గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, డిసెంబర్ 15, 2015

తెలంగాణ కరువుకు శాశ్వత పరిష్కారం...!!!

ప్రఖ్యాత జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ ఎవ్రీవన్ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్ అనే పేరుతో 1996 లో ఓ పుస్తకం రాశారు. దేశంలో చాలా పేదరికం అనుభవిస్తున్న ప్రజలుండే జిల్లాల్లో కలియ తిరిగి రాసిన పుస్తకమది. కరువు ఏర్పడటానికి కారణాలు, దానివల్ల పేద లు పడే ఇబ్బందులు, ప్రభుత్వం చేయాల్సిన పనులు అన్నింటినీ కూలంకషంగా చర్చించారు. కరువును నిర్ధారించడానికి, కరువును ఎదుర్కోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు, దానివల్ల ఎవరికి మేలు కలుగుతున్నదనే విషయాలను లోతుగా అధ్యయనం చేసి అక్షరీకరించారు. ఆ పుస్తకం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నది కానీ, ఏ ప్రభుత్వం కూడా దాన్నొక పాఠంగా స్వీకరించలేదు. సాయినాథ్ తర్వాత కూడా కరువు మీద పుస్తకాలు వస్తున్నాయి. వ్యాసాలు వస్తున్నాయి. మీడియాలో ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ల వార్తలు వస్తున్నాయి. కానీ కరువు మాత్రం మళ్లీ మళ్లీ పేదింటి తలుపు తడుతూనే ఉన్నది. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల కరువు వస్తుందనే ఓ ప్రాథమిక సూత్రీకరణతో ప్రజలను సమాధానపరుస్తున్నారు. విచిత్రమేమిటంటే వర్షాభావ పరిస్థితులకు కరువు పర్యాయపదంగా మారింది.

కరువు అనుకోకుండా వచ్చే సునామీ కాదు. అయినా సరే ప్రభుత్వం కరువును ఓ ప్రకృతి వైపరీత్యంగానే చూస్తున్నది. కేంద్రం రాష్ర్టాలకు కేటాయించే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద ఇచ్చే డబ్బులనే కరువును ఎదుర్కోవడానికి ఖర్చు పెట్టాలనే నిర్దేశిస్తున్నది. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగానో, తక్కువగానో వర్షాలు కురవడం చాలా సాధారణం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా వర్షపాతం ఏటా ఓకే విధంగా ఉండదు. హెచ్చుతగ్గులుంటాయి. అలాంటి సమయంలో అనుసరించాల్సిన వ్యూహం సిద్ధంగా ఉండాలి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల కరువు వస్తుందనేది అందరూ నమ్మే మాట. కానీ వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి దీర్ఘకాలిక వ్యూహాలు అనుసరించకపోవడం వల్ల మాత్రమే కరువు వస్తుంది. ఈ విషయంలో ఇప్పటివరకు అటు కేంద్ర స్థాయిలో గానీ, ఇటు రాష్ట్ర స్థాయిలో గానీ పాలకులు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకుపోలేదు. పాలకుల దృష్టిలోపం వల్ల వచ్చే కరువును ప్రకృతి శాపంగా చిత్రీకరిస్తున్నారు. నిజంగా కరువు ప్రకృతి వైపరీత్యం కాదు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్న పాలకుల నేర ఫలితం కరువు. అంతేకాదు. కరువును నిర్ధారించడానికి, కరువును ఎదుర్కోవడానికి ఇప్పుడున్న పద్ధతులు పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నాయి. 

తెలంగాణలో ఏడాదికి 907 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావా లి. వర్షాకాలంగా పరిగణించే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 713 మి.మీ. వర్షపాతం ఉండాలి. కానీ ఈ ఏడాది 611 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 984 మి.మీ.కు 805 మి.మీ., ఖమ్మంలో 875 మి.మీ.కు 977 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో ఆ జిల్లాలు కరువు జాబితాలో లేవు. మిగతా ఎనిమిది జిల్లాలు కరువు జిల్లాలే. అయితే ఈ జిల్లాల్లో కూడా కొన్ని మండలాల్లో వర్షపాతం తక్కువగా, మరికొన్ని మండలాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. దాని ఆధారంగా కరువు మండలాల జాబితా తయారైంది. ఇది కూడా ఓ అశాస్త్రీయ పద్ధతే. వర్షపాతాన్ని లెక్కకట్టే సమయంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పడిన వర్షం మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ సారి జూన్ మొదటి వారంలో బాగానే వానలు పడ్డాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ఎంతో పెట్టుబడి పెట్టి పంటలు వేశారు. కానీ జూలై, ఆగస్టులలో అసలు వానలే లేవు. దీంతో ఆ పంటలు ఎండిపోయాయి. కానీ సెప్టెంబర్ మధ్య నుంచి మళ్లీ వానలు జోరందుకున్నాయి. వర్షపాతం లెక్కల్లో ఆ వాన చుక్కలు కలిశాయి కానీ పంటలకు ఉపయోగపడలేదు. లెక్క ప్రకారం చూస్తే వర్షపాతం బాగానే ఉన్నట్లు నమోదైన మండలాల్లో నిజంగా కరువు పరిస్థితులుండానికి కారణం ఇదే.

వర్షపాతంతో పాటు పంటలు వేసిన వ్యవసాయ భూమి యాభై శాతం కన్నా తక్కువగా ఉండటం, పంట దిగుబడి 33 శాతం తగ్గడం, వరుసగా 21 రోజుల పాటు వర్షాలు పడకుండా ఉండటం, పంటలో పచ్చదనం, భూమిలో తేమ శాతం తదితర లెక్కలతో కరువును నిర్ధారిస్తారు. వీటన్నింటిలో ప్రధానమైనది వర్షపాతం తక్కువగా ఉండటమే. వర్షపాతం లెక్కులు వేయడంలోనే అసలు లోపముంది కాబట్టి, కరువు ప్రాంతాల నిర్ధారణలోనే లోపం ఉన్నది. సరే, కరువు వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏమిటి? అనే విషయంలో కూడా ప్రభుత్వానికి స్థిరమైన అవగాహనే ఉన్నది. కరువు వల్ల పంటలు పండవు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ప్రజలకు మంచినీళ్ల సమస్య ఏర్పడుతుంది. పశువులకు మేత దొరకదు. కూలీలకు పని దొరకదు. వీటిని ఎదుర్కోవడానికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. మంచినీళ్ల కోసం అప్పటికప్పుడు బోర్లు వేయాలి. దేశంలో ఎక్కడ పశుగ్రాసం ఉన్నా కొనుక్కురావాలి. ఉపాధి హామీ పని దినాలు పెంచాలి. అవసరమైతే కరువు పింఛ న్లు కూడా ఇవ్వాలి.

ఇదీ ఇప్పటి వరకూ ఉన్న కరువు కార్యాచరణ. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యే మార్గదర్శకాలు, కరువును ఎదుర్కొనే మార్గాలు. మొన్నటికి మొన్న తెలంగాణలో కరువు గురించి తెలుసుకోవడానికి కేంద్ర బృందాలు వచ్చాయి. తిరిగాయి. కరువు చూశాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలకు లోబడి కొన్ని కోరికలు కోరింది. మూడు వేల కోట్లు అడిగింది. ఇప్పటికే డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న రూ.270 కోట్ల దాకా వాడుకునే అవకాశం కల్పించడంతో పాటు, మరికొన్ని డబ్బులిచ్చి కేంద్రం చేతులు దులుపుకుంటుంది. ఆ డబ్బులకు మరికొంత జమ చేసి ఎకరాకు మూడు, నాలుగు వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుం ది. కొన్ని బోర్లు , కొంత గడ్డి కూడా వస్తుంది. అంతే తప్ప అంతకు మించి ఏమీ జరగదు. ఈ పరిస్థితిపై సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను కేంద్ర బృందానికి నిర్మొహమాటంగానే చెప్పా రు. అసలు కరవును ఎదుర్కోవడానికి అనుసరించే పద్ధతులు ఇవి కానే కాదని తేల్చిచెప్పారు. దీర్ఘకాలిక వ్యూహం కావాలని డిమాండ్ చేశారు. కేంద్రం సంగతలా ఉంచితే, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అసలు రాష్ట్రంలో కరువే ఉండకుండా చేయడానికి తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు.

నిజానికి కరువును ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో అమెరికాలోని లాస్ వెగాస్ లాంటి ప్రాంతాల్లో ఎన్నటికీ పంట పండని, భూగర్భ జలాలకు అవకాశం లేని వాతావరణం ఉంది. కానీ అక్క డి ప్రజలు తిండికోసం, నీళ్లకోసం అలమటించడం లేదు. ఎనభై ఏండ్ల కిందటే హూవర్ డ్యామ్ కట్టి బూడిద మాత్రమే ఉండే భూమిని భూతల స్వర్గంగా మార్చా రు. అలాంటి ప్రణాళిక కేంద్రం దగ్గర లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్నది. రాబోయే రెండు, మూడేళ్లలో కరువును శాశ్వతంగా పారదోలిన రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతున్నది.
వర్షపాతం తక్కువ నమోదైనా సరే, పంటలు పండటానికి ప్రాజెక్టుల రీ డిజైన్ జరుగుతున్నది. గోదావరి, కృష్ణాలపై బ్యారేజీలు వస్తున్నాయి. కోటి ఎకరాలకు నీరందించే రిజర్వాయర్లు సిద్ధమవుతున్నాయి. వర్షపు నీళ్లనే కాదు, ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లను నిల్వ చేసుకోవడానికి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు సిద్ధమవుతున్నాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. స్థానిక నీటి నిల్వలతో సంబం ధం లేకుండానే నదీ జలాలు మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికీ అందుతాయి. వర్షపాతం పెంచడానికి హరితహారం దోహదపడుతుంది. దీర్ఘకాలిక చర్యల ద్వారా ఎంతటి కరువైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించాలి. వర్షాభావ పరిస్థితులు న్నా సరే, కరువు లేని కాలం కావాలి. తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలి.

gatika


వర్షపాతం తక్కువ నమోదైనా సరే, పంటలు పండటానికి ప్రాజెక్టుల రీ డిజైన్ జరుగుతున్నది. గోదావరి, కృష్ణాలపై బ్యారేజీలు వస్తున్నాయి. కోటి ఎకరాలకు నీరందించే రిజర్వాయర్లు సిద్ధమవుతున్నాయి. వర్షపు నీళ్లనే కాదు, ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లను నిల్వ చేసుకోవడానికి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు సిద్ధమవుతున్నాయి.భూగర్భ జలాలు పెరుగుతాయి.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి