గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 09, 2015

శాస్త్రీయ దోపిడీ, అశాస్త్రీయ విభజన!


తెలంగాణను అయిదున్నర దశాబ్దాలకుపైగా శాస్త్రీయంగా దోపిడీ చేసిన వర్గానికి ప్రతినిధి అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, తమ శాస్త్రీయ దోపిడీ ఇక కొనసాగే అవకాశం లేకుండా రాష్ట్రం విడిపోవడం జీవితాంతం జీర్ణం కాని పీడ కలగా మారింది. దోపిడీకి అవకాశం ఉంటే అది శాస్త్రీయ సమైక్యత అవుతుంది. అవకాశం లేకుండాపోతే అశాస్త్రీయ విభజన అవుతుంది. అందుకే ఆయన మంత్రివర్గం ఈ నెల నాల్గవ తేదీన సమావేశమై, తమ కొత్త రాష్ట్రం ఏర్పడి సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా జూన్ 2న నవనిర్మాణ దీక్ష తీసుకోవడంతో పాటు, విభజన అన్యాయంగా, అసంతృప్తికరంగా జరిగిందంటూ ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ విధమైన ప్రచారంలో ఆయనకు వేరే ఉద్దేశాలు ఉన్నాయని ఎవరైనా అనవచ్చు. తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం, కేంద్ర ప్రభుత్వ వాగ్దాన భంగాలను ఎత్తి చూపడం అనే ఎత్తుగడలు అందులో కలిసి ఉంటే ఉండవచ్చు. కానీ చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు ముందే గాక, ఏర్పాటైన తర్వాత కూడా తీసుకున్న వైఖరిని, చేస్తున్న చర్యలను గమనించినప్పుడు, లేడి పిల్లను పులి వలె తెలంగాణను సీమాంధ్ర దోపిడీ వర్గం శాస్త్రీయంగా భుజించే అవకాశం ఇక లేకపోయిందన్న దుగ్ద, కక్ష అడుగడుగునా కన్పిస్తాయి. కనుక, జూన్ 2 నుంచి నవ నిర్మాణ దీక్షతో పాటు, అన్యాయమైన, అసంతృప్తికరమైన విభజన పేరిట తెలంగాణ వ్యతిరేక భావనలను సీమాంధ్ర సాధారణ ప్రజలలో మరొక మారు రెచ్చగొట్టేందుకు ఆయన ప్రయత్నించే అవకాశం ఎంతైనా ఉన్నది. ఆ పని ఆయన చేయకపోతే ఆశ్చర్యపడాలి.


రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరుగుతున్నదని, జరిగిందని గత ఏడాది కాలంగా ఎంతో వేదనను నటిస్తున్న చంద్రబాబు, గత అయిదున్నర దశాబ్దాలుగా తమ ప్రాంతపు ధనికవర్గం తెలంగాణను ఎంత శాస్త్రీయంగా, ఎంత చట్టబద్ధంగా, ఎంత వ్యవస్థీకృత రూపంలో దోపిడీ చేసిందో చెప్పగలరా? ఆ నీతి నిజాయితీలు ఆయనకున్నాయా? ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి రోజు నుంచి వారు ఒప్పందాలను, చట్టాలను బాహాటంగా ఉల్లంఘించడమే కాదు, తమకు అనుకూలమైన చట్టాలను, నిబంధనలను కొత్తగా చేసుకుని దోపిడీని శాస్త్రబద్ధంగా మార్చారు. తమకు రాజకీయం గా మెజారిటీ ఉండటం, అధికార యంత్రాంగం తమ గుప్పెట్లో ఉండటం, తాము విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి తెలంగాణ ద్రోహులు కొందరు సహకరించడం అనే మూడు అంశాలను ఆధారం చేసుకుని తమ శాస్త్రీయ దోపిడీని నిరాఘాటంగా కొనసాగించారు. తమ ఆర్థిక శక్తి అందుకు తోడు కాగా తెలంగాణను తమ అంతర్గత కాలనీగా కూడా శాస్త్రీయంగానే మార్చుకున్నారు. వీటన్నింటి బలంతో కేంద్ర నాయకత్వాలకు, అధికార గణాలకు ఆకర్షణీయమైన వలలు విసిరి, అక్కడి ఆమోదముద్రలు కూడా శాస్త్రీయంగా వేయించుకున్నారు.


చంద్రబాబు బయటకు ఒప్పుకోకపోవచ్చు గాని, పరిపాలనలో ఆయన వంటి అనుభవజ్ఞునికి, పైగా ఆర్థికశాస్త్రం చదివిన వ్యక్తికి ఒక రహస్యం తెలియకపోదు. ఎక్కడైనా, ఎప్పుడైనా అశాస్త్రీయంగా జరిగే దోపిడీ కన్నా శాస్త్రీయంగా-చట్టబద్ధంగా- వ్యవస్థీకృత రూపంలో జరిగే దోపిడీయే అనేకానేక రెట్లు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అదే అసలు దోపిడీ అని ప్రపంచ రాజకీయ చరిత్రలు, చంద్రబాబు చదివిన ఆర్థిక చరిత్రలు చెప్తాయి. అందుకే మనం బ్రిటిష్ వలస పాలనా వ్యవస్థ అనే శాస్త్రీయ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాము తప్ప, ఎవరో గవర్నర్ జనరల్ అక్రమార్జనలకు వ్యతిరేకంగా కాదు గదా. అదేవిధంగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ధనిక వర్గాల శాస్త్రీయ దోపిడీపై ఉద్యమించారు గాని, అక్కడి అధికారులు లంచాలు తిన్నారని కాదు. కనుక ఎప్పుడైనా శాస్త్రీయమైన-చట్టబద్ధమైన-వ్యవస్థీకృతమైన దోపిడీ అన్నదే అజెండాలోని విషయమవుతుంది. దానిని కొనసాగించడం దోపిడీదారుల అజెండా. కూల్చివేయడం బాధితుల అజెండా. నిరుడు జూన్ 2 నాడు తమ అజెండా ఓడిపోయి తెలంగాణ ప్రజల అజెండా గెలవడం చంద్రబాబుకు, పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ధనిక వర్గానికి, వారి ఆశ్రితులకు, తెలంగాణకు చెందిన తమ భృత్య తరగతికి చెప్పలేనంత వేదనను కలిగిస్తున్నది. 


ఇందువల్ల తమ వర్తమాన తరానికి, రానున్న తరాలకు వాటిల్ల గల ఆర్థిక-రాజకీయ నష్టాలను ఆర్థికశాస్త్ర విద్యార్థి అయిన చంద్రబాబు ఎన్నటికీ లెక్కవేయలేరు. అటువంటి నష్టాలకు కారకులైన భారతీయులను బ్రిటిష్ వారు మన్నించలేనట్లు, తెలంగాణ ప్రజలను చంద్రబాబు ఎన్నటికీ క్షమించలేరు. కానీ చంద్రబాబు కన్న బ్రిటిష్ వారు కొంత నాగరికులనాలి. భారతీయులు తమ వలస పాలనను కూలదోయడం అశాస్త్రీయమనలేదు వారు. పైగా, తమ దుర్మార్గాలకు అమృతసర్ ప్రజల నుంచి మొదలుకొని మాజీ వలస దేశాలలో పలువురిని క్షమాపణలు కోరుతున్నారు. కొన్ని సందర్భాలలో పరిహారాలు కూడా చెల్లిస్తున్నారు. చంద్రబాబు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సీమాంధ్ర ధనికవర్గం, తమ ఇన్నేళ్ల శాస్త్రీయ దోపిడీకి తెలంగాణతల్లికి క్షమాపణలు చెప్పగలరా? పరిహారం చెల్లించగలరా?


మెర్కంటైల్ సామ్రాజ్యవాద దశ నుంచి పారిశ్రామిక విప్లవానంతర సామ్రాజ్యవాద దశ వరకు పాశ్చాత్య దేశాలు ఆర్థిక చరిత్రను అధ్యయనం చేసిన వారు, పాశ్చాత్య దేశాల సంపదలకు ఒక ముఖ్యకారణం లాటిన్ అమెరికన్ సహజ వనరులతో ఆరంభించి పదులకొద్దీ దేశాల వనరులను, మార్కెట్లను కొల్లగొట్టడమని చెప్తారు. అదంతా ఆ పాశ్చాత్య దేశాల శాస్ర్తాలు, ఎథిక్స్ ప్రకారమే జరిగింది. అయితే, అటువంటి దోపిడీ తమ సంపదలకు ఒక ముఖ్య కారణమని అంగీకరించే నిజాయితీని వలసలు అంతమైన తర్వాత అక్కడి నాయకత్వాలు, మేధావి వర్గాలు చూపుతూ వస్తున్నాయి. తెలంగాణ విషయంలో సీమాంధ్ర నాయకత్వాలు, ధనిక వర్గాలు, మేధావి వర్గాలు అటువంటి నిజాయితీని ఎప్పటికైనా చూపగలవా?తెలంగాణను హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసినట్లు అలుపెరుగక రాత్రింబవళ్లు కలవరించే చంద్రబాబు, ఈ ప్రాంతాన్ని తాము ఇన్ని దశాబ్దాలు చేసిన దోపిడీ ఎంత, బాగుపడింది ఎంత, హైదరాబాద్ బాగు అనేది ఏమిటి, ఎంత, ఏ వర్గాల కోసం అన్నది పాశ్చాత్యులు చూపుతున్న నిజాయితీ, అనుసరించి అయినా వివరించగలరా?


చంద్రబాబు వర్గపు ఇదే విధమైన శాస్త్రీయ దోపిడీకి, అశాస్త్రీయమైన పలవరింతలకు ఇంకా నడుస్తున్న పోలవరం కథ ఒక గొప్ప ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరు తనకు బాధాకరంగా ఉందని ఆయన ఇప్పటికి కొన్ని వందల సార్లు అన్నారు. పోలవరం నిర్మాణంలో ఈ దేశపు రాజ్యాంగంతో సహా, బాహాటంగా ఉల్లంఘనకు గురికాని సంబంధిత చట్టం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. అందువల్ల లక్షలాదిమంది గిరిజనులు, దళితులు, మత్స్యకారులతో పాటు ఇతర బీసీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణకు చెందిన వేలకు వేల ఎకరాలు సాగుభూములు, అడవులు, జంతుజాలం, పర్యావరణం ధ్వంసమవుతున్నాయి. మధ్య రాతియుగ కాలం నుంచి అక్కడి ఆవాసముంటున్న కొన్ని తెగల సంస్కృతులు, సామూహిక జీవనాలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. కానీ, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు వల్ల తమ వారికి కలిగే ప్రయోజనాలను లెక్కలు గడుతూ ఎద ఉప్పొంగుతున్న చంద్రబాబుకు, ఈ నష్టాలన్నీ అశాస్త్రీయంగా, రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఎన్నడూ కన్పించలేదు. ఈ నష్టాలు తనకు బాధను కలిగిస్తున్నాయని ఆయన ఒక్కసారైనా, నటన కోసమైనా, మొసలి కన్నీరు అయినా కార్చినట్టు లేరు.


రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూల్, ఆర్టికల్ 338(9), పంచాయతీరాజ్, పెసా, పునరావాస నియమాలు, జాతీయ గిరిజన విధానం (ముసాయిదా) 2006, భూసేకరణ చట్టం, ఏజెన్సీ చట్టాలలో పోలవరం కోసం ఉల్లంఘించనివి ఏవీ లేవు. అదీగాక అక్కడి గిరిజనులను, ఇతర ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసగించేందుకు, బెదిరించేందుకు, అక్రమంగా కేసుల పాలు చేసేందుకు, భయపెట్టి పారదోలేందుకు, సీమాంధ్ర నుంచి వచ్చి షెడ్యూల్డ్ ప్రాంతంలో అక్రమంగా సెటిలైన వారికి స్థానిక గిరిజనులకు మధ్య వివక్ష చూపేందుకు అనుసరించని పద్ధతులంటూ లేవు. అయినప్పటికీ చంద్రబాబుకు ఇదేదీ అశాస్త్రీయంగా కన్పించడం లేదు. తన మనస్సుకు ఏ బాధా కలగడం లేదు. దేశంలోకెల్లా గొప్ప పునరావాస పథకమంటున్న ఆయనకు, రాజశేఖరరెడ్డి కాలం నుంచే ఆరంభించి విచ్చలవిడిగా సాగుతున్న పునరావాస మోసాలు కంటికి ఆనటం లేదు. 


జరుగుతున్నదేమిటో తెలిసి కూడా నోరు పెగలటం లేదు. రాష్ట్రం విడీవిడకముందు నుంచే పోలవరం కోసం తపించిపోయిన ఆ సీమాంధ్ర సంపన్న వర్గ ప్రతినిధికి, ఖమ్మం మండలాలను శరవేగంతో కలుపుకోవడం, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేసుకోవడం, నిధులు తగినన్ని ఇవ్వలేదని కేంద్రంపై కినుక వహించడం వంటివి బాగానే తెలిశాయి. కానీ ఆ బాధితుల గురించి అనేకానేక చట్ట ఉల్లంఘనల గురించి ఏ బాధా కలగలేదు. కానీ అందులో ఆశ్చర్యపడదగింది ఏదీ లేదు. ఎందుకంటే ఇతరులను బాధించ్డం, తాము లాభపడటం దోపిడీదారుల శాస్త్రంలో విడదీయరాని భాగం. తమను బాధించవద్దని బాధితులు అనడం అశాస్త్రీయం. ఇది తెలంగాణకు మాత్రం ఎందుకు వర్తించదు?


టీడీపీ అధ్యక్షుని ప్రచార ఎత్తుగడలు యథాతథంగా బాగానే ఉన్నాయి. కానీ వాటికి కాలం చెల్లిపోయిందని ఆయన గ్రహించినట్లు లేరు. సీమాంధ్ర ప్రాంత సాధారణ ప్రజలు విభజన జరిగిన కొత్తలో కొద్దినెలల పాటు ఆ తరహా ప్రచారంతో కొట్టుకుపోయిన మాట నిజం. కానీ క్రమంగా ఎంత కాలం ఇవే ప్రచారాలు అనే ఆలోచన మొదలైంది. క్రమంగా ఈ ఆలోచన వారిలో పెరుగుతున్నది. ఇది ఏ అంశంలోనైనా, ఎవరికైనా సహజమన్నది ఒకటి కాగా, అంతకన్న ముఖ్యంగా చంద్రబాబు పరిపాలన తీరు ప్రజలకు నెమ్మదిగా ఆవిష్కారమవుతున్నది. దానిపై ఒక్కొక్కటిగా విమర్శలు వినవస్తున్నాయి. జరుగుతున్నది, జరగబోయేది ప్రధానం గాని, జరిగిపోయిన దాని గురించే ఎంత మాట్లాడినా ప్రయోజనమేమిటనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అది సమర్థుడైన నాయకుడు చేయవలసిన పని కాదంటున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవ నిర్మాణ దీక్షపై దృష్టిని పూర్తిగా కేంద్రీకరించి, తెలంగాణ వ్యతిరేక ప్రచారం, విభజన వ్యతిరేక ప్రచారమనే బలహీనపు ఎత్తుగడలను మానుకోవడం సరైన శాస్త్రీయ రాజకీయమవుతుంది.


(వార్తకై దీనిపై క్లిక్ చేయండి)




(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!  జై జై తెలంగాణ!





శుక్రవారం, మే 08, 2015

నిజంగా ఇది తుగ్లక్ కమిటీయే!!!

- కమల్‌నాథన్ విభజన తీరుపై దుమారం
- తెలంగాణ రిజిస్ట్రేషన్‌శాఖ ఆంధ్రాకు అంకితం
- ఏపీ అధికారులను నింపేస్తూ కేటాయింపులు
- ఆంధ్రాకు పోతామన్నవారికీ తెలంగాణలో పోస్టింగ్
- భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం
- మళ్లీ ఉద్యమం తప్పదంటున్న ఉద్యోగులు


కమలనాథనుని కమిటీ
తెలంగాణపైన పగను
బూనినట్టి చేష్టలు గన
తుగ్లక్ చేష్టలె కనబడె!

తెలంగాణ రిజిస్ట్రేష
నుల శాఖను సీమాంధ్రుల
తో నింపుట కిది సీమాం
ధ్రులరాజ్యమ? తెలగాణమ?

తెలగాణకు ఆదాయము
నిడు శాఖలొ సీమాంధ్రుల
నియమించినచో తెలగా
ణకు నష్టమె! అనర్థమే!!

తెలంగాణ ఉద్యోగుల
ఆప్షన్లను చెత్తబుట్ట
పాలుజేసి ఈ కమిటీ
ఆంధ్ర కొమ్ము గాచె నిటుల!!

సీమాంధ్రా ఉద్యోగుల
కే మెరిటులు లేకున్నా,
తెలంగాణలోన నియా
మకము జేయ, మతలబేమి?

తెలంగాణ పోస్టులలో
ఏపీకిని చెందినట్టి
వారలనే కుట్రపూరి
తమ్ముగ నియమించుటేల?

ఆంధ్రాకయి ఆప్షనిడిన
ఆంధ్రవారి నాంధ్రాకే
పంపకుండ, తెలగాణకె
కేటాయించుట కుట్రే!!

తెలంగాణ కార్యాలయ
మందు ఆంధ్ర అధికారుల
నియమించుట న్యాయమా?
పరిపాలన మెటులుండును??

ఆంధ్రవారికింద తెలం
గాణులు పని చేయుటయే
పునరావృతమయ్యెను గద!
న్యాయమెటుల జరుగునయ్య?

సమైక్యాంధ్ర నినాదాలు
చేసినట్టి వారలనే
తెలగాణలొ నియమించుట
గొడవలు సృష్టించుటకే!!

ఆంధ్రవారి నాంధ్రాకే
తెలగాణుల తెలగాణకె
కేటాయింపగ వలెనయ!
లేకుంటే ఉద్యమమే!!

అరువదేండ్లపాటు జరిగి
తెలంగాణ ఉద్యమమ్ము
ఈ దుఃస్థితి పొందుటకా?
మోసగింపబడుటకా??

మా ఉద్యోగాల్ దోచుకొనియు,
మమ్ముల పాలించి, మమ్ము
బానిసలను చేసినారు!
మరల వారె పాలింతురె?

త్వరగా సరిచేయనిచో
మరల ఉద్యమమ్మె జరుగు!
అప్పుడు ఈ దోపిడీల
అంతుచూడవలసియుండు!!

***       ***       ***

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)





గురువారం, మే 07, 2015

ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో ఎందుకీ తాత్సారం?


రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్నా ఇంకా ఉమ్మడి హైకోర్టు కొనసాగడం విచిత్రంగా ఉన్నది. వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్‌సభలో మంగళవారం టీఆరెస్ ఎంపీలు ఆందోళన చేపట్టవలసి వచ్చింది. అయినా కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇవ్వకుండా దాట వేస్తున్నది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని...పదిహేను రోజుల్లో అన్ని పక్షాలతో చర్చలు జరుపుతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ యధాలాపంగా బదులిచ్చారు. వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలె తప్ప ఇంకా చర్చించేదేమున్నది? గతంలో ఇదే పార్లమెంటు వేదికపై టీఆరెస్ సభ్యుడు నిలదీసినప్పుడు కేంద్రం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కాలయాపన చేయడం, పక్కవారిపైకి తోసేయడం తప్ప చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజన తరువాత అన్ని విభాగాలు తదనుగుణంగా చీలిపోవాలె తప్ప మళ్ళా ప్రతి రంగానికి ఆందోళన చేయవలసిన పరిస్థితి రాకూడదు. 
ఆంధ్ర ప్రదేశ్‌కు విడిగా హైకోర్టు ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం కాని పెద్ద విషయమేమీ కాదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాము ఎంపిక చేసుకున్న స్థలంలో వసతి సమకూరిస్తే సరిపోతుంది. వసతుల కల్పనలో తోడ్పాటు అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ విభజనను అడ్డుకోవడం క్షమార్హం కాదు. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కూడా ఎంతో నష్టం వాటిల్లుతున్నది. ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసుకుంటామని భావిస్తే అన్ని విధాలా సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవసరమైతే ఇప్పుడున్న వసతి వారికి ఇచ్చి తాము గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటామని కూడా సూచించింది. 
అయితే హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ సంసిద్ధతను ప్రశంసిస్తూనే, ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జాప్యానికి కారణం న్యాయశాఖదే అయినట్టుగా చెబుతున్న కేంద్రం వైఖరిని తప్పు పట్టింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం- నిధులు ఇవ్వాల్సింది కేంద్రం కాగా, ప్రకటన జారీ చేయాల్సింది రాష్ట్రపతి అని వివరించింది. ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేసే ప్రాంతం ఏదో చెబితే చాలదని, స్థలం చూపించి ఏర్పాట్లు చేయాలని కూడా హితవు చెప్పింది. అయినా మొద్దుబారిన ప్రభుత్వాలకు చలనం రావడం లేదు. 
రెండు రాష్ర్టాలలో ప్రజాభిప్రాయం హైకోర్టు విభజనకు అనుకూలంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చిన ప్రధానాంశాలలో న్యాయ వ్యవస్థలో వివక్షను తొలగించడానికి సొంత హైకోర్టు ఏర్పాటు చేసుకోవడం ఒకటి. రాష్ట్ర విభజనే ఇటువంటి అన్ని సమస్యలకు పరిష్కారంగా గుర్తించి న్యాయవాదులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఎన్నో ఉద్యమాలకు న్యాయస్థానాలు వేదికలయినాయి. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా తెలంగాణకు సొంతంగా హైకోర్టు ఉండాలని ఉమ్మడి పేర సాగే వివక్ష వద్దని న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. ఈ పరిస్థితి ఉద్రిక్తతలకు కూడా దారి తీసింది. సీమాంధ్రలో కూడా హైకోర్టు విభజనకు ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉన్నది. ఇటీవలనే విజయవాడలోని న్యాయవాదులు తమ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు కావాలని ఆందోళన చేపట్టారు. 
తమకు హైకోర్టు బెంచి కావాలని గుంటూరు న్యాయవాదులు ఎంతో కాలంగా ఉద్యమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర విభజన అనివార్యమని వారు గ్రహించారు. దీంతో హైకోర్టు బెంచి అని కాకుండా సొంత హైకోర్టే కావాలని డిమాండ్‌ను మార్చుకున్నారు. దీనికి తెలంగాణవాదులు కూడా హర్షం వెలిబుచ్చారు. నిజానికి సీమాంధ్ర పెద్దలు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలనే డిమాండ్‌కు అన్ని ప్రాంతాల మద్దతు కూడగట్టడానికి కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని శ్రీబాగ్ ఒప్పందంలో అవగాహనకు వచ్చారు. 1953 అక్టోబరులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే 1954 జూలై కల్లా - ఏడాది తిరగక ముందే- తమకంటూ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసుకున్నారు. 
ఆ తరువాత రెండు ప్రాంతాల నెత్తి కొట్టి ఇటు తెలంగాణ ప్రజల అభిప్రాయాలను కాలరాచి హైదరాబాద్‌కు అడ్డా మార్చారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లోనే అడ్డా వేసిన సీమాంధ్ర పెద్దలు ఇంకా ఇక్కడే కొనసాగడానికి కుట్రలు పన్నుతున్నారు. హైకోర్టు విభజనలో జాప్యం జరిగే కొద్దీ ఆందోళనలు, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తక్షణం విభజన కోసం చర్యలు తీసుకోవాలె.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


సోమవారం, మే 04, 2015

ఆర్కే స్వగతం...?!


కనులు మూసిన కనులు తెఱచిన

కేసియారే మెదలుచుండెను
వామనుండని తలచినందుకు
విశ్వరూపుడయెన్!

ఇక తెలంగాణమ్ము రాదని
హాయిగా కనుమూసియుండగ
కేంద్రమిచ్చెను తెలంగాణము
కలయె చెదరెనుగా!

ముఖ్యమంత్రిగ కేసియారే
యేలుచున్ పదకొండు నెలలయె
నేమి చేసితి నింతవరకును
వెంట్రుకైనను కదలదే?

ఆంధ్రజ్యోతిలొ నేను రాసితి
తప్పు రాతలు తప్పు కూతలు
అట్టి రాతలవేమి చేసెను?
చెఱుపగలిగినవా?

గెలిచె టీయారెస్సు ప్రజలను
మనములందున నిలిచిపోయెను
గొప్పపనులను చేయుచుండెను
ఏమి చేతును నే?

మనసు నందున నిట్టి యూహలు
ముసరుచున్నవి, నిదుర రాదే!
పెఱుకుటకు అది చిన్న మొక్కయె?
వృక్షమాయెనుగా!

చిత్రమందున కథానాయకు
నకును దెబ్బయె తాకినప్పుడు
గతము గుర్తుకు వచ్చినట్టుల
నాకు జరిగె గదా!

ఈ టియారెస్ దెబ్బ తగిలియు
గతము మఱచిన నాకు నిప్పుడు
అన్ని జ్ఞప్తికి వచ్చుచున్నవి
ఒక్కటొక్కటిగా!

ఎదుటివారల తప్పులెన్నితి
నాదు తప్పుల నెఱుగకుంటిని
మంచివాడనొ చెడ్డవాడనొ
యెఱుగకుంటినిగా!

ఏదొ చెప్పగబోయి తప్పునె
చెప్పినాడను ఒడలు మఱచియు
పెద్ద వ్యాసమె వ్రాసితినను నా
గర్వమే తొలగెన్!

ఉద్యమము బలపడినయప్పుడు
ఉద్యమమ్మే చల్లబడెనని
మాయమాటలు పలికినాడను
ద్రోహబుద్ధిని ఐ!

కేసియారే దీక్షబూనగ
ఉద్యమమ్మే యెగసిపడగా
నీళ్ళుచల్లగ దలచితిని నే
దుష్ట యోచనతో!

ప్రజలు నాయకులందఱొకటై
"జై తెలంగాణా"యటంచును
ఉద్యమించగ నీళ్ళు చల్లితి
తప్పువ్రాతలతో!

నీళ్ళు చల్లినకొద్ది యెగసెను
ఉద్యమజ్వాలలు మఱింతగ
మాట మూగగ, కనులు గ్రుడ్డిగ
నాకు అనిపించెన్!

ఈ టియారెస్ ప్రజలలోపల
పాతుకొనె  వృక్షమ్ము మాదిరి
నా వశమ్మే కూల్చివేయగ
ననక యత్నిస్తిన్!

ఈ టియారెస్‍పైన నాకును
ఎందుకో కలిగేను ద్వేషము
మందమతినై తిట్టుచుంటిని
కేసియారును నే!

బీజెపీ కాంగ్రెస్సువారలు
పదవికమ్ముడు పోదురంచును
చవకబారు విమర్శచేసితి
నోటి దూలకు నే!

కేసియారుతొ పడకనే కో
దండరామే వెడలిపోయె న
నెడి పుకారును సృష్టిచేసితి!
నమ్మలేదెవరున్!!

పోటిచేయుట కిష్టపడకయె
మిన్నకుండిన అతని చేతను
నేను ఉపయోగింపజూచితి
నమ్మలేదెవరున్!

కేసియారుకు జేయెసీకిని
మనః స్పర్థలు వచ్చెనంచును
కుటిల వచనములెన్నొ పలికితి
కల్లలాయెనుగా!

గతమునందలి నాయకులకును
కేసియారుకు పోలికెక్కడ?
గొప్పమాటలు, గొప్పచేతలు!
ఎటుల పొగడెద నే?

పథకములనన్నింటి నెపుడును
తప్పుపట్టితి, దెప్పిపొడిచితి!
కేంద్రమే మెచ్చుకొని భేషనె
కేసియారెదుటన్!!

అట్టి మెప్పుకు నోరు పెగలదె!
కనులు మండుచు నుండె కాదే!
ఒంటిపై జెర్రులే పాకెను!
ఏమి రాతును నే?

కేసియారు నియంత కాడని
ప్రజకు వ్యతిరేకియును కాడని
నాకు తెలిసియు కుళ్ళుచుంటిని
వ్యర్థ యత్నముచే!

రాజకీయము బాగ తెలిసియు
భవిష్యత్తుకు బాటవేసియు
ప్రజల నమ్మకములను పొందియు
కేసియార్ గెలిచెన్!

కేసియార్ ఏ మంచి చేసిన
చెడు కనంబడె నాదు కండ్లకు!
వెఱ్ఱికూతల వలన నష్టము
కేసియార్ కగునే?

మహోత్తుంగ సముద్రమందున
కాకి రెట్టను వేయగా ఇక
గొప్పతనముకు భంగమగునే?
నాకు తెలియదయెన్!

మహోదధియే కేసియారయె!
కాకి రెట్టయె నాదు చేతలు!
నా కుచేష్టలు కేసియారును
తక్కువెటు చేయున్?

నాకు జ్ఞానోదయమ్మెప్పుడు
కలుగునో యని వేచియుంటిని!
కేసియార్‍పై ఈర్ష్య యెప్పుడు
నాకు తగ్గెడినో?



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


ఆదివారం, మే 03, 2015

ఇప్పుడుకూడా ఏపీ ఉద్యోగులను తెలంగాణకే కేటాయిస్తారా???

TNGOleaders

ఏపీ రాష్ట్రముకు చెందు
ఉద్యోగుల తెలగాణకు
కేటాయించగ వలదయ!
వారలు ఆ రాష్ట్రముకే!!

అరువది సంవత్సరముల
ఉద్యోగపు దోపిడీయె
తెలంగాణ రాష్ట్రముకై
మము పురికొల్పినదయ్యా!

రాష్ట్రము వచ్చిన తదుపరి
ఇంకా వారలు ఎందుకు?
మా రాష్ట్రము మా వారలు!
అన్యాయము సరిచేయుడు!!

డీవోటీపీ ఇచ్చిన
మార్గదర్శకములన్నీ
విభజన కమిటీ ఉల్లం
ఘించినదయ్యా చూడుడు!!

కమలనాథనుని కమిటీ
వాటిని సవరించవలెను!
తెలంగాణ ఉద్యోగాల్
తెలగాణకె దక్కవలెను!!

ఏ శాఖలొ ఏ విధముగ
అన్యాయము జరిగినదో
దయతోడుత మీరలిపుడు
తప్పక పరిశీలింపుడు!
న్యాయమ్మును జరిపింపుడు!!

తెలంగాణలో పుట్టిన
తెలగాణులనే కేటా
యింపవలెను గద! స్థానిక
నిబంధనల మంటగలిపి
ఆంధ్రవారి కెటులిత్తురు?

తెలగాణకు జరుగునట్టి,
తెలగాణకు జరిగినట్టి
అన్యాయమ్ముల కేంద్రము
తప్పక సరిచేయవలెను!

తెలగాణలొ పనిచేయగ
ఇష్టపడెడి ఆంధ్రవారు
తెలంగాణ స్థానికులా?
దయతో పరిశీలింపుడు!

గతంలోని అన్యాయాల్
సరిచేయగవలెను గాని,
క్లిష్టతరము చేసి మాకు
అన్యాయము చేయదగునె?

తెలగాణుల కుద్వేగాల్
కలిగించగ వలదయ్యా!
శాంతితోడ జీవించే
బాటనిపుడు చూపుడయా!!



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, మే 02, 2015

బాబుకు మతిపోయింది..

-యాదవులు, కురుమలను కించపరిచారు
-బేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలి: మంత్రి హరీశ్‌రావు
-ఎవడు పచ్చగున్నా బాబు ఓర్వలేడు
-ఆంధ్ర రైతులకు నీళ్లిచ్చిన మానవతావాది కేసీఆర్
-తెలంగాణ రైతు ఉసురు తీసింది బాబు
-టీడీపీలో కేసీఆరే సీనియర్
-ఓడిపోయి దిక్కులేక చేరింది చంద్రబాబు 
-తెలంగాణకు అడుగడుగునా ద్రోహమే
-బాబు క్షమాపణ చెప్పకపోతే ఊరుకోం: యాదవ నాయకుల హెచ్చరిక

rao

చంద్రబాబుకు వయసు మీద పడి మతితప్పిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నదని చెప్పుకునే బాబు ఇపుడు పూర్తిగా మరుగుజ్జులా మారిపోయాడని, పక్కనవాళ్లు పచ్చగా ఉంటే ఓర్వలేక కండ్లలో నిప్పులు పోసుకుంటున్నాడని అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డి, నిజమాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. 

టీడీపీ లేకపోతే కేసీఆర్ గొర్రెలు మేపుకునేవారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలమీద విరుచుకుపడ్డారు. గొర్రెలు కాసుకోవడం నీచమా..అవమానకరమా..? అని చంద్రబాబును ఆయన నిలదీశారు. యాదవులు, కురుమల వృత్తిని కించపరిచిన చంద్రబాబు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు మాటలు ఆయన మానసిక స్థితిని సూచిస్తున్నాయని అన్నారు. టీడీపీలో కేసీఆరే చంద్రబాబుకన్నా సీనియర్ అని హరీశ్‌రా వు చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడి పోయాడని హరీశ్ చెప్పారు. ఆ తర్వాత రాజకీయంగా పుట్టగతులులేక మామపెట్టిన పార్టీలో దిక్కులేక చేరారని తెలిపారు. కేసీఆర్ 1982 లోనే టీడీపీలో చేరితే చంద్రబాబు ఏడాది తరువాత 1983లో టీడీపీలో చేరారని అన్నారు. టీడీపీలో కేసీఆరే సీనియర్ అని స్పష్టం చేశారు. 

నీ బతుకేంది బాబూ..


కేసీఆర్ ఉన్నతమైన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆయన పుట్టింది 3 ఎకరాల భవంతిలో.. మరి నీ సంగతి ఏమిటి చంద్రబాబూ అని హరీశ్‌రావు నిలదీశారు. పుట్టిన ఇంటిని పాఠశాలకు, ఆస్తిని ఎస్సీ కార్పొరేషన్‌ను ఇచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. నీకు అలాంటి చరిత్ర ఉందా అని నిలదీశారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు నాయుడు వేలకోట్లకు ఎలా పడగలెత్తారని సూటిగా ప్రశ్నించారు. గురువింద గింజ నలుపెరగదన్నట్లుగా చంద్రబాబు గిల్లికజ్జాలకు దిగుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ మానవతావాది..


సీఎం కేసీఆర్ మానవతావాది కాబట్టే విశాఖ పట్నంలో తుఫాన్ వస్తే ఎవరూ కోరకముందే అక్కడికి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు పంపించి మానవత్వాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు. నాగార్జున సాగర్ వివాదం తలెత్తినపుడు సాగర్ నీళ్లను వాడుకునే హక్కు ఆంధ్రాకు లేదని స్వయంగా తానే అడ్డుకుంటే కేసీఆర్ పిలిచి వారించారని హరీశ్ చెప్పారు. ఇక్కడి వారైనా, ఆంధ్రా వారైనా అందరూ రైతులేనని నచ్చచెప్పి, నీళ్లిచ్చి అక్కడి వారి పంటలు కాపాడింది కేసీఆర్ అని హరీశ్ అన్నారు. అదే చంద్రబాబు తెలంగాణలో కరెంటు సమస్యతో రైతులు మరణిస్తున్నప్పుడు శ్రీశైలంలో తెలంగాణవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడని విరుచుకుపడ్డారు.

తెలంగాణలో పంటలు ఎండిపోవాలని కుట్రలు చేశారని అన్నారు. తెలంగాణలో ఆంధ్రా విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే, ఆంధ్రాలో భూములున్నా హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆంధ్ర రైతులకు కూడా రుణమాఫీ రద్దు చేసిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

ఎన్ని నాలుకలు నీవి?..


చంద్రబాబుకు వెయ్యినాలుకలని హరీశ్‌రావు దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణకు మొదటి లేఖ ఇచ్చింది తానే అంటాడు.. గుంటూరుపోయి తెలంగాణ ఆపింది తానే అంటాడు అని మంత్రి విమర్శించారు. 2009లో తెలంగాణ వచ్చినపుడు రాజీనామాలతో ఆపింది తానేనని గతంలో కూడా చంద్రబాబు బహిరంగ సభల్లోనే ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు చేసినంత ద్రోహం మరెవ్వరూ చేయలేదని హరీశ్ అన్నారు. పార్లమెంటు ఆమోదించేదాకా అడుగడుగునా అడ్డుపడ్డది చంద్రబాబే..వచ్చిన తర్వాత ఆవిర్భావానికి ముందే ఏడు మండలాలు కబళించింది చంద్రబాబేనని అన్నారు. పార్లమెంట్ చట్టాలు, ఒప్పందాలను తుంగలో తొక్కి తెలంగాణకు కరెంట్ రాకుండా ఆపి రైతుల ఉసురు తీశాడని అన్నారు.

ఆఖరుకు ఆత్మగౌరవంతో పాలన చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి సహించలేక హైదరాబాద్‌లో గవర్నర్ పరిపాలన పెట్టాలని కూడా కుట్రల మీద కుట్రలు చేశాడని గుర్తు చేశారు. ఇపుడు తగుదునమ్మా అని సమస్యలు పరిష్కరించుకోవడానికి కేసీఆర్ రావడం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని అన్నారు. సింగరేణి నుంచి ఆంధ్రాకు కరెంట్ ఇవ్వడంలో సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించడం అవివేకానికి నిదర్శనం అన్నారు.

రైతు మరణాలకు బాబే కారణం..


టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవలంబించిన విధానాలే నేడు రైతు మరణాలకు కారణమని హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు, విద్యుత్ అందించడంలో చూపిన వివక్ష కారణంగానే కరువు తిష్ఠ వేసి భారీగా వలసలు, రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని అన్నారు. చెరువుల విధ్వంసం, ఆక్రమణలు, శిఖం భూములు కబ్జాలన్నింటికీ చంద్రబాబు పాలనలోనే బీజం పడిందని అన్నారు. 

ఉంటే సక్కగుండు...
చంద్రబాబు తెలంగాణలో ఉండదలిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అయితే బుద్ధిగా ఉండాలని మాత్రమే చెప్తున్నామని అన్నారు. నేను ఇక్కడే ఉంటా ఎక్కడికి పోనని చంద్రబాబు పదేపదే అంటున్నడు.. అసలు ఆయనను పొమ్మన్నది ఎవరు..? ఇక్కడే ఉండు..కానీ తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టకు. విద్యుత్ ప్రాజెక్టులకు అడ్డుపడకు.. నీళ్లు రాకుండా కుట్రలు చేయకు అని హెచ్చరిస్తున్నాం...అని హరీశ్‌రావు హితవు పలికారు. మా పక్కనే ఉంటూ మాకే గొయ్యితీస్తే పొమ్మనకపోతే ఏమంటాం అని ప్రశ్నించారు.

ఊర్ల పాల్గొంటూ హైదరాబాద్‌లో విమర్శిస్తున్నరు..


ఎర్రబెల్లి వంటి టీడీపీ నాయకులు, డీకే అరుణ వంటి కాంగ్రెస్ వారు ఊర్లలో మిషన్ కాకతీయలో పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలతో ఇది మంచి కార్యక్రమం అని ప్రోత్సహిస్తూ హైదరాబాద్ రాగానే ఈ పథకంమీద ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో చెరువుల మరమ్మతు పనుల పేరిట కాంట్రాక్టర్ జేబులు నిండేవన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతాంగం కడుపు నింపుతున్నదని తెలిపారు.

క్షమాపణ చెప్పకపోతే చావుదెబ్బే.. దూదిమెట్ల హెచ్చరిక


టీడీపీ లేకపోతే తెలంగాణలో కేసీఆర్ గొర్రెలు కాసుకోనేవారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. యాదవులను, కుల వృత్తిని చంద్రబాబు దారుణంగా అవమానించారని తెలంగాణ విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు. చంద్రబాబు వెంటనే యాదవులకు క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆయనకు యాదవుల చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.

అక్కడా ఇక్కడా ఛీత్కారాలే..


వాస్తవానికి చంద్రబాబును ఆంధ్రావాళ్లు కూడా నమ్మడం లేదని ఇటు తెలంగాణ అటు ఆంధ్రలో కూడా ఛీత్కరిస్తున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో వరుసకట్టి పార్టీ మారుతున్నారు. ఆంధ్రాలో ఆదరణ కరువైంది. అక్కడ తిరగలేకపోతున్నారు. దీనితో మతిస్థితిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో 3 లక్షలకు పైగా పింఛన్లు కోత విధించగా తెలంగాణలో 5 లక్షలు అదనంగా పింఛన్లు ఇస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. పూటకోసారి, ప్రాంతానికో విధంగా మాట్లాడుతున్న చంద్రబాబులాంటి రాజకీయ నాయకులు దేశంలో ఎక్కడా ఉండరని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో ఆ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!




శుక్రవారం, మే 01, 2015

ప్రజ...పల్లెప్రపంచంలో నా ఇంటర్వ్యూ.... - గుండు మధుసూదన్

ప్రజ...పల్లెప్రపంచం బ్లాగులో నా ఇంటర్వ్యూ...

-గుండు మధుసూదన్


గుండు మధుసూదన్.....తెలుగు బ్లాగర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణా వాదిగా , తెలుగు పద్య ప్రేమికునిగా ఆయన అందరికీ పరిచయమే... సహజంగానే తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో సమైక్యవాదులకు కొందరికి ఆయన వ్యతిరేకిగా కనిపిస్తారు. చాలామంది చీత్కారాలకు, అవహేళనలకు సమాధానం చెపుతూనే  రెండు లక్ష్యాలతో బ్లాగు ప్రపంచంలో ఆయన వాణిని వినిపిస్తున్నారు. వాటిని ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఒకటి “తెలుఁగు పద్యంబు నిత్యమై తేజరిల్లు” తెలుగు పద్యానికి ప్రాచుర్యం కలిగించడం., రెండు బంగారు తెలంగాణ సాధనలో తానూ పాత్రధారి కావడం. 


తెలుగు భాష గురించి, పద్యం గురించి ఎంత ఓపికగా సమాధానాలు చెపుతారో తెలంగాణా వ్యతిరేకులపైనా, నిర్హేతుక విమర్శలపైనా అంత ఘాటుగా స్పందిస్తారు. నా అభిమాన నటుడు ఎన్.టి.ఆర్ - అభిమాన నేత కె.సీ.ఆర్ అని ధైర్యంగా చెప్పగలరు. వివిధ అంశాలపై 'ప్రజ' అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చిన గుండు మధుసూదన్ గారికి ధన్యవాదములు. ఇంటర్వ్యూ వివరాలు క్రింద ఉన్నాయి.

(బంగారు తెలంగాణా సాధనలో పాత్రధారి గుండు మధుసూదన్ గారు)
ప్ర -  మీ పేరు?
జ -  గుండు మధుసూదన్

ప్ర - మీ వయస్సు?
జ - 56సం.లు.

ప్ర - మీ తల్లిదండ్రుల వివరాలు?
జ - మా ఇంటిపేరు "గుండు"వారు. మా తాతగారు గుండు పెద్ద వీరయ్యగారు. మా నాయనమ్మ గుండు లచ్చమ్మగారు. మా పూర్వికులది అయ్యనప్రోలు (నేటి అయిలోని>అయినవోలు) గ్రామం. బతుకుదెరువుకై మా తాతగారు వరంగల్లులోని గిర్మాజిపేటకు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు.

మా తండ్రిగారు గుండు రామస్వామిగారు. శ్రీలక్ష్మీనారసింహస్వామి భక్తులు. ఆజంజాహీ బట్టలమిల్లులో కొంతకాలం పనిచేసి, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మానివేసి, ఇంటివద్దనే ప్రైవేటు పాఠశాలను ప్రారంభించి, ఐదవతరగతి వరకు పిల్లలకు విద్యబోధిస్తూ జీవనం సాగించారు. ఆయన చదివింది నైజాం కాలంలో రెండవతరగతే అయినా, పోతన భాగవతం ఆమూలాగ్రం పఠించారు. ఎప్పుడూ అందులోని వివిధ ఘట్టాలలోని పద్యాలను రాగయుక్తంగా పఠిస్తూ ఉండేవారు. ఇంతేగాక యక్షగానాలూ, రంగస్థల నాటకాలలోని ఘట్టాలను, పద్యాలను పఠిస్తుండేవారు. వారి సాహిత్యాభినివేశమే నాకూ పట్టుబడింది. ఛందస్సు తెలియకపోయినా చదివేది ఏ పద్యమో ఇట్టే తెలిపేవారు. పద్యరచన చేయడం వారికి పట్టుబడలేదు. నాకు పట్టుబడింది. అది నా భాగ్యంగా భావిస్తాను. మా తండ్రిగారు జీవించియుంటే నా పద్యాలను పఠించి పొంగిపోయేవారేమో? వారు నా పద్యరచన చూడకుండానే స్వర్గస్థులుకావడం నా దురదృష్టం.

మా తల్లిగారు గుండు మల్లికాంబగారు. సామాన్య గృహిణి. నాకన్న ముందు ఏడుగురు సోదరులు పుట్టి చనిపోయారు. ఎనిమిదవ సంతానంగా నేను జన్మించాను. నేనూ వాళ్ళలాగే దక్కకుండాపోతానేమోననే భయంతో నాకు నాలుగేళ్ళ వయస్సు వచ్చేంతవరకూ మా తల్లిగారు ఇల్లిల్లూ తిరిగి నాకు అవసరమయ్యే వస్తువులూ ఆహారం, బట్టలు, బొమ్మలు మొదలైనవి బిచ్చమెత్తి తెచ్చి నాకిచ్చారు.   కనీసం బిచ్చగానివలెనైనా నా కొడుకు బతకాలనే తపనతో అలా చేసివుంటారు. అందుకే నాకు "భిక్షపతి" అనే పేరు పెట్టి నన్ను అల్లారుముద్దుగా పెంచిపెద్దచేశారు. మా తండ్రిగారు నాకు పెట్టిన పేరు "మధుసూదన్". ఆయన విష్ణుభక్తులుకాబట్టే నాకా పేరు పెట్టివుంటారు. మా తల్లిదండ్రులు నాపై చూపిన వాత్సల్యం అమూల్యమైనది. వారు  నాకెప్పుడు గుర్తుకు వచ్చినా నా కళ్ళు చెమరుస్తాయి...హృదయం ద్రవిస్తుంది.

ప్ర - మీ జన్మస్థలం?
జ - గిర్మాజీపేట, వరంగల్ జిల్లా

ప్ర - ప్రస్తుత నివాసం?
జ - రంగశాయిపేట, వరంగల్

ప్ర - విద్యార్హతలు - విద్యాభ్యాసం వివరాలు?
జ -  1-3 అమ్మబడి (ప్రైవేటు పాఠశాల), ఇంటికి దగ్గరలో(గిర్మాజీపేట)వరంగల్
    -  4-7 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, చార్‍బౌళి, వరంగల్
    -  8-10 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గిర్మాజీపేట, వరంగల్‍లో
    -  ఇంటర్ మీడియట్…ప్రైవేటుగా…ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్
    -  బి.కాం (వాణిజ్య శాస్త్రం మరియు తెలుగు సాహిత్యం) అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. హైదరాబాద్
    -  ఎం.ఏ.(తెలుగు) ఎస్.డీ.ఎల్.సీ.ఈ., కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్
    -  తెలుగు పండిత శిక్షణ…ప్రభుత్వ విద్యా కళాశాల, హనుమకొండ, వరంగల్

ప్ర - మీ వివాహం, ఇతర కుటుంబ వివరాలు?
జ - మా తల్లిదండ్రులకు జీవితం చివరి దశకు చేరిన సమయంలో నేను జన్మించడం వల్లా, వారికి చేదోడు వాదోడుగా నేనొక్కడినే ఉండలేను కాబట్టి నాకు పదిహేడేళ్ళ వయస్సులోనే (పదవ తరగతి ముగియగానే) మా మేనమామ కుమార్తె "సరోజన"తో వివాహం జరిపించారు. నాకు ఇరవై ఒక్క ఏండ్ల వయస్సు వచ్చేసరికే మాకు ఇద్దరు కుమార్తెలు...(ప్రశాంతకుమారి, ప్రవీణకుమారి) జన్మించారు. పదేళ్ళ సుదీర్ఘ కాలం తరువాత ఒక కుమారుడు (ప్రణీత్ కుమార్) జన్మించాడు.

ప్ర - మీ ఉద్యోగ వివరాలు?
జ - నాకు పెళ్ళి చేయగానే ఆర్థిక ఇబ్బందులవల్ల మా తండ్రిగారు నా చదువుకు ఫుల్‍స్టాప్ పెట్టి, నన్ను ఒక షాపులో గుమాస్తాగా అరవై రూపాయల జీతానికి కుదిర్చారు. ఆ సమయంలో నేను పనిచేస్తూనే రాత్రుల్లో సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు (సంస్కృతాంధ్రగ్రంథాలు) చదువుతూ నా సాహిత్యజ్ఞానాన్ని వృద్ధిపరచుకున్నాను. ఆ తర్వాత ఒక సీ.ఏ. దగ్గర గుమాస్తాగా పనిలో చేరాను. ఆకాలంలో ప్రైవేటుగా ఇంటర్, అలాగే ఓపెన్ యూనివర్సిటీలో బి.కాం. (తెలుగు సాహిత్యంతో) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివి ఉత్తీర్ణుడనయ్యాను. నేను డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగానే మా తండ్రిగారు మరణించారు. కొన్ని నెలలలోనే ఒక ప్రైవేటు ఆంగ్లమాధ్యమ పాఠశాలవారు నన్ను తెలుగు పండితునిగా తెలుగు బోధించడానికి ఆహ్వానించారు. డిగ్రీ పూర్తికాకున్నా నాకున్న పరిజ్ఞానంతో నేను చేసిన బోధన వారిని సంతృప్తులను గావించింది కాబోలు నాకు తెలుగు పండితునిగా ఉద్యోగం ఇచ్చారు. అక్కడే నాలుగేళ్ళు పనిచేశాను. డిగ్రీ పూర్తయ్యే సమయంలో మా తల్లిగారు పరమపదించడంతో పరీక్షలుకూడా రాయలేకపోయాను. డిగ్రీకి ఫుల్‍స్టాప్ పడింది. మూడేళ్ళ తర్వాత నా సహోపాధ్యాయుడూ, బాల్య స్నేహితుడూ ఐన శ్రీ రామా ప్రభాకర్‍‍రావు ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తిచేసి, పండిత శిక్షణ కూడా పొందడంవల్ల ఉత్తరోత్తరా మెరుగైన పాఠశాలల్లో పనిచేయడానికి అవకాశాలు లభించాయి. కొద్దికాలంలోనే తెలుగు పండితునిగా ప్రభుత్వ ఉద్యోగంలో మొదటి ర్యాంక్ పొంది, పట్టణ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా నియమింపబడ్డాను. ఈ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం ప్రస్తుతం శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు సాగింది.
ప్ర - మీ బ్లాగుల పేరు?
జ - 1. మధుర కవనం (తెలుగు పద్య సాహిత్యం) - http://madhurakavanam.blogspot.com/




ప్ర - మీ బ్లాగుల లక్ష్యం ఏమిటి?
జ -  మధుర కవనం….. తెలుగు పద్య సాహిత్య పిపాసువులకు పద్య రచనలను పరిచయం చేయడం, వారి అమూల్య సూచనలను స్వీకరించడం.
     నా తెలంగాణ కోటి రత్నాల వీణ… తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను తెలంగాణులకు తెలియజేసి, ఉద్యమాన్ని సరైన రీతిలో కొనసాగేటట్లు చేయడం, బంగారు తెలంగాణ సాధనలో ఏర్పడే ఒడిదుడుకులను అధిగమించడానికి అహర్నిశలూ శ్రమించి, తెలంగాణులకు తగు సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేయడం…ఇంకా అభివృద్ధిపథంలో తెలంగాణను పయనింపజేయడంకోసం అన్ని విధాలా సాయపడడం…

ప్ర -  మీకు బ్లాగు వ్రాయాలని కోరిక ఎలా కలిగింది?
జ - మా వరంగల్‍లోని సాహితీ మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారు శంకరాభరణం అనే పద్యసాహిత్య బ్లాగును నడుపుతుంటే…నాకు కూడా పద్య సాహిత్యాభిమానులకై ’మధుర కవనం’నూ, తెలంగాణులను మేలుకొల్పడానికై ’నా తెలంగాణ కోటి రత్నాల వీణ’నూ నడపాలనే ఆలోచన కలిగింది.

ప్ర -  మీ బ్లాగు అనుభవాలు?
జ - ప్రారంభంలో “మధుర కవనం”కు వీక్షకులే లేరు. శ్రీ కంది శంకరయ్యగారు మాత్రమే వీక్షిస్తూ ప్రోత్సహించేవారు. వారి సలహా మేరకే నేను బ్లాగు అగ్రిగేటర్‍లకు నా బ్లాగుల వివరాలు పంపి, తెలుగు బ్లాగుల్లో ’మధుర కవనం’కు వీక్షకులను రప్పించగలిగాను. అయినా…పద్య సాహిత్యానికి తగినంత ప్రోత్సాహం, చూడాలనే తపన ఇంకా రాలేదు గనుకనే ఎక్కువ మంది వీక్షకుల్ని ఆకర్షించలేకపోతున్నది. వీక్షకులు పరిమితంగానే ఉన్నప్పటికీ…వారే నాకు ’పదివేల సైన్యం’.

’నా తెలంగాణ కోటి రత్నాల వీణ’కు ఎంతోమంది వీక్షకులు వచ్చారు. ఆంధ్రానుండీ…తెలంగాణనుండీ…వీక్షకులు అనేకులు తయారయ్యారు. ఇప్పటికీ నేను ఏ పోస్టు పెట్టినా…కొన్ని సెకనులలోనే … అనేక మంది వీక్షకులు పఠిస్తున్నారు.

’నా తెలంగాణ కోటి రత్నాల వీణ’లో ఆంధ్రా వారి నుండి ఎన్నో హేళనలనూ, చీవాట్లనూ, అవమానాలనూ, తిట్లనూ, అసత్యారోపణలనూ ఎదుర్కొనాల్సివచ్చింది.

’మధుర కవనం’లో సాహిత్యాభిమానుల ఆదరాభిమానాలనూ, అభినందనలనూ పొందగలిగాను.

ప్ర -  బ్లాగర్ గా ఎదురైన ఆటంకాలు ఏమిటి?
జ - ఆంద్రా ప్రజలు (అలాగే కొందరు బ్లాగర్లు) నా బ్లాగులోని పోస్టులను సహేతుకంగా విమర్శించేవారు కొందరూ, నిర్హేతుకంగా విమర్శించేవారు చాలా మందీ…అనేక వ్యాఖ్యలు రాశారు. వీటిని నాకు ఎలా ఎదుర్కోవాలో తోచేది కాదు. తెలంగాణకు జరిగిన అన్యాయం…పాలకులు చేస్తున్న అక్రమం… వాళ్ళకు కనిపించేది కాదు. కేవలం ’తెలంగాణులు విడిపోవలనుకుంటున్నారు’ ఆంధ్రప్రదేశ్‍ను రెండు ముక్కలు చేయాలనుకుంటున్నారు…అన్నదే వారి కోపం…అంతేగానీ…తెలంగాణులు అరవై ఏండ్లుగా అనుభవించిన బానిసత్వం, అసమానత్వం, అన్యాయం వాళ్ళ కళ్ళకు కనిపించలేదు. విమర్శించడమే…వెక్కిరించడమే…అవమానించడమే వారి లక్ష్యం. అందుకే అన్ని రకాలుగా నా బ్లాగులోకి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చిరాతలు రాసేవారు. అందుకే నేను బాగా ఆలోచించి…వారి వ్యాఖ్యలు నా ఆమోదం పొందిన తర్వాతనే ప్రచురించబడేట్టుగా అమర్చాను. ఇప్పటికీ…పిచ్చి రాతలు రాసేవారు రాస్తూనే ఉన్నారు. అవి స్పామ్‍లోకి పోతూనే ఉన్నాయి. ప్రచురణ యోగ్యమైనవి ప్రచురించబడుతూనే ఉన్నవి.

ప్ర - సీనియర్ బ్లాగర్ గా మీ అనుభవాలు?
జ -  నేను సీనియర్ బ్లాగర్‍ని అనుకోవడంలేదు. నాకింకా చాలా అనుభవం రావాల్సి ఉంది. ’మధుర కవనం’బ్లాగులో కంటే…’నా తెలంగాణ కోటి రత్నాల వీణ’బ్లాగులో చాలా అనుభవం వచ్చింది. ఆంధ్రావాళ్ళ పిచ్చి వ్యాఖ్యలకు నా తెలంగాణ ఎదుర్కొన్న అన్యాయాలే ఉదాహరణలుగా ప్రతిసమాధానం ఇచ్చేట్టు చేశాయి. యథార్థ సంఘటనలే వాళ్ళను ఎదుర్కొనేలా చేశాయి. ఎవరైతే తెలంగాణాను, తెలంగాణులను దూషిస్తున్నారో వాళ్ళకు చెంపపెట్టు పెట్టి సరైన సమాధానం దొరికేలా చేసింది…మాకు జరిగిన అవమానాలే…అసమానతలే…దోపిడులే…ద్రోహాలే…వాటి చరిత్రలే … జరిగినవీ…జరుగుతున్నవీనూ. ఇవన్నీ నాకు కలిగిన అనుభవాలు! ఇవి నాకు సీనియర్ బ్లాగర్‍ అనే పేరు తెచ్చేవి కానేకావు. నేను బ్లాగర్‍నని అనుకోలేదు…తెలంగాణ రాష్ట్ర సాధనా హోమంలో నేనొక సమిధగానైనా ఉపయోగపడాలన్నదే నా తపన. సీనియర్ బ్లాగర్‍ననిపించుకోవడం నా ఊహకు అందనిది.

ప్ర - తెలుగు బ్లాగర్లకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ - సలహాలు ఇచ్చేటంత గొప్పవాడిని నేను కాను. ఏదో నా వరకు నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. అంతే...

ప్ర - మీ బ్లాగులో మీ పోస్టులలో మీకు నచ్చినవి?
జ - అన్నీ నచ్చిన పోస్టులే. ఐతే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏర్పడిన రాజకీయ పరిణామాలలో ప్రతిరోజూ…పద్యాలనూ…గేయాలనూ…వివిధ నడకలలో రాయడం జరిగింది. వాటి రచనా శైలి ఇప్పటికీ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను ఆ వేగంతో కూడిన సమయంలో ఇంత అందంగా రాయగలిగానా? అని. ఇవి నాకు బాగా నచ్చిన పోస్టులు.

ప్ర -  ఇతర బ్లాగులలో మీకు నచ్చినవి?
జ - తెలుగు వారికై, వారి జ్ఞానాభివృద్ధికై నిరంతరం తోడ్పడే బ్లాగులు నాకు బాగా నచ్చాయి. ఈమాట, ఆంధ్రామృతం, శంకరాభరణం, కథామంజరి , అంతర్యామి, వలబోజు జ్యోతిగారిబ్లాగు, మందాకిని మొదలైన సాహితీ బ్లాగులూ….కట్టా-మీఠా, అక్షరసత్యాలు, నా తెలంగాణ, మిషన్ తెలంగాణ, గుండెఘోష, పోరు తెలంగాణ, అమృతమథనం, ఉదయరాగం, ఏది సత్యం?, కోటి రత్నాల వీణ, తొవ్వ, ధర్మమేవ జయతే, జై గొట్టిముక్కల వారి బ్లాగు మొదలైన తెలంగాణ బ్లాగులు నాకు బాగా నచ్చాయి.

ప్ర - బ్లాగు ప్రపంచంలో ఎదురైన ఆటంకాలు? ఇబ్బంది అనిపించిన సందర్భాలు?
జ -  పైన వివరించాను

ప్ర -  తెలుగు బ్లాగుల అభివృద్ధికి మీరిచ్చే సూచనలు?
జ - ఎక్కువ సమాచారాన్నిచ్చి, ప్రభావవంతంగా వీక్షకుల మెదళ్ళలోకి చొచ్చుకుపోగలిగేలా బ్లాగును తీర్చి దిద్దితే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందీ మీ బ్లాగు.

ప్ర - బ్లాగుల వల్ల ఉపయోగాలేమని మీరు అనుకుంటున్నారు?
జ - వీక్షకులకు, పాఠకులకు విజ్ఞానంతో పాటు వినోదాన్నీ, కర్తవ్యప్రబోధాన్నీ అందించేవిగా ఉండడమే బ్లాగుల వల్ల కలిగే ఉపయోగాలు.

ప్ర - మీ హాబీస్  ?
జ - సాంప్రదాయిక పద్య రచన, చిత్రలేఖనం, ఘంటసాలగారి భక్తిగీతాలు మొ. వినడం, పద్యాలు నా బాణీలో రాగయుక్తంగా పఠించడం, ప్రాచీన పద్య సాహిత్య పఠనం మొదలైనవి.

ప్ర - మీ అభిమాన రచయిత  ?
జ - వచన రచయితల్లో ప్రత్యేక రచయితలెవరూ లేకున్నా యద్ధనపూడి, మాదిరెడ్డి, ఇల్లిందల గారల నవలలు ప్రభావితంచేశాయి.. డిటెక్టివ్ నవలా రచయితలు కొమ్మూరి సాంబశివరావు, మధుబాబు, గిరిజశ్రీ భగవాన్ గారల రచనలు నాలో చురుకుదనాన్ని నింపాయి. ముఖ్యంగా యండమూరివారి నవలలు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయనవచ్చు.

ఏది ఏమైనా వచన రచనలను ప్రక్కన బెడితే...నన్ను పూర్తిగా ప్రభావితం చేసిన కవులలో ముఖ్యుడు బమ్మెర పోతన. ఆ తర్వాత ప్రాచీన సాహిత్య కవుల ప్రభావం నాపై ఎక్కువ ప్రభావం చూపింది. శతక పద్యాలు చిన్ననాడే అర్థం తెలియకుండానే కంఠస్థం చేసినా...పెద్దవాడినైన తర్వాత వాటి ప్రభావం నా నిజజీవితంపై పడింది. నా వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యదోహదకారులయ్యాయి ఆ శతకాలు!

ప్ర - మీకు నచ్చే రచనలు?
జ - ప్రాచీన కావ్యాల్లో పోతన భాగవతం, పాల్కురికి సోమన్న కావ్యాలు, మనుచరిత్ర, ఆముక్తమాల్యద, వసుచరిత్ర, పారిజాతాపహరణం, శ్రీనాథుని కావ్యాలు, మొల్ల రామాయణం, విజయవిలాసం, ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసం మొదలైనవి నాకు నచ్చినవి.

ఆధునిక కావ్యాల్లో వానమామలై వరదాచార్య, జగన్నాథాచార్య సోదరకవుల కావ్యాలు, వద్దిరాజు సోదరకవుల పద్య రచనలు, దాశరథి కృష్ణమాచార్యులవారి పద్య రచనలు, పల్లా రామకోటార్యగారి వెంగళప్ప శతకం (వినగదప్ప వెఱ్ఱి వెంగళప్ప...మకుటం గలది), సిద్ధప్ప వరకవి పద్య రచనలు, ఠంయ్యాల లక్ష్మీనరసింహాచార్యుల పద్య కావ్యాలు, చిలుకమఱ్ఱి రామానుజాచార్యులవారి పద్య కావ్యాలు మొదలైనవి నాకు అత్యంత ప్రీతిపాత్రమైన రచనలు.

ప్ర - మీకు ఇష్టమైన ఆహారం?
జ - సాత్త్వికాహారమంటేనే నాకు ఇష్టం. దోసకాయముక్కలు, మునగకాడలు, టమాటాలు మొదలైనవి వేసి చేసిన పప్పుచారుతో భోజనమంటే నాకెంతో ఇష్టం. అలాగే పాలకూర పప్పంటే చాలా ఇష్టం.

ప్ర - జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏది?
జ - చాలా కష్టమైన ప్రశ్ననే అడిగారు. దీనికి చాలా రకాలుగా (డబ్బుఅనీ, పలుకుబడి అనీ, స్నేహం అనీ సుఖంగా బతకడం అనీ) సమాధానాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. "లోకో భిన్నరుచి" అన్నట్లుగా ఒక్కొక్కరూ ఒక్కొక్కరకంగా సమాధానం చెబుతారు. అయితే సమంజసమైన సమాధానం ఏమంటే "మంచివ్యక్తి"గా మిగిలిపోవడం. మంచితనం పదిమందిలో (మనం మరణించినా) చిరస్థాయిగా జీవించేటట్లు చేస్తుంది. ఎదుటివాని విషయంలో చెడ్డవానిగా ముద్రింపబడడం కంటే మరణించడం మేలు. సచ్ఛీలం (మంచి నడవడి) కోల్పోవడంవల్ల మన విలువ పడిపోతుంది. దీనికి శాంతగుణం తోడుపడుతుంది. తొందరపాటు లేకుండా బాగా ఆలోచించి ఎదుటివారి మనస్సుకు కష్టంకలగకుండా ప్రవర్తిస్తే వారి మనస్సులో మనం గొప్పవారిగా, మంచివారిగా ముద్రింపబడతాం. అందరిలోనూ మంచివానిగా పేరుతెచ్చుకోవడం కంటే గొప్ప ధనం ఏముంటుంది? ఈ పేరు ధనమిచ్చి కొనుక్కోలేం కదా! అందుకని జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది "మంచితనం" అని నా భావన.

ప్ర - మీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనదేది అంటే ఏమి చెప్తారు?
జ - నాకు ప్రభుత్వ ఉద్యోగం రాదు అనుకుంటున్న సమయంలో ఫస్టుర్యాంకుతో తెలుగు పండితునిగా ప్రభుత్వ పాఠశాలలో నియమింపబడటం నా జీవితంలో చాలా ముఖ్యమైనది. అలాగే బి.కాం.(తెలుగుతో) విద్యార్హత గల నన్ను డబుల్ ఎమ్మేలు చేసిన మహామహులు అభ్యర్థులుగా ఉన్న ఇంటర్వ్యూలో నెగ్గలేవంటూ నిరుత్సాహపరిచిన శ్రీ భద్రయ్యసార్ గారి మాటల్ని వమ్ము చేస్తూ వరంగల్ పబ్లిక్ స్కూల్‍లో ఇంటర్వ్యూలో ప్రథమునిగా నెగ్గి, తెలుగు పండితునిగా నియమింపబడడం నాకు జీవితంలో మరువరాని విషయం!

ప్ర - మీకు ఇతరులలో నచ్చేవి ఏవి? నచ్చనివి ఏవి?
జ- నాకు ఇతరులలోని సౌమ్యత, నిజాయితీ, నిబద్ధత, కార్యసాధకత, స్నేహశీలత మొదలైన గుణాలు బాగా నచ్చుతాయి.
ఇతరులలోని అసత్యవాదిత్వం, అన్యాయం, దౌష్ట్యం, చాడీకోరుతనం, స్వార్థం మొదలైన దుర్గుణాలు  నచ్చవు.

ప్ర - మీలో మీకు నచ్చేవి ఏవి? నచ్చనవి ఏవి?
జ- నేను సరైనది అనుకున్నదాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా సాధించాలనే గుణం నాకు నచ్చుతుంది. మొహమాటానికి పోయి ఇతరులకు సాయంచేయడంద్వారా చిక్కులు తెచ్చుకోవడం నాకు ఎంత వదిలించుకోవాలన్నా వదిలించుకోలేని గుణం.
( బమ్మెర పోతన ఇమేజ్ ఆలోచనాతరంగాలు బ్లాగు సౌజన్యంతో )
ప్ర - మీ రోల్ మోడల్ ఎవరు?
జ- మా తండ్రిగారు మరియు బమ్మెర పోతన ఇద్దరే!

ప్ర - మీకు నచ్చే వృత్తి?
జ- తెలుగు భాషా బోధక వృత్తి నాకు బాగా నచ్చిన వృత్తి. ఎందుకంటే, భాషా బోధనలో లభించినంత తృప్తి ఇంకే వృత్తిలోనూ లభించదని నా నమ్మకం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయునికే...ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయునికే సాధ్యమౌతుంది. వారే విద్యార్థుల హృదయ ఫలకాలపై స్థిరంగా నిలిచిపోతారు. నేనింతవరకూ తెలుగు పండితునిగా బోధించిన పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎక్కడ ఎదురుపడినా "నమస్కారమండీ గురువుగారూ" అంటూ రెండుచేతులూ జోడించి నమస్కరించడం నాకు ఎంతో ఔన్నత్యాన్ని కలిగించింది.

ప్ర - మీరు డిప్రెషన్ కు గురైనప్పుడు రీచార్జ్ కావడానికేమి చేస్తారు?
జ- నాకు డిప్రెషన్ కలిగించిన అంశాన్ని గురించి అలాగే ఆలోచిస్తూంటే మరింత అసహనం పెరుగుతుంది. కాబట్టి ఆ అంశాన్ని వెంటనే మరిచిపోవడానికి నాకిష్టమైన ఇతర విషయాలపై మనస్సును మళ్ళించడానికి ప్రయత్నిస్తాను. తద్వారా డిప్రెషన్ కలిగించిన అంశం యొక్క తీవ్రత తగ్గుతుంది. క్రమంగా కాలమే ఆ తీవ్రతను తగ్గిస్తుంది. మామూలు జీవనంలో పడేలా చేస్తుంది. నెమ్మదిగా ఆ అసహనంనుండి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి డిప్రెషన్ కలిగినప్పుడు తీవ్రంగా స్పందించకుండా ఇతర ఇష్టమైన అంశాలపైకి మనస్సును మళ్ళించగలిగితే నెమ్మదిగా దానినుండి ఉపశమనం కలుగుతుందని నేను అనుభవపూర్వకంగా గ్రహించాను.

ప్ర -  నేటి యువతకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
జ- యువతకు సలహాలిచ్చేటంత గొప్పవాణ్ణి నేను కాను. కాకపోతే అనుభవజ్ఞులైన తల్లిదండ్రులు, పెద్దలు చెప్పిన విషయాలను పెడచెవిని బెట్టకుండా, అనుసరిస్తే...జీవితంలో దుఃఖించాల్సిన అవసరం రాదు. ఎవరైతే ఎవరినీ లెక్కచేయకుండా గర్వంతో విర్రవీగుతూ, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో వారు భవిష్యత్తులో అనేక బాధలు పడాల్సివస్తుంది. "పెద్దలాడు మాట చద్దిమూట" గదా! గర్వాన్నీ, స్వార్థాన్నీ (కొంతవరకుంటే చాలు) పూర్తిగా తగ్గించుకుంటే, ’యువత’కు సమాజంలో గౌరవనీయమైన స్థానం దక్కుతుంది.

ప్ర - ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలంటే ఏమి చేయాలి?
జ- ఇతరులు ఎలా మాట్లాడితే మన మనస్సుకు కష్టం కలుగుతుందో, అలా మనం మాట్లాడకుండడం వల్ల అందరూ మనను ఇష్టపడతారు...అభిమానిస్తారు...స్నేహంచేస్తారు. ఎవరైనా మనకు శత్రువులుగా మారాలన్నా, స్నేహితులుగా మారాలన్నా మన నాలుక మన స్వాధీనంలో ఉండాలి. నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఎవరూ నొచ్చుకోరు.

ప్ర- మీరు తెలంగాణా వాదిగా ఉండే సందర్భంలో ఆంధ్రా ప్రాంతంపై కొంచెం శృతిమించిన ఆరోపణలు చేస్తున్నట్లనిపించిన సందర్భాలున్నాయా?
జ -  నేను ఎప్పుడూ శ్రుతిమించిన ఆరోపణలు చేయలేదు. ఆంధ్రావాళ్ళు మా సోదరులు. మా కోపం కేవలం మాకు అన్యాయం చేసిన పాలకులపైనే…దోపిడీదారులపైనే…దుర్మార్గవర్తనులపైనే….!!! ఆంధ్ర ప్రజలపై మాకు సోదరభావం మాత్రమే ఉన్నది. శత్రుభావన లేదు. నా పోరాటం అంతా తెలంగాణకు జరిగిన అన్యాయం, అవినీతి, దోపిడీ, దౌర్జన్యం, అసమానత్వం, అవమానం పైనే!! పాలకులుగానీ…దోపిడీదార్లుగానీ తెలంగాణకు ద్రోహం తలపెట్టినప్పుడు వాటిని ప్రజలకు తెలుపడానికి నా బ్లాగు అందరికన్నా ముందుంది. అన్యాయాలాను తెలంగాణులు అవలీలగా ఎదుర్కొనేలా చేసింది…చేస్తున్నది.!

ప్ర - తెలుగు సాహిత్యంపై మీకు పట్టు ఉండడానికి కారణం?
జ - మా నాన్న(కీ.శే.శ్రీ గుండు రామస్వామి) గారి ప్రోత్సాహంతో చిన్నప్పటినుంచీ కథలన్నా, పద్యాలన్నా ఇష్టం ఏర్పడింది. రెండవ తరగతినుండే…చందమామ, బాలమిత్ర, చంద్రభాను పిల్లల మాసపత్రికల్ని నా చేత చదివించారు మా నాన్నగారు. అలాగే ప్రతి తరగతికి ఒక శతకంచొప్పున ఐదవతరగతి వరకు ఐదు శతకాలు కంఠస్థం చేయించారు. అలాగే, మా బాబాయి (కీ.శే.శ్రీ చేరాల లక్ష్మణార్య) గారు నాలుగవ తరగతిలో “ఆర్య సమాజం” వరంగల్లులో వేదమంత్రాధ్యయనం చేయించడంతో పాటు, ఆరవ తరగతినుండి  విశ్వహిందూ పరిషత్ వారి సంస్కృత పాఠాలు తెప్పించి నాచేత చదివించారు. అలాగే మా నాన్నగారు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు పోతన భాగవతంలోని గజేంద్రమోక్షణం, వామనావతార ఘట్టం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాదచరిత్ర లను నేర్పించారు. ఈ విధంగా నేను నా తోటి విద్యార్థులలో మేటిని కాగలిగాను. సాహిత్యం పట్ల అనురాగం ఏర్పడింది. పద్యరచన పట్ల మక్కువ కలిగింది. రచనాశక్తి ఉదయించింది. ఆనాటికి ఏమాత్రమూ ఛందఃపరిజ్ఞానం లేకున్నా, పఠనానుభవంతోనే పదవతరగతిలో కొన్ని పద్యాలు రాసి మా తెలుగు పండితులు కీ.శే.శ్రీ గోపాలకృష్ణయ్యగారి మెప్పును పొందగలిగాను!

ఇంతేగాకుండా…
హనుమకొండలో మిత్రమండలి సమావేశాలూ, శ్రీలేఖసాహితి సమావేశాలూ, ఆంధ్ర పద్య కవితా సదస్సు(వరంగల్ జిల్లా శాఖ) సమావేశాలూ, పుస్తకావిష్కణలూ, అవధానాలూ, పృచ్ఛకునిగా పాల్గొనడాలూ, సభలూ…ఇవన్నీ నాలోని సాహిత్యాన్ని మెరుగుపరిచాయి. శ్రీ కాళోజీ నారాయణరావుగారి ఇంట్లో, వారి అన్నగారు శ్రీ కాళోజీ రామేశ్వరరావుగారూ, శ్రీ దేవులపల్లివారూ, శ్రీ అనుముల కృష్ణమూర్తిగారూ, శ్రీ ఇందారపు కిషన్ రావుగారూ, శ్రీ మోతుకూరి మధుసూదనరావుగారూ, శ్రీ ఆవాల దామోదర రెడ్డి గారూ, శ్రీ అడ్డగట్ల శ్రీధర్‍గారూ, శ్రీ జీడికంటి శ్రీనివాసమూర్తిగారూ, శ్రీ సదానందాచారిగారూ, శ్రీ పల్లా రామకోటార్యగారూ, శ్రీ అనుమాండ్ల భూమయ్యగారూ, శ్రీమతి కాత్యాయనీ విద్మహేగారు మొదలైనవారివల్ల ప్రభావితుణ్ణయ్యాను. ముఖ్యంగా మా తెలుగు ఉపన్యాసకురాలు శ్రీమతి శ్యామలగారి తండ్రిగారు శ్రీ టి.ఎస్.ఆర్.అప్పారావుగారి సూచనలవల్ల లక్షణబద్ధమైన పద్యం ఎలా రాయాలో తెలిసింది. ఇలాంటి మార్గదర్శకులలో ఒకరు శ్రీ కంది శంకరయ్యగారు. వారి పరిచయం నా పద్యాన్ని ఒక మలుపు తిప్పింది.

ప్ర - తెలుగు భాష అభివృద్ధికి మీవంతుగా ఏమి చేస్తున్నారు?
జ- విద్యార్థులలో పదసంపదను వృద్ధిచేయడం కోసం వాళ్ళకు తెలియని వివిధ పదాలను సులభమైన వాక్యాల్లో ప్రయోగించి, తమంతతామే వాటి అర్థాలను తెలుసుకొనేలా, ఆ పదప్రయోగాలనుంచి తామూ పదాల్ని వాక్యాల్లో ఎలా ప్రయోగించాలో ప్రత్యక్షంగా తెలుసుకునేలా చేయడం.

లక్షణ(వ్యాకరణ)బద్ధమైన భాషను వ్యావహారిక భాషద్వారా  పద, వాక్య ప్రయోగాల ద్వారా తమంతతాముగా తెలుసుకునేట్టుగా చేయడం.

ఛందస్సును సులభమైన రీతిలో ఉదాహరణలతో (అప్పటికప్పుడు జరిగిన సంఘటనను గానీ, విద్యార్థుల పేర్లువచ్చేట్టుగాగానీ పద్యాలను నల్లబల్లపై రాసి) బోధించడం.

నేనే విద్యార్థులకై ఒక సులభ వ్యాకరణం రాయాలనుకుంటున్నాను.

ప్ర -  మీ లక్ష్యం ఏమిటి?
జ - “తెలుఁగు పద్యంబు నిత్యమై తేజరిల్లు” తెలుగు పద్యానికి ప్రాచుర్యం కలిగించడం. బంగారు తెలంగాణ సాధనలో నేనూ పాత్రధారిని కావడం
(కల్వకుంట్ల చంద్రశేఖర రావు)
ప్ర -  మీ అభిమాన నాయకుడు?
జ - తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కె. చంద్రశేఖర రావుగారు…తెలంగాణ సాధనకై నడుంబిగించి, మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగివచ్చారు…తెలంగాణను సాధించారు…తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు! అహర్నిశలూ కృషిచేస్తున్నారు.

ప్ర - మీకు నచ్చిన సినిమా  ?
జ - పాత సినిమాలు ఎన్.టీ.రామారావుగారివి, అలాగే పౌరాణిక, జానపద చిత్రాలు బాగా నచ్చుతాయి. ఇప్పటికాలానికి చెందినవి అన్నమయ్య, శ్రీరామరాజ్యం నచ్చిన చిత్రాలు.

హిట్ పెయిర్ మహా నటీ-నటులు సావిత్రి - ఎన్.టి.ఆర్ )
ప్ర - మీ అభిమాన నటీ నటులు ఎవరు?
జ - నటరత్న, పద్మశ్రీ ఎన్.టి.రామారావు, సావిత్రి …ఇద్దరూ నాకు నచ్చిన నటీనటులు.

ప్ర - ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం?
జ- ఈ జగన్నాటకంలో మనం కేవలం పాత్రధారులమే...అంతా ఆ భగవంతుని లీల. ఇంతమాత్రానికే ఈ దోపిడీలూ, కక్షలూ, కార్పణ్యాలూ, అవినీతీ, స్వార్థం, దౌష్ట్యవర్తనం ప్రదర్శించడం అర్థంలేని పని. మన మనస్సులో ఎన్ని ఆందోళనలున్నా ఆ భగవంతునిపై భారం వేసి మన శక్తికొద్దీ ప్రయత్నించడం..మిగతాది భగవంతుడే చూసుకుంటాడనే నమ్మకంతో పనిచేయడం వల్ల మానసిక ప్రశాంతతకు ఆటంకం ఏర్పడదు. అనవసరపు ఆందోళన కలుగదు. అంతా ఈశ్వరేచ్ఛ అనుకోవడం వల్ల ఏదైనా ఆశించనిది జరిగితే భగదిచ్ఛగా భావించాము కాబట్టి పరస్పర నిందాలాపాలకు మనం కారకులం కాము. సాత్త్విక జీవనం సాధ్యమవుతుంది. భగవంతుడు మనకు ఇంతే ఇచ్చాడనే ఆత్మ సంతృప్తి కలిగి, ఈర్ష్యాద్వేషాలకు తావులేకుండాపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికజీవితం మనిషిని ఉన్నతంగా, మహా మనీషిగా తీర్చిదిద్దుతుందని నా నమ్మకం.

ప్ర - మతం పై మీ అభిప్రాయం?
జ-’మతం’ అంటేనే అభిప్రాయం అని అర్థం. వివిధ మతాలవారు వివిధ రీతులలో తమ భక్తి ప్రపత్తులను ప్రకటించుకున్నా, అందరు ప్రయత్నించేదీ ఆ భగవంతుని కృపకొరకేననే పరమసత్యం తెలుసుకుంటే ఏ మతవిద్వేషాలూ మన మనస్సులను చేరవు. అన్ని మతాల సారం ఒకటే...మానవత్వం ప్రదర్సించి, తోటి జీవులపై ప్రేమభావంతో ఉండడం...కష్టాలలో సహాయకారులమై ఉండడం...మనకున్నదానిలో కొంతలో కొంతైనా బాధితులకు, నిర్భాగ్యులకు దానంచేయడం...అన్యాయవర్తనులం కాకుండా ఉండడం...మొదలైనవి ఏ మతమైనా బోధిస్తుంది. కాబట్టి మతంపేరుతో విద్వేషంతో విధ్వంసం సృష్టించడం అమానవీయం. అలా ప్రవర్తిస్తే దైవాగ్రహానికి గురికావలసివస్తుంది. కాబట్టి సర్వమానవ సమానతే మతానికి గమ్యం కావాలి.

ప్ర - సనాతన ధర్మం పై మీ అభిప్రాయం?
జ- సనాతన ధర్మం మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. దీనికి స్వార్థం, విద్వేషం తోడైతే అది కలుషితమవుతుంది. అది ధర్మభ్రష్టమై అధర్మానికి దారితీస్తుంది. పర మతాల్ని శత్రువులుగా భావింపజేస్తుంది. అందుకని సనాతన ధర్మ నిర్వహణలో మానవుడు తన హద్దులు దాటకుండా ప్రవర్తిస్తే అది మహనీయత్వాన్ని ప్రసాదిస్తుంది. ఛాందసంగా (మూర్ఖంగా) ఆలోచించకుండా, మానవీయంగా ఆలోచిస్తే మేలు కలుగుతుంది.
ప్ర - మీరు చెప్పదలచుకున్న ఇతర అంశాలు?
జ - స్వార్థ ప్రయోజనాలను వదలి…సత్యమైన అంశాలను…అవసరమైన విషయాలను…మోసం ఎంతమాత్రం లేకుండా …ఆచరణయోగ్యమైనవిధంగా…ప్రభావవంతంగా…ప్రతిభాయుతంగా అందిస్తే …పాఠకులకు  గొప్ప మేలు చేసినవారవుతారు.
- పల్లా కొండల రావు