గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఫిబ్రవరి 26, 2015

’రామసేతు’ను చూసినట్టుగా...’భద్రాచలం”ను చూడరా...???

images of bhadrachalam కోసం చిత్ర ఫలితంimages of bhadrachalam కోసం చిత్ర ఫలితం
images of bhadrachalam కోసం చిత్ర ఫలితంimages of bhadrachalam కోసం చిత్ర ఫలితం

సేతు సముద్రం ప్రాజెక్టు కోసం పది కిలోమీటర్ల శిలను తొలిస్తేనే,
పర్యావరణానికి ముప్పు అని, సముద్ర జలాలకు ఆవాసం లేకుండా
పోతుందని, ఔషధ మొక్కలు నాశనం అవుతాయని, అరుదైన జాతి జీవాలు, వృక్షాలు కనుమరుగు అవుతాయని గగ్గోలు పెట్టారు.
మరి లక్షల ఎకరాలు ముంచి పోలవరం కడితే పర్యావరణానికి ఎంత ముప్పు కలగాలి?
ఎంత మంది నిరాశ్రయులు కావాలి? ఎన్ని అరుదైన జాతులు అంతరించాలి?
 

’ఇది రామభక్తుల ప్రభుత్వం. జై శ్రీరాం నినాదాలు చేసే వారిది!’ అని కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ మాజీ అధ్యక్షుడు నితీష్ గడ్కరీ ఇటీవలే ప్రకటించారు. సంతానం విషయంలో, పీకే సినిమా విషయంలో కాషాయదండు నుంచి చాలా ప్రకటనలు వస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ప్రకటనల లక్ష్యం అర్థం చేసుకోవచ్చు. కానీ కేంద్రం ప్రభుత్వం ఇటీవల చేస్తున్న కొన్నిపనులు, ప్రయత్నాలు తాము నిజమైన రామభక్తులమని, రాముడి చరిత్ర అవశేషాల పరిరక్షకులమని చాటే విధంగానే ఉన్నాయి. రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో అయోధ్య నుంచి నేపాల్ లోని జానక్‍పూర్‍కు ఓ రహదారి నిర్మించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. రాముడు 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసేందుకు చిత్రకూట్‍లోని అడవులకు ఈ మార్గం ద్వారానే వెళ్లారు కాబట్టి, ఈ దారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి నిర్మాణాలు, ప్రయత్నాలు గతంలో కూడా చాలానే జరిగాయి. అసలు రాముడి పేరు చెప్పుకునే బిజెపి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. రాముడిపై బిజెపికే పేటెంట్ హక్కు ఉందన్నట్లు ఉంటుంది ఆ పార్టీ ధోరణి. అందుకే రాముడి చరిత్రకు సంబంధించిన ఏ అంశానికైనా బిజెపి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందనే అభిప్రాయం సామాన్యులకు కలుగుతుంది. రాముడు పుట్టినట్లు చెబుతున్న అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం బిజెపి కట్టుబడి ఉందని ఆ పార్టీ ప్రతీ ఎన్నికల్లో చెబుతూ వస్తుంది కూడా. సీతను అపహరించి బంధించిన లంకకు వెళ్లడానికి రామసేతును నిర్మించినట్లు చెబుతున్న ప్రాంతాన్ని కూడా అలాగే పరిరక్షిస్తామని, రామసేతును ధ్వంసం చేసేది లేదని కూడా బిజెపి నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు అవసరం ఉన్నా , లేకపోయినా ప్రతీ సారీ చెబుతూనే ఉన్నారు. కానీ, రాముడి చరిత్రకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలు, రాముడి జీవితంతో ముడిపడి ఉన్నట్లు చెబుతున్న ప్రాంతాలన్నింటి విషయంలోనూ బిజెపి ఇదే వైఖరి కలిగి ఉందా? అనేది విశ్లేషించుకుంటే బిజెపి ద్వంద్వ వైఖరి బయటపడుతుంది.

రామసేతు విషయంలో హిందువుల మనోభావాల పేరుతో బిజెపి, సంఘ్ పరివార్ నాయకులు చేస్తున్న హంగామా దేశ ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపుతుంది. హిందూ మహాసముద్రం ద్వారా వివిధ దేశాల నుంచి వచ్చే నౌకలు భారత్ చేరుకోవాలంటే ప్రస్తుతం శ్రీలంక అవతలి నుంచి రావాల్సి వస్తుంది. వేరే దేశం నుంచే కాదు, భారత దేశంలోని అరేబియా తీర ప్రాంతాల నుంచి ఇతర నగరాల నుంచి హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు నౌకలు చేరుకోవడానికి కూడా శ్రీలంక దేశం నుంచి తిరిగి రావడం ఆర్థికంగా, సమయపరంగా కూడా భారమే.
మలేసియా, తైవాన్, సింగపూర్‌తో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు, దేశంలోని ముంబాయి తదితర నగరాల నుంచి వచ్చే నౌకలు 424 నాటికల్ మైళ్లు(780 కిలోమీటర్లు) దూరం, 30 గంటల సమయం అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తున్నది. మద్రాస్, తుతుకుడి, కన్యాకుమారి లాంటి ప్రాంతాలకు భారత పరిధిలోని సముద్ర జలాలలకు ఆనుకునే ఉన్నప్పటికీ, అక్కడ సముద్రంలో ఉన్న పర్వత శ్రేణులు, శిలల వల్ల నౌకల రాకపోకలు కుదరడం లేదు. రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి నుంచి శ్రీలంక వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాని వల్లే నౌకలు నేరుగా భారత్ చేరుకోవడం లేదు. ఇది సరుకు దిగుమతి చేసుకునే భారత్‍పై ఎంతో భారం పడే అంశం. ఈ దూరాన్ని, భారాన్ని తగ్గించడానికి సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి మొదలుకుంటే నేటి వరకు ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయడం...ఏదో ఓ కారణం చేత ఆగిపోవడం...పరిపాటిగా మారింది. యుపిఎ ప్రభుత్వం ఉన్నప్పుడు, అందులో డిఎంకె భాగస్వామిగా ఉన్నప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టు తెరమీదికి వచ్చింది. అప్పటి కేంద్ర షిప్పింగ్ మంత్రి టిఆర్ బాలు ఈ ప్రాజెక్టు కట్టి తీరాల్సిందే అనే పట్టుదల ప్రదర్శించారు. కరుణానిధి కూడా అండగా నిలిచారు. ధనుష్కొటి-శ్రీలంకల మధ్య సముద్ర జలాల్లో ఉన్న రాళ్ళను, గుట్టలకు ఓ పది కిలోమీటర్ల మేర తొలగిస్తే నౌకలు శ్రీలంక అవతలి నుంచి రావాల్సిన అవసరం ఉండదు.
కన్యాకుమారి పక్క నుంచే రావచ్చు. కానీ ఈ ప్రాజెక్టును బిజెపి, సంఘ్ పరివార్ తీవ్రంగా వ్యతిరేకించాయి. ధనుష్కోటి-శ్రీలంకల మధ్య సముద్రంలో ఉన్న పర్వతం లాంటి ప్రాంతం సహజసిద్ధంగా ఏర్పడింది కాదని వాదించాయి. అది సీతను రావణాసురుడి చెరనుంచి విడిపించడానికి రాముడు వెళ్లడానికి నిర్మించిన వారధి అని రామాయణం వినిపించాయి. దాన్ని తొలగించడమంటే రాముని చరిత్ర ఆనవాళ్లను చెరిపేయడమే అని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ బండరాళ్లను ఆధారం చేసుకుని ఎన్నో జలజీవాలున్నాయని, ఔషధ మొక్కలున్నాయని, వాటిని రక్షించడం కూడా ముఖ్యమేనని చెప్పాయి. ఆ శిలలను తొలగిస్తే పర్యావరణానికి కూడా ముప్పు అని వాదించాయి. ఈ వాదనను డిఎంకె, మరికొన్ని పక్షాలు తీవ్రంగా ఖండించాయి. అసలు రాముడి వారధి అని చెప్పడానికి ఒక్క ఆధారమూ లేదని, శిలలను తొలగించకుండా అడ్డుపడడమంటే అభివృద్ధికి అడ్డుపడడమే అని కూడా కరుణానిధి చెప్పారు. ఆ వాద, ప్రతివాదనల నేపథ్యంలో సేతుసముద్రం కెనాల్ ప్రాజెక్టు మూలన పడింది.
రాముడు అయోధ్యలో పుట్టాడని, చిత్రకూట్ లోని అడవుల్లో సంచరించాడని, లంకకు వారధి కట్టారని నమ్మే ప్రతీ ఒక్కరు...భద్రాచలం ప్రాంతంలో రాముడి అడుగు జాడలను కూడా నమ్ముతారు. వనవాసంలో భాగంగా రాముడు భద్రాచలం అడవుల్లో కూడా గడిపాడని రామాయణం నమ్మే వారంతా విశ్వసిస్తారు. దక్షిణ అయోధ్యగా కూడా భద్రాచలానికి పేరుంది. సీతారామచంద్రులు ఎంతో అన్యోఽన్యంగా, ప్రేమగా గడిపిన ప్రాంతంగా భద్రాచలాన్ని చెప్పుకుంటారు. ఈ ప్రాంత పరిసరాలన్నీ రాముడి కథతో ముడిపడి ఉన్నవే. వాల్మీకి మహర్షి వర్ణించిన ప్రస్రవణ పర్వతములనే ’పాపికొండలు’ అని పిలుస్తున్నారు. రామాయణ గాథ ప్రకారం... సీతమ్మను ఎత్తుకుపోతున్న సందర్భంలో పక్షిరాజు జటాయువు రావణాసురుడ్ని అడ్డగిస్తుంది. రావణుడితో పోరాడుతుంది. అప్పుడు రావణుడు కత్తితో జటాయువుపై దాడి చేస్తాడు. ఆ దాడిలో జటాయువు రెక్క విరిగి కింద పడుతుంది. ఆ రెక్కపడిన ప్రాంతమే నేటి ’రేకపల్ల”. మొండెం పడిన ప్రాంతమే ’శ్రీరామగిర”. ఆ జటాయువును రాముడు తండ్రితో సమానంగా భావించి పిండప్రదానం చేస్తాడు. ఆ ప్రాంతాన్నే ’జటాయుబండ’గా పిలుస్తున్నారు. చలికాలంలో సీతమ్మ స్నానం చేయడానికి రాముడు గోదావరి నది నీటిని తన ఆగ్నేయాస్త్రంతో వేడి చేస్తాడు. రెండు గుంటల్లో నీరు ఇప్పటికీ వేడిగా ఉంటుంది. వాటినే ఇప్పుడు ’ఉష్ణగుండాలు’గా పిలుస్తారు. 
భద్రాచలం చుట్టుపక్కల ఉన్న పర్ణశాల, రేకపల్లి, పాపికొండలు, జటాయుబండ, శ్రీరామగిరి, ఉష్ణగుండాలు.. ఇవన్నీ రాముడి కథతో సంబంధం ఉన్న ప్రాంతాలే. వీటిలో పర్ణశాల, భద్రాచలం తెలంగాణలో మిగిలిపోగా.. రేకపల్లి, పాపికొండలు, జటాయుబండ, ఉష్ణగుండాలు, శ్రీరామగిరి ఆంధ్రప్రదేశ్‍లో కలిసిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ప్రాంతాలన్నీ పోలవరం ప్రాజెక్టువల్ల ముంపుకు గురై, జలసమాధి కానున్నాయి. 
సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల దేశానికి ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ అది రాముడి వారధి కాబట్టి దాన్ని ముట్టుకోవద్దంటున్నారు.
మరి పోలవరం ప్రాజెక్టు వల్ల కూడా రాముడి చరిత్రలో భాగమైన ప్రాంతాలన్నీ మునిగిపోనున్నాయి...కనుమరుగు కానున్నాయి.
బిజెపి ప్రభుత్వమే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, డబ్బులిచ్చి కట్టిస్తోంది.
మరి రామసేతుకు వర్తించిన నియమాలు భద్రాచలానికి, పోలవరానికి వర్తించవా?
సేతు సముద్రం ప్రాజెక్టు కోసం పది కిలోమీటర్ల శిలను తొలిస్తేనే, పర్యావరణానికి ముప్పు అని, సముద్ర జలాలకు ఆవాసం లేకుండా పోతుందని, ఔషధ మొక్కలు నాశనం అవుతాయని, అరుదైన జాతి జీవాలు, వృక్షాలు కనుమరుగు అవుతాయని గగ్గోలు పెట్టారు.
మరి లక్షల ఎకరాలు ముంచి పోలవరం కడితే పర్యావరణానికి ఎంత ముప్పు కలగాలి? ఎంత మంది నిరాశ్రయులు కావాలి? ఎన్ని అరుదైన జాతులు అంతరించాలి?
ఇది రామభక్తుల ప్రభుత్వమని కేంద్ర మంత్రులు చాటుకుంటున్నారు.
రామసేతు విషయంలో ప్రదర్శించిన రామభక్తిని భద్రాచలం విషయంలో ఎందుకు ప్రదర్శించడం లేదు.
రామభక్తి కూడా అవకాశవాదంలో భాగమేనా?
వీళ్ళు ’రామసేతు’ను చూసినట్టుగా...’భద్రాచలం’ను చూడరా???

-గటిక విజయకుమార్
(ఆధారంకై: రామసేతు...భద్రాచలం...పై నొక్కండి)

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి