గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 01, 2014

రెండు వేల ఎకరాలతో సినిమా సిటీ

-తక్షణమే మినరల్ కార్పొరేషన్ ఏర్పాటు
-ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు
-ఫార్మా సిటీ, కెమికల్ సిటీలకు ప్రతిపాదన
-టీఐఐసీకి ఐదు లక్షల ఎకరాల సేకరణ లక్ష్యం
-హైదరాబాద్ మాస్టర్‌ప్లాన్‌తో ఐటీఐఆర్ అనుసంధానం
-విద్యార్థులకు పరిశ్రమల్లో ప్రాక్టికల్స్
-పారిశ్రామిక విధానంపై సమీక్షలో సీఎం విజన్
హైదరాబాద్ సమీపంలో దాదాపు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సినిమా సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందులో సినీ నిర్మాణానికి అవసరమైన అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అన్ని రకాల పరికరాలు, వసతులు కల్పించాలని ఆయన సంకల్పించారు. రెగ్యులర్ స్టూడియోలతో పాటు గ్రాఫిక్స్ ఇతర విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నది ఆయన విజన్‌గా ఉంది. గురువారం సచివాలయంలో పారిశ్రామిక విధానంపై జరిగిన సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. 
cinemacityసినిమా సిటీ ఇప్పటికే ఇక్కడున్న సినీ పరిశ్రమకు చేదోడు వాదోడుగా ఉంటుందని, రాజధానిలో సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. ఫలితంగా స్థానికులకు మరిన్ని ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని, సాహితీరంగంలోని వారికి కూడా మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ప్రముఖ స్థానం చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ ఇక్కడినుంచి తరలిపోతుందన్న అభిప్రాయాలను ఆయన కొట్టిపారేశారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ పరిశ్రమ హైదరాబాద్‌నుంచి తరలిపోదని అంటూ ఇంతటి మంచి వాతావరణం ఉన్న నగరం ఎక్కడా లేదని నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. చాలాకాలంగా సినిమా షూటింగులు, టీవీ సీరియల్ నిర్మాణాలు హైదరాబాద్‌లో బాగా పుంజుకున్నాయని తగిన వసతులు కల్పిస్తే ఇతర రాష్ర్టాల వారు కూడా వస్తారని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా ఈ సినిమా సిటీ నిర్మాణం జరిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆయన మార్గదర్శనం చేశారు. అంతర్జాతీయంగా సినిమాల్లో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్‌లాంటి సాంకేతిక అంశాలకు చాలా ప్రాముఖ్యం పెరిగిందని, ఇలాంటి అధునాతన ధోరణులను గమనించి తదనుగుణంగా సినిమా సిటీని రూపొందించాలని ఆయన సూచించారు.

సత్వరమే మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్..

రాష్ట్రంలో మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తెలంగాణ అపార ఖనిజ నిక్షేపాలకు నిలయంగా ఉందని వాటిని వెలికితీసి పారిశ్రామికీకరణకు వినియోగించాల్సి ఉందని అన్నారు. తెలంగాణ సహజ వనరుల ను, మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా పారిశ్రామిక విధానం ఉండాలని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలం గాణలోని ఖనిజాలు, గనులను తీవ్ర నిర్లక్ష్యం చేశారని సీఎం అభిప్రాయపడ్డారు.

వరంగల్-ఖమ్మం జిల్లాలోని లక్షా యాభైవేల ఎకరాల్లో అపార ఖనిజ సంపద ఉంటే అది పనికిరానిదని దుష్ప్రచారం చేశారని, అయితే అదే ఖనిజంతో రూ. 30వేల కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందు కు స్టీల్ అథారిటీ ఆప్ ఇండియా ముందుకు వచ్చిందని చెప్పారు. బయ్యారం ఇనుప ఖనిజం ఎంత ఉపయుక్తమో ఈ ఉదాహరణ రుజువు చేసిందని తెలిపారు.

ఫార్మా, కెమికల్ సిటీలు...

పారిశ్రామికాభివృద్ధికి దోహదపడేలా ఒక ఫార్మాసిటీతోపాటు ఒక కెమికల్ సిటీ ఏర్పాటు కావాలని సీఎం అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు, విధానాలు రూపొందించాలని, వీటి ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పారిశ్రామిక వేత్తలు ఏ రంగంలో పెట్టుబడికోసం ముందుకు వచ్చినా రాష్ట్రంలో అందుకు అవకాశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని దానిని హైదరాబాద్ మాస్టర్‌ప్లాన్‌కు అనుసంధానం చేసి సమగ్ర ప్రణాళికలు తయారుచేయాలని సూచించారు.

భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా సీడ్ కాలనీలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని అన్నారు. ఇవి రైతుకు ఆర్థికంగా మంచి చేయూత అందిస్తాయని చెప్పారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత కలిగిన వాతావరణాన్ని వినియోగించి వివిధ రకాల పంటలతోపాటు విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తే దేశంలోని వివిధ ఆగ్రో ఇండస్ట్రీస్ తరలి వస్తాయని చెప్పారు.

వివిధ రంగాల అభివృద్ధి అవకాశాలేంటి?

రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, ఐటీ హార్డ్‌వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్, కాటన్, స్పిన్నింగ్, లెదర్, మైన్స్, మినరల్స్, వేస్ట్ మేనేజ్‌మెంట్, ప్లాస్టిక్ పాలిమర్, కెమికల్, జెమ్స్, పెరల్స్, జ్యూవెలర్స్, ఆటోమోబైల్స్ తదితర రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అన్ని అవకాశాలపై ఈ సమావేశంలో అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.

పారిశ్రామిక విధానంలో పాటించే పద్ధతులపై చర్చించారు. సింగిల్‌విండో, ఛేజింగ్ సెల్‌తో కూడిన పారిశ్రామిక విధానంలో ప్రతి రంగానికి పరిశ్రమలు ఏర్పాటు చేసేటప్పుడు వేర్వేరు పద్ధతులు అవలంబించాల్సి ఉంటుందని, అయితే విభాగాల వారీగా మాత్రం ఏకీకృత విధివిధానాలు తయారు చేసుకోవచ్చని వెసులుబాటుతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుతం ఉన్న చట్టాలు, విధానాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవసరమైన మార్పులు..చేర్పులూ చేయాలని, అవసరమైతే పాత చట్టాలని తొలగించి పూర్తిగా కొత్త చట్టాలను తేవాలని సీఎం ఆదేశించారు.

పరిశ్రమలతో కళాశాలల అనుసంధానం..

హైదరాబాద్‌లో ఇక్రిసాట్, డీఆర్‌డీఏ, ఐఐటీ లాంటి పరిశోధనా సంస్థలు ఉన్నాయని, అందువల్ల ఇంజనీరింగ్ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. కళాశాలల్లో చదివే విద్యార్ధులు విధిగా పరిశ్రమల్లో ప్రాక్టికల్స్ చేసే విధంగా విధాన రూపకల్పన చేయాలని ఆదేశించారు. దీనిద్వారా విద్యార్థులకు విద్య, జ్ఞానంతోపాటు అనుభవం వస్తుందని అభిప్రాయపడ్డారు. తద్వారా పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో రీసెర్చ్ కారిడార్ వ్యవస్థ ఉన్నదని, రాష్ట్రంలో కూడా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. టీఎస్‌ఐఐసీని బలోపేతం చేయాలని, ఐదు లక్షల ఎకరాల భూమిని సంస్థకు అప్పగించడంద్వారా పారిశ్రామిక వాడల అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడం తేలిక అవుతుందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే టీఎస్‌ఐఐసీ ఒక బలమైన ఆర్ధిక సంస్థగా ఎదుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్ నర్సింగ్‌రావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

rajiv raghav చెప్పారు...

మంచి ప్రాజెక్టు...
ఆయితే అన్న మాటల ప్రకారం కార్యరూపం దాల్చితే చాలా మందికి ఉపాధి కలుగుతుంది...
ఇలాంటి మంచి ఆలోచనలను సమర్దవంతమైన అధికారుల పర్యవేక్షణలో చేపడితే చాలా బాగుంటుంది..

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సంతోషం. ఇది మీరు వ్యంగ్యంగా అంటున్నారో, మనస్ఫూర్తిగా అంటున్నారో తెలియకున్నది. మనస్ఫూర్తిగా అంటే మాత్రం మీకు ధన్యవాదాలు! స్వస్తి.

rajiv raghav చెప్పారు...

సార్...
ఇక్కడ సామాన్య ప్రజలకు ఉపయెగపడే ఏ ప్రాజెక్టు ఎవరూ చేపట్టినా దానిని మనం మనసారా అహ్హనించాలి సార్..
అంతే తప్ప దాని పేరు చెప్పి బడాబాబులు లాభపడేదయితే దాని అంత దరిద్రం ఇంకోకటి లేదు. అది సీమాంధ్ర వాడయినా సరే, తెలంగాణా వాడయిన సరే...

నా గత కామెంటులు చూసి మీరు కనూప్యూజ్ ఆయినట్టున్నారు. కానీ ఒకటి చెప్పదల్చుకున్నాను మీకు. మంచి జరిగిన ప్రతి చోట నా సమర్దన ఉంటుంది. అలాగే చెడు జరిగిన ప్రతి చోట నా అభ్యంతరం ఉంటుంది... దానికి తెలంగాణా, ఆంధ్ర తో సంబంధం లేదు.

నేను వ్యంగ్యంగా వ్యాఖానించనంటే దానికి పై పోస్టులో వ్రాసిన అంశాలు కూడా కారణమవుతాయి. అలాగే మనస్ఫూర్తిగా వ్యాఖ్యానించడనంటే ఆ పోస్టులో ఉన్న నిజాయితీ కూడా కారణమవుతుంది. పై పోస్టులో నాకు నిజాయితీ కనబడీంది. ఎందుకంటే అందులో నాలాంటి సామాన్యులకు ఉపాధి దొరుకుతుంది.
(నాలాంటి అంటే సీమాంధ్రుడు అని అనుకోకండి..మీ తెలంగాణా వాడే అనుకొండి). ఇక్కడ అర్ద్రం కామన్ మేన్ అని మాత్రమే..

విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి. దాని మీద వచ్చే ప్రతివిమర్శలకు ఇచ్చే జవాబుల్లో కూడా హేతుబద్దత ఉండాలి. అంతే కాని నేను మిమ్మల్లి అనలేదు. కేవలం పాలకులను మాత్రమే అంటున్నాను అనే పలాయనవాదం సరికాదు. మీరు సీమాంధ్ర పాలకులకు అపాదిస్తున్న లక్షణాలుకు బాబు లాంటోళ్ళు మీ తెలంగాణాలో కూడా ఉన్నారు. ముందు వారి బాగోతాలు గూర్చి వ్రాయండి. అప్పుడు మీకు అందరి మద్దతు ఉంటుంది. అంతే కాని కేవలం ఒక ప్రాంతంను టార్గెటు చేయడం సరికాదు. ప్రాంతాభిమానం అనేది మీకంతో మాకు కూడా అంతే అని మీరు అర్ద్రం చేసుకోగలిగితే చాలు.. అదే పదివేలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి