 8 ఉంది. సెక్షన్ 8లో ఇవన్నీ ఎవరు చేస్తారు? గవర్నర్ చేయాలి. ఇది సార్వభౌమ ప్రభుత్వం.

అప్పుడు మీరు గవర్నర్ దగ్గరకు ఎందుకు వెళ్లకూడదు? టెలిఫోన్ల ట్యాపింగ్‌పై ఆధారాలన్నీ సమర్పించవచ్చుకదా.



నేను చాలాసార్లు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాను. కేసీఆర్‌కు కూడా చాలాసార్లు అప్పీలు చేశాను. విభజన తర్వాత మనం కూర్చుని, అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తెలుగు ప్రజలు ఒక్కటే. ప్రభుత్వాలు, పార్టీలు వేర్వేరు. రాజకీయంగా మనం పోరాడుకోవచ్చు. కానీ ప్రభుత్వాలుగా మనం సహకరించుకోవాలి. ఆయన వీటిని ఎప్పుడూ పట్టించుకోలేదు.

రాష్ట్రపతికి ఈ టెలిఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు సమర్పించవచ్చు కదా.. టెలిఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని మీరు కోరనున్నారా? మీ సొంత ఏసీబీని ఈ ఆరోపణలపై విచారణ జరపాలని ఆదేశిస్తారా?



తప్పకుండా

మీరు టెలిఫోన్ ట్యాపింగ్‌పై మీరు కేసీఆర్ ప్రభుత్వంపై విచారణకు ఆదేశిస్తారు.. వారేమో ఆలోపే మీపై ఓటుకు నోటు కేసులో విచారణకు ఆదేశిస్తారు.. మనం ఎలాంటి పరిస్థితికి వెళుతున్నాం?



దీనికి ఎవరిది బాధ్యత?

కేసీఆర్‌దా బాధ్యత? మీకు సమన్లు ఇవ్వాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని సవాలు చేస్తున్నారా?



మేం ఏమీ చేయం. వాళ్లను సమన్లు ఇవ్వమనండి. అప్పుడే మేం ఏం చేయాలో అది చేస్తాం.

ఆయన గవర్నర్‌ను కలిసి మీకు నోటీసులు ఇవ్వడానికి అనుమతి కోరుతారేమో.. అవసరమైతే ప్రాసిక్యూట్ చేస్తారేమో!



వాళ్లు నోటీసులు ఇచ్చిన తర్వాత మాకు ఉన్న ఆధారాలేంటి? అధికారాలేంటి? పరిశీలిస్తాం. ప్రజాస్వామ్యంలో నన్ను ఎలా బెదిరిస్తారు? నన్ను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తారు? ఆయనే అంతా చేశారు. నా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఎలక్టోరల్ రోల్‌లో ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది తప్పు కాదా? ఇది ముడుపుల వ్యవహారం కాదా?

ఇలా ఎమ్మెల్యలను ఉభయ పక్షాలు ప్రలోభపెడుతూ పోతే..



నేనేమీ ప్రలోభపెట్టడం లేదు.

మీ ఎమ్మెల్యే 50 లక్షలు స్టీఫెన్‌సన్‌కు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.



ఏదైనా పార్టీలో ఒక కార్యకర్త తప్పు చేస్తే చట్టం ప్రకారం వెళ్లవచ్చు. అది వేరే విషయం. కానీ నన్ను ఎందుకు లాగుతున్నారు?
(Suppose any party.. one functionary has committed a mistake. Its OK. According to law it has to be acted. That is different issue. Why you are dragging me?


ఎందుకంటే మీరు టీడీపీ అధ్యక్షులు.. ఇది మీకు ఇబ్బందికర అంశం. మీ గొంతు ఆడియో టేప్‌లలో ఉంది. అందుకే వారు మిమ్మల్ని లాగుతున్నారు. (Because you are the president of the TDP and it has embarrassed you and your voice is in the audio tape. Thats why they are dragging you into this.)


అదే నేను చెప్తున్నాను. ఉమ్మడి రాజధానిలో మీరు ఇలాంటివన్నీ స్టింగ్ ఆపరేషన్‌ల ద్వారా లేదా కల్పితాలు సృష్టించి.. మీ ఇష్టం వచ్చినట్లు చేయలేరు. మీకు ఉన్న హక్కు ఏంటి?

రెండు తెలుగు రాష్ర్టాలు ఏర్పడి సరిగ్గా సంవత్సరం అవుతున్నది. ఇప్పుడు ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నాయి. ముఖ్యమంత్రులు ఒకరినొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

దీనికి ఎవరిది బాధ్యత? కేసీఆర్‌దా బాధ్యత?



అవును.. ఆయనదే. ఈ పరిస్థితి ఆయనే సృష్టిస్తున్నారు.

ఒకవేళ ఆయన మిమ్మల్ని ముట్టుకుంటే మీ పోలీసులు, మీ ఏసీబీ స్పందిస్తాయా?



తప్పకుండా స్పందిస్తాం. నాకు సార్వభౌమ అధికారాలు ఉన్నాయి.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




బాబూ.. ఇక్కడ మేం క్షేమం...

chakra

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గారికి నమస్కారములతో రాయునది..

అయ్యా.. 

ఇక్కడ మేం క్షేమం. ఇక్కడ అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ.. మిగిలిన తెలంగాణ జిల్లాల్లోనూ పలు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్న ఆంధ్రా నుంచి వచ్చిన వారమంతా బాగున్నాం. ఇక్కడ ఉంటున్న వారిలో కొందరి ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిందని, ఇక్కడి ఆంధ్రులు కలవరపడుతున్నారని మీరు ఆందోళన చెందుతున్నట్లుగా పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా తెలిసింది. మీరు మా గురించి ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, మీకు మా గురించి ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారని భావిస్తున్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ ఉంటున్న ఆంధ్రులను కలవరపెట్టవద్దని ఇందుమూలంగా తెలియజేస్తున్నాం.

శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటున్న రచయిత బమ్మిడి జగదీశ్వరరావు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాని, తెలంగాణ ప్రజల నుంచి కాని ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జీవిస్తున్నారని చెప్పడానికి మిక్కిలి సంతోషంగా ఉన్నది. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చిన మా మేనల్లుడు కూడా కూకట్‌పల్లిలో పరమానందభరితంగా బతుకుతున్నాడని, అక్కడే ఓ ఇల్లు కూడా కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నాడని ఈ మధ్యనే విని ఆ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. పశ్చిమ గోదావరిజిల్లా పాలకొల్లు నుంచి వచ్చి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్న బోళ్ల తాతాజీకి దిల్‌సుఖ్‌నగర్, ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ సోదరులు చేతనైన సాయం చేస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను.

భర్త అకాల మరణంతో దిక్కుతోచని స్థితిలో అద్దెకుంటున్న ఇంటి ముందే కర్రీ పాయింట్ పెట్టుకున్న ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన సీతమ్మ చేసిన కూరలు, పచ్చళ్లంటే తెలంగాణ ఆడపడుచుల నోళ్లలో నీళ్లూరుతున్నాయని విని ఆ సీతమ్మకు బతుకు ధైర్యాన్ని ఇచ్చిన హైదరాబాద్‌కు, ఇక్కడి మనుషులకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది. ఇలా వేలు, లక్షల మంది ఆంధ్రులు హైదరాబాద్‌లోనూ, తెలంగాణ జిల్లాల్లో నూ గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారని, ఈ మాట వింటే మీరు కూడా సంతోషిస్తార ని భావిస్తూ మీకు తెలియజేస్తున్నాను.

అంతెందుకు.. హైదరాబాద్ శివారులో ఇల్లు కట్టుకున్న మీ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇంటి పై ఈగ కూడా వాలలేదనే విషయాన్ని నిరంతరం మీ పక్కనే ఉండే ఆయనే చెప్పలేదంటే కొంచెం బాధేస్తోంది. ఆయన భార్య నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రి కాగానే పరకాల ప్రభాకర్ ఇల్లు ఉన్న గ్రామస్థులు మా ఊరమ్మాయి కేంద్రమంత్రి అయ్యిందంటూ పొంగిపోవడం పత్రికలు చూసిన వారందరికి తెలిసిందే. ఇదంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అమరావ తి అభివృద్ధి పట్టించుకోకుండా ఇక్కడి ఆంధ్రుల జీవితాలపై ఆందోళన చెందవద్దని చెప్పేందుకే. 

మీ రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారి ఇల్లు ఇంకా ఆయన పేరు మీదే ఉందని, ఆయన ఇం ట్లో పని చేస్తున్న పనిమనిషి పేరు మీద మారలేదని, ఎప్పటికి మారదని గ్యారంటీ ఇస్తున్నా. తెలంగాణ వస్తే ఆయన ఇంటిని పని మనిషి లాక్కుంటుందేమోననే భయాన్ని ఏడాదిన్నర క్రితం ఓ ఛానె ల్ చర్చాగోష్టిలో పాల్గొన్న బుచ్చయ్య చౌదరి గారు వ్యక్తం చేశారు. ఆయనకు, ఆయన ఇంటికి ఏం కాదని మీరు ధైర్యం చెప్తారని నేను ఆశిస్తున్నాను. మీ పార్టీ ఎంపీగారే చెప్పినట్లు ఏడాది పాలనలో కేసీఆర్ అనేకసార్లు పర్యటించింది నగరంలోని మల్కాజిగిరి ప్రాంతంలోనే. అక్కడే ఆయన నిరుపేదలకు రెండు బెడ్‌రూంల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మీకు తెలియక కాదు కానీ, మల్కాజిగిరిలో ఉంటున్నవారిలో సగానికి పైగా ఉన్నవారందరూ ఆంధ్రులే. వాళ్లకు ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ అన్నారంటే మల్కాజిగిరి వాసుల గురించి తెలియక అనుకుంటామా..?

ఇక చివరిగా చెప్పొచ్చేదేమిటంటే మీ రాజకీయాలు, మీ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓట్లు, నోట్లు, ప్రజాప్రతినిధుల అంకెల గారడీలు మీకే పరిమితం చేసుకోండని కోరుతున్నాను.

ఓట్ల పండుగ అయిపోయి ఏడాదైంది. మరో నాలుగేళ్ల వరకూ మా జోలికి రావద్దు మహాప్రభో అని ప్రార్థిస్తున్నాం. మార్నింగ్ వాక్‌లో ఎదురుపడినప్పుడు పరస్పర పలకరింపులు, అక్కడి వారి ఫంక్షన్లు, ఇక్కడి వారి ధావత్‌లు కలిసి చేసుకుంటున్న సమయంలో వాటి మధ్యలోకి ప్రాంతంపగ రావద్దని మనవి చేసుకుంటున్నా. రోజులు మారుతున్నప్పుడు మనుషులు మారతారని, కక్షలు, కార్పణ్యాలు కలకా లం ఉండవని, ఉండకూడదని ఆ దిశగా ఏలికలు పాలన సాగించాలని, వినకపోయినా చెప్పడం ఓ బాధ్యతగా భావించి ఈ నాలుగు ముక్కలు చెబుతున్న. కాపలా కాసే మనుషులను మార్చడం కంటే మీ చుట్టుపక్కల ఉన్నవారి మనసులు మారిస్తే బాగుంటుందని భావిస్తున్నా..
ఇట్లు
ముక్కామల చక్రధర్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!