నీటిపారుదల రంగ నిపుణులు
తెలంగాణ ముద్దుబిడ్డ
కీర్తిశేషులు
రామరాజు విద్యాసాగర్ రావు గారికి
అశ్రుతర్పణము
నీటి విషయాన జరుగు దుర్నీతినిఁ దెల
గాణ కనులఁ గట్టినయట్లుఁ గాను చూపి
నట్టి యింజనీర్ తెలగాణ కంకితుఁడగు
రామరాజు విద్యాసాగరన్నకశ్రు
తర్పణమ్మందఁజేతును త్వరితముగను!
భౌతికమ్ముగఁ దెలగాణ ప్రజలముందు
నీవు లేకున్నఁ, బారెడి నీటి ధ్వనుల
యందు నీ మాటలు వినెద; మట్లె పొలపుఁ
బచ్చఁదనమందు నీదు రూపముఁ గనెదము!
నీటి విషయాలఁ దెలిపియు, నిప్పు రగులఁ
జేసి, యాంధ్ర నాయకుల దుశ్చేష్టితముల
నెఱుకపఱచియుఁ దెలగాణ నిద్రలేపి
యుద్యమింపఁగఁ జేసితివో మహాత్మ!
కేంద్ర జలసంఘమునను సాంకేతికునిగఁ
బనియుఁ జేసిన యనుభవంబంత మేళ
వించి, సాగునీటినిఁ బంచు విషయమందు
మన తెలంగాణకును జరిగిన దురితము
లిల సహేతుకముగ విమర్శించినావు!
ఆంధ్రజలదోపిడినిఁ దెలంగాణలోని
సకల జనుల కర్థమ్మగు సరళితోడఁ
దెలియఁజేసి, యుద్యమమున స్థిరతమమగు
వెలుఁగు లందఁజేసియు నిట వెలిఁగితివయ!
మన తెలంగాణ యుద్యమ మలిదశ కొక
వైపు జయశంక రింకొకవైపు నీవు
నిలిచి, యుద్యమస్ఫూర్తిని నింపిన ఘన
రాష్ట్ర సాధక యజ్ఞ కర్మఠుఁడవైతి!
"నీరు - నిజములు" పేరిట నిక్కమైన
విషయముల నీవ తెల్పియు, వెంటవెంట
జరుగు పరిణామములఁ దెల్పి, జనుల హృదుల
స్థిరతరమ్మగు స్థానాన స్థిరపడితివి!
"నీరు నిధులు నియామక నియమము" లవి
మన తెలంగాణ యుద్యమమ్మునఁ బునాదు
లయ్య! యిందున నీరమ్మె యత్యవసర
మైన "కాలమ్ము"గా నీకు నమరెనయ్య!!
నీర మీయక కృష్ణమ్మ పారుచున్న,
పఱఁగ గోదారి జలమీక పరుగులిడెడి
యాంధ్ర కుట్రల నెల్లను నందఁజేసి,
ప్రజ యమాయకత్వ సువిదారకుఁడవైతి!
ముఖ్యమంత్రి కేసీయారు ముఖ్యమైన
సలహదారునిగా నుండి, సక్రమమగు
నెన్నొ జల ప్రణాళికలను నెన్నికమెయిఁ
దెలిపి బంగారు తెలగాణఁ దిరపఱచియు
నీరముల సస్యముల నీవె నిలిచితివయ!
ఘనుఁడ! నీటిపారుదలరంగనిపుణుండ!
పుణ్య తెలగాణ తల్లికి ముద్దుబిడ్డ!
జన జల ప్రదాత! జల హృది సంస్థితుండ!
రామరాజ విద్యాసాగరా నమోఽస్తు!
జన్మభూమి నేత్రమ్ముల జాలువారు
బాష్పవారిని నాపఁగఁ బ్రతినఁ బూని,
జీవితమ్మంకితమ్ముగాఁ జేసినట్టి
సుజనసాగర! విద్యన్న! జోతలివిగొ!
నీదు మరణమ్ము తెలగాణ నేల కెపుడుఁ
దీర్చలేనట్టి లోటాయె! తిరముగాను
నీదు చరితమ్ము తెలగాణ నేలయందు
నిలిచి వెలుఁగును, రవిచంద్రు లిల స్థిరముగ
వెలుఁగులనుఁ బ్రసరించుచు వెలయుదాఁక!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి