గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 29, 2014

శ్రీశైలంలోనే కృష్ణమ్మ బందీ!

- ఇన్‌ఫ్లో కొనసాగుతున్నా నీటి విడుదల శూన్యం
- పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలింపు?
- విద్యుదుత్పత్తికి వినియోగించిన నీరే సాగర్‌కు..
ఎగువ రాష్ర్టాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నా.. ఆ ఆ ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు మాత్రం నీటి విడుదల జరగడం లేదు. ఎగువ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణ్‌పూర్, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు రోజుకు కనీసం లక్ష క్యూసెక్కులకుపైనే ఇన్‌ఫ్లో వస్తున్నది. ఫలితంగా ప్రాజెక్టు నీటిమట్టం కూడా వేగంగా పెరుగుతున్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 877.30 అడుగులమేర నీరుంది. నిబంధనల ప్రకారం నీటిమట్టం 834 అడుగులు దాటగానే దిగువన ఉన్న నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయాలి.
SRISAILAMకానీ ఇప్పటికీ సాగర్‌కు నీటివిడుదల జరగడం లేదు. నీటిని ప్రాజెక్టులోనే నిల్వ ఉంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటిని రాయలసీమకు తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీశైలంలో 841 అడుగులమేర నీరు చేరితే కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు ద్వారా తరలిపోయేందుకు వీలుగా మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజమార్గం వేశారు. దీంతో నాగార్జునసాగర్‌కు రావలసిన నీటిలో గండిపడుతున్నదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కేవలం శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం వదులుతున్న నీరే సాగర్‌కు వస్తున్నది.

బుధవారం ఒక్కరోజే శ్రీశైలానికి 1,53,581 క్యూసెక్కుల నీరు వచ్చి చేరితే, సాగర్‌కు కేవలం 45,190 క్యూసెక్కులు మాత్రమే వదిలారు. ఇది కూడా విద్యుదుత్పత్తికి వినియోగించిందే కావడం గమనార్హం. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా, ప్రస్తుతం 546.70 అడుగులు మాత్రమే నీరుంది. సాగర్‌కు 33,321 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే వస్తుండగా, ప్రాజెక్టు నుంచి 28,312 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. మరో ఏడు అడుగుల నీరు చేరితే శ్రీశైలం పూర్తిగా నిండనుండగా, నాగార్జునసాగర్ నిండాలంటే మాత్రం మరో 44 అడుగుల మేర నీరుచేరాలి.

SRISAILAM2

6 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...


అయ్యా, మధుసూదన్ గారూ,మీరుపెద్దవారు.నేనూ పెద్దవాడినే. మీరు పండితులు కూడా.మన రాష్ట్రాలు విడిపోయాయి.జరిగిందేదో జరిగింది.ఇరు వైపులా సామాన్య ప్రజలు సఖ్యంగానే ఉన్నారు.మీవంటివారు విద్వేషాలని రేపే బ్లాగులు రోజూ వ్రాయడం బాగులేదు.ఉదాహరణకి ;నాగార్జునసాగర్ నీరు తెలంగాణా జిల్లాలకే కాదు.కోస్తా ఆంధ్రా జిల్లాలకి కూడా చాలా ఉపయోగపడుతున్నది. మరి శ్రీశైలం నుంచి నీరు నాగార్జునసాగర్కి ఎందుకు అడ్డుకొంటారు.?ఈ విషయాలు technical matters ఇరువైపులా ఇంజనీర్లు,water boards,entral water commission చూసుకొంటాయి. మీరు సాహిత్యవిషయాలకి,కవిత్వానికి పరిమితం ఐతే మంచిదేమో.ఇలా వ్రాసినందుకు మన్నించండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఆర్యా, కమనీయంగారూ! నా టపాలలో అసత్యాలేమైనా ఉన్నచో తమరు ఆక్షేపించినచో నాకు సంతోషదాయకమవుతుంది గానీ, నేను నా బ్లాగులో సత్యాలను బహిర్గత పఱచినచో నష్టమేమి? మొదటినుండియు తెలంగాణకు జరుగుచుండిన యన్యాయమిదియే! మీడియా అసత్యప్రచారాలు చేయుచు, యథార్థాలను తెలంగాణ ప్రజల దృష్టికి రానీయకపోవడం వల్ల తెలంగాణ ఎంతయో నష్టపోయినది. రాష్ట్రము విడిపోయినను అక్రమార్కుల దురాగతములు కొనసాగుచునే యున్నందున నేను నా బ్లాగుముఖమున తెలంగాణ ప్రజలకు తెలియజేయుచున్నాను. నేను కేవలము అక్రమముల బహిర్గతపఱచుచుంటినేగాని, నా సోదర సీమాంధ్రులను ఎంతమాత్రమును కించపఱచుటలేదు. దౌష్ట్యముల నెఱుకపఱచుచుంటినేగాని, నా సోదరులను ఇబ్బందులకు గుఱిచేయుటలేదు. తెలంగాణులను ఎండబెట్టి సీమాంధ్రసోదరులు బాగుపడగోరుదురా? అట్లు కాఁగోరిన మీరు మాకు సోదరులెట్లగుదురు? కారుగదా! కావున నా ప్రయత్నములకు తమరు అడ్డుపడకుండ, నేను చేయుచున్న యజ్ఞమును కొనసాగనీయవలసినదిగా మనవి. స్వస్తి.

కమనీయం చెప్పారు...


ఆర్యా,సరే మంచిదే.అలాగే కానీండి.విద్వేషాలు పెరగకుండా రాస్తే మంచిదే. నేనేమీ అడ్డుపడను.కాని నాదొక సందేహం.50 సం;పైగా ఆం;ప్ర;ప్రభుత్వంలో తెలంగాణా మంత్రులు,శాసనసభ్యులు, జిల్లాపరిషత్ సభ్యులు,ఇంకా ఉన్నతాధికార్లు,ఉన్నారు కదా.వారంతా ఇన్నాళ్ళు ఏమి చేస్తూఉండినారు? నలుగురు తెలంగాణా ప్రాంత ముఖ్య మంత్రులు కూడా ఉండినారుకదా.కేవలం వలసవాదులని నిందించడమెందుకు?అందులోను,మనది ప్రజాస్వామ్య వ్యవస్థ కదా.ఏ బ్రిటిష్ ,లేక నిజాం నిరంకుశ రాజ్యమూ కాదుకదా అణచివేయడానికి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అయ్యా కమనీయంగారూ,

గతంలో వందల సంవత్సరాలనుండి నిజాం పాలకులు, ఆంధ్రా పాలకుల పాలనలో బానిసత్వంలో మ్రగ్గిన తెలంగాణులు విద్యకూ, జ్ఞానానికీ దూరమై అమాయక జీవనం గడపడం వల్ల, తెలివైన పాలకులయిన ఆంధ్రాపాలకులు, తెలంగాణ నాయకులను, అధికారులను రకరకాల లాబీయింగులూ, నజరానాలూ, పదవుల ఎరవేసి, వాళ్ళను తమ గుప్పిట్లో పెట్టుకొని తమ పబ్బం గడుపుకుంటుండడం వల్ల తెలంగాణా ఉపేక్షకు గురైంది. ఈ విషయం మీకు తెలియందికాదు. తెలంగాణ నాయకులు, అధికారులు స్వార్థంతో ఆంధ్రానాయకులకు బానిసలైన తర్వాత, మనం ప్రజాస్వామ్యం అంటూ ఎంత గొంతుచించుకున్నా ఏం లాభం? తెలంగాణ రిమోట్ కంట్రోల్ ఆంధ్రా నాయకుల చేతిలో వున్న తర్వాత, తెలంగాణ నాయకులేంచేయగలుగుతారు? అందువల్లే తెలంగాణ ఉపేక్షకు గురై, వెనుకబడిపోయింది, నష్టపోయింది! మా బంగారమే మంచిదికానప్పుడు ఎవర్నని ఏంలాభం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడింతర్వాత కూడా ఆంధ్రా అక్రమార్కుల దౌష్ట్యం కొనసాగుతూనే ఉన్నది. ఇదే మా బాధ. దీనికి ముగింపు పలకడం కోసమే మేం కృషిచేస్తున్నాం. త్వరలోనే ఇది సంభవమవుతుంది. చూస్తూ వుండండి. స్వస్తి.

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

తెలంగాణా రాష్ట్రంగా విడిపోయినా ఆంధ్రా నాయకుల ప్రయత్నాల వలన ఇంకా తెలంగాణా అన్యాయానికి గురవుతున్నది వాస్తవం - ఆ వాస్తవాలనే నమస్తే తెలంగాణా పత్రికలో ప్రస్తావిస్తున్నారు - వాటినే మధుసూధన రావు గారు యథాతథంగా తమ బ్లాగ్ లో ఉంచుతున్నారు. అన్యాయాలని ప్రశ్నించటం కూడా తప్పంటే ఎలా? నిజానికి గత 2-3 సంవత్సరాలలో ఏ ఒక్క తెలంగాణ వాది సీమాంద్రులను ద్వేషించటం కాని దూషించటం కాని చేయలేదు. కేవలం తెలంగాణా కావాలనే ఆకాంక్షను తెలుపుకున్నారు, అందుకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నాయకులనే ప్రశ్నించారు. అయినా కొందరు సీమాంధ్రకు చెందిన బ్లాగర్లు ఆనాడే కాదు నేటికీ తెలంగాణా వారిని తెలబాన్లు అని ప్రత్యేకంగా దూషిస్తూ రాశారు. అవి మీ దృష్టికి రాకపోవటం చిత్రంగా ఉంది. పనిగట్టుకుని ప్రతినిత్యం తెలంగాణా వారిని దూషిస్తున్న ఆ బ్లాగర్లను మీరు ప్రశ్నించటం పోయి తెలంగాణాకు జరుగుతున్నా అన్యాయం గురించి తెలిపే వారిని తప్పుబట్టటం సబబు కాదు. అన్యాయాలని తెలుపుకోవటం ప్రతి భారత పౌరుని హక్కు. ఆ హక్కుని దుర్వినియోగ పరుస్తూ తెలబాన్లు అని తెలంగాణా వారిపైన విషం కక్కి దూషించే వారిని మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది. తెలంగాణాకు జరిగే అన్యాయాలని ఎండగట్టే మధుసూధన రావుగారిని స్వేచ్చగా వారిపని వారు చేసుకోనీయండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు మల్లికార్జునస్వామిగారూ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి