గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 01, 2013

విజయనామ సంవత్సర యుగాదినాటి సంఘటన...(గేయ కవిత)



శ్రీలు గురియు ఈ విజయ యుగాది
మాత అరువదేడుల క్రిందట జనె
ఆంధ్ర తెలగాణ లెటుల నున్నవో
చూచి వత్తమని కడు వేడుకతో!


పందొమ్మిది వందల యేబది మూ
డప్పటి మాటిది! విజయ యుగాది
మాత వెళ్ళెను ముందుగ ఆంధ్రకు!


ఆంధ్ర మాత కన్నీటితొ ఎదురై
“నా తనయులు మదరాసు రాష్ట్రమున
బానిస బతుకులు బతుకుచుండి”రని
బావురుమని “కాపాడు”మన్నది!



విజయ యుగాది మాత “కాతు”నని
అభయమిచ్చి, యిక తెలంగాణను
చూచిపోవుటకు రయమున వచ్చెను!


నాడు హైదరాబాదు రాష్ట్రమున
నిజాము పాలన అంతము కాగా
తెలంగాణమున ప్రజలందరును
యుగాది మాతకు స్వాగత మిడిరి!

సంతసమున తెలగాణ తల్లియును
“నా పిల్లల చల్లగ జూ” డన్నది!

“అటులే” యని యా యుగాది మాతయు
“ఆంధ్ర మాత కన్నీరు తుడువు” మని
కోరె తెలగాణ తల్లిని మరి మరి!


సోదరి బిడ్డల దీన స్థితి విని
జాలిపడిన తెలగాణ తల్లి, కప
టమ్మెది లేకయు మాట యిచ్చెను!



మాట తీసుకొని విజయ యుగాది
అరువదేండ్ల తరువాత ఆంధ్రలో
రెండువేల పదమూడు వత్సరము
లోన అడుగిడియును అంతట చూచెను;
ఎచట జూచినా కోలాహలమే,
జనుల మోమునను సంతోషమ్మే,
తెలంగాణమును దోచిన ఛాయలె!!
విజయ యుగాది యిది గమనించియు
తెలంగాణముకు పయనమాయెను!



తెలంగాణమున అడుగిడి యుగాది
మాత చూచె నొక చోట నొక్కతెను!
ఏడ్చి యేడ్చి కన్నీరు ఇంకగా
అరచి యరచి తన గొంతు బొంగురై

గుర్తుపట్ట రానట్టి యామెను
విజయ యుగాది చేరి యడిగెను;


"ఎవరమ్మా నువు? నే నెచ్చటనో
నిన్ను జూచిన జ్ఞాపకమున్నది!
తెలిసిన వారల పోలికలున్నవి!”


అనగానే ఆ వనిత భోరుమని
యేడ్చుచు “అమ్మా , యుగాది మాతా!
తెలంగాణ మాతను నేనమ్మా!
అరువదేడుల కిందట నీకు
మాట యిచ్చితిని జ్ఞాపకముందా!


ఆంధ్ర మాత కన్నీరు తుడువగను
వారల నా దరి జేరనిచ్చితిని!
ఇటెటు రమ్మంటె ఇల్లు నాదనిరి;
కృతజ్ఞత వీడి కృతఘ్నులైరి!


బానిస లిప్పుడు పాలకులయ్యిరి;
స్వతంత్రులను బానిసలను జేసిరి!
రమ్మనగానే పొమ్మనజొచ్చిరి!!
తెలంగాణ రాష్ట్రమ్ము కోసమై
ఎంత అడిగినను పెడచెవి బెట్టిరి!


వేయి వీరుల బలిదానమ్ములు
కర్కశులను కరిగించక పోయెను!
మాట యిత్తురు తప్పుచుందురు;
నరములేని నాలుక మాటాయెను!

తెలంగాణమున ఉద్యమమ్ములే
రాష్ట్ర సిద్ధికై జరుగుచుండెను!

బిడ్డల ఆశలు తీరే దెన్నడొ?
ఆనందమ్మే విరిసే దెన్నడొ?

నీ వైనా మరి దారి జూపి, మము
అమ్మా! కావుము” అనుచు వేడగా,
ఆంధ్రుల మోసము గమనించియు ఆ
యుగాది మాతయు కలవరమందుచు
అభయ మిచ్చెను “మరువత్సరమున
’యుగాది’ త్వదీయ రాష్ట్రములోనే!
తెలంగాణ మాగాణము వెలుగుల
జిమ్మి సంతసము నంతట పంచును!
నిజమిది! నిజమిది! నమ్ముము నన్న”ని
యుగాది మాత అంతర్ధానము
కాగా, వేకువ కోడి కూసెను!


మేలుకొన్న నే కలగంటినని
తెలిసికొంటి! నా కల నిజమౌటకు
విజయ యుగాది మాతను నేను
మనస్ఫూర్తిగా కోరితి శుభము!!


(రెండువేల పద్నాలుగులో వచ్చే యుగాదినాటికి మన తెలంగాణ రాష్ట్రములోనే యుగాది పండుగ జరుపుకోవడానికి మనమంతా వేచి వుందాం!!)

జై తెలంగాణ!                  జై జై తెలంగాణ!!

3 కామెంట్‌లు:

Vinjamur చెప్పారు...

Excellent .Very well written . Congratulations .

Vinjamur చెప్పారు...

Excellent .Very well written . Congratulations .

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు Vinjamur గారూ! తమరి ప్రోత్సాహం సంతోషాన్ని కలిగించింది. ప్రతిరోజూ ఈ బ్లాగు చూసి తమ అభిప్రాయం తెలుపుతుండగలరు. ఇందులో ఉన్న అన్ని పోస్టులూ చూసి అభిప్రాయం తెలుపగలరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి