కవి పండిత రచయితృ బృందమునకు, వీక్షకులకు
వినాయక నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు!
హెచ్చు తగ్గులు లేనట్టి హిత మనమున,
దరికిఁ జేరనిచ్చితిమి యందఱనుఁ బ్రేమఁ
గుఱియ; స్వార్థ మేమాత్రమ్ముఁ గోర మయ్య;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (1)
మమ్ము బాధించినట్టి సీమాంధ్రులకును
మంచి బుద్ధిని దయసేసి, మమత గలుగు
వారలుగ మార్చి, దీవించి, వరము లిచ్చి,
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (2)
మాయ లేనట్టి వార; మమాయకులము;
కుడు మటన్నఁ బండు వటంచుఁ గూర్మి మీఱ,
సంతతము సంతసముఁ బూని, స్వాగతింప;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (3)
తెలుఁగు వారందఱును నొక్కటిగను నుండి,
ప్రాంతములుగాను విడిపోవ బాగటంచు,
వేడుచుంటిమి ప్రార్థించి, పేర్మి మీఱ;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (4)
ఆత్మ గౌరవోద్యమ మిది, యాదరించి,
యిష్టములఁ దీర్చి, యెడఁబాపి కష్టములను,
మమ్ముఁ గరుణింప వేడెద మనమునందు;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (5)
2 కామెంట్లు:
వినాయకుల వారు సీమాంధ్ర నాయకులకు సద్బుద్దిని ప్రసాదించేలా ఎంతో అద్భుతంగా విన్నవించారు.
బాధించిన వాడిని భేదించక బుద్దిని బాగు చేయమని మీరు చెప్పిన మాటలు, సద్బుద్ధి కలిగిన తెలంగాణా వాదుల బుద్దికి నిదర్శనం.
ఆ వినాయకుడు మిమ్మల్ని చల్లగా చూచు గాక.
ధన్యవాదాలు స్వామిగారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి