"తెలంగాణ రాష్ట్రం" ఏర్పడనున్న తరుణంలో, సీమాంధ్ర సర్కారు, జీవోఎంకు సమర్పించిన నీటి పంపకాల దొంగలెక్కల చిట్టా ప్రకారం, నీటి పంపకాలు జరిగితే, తెలంగాణా...నీటి హక్కులకోసం, మరో 37 ఏళ్ళవరకు, కనీసం పోరాటం జరిపే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది! తస్మాత్ జాగ్రత...జాగ్రత!! - "ఏది సత్యం?" బ్లాగు సౌజన్యంతో...>చూడుడు: edisatyam.blogspot.in (dt.20-10-2013)
మన తెలంగాణమును మోసమందు ముంచఁ
బూని, సీమాంధ్ర మంత్రులు వోయి వేగ
కేంద్ర మంత్రి వర్గమ్మున కిచ్చినట్టి
నీటి వినియోగ వివరాలు “నీటి లెక్కె!” (1)
మన తెలంగాణమునఁ బాఱు మన నదీ జ
లముల దొంగ కేటాయింపు లన్ని చూపి,
యింకఁ దెలగాణ వనరుల నెంత దోచు
కొనఁగఁ గోరిరో సీమాంధ్ర క్రూర ఘనులు? (2)
మన నమాయకులను జేసి, మన వనరుల
మనకుఁ గాకుండఁ జేయంగఁ, గనుచు, నోరు
మెదప కుండిన తెలగాణ మిన్నలైన
మంత్రి వర్యుల చర్యలు మంచి వగునె? (3)
నోరు మెదపక యున్నచో నీరు వోయి,
యచటి సీమాంధ్రఁ బాఱు; నిచట మనకుఁ
బంట లెండును; కడుపెండు; భవిత యెండుఁ;
బూర్తి తెలగాణ మెండును; పోరు మిగులు! (4)
నీర మనఁగాను జీవమ్ము! నీరు లేక
జీవన మ్మెట్లు నిలుచును? నీవు, నేను,
మనము, తెలగాణ రాష్ట్రంపు జనులు లేరు!
కాన, నీటికై పోరున కరుగ వలయు!! (5)
కండ్లు తెరువుండు తెలగాణ కార్యకర్త
లార! రాఁబోవు గండమ్ము లన్ని కనుఁడు!
మేలుకొని, తగు చర్యలు కీలు కొలిపి,
ఘన తెలంగాణఁ గాపాడఁ గాను రండు!! (6)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
13 కామెంట్లు:
కాకి లెక్కలు తయారు చేయడంలో మహాదిట్టలు వారు. 10 మంది వాళ్ళు ఉంటే ఏ ఒక్కరిద్దరో తెలంగాణా వారు ఉంటారు. బలం వారి చేతిలో ఉండి దశాబ్దాల నుండి తెలంగాణాకు అన్యాయం చేస్తున్నారు. పోలవరం విషయంలో వెళ్లి పరిశీలంచ కుండా కూచున్న దగ్గరనే తప్పుడు లెక్కలు తయారు చేయటం ఎన్నో చూశాను. ఎంత భయపెట్టినా, ఎన్ని సార్లు పరిశీలించామన్నా అవే తప్పుడు లెక్కలే ఉంటాయి. ఇపుడు కేంద్ర మంత్రుల పరిశీలక బృందానికి ఎలాంటి లెక్కలు పంపుతున్నారో, తెలంగాణాకు ఎంతటి అన్యాయం చేయనున్నారో తలచుకుంటేనే భయం వేసే విషయం. అయినా ధర్మం తెలంగాణా పక్షమే ఉంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా భవిష్యత్తులో తెలంగాణా ఉజ్వలంగా వెలిగిపోవటం సత్యం.
చివరగా తమరి నోటి వెంట వెలువడిన మాటలే నాకు కొంత ఉపశమనాన్నిస్తున్నాయి! ఎందుకైనా మన నేతలు, మేధావులు, కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తులుగా ఉండి, సీమాంధ్ర కపట నాటకాన్ని బట్టబయలు చేస్తే...కేంద్రానికి వాళ్ళ నిజస్వరూపం తెలిసి, మన పట్ల ఉదార భావంతో మెలగుతారేమోననే ఆశ నాలో ప్రబలంగా ఉంది. చూడాలి ఏమవుతుందో?
మీరేమి అనుకోకండి...ఏమీ అధ్బుతాలు జరిగిపోవు...భయం లెదు...ఆశా అక్కరలేదు!!చరి త్రను క్షుణ్ణంగా చూడండి...మళ్ళీ నన్ను ఖండిస్తారు...అయినా ఏమీ జరగదు...వందేళ్ళు పోయినా కూడా...వనరుల పై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరిది!!అవకాశాలను అందిపుచ్చుకోవడం తెలివైన వాడి పని!! ఆయన తెలివైన వాడు!! మీరూ సామాన్యులే..నేనూ సామాన్యుడినే!!మళ్ళీ నన్ను ఖండిస్తారు...అయినా ఏమీ జరగదు...వందేళ్ళు పోయినా కూడా...ఆంధ్రాను వంద ముక్కలు చేసినా సామాన్యుడికి...అంతే సంగతులు...వీడి స్థానం లొ మరోకడు వస్తాడు...మనల్ని పీక్కు తిండానికి!!
ఆంధ్రాను పీక్కు తిననీ...మా కభ్యంతరం లేదు. మా తెలంగాణను దోచుకుంటా మంటే మాత్రం మర్యాద దక్కదు.
"ఆయన తెలివైనవాడు"
అది తెలివికాదు. పైశాచిక నైజం. కుక్కబుద్ధి! దోపిడీ చేస్తున్నావు కాబట్టే విడిపోతున్నాం అన్నా "కనకపు సింహాసనమున శునకముఁ గూర్చుండఁ బెట్టి"తే వెనుకటి గుణం మానుతుందా? ఇప్పటికీ అదే బుద్ధి చూపించుకుంటున్నారు.
వందేళ్ళు కాదు...వాళ్ళకు కాలం మూడింది...చూస్తూ ఉండండి.
స్పందించినందుకు కృతజ్ఞతలు!
>ఆంధ్రాను పీక్కు తిననీ...మా కభ్యంతరం లేదు
ఒక్క మాట చాలు నూహల తీరును
పట్టి చూప నిట్టి పాడుమాట
పలుకువారి కింక భగవంతుడొక్కడే
కరుణజూపి మంచి గరపవలయు
మిత్రులు శ్యామలీయంగారూ! తమరు నా వ్యాఖ్యకన్న ముందు వ్యాఖ్యను గమనించకయే నిందిస్తున్నారు. మీ వ్యాఖ్యారూప పద్యంలోని మీ ఆంతర్యం ఆ వ్యాఖ్యాతకే దక్కుతుంది. ఆ వ్యాఖ్య చివరి మాటలు తిలకించండి...
"వందేళ్ళు పోయినా కూడా...ఆంధ్రాను వంద ముక్కలు చేసినా సామాన్యుడికి...అంతే సంగతులు...వీడి స్థానం లొ మరోకడు వస్తాడు...మనల్ని పీక్కు తిండానికి!!" ఇవి ఒక అజ్ఞాత మాటలు. దాని స్పందనే నా వ్యాఖ్య.
అఱువ దేండ్ల నుండి యష్ట కష్టాలను
బడుచు నున్న మమ్ముఁ బాప మనక,
దోచుకొనెడి వానిఁ గాచఁగఁ బూనంగ
న్యాయమౌనె మీకు నయవిచార!
ఒక కులపోళ్ళ ధన దాహం,దోపిడీ,వాళ్లను చూసి మరి మాకో?అంటూ సింహాసనం ఎక్కి వీళ్ళు.పదేళ్ళ పాటు దోచుకుని...దేముళ్ళంటూ దండాలు పెట్టించుకుంటున్నారు...నిర్బయంగా నిజాలు ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు?ఈ పదేళ్ళలో...ఈ పదేళ్ళలోనే...ఎంత గూండాగిరీ చేసారు?రియల్ ఎస్టేట్ అని కానీయండి...మరొకటని కానీయండి...పట్ట పగ్గాల్లేకుండా హైద్రాబాద్ ని లూటీ చేసారు గా?తమ వనరులు తమ కళ్ళెదుటే దోచుకు పోతుంటే?కడుపు మండదా?సమస్యకు మూలం ఉంది.దాన్ని మరుగున పరిచి అనవసరమైన వాదనలెన్ని చేసినా ప్రయోజనం శూన్యం.సీమాంధ్ర పెట్టు బడిదారుల ఆధిపత్యాన్ని,దోపిడీని ప్రశ్నిస్తున్నారే కానీ...సీమాంధ్రులను కాదు.సరి దిద్దుకోలేనన్ని తప్పుల్ని ఈ పెట్టుబడిదారులు చేశారు!అది ఎవరన్నదీ సీమాంద్రులకు తెలుసు...రాష్ట్రం విడిపోతుందన్న ఆలోచనా, అవకాశాలు తగ్గిపోతాయన్న బెంగా సీమాంధ్రులను అతలాకుతలం చేస్తున్నాయి.ఈ రాష్ట్రం లోని సంపద అంతా కొంత మంది చేతుల్లోనికే పోయింది!పోతోంది!కాదంటారా?
మధుసూదన్గారూ,
మీరూ, మీ వ్యాఖ్యాతలూ మాటల యుధ్ధం చేసుకోవటం గమనించాను. ఆవేశంతో మాటలు విసరటం ఎవరికీ శోభనీయదు.
మిమ్మల్ని నేను నిందిచానని మీరు భావిస్తే క్షంతవ్యుడను. ఎవరిని నిందించటమూ, ఎవరిని ఎద్దేవా చేయటమూ, ఏ పక్షం నాశనం కోరుకోవటమూ నా తత్త్వం కాదు. ఇప్పటికే రాజకీయ నాయకుల నిర్వాహకత్వం కారణంగా ప్రజలమధ్య వైషమ్యాలు ముదురుతున్నాయి.
క్రాంతదర్శనులూ, సకలజనసంక్షేమకారులూ కావలసిన కవులు కూడా ప్రాంతాలవారీగా విడిపోయి శాపనార్ధాలకు దిగటమూ, రణన్నినాదాలు చేయటమూ అంత సముచితంగా నాకు అనిపించటం లేదు. దీర్ఘకాలికమైన తెలుగుజాతి ఐక్యతను దృష్టిలో పెట్టుకోవలసి ఉందని మాత్రం నేను ఉభయపక్షాల సమరవీరాలాపాలు చేస్తున్నవారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరొక్క సారి మనవి చేస్తున్నాను. దుడుకుమాటల్ని ప్రయోగించే వారికి, వాటిని పరిహరించుకునే లసద్బుధ్ధిని భగవంతుడు దయచేసి అందివాలని అన్నానే కాని అన్యంగా ఏమీ అనలేదు. దయచేసి,
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే
అన్న గీతాకారుడి హితవును అనుసంధానం చేసుకోండి. మీరు పద్యసాహిత్యాభిమానులు, స్వయంగా కవిత్వం కూడా వ్రాస్తున్నారు చక్కగా. కవిత్వం చెప్పటమూ నాకు తెలిసి నంత వరకూ ఒక వాఙ్మయతప్పస్సే. అందమైన కవిత్వమూ, ఆవేశపూరితమైన కవిత్వమూ సమకాలీనుల మెప్పు సాధించవచ్చును. కాని లోకక్షేమం కోసం ఒక మహాముని వాఙ్మయయజ్ఞం చేస్తున్నట్లుగా కవి స్థిరమూ శాంతమూ ఐన చిత్తంతో చేసే సాహిత్యసృష్టి బహుకాలం నిలిచి ఉంటుంది. నేను మీకు చెప్పగలవాడను కాకపోవచ్చు. కాని నా దృక్పధం తెలియ జెప్పుకుందుకు మాత్రం ఈ మాట చెప్పవలసి వచ్చింది. అవినయంగా భావిస్తే మరొక్క సారి క్షమించండి.
చూడండి శ్యామలీయంగారూ, అన్యాయం చేసేవాడికంటే దాన్ని చూస్తూ సహించేవాడే నిజమైన దోషి. అరవై యేండ్లనుండీ అన్యాయానికి గురి కాబడటం వల్లనే తెలంగాణ ఉద్యమం రగులుతున్నది. అన్యాయానికి ముగింపు లేకుండా కొనసాగుతోంది. మా తెలంగాణ వారికి ఎంతటి అన్యాయం జరిగిందో జగమెరిగిన సత్యం. ఈ అకృత్యాలను చూస్తూ కూడా మీలాంటి మేధావులు ఏ విధంగానూ అడ్డుకొనలేకపోయారు. అంటే అన్యాయం చేసినవారితో పాటు మీరు కూడా దోషులేనని మేం భావించవలసి ఉంటుంది. ఎన్ని అన్యాయాలని మేం సహించాలి? అన్యాయాల సుడిగుండాల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాం. మీరు ఒడ్దున నిలబడి చోద్యం చూస్తున్నారు. మా కష్టాలు మీకేం తెలుస్తాయి? బానిస బతుకులు మావి. స్వతంత్ర జీవనం మీది! తెలుగుజాతి ఐక్యత గురించి మీరు మాట్లాడటం చూస్తే మీరు తెలిసే అంటున్నారో తెలియక అంటున్నారో అర్థంకావడం లేదు. ఐక్యంగా ఉండాలనుకునేవారు స్వార్థపరులై ఒక ప్రాంతాన్ని దోపిడీ చేయరు. మాకు జరిగిన అన్యాయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని, ప్రేమభావంతో, మైత్రీభావంతో సమస్యను తొలగించడం కోసం కృషిచేస్తారు. మాకు ఉద్యోగాలలోనూ, విద్యలోనూ, నీటి వనరుల విషయంలోనూ, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి విషయంలోనూ, నిధుల వినియోగం విషయంలోనూ…ఎన్నని చెప్పను? అన్నిట్లోనూ వివక్ష, దోపిడీ జరిగింది…జరుగుతోంది కూడా! నిన్నగాక మొన్న…నీటి వనరుల విషయంలో…కేటాయింపులు లేకున్నా…ఉన్నట్టుగా కూట కల్పిత కేటాయింపుల జాబితా…కేంద్ర మంత్రివర్గ కమిటికి సీమాంధ్ర సర్కారు అందజేసింది. ఇది అబద్ధం అంటారా? ఇంకెంతకాలం దోపిడీ చేస్తారు? ఇంత జరుగుతున్నా మేం శాంతి, సహనం అంటూ మీరు చెప్పినట్టుగా నిష్క్రియాత్మకంగా ఎలా ఉండాలి? కవులు క్రాంతదర్శులు…సకలజనసంక్షేమకారులు కాబట్టే…ఒక ప్రాంతం వారు అన్యాయానికి గురవుతుంటే…వాళ్ళను మేలుకొలుపవలసిన అవసరం ఏర్పడింది! మాది ఆవేశమో, ఆవేదనో అర్థం చేసుకోలేనివారా మీరు? ఆవేదనతో తగిన విధంగా ప్రతిక్రియలు చేయడం మీకు ఆవేశంతో కూడినట్టుగా కనబడడం దురదృష్టకరం. మీ ప్రక్కనున్నవాడు మీ కళ్ళ యెదుటే దోపిడీ చేస్తుంటే..మీరు… అడ్డుకోకుండా…ఎదుర్కోకుండా…పదిమందిని పిలవకుండా…ప్రతిఘటించకుండా…ఏ ఆందోళన చెందకుండా…అనుద్వేగులై…ఊరకే చూస్తూ ఉంటారా…లేకుంటే….మూతిమీద ఈడ్చి ఒక్కటిస్తారా? మీరే చెప్పండి. మేం ఎంతో శాంతం వహించి ఉన్నాం. కేంద్రం మాకు జరిగిన అన్యాయాన్ని గ్రహించింది కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై కృషి చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటు కాకుండా సీమాంధ్ర అవకాశవాదులు అడ్దుపడుతున్నారు. వారిని ప్రతిఘటించకపోతే…మేం మట్టికొట్టుకుపోతాం. మా స్థానంలో ఉండి ఆలోచించండి…మీకే అర్థం అవుతుంది! గీతావాక్యాన్ని ఉదాహరించి, మీరు పద్యసాహిత్యాభిమానులు, కవిత్వం కూడా రాస్తున్నారు...ఉద్వేగ పూరితమైన దుడుకుమాటల్ని ప్రయోగిస్తున్నారు…అని నన్ననడం బాధాకరం. నేనింతకుముందే చెప్పాను…మీ కళ్ళ యెదుట దోపిడి జరుగుతుంటే…మీరు గీతా వాక్యాన్నే వల్లెవేస్తారా…నిష్క్రియాత్మకంగా ఉంటారా..అని? అన్నీ అర్థం చేసుకొనేవారికే ఎవరైనా చెప్పగలుగుతారు. ఇప్పుడు మీరైనా చెప్పవలసింది…సీమాంధ్ర నేతలకు…అవకాశవాదులకు…మాకు కాదు. నా మాటలు మిమ్మల్ని నిందించినట్టుగా ఉన్నాయనుకుంటే పొరపాటే..! ఈ మాటలు ఆవేదనలోంచి వస్తున్నాయి. మిమ్మల్ని నిందించటం కూడా నా అభిమతం కాదు. అన్యాయంగా నన్నంటున్నందుకు కలిగిన ఆవేదన. మీరన్నట్టు.."లోకక్షేమం కోసం ఒక మహాముని వాఙ్మయయజ్ఞం చేస్తున్నట్లుగా కవి స్థిరమూ శాంతమూ ఐన చిత్తంతో చేసే సాహిత్యసృష్టి బహుకాలం నిలిచి ఉంటుంది" అనేది అక్షర సత్యమే అయినా...అన్యాయానికి గురైన వారిని ప్రబోధించడం తక్షణ కర్తవ్యం. మేం స్థిర పడిన తర్వాత స్థిరమూ, శాంతమూ గల చిత్తము నాకు కలుగుతుంది. తెలంగాణ ఏర్పడేంతవరకూ కవులు కర్తవ్య ప్రబోధకులుగానే ఉండాలని నా భావన... నేనూ అలాగే ఉంటాను..తెలంగాణ ఏర్పదినప్పుడే నా మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అప్పుడే మీరన్న ఉదాత్తాశయాల సాధనకై సత్కవిత్వానికై కృషిచేయగలుగుతాను. తాము దయతో నా ఆవేదన అర్థం చేసుకొని సహకరించగలరు..స్వస్తి.
నా వ్యాఖ్యకు మీరు ఒక టపా అంత సమాధానం ఇచ్చారు. నేను మాత్రం క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి విరమిస్తాను చర్చనుండి.
మీ ఆవేదన నాకు అర్థం అయింది. మీది అనుముంటున్న ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి మీరు తీవ్రంగా స్పందిస్తున్నారు. మీ స్పందనను నేను తప్పుబట్టటం లేదు - మీరు పరుషమైన భాషను వాడటం ద్వారా మంచి పని చేయటం లేదని అంటున్నాను. "ఆంధ్రాను పీక్కు తిననీ...మా కభ్యంతరం లేదు" అనటం దుడుకుతనమే అని నేనంటే ప్రబోధించటం అని మీరంటున్నారు. కనీసం ఇటువంటి వాగ్విన్యాసం ప్రబోధించటంగా భావించలేను క్షమించండి . నా అభిప్రాయం మీకు రుచించలేదంటే దానికి మీ అవేశపూరిత మానసికస్థితి కారణం. వదిలెయ్యండి.
నా కళ్ళ యెదుట దోపిడి జరగ టం లేదని నేనూ అనుకోవటం లేదు. ఈ అరవై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొత్తం రాష్ట్రం అంటేనే హైదరాబాదు అన్నట్లుగా గద్దెకెక్కిన రాష్ట్రప్రభుత్వాలన్నీ వ్యవహరించాయి. సీమాంధ్రలోనూ తెలంగాణాలోనూ కూడా ఇతర నగరాల అభివృధ్ధి పట్లు ఏ మాత్రం దృష్టి పెట్ట లేదు. నేను పుట్టి పెరిగిన ప్రాంతం నలభై ఏళ్ళ కంటే ఇప్పుడు అధ్వాన్నమైన స్థితిలో ఉంది. తెలంగాణాలోనే కాదు రాయలసీమలోనూ, ఉత్తరాంధ్రలోనూ అభివృధ్ధిని ఎవరూ పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాదే అన్నట్లు అంతా వ్యవహరించారు. చాలా పెద్దతప్పు అది.
మీరు ప్రజలను దోపిడీదారులు అనటం హర్షించలేను. "సీమాంధ్రలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణా ద్రోహులు" వంటి మాటలు మీకు కర్ణపేయంగా ఉండవచ్చును కాని కోట్లాది మంది ప్రజలకు ఆవేదన కలిగిస్తాయని తెలిసీ తెలంగాణా వాదులు ఎవరూ ఖండించలేదు. ఎందుకంటే దాదాపు మీ అందరిదృష్టిలోనూ సీమాంధ్రు లంతా తెలంగాణాకు ద్రోహంచేయటానికే పుట్టిన ద్రోహులన్న అభిప్రాయం ఉంది కాబట్టి! ఇటువంటి భావజాలాన్ని వెలిబుచ్చటమూ వ్యాప్తిచేయటమూ దుడుకుతనం కాదని మీరనుకుంటే మీ యిష్టం. ఇవి ప్రజలమధ్య దూరాన్ని పెంచటం తప్ప మరే ప్రయోజనాన్నీ సాధించవు. తాత్కాలికంగా తెలంగాణా వాదులకి మరింత ఉత్తేజం కలిగించవచ్చును. కాని దీర్ఘకాలికంగా దుష్ఫలితాలే ఇస్తాయి. ఒకానొకరు నాకు ఈ ఆరోపణకు తీవ్రంగా స్పందిస్తే మరింత రచ్చ తప్ప మరేం మేలు కలుగుతుందీ? ఎవరికి కలుగుతుందీ?
కేంద్రం మీ తెలంగాణావాదం పట్ల సానుభూతితో రాష్ట్రాన్ని ఇస్తోందని ఆనందిస్తున్నారు. తన అవసరాలకోసం కక్కుర్తిపడి ఇస్తోందని ఇతరులు అనుకుంటున్నారు. నేను రెండు అభిప్రాయాలతోనూ ఏకీభవించటం లేదు. రాష్ట్రం కోసం ఉద్యమించేందుకు తెలంగాణావాదులకు ఎంత హక్కు ఉందో, దాన్ని నిరోధించేందుకు ప్రయత్నించటానికి ఆవలి పక్షానికీ అంతే హక్కు ఉంది. నేను రెందు పక్షాలపట్లా ఉదాసీనంగా ఉండే హక్కునూ కలిగి ఉన్నాను కూడా. మీకు నచ్చని పనులు చేసే హక్కు ఎవరికీ ఉండరాదనటం సరియైన వాదం కాదు. నిదానించండి.
కవులు ఎప్పుడూ కర్తవ్యప్రబోధకులుగానే ఉండాలి. ప్రబోధకులు ఆవేశంతో వ్యవహరిస్తే చేసే ప్రబోధం దారితప్పే అవకాశమే హెచ్చు. నేను గీతావాక్యాన్ని ఉటంకించటాన్ని నిస్క్రియత్వాన్ని అభిలషించటంగా మీరు భావించటం పొరపాటు. మీ ఆవేశపూరితస్థితి కారణంగా సరిగా అర్థం చేసుకోలేక పోతున్నారు. నా దృక్కోణంనుంచీ పుంఖానుపుంఖాలుగా వా వాదన నేను వినిపిస్తూ వ్యాసాలూ వ్రాయగలను, పద్యకవిత్వమూ వచనకవిత్వమూ చెప్పగలను కూడా. కాని అలా చేయరాదని నిర్ణయించుకున్నాను. కలుషితంగా ఉన్న వాతావరణంలో అవతలి వాళ్ళు ఏం మాట్లాడినా "విషం కక్కారు" లాంటి మాటలతో సత్కారాలు చేస్తున్నారు. అలా బిరుదప్రదానం చెస్తున్నవారిలో కవులూ ఉన్నారు, వారిలో కొందరికి అందమైన బిరుదులూ ఉన్నాయి. లేనిది సమదృష్టి ఒక్కటే!
మీరు మీ సమాధానం మొదట్లో "ఈ అకృత్యాలను చూస్తూ కూడా మీలాంటి మేధావులు ఏ విధంగానూ అడ్డుకొనలేకపోయారు. అంటే అన్యాయం చేసినవారితో పాటు మీరు కూడా దోషులేనని మేం భావించవలసి ఉంటుంది" అన్నారు. సంతోషం. ఏ పక్షం వారైనా సంయమనంతో మరొకరు ఏమి చెబుతున్నారో వినే పరిస్థితి లేనేలేని వాతావరణంలో మౌనాన్ని ఆశ్రయించక తప్పట్లేదు. నేను ఎప్పుడూ ఒకే విషయం మీద స్పందిస్తున్నాను వీలైనప్పుడు. మీమీ వాదనలు సమర్థంగా వినిపించండి. శేషం కోపేన పూరయేత్ అన్నట్లుగా త్వంశుఠః అంటే త్వంశుంఠః అని నిందలు చేసుకో నవసరం లేదు. తప్పులు అన్ని వైపులా ఉండవచ్చును. చర్చలను నిందాలాపాలు నడపనూలేవు ముగించనూ లేవు. అసలు చర్చించుకుందుకు ఎవరూ సన్నధ్ధంగా లేని వాతావరణంలో ఎవరూ వేలు పెట్టి ఉపయోగం ఉండదు.
మధుసూదన్గారూ, ఇలా మనం ఎంత చర్చించుకున్నా ఉపయోగం ఉండదని అనిపిస్తోంది. కాబట్టి చర్చ ముగిద్దాం. ఏ మంటారు?
శ్యామలీయంగారూ, క్లుప్తంగా రాస్తానంటూనే మీరూ ఒక టపా అంత వ్యాఖ్య రాశారు! నేను క్లుప్తంగా రెండు విషయాలు చెప్పి ముగిస్తాను.
1. నేను మమ్మల్ని దోపిడీ చేసిన సీమాంధ్ర నేతల్ని, పెట్టుబడిదారుల్ని, అవకాశవాదుల్ని మాత్రమే దోపిడిదారులని అన్నాను. ఈ దోపిడీతో సంబంధం లేని సీమాంధ్ర ప్రజల్ని కాదు.
2. నేను ఆవేదనతో రాశానన్నాను గాని, ఆవేశంతో రాశాననలేదు. కవికి ఆవేశంగానీ, ఆవేదనగానీ ఉంటేనే కవిత్వం పుడుతుంది. కవితావేశం...భావావేశం...అని పెద్దలు ఊరకే అనలేదు.
3. నేను పద్యాల్ని ఈ బ్లాగులో స్వోత్కర్ష కోసం రాయడం లేదు. మీ రచనా వ్యాసంగ స్వోత్కర్ష ఇక్కడ అప్రస్తుతం.
4. మేం దోపిడీకి గురికాబడ్డా, మమ్మల్ని సీమాంధ్రులు "తెలబాన్లు’ అన్నా మేం నొరు మెదపరాదు. నోరు మెదిపితే దుడుకు మాటలు, ఆవేశపూరితులు. ఇదెక్కడి న్యాయం?
(ఈ బ్లాగులో సీమాంధ్రులు..ఎన్నో...నోటితో చెప్పరాని మాటలతో వ్యాఖ్యలు పెట్టారు. వాటికి మేం ఎలా స్పందించాలి? ఇలాంటివి దుడుకు చేతలుకావా?)
5. మనం ఎంత చర్చించుకున్నా ఉపయోగం ఉండని అంశం గురించి మీరెందుకు చర్చించారో...బహుశః నన్ను దుడుకు వాడని నిరూపించడంకోసమా? నేను వ్యాఖ్యననుసరించి సరిగానే వ్యవహరించాను. ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. పశువును దుడ్డుతోనే అదుపుచేయాలి. లేకుంటే ఈ లోకం అణచివేస్తుంది...మమ్మల్ని దోచుకున్న దోపిడీదార్లలాగా...! అందువల్ల నేను సరిగా వ్యవహరించినా, దుడుకువాడిలా మీ కంటికి కనిపిస్తే అని మీ దృష్టికోణం అని సరిపెట్టుకుంటాను.
ఉంటాను. స్వస్తి.
Sir,
Mimmulani vere blogs lo edo annaranai feel kaakundi. alanti kukkalu moruguthuntayi.
Meeru peddhvaaru. alanti vaatini pattinchukokandi. mee venuka memu unnamu.
Mandhubabuగారూ! నన్ను గురించి వేరే బ్లాగులలో ఎవరో ఏమో అన్నారని నేను బాధపడను. ఎవరి సంస్కారం వారిది. స్పందించినందుకు ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి