వసంతతిలకా వృత్తము:
ఓ హేవిళంబిరొ మహోత్తమ మిట్టి వేళన్
మాహాత్మ్య మొప్పఁగను మాన్యతలన్ గొనన్, మే
మూహించనట్టి గతి మోదము నందఁజేయం
గోహో వసంతతిల కోద్ధృతిఁ జూప రావే!
సుగంధి వృత్తము:
మందమందమౌ సుగంధ మారుతమ్ము వీవఁగా
విందుఁగూర్చు పూవుఁదేనె వేగఁ జేకొనంగ, నా
నందమంది బంభరమ్ము నాట్యమాడి పాడఁగా
సందడింప, హేవిళంబి సంతసానఁ బ్రోచెడిన్!
మత్తకోకిలా వృత్తము:
గున్నమావి పసిండి పిందెలఁ గ్రొత్త కోర్కెల మొగ్గలన్
మిన్నయౌ సొగసుల్ ధరించియు మించినట్టులు పూవులన్
వన్నె చిన్నెల హేవిళంబిటఁ బచ్చ యంద మెలర్ప, సం
పన్నమై సను లేఁజిగుళ్ళను మత్తకోకిల మేసెగా!
ధ్రువకోకిలా వృత్తము:
కనఁగ వేడుచు మించు కోర్కెనుఁ గన్నులకుఁ దా విందొసం
గనుఁ, బసందగు వేపపూఁతల, కమ్ర నింబ తరూత్తమల్,
సునయనమ్ముల వెల్గఁజేసెడు చూతవృక్ష రసాలముల్
వనులఁ గాంచియు సంతసమ్మునఁ బాడెరా ధ్రువకోకిలల్!
మానినీ వృత్తము:
కాననమందు శుకాళి పికాళులు గారవ మొప్ప నగమ్ములపై
మే నలరంగను మేలుకొనంగను మిన్నులు ముట్టెడు మేళములన్
వీనుల విందుగ వీణియ మీట విభిన్న విధమ్ముల వించు నిఁకన్
మానినులున్ విసుమానము హెచ్చ నమంద ముదంబునుఁ బొందిరయా!
మందాక్రాంతా వృత్తము [పంచపాది]:
ప్రొద్దుల్ వోయెన్ బదమనుచుఁ బూఁబోండ్లతోఁ బోరు భర్తల్
ముద్దౌ చేఁతల్ హసనములతో ముచ్చటల్ సెప్పు బాలల్
విద్దెల్ వెల్గన్ విలువ పెరుఁగన్ విద్య బోధించు నొజ్జల్
పద్దెమ్మిందున్ స్వరచితములన్ బండితుల్ వే బఠింపన్
సుద్దుల్ వించున్ సకల జనులున్ జొక్కి రీ హేవిళంబిన్!
మాలినీ వృత్తము:
పలువుఱిట యుగాదిన్ బార్వతీశున్ రమేశున్
నలువ నెపుడుఁ గొల్వన్ నాస్తికత్వ మ్మణంగున్!
కలలు నిజము లౌచున్ గాంక్షితమ్మే ఫలింపన్
విలువలఁ గొన రారే మాలినుల్ హేవిళంబిన్!!
ఉత్పలమాలా వృత్తము:
తీయని చైత్రమాసమున దిక్కుల నామని శోభ వెల్గఁగా,
హాయియు శ్రోత్ర పేయము శుకాళి పికాళుల గానరావముల్
శ్రేయ మొసంగ, నుత్పలము శ్రేష్ఠతరమ్మగు స్వాగతమ్మిడన్,
బాయని పోఁడిమిన్ సతత వందిత రాఁగదె హేవిళంబిరో!
మంగళమహాశ్రీ వృత్తము:
మానిత యుగాది! సుసమంచిత గుణాత్మక విమర్శనము సర్వజనకోటిన్
ధ్యానవహ ధీమహిత దాతృగుణ మాత్మగత దైవకృప రక్షణము సేయన్,
జ్ఞానము భవిష్యము వికాసము ధనాప్తత సుఖాప్తతలు శాంతుల నిడంగన్,
మేనఁ గలుషాలు విడి, మీఱెడి చిరాయు విడు మెప్పుడును మంగళమహాశ్రీ!
స్వస్తి
మధురకవి గుండు మధుసూదన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి