- రెవెన్యూశాఖలో విభజన జరుగకుండానే
- ఆంధ్రా ప్రాంత ఉద్యోగుల పదోన్నతులకు సన్నాహాలు
- ఏకపక్షంగా డీపీసీ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు
- తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరం
- నేడు ఏపీ సీసీఎల్‌ఏ ఎదుట ఆందోళన
- తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరం
- నేడు ఏపీ సీసీఎల్‌ఏ ఎదుట ఆందోళన
సీమాంధ్ర సర్కారు విభజన చట్టాలను, న్యాయాన్ని భేఖాతర్ చేస్తున్నది. కీలకమైన రెవెన్యూశాఖలో పదోన్నతుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగుల విభజన జరుగకుండానే ఏకపక్షంగా ఆంధ్రా ప్రాంత రెవెన్యూ అధికారులకు పదోన్నతులు ఇచ్చి తెలంగాణకు పంపాలని కుట్ర పన్నింది. రాష్ట్ర విభజన జరిగి 18 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగులు, అధికారుల విభజన జరుగలేదు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీ ఇంకా పూర్తిగా చేయక ముందే ఏపీ ప్రభుత్వం తమ ప్రాంతంవారికి పదోన్నతులు ఇవ్వడానికి సిద్ధమైంది.
గురువారం ఏపీ సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఉమ్మడి డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై తెలంగాణ డిప్యూటీ కలెక్టర్లు తెలంగాణ సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 475 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉండగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కేవలం 176 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మాత్రమే ఉన్నాయంటూ డీపీసీ నిర్వహించడం సరికాదన్నారు. వాస్తవంగా ఉమ్మడిగా డీపీసీ నిర్వహిస్తే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించాలని, డీపీసీలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. పోస్టులు, సీనియార్టీలిస్ట్‌ల తయారీలో తెలంగాణ సీసీఎల్‌ఏ భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఏపీ ఏకపక్షంగా డీపీసీ నిర్వహించడాన్ని వారు తప్పుపట్టారు. దీనిపై వెంటనే స్పందించిన రేమండ్ పీటర్, ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి సూర్యకుమారితో ఫోన్‌లో మాట్లాడారు. డీపీసీ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏ ప్రాతిపదికన డీపీసీ నిర్వహిస్తారని ప్రశ్నించారు. అయితే మంజూరైన పోస్టులకు లెక్కప్రకారం సీనియార్టీ లిస్ట్ తయారు చేశామని ఆమె సమాధానం ఇచ్చారు.
పదోన్నతుల విషయంలో కోర్టుధిక్కరణ కేసు ఉన్నందున డీపీసీ నిర్వహిస్తున్నామన్నారు. కమలనాథన్ కమిటీకి 176 మంజూరైన పోస్టులు ఉన్నాయని చెప్పామని, సీనియార్టీ జాబితా ఇచ్చామని తెలిపారు. దీంతో విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయం చేయవలసి ఉందని రేమండ్ పీటర్ అన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం నిర్వహించే డీపీసీని రద్దు చేయాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై గురువారం ఏపీ సీసీఎల్‌ఏ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శివశంకర్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి