గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మార్చి 31, 2015

పచ్చకామెర్లరోగికి లోకమంతా పచ్చగానే....

pointblock

సత్య మనృతంబు పరుషోక్తి సరసభాష
ప్రాణిహింసయు దయయు లోభంబు నీఁగి
కనక సంగ్రహవ్యయములు గలుగు వార
రమణికై వడి బహురీతి... రాజనీతి!

రాజనీతి
కొన్నిసార్లు సత్యాసత్య మిశ్రమంగా,
కొన్నిసార్లు నిష్ఠూరంగా, ఒకసారి చెవికింపుగా,
ఒకచోట కఠోరంగా, ఒకసారి దయను చూపుతూ,
మరోసారి ద్రవ్యమాశ చూపుతూ, ఆ తర్వాత వ్యయం కలిగిస్తూ
ఇలా వార రమణిలా నానా విధాలుగా సాగేది రాజనీతి ...

అన్నది భర్తృహరి సుభాషితం. అలాంటి రాజనీతికి స్థిరత్వం ఉండదు. జయాపజయాల ప్రమేయం లేకుండాలోకరీతిని బట్టి సాగిపోవడం రాజనీతిజ్ఞుల లక్షణం. అజ్ఞానులకీ రాజనీతిజ్ఞత అర్థం కాదు. దాని లోతుపాతు లెరుగరు. అందుకే అల్ప విజయాలకే ఎగిరిపడతారు.

అక్కన్న మాదన్నగార్లు అందలం ఎక్కితే..
సాటికి సరప్ప చెరువుకట్ట ఎక్కాడట.. 
ఎవరి ఆనందం వారిది. ఎవరి తృప్తి వారిది. వాళ్లకు అది గొప్ప అయితే ఈయనకిదే మేటి.

రాధాకృష్ణా సరప్ప టైపే. ఇవాళ చెరువు కట్టే ఆయనకు అందలం అయిపోయింది. బీజేపీ గెలుపే పండుగ అయిపోయింది. సరే.. ఆనందించే హక్కు ఆయనకుంది. కాదనంగానీ..ఆ పరవశంలో చెక్కిన కొత్తపలుకులో ఉచితానుచితాలు అటకెక్కించడమే అభ్యంతరకరం. ఏపీలో టీడీపీ ఓటమి చంద్రబాబుది కాదు.. టీచర్లు సేవాతత్పరుడిని గెలిపించి మంచి సందేశం ఇచ్చారట. కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వానికి హెచ్చరిక పంపారట. ఇక్కడ కేసీఆర్ చాలా చాలా నేర్చుకోవాలట.

ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అంతేకాదు కేసీఆర్ చెబుతున్న ఇతర పార్టీలు ఉండకూడదన్న మాటను ప్రజలు తిరస్కరించారట. ఎక్కడ మా అందాల చంద్రబాబు!... అంటూ దేవులాడుతున్నారట. ఈ ఎన్నికల్లో బోలెడంత మనసు పారేసుకున్నారట. బీజేపీ-టీడీపీ కూటమిని ప్రత్యామ్నాయంగా భావించాం పో! అని ఈ ఎన్నిక ద్వారా చెప్పేశారట. ఇక్కడ బోనాలు, బతుకమ్మలు, యాదగిరిగుట్టలతో కేసీఆర్ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఇంకేం చేయడం లేదట. మరీ ఆశ్యర్యకరమైన వ్యాఖ్య ఏమంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవేనట. ఈ ఎన్నికలతోనే టీఆర్‌ఎస్ పని అయిపోయిందట.

మరి మెదక్ ఉప ఎన్నికను ఏ కాకి ఎత్తుకుపోయినట్టు? కంటోన్మెంటు ఎన్నికలను ఏ అనకొండ కబళించినట్టు? సదరు ఎన్నికల్లో రాధాకృష్ణ ప్రవచించిన టీడీపీ-బీజేపీ అనబడే మహా ప్రత్యామ్నాయ శక్తిని ఓటర్లు పెకిలించి బంగాళాఖాతంలోకి విసిరేసిన చరిత్ర ఏమైనట్టు? ఒక పత్రికాధిపతి.. బోలెడంత అనుభవం, అనుభూతులు ఉన్న పాత్రికేయరత్నం అయిన రాధాకృష్ణ ఇది మర్చేపోయినట్టున్నారు. అందుకే కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవేననేశారు.
తెలుగు పాఠకులను దేవుడు రక్షించుగాక! అంతటితో ఆయన అజ్ఞానాంధకారం ఆగలేదు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అస్సలు బలపడలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయట. మా మంచి సీమాంధ్రులు శ్రద్ధగా వెళ్లి కసిగా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారట. వారు కేసీఆర్ మాటలను విశ్వసించలేదని కూడా తేలిపోయిందట. 

మరి ఈ మధ్యే కదా కంటోన్మెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయాలు కూడా నమోదు చేసింది. కంటోన్మెంటులో ఉండే సీమాంధ్రులు సీమాంధ్రులు కానట్టేనా? సరే... అలాగే అనుకుందాం.. మరి రాధాకృష్ణ ప్రవచించిన మహత్తర అరివీర భయంకర ప్రత్యామ్నాయరాజం బీజేపీ-టీడీపీ కూటమి సదరు ఎన్నికల్లో ఖాతా కూడా ఎందుకు తెరువలేకపోయినట్టు? ఎమ్మెల్యేల సంతానాన్ని నిలిపినా, పిట్టర్ బాబులు కోట్లు కుమ్మరించినా ఎందుకు బాల్చీ తన్నేసినట్టు? గుడిసె వాసినుంచి ఆకాశహర్మ్యాల నివాసుల దాకా, నూనూగు మీసాల యువతనుంచి పండు ముదుసల్ల దాకా జనులంతా పాల్గొన్న ఆ ఎన్నికల్లో సాధించిన విజయం...కేవలం పట్టభద్రులకి.. అదీ ఓట్లు ముందస్తుగా నమోదు చేసుకున్న, చేయబడిన గుప్పెడు ఓటర్లకే పరిమితమైన ఒక్క ఫలితంతో తలకిందులై పోయినట్టా? ఈ మాత్రం దానికే తెలంగాణ సెంటిమెంటు పలచబడినట్టా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటమైనట్టా? 

కానని ముఖానికి కప్పే దయ్యమై పట్టిందట..అనే సామెతుంది తెలంగాణలో.

ఎపుడో 2009 తర్వాత ఉప ఎన్నికల నాటినుంచి పచ్చపార్టీ డిపాజిట్లకు మొహం వాచి...వాచి నిద్రాణమై నిర్జీవమై నిరాశలో కూరుకుపోయిన పరిస్థితి. ఎన్ని కుట్రలు వండి వార్చినా బురద చల్లినా అరవై, డెబ్బైవేల మెజార్టీలతో టీఆర్‌ఎస్ జైత్రయాత్రలు నిద్రకు దూరం చేసిన పరిస్థితి. నెర్రలువారిన నేలలో పడక పడక పడ్డ ఒక్క వానచుక్కలాగ ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఓ ముసుగు విజయం. బహశా దాని ఫలితమే తాజా కొత్తపలుకులోని ఆ కప్పగంతులన్నీ. కౌమారంనుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే బాలురకు మూతిమీద మొలిచే రాగిపోగులు ఓ చిత్రమైన సమస్య.

మీసాలు అయినట్టూ కానట్టుగా ఉండే ఆ నూనూగు పోగులను అద్దం ముందు తిప్పి తిప్పి అందాలు చూసుకున్నా.. పదేపదే తడిమి తడిమి , లాగి లాగి నిర్దారించుకోచూసినా నమ్మీ నమ్మలేని వింత అనుభూతి. వచ్చీరాని వయసు కాబట్టి అవి అవేనా? అవి నాకేనా? అని మనసు పీకే ఆశ్చర్యానందాలతో కూడిన అయోమయావస్థ. ప్రస్తుతం రాధాకృష్ణ కూడాగెలుపు మీద అలాంటి సంభ్రమాశ్చర్యాల సందేహాస్పదాంబుధిలో మునిగితేలుతున్నట్టు కనిపిస్తున్నది.

బ్లడ్ గ్రూపు.. టీ -నెగిటివ్
బ్లడ్ గ్రూపుల్లో ఏ, బీ, ఏబీ అని ఓ పాజిటివ్, నెగిటివ్ అని...ఇలా గ్రూపులుంటాయి. కానీ రాధాకృష్ణది మాత్రం టీ నెగిటివ్ గ్రూపు. మూత్ర పరీక్షలని, రక్త పరీక్షలని, సీటీ స్కాన్ అని.. ఇలా అనేక రకాల పరీక్షలుంటాయి వైద్యపరీక్షల్లో. మీరు ఏ పరీక్ష చేసినా రాధాకృష్ణకు వచ్చే రిపోర్టు మాత్రం ఒకటే. తెలంగాణ వ్యతిరేకత. అందుకే ఆయనకు తెలంగాణ వచ్చాక ఎన్ని ఎన్నికలు జరిగాయో గుర్తుకు రాలేదు. టీఆర్‌ఎస్ గెలుపులు.. తెలంగాణ వ్యతిరేకుల దారుణ పరాజయాలు తట్టనే లేదు. కేవలం అస్మదీయులు గెలిచిన ఒక్క ఎన్నికే మనసుకు వచ్చింది.

ఆ వ్యతిరేకత ఆయనలో ఎంతగా జీర్ణించుకుపోయిందంటే తెలంగాణ ఉద్యమం మొదలైన నాటినుంచి రాధాకృష్ణ అంటున్నది ఒకే మాట. ..ఉద్యమం వేడి ఎంతకాలం ఉంటుంది? సెంటిమెంటు ఎక్కువ కాలం నిలవదు అనే మాట. ఆయన దృష్టిలో తెలంగాణవాదం ఏదో నలుగురు కూడి చేసే అల్లరి. నాలుగురోజుల్లో చల్లారిపోతుంది. పాపం గత 14 ఏండ్లుగా అదే మాట మీద నిలబడ్డారు. ఎప్పటికైనా నిజం కాకపోతుందా అని కలలు కన్నారు. కాకపోతే వేసివేసి ఆ రికార్డు అరిగిపోయింది.. విరిగిపోయింది. కానీ తెలంగాణవాదమే చెక్కుచెదరలేదు. అయినా సరే.. సెంటిమెంటు చల్లారకపోతుందా? కేసీఆర్ బలహీనపడక పోతాడా? అన్నదే ఆయన ఆశ. అందుకే ఈ ఒక్క ఫలితంతో ఆనందాలు అవధులు దాటిపోయి సెంటిమెంటు తగ్గిపోతున్నది అంటూ గంతులేశాడు.

నాలుగుసార్లు రాస్తే నిజమని ప్రజలు నమ్మేయకపోతారా అన్నది ఆయన ఆశ కావచ్చు. కానీ రాధాకృష్ణ లాంటి వాళ్లు ఉన్నంతకాలం ఆ సెంటిమెంటు కచ్చితంగా ఉండి తీరుతుంది. పీడకలగా మారిన తెలంగాణ రాష్ర్టాన్ని దెబ్బ కొట్టడానికి రాధాకృష్ణ వేయని ఎత్తులేదు. రాష్ట్రం వచ్చీరాగానే కరెంటు లేక పరిశ్రమలు తరలిపోతున్నాయోచ్ అంటూ ఎన్ని రాతలు? ఫార్మా అయిపోయింది.. ఇక కర్నాటకే కేరాఫ్ అంటూ ఎన్ని కుట్రలు. అదిగో ఏపీకి స్పెషల్ స్టేటస్... ఇదిగో తెలంగాణ పరిశ్రమలు తరలిపోతున్నాయ్ అంటూ ఎన్ని వార్తలు. శ్రీశైలం నీరు విద్యుత్‌కు వాడితే వ్యతిరేక ప్రచారం. సాగర్ నీరు తరలింపును ఆపితే దుష్ప్రచారం. మెట్రో రైలు మీద దుమారం. పాలమూరు పథకాల మీద బురద. ఇవన్నీ చెప్తున్నవి ఏమిటి? ఆ కలం తెలంగాణ మేలు కోరదు. ఆ పలుకు ఇక్కడి ప్రజల అభ్యున్నతిని సహించదు. తెలంగాణ వచ్చిన 9 నెలల్లో ఈ గడ్డకు మేలు చేసే వార్త ఒక్కటన్నా రాశారా? వేశారా?

"....చీడపుర్వు దాఁ
జెడఁ దిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే?
పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!"
అన్నాడు భాస్కర శతకకారుడు.. చీడపురుగు చెట్టును తొలిచివేస్తుందే కానీ చేరెడునీళ్లు పోసి పెంపు సేయదు కదా!
-సవాల్‌రెడ్డి



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి