గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, నవంబర్ 06, 2013

మేం తెలబానుల మైతే...మీరు తెలబాన్ధ్రులు కారా? (1)

మా తెలంగాణ రాష్ట్రమ్ము మాకు నిడఁగఁ
గోరు వారలన్ వేర్పాటుఁ గోరు వార
లంచుఁ, దీవ్రవాదు లటంచు ననఁగ నేల?

మొదటి వేర్పాటు వాదులు గదయ మీరు!
నాఁడు మద్రాసు సఖ్యమ్ము నూడఁ బెఱికి,
వేఱు రాష్ట్రమ్ము నిడఁగానుఁ గోరి రెవరు?
తీవ్రముగ నుద్యమించిన దెవ రదెవరు?

మమ్ము తెలబాను లనఁగ మే మగుదు మెట్లు?
మొదటి తెలబాన్ధ్రులే మీరు! మురువకుఁ డయ!

ఒక్క ప్యూను జాబునకయి నిక్కి నీల్గి,
యాగి చేసితి రయ్య మీ యాంధ్రు లపుడు!
సభలు చేసియు, నిందించి, జాలి లేక,
యాంధ్ర రాష్ట్ర మేర్పాటె ధ్యేయ మ్మటంచు,
నుద్యమమ్ము నడిపినది యోర్వలేని
యాంధ్రులరు కాదె? మదరాసు నాంధ్ర దనుచుఁ
గోరి యుద్యమించిన యట్టి వార లెవరు?

మమ్ముఁ దెలబాను లందురే? మమ్ము దోచి,
యెఱుఁగ నట్టున్న తెలబాన్ధ్రు లీరు కారె?

దొంగయే "దొంగ..దొంగరో..దొంగ" యనుచుఁ
బరుగుఁ దీయంగ...దొంగయే దొరగ నగునె?
యిచటి వెన్నియో దోచియు, నెఱుఁగ నట్లు,
మమ్ముఁ దెలబాను లనఁగానె మాయునె యవి?

మీరు చేసిన శృంగారమే యదౌనె?
మేము చేసిన వ్యభిచారమే యిదౌనె?
నోరు మూయుఁడు! నవ్వియుఁ బోరె? మీర
లింక వగల మాటలు మానుఁ డిట్టి తఱిని!!


జై తెలంగాణ!        జై జై తెలంగాణ!!


మంగళవారం, నవంబర్ 05, 2013

ఇంకా దోచగ బూనెద రేలా?



"ఈ హైదరబాద్ నగరమువంటి
రాజధాని మా కెచట దొరకును?"
అనెడి వారలకు, మా ప్రశ్నయు నదె!

తెలంగాణలో హైదరబాదును
పోలిన నగరా లున్నాయా?
అభివృద్ధి యేది తెలంగాణలో?

మీకున్నవి దానిని పోలెడు పలు
పట్టణాలు! విలసిల్లు చున్నవి!
విజయవాడ, విశాఖపట్టణం,
గుంటూర్, తిరుపతి, రాజమండ్రులు!
మాకేమున్నవి తెలంగాణలో?

విమానాశ్రయాల్ నాలుగు మీకు
కడప, వైజాగు, గన్నవరం, తిరుపతి!

హైదరబాదున బేగంపేటను,
వరంగల్లున మామునూరును
విమానాశ్రయ నామ క్రమమ్మును
పాడుజేసితిరి! మీ పాపమ్మే!

ఆజంజాహి బట్టల మిల్లు,
నిజాం షుగర్సు చక్కెర మిల్లు
నాశన మాయెను! రూపు మాసెను!
మీ పాపమ్మే! మీ నిర్వాకమె!

ఏ ముఖమ్ముతో హైదరబాదును
మాది మాది యని వదరుచుందురు?
దోచుకొనంగను సరిపోలేదా?
ఇంకా దోచగ బూనితిరా?

తెలంగాణకు పట్టిన "శని" మీ
సీమాంధ్రులె! పలు మాట లేలనో?
రాహు కేతువు లరాచకీయులై
రాక్షసానందమంది, హర్తలై,
దోచితిరి తెలంగాణ వనరులను!

నీళ్ళవి యేవీ తెలంగాణలో?
ప్రాజెక్టు లేవి యీ తెలంగాణలో?
ఉద్యోగములను, సద్యోగములను
దోచితిరి తెలంగాణ వనరులను!
ఇంకా దోచగ బూనితిరా?


రాయల ఉత్సవ నిర్వహణమునకు
కోట్లకు కోట్లు దోచిపెట్టితిరి!
కాకతీయుల ఉత్సవాలకు
ఎన్ని కోటుల నిచ్చితిరయ్యా?

టాంకుబండుపై మీ వారి విగ్రహాల్
వరుస దీరినవి, వెలుగుచున్నవి!
మరి మా వారల విగ్రహాలేవి?
"తెలుగుజాతి"యని యరచుచుందురు;
మరి మా వారలు కనబడలేదా? 

చాలు చాలు మీ నటనలు చాలును!
సీమాంధ్రులు మము వీడిన చాలును!
మా రాష్ట్రము మా కిడిన చాలును!
అదే మా కగును పది వేలు!
అదే మా కగును పది కోట్లు!!

జై తెలంగాణ!          జై జై తెలంగాణ!

సోమవారం, నవంబర్ 04, 2013

విననిచో నిన్ను "నూసరవెల్లి" యండ్రు!


ఓ జగన్మోహనా! మున్ను రాజశేఖ
రుండు తెరపైకి తెచ్చినట్టి దండి కార్య
మిదియె! కేంద్రమున్ దెలగాణ మడుగఁ జనియె!
నట్టి నాయక సత్పుత్ర! యిట్టి పనికిఁ
బూనుకొన నేమి యందురు? పోరుచున్న
మా తెలంగాణ కోరిక మాన్ప నీవు
నీ సమైక్యాంధ్ర నినదమ్ము నిటులఁ జేయ
నీదు వ్యక్తిత్వ మెట్టిదం చెఱుఁగ వలయు?


“ఆర్టికలు మూఁడునుం గేంద్ర మనుసరించి
రాష్ట్ర మిచ్చిన నభ్యంతరమ్ము నాకు
లేదు! తెలగాణ సెంటిమెంట్ నాదు తలను
దాల్చి, గౌరవింతు”నటంచుఁ దఱచి నాఁడు
నమ్మఁ బలికిన మాటలు వమ్ము లయెనె?


నాఁడు పరకాలలో ఓట్ల నడుగఁ జనియు
నీదు తల్లి, చెల్లియుఁ బల్కె నెఱుక లేదె?
మా తెలంగాణ జనులు నమ్మంగఁ బలికి,
నేఁడు “బోర్డు” తిప్పుట రాజనీతి యగునె?

ద్రోహ కాంక్షను మానుఁడు! తుచ్ఛమైన

యోచనము మాని, మాకు ప్రయోజన కర
మైన తెలగాణ రాష్ట్రమ్ము నీ మనమ్ము
నందిడి, సమైక్య నినదమ్ము నాపు మయ్య!
యపుడె యాడి తప్పని వాఁడవందు రయ్య!
విననిచో నిన్ను “నూసరవెల్లి” యండ్రు!!



ఓయి చంద్రబాబూ! వినుమోయి! నాఁడు
ఎన్నికలలోన గెలువంగ నీతు లెన్నొ
పలికి, “తెలగాణ రాష్ట్ర మేర్పాటునకును
మేము ననుకూల”మంటివి! యేమనందు?


నిండు సభలోనఁ "దెలగాణ నీయఁగాను
బిల్లు పెట్టుఁడు! మద్దతు నెల్ల మేము
తెలుపుదు”మటంచునుం బల్కి తీవుకాదె?
కేంద్ర ప్రకటన రాఁగానె, కించ పఱచు
మాట వల్కుచుఁ బ్రతిఘటింపంగ లేదె?

రెండుకండ్ల సిద్ధాంతమ్ము ప్రియము నీకు!
కాని, యొక కన్నె ముఖ్యము కాదె నీకు?
కాకయున్న, సమన్యాయ కాంక్ష యేమి?
నష్ట పడినట్టి మేమె యే న్యాయమునకు
సమ్మతింపంగ వలెనయ్య? చాలు నటన!
అఱువ దేఁడులు కష్టాల నంది నట్టి
మా తెలంగాణకే న్యాయ మందఁ జేసి,
రాష్ట్ర మేర్పడ నిచ్చుచో, రాజకీయ
స్వార్థ మేమియు లేనట్టి వాఁడ వండ్రు!
విననిచో నిన్ను “నూసరవెల్లి” యండ్రు!!



ముఖ్యమంత్రీ! వినుము! నీవు మున్నుగాను
“విభజనాంశము కేంద్ర సద్వీక్షితమ్ము!
హై కమాండ్ నిర్ణయమునకు “ఓకె” యనియుఁ
గట్టుబడియుందు” నంచును కపటముగను
మాట లాడియు, నిర్ణయ మ్మందఁ గానె,
మాట మార్చి. ’సమైక్య తీర్మాన’ మిపుడు
కోరి, పలికిన నేమండ్రు? క్రూరుఁ డండ్రు!
మా తెలంగాణ మన్యాయ మందె నిజము!
తెలిసి నీ విట్లు పలుకంగ విలువ కలదె?
ముఖ్యమంత్రికిఁ బక్షమ్ము సఖ్య మగునె?


“వీఁడు నా వాఁడు! నా వాఁడు వాఁడు కాఁడ”
టంచుఁ బలుకంగ న్యాయమ్మ టంచు నండ్రె?
కనుక, నిఁకనైనఁ దెలగాణ కినుక మాని,
రాష్ట్ర మేర్పడఁగ సహకారమ్ము నిడుఁడు!
మిమ్ముఁ దలపైని నిలుపు సుమ్మీ జనమ్ము!
విననిచో నిన్ను “నూసరవెల్లి” యండ్రు!!


జై తెలంగాణ!        జై జై తెలంగాణ!!

శనివారం, నవంబర్ 02, 2013

సీమాంధ్రుల అభియోగాలు - తెలగాణుల సమాధానాలు (2)


రెండవ భాగము (నిన్నటి టపా తరువాయి భాగము)

5.అన్నదమ్ములను విడదీశారు…

సమాధానము:
ఈ సమాజము నందున నెవ్వరైన
యన్నదమ్ములు కలిసియు నున్నవారె?
యిట సమిష్టి కుటుంబమ్ము లెటుల నుండుఁ?
బెండ్లి కాఁగానె వారలు వేరు కాపు
రమ్ము వెట్టుచు నుండంగ, మమ్ము మీర
“లన్నదమ్ముల విడదీసి”రన్న మాట
యెటులఁ దలఁదాల్చఁ గల మయ్య యీ దినమున?
నొక్క తల్లికిఁ బుట్టియు నున్న యన్న
దమ్ము లెప్పుడు విడిపోయెద మ్మటంచుఁ
జూచుచుండంగఁ గనలేదె? సోదరు లన
నెట్టి సోదరులము మేము? నెవరు తల్లి?

దితికిఁ బుత్రులు మీ! రదితికిఁ బుత్రు
లమ్ము మేమయ్య! రాక్షసులకును, దేవ
తలకు నెట్టి బాంధవ్యము కలదొ? మీకు
మాకు నట్టి బాంధవ్య మీ లోకమందుఁ
గలదు! కావున, మీ తోడఁ గలసి యుంట,
సర్ప నివసిత గేహ వాసమ్మె మాకు!

6.చిన్న రాష్ట్రాల డిమాండు పెరుగుతుంది…

సమాధానం:
పెరుగ నీవయ్య! యభివృద్ధి పెరుగు సుమ్ము!
మా తెలంగాణ కన్న సూక్ష్మాతి సూక్ష్మ
మౌ జపానును గనుమయ్య! మహితమైన
దేశ మదియ! ఢిల్లి, గోవ దిటముగాను
వృద్ధిఁ గనలేదె? యతి చిన్నవి యవి కావె?
యమెరికాలో వసించు జనము గణింప
ముప్పదియ కోట్లు! మన దేశ మున్న దయ్య
నూఁట యిరువది కోటులు! నేఁటి దాని
రాష్ట్ర సంఖ్య యేఁబది యయ్యె! రాష్ట్రము లిట
నిరువ దెనిమిది! యమెరికా నెంచి చూడ
వంద రాష్ట్రాల పయి నుండవలయు నిచట!
నిరువ దెనిమిది సరియౌనె? నింక నబ్బ
ర నధికార వికేంద్రీకరణము జరిగి,
సులభ పరిపాలన మ్మబ్బు! సుకరముగను
వృద్ధి శీఘ్రగతినిఁ గూడు! వెతలుఁ దొలఁగు!

7.కలిసి ఉంటే కలదు సుఖం…

సమాధానం:
కలిసి యుండిన సుఖములు కలుగు ననిన,
నెవ్వరికి సుఖములు కల్గు? నెవ్వరి కిటఁ
గలుగు నన్యాయములు? తెల్పఁగలరె మీర
లిపుడు? తెలగాణకును దుఃఖ మిపుడుఁ గలిగె!
సుఖము సీమాంధ్ర వారిది! సుఖముఁ గనక
యఱువ దేఁడుల నుండియు నఱచి యఱచి,
కలిసియే యుంటి మోయయ్య! కలిసియున్న
మాకు సుఖములు కలిగెనే? మమ్ము దోచు
కోర్కి తోడనే కలిసున్న కల్మి గల్గు
నంచు నీతులు చెప్పుచు, మంచి వీడి,
మోసగించుచు నుంటిరి! వీసమైన
నీతి కలదె మీ సీమాంధ్ర నేతలకును,
దోపిడీదార్ల, కవకాశ దుర్మతులకు?
దోపిడీదార్లచే మేము దోపిడులకు
నెంత కాలమ్ము గుఱియైన నేమి ఫలము?
కనుక, విడిపోయి సుఖములఁ గనెద మయ్య!

8.ఇక్కడ కూడా ఉద్యమం ఉంది…

సమాధానం:
ఉన్నచో నుండనిమ్ము! మహోన్నత మగు
నట్టి ప్యాకేజి మీ కబ్బు! నదియె మీకు
మేలుఁ గలిగించు! నభివృద్ధి చాలినంతఁ
గలుగు! నుద్యమాల్ జనులకుఁ గలుము లిడును!

“మాది మాకు, మీయది మీకు” మా మతమున;
“మీది మాకె, మాయది మాకె” మీ మతమున!
మాది సహజోద్యమమ్మోయి! మీది కృత్రి
మోద్యమమ్ము! నిజాయితీ మూర్తిమత్వ
మిచట! నన్యాయ రూపమ్ము లచటఁ! గాన,
నుద్యమము పేర బెదిరించ, నొదిగి యొదిగి,
బెదరి దాసోహ మందుమే? హృదయ మందు
మా తెలంగాణ రాష్ట్రంపు మహితమైన
రూప మెసలారుచున్నది! కోప మేల?
మాను మో యయ్య! యడ్డుట మాను మయ్య!

9.గుండెపోటుతో పలువురి మృతి…

సమాధానం:
“సహజ” మరణాల మీర “లసహజ”ముగను
మరణ మంది రటంచును దఱచి తఱచి,
తెలుపఁగా నేల? తెలగాణ తెచ్చుట కయి
యమర వీరుల బలిదాన మమరె! వేయి
మంది యువతీ యువకుల యాత్మలనుఁ గించ
పఱుపఁగా నెంచి, యిట్టుల వదరెదోయి?

గుండెపోటుతో మరణించ, వెండి యదియ
యాత్మహత్యయె? తెలగాణ యమర వీరుఁ
డొక్క శ్రీకాంతచారిచా లక్కడ మృతి
నందినట్టి సీమాంధ్రవా రందఱకును!

మా యమరవీరు లొక్కరి మరణము వలె
మీ మృతులు మరణించిరే? మీది “సహజ
మరణము”! తెలగాణ యమర వర మరణ “మ
సహజ”మోయి! సహస్రాక జనను
ల కిటఁ బుత్రశోకమ్ము కలఁచె హృదయము!
కడుపు కోఁతతో నిత్యమ్ము గనలి కనలి,
దుఃఖపడుచుండి రిట! వారి దుఃఖ మెవఁడు
తీర్చఁగలఁ డోయి? యనవల దిట్లు నీవు
మా యమర వీర వరుల సామాన్యులనుగఁ
జేసి,యాత్మహత్యలఁ జిన్నఁ జేసి, యిపుడు!
రాష్ట్రమునకయి యెవఁడైనఁ బ్రాణ మిడెడు
వాఁడు కలఁడె సీమాంధ్రను? వల దమరులఁ
దక్కువగఁ జేసి మాట్లాడఁ దగదు మీకు!


జై తెలంగాణ!               జై జై తెలంగాణ!


(సీమాంధ్రుల అభియోగాలు-తెలగాణుల సమాధానాలు సమాప్తం)

శుక్రవారం, నవంబర్ 01, 2013

సీమాంధ్రుల అభియోగాలు-తెలంగాణుల సమాధానాలు (1)


నా తెలంగాణ సోదరులారా! నే నీమధ్య ’ఫేస్ బుక్’లో తిలకించిన “సీమాంధ్రుల అభియోగాలు-తెలంగాణ సమాధానాలు”ను పద్యరూపమున ప్రకటింప బూనుకొన్నాను. కొంత భాగము ఈ రోజున ప్రకటిస్తున్నాను. రేపు మిగతాది ప్రకటిస్తాను.

1.ప్రజల అభిప్రాయం తీసుకోలేదు….

సమాధానం:
మా తెలంగాణ నాంధ్రతో మమ్మడిగియె
కలిపిరే? యప్డు మా ప్రజా కాంక్షితమ్ము
నడుగ వలెనని తెలియదే? నమ్మఁ బలికి,
నాయకుల మోసగించి, యాంధ్రప్రదేశ
మందుఁ గలిపి, దోచిరి మమ్ము! మఱచినారె?

సరియె, పోనిండు! విభజన జరుపఁగాను
నఱువ దేఁడుల నుండి మే మడుగుచుండ
నటులె యన్యాయమును జేసినట్టి కోర్కి
మీర లొప్పుకొందురె? “వద్దు! మేము నొప్పు
కొన”మటంచుఁ బల్కుదురుగా కోయి దీని!

నాల్గు కోట్లు మేము! నాఱు కోటులు మీర!
లెట్లు కుదురు నోయి యేక వాక్కు?
మమ్ము మీర లండ్రు మైనారిటీలని!
మాకు నెటులఁ గలుగు శోక విరతి?

ఇట్లు దుర్బుద్ధితో మీర లెంత యఱచి
“మా యభిప్రాయ మడుగలేదాయె” ననుచు
గోల చేసిన, నన్యాయ మూలకర్త
లీరె కాన, కేంద్రమ్మె యా తీరు నడచె!

2.హైదరాబాదును మేమే డెవలప్ చేశాము…

సమాధానం:
’చార్మినా, రసెంబ్లీ, కోర్టు, సలరుజంగు
మ్యూజియము, ట్యాంకుబండ్’లను మొదలగునవి
మీరు కట్టించితిరె? దీని మేము వృద్ధి
చేసినా మన, నమ్మంగఁ జెవినిఁ బువ్వు
పెట్టుకొన్నట్టి వారలు వేరె లేరె?

ఇచట కాలమ్ముతోడ హయిద్రబాదు
కలసి యభివృద్ధిఁ గాంచెను! కాని, మీర
లెట్టి యభివృద్ధి చేసితి రిచట? మీవి
యైన వ్యాపారముల కగు నవసరములఁ
దీర్చుకొనఁగాను భవనాలు దిట్టముగను
గట్టుకొంటిరి! కాని, సర్కారు వైద్య
శాల లేవైన, బడులైన స్థాపితమయె
నోయి? సెలవిమ్ము! ప్రైవేటు లాయె వృద్ధి!
యిచటి తెలగాణ జనులు నెట్టి వృద్ధి
లేకయే యుండ్రి! సీమాంధ్రు లిచటఁ జేరి,
వృద్ధిపొందిరి మము దోచి, వెతలఁ ద్రోచి!

3.హైదరాబాదు మాది…

సమాధానం:
వలచి పదిహేను వందల పదియు రెండు
వత్సరమ్మున నే నిట బ్రతుకు బ్రతికి,
హైద్రబాదును గట్టించి, యాదరించి
తందువే? గోలుకొండ సుల్తాను కట్టి
నట్టి హైదరాబాదు నీ దనెడు మాట
చిన్నపిల్లలకుం జెప్పు చిత్రకథయె?

పదియు మూఁడగు జిల్లాల వారి దెట్టు?
లిచటి హైద్రబాదును నీదు హితవుఁ గనెడి
తాత ముత్తాత లెప్పు డుద్ధరణఁ జేసి,
కట్టిరో చెప్పుమోయి! సాక్ష్యమ్ము లేవి?
నీవు చెమటోడ్చియును గట్టినావె చెపుమ!
తండ్రి తాత ముత్తాతలు తరతరాలు
గా నిచట వసించు ప్రజల కాటపట్టు
నైన “హైద్రబాద్”, వారిదే యౌను గాని!

4. తెలుగువారిని విడదీయొద్దు….

సమాధానం:
భారతీయుల విడదీయవ ద్దనుమయ!
తమిళులును భారతీయులే! ధర్మపరుల
గు తెలగాణులు భారతీయత గలారె!
యిట్టి భరత జాతీయత నెట్టు విడిచి
తోయి సీమాంధ్రుఁడా! నాఁడు తూట్లు పొడిచి,
తమిళ సోదరులను వీడి, తప్పుచేసి,
వేరు రాష్ట్రమ్ముగా నెట్లు విడఁగఁ జేసి
నావొ? నేఁడు గుర్తుకు రాదె? నీవె చెపుమ!

హింది మాట్లాడు రాష్ట్రాల వెన్ని కలవొ
నీకుఁ దెలియదే? లెక్కించు! నిక్కముగను
వారు విడదీయఁ బడిరే? వివాద మేది?
తెలుఁగు రాష్ట్రాలు రెండైన స్థిరతఁ గనియు
నెంతయో వృద్ధిఁగను నయ్య! చింత వలదు!

చింత కలుగుచో హింది రాష్ట్రీయుల కొక
రాష్ట్ర మేర్పాటు చేయించి, రమ్మిటకును!
అందరము కలసియు నుందు మయ్య యిచట
తెలుఁగు రాష్ట్ర మొక్కటి యంచు దిగులు వీడి!

మాది తెలగాణ భాషయే! కాదు తెలుఁగు!
తెలుఁగు తెలుఁగంచు నన, మాది తెలుఁగె యైన,
మా తెలంగాణ భాషల నా తెఱఁగున
నెట్టు లవమాన పఱచితో యెఱుకలేదె?

చిత్రసీమను విలనుల, చిన్న నటుల,
హాస్య నటుల సంభాషణలందు మీరు
మా తెలంగాణ భాషను, నీతి తప్పి,
చేర్చలేదె? యిచ్చట మీరు చర్చ చేసి,
యిపుడు తెలుఁగంచు వదరంగ; హృదయమందుఁ
బ్రేమ లొలుకంగ వత్తుమే పిలువఁగానె?

నాది బ్రతుకమ్మ పండుగ! నీది యట్ల
తద్దె! రెంటికిఁ బొత్తేది? తగవు మాని,
వగల మాటలు చాలించి, భ్రమలు వీడి,
తెలుఁగు వారల నిట విడదీయ వద్ద
టంచు మొత్తుకొనకు మోయి టక్కరీఁడ!

(మిగతా అభియోగాలు…వాటికి సమాధానాలు రేపటి టపాలో చూడగలరు)

జై తెలంగాణ!        జై జై తెలంగాణ!

బుధవారం, అక్టోబర్ 30, 2013

అఖిల పక్ష సమావేశ మవసరమ్మె?!


అఖిలపక్షాలఁ బలుమారు లడుగఁ, దనదు
పార్టి వైఖరిఁ దెలిపిరి వాటి నేత; 
లవియ యనుసరించియుఁ గేంద్ర మాస్థతోడ 
మన "తెలంగాణ రాష్ట్ర మిత్తు" నని తెలిపె! (1) 

’కోర్’ కమిటి యొప్పుకొనె! ’నోటు’ కోరి వెలసె! 
కేంద్ర మంత్రి వర్గము పరీక్షించి యన్ని; 
తగిన యేర్పాటులను జేయఁ దగు నటంచుఁ 
గోరె సకలాభిమతముల క్షుణ్ణముగను! (2) 

కేంద్ర హోం శాఖ యిటఁ బరికించఁగాను, 
టాస్కు ఫోర్సు బృంద నియమితమ్ముఁ జేయఁ; 
గార్య వర్గ సమావేశ కారణములఁ 
జర్చ చేసి, ముందుకు పోవ సాఁగె నదియు! (3) 

ఇన్ని చేసిన కేంద్రమే, యిప్పు డిట్టి 
యఖిల పక్ష సమావేశ మవసర మని 
తెలుప, సందేహముల్ గల్గె! స్థిర మనమ్ము 
లల్ల కల్లోల మాయెను తల్లడిలుచు! (4) 

మన తెలంగాణ రాష్ట్ర తీర్మానమునకు 
హర్ష మందెను తెలగాణ మా దినమున! 
నేఁ డఖిల పక్ష మనఁగ సందేహ మొదవె 
“నేమి సేయుదురో తెలగాణ నిప్పు”డనుచు! (5) 

“రాష్ట్ర మేర్పాటు సేయంగ రా”దటంచుఁ 
బల్కు దుష్టుల కుట్రచే, బలి పశువుగ 
మా తెలంగాణ ప్రజల సన్మానసములఁ 
జేయు నేమొ యీ కేంద్రమ్ము శీఘ్ర గతిని? (6) 

విభజనమునందు భాగమా? వేచి, మేమె 
యఖిల పక్ష సమావేశ మాదరించి, 
స్వాగతింతుము! కానిచో, సకల జనుల 
మొక్కటై యుద్యమింతుము నిక్కముగను! (7) 

“అంత మన మంచికే”యని యనుకొనుచును,
వేచి యుండిరి తెలగాణ వీరు లిచట! 
ద్రోహ మేమైన జరిగెనా, తూర్ణముగను 
నుద్యమింతురు సాధనోన్ముఖులు నయ్యు! (8) 

ఇదియె సత్యాగ్రహమ్ము! సదీప్సిత మగు
మా తెలంగాణ, శీఘ్రమే మాకు నొసఁగి, 
మా మనమ్ములను బులకింపంగఁ జేయ, 
మా కృతజ్ఞతఁ దెలుపుదు మందఱ మిట! (9) 

అఖిల పక్షమ్ము తెలగాణ మవతరింపఁ 
జేయు రీతిని మెలఁగఁగాఁ జేతు మిదియ 
ప్రార్థనము కేంద్రమున కేము! రాజకీయ 
మేది యైన జరుగుచో, నిమేషమైన 
నోర్చుకొనక, చేపట్టెద ముద్యమమును! (10) 

జై తెలంగాణ!          జై జై తెలంగాణ!

ఆదివారం, అక్టోబర్ 27, 2013

ముగ్గురా? కారు! వారలు మూఁడు కోట్లు!


ఏకపక్ష సమైక్యాంధ్ర హెచ్చులకయి
సభలు నిర్వహించఁగ సమంజసము కాదు!
“నేను విడిపోదు”నను తమ్ముని బలిమిగను
కలిసి జీవించఁగా నాపు కార్య మిదియె? (1)

ఇట్టి సీమాంధ్రులును జేయునట్టి సభను

దెలిపెఁ “దెలగాణ వాణి” సతీశు గౌడు!
“జై తెలంగాణ” నినదమ్ము స్వేచ్ఛగాను
నొక్కఁ డయ్యును నెలుగెత్తె నొక్కసారి! (2)


ఓయు విద్యార్థి జేయేసి యొక్కటి యయి,
సభను నడ్దుకొనంగను సాఁగి వచ్చె!
వారె గడ్డము శ్రీరాము ప్రభృతు! లచట
“జై తెలంగాణ” నినదముల్ స్వేచ్ఛగాను
సలిపి, తెలగాణ కోరికఁ దెలిపినారు! (3)


విషపు సీమాంధ్ర వాక్కుల వినఁగ లేక,
రుద్రుఁడై శివతాండ వోగ్రుండు నగుచు
నడ్డ, నాకుల శ్రీనివాస్ రెడ్డి బూటు
విసరె వేదిక పయికి నుద్విగ్న హృదిని! (4)


ముప్పయొకవేయి వారలు; మువురు వీర;
లైన నేమాయెఁ దెలగాణ మానసమును
దెలిపి రయ్య వీరలు! మేటి ధీరు లయ్య!
ముగ్గురా? కారు! వారలు మూఁడు కోట్లు!
మన తెలంగాణ వీరులు! మాన్యు లయ్య!! (5)


“అడుగఁ దలఁచు కొన్నా”నంచు నడిగి యడిగి,
యన్ని ప్రశ్నలు పసలేని వనియుఁ దెలిసి,
పలికి బొంకినవాఁ డటఁ బల్క, నవియ
యొప్పు లగునె? తప్పులు తప్పె గాని! (6)


సభకుఁ దరలి వచ్చెడునట్టి జనుల నాపి,
నిరసనముఁ దెల్పినారు, నిర్ణీతమైన
భాషణల కృత్యములతోడ వాంఛితమును!
వారు వరదన్నపేఁట్, రాయపర్తి ఘనులు!! (7)


అటులె యడ్డుకొన్నా రయ్య యా సభికుల,
బట్టుపల్లి, కడిపికొండ వాసులపుడు!
నిరసనముఁ దెల్పినను వారి నిర్ణయమును
మార్చుకొనరైరి కఠినులు! మానవులరె? (8)


ఎన్ని సభలను జేసియు, నెన్ని వాగి,
బీరములు వల్కి, బెదరించి, వెఱ్ఱులెత్తి,
యెన్ని తైతక్క లాడిన నేమి యైన,
మన తెలంగాణ రాష్ట్రమ్ము మాన్పఁ గలరె? (9)


ధర్మ మున్నది మనవైపు! దైవ కృపయు
నుండె మన పైన ! న్యాయమే యున్నదయ్య
మనను గాపాడఁగా నిట! మన యుసురులు
తప్పకుండఁగ దోపిడీ దారులకును
దాఁకు నో తెలంగాణ సోదర! నిజముగ
మన తెలంగాణ రాష్ట్రమ్ము మనకు దక్కు!! (10)


జై తెలంగాణ!       జై జై తెలంగాణ!

గురువారం, అక్టోబర్ 24, 2013

బాగుపడి చూపుటయె నేతృ పరమ కృతము


"విభజనకు మేము వెనుకంజ వేయఁ బోము;
ఆఱు నూఱైనఁ "దెలగాణ, మాంధ్ర రాష్ట్ర
ము" లను, రెండు రాష్ట్రమ్ములు తెలుఁగు వారి
కేరుపాటు చేతు"మటంచుఁ గేంద్ర మనియె! (1)

విభజనము తప్పదని తెల్సి, పిడికి లెత్తి,
"యడ్డు పడె"దంచుఁ బల్కిన నాగునదియె?
"తెలుఁగు జాతి యొక్కటిగాను వెలిఁగి పోవఁ
గావలె"నటంచుఁ బైకి వల్కంగ; లోన
దుష్ట యోచనఁ జేయంగ, శిష్ట మగునె? (2)

కేంద్ర ప్రకటన రాఁగానె క్షేమ మెసఁగ
విభజనమునకు సమ్మతి వేగఁ దెలిపి
యున్నచో నింత కాలమ్ము సున్న యగునె?
ప్రజల కష్టాల పాల్జేయ వాంఛితమ్మె? (3)

కలుగుచున్నట్టి పరిణామ క్రమముఁ గాంచి,
మేలుకొన్నచో జరుగును మేలు! కాని,
"యింక నే కుట్రలను జేతు నిప్పు"డనిన,
మెచ్చ రెవ్వరు మిమ్మింక! కచ్చె హెచ్చు!! (4)

"విభజనము వ"ద్దనెడి మాట పెక్కుఱకును
బాధఁ గలిగించు! నవకాశ వాదుల కదె
సంతసముఁ గూర్చు! వ్యాపార సరణి కొఱకు
నందఱను నష్ట పఱుపంగ న్యాయ మగునె? (5)

కలసి యుండియుఁ బోట్లాటఁ గనుట కన్న;
మనము విడిపోయి, సుఖముగా మనుట మిన్న!
కలసి యుండిన సుఖములు కలుగు ననెడి
మాట ప్రాఁత వడిన మాట! నేఁటి మాట,
వేఱు పడినచో సుఖములు, ప్రేమ పెరుగు! (6)

కేంద్ర మంత్రి వర్గము నేఁడు కృత వినిశ్చ
యమ్ముతో నుండె విభజింప! నందు వలనఁ
గాక యున్నను, బ్రజల మేల్గనఁగ నెంచి,
వేఱు పడఁగాను మేలగుఁ; బ్రేమ లెసఁగు!! (7)

శీఘ్ర మభివృద్ధిఁ గోరిన, శీఘ్రముగను
రెండు రాష్ట్రమ్ము లిప్డు వేర్వేఱుగాను
ప్రభవ మందంగ వలె! గాన, భ్రాంతి విడచి,
వేగమే విడిపోయిన, వెతలు తొలఁగు! (8)

శ్రేయ మందఁగ జాప్యమ్ముఁ జేయ మాని,
ప్రజల కొనఁగూడు లాభమ్ము పఱగ నెంచి,
నవ్య రాష్ట్రోపయుక్త కాంక్షలను దెలిపి,
బాగుపడి చూపుటయె నేతృ పరమ కృతము! (9)

జై తెలంగాణ!    జై సీమాంధ్ర!

ఆదివారం, అక్టోబర్ 20, 2013

రండి! భావి జల దోపిడీకి అడ్డుకట్ట వేయండి!!


"తెలంగాణ రాష్ట్రం" ఏర్పడనున్న తరుణంలో, సీమాంధ్ర సర్కారు, జీవోఎంకు సమర్పించిన నీటి పంపకాల దొంగలెక్కల చిట్టా ప్రకారం, నీటి పంపకాలు జరిగితే, తెలంగాణా...నీటి హక్కులకోసం, మరో 37 ఏళ్ళవరకు, కనీసం పోరాటం జరిపే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది! తస్మాత్ జాగ్రత...జాగ్రత!! -      "ఏది సత్యం?" బ్లాగు సౌజన్యంతో...>చూడుడు: edisatyam.blogspot.in (dt.20-10-2013)


మన తెలంగాణమును మోసమందు ముంచఁ 
బూని, సీమాంధ్ర మంత్రులు వోయి వేగ 
కేంద్ర మంత్రి వర్గమ్మున కిచ్చినట్టి
నీటి వినియోగ వివరాలు “నీటి లెక్కె!” (1)


మన తెలంగాణమునఁ బాఱు మన నదీ జ 
లముల దొంగ కేటాయింపు లన్ని చూపి,
యింకఁ దెలగాణ వనరుల నెంత దోచు

కొనఁగఁ గోరిరో సీమాంధ్ర క్రూర ఘనులు? (2) 

మన నమాయకులను జేసి, మన వనరుల 
మనకుఁ గాకుండఁ జేయంగఁ, గనుచు, నోరు
మెదప కుండిన తెలగాణ మిన్నలైన

మంత్రి వర్యుల చర్యలు మంచి వగునె? (3) 


నోరు మెదపక యున్నచో నీరు వోయి, 
యచటి సీమాంధ్రఁ బాఱు; నిచట మనకుఁ
బంట లెండును; కడుపెండు; భవిత యెండుఁ;
బూర్తి తెలగాణ మెండును; పోరు మిగులు! (4)


నీర మనఁగాను జీవమ్ము! నీరు లేక
జీవన మ్మెట్లు నిలుచును? నీవు, నేను,
మనము, తెలగాణ రాష్ట్రంపు జనులు లేరు!
కాన, నీటికై పోరున కరుగ వలయు!! (5)


కండ్లు తెరువుండు తెలగాణ కార్యకర్త 
లార! రాఁబోవు గండమ్ము లన్ని కనుఁడు!
మేలుకొని, తగు చర్యలు కీలు కొలిపి,
ఘన తెలంగాణఁ గాపాడఁ గాను రండు!! (6)


జై తెలంగాణ!        జై జై తెలంగాణ!!

మంగళవారం, అక్టోబర్ 15, 2013

తెలంగాణ జాతిపితకు అశ్రునివాళి...


తేది: జూన్ 21, 2011 నాడు మన తెలంగాణ జాతిపిత, మన మార్గ ప్రదర్శకుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్వర్గస్థుడైన వార్త వినగానే నాలో నుండి పెల్లుబికిన అశ్రునివాళి… 

ఉత్పలమాలిక: 

“ఓ తెలగాణ జాతిపిత! యో జయశంకర! యో గురూత్తమా!
మా తెలగాణ నేతలకు మార్గ ప్రదర్శనఁ జేసి, నిత్యమున్ 
జాతికిఁ జేతనమ్ము నిడి, చల్లని మాటల స్ఫూర్తి నిచ్చియున్, 
నీతి నిజాయితిన్ నిలిపి, నీ చిరకాల స్వరాష్ట్ర కాంక్షమై 
యీ తెలగాణ యుద్యమము నెంతయొ ముందుకుఁ బోవఁ జేసి, నీ 
చేఁతలతోన రాష్ట్ర మిట సిద్ధియు నొందక మున్న దైవమై 
మా తలరాత మార్చు వర మీయఁగ నెంచియు స్వర్గగామివై 
పోతివి దుఃఖవార్ధి మము మున్గఁగఁ జేసియు మమ్ము వీడియున్! 
యాతన మాకు శేష మయె; వ్యాకుల చిత్తుల మయ్యు మేమిటన్ 
జేతుము నీకు వందనము శీర్షము వంచి, మహోత్తమాశయా! 
చేతుము రాష్ట్ర సిద్ధి, ఘన చిత్తతతో నిఁక నుద్యమించి, యో 
యీ! తెలగాణమాత సుత! యీ తెలగాణము రాష్ట్ర మయ్యెడున్!” 


(నాటి నా మాట నేడు యథార్థము కాబోతున్నదనే ఆనందం…తెలంగాణ రాష్ట్రోదయాన్ని కన్నులారా తిలకించడానికి మా తెలంగాణ జాతిపిత లేడుకదా అనే విచారం…రెండు కలగలసిన ద్వైధీభావం నా మనస్సును ఆవరించింది. హే భగవాన్! మా మార్గదర్శి ఆత్మకు శాంతిని ప్రసాదించమని మాత్రమే నేను కోరగలను. అంతకు మించి ఏమి చేయగలను?)

జై తెలంగాణ!          జై జయశంకర్ జీ! 

ఆదివారం, అక్టోబర్ 13, 2013

మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా!

తెలంగాణ ప్రజలకు రచయితలకు కవి పండితులకు
విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు!!


చండి! భవాని! శైలసుత! శాంభవి! భైరవి! యోగమాయ! చా
ముండి! వృషాకపాయి! సతి! మోక్షద! శాంకరి! దుష్ట దానవో
త్ఖండతరాశుకాండ! తెలగాణ వరాంచిత రాష్ట్రదాయి! పా
షండ శిఖండి! శక్తి! మహిషాసుర మర్దిని! సింహవాహనా! (1)

నేతల నీతిమంతులుగ నేర్పడఁ జేసియు; మమ్ము నేఁడిటన్
పూత మనమ్ము గల్గునటు పూని, వరమ్మిడి, వెల్గఁ జేసియున్;
చేతము చల్లనౌనటుల శీఘ్రమె రాష్ట్రము నేర్పరించియున్;
మా తెలగాణ మా కొసఁగు మమ్మ! దయామయి! సింహవాహనా! (2)

పూనెను కేంద్రమిప్పు డనుమోదము తోడుత రాష్ట్ర మీయఁగన్;
దీని నమోఘ రాష్ట్రముగఁ దీరిచి దిద్దియు మా కిడంగ, నీ
వే నవ రూప కర్తవయి, వేగమె హైదరబాదుఁ గోరు, మా
కా నగరమ్ముతోడి తెలగాణము నీఁగదె సింహవాహనా! (3)

నిరతము నిన్ను గొల్చెదము; నిక్కము! నమ్ముము! మా మనోరథ
స్థిరతర రాష్ట్రమందఁగను దీక్షలు సేసి, తపించినాము, మా
చిరమగు వాంఛఁ దీరిచి, విశేష తమాంచిత నవ్య రాష్ట్రమున్
కర మనురాగ యుక్తముగఁ గాంచుచు నీఁగదె సింహవాహనా! (4)

ఆత్రముతోడ వేచితిమి, హర్ష సుహృద్వర రాష్ట్రదాయి! మా
శత్రుల మానసమ్ములనుఁ జక్కనొనర్చియు, వారలన్ సుహృ
న్మిత్రులుగాను మార్చి, కరుణించియు, మమ్మిఁక వేగిరమ్మె స
ద్గాత్రులఁ జేసి, నీవు తెలగాణము నీఁగదె సింహవాహనా! (5)

                        -:శుభం భూయాత్:-

బుధవారం, అక్టోబర్ 09, 2013

నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ!


*
"నాకుఁ దెలగాణ నిచ్చెడు, నాపెడు బల
మేమియును లేదు! మీ సెంటిమెంటు నేను
గౌరవింతు" నటంచును కమ్మఁగాను
బలికి, యిపుడిట్టి దీక్షఁ జేపట్టినట్టి
రెండు నాల్కల జగను దుర్నీతి తోడ,
దోచుకొనఁ గోరి పలికెడు దుష్ట వాక్కు
నా తెలంగాణ సోదరా నమ్మకుమయ! (1)

*
"ఆత్మ బలిదాన మెంతయు నార్తి దాయ
కమ్ము! బాసచేసి, యనెదఁ గాంక్షతోడ,
నింక బలిదానములు వల, దిచ్చటఁ దెల
గాణమును బలయుక్తనుగా నొనర్తు!
సోదరుల్లార! తెలగాణ సువిదితమగు
కాంక్ష నెప్పుడు నే నెద గారవింతు"
ననియు శర్మిల యా నాఁడు నమ్మఁ బలికి,
నేఁడు దీనిఁ "బాకిస్తా" ననెడి విధమున,
దోచుకొనఁ గోరి పలికెడు దుష్ట వాక్కు
నా తెలంగాణ సోదరా నమ్మకుమయ! (2)


*
పదవి కొఱకయి మామనే వంచనమున
పదవి వీడఁ జేసినయట్టి బాబు నాఁడు,
"బిల్లు పెట్ట, మద్దతు నిత్తు వేగ సభ" న
టంచుఁ బల్కి, తెలంగాణ వంచకుఁ డయి,
కేంద్ర మిడఁగా, విభేదించి, కీడు సలిపె!
సీటు కోసము చెప్పిన మాట తప్పి,
మోసగించంగఁ జూచెడు వేసగాఁడు;
రెండు కండ్ల సిద్ధాంత సుప్రీతుఁడైన
బాబు దీక్షల, మాటలఁ బరిగణించి,
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (3)

*
బ్రతుకు నిచ్చిన కాంగ్రెస్సు బాట నడ్డి,
సొంత లాభమ్ము కోసమై, సొంత జనులఁ
జింతలనుఁ ద్రోయఁగా సాహసించియుఁ, దెల
గాణమును తుంగలోనఁ ద్రొక్కఁగాను దలఁచి,
కుటిల కృతముల నుద్యమ నటకుఁడైన
నల్లికుట్టుల నల్లారి నయ విరహిత
చేష్టలను , వాక్కులను దెలిసి తెలిసి, యిఁక
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (4)

*
నీదు మార్గమ్ము తెలగాణ; నీతి, రీతి,
ఖ్యాతి తెలగాణ; మంత్రమ్ము, ఆశయమ్మ
దియ తెలంగాణ; ధర్మమ్ముఁ దిరుగ నీఁక,
న్యాయమునుఁ దప్పనీఁక;సహాయము నిడి,
సహనమునుఁ బూని, తెలగాణ సాధనమున
నెంద ఱడ్డము వచ్చిన; నెవరు నింద
సేసిన; విని, వినని వాని వేసముఁ గొని,
మన "తెలంగాణ రాష్ట్రమ్ము" మనకు దక్కు
దనుక, మోసకారుల బాస తలను నిడక,
యెల్ల వేళల నప్రమత్తోల్లమునను
రాష్ట్ర సాధనా లక్ష్యమ్ముఁ గ్రాలుచుండఁ,
గృత్యములఁ జేయఁగాను రాష్ట్రేప్సితమ్ము
త్వరితముగ నెఱవేఱు! నీ తపన తీరు!!
గాన, నిన్నిప్పు  డుడికించఁ గాను బూను
దుష్ట దుర్మార్గ దుర్నీత దుర్మదాంధ
భాషణము లెప్పుడును నీవు వలచి వలచి,
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (5)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

ఆదివారం, అక్టోబర్ 06, 2013

ఉద్యమకారులా...రౌడీమూఁకలా...?!


కేంద్ర మిటు నోటుఁ బెట్టంగఁ, గ్రిందు సేయ
సీమ నాయకు లట దుష్ట చేష్టఁ బూని,
యల్లరులు, దోపిడులు, లూటి, లక్రమములు
చేయఁ బురికొల్పి రిదియేమి చిత్ర మయ్య? (1)

మా తెలంగాణమును దోచు మార్గ మిటుల
మూయఁ బడఁగానె, దోపిడీ మానసములు
మిన్న కుండునె? సీమాంధ్ర మీఱి హద్దు,
దోచుచుండిరి ప్రజల నాందోళన నిడి! (2)

అఱువ దేండ్ల దోపిడిని మే మందఱ మిట
నోర్చి, యుద్యమమును జేయ, నొక్కఁ డైన
“మీకు జరిగె నన్యాయమ్ము; చేకుఱు సుఖ
ము” లనియుఁ బల్కెనే? కర్కశులరుఁ గాదె! (3)

ఇచట నుద్యమ మందున నే యకృత్య
మేని జరిగెనే? యఱువది యేఁడుల నిర
సనము శాంతి యుతముగానె జరిగెఁ గాదె?
యఱువది దినాల సమ్మెలో నవియ యేమి
యల్లరులు, దోపిడులు, లూటి, లక్రమములు? (4)

ఈ నిరాహార దీక్షలు హేళనముకె!
వోట్లు, సీట్లు, కోట్ల కొఱకె పొండు పొండు!!
ఇటఁ దెలంగాణలో నుద్యమించ మీర
లిట్లు దీక్షలు సేసితిరే? దురాశ! (5)

"వేగఁ దెలగాణ బిల్లును బెట్టుఁ, డేము
మద్ద తిచ్చెద" మంచును మాటలాడి;
కేంద్ర మొప్పుకొనంగనే, కృతము మఱచి,
దీక్షలను జేయ నేమండ్రు తెలుఁగు జనులు? (6)

ఉద్యమము ముసుఁగునను దురూహఁ బూని,
దొంగ మూఁకలఁ జేర్చి, విదూషకులయి,
ప్రజల దోచి, ప్రభుత నష్ట పఱచి, కాల
మును గడపఁగను మీకేమి మోద మబ్బె? (7)

మీర లిఁకనైనఁ బ్రజల హింసింప మాని,
దొంగ వేషాలు వదలి, సంతోష మిడెడు
కృత్యములఁ జేయ, బాగుగాఁ బ్రీతి నంది,
ప్రజలు మిముఁ జేరి, నమ్మెద రయ్య నిజము! (8)

కేంద్రమునకు మీరిచ్చిన కృత ప్రతిజ్ఞ
చెల్లు బాటగు నట్టులఁ జేసి, మీరు
ఘనతఁ జాటుకొనిన వేగ గౌరవ యుత
స్థానములు దక్కునయ్య! మీ స్థాయి పెరుగు!! (9)

కాన యిఁకనైనఁ బ్రభుతకుఁ గాంక్షఁ దెలిపి,
రెండు రాష్ట్రాలు సాధించి, ప్రేమఁ గనుఁడు!
బడుగు బహుజన ప్రజల సంబరము నందుఁ
బాలుఁ గొనుఁడు! మీ ఖ్యాతి నిజాలు కనుఁడు!! (10) 

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

తెలంగాణ ప్రథమ విజయం!

నా తెలంగాణ సోదరులకు
శుభాకాంక్షలు!!


సిరులు తొలుకాడు తెలగాణ సీమ నేఁడు
సంతసమ్మునఁ దేలి, ప్రశాంత మాన
సాబ్జ యయ్యెఁ గేంద్రామోద సాక్ష్యమైన
ప్రకటనా పత్రమునుఁ జూచి వఱలి యిచట! (1)

అఱువదేండ్ల నిరీక్షణ హర్షపూర్ణ
మాయె నేఁడు కేంద్రమ్మిడె న్యాయమైన
తీర్పు! సీమాంధ్ర ఘటిత విదీర్ణ హృదయ
మీ దినమ్ము చికిత్సచే మోదమందె!! (2)

నా తెలంగాణ సోదరా! నవ్య రాష్ట్ర
మీ తెలంగాణ, వెలిఁగించు నీదు బ్రతుకు!
స్వేచ్ఛనందిన హృదయానఁ జేయుమయ్య
"జై తెలంగాణ" గానమ్ము సంతసమున!! (3)

కేంద్ర సంకల్ప సాధనా కీర్ణమైన
చర్య నీ దినమునఁ బ్రయోజన కరమని
పరవశమ్మునఁ బ్రజలంత స్వచ్ఛమైన
మనముతో స్వాగతించిరి ఘనముగాను!! (4)

అఱువదేఁడుల యాఁకలి యాఱునంచు
నాశతోఁ జూచు తెలగాణ నాయకులకుఁ
జేతు జేజేలు, నతులు విశేషముగను
నా తెలంగాణ రాష్ట్ర సంజనిత తుష్టి!! (5)

కేంద్ర ప్రకటన మాత్రాన గృహము నలికి,
పండుగను జేసికొనఁగాను వలదటంచు,
మనసు బోధించు చున్నది; మన స్వరాష్ట్ర
మేర్పడెడు దాఁక నిత్యము హితముఁ గోరి,
యెదిరి కదలికల్ తెలివితో నెఱుఁగ వలయు;
దానఁ దెలగాణ రాష్ట్రావతరణ మగును!! (6)

జై తెలంగాణ!                           జై జై తెలంగాణ!!

మంగళవారం, అక్టోబర్ 01, 2013

విజయనామ సంవత్సర యుగాదినాటి సంఘటన...(గేయ కవిత)



శ్రీలు గురియు ఈ విజయ యుగాది
మాత అరువదేడుల క్రిందట జనె
ఆంధ్ర తెలగాణ లెటుల నున్నవో
చూచి వత్తమని కడు వేడుకతో!


పందొమ్మిది వందల యేబది మూ
డప్పటి మాటిది! విజయ యుగాది
మాత వెళ్ళెను ముందుగ ఆంధ్రకు!


ఆంధ్ర మాత కన్నీటితొ ఎదురై
“నా తనయులు మదరాసు రాష్ట్రమున
బానిస బతుకులు బతుకుచుండి”రని
బావురుమని “కాపాడు”మన్నది!



విజయ యుగాది మాత “కాతు”నని
అభయమిచ్చి, యిక తెలంగాణను
చూచిపోవుటకు రయమున వచ్చెను!


నాడు హైదరాబాదు రాష్ట్రమున
నిజాము పాలన అంతము కాగా
తెలంగాణమున ప్రజలందరును
యుగాది మాతకు స్వాగత మిడిరి!

సంతసమున తెలగాణ తల్లియును
“నా పిల్లల చల్లగ జూ” డన్నది!

“అటులే” యని యా యుగాది మాతయు
“ఆంధ్ర మాత కన్నీరు తుడువు” మని
కోరె తెలగాణ తల్లిని మరి మరి!


సోదరి బిడ్డల దీన స్థితి విని
జాలిపడిన తెలగాణ తల్లి, కప
టమ్మెది లేకయు మాట యిచ్చెను!



మాట తీసుకొని విజయ యుగాది
అరువదేండ్ల తరువాత ఆంధ్రలో
రెండువేల పదమూడు వత్సరము
లోన అడుగిడియును అంతట చూచెను;
ఎచట జూచినా కోలాహలమే,
జనుల మోమునను సంతోషమ్మే,
తెలంగాణమును దోచిన ఛాయలె!!
విజయ యుగాది యిది గమనించియు
తెలంగాణముకు పయనమాయెను!



తెలంగాణమున అడుగిడి యుగాది
మాత చూచె నొక చోట నొక్కతెను!
ఏడ్చి యేడ్చి కన్నీరు ఇంకగా
అరచి యరచి తన గొంతు బొంగురై

గుర్తుపట్ట రానట్టి యామెను
విజయ యుగాది చేరి యడిగెను;


"ఎవరమ్మా నువు? నే నెచ్చటనో
నిన్ను జూచిన జ్ఞాపకమున్నది!
తెలిసిన వారల పోలికలున్నవి!”


అనగానే ఆ వనిత భోరుమని
యేడ్చుచు “అమ్మా , యుగాది మాతా!
తెలంగాణ మాతను నేనమ్మా!
అరువదేడుల కిందట నీకు
మాట యిచ్చితిని జ్ఞాపకముందా!


ఆంధ్ర మాత కన్నీరు తుడువగను
వారల నా దరి జేరనిచ్చితిని!
ఇటెటు రమ్మంటె ఇల్లు నాదనిరి;
కృతజ్ఞత వీడి కృతఘ్నులైరి!


బానిస లిప్పుడు పాలకులయ్యిరి;
స్వతంత్రులను బానిసలను జేసిరి!
రమ్మనగానే పొమ్మనజొచ్చిరి!!
తెలంగాణ రాష్ట్రమ్ము కోసమై
ఎంత అడిగినను పెడచెవి బెట్టిరి!


వేయి వీరుల బలిదానమ్ములు
కర్కశులను కరిగించక పోయెను!
మాట యిత్తురు తప్పుచుందురు;
నరములేని నాలుక మాటాయెను!

తెలంగాణమున ఉద్యమమ్ములే
రాష్ట్ర సిద్ధికై జరుగుచుండెను!

బిడ్డల ఆశలు తీరే దెన్నడొ?
ఆనందమ్మే విరిసే దెన్నడొ?

నీ వైనా మరి దారి జూపి, మము
అమ్మా! కావుము” అనుచు వేడగా,
ఆంధ్రుల మోసము గమనించియు ఆ
యుగాది మాతయు కలవరమందుచు
అభయ మిచ్చెను “మరువత్సరమున
’యుగాది’ త్వదీయ రాష్ట్రములోనే!
తెలంగాణ మాగాణము వెలుగుల
జిమ్మి సంతసము నంతట పంచును!
నిజమిది! నిజమిది! నమ్ముము నన్న”ని
యుగాది మాత అంతర్ధానము
కాగా, వేకువ కోడి కూసెను!


మేలుకొన్న నే కలగంటినని
తెలిసికొంటి! నా కల నిజమౌటకు
విజయ యుగాది మాతను నేను
మనస్ఫూర్తిగా కోరితి శుభము!!


(రెండువేల పద్నాలుగులో వచ్చే యుగాదినాటికి మన తెలంగాణ రాష్ట్రములోనే యుగాది పండుగ జరుపుకోవడానికి మనమంతా వేచి వుందాం!!)

జై తెలంగాణ!                  జై జై తెలంగాణ!!

ఆదివారం, సెప్టెంబర్ 29, 2013

నా తెలంగాణ జనభేరి!



“హైదరాబాదు తెలగాణదౌ” నటంచు
వచ్చిరే పది జిల్లాల ప్రజలు కదలి
యా నిజాం కళాశాల గ్రౌండ్స్ నందు నిండ!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (1)

పెట్టుఁడీ బిల్లు పార్లమెంట్ చట్ట సభను
వేగమే” యంచుఁ దెలగాణ సాఁగి వచ్చి
నినద మెత్తెను గొంతెత్తి వినఁగ ఢిల్లి!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (2)

కడుపు మండిన వార లిక్కడను నుండ్రి;
వేగఁ దెలగాణ రాష్ట్రమ్ము నీఁగదెయని!
కడుపు నిండిన వార లక్కడను నుండ్రి;
హైదరాబాదు దోఁచఁగా నద నిదెయని!
మండు వారికి శత్రు లీ నిండు వారె!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (3)

ఆత్మ బలిదాన మిడిరి సహస్ర వీర
జనులుకాంక్షమై తెలగాణ జనులు నిటను
వచ్చి రంజలి ఘటియింపఁ బరుగు లిడుచు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (4)

రాష్ట్ర మీయంగఁ బ్రకటించఁ బ్రభుత యచట;
దాని నడ్డుకొనిన యాంధ్ర దౌష్ట్య యుతుల
చేష్ట ఖండింపఁగాఁ బ్రజల్ చేరి రిచట!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (5)

మా తెలంగాణ నాయక మాన్యుల నవ
మాన పఱుపంగఁ దగదనిమానహీను
లైన సీమాంధ్రులకుఁ దెల్పఁగానిచటికిఁ
దరలి వచ్చిరి తెలగాణ వర జనులును!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (6)

ఆ దినేశుని దౌష్ట్యమ్ము లాగడములు
సాఁగవను తీర్పు వినియువిచార మెడల
సంతసమ్మున గొంతెత్తి వంత పాడఁ
బరుగులెత్తి వచ్చిరి జనుల్ ప్రబలు రయ్యు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (7)

మా తెలంగాణ రాష్ట్రమ్ము మా కిడుఁడన,
మూర్ఖ బుద్ధియౌ కిరణుండు ముఖ్యమంత్రి
పదవి నడ్డము పెట్టియు వదరుచుండఁ,
ద్రిప్పి కొట్టంగ వచ్చిరి యిప్పు డిటకు
పది జిలాల ప్రజలు వేగ పడుచు మిగుల!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (8)

ఆంధ్రలోఁ గొన్ని వర్గమ్ము లడ్డుపడఁగ;
బడుగు బహుజన వర్గాల ప్రజలు ప్రబల
ముగనుతెలగాణ రాష్ట్ర మీయఁగను గోర,
వారి నణచు క్రూరుల పని పట్ట నెంచి,
యిటకుఁ దరలి వచ్చిరి జను లీ విధముగ!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (9)

మా తెలంగాణ రాష్ట్రమ్ము మా బలమున
సత్వరమ్ముగ నేర్పడున్సకల జనులు
సంతసింతురుజేజేల సంతస నిన
దమ్ములు తెలగాణ జనులు తఱచి తఱచి
చేతురని తెలుపఁగను వచ్చిరయ యిటకు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (10)

శనివారం, సెప్టెంబర్ 28, 2013

నిన్న మొన్నటి దాఁక వంచించు మాట!


*
నిన్న మొన్నటి దాఁక వంచించు మాట
లెన్నొ మాట్లాడి, “తెలగాణ మున్నది యటఁ
గేంద్ర కరమున! నా చేఁతి కేమి యిడక
యుండ్రి! వారలదౌ నిర్ణయోద్ధృతినిట
నేను తలఁదాల్చి, యనుసరించెద నిజమ్ము!
నమ్ముఁ” డంచుఁ జొక్కంపు బంగారు మాట
లాడి; నేఁడుఁ దప్పి, మఱొక్క లాగున విని
పించుచును ముఖ్యమంత్రి ఱంపిల్లుచుండె!! (1)

*
“నీర ముద్యోగము లుపాధి ఘోరమైన
పాటులందును విభజన వలన నిచటఁ!
గాన, కేంద్రమ్మిఁక మఱియొక్క తఱిఁ దఱచి,
విభజనంపు టాలోచన వేగముగను
మానవలె” నంచు మన ముఖ్యమంత్రి వలికె! (2)

*
నీటి పాట్లను ట్రిబ్యునల్ తేఁట పఱచు;
మఱియు, నుద్యోగులకు నియమావళి యిట
నుండెను; నుపాధి కొఱ కే జనుండు నైన,
నెచటికైనను బోయి యుండినను నెవరు
నీ ప్రజాస్వామ్య దేశాన నెటుల నాపు
దురు? కనుక, నివియ వితండ దుర్మదాంధ
దర్పిత వచనమ్ములు! కాన, తగ్గుమనుచు
నిచటి తెలగాణ జనులు ఖండించుచుండ్రి! (3)

*
స్వార్థపూరిత దూషిత వాక్కులివియ;
యివియ తెలగాణ జనులను నీసడించి,
రెచ్చఁగొట్టెడి పలుకు! లుద్రేక జన్య
వా క్కలహ కారణమ్ములు! భ్రమముఁ గొలుపు
నివియ సీమాంధ్ర జనులకు; నెంతయేని
మోసమునుఁ గూర్చు మాటలు! ముందు ముందు
నెన్నికలలోన గెలుపొంద, నిక్కముగను
నెత్తుగడ కాక, యిదికాదె నీచ కృతము? (4)

*
మొదట నొకమాటఁ బలికియుఁ, బిదప మఱియు
నొకటి వలుకంగ, రెండు నాలుకలు గలవె?
వాక్కు స్థిరముగా నుండఁగా వలయుఁ; గాని,
పూఁట పూఁటకు మాఱిన, మూర్ఖుఁడనరె? (5)

*
బొంకులను బల్కి, యిట నట మూఢ మతినిఁ
బ్రజల మోసగించంగ దిగ్భ్రాంతులయిరి!
రెచ్చిపోవునట్టుల వారి గిచ్చి, యిటులఁ
గోపమునుఁ బెంచఁగా నెంతొ ఘోరమొదవె! (6)

*
ముఖ్యమంత్రి యనంగను ముఖ్యముగను
నిరువుఱను శాంత పఱుపంగ స్థిర తముఁ డని,
శాంతి కాముకుఁడని యంచు, సఖ్యముగను
మెలఁగి, కేంద్ర శాసనముల మీఱకుండ
నందఱును దలఁదాల్చెద రహరహమ్ము!
కాని, కోపమ్మునుం బెంచు ఖండితమగు
వచనములు వల్కఁగా గౌరవమ్మె చెడెను!! (7)

*
"నేను సీమాంధ్ర పక్షమే కాన, ప్రభుత
యే తెలంగాణ ప్రకటన నిపుడె తిరిగి
వెనుకకును దీసికొనుదాఁక వెనుక యడుగు
వేయ; నేను రాజీనామ చేయుటకును
జంకఁ బోను! క్రికెట్టున నింకఁ జివరి
బంతి నా చేఁత నున్నది! పరుగు లాఱొ,
యోడి పోవుటయో, చూచె దోయి నే" న
టంచుఁ బలుకంగ నిష్ఫలితమ్మె కలుగు! (8)

*
ఆటలో నోడిపోయెద నంచుఁ దెలిసి,
గెలిచె దంచును బలుకంగ గెలుపుఁ గనునె?
ఆట యెప్పుడో ముగిసెలే, యటఁ బ్రకటన
కేంద్రమే చేసె! తెలగాణ కిది సమయము!
హైదరాబాదుతోఁ గూడినట్టి రాష్ట్ర
మునొసఁగంగ మాటిచ్చెను గనుక, మాట
తప్పు నవకాశమే లేదటంచుఁ జెప్పె!! (9)

*
అవని విదీర్ణమైనను, హిమాద్రి చలించుటఁ గల్గినన్, మహా
ర్ణవ మది యింకినన్, దివసనాథుఁడుఁ, జంద్రుఁడుఁ దేజ మేదినన్,
నవ తెలగాణ రాష్ట్రము జనావళి మెచ్చియు, “జే” యనంగ, గౌ
రవయుత యయ్యు వచ్చును, విరాజిలుచుం జిఱునవ్వు తోడుతన్! (10)

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!