"విభజనకు మేము వెనుకంజ వేయఁ బోము;
ఆఱు నూఱైనఁ "దెలగాణ, మాంధ్ర రాష్ట్ర
ము" లను, రెండు రాష్ట్రమ్ములు తెలుఁగు వారి
కేరుపాటు చేతు"మటంచుఁ గేంద్ర మనియె! (1)
విభజనము తప్పదని తెల్సి, పిడికి లెత్తి,
"యడ్డు పడె"దంచుఁ బల్కిన నాగునదియె?
"తెలుఁగు జాతి యొక్కటిగాను వెలిఁగి పోవఁ
గావలె"నటంచుఁ బైకి వల్కంగ; లోన
దుష్ట యోచనఁ జేయంగ, శిష్ట మగునె? (2)
కేంద్ర ప్రకటన రాఁగానె క్షేమ మెసఁగ
విభజనమునకు సమ్మతి వేగఁ దెలిపి
యున్నచో నింత కాలమ్ము సున్న యగునె?
ప్రజల కష్టాల పాల్జేయ వాంఛితమ్మె? (3)
కలుగుచున్నట్టి పరిణామ క్రమముఁ గాంచి,
మేలుకొన్నచో జరుగును మేలు! కాని,
"యింక నే కుట్రలను జేతు నిప్పు"డనిన,
మెచ్చ రెవ్వరు మిమ్మింక! కచ్చె హెచ్చు!! (4)
"విభజనము వ"ద్దనెడి మాట పెక్కుఱకును
బాధఁ గలిగించు! నవకాశ వాదుల కదె
సంతసముఁ గూర్చు! వ్యాపార సరణి కొఱకు
నందఱను నష్ట పఱుపంగ న్యాయ మగునె? (5)
కలసి యుండియుఁ బోట్లాటఁ గనుట కన్న;
మనము విడిపోయి, సుఖముగా మనుట మిన్న!
కలసి యుండిన సుఖములు కలుగు ననెడి
మాట ప్రాఁత వడిన మాట! నేఁటి మాట,
వేఱు పడినచో సుఖములు, ప్రేమ పెరుగు! (6)
కేంద్ర మంత్రి వర్గము నేఁడు కృత వినిశ్చ
యమ్ముతో నుండె విభజింప! నందు వలనఁ
గాక యున్నను, బ్రజల మేల్గనఁగ నెంచి,
వేఱు పడఁగాను మేలగుఁ; బ్రేమ లెసఁగు!! (7)
శీఘ్ర మభివృద్ధిఁ గోరిన, శీఘ్రముగను
రెండు రాష్ట్రమ్ము లిప్డు వేర్వేఱుగాను
ప్రభవ మందంగ వలె! గాన, భ్రాంతి విడచి,
వేగమే విడిపోయిన, వెతలు తొలఁగు! (8)
శ్రేయ మందఁగ జాప్యమ్ముఁ జేయ మాని,
ప్రజల కొనఁగూడు లాభమ్ము పఱగ నెంచి,
నవ్య రాష్ట్రోపయుక్త కాంక్షలను దెలిపి,
బాగుపడి చూపుటయె నేతృ పరమ కృతము! (9)
జై తెలంగాణ! జై సీమాంధ్ర!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి