[పోతన 534వ జయంత్యుత్సవాల సందర్భంగా బమ్మెర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటుచేసిన కవిసమ్మేళనంలో నేను రచించి, పఠించిన పద్యములు]
కం.
శ్రీరామాజ్ఞప్తకథా
భార! భవహరాప్త కృత్య! భాగవతాఖ్యో
ద్ధారాంచిత శబ్దాలం
కార యుత పురాణకర్త! కవి పోతన్నా! 1
సీ.
కాకతీయుల యోరుగల్లున విలసిల్లు బమ్మెర గ్రామానఁ బ్రభవమంది;
పిన్ననాఁటనె రంగ వీక్షిత భాగవతమును వ్రాసెదనని తల్లికి నని;
జనని యాశీర్వచ స్సత్త్వమ్ముచే వెల్గి, సహజకవిత్వ విశారదుఁడయి;
భాగవతముఁ దెల్గువారల కిడఁగాను తెనిఁగింప సమకట్టి, తేజమెసఁగ,
గీ.
హరికథా మహత్త్వవిశిష్ట చరితములను భక్తిభావసమంచితాసక్తి మెఱయ,
ద్వాదశస్కంధయుక్త సత్ప్రకర వర సమేతను లిఖించె బమ్మెర పోతసుకవి! 2
ఉ.
కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేడ్చునట్టి యా
హాటకగర్భురాణికిని "నాఁకఁటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ" నటంచుఁ ద్రిశుద్ధిగన్ వెసన్
మాట యొసంగినాఁడవయ మాన్యుఁడ! బమ్మెర పోత సత్కవీ! 3
మ.
భళిరా సత్కవి పోతరా డ్విదిత శబ్దవ్యాప్త సమ్మోహకా!
గళితాఘాద్రి మహాంధ్రభాగవత నిర్ఘాతా! ప్రసిద్ధాంశ స
న్మిళితానేక సమస్త పుణ్య సుకథా నిశ్శ్రేయస ప్రాప్త! ని
ర్దళితోత్కృష్టతరానయప్రకర! సర్వామోద సంధాయకా! 4
చం.
నవవిధ భక్తి మార్గముల నవ్యవిధమ్మున వ్రాసినావు భా
గవత పురాణమున్ విమల కమ్రసుశబ్దయుతార్థ పద్య సం
రవముల శింజినుల్ మొరయ రమ్యతరాంచిత ముక్తి యుక్తమై
శివకర సత్య సుందర వశీకరణమ్ముగ భక్తపోతనా! 5
స్వస్తి