విద్యుత్ వివాదాలకు అజ్యం పోసిన ఏపీ సర్కారు ఉద్యోగుల విభజనలోనూ కోత్త కిరికిరిలకు ఆజ్యం పోస్తున్నది. కార్పొరేషన్ల ఉద్యోగుల విభజన అంశాన్ని కమలనాథన్ కమిటీ సిఫార్సులకు ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. విద్యుత్ ఇంజినీర్ల విభజన అంశంపై ఏపీ ట్రాన్స్‌కో ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన తదుపరి తమ సొంత రాష్ర్టాల్లో పనిచేయాలన్న ఆకాంక్షతో ఇంజినీర్లు ఉన్న నేపథ్యంలో ఉద్దేశ్యపూర్వకంగానే ఉద్యోగుల విభజనను జాప్యం చేస్తున్నారని వారు ఆక్షేపిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో 4,592 మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా, వారిలో 1,100 మంది సీమాంధ్రకు చెందిన వారున్నారు. వీరిలో తొంబై శాతం మంది ఉద్యోగులు విభజన కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం 200 మంది ఇంజినీర్లు మాత్రమే తెలంగాణలో కొనసాగాలని యోచిస్తున్నారు. విద్యుత్‌రంగంలో స్థానికత ప్రామాణికంగా ఇంజినీర్ల జాబితాను విద్యుత్‌సంస్థలు ఇప్పటికే సిద్ధం చేశాయి. అయితే విద్యుత్ యాజమాన్యాలు విధాన నిర్ణయాలు వెలువరించాల్సి ఉంది.
తెలంగాణ జెన్‌కోలో పనిచేస్తున్న సీమాంధ్ర ఇంజనీర్లు వెళ్ళిపోతే సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్(టీఎస్‌పీఈఏ) కొన్ని ప్రతిపాదనలు చేసింది. విద్యుత్ ఇంజినీర్ల విభజన క్రమంలో మంజూరు పోస్టులకు మించి ఉద్యోగులున్నట్లయితే సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సుధాకర్‌రావు, జీ సంపత్‌కుమార్‌లు సూచించారు. విద్యుత్ సంస్కరణల సమయంలో అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్‌కో, జెన్‌కో, ఆనాటి సెంట్రల్ పవర్ డిస్కమ్‌లలో సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించిన విషయాన్ని వారు గుర్తుచేశారు.
విద్యుత్‌లోటుతో ఉన్న తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే చర్యలను నీరుగార్చేందుకే ఏపీ సర్కారు ఉద్యోగుల విభజనను మరింత జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని తొమ్మిది, పదవ షెడ్యూళ్ల స్ఫూర్తికి భిన్నంగా ఏపీ ట్రాన్స్‌కో లేఖ రాయడాన్ని తప్పుపడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు విద్యుత్ రంగంలో ఉద్యోగుల విభజనకు ఎలాంటి పొంతన లేదని, కార్పొరేషన్లు, కంపెనీలు సొంత మార్గదర్శకాలను రూపొందించుకుని ఏడాది కాలంలోగా ఉద్యోగుల విభజన చేసుకోవాలని చట్టంలో స్పష్టంగా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజన చేయాలంటూ ఏపీ ట్రాన్స్‌కో తెలంగాణ ట్రాన్స్‌కోకు లేఖ రాయడంలోని ఔచిత్యాన్ని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి