గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మార్చి 07, 2015

జేసీజే పరీక్షలకు ఓకే!!

-మూల్యాంకనం మాత్రం వద్దు: హైకోర్టు
-పరీక్షలపై స్టే కోరిన తెలంగాణ.. వ్యతిరేకించిన ఏపీ
-హైకోర్టులో ఉద్రిక్తత.. చాంబర్‌లోనే ధర్మాసనం తీర్పు
జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)-2014 నోటిఫికేషన్ ఆధారంగా మార్చి 8న నిర్వహించే రాతపరీక్షలను యథాతథంగా నిర్వహించాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. అయితే జవాబుపత్రాలను మూల్యాంకనం చేయద్దని స్పష్టంచేసింది. రానున్న ఆదివారం నిర్వహించబోయే రాతపరీక్షలు మినహా తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు మరేవిధంగా ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది.
అభ్యర్థులు రాసిన జవాబుపత్రాలను సీల్డ్‌కవర్లలో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగిన సమయంలో 2014 ఫిబ్రవరిలో జారీచేసిన జేసీజే -2014 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 8న రాతపరీక్షలు నిర్వహించడాన్ని సవాల్‌చేస్తూ న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రత్యేక రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా రాతపరీక్షలు నిర్వహించడం సహేతుకం కాదని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మార్చి 4న చివరిసారిగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. తీర్పును మార్చి 6వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ..


తెలంగాణ రాష్ర్టానికి నష్టం చేకూర్చేవిధంగా జేసీజే నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో శుక్రవారంనాటి కోర్టు ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం పదిన్నరకు ఉత్తర్వులు వెలువరిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ న్యాయవాదులు భారీస్థాయిలో హైకోర్టుకు చేరుకున్నారు. కేసు సంఖ్య రాగానే తెలంగాణ రాష్ట్రం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలను మరోసారి ధర్మాసనానికి నివేదించారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన నోటిఫికేషన్‌కు తెలంగాణ రాష్ర్టానికి సంబంధం లేదని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్‌ను పట్టించుకోకుండానే నోటిఫికేషన్ జారీచేశారని నివేదించారు. జేసీజే పోస్టులను ఆరు నెలల్లోగా భర్తీ చేయాలని జనవరి 20న సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించినందున అత్యవసరంగా పరీక్షలను నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు విధించిన ఆరు నెలల గడువులోగా రెండు రాష్ర్టాలకు న్యాయవ్యవస్థను విభజించి, దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులు, ఇతర సిబ్బందిని ఆయా రాష్ర్టాలకు కేటాయించిన తర్వాత ఖాళీల ఆధారంగా జేసీజే పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టాలని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. అప్పటి వరకు పరీక్షలపై, కొత్త నోటిఫికేషన్‌పై స్టే విధించాలని అభ్యర్థించారు.

ఆంధ్రప్రదేశ్ తరపున ఆ రాష్ట్ర ప్రత్యేక న్యాయవాది వాదనలు చేస్తూ.. తాము స్టేకు నిరాకరిస్తున్నామని తెలిపారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని కోరారు. ఏపీ వాదనలపై కోర్టు హాల్లోని తెలంగాణ న్యాయవాదుల్లో అసంతృప్తి చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. హైకోర్టు తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు చేస్తూ.. ఆరు నెలల్లో పోస్టులను భర్తీచేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలనుసారమే రాతపరీక్షల నిర్వహణతోపాటు కొత్త నోటిఫికేషన్ జారీచేసినట్లు వివరించారు. వాదనలు పూర్తవ్వడంతో తాము తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా పేర్కొని, బెంచి దిగి చాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో న్యాయవాదులను ఉద్దేశించి.. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు, పేరు ఉందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారన్నారు. కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదుల గూర్చి కాదని, దేశవ్యాప్తంగా ఉన్న అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తదనంతరం నలబై నిమిషాల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ తిరిగి ధర్మాసనాన్ని అధిరోహించారు. అయితే అదే సమయంలో తీర్పు వెలువరిస్తారనే ఉత్కంఠతో తెలంగాణ న్యాయవాదులు కోర్టు హాల్లోనే ఉన్నారు. కొద్దిపాటి సమయం వేరే కేసులు విచారణ చేపట్టిన ధర్మాసనం, తీర్పును వెలువరించకుండానే బెంచి దిగిపోయింది. మధ్యాహ్నం గడిచినప్పటికీ న్యాయవాదులు కోర్టు హాల్లోనే తీర్పుకోసం వేచిచూస్తూ ఉన్నారు. మధ్యాహ్నం భోజన విరామం సమయం తర్వాత ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లోనే ఉత్తర్వులు వెలువరించనున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాదులకు, అడ్వకేట్ జనరల్‌కు సమాచారం అందించారు. దీంతో వారందరూ చాంబర్‌కు చేరుకున్నారు. చాంబర్‌లోనే ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని పేర్కొంది. అయితే మూల్యంకనం చేపట్టవద్దని, ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉన్నందున తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే చర్యలు చేపట్టినందున, అలాగే అభ్యర్థులు సైతం సిద్ధం అయినందున పరీక్షలను యథాతథంగా నిర్వహించడానికి అనుమతి ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

lawyers


తీర్పు నేపథ్యంలో హైకోర్టులో పోలీసులు, బలగాల మోహరింపు


జేసీజే పరీక్షలపై, నోటిఫికేషన్లపై తీర్పు నేపథ్యంలో హైకోర్టు వద్ద పోలీసులు, భద్రతా బలగాలను భారీగా మోహరించారు. తెలంగాణ న్యాయవాదుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయనే ఉద్దేశంతో కోర్టు హాల్లోకి న్యాయవాదులను అనుమతించే విషయంలో పలు నిబంధనలు విధించారు. కోర్టు ప్రాంగణంలోకి ఇతరులు రాకుండా నిరోధించారు.

పరీక్షలు అడ్డుకున్నవారిపై కఠిన చర్యలు : హైకోర్టు రిజిస్ట్రార్


జేసీజే పోస్టుల రాతపరీక్షలను అడ్డుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికాప్రకటన విడుదలచేశారు. పరీక్షలు అడ్డుకోవడంద్వారా రీఎగ్జామినేషన్‌కు కారణమైనవారినుంచే రీఎగ్జామినేషన్‌కు అయ్యే ఖర్చు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల వరకే పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు అనుమతించబోమని రిజిస్ట్రార్ స్పష్టంచేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లతోపాటు ఫోటో గుర్తింపుకార్డు లేదా బార్ అసోసియేషన్ జారీచేసిన గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

స్క్రీనింగ్ టెస్ట్‌లంటే మా గొంతులు నొక్కడమే: జేఏసీ


నమస్తే తెలంగాణ, చార్మినార్: జేసీజే రాతపరీక్షలను యథాతథంగా నిర్వహించాలన్న తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయవాద జేఏసీ నేతలు రాష్ట్ర హైకోర్టు ముందు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు తీర్పు న్యాయవాదులకు, తెలంగాణ వాదులకు తీరని నష్టం కలిగిస్తుందని విచారం వ్యక్తంచేశారు. ఈ దఫా జ్యుడిషియల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగితే వచ్చే 30 ఏండ్ల వరకు మళ్లీ జ్యుడిషియల్ ఉద్యోగాల భర్తీ ఉండదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం జ్యుడిషియల్ ఉద్యోగాల్లో భాగమైన జూనియర్ సివిల్ జడ్జి పోస్టులతోపాటు ఇతర విభాగాల్లో నియామకాలను 42ః58 నిష్పత్తిలో విభజించి ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఇదే విషయాన్ని కోరుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని జిల్లా కోర్టుల వద్ద విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను చేపట్టినా హైకోర్ట్ ప్రతిస్పందించక పోవడం న్యాయవాదుల గొంతు నొక్కడమేనన్నారు. అయితే పరీక్ష జవాబు పత్రాలను మూల్యాకనం చేయొద్దని, ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించడం కొంత సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని కేంద్రంతో చర్చలు జరిపి, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ ఏర్పాటును త్వరితంగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు మాణిక్ ప్రభుగౌడ్, ఎంఎస్ తిరుమల్‌రావు, గోవర్థన్, ఉపేంద్ర, ట్రిబ్యునల్ న్యాయవాద జేఏసీ కార్యదర్శి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

జేసీఏ పరీక్షకు తప్పక హాజరు కండి


జేసీజే పోస్టుల రాతపరీక్షను బాగా రాయాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అభ్యర్థులను కోరింది. జేఏసీ నాయకులు శ్రీరంగారావు, కే గోవర్దన్‌రెడ్డి, అనిల్ మాట్లాడుతూ కొద్దికాలంగా ఈ విషయంలో గందరగోళం నెలకొని ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనకు గురికాకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి