తేటగీతులు:
విద్య యున్నచో జీవన విధులు దెలియు!
లోక వృత్తమ్ము దాన విలోకన మగు!
విద్య లేకున్నఁ బ్రదికెడు విధ మెఱుఁగఁడు!
విద్య లేనట్టివాని జీవితము సున్న!!
విద్యలనుఁ బూర్ణుఁ డెపుడు గర్వితుఁడు కాఁడు;
స్వల్ప మెఱిఁగినవాఁడె గర్వమునుఁ జూపు;
నన్ని తెలియుటయే నిగర్వోన్నతి నిడుఁ;
గొన్ని తెలియుట గర్వానికున్న మహిమ!
ఎంత పండితుఁ డైనను నెంత విద్య
కల్గి యున్నను నిత్యమ్ము కాంక్ష తోడ
సాధనముఁ జేయకున్నచో సమయమునకు
నక్కఱకు రాదు! తద్జ్ఞాన మంతరించు!!
గురువు లెప్పుడు జ్ఞానమ్ముఁ గొనుచు నుండ
విద్యయే దీప్త మగుచుండు వేగముగను!
నిత్య విద్యార్థులై గురుల్ నిలిచినంత
భావి భారత పౌరులే పరిఢవింత్రు!!
బాలకులు బడులకుఁ బోయి భావి పౌరు
లుగను వెలుఁగొందు నట్టి విద్యఁ గొని వెలిఁగి
వెలుఁగు లోకానికినిఁ బంచి నిలువఁ గాను
జగము కీర్తించుఁ గావునఁ జదువ వలయు!!
అభ్యసనమునుఁ బట్టి విద్యయె యెసంగు!
కర్మమునుఁ బట్టి బుద్ధి సద్ఘనత పెరుఁగు!
సాధనము చేత సద్విద్య చాలఁ గలుగు!
పఱఁగ సద్బుద్ధి సత్కర్మ వలన నెసఁగు!!
నేర్చుకొనువాఁడు నిత్యమ్ము నేర్పుతోడ
శత్రువుల నుండి యైనను సద్గుణమ్ముఁ
గొనఁగఁ దగు నయ్య సేవించి వినియుఁ! గాన,
రిపుని నుండైన సచ్ఛీల మెపుడు కొనుఁడు!!
వినఁగ నిచ్ఛ లేకుంటయు; వేగిరపడు
టయును; నాత్మ శ్లాఘయను మూఁట నిల విద్య
నేర్వ నాటంకపఱచియు నిశ్చయముగ
విముఖులనుఁ జేయుఁ గావున వీడుఁ డివియ!!
పండితుఁడు లేని చోట నపండితుండె
గౌరవింపఁగఁ బడుచుండు ఘనముగాను!
వృక్షములు లేని చోటున వెదకిచూడ
నాముదపుఁ జెట్టె, వృక్షమ్మ టండ్రు జనులు!!
జ్ఞాన మెంతేని యున్నచో సర్వులకును
సుంతయైనను నుపయోగవంత మగుట
వలయు! నా జ్ఞాన ముపయోగపడదయేని
కుండలో దీప మున్నట్టు లుండునయ్య!!
పండితుని పరిశ్రమమునుఁ బండితుండె
తెలియఁగలఁడయ్య! యితరుండు తెలియఁగలఁడె?
పురిటి నొప్పులు తెలియును పుత్రవతికె!
బొట్టెలఁ గనని గొడ్రా లవెట్టు లెఱుఁగు?
పొత్తమునఁ గల విద్య యెప్పుడును నవస
రమున కెట్లొనరదొ యటు లక్కఱపడు
సమయమున ధనము పర హస్తమున నుండ
నెట్లు పనికివచ్చు? నెటులు హితము నిడును?
విద్య నొసఁగెడు గురుని సేవింపుమయ్య!
సూక్తి బోధకుఁ డగువాఁడె చుట్టమయ్య!
యెంచి సారము నెల్ల బోధించునట్టి
పెద్దలగువారి వాక్కులె చద్దిమూట!!
యుక్తియుక్తమౌ వాక్కు బాలోక్తమైనఁ
గొనఁగఁ దగునయ్య బుధులకుఁ గూర్మి మీఱ!
తపనుఁ డీక్షింపలేని పదార్థచయముఁ
చూపునుం గాదె యొకచిన్న దీపకళిక!!
స్వస్తి
2 కామెంట్‌లు:
నమస్సులు.
పద్యాలు చాలా బాగున్నవి.
ధన్యవాదాలండీ శివ ప్రసాద్ రావు గారూ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి