గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 21, 2015

అప్పుడు వినిపించని నిరసన స్వరాలు...ఇప్పుడెందుకు వినిపిస్తున్నాయి?

-టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలో యథేచ్ఛగా భూపందేరం
-ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అడ్డదిడ్డంగా కేటాయింపు
-కబ్జాలకు.. అన్యాక్రాంతాలకు లెక్కేలేదు
-అయాచిత లబ్ధి పొందిన నాయకగణం
-కోర్టు కేసులలో వందల ఎకరాలు
-అప్పుడెన్నడూ నోరుమెదపని విపక్షాలు..
-పేదలకు ఇండ్లు కడతామంటే గగ్గోలు
అమానవీయ పరిస్థితుల మధ్య బతుకులు వెళ్లదీస్తున్న పేదలు గౌరవంగా బతికేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొంత స్థలాన్ని తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటనపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి! పరమపవిత్రమైన విద్యాసంస్థ భూమిని తీసుకోడానికి వీల్లేదని బల్లగుద్దుతున్నాయి! ఇంతవరకూ యూనివర్సిటీ భూములను ముట్టిందే లేదన్నంత స్థాయిలో చెలరేగుతున్నాయి! నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో అనేక ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అక్రమార్కుల కబ్జాల్లో చిక్కుకున్నాయి. ప్రత్యేకించి 1987 తర్వాత తమకు తోచినంత భూమిని తమకు కావలసిన ప్రైవేటు సంస్థలకు అప్పటి ప్రభుత్వాలు కట్టబెట్టడం మొదలుపెట్టాయి. అప్పుడు వినిపించని నిరసన స్వరాలు ఇప్పుడే ఎందుకు వినిపిస్తున్నాయనేది ఆసక్తిగొల్పుతున్న అంశం! గతంలో ప్రభుత్వాల్లో ఉండి పందేరం చేసిన నాయకులు.. ఇప్పుడు ప్రజోపయోగ కార్యక్రమానికి అతిస్వల్పంగా 11 ఎకరాల భూమి తీసుకుంటామంటే ఎందుకు రగడ చేస్తున్నాయన్నది ప్రశ్న!! నిజానికి కేసీఆర్ అడిగింది ఉస్మానియాకు ఉన్న వందల ఎకరాల్లో కేవలం 11 ఎకరాలు మాత్రమే!! అది కూడా పేదలకు ఇండ్లు కట్టించేందుకే! ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే విపక్ష లక్ష్యమని గుడ్డిగా నమ్మి.. అదే పద్ధతిలో వ్యవహరిస్తున్న ప్రతిపక్షాలకు సహజంగానే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమం రుచించదు!! సవాలక్ష లొసుగులు వెతుకుతాయి! ఈ పరిస్థితుల్లోనే.. ప్రజాపక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం తీరుతో ఇప్పటికే గుండెలు గుభేల్మంటున్న ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.


artscollege


ఇక్కడే కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వర్సిటీ స్థలాలను సెజ్‌ల పేరిట అమ్మేయాలని చూసిందెవరు? అయాచిత లబ్ధిని ఆర్జించడానికి చేసిన కుట్రలెన్ని? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వందల కోట్ల విలువైన స్థలాలపై కన్నేసిందెవరు? ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారమిచ్చిన సమైక్య రాష్ట్రంలో పాలకులెవరు? ఓ వైపు కబ్జాలు యథేచ్ఛగా సాగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరించారు? ఇప్పుడు పేదలకు ఇండ్లు కట్టిస్తామంటే అడ్డుకుంటున్నవారే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది? 1987 నుంచి వర్సిటీల భూములు పెద్ద ఎత్తున దుర్వినియోగమైన ఉదంతాలు కన్పిస్తాయి. సంస్థలకు, వ్యక్తులకు ఇష్టారాజ్యంగా భూములను కట్టబెట్టారు. లక్ష్యాలను మరిచి, నిబంధనలకు విరుద్ధంగా ఎన్నెన్నో సంస్థలకు ధారాదత్తం చేశారు. వందల ఎకరాలను మాయంచేశారు. 


ఆలనాపాలనా లేకపోవడంతో కబ్జా బాగోతాలు సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే భూములపై ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలున్నాయి. రాజకీయ ప్రాబల్యంతోనే యూనివర్సిటీల భూములను కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 251.64 ఎకరాలపై పలు కోర్టు కేసులు నడుస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. దశాబ్దాల తరబడి అన్యులు, వర్సిటీలతో సంబంధం లేని సంస్థలు/వ్యక్తులకు స్థలాలను కట్టబెట్టినప్పుడు రాజకీయ పార్టీలు, సంఘా లు మౌనం వహించాయి. ఉద్యోగులకు ఇండ్లస్థలాల పేరిట భూము లు కేటాయించినా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ప్రభుత్వం పేదలకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇండ్ల నిర్మాణానికి కొంత స్థలాన్ని వినియోగించుకోవాలని ప్రతిపాదిస్తే గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


ఇతర సంస్థలకు కేటాయించిన భూములు: ఉస్మానియా ఎస్టేట్ సెల్ లెక్కల ప్రకారం యూనివర్సిటీలో మొత్తం భూమి 1627 ఎకరాలు. ఇందులో లీజుకు ఇచ్చినది 185 ఎకరాలు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), ఫోరెన్సిక్ ల్యాబ్, హోమియో మెడికల్ కాలేజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) కేంద్రాలు యూనివర్సిటీ భూముల్లోనే కొనసాగుతున్నాయి. తార్నాకలోని బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్టీసీ దవాఖాన, రామాంతాపూర్ దూరదర్శన్ కేంద్రానికి 30 ఎకరాలను విక్రయించారు. ఓయూ ఉద్యోగుల నివాసాలకు మాణికేశ్వరినగర్‌లో 35.30 ఎకరాలను ఉచితంగా ఇచ్చారు. ఇలా మొత్తం 250 ఎకరాలు కట్టబెట్టారు. మోహిని చెరువు, గార్డెన్‌కు 9 ఎకరాలు, జింకల సంరక్షణ పార్కుకు 60 ఎకరాలు (అదిప్పుడు విషసర్పాలకు నిలయంగా మారింది), హెర్బల్ గార్డెన్‌కు 5 ఎకరాలు, అరటి తోటకు 12 ఎకరాలు కేటాయించారు. సత్యసాయి స్కూల్(ట్రస్టు)కు 5 ఎకరాలు, సురభారతికి 500 చ.మీ. వంతున అనేక సంస్థలకు లీజుకు ఇచ్చారు. వాటిని అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో బీళ్లుగా మారాయి. నలు దిక్కులా సుమారు వంద ఎకరాల వరకు కబ్జాకు గురైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

UOFHYD


వీటిపై ఏనాడూ ఏ పాలకులూ సర్వే చేపట్టింది లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు మొలిపించాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇవన్నీ 1980 తర్వాత చోటు చేసుకోవడం విశేషం. మిగిలిన వందల ఎకరాల స్థలం కంపచెట్లు, పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం కళాశాలలకు, కార్యాలయాలకు, క్రీడా మైదానాలకు, అధ్యాపక, ఉద్యోగుల క్వార్టర్లకు 500 ఎకరాలు మాత్రమే వినియోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రంగాపూర్‌లో నిజామియా అబ్జర్వేటరీ పేరుతో 265 ఎకరాల్లో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. కానీ అందుకు కేటాయించిన స్థలంలో బహుళ అంతస్తులు వెలిశాయి. హోటళ్లు, లాడ్జీలు కూడా నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. లాలాపేట, అంబర్‌పేట, రామాంతాపూర్, జమిస్థాన్‌పూర్, హబ్సిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని ఉస్మానియా వర్సిటీ భూములు చాలా వరకు కబ్జాకు గురయ్యాయన్న ఫిర్యాదులు అనేకం ఉన్నాయి.


సెంట్రల్‌వర్సిటీ భూములు ఇలా వెళ్లాయి..:

రాష్ట్ర ప్రభుత్వం 1974లో గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 2,324 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. అదే స్థలంలో వివిధ సంస్థలకు 700 ఎకరాల వరకు కేటాయించారు. ఇందులోనే 537 ఎకరాల స్థలాన్ని ఐఎంజీకి కేటాయించగా, అందుకు యూనివర్సిటీకి ప్రత్యామ్నాయంగా చూపింది తక్కువే. ప్రత్యామ్నాయంగా గోపనపల్లిలో 397 ఎకరాలను వర్సిటీకి ఇవ్వా.. అందులో క్రషర్లు ఉండడం వల్ల నిర్మాణయోగ్యంగా లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. 1987నుంచి ఈ యూనివర్సిటీ స్థలాలను ఇతర సంస్థలకు కట్టబెడుతూ వచ్చారు. భూ పందేరంతో ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ భూములు 1522 ఎకరాలకు కుదించుకుపోయాయి.


హైదరాబాద్ యూనివర్సిటీ భూములను ఇలా పంచేశారు:

1994లో నవోదయ స్కూల్‌కు 30 ఎకరాలు, 1990లో హెచ్‌సీయూ బస్‌డిపోకు 10 ఎకరాలు, 1991లో ఏపీఎస్‌ఈబీకి 6.02 ఎకరాలు, 1980లో ట్రిపుల్ ఐటీకి 62 ఎకరాలు, 1987లో తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు ఐదెకరాలు, 1998లో టెలీకమ్యూనికేషన్స్‌కు ఒక ఎకరం, 2000లో శాప్‌కు 108 ఎకరాలు, 2003లో శాప్ హాకీ స్టేడియానికి 14 ఎకరాలు, 2003లో శాప్ మిలిటరీ గేమ్స్ విలేజ్‌కు 14 ఎకరాలు, 2003లో శాప్ షూటింగ్ రేంజ్‌కు 20 ఎకరాలు, 2007లో ఏపీఎన్జీవోలకు 134 ఎకరాలు, 2004లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు 10 ఎకరాలు, 2005లో ఏఎండీఐఎస్‌ఏ సంస్థకు 2 ఎకరాలు, 2008లో సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్‌కు 5 ఎకరాలు, 2009లో టీఐఎఫ్‌ఆర్‌కు 210 ఎకరాలు, 2009లో టీఈఆర్‌ఐ సంస్థకు 40 ఎకరాలు, 2009లో సీడీఎఫ్‌డీకి 25 ఎకరాల వంతున కేటాయించారు.


ఆర్థిక మండలి పేరుతోనూ..:

కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సెంట్రల్ యూనివర్సిటీలో 200 ఎకరాలను ప్రత్యేక ఆర్థిక మండలిగా రూపొందించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. నాలెడ్జ్ ఇన్నోవేషన్ పార్కు పేరిట ప్రైవేటు కంపెనీలకు వేల కోట్ల విలువైన భూ పందేరానికి సిద్ధమయ్యారు. 2010 మార్చిలో అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌సిబల్ వర్సిటీ భూములను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదాయం పెంచుకునే నెపంతో 200 ఎకరాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు.


వ్యవసాయ వర్సిటీలో మిగిలిందెంత?:

ప్రభుత్వం 1964లో ఎన్జీ రంగా యూనివర్సిటీ(ప్రస్తుత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వ్యవసాయ వర్సిట్లీ)కి రాజేంద్రనగర్‌లో 2687.27 ఎకరాలు కేటాయించింది. దీంట్లో 25 ఎకరాలు రోడ్లకు పోయింది. 56 ఎకరాల్లో ఇండ్లు వెలిశాయి. బుద్వేలు, శివరాంపల్లి, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్, హిమాయత్‌సాగర్ గ్రామాల పరిధిలోని ఈ వర్సిటీ భూముల్లో వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఏనాడూ సర్వే చేసిన, చేయించిన పాపాన పోలేదు. అనేకమంది హద్దులు దాటి భూములను కలిపేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ఇతర సంస్థలకు, ఇన్‌స్టిట్యూట్స్‌కు కేటాయించారు.


ఇతర ప్రాంతాల్లోనైతే ఉపాధి మృగ్యం


గ్రేటర్ హైదరాబాద్‌లో దశాబ్దాలుగా కిరాయి ఇండ్లల్లో మగ్గుతున్న నిరుపేదలకు గృహ వసతి కల్పించాలన్న లక్ష్యసిద్ధికి అవరోధాలు ఎదురవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. 2006 నుంచి ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 2.30 లక్షల మంది ఇండ్లకోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చి కూలీనాలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారే ఇందులో అధికం. అలాంటి వారికి గతంలో ఎక్కడో శివారు ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించి ఇచ్చారు. ఎక్కడో సిటీకి దూరంగా అపార్టుమెంట్లు నిర్మించి ఫ్లాట్లను కట్టబెట్టడం ద్వారా తమ ఉపాధి దెబ్బ తింటున్నదని దరఖాస్తుదారులు చెబుతున్నారు. నగర శివార్లల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్‌గృహకల్పవంటి పథకాలకింద నిర్మించిన ఇండ్లు నిరుపయోగంగా మారాయి. అందుకే నగరంలోనే ఉన్న ఖాళీ స్థలాల్లో అపార్టుమెంట్లను నిర్మించి పేదలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


బుధవారం, మే 20, 2015

ఇవే మనకు లభించబోయే వరాలు...!!!

తెలంగాణకు గోదావరి ఒక వరప్రసాదిని. జీవనదియైన గోదావరిలో సంవత్సరం పొడుగునా 2,163 టీఎంసీల నీరు ప్రవహిస్తున్నా దీని నుంచి కేవలం 650 టీఎంసీల నీటిని మాత్రమే మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. మిగతా 1,568 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నది. వివిధ ప్రాజెక్టులు, బ్యారేజీల ద్వారా వినియోగించుకుంటున్న నీరు పోను, మిగులు జలాలుగా సముద్రం పాలవుతున్న నీటినుంచి జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటే.. తెలంగాణ ఎదుర్కొంటున్న విద్యుత్తు కొరతకు శాశ్వత పరిష్కారం దొరకుతుంది. దీనికోసం ప్రతిపాదిత ప్రాజెక్టులున్న చోట్ల, లేదా ఎత్తిపోతల ద్వారా హైడ్రోపవర్ స్టేషన్లను నిర్మించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది బొగ్గుతో ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ కన్నా చాలా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకోవచ్చు. 

river

ఈ నేపథ్యంలో గోదావరి నదిపై ఎక్కడెక్కడ ఏ స్థాయిలో హైడ్రోపవర్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చో, అవి ఏ మేరకు లాభదాయకమో చూద్దాం. ఒక టీఎంసీ నీటిని ఒక మీటర్ ఎత్తున నిల్వ చేయగలిగితే.. దానిద్వారా 0.068 ఎంయూ (మెగా యూనిట్లు)ఉత్పత్తి చేయవచ్చు. గోదావరి నది ప్రవహిస్తున్న ఎత్తైన ప్రాంతాల్లో ఈ హైడ్రోపవర్ స్టేషన్లను నిర్మించుకోవచ్చు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వస్తున్న వరదతో మరింత విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ దానిలో 60 శాతం మాత్రమే వినియోగించుకోగలుగుతున్నాం.

ఇప్పటి దాకా తెలంగాణలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా, నాగార్జునసాగర్ పవర్ హౌజ్ ద్వారా ఇంకా ఇతర చిన్న ఉత్పత్తి కేంద్రాల ద్వారా మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తున్నారు. మనం వినియోగించుకుంటున్న 650 టీఎంసీల నీటిని కూడా ఎత్తైన ప్రదేశాల నుంచే తీసుకుంటున్నాం. కాబట్టి అక్కడ కూడా పవర్‌ను ఉత్పత్తి చేయవచ్చు. తెలంగాణలో 350 టీఎంసీల నీటితో 4048 మెగా యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఈ విధమైన విధానం అవలంబిస్తే.. పర్యావరణానికి కూడా ఏమాత్రం నష్టం కలగదు. థర్మల్ పవర్ ప్రాజెక్టులతో ఉత్పన్నమయ్యే కాలుష్య సమస్య కూడా ఉండదు. అలాగే సహజ శిలాజ ఇంధనాల వాడకం ద్వారా ఉత్పన్నమయ్యే కాలుష్యం కూడా ఉండదు. 

ప్రవాహ నీటిని ఎత్తు ప్రాంతాలకు లిఫ్ట్ చేసి దానిద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని వాటర్డ్ పవర్డ్ పంప్స్ అని పిలవవచ్చు.


ఇవి ఈ క్రింది విధంగా పనిచేస్తాయి..
  • జల విద్యుత్ ఉత్పాదనతో అనేక విధాలుగా ఉపాయోగాలున్నాయి.
  • జలవిద్యుత్ ఉత్పాదనతో శిలాజ ఇంధనాల వాడకం తగ్గి సహజ ఇందనాలు భవిష్యత్ తరాల కోసం మిగులుతాయి.
  • జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సహజ వరద నీటిపై ఆధారపడి నిర్మితమై పనిచేస్తాయి కాబట్టి ఇతర వనరుల వినియోగం ఉండదు.
  • ఇతర ఇంధనాల ద్వార కన్నా నీటితో విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ ఖర్చుతో చేయవచ్చు.
  • నీటి నిల్వతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల ద్వారా ఇతర అవసరాలకు ముఖ్యంగా వ్యవసాయం, తాగు నీటి అవసరాలను తీర్చుకోవచ్చు.
  • జలవిద్యుత్ ప్రాజెక్టుల సహజంగా మారుమూల ప్రాంతాల్లో నిర్మితమవుతాయి కాబట్టి, ఆతర్వాత ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి.
  • ఎత్తయిన ప్రదేశంలో నీటిని నిల్వ ఉంచడం అనేది చాలా చవుకైన సహజ బ్యాటరీగా దాన్ని పరిగణించవచ్చు. 


table

శ్రీశైలం లెఫ్ట్‌బ్యాంక్ పవర్ హౌజ్ 150 మెగావాట్ల శక్తి కలిగి ఆరు పంపుహౌజులు కలిగి ఉన్నది. తక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో నీటిని నిల్వ చేసి, డిమాండ్ ఉన్న సమయంలో నీటి నిల్వతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. తద్వారా విడుదలైన నీరు నాగార్జున సాగర్ చేరి అక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించ బడుతున్నది. కానీ దురదృష్టవశాత్తూ కృష్ణా నది జీవనది కాదు. కానీ గోదావరి నది జీవనదిగా తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అనుగుణంగా ఉన్నది. దీనిపై ఆయా భౌగోళిక పరిస్థితులను అధా రం చేసుకుని కాళేశ్వరం- అప్పర్, కాళేశ్వరం-లోయర్, ఇచ్చంపల్లి-అప్పర్, కంతనపల్లి-లోయర్, ఎధిర- అప్పర్, పర్ణశాల-లోయర్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులను నిర్మంచుకోగలితే దాదాపు 4000మెగా యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అలాగే రోజువారీగా నదీ ప్రవాహంలో ఉండే ఎగుడు దిగుడులను అధిగమించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా విద్యుత్ కొరతను తీర్చడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు హామీ పడినట్లు అవుతుంది. 


gandi

గోదావరి నది జీవనదిగా తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అనుగుణంగా ఉన్నది. దీనిపై ఆయా భౌగోళిక పరిస్థితులను అధారం చేసుకుని కాళేశ్వరం- అప్పర్, కాళేశ్వరం-లోయర్, ఇచ్చంపల్లి-అప్పర్, కంతనపల్లి-లోయర్, ఎధిర- అప్పర్, పర్ణశాల-లోయర్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులను నిర్మంచుకోగలితే దాదాపు 4000మెగా యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!




ఆదివారం, మే 17, 2015

ఆంధ్రా అక్రమార్కుల కుట్రలను ఛేదిద్దాం..

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు చెన్నై నగరాన్ని 24 గంటల్లో ఖాళీ చేయాలని తమిళనాడు రాజాజీ ఆదేశించిన వాళ్లను తెలంగాణలో కలుపుకుని అరవై ఏళ్లు శిక్ష అనుభవించాం. ఇప్పుడు అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి. తెలంగాణను అస్థిరపర్చే కుట్రలను భగ్నం చేసుకుంటూ స్వయం పాలనలో బంగారు తెలంగాణ దిశగా ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్న తెలంగాణ సర్కారుకు అండగా నిలవాలి.


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు మనకు ఒక్కటే ఎజెండా. ఇప్పుడు అది రెండు రకాలు మారింది. ఒక్కటి అరవై ఏళ్ల ఉద్యమ విజయం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అస్తిరపర్చే కుట్రల నుంచి కాపాడుకోవడం, రెండోది తెలంగాణ అభివృద్ధి పునాదిని పటిష్టంగా నిర్మించుకోవడం. ఇన్నాళ్లు సమైక్య పాలనలో తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోని సీమాంధ్ర కుట్ర జీవులు ఇప్పుడు స్వయం పాలనలో తెలంగాణ అభివృద్ధి ఎజెండాగా వడివడిగా అడుగులు ముందుకు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంద్రజాల, మహేంద్రజాల, టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలతో తెలంగాణ ప్రజల మనస్స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రత్యక్ష, పరోక్ష దాడులకు దిగుతున్నారు.

అరవై ఏళ్లు తెలంగాణలో ఆవాసం ఏర్పరచుకుని ఇక్కడి వనరులను కొల్లగొడుతూ బతుకుతున్న సీమాంధ్ర రాజకీయశక్తులు, మీడియా ఇప్పుడు తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించడానికి నిస్సిగ్గుగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. అరవై ఏళ్ల సీమాంధ్రుల పాలనకు, స్వయం పాలనకు చాలా తేడా ఉందని ప్రజలు సంతోషంగా గుర్తిస్తున్నప్పటికీ, బానిస మనస్తత్వానికి అలవాటుపడిన కొందరు తెలంగాణ నాయకులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.

వాళ్ల చేష్టలకు సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం కూడా తోడైంది. దీన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలి. తెలంగాణ వచ్చింది కదా ఇంకా అన్ని సమస్యలు ఎందుకు పరిష్కారం కావటం లేదంటూ కొందరు సృష్టిస్తున్న గందరగోళాన్ని గుడ్డిగా నమ్మితే రాష్ట్రం ఆగమైపోతుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణను ఎలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. 

  • తెలంగాణ కరెంటు కష్టాల్లో ఉంటే మన వాటా మనకు రావాల్సిన కృష్ణపట్నం కరెంటు మనకు ఇవ్వలేదు.
  • పోలవరం ముంపు మండలాలను కలుపుకుని అందులో ఉన్న సీలేరు విద్యుత్తు మనకు ఇవ్వలేదు.
  • హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగుల మీద ఈగ వాలకపోయినా తమకు భద్రత లేదంటూ కేంద్రానికి స్వయంగా ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చేత పలుమార్లు ఫిర్యాదు చేయించి హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నించారు.
  • సాగర్ జలాల విషయంలో ముందుగా పోలీసులను డ్యాం మీదికి పంపించి గొడవపెట్టి మళ్లీ వాళ్లే గవర్నర్ వద్ద పరిష్కారానికి ప్రయత్నించామని చాటింపు చేసుకున్నారు.

సీమాంధ్ర బానిస నేతలు ముఖ్యమంత్రి మీద దూషణలకు దిగుతున్నా వాళ్లకు అభివృద్ధితోనే సమాధానం ఇవ్వాలనే తరహాలో సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారు. హైకోర్ట్ విభజన విషయంలో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో అర్ధమవుతూనే ఉంది. ఇప్పుడున్న హైకోర్టును ఆంధ్రాకు కేటాయించినా అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయినా విభజనకు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. చివరికి తెలంగాణ కేసులను మహారాష్ట్ర లేదా కర్నాటక హై కోర్టులకు బదిలీ చేయాలని ఇక్కడి పార్లమెంట్ సభ్యులు కేంద్ర న్యాయశాఖా మంత్రిని కోరారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


ఇలాంటి కుట్రలన్నీ ప్రత్యక్షంగా కనిపించేవి. చాపకింద నీరులా తెలంగాణ ప్రజల ధైర్యాన్ని చెదరగొట్టే పనులు కూడా చాలా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గంటల తరబడి విరామం లేకుండా అభివృద్ధి సమీక్షలు, ప్రజల్లో పర్యటనలు చేస్తుంటే ఆయన ఆరోగ్యం మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని తండ్రిలా భావించే ఒక మంత్రి ఇంకో పార్టీలో చేరుతున్నాడని వారి ఆస్థాన మీడియాతో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఉన్న వివిధరకాల అసంతృప్తి వాదులతో వేదికలను ఏర్పాటు చేయించే పనులను మొదలు పెట్టారు. పాత పాచికలు పారకపోవడంతో కొత్తవాటి కోసం దేవులాడుతున్నారు. మొత్తానికి తెలంగాణ మీద కుట్రలను సజీవంగా నిలిపే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ముందు ముందు కొత్తరూపాల్లో మనల్ని చెదరగొట్టడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు చెన్నై నగరాన్ని 24 గంటల్లో ఖాళీ చేయాలని తమిళనాడు రాజాజీ ఆదేశించిన వాళ్లను తెలంగాణలో కలుపుకుని అరవై ఏళ్లు శిక్ష అనుభవించాం. ఇప్పుడు అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి. తెలంగాణను అస్థిరపర్చే కుట్రలను భగ్నం చేసుకుంటూ స్వయం పాలనలో బంగారు తెలంగాణ దిశగా ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్న తెలంగాణ సర్కారుకు అండగా నిలవాలి.

రైతుల రుణమాఫీ, ఆసరా పింఛన్లు, ఫీజు రీ యింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు, ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్, అంగన్వాడీ ఉద్యోగులు, హోంగార్డుల జీతాల పెంపు, రేషన్ బియ్యం పరిమితి పెంపు, హాస్టళ్లకు సన్న బియ్యం, హైదరాబాద్ సహా తెలంగాణ శాంతిభద్రతల మెరుగుదలకు నిధుల కేటాయింపు.. ఇలా ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. కరెంటు సమస్యను మన సీఎం పరిష్కరించారు. విద్యుత్తు, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. వీటికి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు సంపాదించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి సారించారు. విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయి సరిపడా కరెంటు చేతికొచ్చేలోపు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలనేది ముఖ్యమంత్రి ప్రణాళిక. విభజన సమయంలో ఇన్ని పనులు చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలంగాణను అస్థిరపరచే బయటి, ఇంటి శత్రువుల కుట్రలను ఎదుర్కొనే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే తెలంగాణ అభివృద్ధి మీద సీఎం కేసీఆర్ ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుంది .

- మిట్ట సైదిరెడ్డి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



శనివారం, మే 16, 2015

ఏపీ అధికారుల కుట్రలతో ట్రెజరీశాఖలో అయోమయం!

- ఏపీ అధికారుల కుతంత్రాలు.. ట్రెజరీ ఉద్యోగుల విభజనలో జాప్యం
- కుంటుపడుతున్న అభివృద్ధి, నిధుల నిర్వహణ అస్తవ్యస్తం
- రాష్ట్ర ఉద్యోగ సంఘాల ఆందోళన
ఉమ్మడి రాష్ట్రంలో అధికారుల కుట్రలు, కుతంత్రాల కారణంగా ట్రెజరీ విభాగంలో ఉద్యోగుల విభజన కొరకరాని కొయ్యగా మారింది. ఉమ్మడి పాలనలో వివిధశాఖలలోని అకౌంట్స్ విభాగాల అధికారులను ట్రెజరీశాఖ అధికారుల జాబితాలో చూపించకపోవడంతో ఆ శాఖ ఉద్యోగుల విభజనలో అయోమయం, గందరగోళం నెలకొన్నది. దాదాపు 29 శాఖాధిపతుల కార్యాలయాలలోని అకౌంట్స్ విభాగం అధికారులను ట్రెజరీశాఖ అధికారులుగా గుర్తించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. 



ప్రభుత్వ ఖజానా విభాగంలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం కేటాయిస్తున్న నిధుల నిర్వహణ, నియంత్రణ, పరిపాలనా పనులు కుంటుపడుతున్నాయి. పేద ప్రజల సంక్షేమం, బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న వేలకోట్ల నిధుల నియంత్రణ అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్ర ఖజానా విభాగంలో నెలకొన్న పరిస్థితులపై ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీ విభాగంలో ఉద్ధేశపూర్వకంగా ఆంధ్ర అధికారులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి టీఎన్జీవో నేతలు సిద్ధమవుతున్నారు. 

list


తెలంగాణ పోస్టులన్ని గల్లంతవుతాయి..
ఉమ్మడి రాష్ట్రంలో ట్రెజరీ విభాగం డైరక్టర్‌గా వ్యవహరించిన అధికారి చేసిన పొరపాట్లతో వివిధశాఖలలో పనిచేస్తున్న 950 మంది అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 
వివిధశాఖలలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులందరినీ ట్రెజరీశాఖ ఉద్యోగులుగా లెక్కించాలి. తద్వారా మాత్రమే ఉద్యోగుల విభజన 58:42 నిష్పత్తిలో సాధ్యమవుతుంది. లేనిపక్షంలో తెలంగాణ పోస్టులన్నీ గల్లంతవుతాయి అని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఎంఏ హమీద్‌లు పేర్కొన్నారు.

ఈ శాఖలో ఏపీ రీఆర్గనైజేషన్ సెల్ కుట్రలు చాలా స్పష్టంగా తేటతెల్లమయ్యాయని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డర్ టూ సర్వ్ నిబంధన ప్రకారం ఏపీకి కేటాయించిన ట్రెజరీ అడిషనల్ డైరెక్టర్ అధికారికి తెలంగాణ ట్రెజరీశాఖ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించారు. ఆయన జీతభత్యాలు ఏపీలోనే తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర ఆడిట్ విభాగంలోకూడా ఇలానే అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. 

తెలంగాణ ట్రెజరీ డైరెక్టరేట్‌కు అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను కేటాయించకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులే మొత్తం తెలంగాణ ఖజానా వ్యవహారాలను నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఉమ్మడి ఏపీలోని మెడికల్, హెల్త్ విభాగాల్లోని అకౌంట్ సెక్షన్లలో పనిచేస్తున్న 30 మంది అధికారులను ఏపీకి కేటాయించారో? లేక తెలంగాణకు ఇచ్చారో? అనే విషయం తెలియక అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఉద్యానవనశాఖ, పరిశ్రమలు, బీసీసంక్షేమం, గిరిజనసంక్షేమం, పశుసంవర్ధకశాఖ, ప్రింటింగ్‌ప్రెస్, మెడికల్ హెల్త్, స్కూల్‌ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, అగ్రికల్చర్, సమాచార, పౌరసంబంధాలశాఖ, ఉన్నత విద్య, ఇతర శాఖలలో అకౌంట్స్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆయా శాఖల ఉద్యోగులుగా కానీ, ట్రెజరీ ఉద్యోగులగా కానీ విభజన కమిటీ జాబితాలలో పేర్కొనలేదని టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధానకార్యదర్శి సత్యనారాయణలు పేర్కొన్నారు.

ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు పడుతుండగా రాష్ర్టానికి చెందిన సీనియర్ అధికారులను, ఉద్యోగులను ఏపీకి కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. వివిధ శాఖలలోని అకౌంట్స్ విభాగం ఉద్యోగులందరినీ ట్రెజరీ ఉద్యోగులుగా పరిగణించి శాస్త్రీయంగా విభజన జరుపాలని, అధికారులందరికీ న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శుక్రవారం, మే 15, 2015

గోదావరి గలగల...కృష్ణానది విలవిల!!

- నదీయాజమాన్య బోర్డుల పరిస్థితి
- ఆగస్టు నుంచి పెండింగ్‌లో కృష్ణాబోర్డు వేతనాలు
- గోదావరికి అన్ని వసతులు, వేతనాలు
- అసంతృప్తిలో కృష్ణా యాజమాన్య బోర్డు
- కేంద్రం దృష్టికి పంచాయితీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు జీతాలు లేవు. బోర్డు చైర్మన్‌కు శాశ్వత చాంబర్ లేదు. చీప్ ఇంజినీర్‌కు ప్రత్యేక గదిలేక క్లర్కులతో కలిసి కూర్చుంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ బోర్డుకోసం నయాపైసా విదిలించడం లేదు. ఆ రాష్ట్ర బడ్జెట్‌లో ఈ బోర్టుకు చంద్రబాబు ఉదారతతో కేటాయించిన మొత్తం కేవలం రూ. 10వేలు. ఏపీ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్న బోర్డు కేంద్రానికి మొరపెట్టుకుంది. 

రెండు బోర్డులు..

godavariరాష్ట్ర విభజన చట్టం కింద కేంద్రం రెండు జీవనదులు కృష్ణా గోదావరి నదులపై రెండు నదీ యాజమాన్య బోర్డులను ఏర్పరిచింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా, కృష్టా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పని చేయాలని నిర్దేశించింది. యాజమాన్య బోర్డుల వ్యయాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంది. బోర్డుల నిర్వహణ నిమిత్తం చెరో రూ. 5 కోట్లు జమ చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ. 5 కోట్లు ఉమ్మడిగా జత చేశాయి. ఈ మేరకు అక్కడా ఇక్కడా యాజమాన్య బోర్డులు ఏర్పాటయ్యాయి. 



గోదావరి గలగల..

తెలంగాణలో ఏర్పాటైన గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు మన ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది. విభజన చట్ట ప్రకారం కేంద్రం సూచించిన నిబంధనలను అన్నింటిని తుచా తప్పకుండా పాటించాలి. బోర్డు సభ్యులకు ఏ విషయంలోనూ ఇబ్బంది కలగకూడదని సీఎం కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు బోర్డుకు సంబంధించి ఏ సమస్యనై నా అవసరాన్నైనా తక్షణమే సమకూర్చుతున్నారు. నెలనెలా జీతాలు భత్యాలు ఇతర ఖర్చులకు నిధులు విడుదల చేస్తున్నారు. మాజీ చైర్మన్ అగర్వాల్ పని చేసింది కొద్ది నెలలే అయినా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సరైన గౌరవాన్ని కల్పించింది. ఉన్నంతలో ఆయను ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసింది. రెండు రోజుల్లో పదవి విరమణ చేస్తున్నారన్న సమయంలో పర్యాటక, పుణ్యక్షేత్రాల సందర్శనలు ఏర్పా టు చేసింది. తర్వాత వచ్చిన ఛైర్మన్ రామ్‌శరణ్, మెంబర్ చీఫ్ ఇంజినీర్ పట్నాయక్‌లకు వసతులు నిధుల్లోలోటు లేకుండా చూస్తున్నారు. 


కృష్ణా విలవిల..

ఇక ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిస్థితి దయనీయంగా ఉంది. బోర్డు ఛైర్మన్‌గా పండిట్ గత ఏడాది అక్టోబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్‌కు చెందిన అధికారి వీఎన్ నాగ్‌పురే చీఫ్ ఇంజినీర్ గా వచ్చారు. అప్పటి నుంచి ఇద్దరికి శాశ్వత చాంబర్ లేదు. ఛైర్మన్‌కు తాత్కాలిక చాంబర్ చూపినా చీఫ్ ఇంజినీర్ ఎల్‌డీసీలు, యూడీసీలతో నే కూర్చోవలసి వస్తోంది. గోదావరి బోర్డుతో సమానంగా, కృష్ణా బోర్డుకి కూడా తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లు డిపాజిట్ చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఖజానా నుంచి చిల్లిగవ్వ తీయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీ బడ్జెట్‌లో బోర్డుకి ఈ ఏడాది కేవలం రూ.10 వేలు కేటాయించారు. బోర్డు ఛైర్మన్‌కు నెలకు సుమారు రు.1.7 లక్షలు, చీఫ్ ఇంజినీర్‌కు రూ. లక్షన్నర జీతం ఉంటుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. బోర్డు సిబ్బందికి జీతాలందడం లేదని చెప్తున్నారు. దీనితో బోర్డు సిబ్బంది కేంద్రానికి మొరపెట్టుకున్నారని తెలిసింది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, మే 14, 2015

తెలంగాణ జల ప్రణాళిక "మిషన్ గోదావరి"!!!

గోదావరికి దక్షిణ గంగ అని పేరు. తెలంగాణలో ఈ నది ఉపయోగపడకుండానే ప్రవహిస్తూ పోతుంది. ఉత్తరాన ప్రాణహిత, వార్ధా, వెన్ గంగాలను కలుపుకుని పోచంపాడు వద్ద దశాబ్దాల కింద కట్టిన శ్రీరామ్‌సాగర్‌ను దాటుకొని సాగుతుంది. ఇటీవలే ఎల్లంపల్లి ప్రాజెక్టును మాత్రం నిర్మించారు. ఇక అక్కడి నుంచి ధవళేశ్వరం వరకు 460 కిలోమీటర్ల పొడుగునా ఒక్క గోదావరి జలాలను వినియోగించుకునేందుకు ఎలాంటి సాగునీటి ప్రాజెక్టు లేదు. ప్రాణహిత వైపు లేదా ఎల్లంపల్లి వైపు నుంచి భద్రాచలం వరకు గల 400 కిలోమీటర్లలో నీటిని వినియోగించుకోవడంపై తెలంగాణ దృష్టి సారించాలి. పోలవరం బ్యాక్ వాటర్ ఉండే ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే దాకా గోదావరి ప్రవాహంలోని నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను నిర్మించుకోవాలి. 

table



1. తెలంగాణ ప్రాజెక్టుల రూపకల్పన కోసం గోదావరిలో వాస్తవానికి ఎంత నీరు లభ్యమవుతున్నది? బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ర్టానికి వాటా కేటాయించిన నేపథ్యంలో- దీనికి చాలా మంది చెప్పే సమాధానం 1480 టీఎంసీలు. గోదావరి ఎక్కువగా తెలంగాణలోనే ప్రవహిస్తున్నది. కనుక, సీలేరు, శబరి జలాలను మినహాయించినా, మనకు ఈ మొత్తం వస్తుందని భావిస్తారు. నిజానికి ఈ నీటి లభ్యత ఎంత అనేది పరిశీలించాలని భావించాను. కేంద్ర జలవనరుల కమిషన్ దేశ వ్యాప్తంగా ప్రధాన నదులపై హైడ్రో అబ్జర్వేషన్ స్టేషన్‌లను ఏర్పాటు చేసి డేటాను ప్రచురిస్తుంది. 
దీనికి తోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఆన్ లైన్ ఇన్ రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టం ద్వారా కూడా నీటి లభ్యతను, ప్రవాహతను తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే 2007-2012 మధ్య వీటిలో ప్రవహించిన నీటి ప్రవాహ సరాసరిని తీసుకుని నీటి ప్రవాహతను లెక్క తీయవచ్చు. దీని ప్రకారం గోదావరి బేసిన్‌లో నీటి లభ్యత వివరాలు పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. 

భద్రాచలం వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తున్న గోదావరి నీరు 2,163 టీఎంసీలు! అంటే తెలంగాణలో నీటిపారుదల, జల విద్యుత్‌కు భారీ అవకాశాలు ఉన్నాయి. ప్రాణహిత దగ్గర లభించే నీరు 350 టీఎంసీలు మాత్రమే కాదు. సముద్రమట్టానికి 140 మీటర్ల ఎత్తు నుంచి 700 టీఎంసీల నీళ్ళు వచ్చి పడుతున్నాయి. దీని ఆధారంగా జల విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా, నాలుగు వందల కిలోమీటర్ల మేర నదీ మార్గాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. 75 శాతం సగటు ప్రవాహం లెక్కగట్టినా 1,622 టీఎంసీల నీరు లభిస్తుంది.

2. డ్యాం/బ్యారేజీలకు అనువైన స్థలాలు- నీటి ఉపయోగం?తుమ్మిడిహట్టి: ఇది ప్రస్తుత ప్రతిపాదిత స్థలం. ఎత్తు విషయమై మహారాష్ట్రతో అంగీకారానికి రావలసి ఉన్నది. మహారాష్ట్ర వైపు ముంపును తగ్గించడానికి ఎత్తు, ప్రదేశం విషయంలో కొంచెం తగ్గినా తప్పులేదు. ఈ ప్రదేశం వద్ద 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు అంగీకరించినా, లిఫ్టు లేకుండా 160 టీఎంసీలు మళ్ళించడం ఎట్లా అనేది అర్థం కాని విషయం. లిఫ్టు ఏర్పాటు చేసి, ఎత్తు తగ్గించి, విడుదలైన నీటితో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఉత్తమం. సాగునీటిని, జల విద్యుత్‌ను (తదనుగుణంగా వ్యయాన్ని) పంచుకునే విషయమై మహారాష్ట్రతో చర్చించవచ్చు. కనీసం సగం తెలంగాణకు ఇవ్వాలె.

ముక్కిడిగూడెం:(116-136 మీ) ప్రతిపాదిత స్థలం నుంచి 55 కిలోమీటర్ల దిగువన కొండ వరుసలతో నీటిని నిలిపే లోయ వంటిది ఉన్నది. ఇది లిఫ్టుకు కూడా అనుకూలం. ప్రస్తుత ప్రాణహిత- చేవెళ్ళ పథకంలో గుర్తించిన మొదటి లిఫ్టు దీనికి 62 కిలోమీటర్ల దగ్గర ఉన్నది. ఇది చాలా అనుకూలమైనది. ఎందుకంటే ఈ స్థలం వల్ల ఎక్కువ ముంపు ప్రాంతం తెలంగాణవైపే ఉన్నది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహించే పెద్ద వాగు నీళ్ళు ఇక్కడకు చేరుతాయి. ప్రాణహిత కూడా దీనికి ముందుగానే ఉన్నది. సాగునీటిని, జల విద్యుత్‌ను (తదనుగుణంగా వ్యయాన్ని) పంచుకునే విషయమై మహారాష్ట్రతో చర్చించవచ్చు. కనీసం సగం తెలంగాణకు ఇవ్వాలె. దీని వల్ల తెలంగాణ, మహారాష్ట్రలోనున్న విదర్భలోని వెనుకబాటు తనాన్ని ప్రాణహిత ద్వారా పారదోలవచ్చు.

ఎగువ కాళేశ్వరం (100-120 మీటర్లు) : నీటి లభ్యత ఎక్కువగా ఉండే అద్భుతమైన ప్రాంతం ఇది. ఇక్కడే ప్రాణహిత, గోదావరి కలుస్తాయి. కానీ ఎత్తు ఎక్కువగా ఉంటే ముంపు ఎక్కువగా మహారాష్ట్రలో ఉంటుంది. అందువల్ల ఎత్తు తగ్గించి, రివర్సిబుల్ టర్బైన్స్‌తో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలి. దగ్గరలో దిగువ కాళేశ్వరం డ్యాం ఉంటుంది.
దిగువ కాళేశ్వరం (93-115 మీటర్లు): ఈ రెండు రిజర్వాయర్ల మధ్య తక్కువ ముంపుతో లోయర్ రిజర్వాయర్ ఏర్పడుతుంది. ఎగువ, దిగువ రిజర్వాయర్ల మధ్య రివర్సిబుల్ టర్బైన్స్ కోసం అనుకూలమైన దిగువ రిజర్వాయర్ ఏర్పాటు చేయవచ్చు.

box



river

ఇచ్చంపల్లి (80-100 మీటర్లు): ఒకప్పుడు 125 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్‌తో వెయ్యి టీఎంసీల నీటిని వినియోగించుకునే భారీ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. కానీ నిర్మాణం జరగలేదు. అటవీ ఖనిజ సంపద మునగ కుండా వంద మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్‌తో నిర్మించవచ్చు. దీని నుంచి పైప్ ద్వారా దేవాదులకు నీరు పంపవచ్చు. 75 నుంచి 90 మీటర్ల మేర నీటిని తోడడం తప్పుతుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.

కంతనపల్లి:(70-85 మీ) సాగునీటి ప్రాజెక్టు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన స్థలం ఇది. ఇక్కడ ఇరువైపుల తెలంగాణ భూభాగం ఉన్నది కాబట్టి ఎంత పెద్ద ప్రాజెక్టు వీలైతే అంత నిర్మాణం చేపట్టాలి. ఇక్కడి నుంచి దేవాదులకు నీటిని అందిస్తూ, విద్యుత్ వినియోగం తగ్గిస్తుంది. ప్రాణహిత, ఇంద్రావతి జలాలు భారీగా చేరడం వల్ల, గోదావరి మిగులు జలాలతో వంద రోజుల పాటు పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఎదిర: (57-70 మీ) ఇక్కడ మంచి బ్యారేజీని నిర్మించడానికి తెలంగాణకు రెండో ప్రాధాన్య ప్రాజెక్టు స్థలం. ఇక్కడ కూడా నీళ్లు, ముంపు ప్రాంతాలు తెలంగాణ భూభాగంలోనే ఉంటాయి. ప్రాజెక్టుకు రెండువైపులా వినియోగించుకుని సాగునీటి, థర్మల్ ప్లాంట్స్, హైడ్రో పవర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.


పర్ణశాల:(50-60 మీ) దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది.
దుమ్ముగూడెం:(45- 50 మీ.) ఇది పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోతుంది. కాబట్టి దీనిపై పెద్ద బ్యారేజీ చేపట్టి భద్రాచలంకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీనిని మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణహిత, గోదావరి నదులపై చేపట్టబోయే ఈ డ్యాంల, బ్యారేజీ నిర్మాణం వల్ల మనం సాగునీటి కోసం 650 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. అలాగే 4000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ విద్యుత్‌ను 200 నుంచి 400 మీటర్ల ఎత్తు వరకు నీటిని తరలించడానికి లిఫ్ట్ పంపుల కోసం ఉపయోగించుకోవచ్చు.

venkat


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!




బుధవారం, మే 13, 2015

ఇవి మరోచోటికి తరలిపోతే ఎవరికి నష్టం?

"అభివృద్ధి"యె అవకాశం!
మార్పుతెచ్చు చోదకం!
ఎట్టి పనియు మొదలైనా,
వెనుకనె అభివృద్ధి యుండు!!

సెక్రెటేరియట్‍ను ఎర్ర
గడ్డలోన పెడుదమన్న,
సాగరు ప్రక్షాళనన్న
హైదరబా దెమ్మెల్యే
లడ్డుపడుదురే? ఇంక
గగ్గోలులె? కోపాలే?

అంతర్జాతీయకళా
క్షేత్రం కడదామంటే,
కుంటి, గ్రుడ్డి సాకులేల?
అడ్డగింప జూడనేల?

"ఎర్రగడ్డ" సచివాలయ
మే "పికెట్‍"కు తరలినచో,
నష్టమెవ్వరికి జరుగును?
ఎర్రగడ్డ ప్రజలకె గద!
అభివృద్ధియె తొలగుకదా!!

ఎన్‍టీఆర్ స్టేడియమున
కళాభారతిని కట్టుట
నెమ్మెల్యేలడ్డుకొనిన
నష్టమెవ్వరికి జరుగును?
లోయర్ ట్యాంక్‍బండ్‍ నివాసు
లకె జరుగును యోచింపుడు!!

ప్రభుత్వమ్ము నిర్ణయించు
ప్రదేశములలొ నిర్మించిన
ఆ ప్రదేశములె వృద్ధిని
పొంది వెలిగిపోవును గద!

కళాభారతి నశోక్‍నగర్
విడచిన వేరొక చోటకు
పద్మరావొ, తలసానో
సంతసాన కొనిపోదురు!!

తరువాతను అశోక్ నగర్
పరిస్థితియు నెటకుపోవు?
ఏ వృద్ధియు లేకుండా
చరిత్రలో నిలిచిపోవు!!

ఎమ్మెల్యే లైదేండ్లే!
ప్రజలో? స్థిరనివాసులే!!
అశాశ్వతులె అడ్డుపడిన
శాశ్వతులకె నష్టమ్మగు!!
యోచింపుడు ప్రజలారా
ఏమి చేయవలెనొ యిపుడు!!!


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
(సవాల్ రెడ్డిగారి వ్యాసంకోసం ఇక్కడ క్లిక్ చేయండి)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


మంగళవారం, మే 12, 2015

వీళ్ళకు తెలంగాణ సోయి ఇంకెప్పుడొస్తుంది?


చంద్రబాబు తన ప్రాధాన్యం, తన ప్రాంతం ఆంధ్ర అని విభజనకు ముందే రుజువు చేసుకున్నారు. తెలంగాణలో ఇంక తనకేమీ మిగలదన్న చైతన్యం ఆయనకు అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. ఇక్కడ ఈ మాత్రం ఎమ్మెల్యేలు గెలుస్తారని చంద్రబాబు కూడా ఊహించలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ వ్యతిరేకతను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. దాచుకోలేడు. మన ప్రాజెక్టులను, మన ప్రయోజనాలను, మన కరెంటును, మన నిధులను అన్నీ కైంకర్యం చేయడానికి ఆయన ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తూనే ఉన్నారు. 
ఇంత జరుగుతున్నా ఆంధ్ర నాయకత్వంలోని పార్టీలో ఉండి, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకులపై దాడి చేస్తున్నప్పుడు ఎవరికయినా కలిగే అనుమానమే ఇది. 
  • వీళ్లకు ఏమి ఖర్మ వచ్చింది? 
  • ఎందుకిలా మాట్లాడుతున్నారు? 
  • తెలంగాణ సోయి ఎందుకు రాలేదు? 
స్వరాష్ట్రం దక్కించుకున్నా తెలంగాణ ఆత్మగౌరవంపై ఆధిపత్యశక్తుల దాడు లు ఆగలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తెల్లోడే నయం అన్నవాళ్లున్నారు. ఇప్పుడు కూడా రాజశేఖర్‌రెడ్డే నయం, చంద్రబాబే నయం అనే బానిస రాజకీయ సంతతి ఇంకా తెలంగాణలో కొనసాగుతున్నది. వీళ్లకు ఇంకా సొంత తెలివి రాలేదు. ఆత్మగౌరవ చైతన్యం అసలే లేదు. ఇంకా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను చదవడమే. ఎవరో కీ ఇస్తే ఆడడమే. ఎవరో రెచ్చగొడితే వాగడమే. విచిత్రం ఏమంటే మోత్కుపల్లి, ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, ఒక పత్రికాధిపతి, ఒక మావోయిస్టు ప్రతినిధి, కొందరు బీజేపీ నేతలు అందరూ ఒకే బాణీలో ఒకే తీవ్రతలో మాట్లాడుతుండడం. వారికి మచ్చలు తప్ప చంద్రుడు కనిపించడం లేదు. తెలంగాణ సాధించుకుని మనం ఏమి ప్రయోజనం పొందామో వారు చూడదల్చుకోలేదు. మాట్లాడదల్చుకోలేదు. తెలంగాణ అంతా సాఫీగా జరిగిపోతుండడం చూసి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అజీర్తితో అస్తమానం మీడియా ముందు వాంతులు చేసుకుంటున్నారు. కొందరయితే తమ రాజకీయ సైజును మించి ఊహించుకుంటున్నారు, ఎట్లబడితే అట్ల మాట్లాడుతున్నారు. ఇందులో ఒకటే సూత్రం చంద్రబాబుకు అక్కడ ఏమి చేసినా ప్రతిష్ఠ పెరగడం లేదు. నేరుగా ప్రజలను ఆదుకునే పని ఏదీ జరగడం లేదు కూడా. రుణమాఫీ కంపు కంపు చేసి వదిలిపెట్టారు. డ్వాక్రా మహిళలను నట్టేట ముంచారు. అక్కడ రైతుల ఆత్మహత్యలు యథాతథం. పాత ప్రాజెక్టులకు మరోసారి శంఖుస్థాపనలు చేయించడం తప్ప పారిశ్రామిక ప్రగతి కూడా గొప్పగా ముం దుకు సాగడం లేదు. ఇంతకాలం ఆంధ్ర ఆదాయంతో తెలంగాణను పోషించినట్టు గా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు తేలిపోయింది. ఆంధ్ర లోటు రాష్ట్రమని. ఆయనకు సమస్యలు తలెత్తడం సహజం. వాటిని ఎదుర్కోవడానికి ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడడం లేదు. వాటిని పరిష్కరించుకోవడానికి ఎక్కడ దృష్టిని కేంద్రీకరించుకోవాలో అక్కడ కేంద్రీకరించడం లేదు.

అందుకే ఆయన పక్క రాష్ట్రంపై దృష్టిని మళ్లించారు. మనం పెరగకపోయినా పర్వాలేదు, పక్క వాడి ప్రతిష్టను తగ్గించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును బద్నాం చేయడం ఎలా అన్న అంశంపై ఆయన చాలా యాతన పడుతున్నాడు. మీకు తెలుసా వారు డెయిలీ వేజెస్ తీసుకుని మాట్లాడుతారు. ఏ రోజుకారోజే చంద్రబాబు దగ్గరికెళ్లి చెయ్యి చాపుతారు. చంద్రబాబు ఏమీ చెయ్యకపోతే నాలుగురోజులు మాటలు బందు. కూలీ ఇస్తేనే ప్రెస్ కాన్ఫరెన్సులు. చంద్రబాబు ఎంత డబ్బయినా ఖర్చు చేసి తెలంగాణలో దుకాణం కాపాడుకోవాలనుకుంటున్నాడు అని టీడీపీ వార్తలు రాసే ఒక జర్నలిస్టు చేసిన వ్యాఖ్య విన్నప్పుడు విస్మయం కలిగింది. అమర్యాదకరంగా అనిపించింది. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవరికయినా అలా అనిపించే అవకాశం ఉంది. చంద్రబాబు తన ప్రాధాన్యం, తన ప్రాంతం ఆంధ్ర అని విభజనకు ముందే రుజువు చేసుకున్నారు. తెలంగాణలో ఇంక తనకేమీ మిగలదన్న చైతన్యం ఆయనకు అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. ఇక్కడ ఈ మాత్రం ఎమ్మెల్యేలు గెలుస్తారని చంద్రబాబు కూడా ఊహించలేదు. ఇప్పుడు కూడా తెలంగాణ వ్యతిరేకతను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. దాచుకోలేడు. మన ప్రాజెక్టులను, మన ప్రయోజనాలను, మన కరెంటును, మన నిధులను అన్నీ కైంకర్యం చేయడానికి ఆయన ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఆంధ్ర నాయకత్వంలోని పార్టీలో ఉండి, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలో ఉండి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నాయకులపై దాడి చేస్తున్నప్పుడు ఎవరికయినా కలిగే అనుమానమే ఇది. వీళ్లకు ఏమి ఖర్మ వచ్చింది? ఎందుకిలా మాట్లాడుతున్నారు? తెలంగాణ సోయి ఎందుకు రాలేదు? అని ఎవరయినా ప్రశ్నిస్తారు.

తెలంగాణలో అసలు విమర్శ ఉండకూడదా అని కొందరు ప్రశిస్తున్నారు. ముఖ్యమంత్రిలో ప్రతికూలాంశాలు లేవా అని మరొకాయన ప్రశ్నించారు. విమర్శ ఉండాలి, విచక్షణ కూడా ఉండాలి. విమర్శ వినేవాళ్లకూ సహేతుకం అనిపించాలి. ఎవడో ఎక్కించిన కుళ్లును ఇక్కడ కుమ్మరించడం కాదు. ప్రతికూలాంశాలు మాట్లాడడానికి ఇంకా చాలా సమయం ఉంది. తెలంగాణ వచ్చిన పదిమాసాల్లో సాధించిన ఎన్నో మంచి పనుల గురించి ఎందుకు మాట్లాడరు? మన హక్కులను మనం ప్రకటించుకుంటున్నాం. మన ప్రయోజనాలను మనం కాపాడుకుంటున్నాం. మన ప్రభుత్వం మన మనసుతో పనిచేస్తున్నది. అది ఎందుకు చూడడం లేదు? ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు సైతం మన రాష్ట్రం చేస్తున్న మంచి పనులను, చేపట్టిన పథకాలను మెచ్చుకుంటున్నారు. మీరు అదృష్టవంతులు. మీకు మంచి ముఖ్యమం త్రి దొరికారు. రాష్ర్టానికి సంబంధించి ఆయనకున్న అవగాహన, ఆలోచనలు అద్భు తం. మీరు చేయవలసిందల్లా మరో పదేళ్లపాటు ఆయన చల్లగా ఉండేట్టు, అధికారంలో ఉండేట్టు చూసుకోవడమే అని ఢిల్లీ నుంచి వచ్చిన ఒక అత్యున్నత అధికారి ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా జిల్లా అధికారులతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో చెప్పారు. చంద్రశేఖర్‌రావు అందరిలాగా అధికారం అనుభవించవచ్చు. కానీ ఆయన తెల్లవారుజామున రెండుగంటల దాకా ప్రాజెక్టుల గురించి శోధిస్తారు. నెట్ ప్రపంచంలో చొరబడి గూగుల్ మ్యాప్‌లను ముందేసుకుని తెలంగాణలో ఏ నీరు ఎటు ప్రవహిస్తుంది? ఏ ప్రాంతం సముద్రమట్టం నుంచి ఎంత ఎత్తున ఉంది? ఏ నది వెడల్పు ఎంత? ఎక్కడ ప్రాజెక్టులు కడితే ఎంత ప్రయోజనం? ఏ వాగులు ఎక్కడ ఉన్నాయి అని గంటల తరబడి చూస్తారు. ఆయన గూగుల్ చేసి, గుర్తులు పెట్టి, కాపీ చేసిన మ్యాపులు చూస్తే ఆయన పడుతున్న ఆరాటం, తపన ఎంతో తెలుస్తాయి. మ్యాపుల ముందు నిలబడి బడి పంతులులాగా తమ పార్టీ నాయకులందరికీ పాఠాలు చెబుతుంటే ఢిల్లీ అధికారులు చేసిన వ్యాఖ్యల్లోని సామంజస్యం అర్థమవుతుంది. కంప్యూటర్లు, ల్యాపుటాపులు, మొబై లు ఫోన్లు తెలుగు ప్రజలకు నేనే పరిచయం చేశానని చెబుతున్న నాయకులకు రాష్ట్రంలో ఏ నది ఎక్కడ, ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో తెలుసని అనుకోలేం.

అంతేకాదు చంద్రశేఖర్‌రావు విద్యుత్ రంగంలో ప్రారంభించింది ఒక విప్లవమే. చంద్రబాబు అధికారంలోకి రాగానే పీపీఏలను తెచ్చాడు. ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ ధనాన్ని, భూములను ధారాదత్తం చేసి కమీషన్లు నొక్కేసి విద్యుత్ ఉత్పాదన రంగం జుట్టును ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టాడు. విద్యుత్ రంగంలో గవర్నమెంట్ టు గవర్నమెంటు(జీటుజీ) విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దే. ఇప్పటివరకు రూపకల్పన చేసిన ప్రధాన విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులన్నీ ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోనే పెట్టారు. జెన్‌కో, సింగరేణి, ఎన్‌టిపీసీలు ఉత్పాదన చేస్తాయి. వాటికి అవసరమైన వ్యవస్థాపన యంత్రాలన్నీ బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారు. చంద్రబాబు నుంచి ఇటువంటిది కలలోనైనా ఊహించగలమా? అన్నింటినీ మించి విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా ఆయన తీసుకున్న చర్యలు అసాధారణమైనవి. నిన్నగాక మొన్న రాష్ట్రం వచ్చింది. కొత్తగా విద్యుత్ ఉత్పాదన ఏదీ ప్రారంభం కాలేదు. కేసీఆర్ చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదీ లేదు. కానీ ఆరు మాసాల్లోనే కరెంటు కోతలు లేని తెలంగాణను చూపించారు. విద్యుత్ ఇవ్వగలిగితే గ్రామాల్లో రైతులకు ఎంత ఊరట లభిస్తుందో ఈ వేసవి అనుభవం చెబుతున్నది. ఈసారి ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు మోటార్లు పదేపదే కాలిపోవడాలు, సబ్ స్టేషన్ల చుట్టూ, మెకానిక్‌ల చుట్టూ తిరగడాలు బాగా తగ్గిపోయాయి. ఇది ఎలా సాధ్యమైంది? అంటే మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి, మన మనసుతో ఆలోచిస్తే మార్గం ఉంటుంటుదని ఆయన రుజువు చేశారు. ఇంకో విచిత్రం కూడా గమనించాలి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను కరెంటు కోతలతో నరకయాతనకు గురిచేసిన ఆంధ్ర నాయకత్వం, విడిపోగానే ఆంధ్రలో 24 గంటల కరెంటు ఎలా ఇవ్వగలుతున్నారు? ఇప్పుడు ఆంధ్రలో 24 గంటలు కరెంటు ఇవ్వగలిగిన ప్రభువులు గతంలో తెలంగాణలో ఆరుగంటలు కరెంటు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? సమైక్యపాలనలో ఎండాకాలం రాకముందే జనవరిలోనే కరెంటుకోతలు మొదలయ్యేవి.జనవరిలో నగరాల్లో ఒక గంట కోతతో మొదలయి, మే వచ్చే సరికి నాలుగు గంటలు కోతలు విధించేవారు. రైతులనయితే పూర్తిగా గాలికి వదిలేసేవారు. మరి ఇప్పుడెలా సాధ్యమైంది? మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పెడతాడని సామెత. పరాయివాడు ముందు వరుసలో కూర్చున్నా పెట్టడు. సమైక్య ముఖ్యమంత్రులు తెలంగాణకు ఎప్పుడూ పరాయివాళ్లే. కేసీఆర్ మన ముఖ్యమంత్రి, మనసు పెట్టి మన వాళ్లకు ఇబ్బంది రాకుండా చూడాలని తపించాడు కాబట్టి సాధ్యమైంది.
అదొక్కటే కాదు నాగార్జునసాగర్ ఎడమకాలువ నుంచి మన వాటా నీరు మనం తీసుకోగలిగామన్నా, రాజోలిబండ మళ్లింపు కాలువ నుంచి రబీలో కూడా మన వాటా తుంగభద్ర నీరు తెచ్చుకున్నామన్నా, తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను వేగిర పర్చామన్నా, మిషన్ కాకతీయను ఒక యజ్ఞంలా చేస్తున్నామన్నా తెలంగాణ చైతన్యం, అంకితభావం కలిగిన మన నాయకులు ఉన్నారు కాబట్టే సాధ్యమయింది. సంక్షేమ పథకాల అమలులో కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి మానవీయ దృక్పథంతో వ్యవహరించింది. అమలులో కొన్ని లోటుపాట్లు జరిగి ఉండవచ్చు. కానీ మునుపెన్నడూ లేనంత మందికి పింఛన్లు ఇస్తున్నారు. మునుపెన్నడూ ఖర్చు చేయనన్ని నిధులు సంక్షేమంపై పెడుతున్నారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మంచి అన్నం పెట్టాలన్న ఆలోచన గతంలో ఎప్పుడయినా చేశారా? తెలంగాణ ఏర్పడి పది మాసాలే అవుతున్నది. అయినా ఒక గణనీయమైన, గుణాత్మకమైన మార్పును చూపించగలిగారు కేసీఆర్. అయినా తెలంగాణకు చేసుకోవాల్సిన మేలు ఇంకా చాలా చాలా ఉంది. అందుకు ఒక నిర్మాణాత్మక రాజకీయ వాతావరణం అవసరం. విధ్వంసకర రాజకీయాలు, ఉన్మాద దాడులు రాష్ర్టానికి మేలు చేయవు. అటువంటి శక్తులను తెలంగాణ సమాజం ఇప్పటికే నేలకేసి కొట్టింది. అయినా వారు మళ్లీ మళ్లీ వెర్రితలలు వేస్తూనే ఉన్నారు. కష్టపడి త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం ఇటువంటి నక్కలను చూసి చలించదు. వారి కూతలను, రాతలను లెక్కపెట్టదు.
-kattashekar@gmail.com


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!