గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఆగస్టు 20, 2014

ఉన్నత విద్యపై ఆంధ్రా పెత్తనం

-టీఎస్‌సీహెచ్‌ఈ ఏర్పాటైనా పెత్తనమంతా ఏపీసీహెచ్‌ఈదే
-తెలంగాణ రాష్ట్ర ఫైల్స్ కూడా ఆంధ్రా అధికారుల వద్దకే

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాటైనప్పటికీ ఉన్నత విద్యలో పెత్తనమంతా ఆంధ్రా విద్యా మండలి చేతుల్లోనే కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఫైళ్లు కూడా ఆంధ్రా అధికారులే చూస్తున్నారు. తెలంగాణ అధికారులకు ఒక్క ఫైల్ కూడా పంపడం లేదని సమాచారం. దీంతో తెలంగాణ విద్యా మండలి చైర్మన్, అధికారులు, సిబ్బంది, అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీఎస్‌సీహెచ్‌ఈకి అధికారులను నియమించినా అధికారాలు మాత్రం కట్టబెట్టలేదంటున్నారు. విద్యా మండలి అధికారులు రోజూ సందర్శకుల మాదిరిగా టీఎస్‌సీహెచ్‌ఈకి వచ్చిపోతున్నారు. కనీసం చాయ్, బిస్కెట్లకు కూడా తెలంగాణ అధికారులకు డబ్బుల్లేని దుస్థితి ఏర్పడిందని, తెలంగాణ విద్యా మండలికి కావాల్సిన ప్రతి పైసా తమ జేబు నుంచే ఖర్చు చేస్తున్నామని అధికారులు వాపోతున్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలిలో 52:48 నిష్పత్తి ప్రకారం ఆస్తులు, నిధులు పంచుకోవాల్సి ఉంది. కాని ఈ విషయంలో ఆంధ్రా సర్కారు ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో కూడా తమ పెత్తనం చెలాయించాలని ఆంధ్రా సర్కారు ఆదేశాల మేరకు మండలి విభజన ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.


ఆస్తులపై తప్పుడు లెక్కలు..!ఏపీ ఉన్నతవిద్యా మండలికి దాదాపు రూ.180 కోట్ల వరకు నిధులు ఉన్నాయని తెలిసింది. వీటిలో బ్యాంకు బ్యాలెన్స్‌తో పాటు పలు బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. బాండ్ల రూపంలో కూడా అనేక నిధులు ఉన్నట్లు తెలిసింది. ఏయే బ్యాంకులలోఎన్నెన్ని బాండ్లు, నిధులున్నాయనే అంశంపైనా ఆంధ్రా అధికారులు తప్పుడు లెక్కలు చూపించే పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిధుల స్వాహా కోసమే విభజన ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారాలు, ఆస్తుల పంపకానికి అనుమతివ్వాలని టీఎస్‌సీహెచ్‌ఈ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అయితే దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విద్యా శాఖ కార్యదర్శులు సమావేశం కావాలి. మండలి విభజన గురించి కూలంకషంగా చర్చించి విభజన ప్రక్రియ ముగించాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో పొందుపరిచిన ఉన్నత విద్యా మండలి, ఇంటర్మీడియట్ బోర్డును వీలైనంత త్వరగా విభజించాలని తెలంగాణ విద్యావేత్తలు రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యకుపై నిర్ణయాలలో టీఎస్‌సీహెచ్‌ఈ పాత్ర ఉండాలే తప్ప ఆంధ్ర విద్యామండలి ప్రమేయం ఉండకూడదని పేర్కొంటున్నారు. ఆంధ్ర అధికారులను కట్టడి చేయాలంటే విద్యా మండలి విభజనను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం నేత పీ మధుసూధన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విభజన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శికి వారం క్రితమే లేఖ రాశామని టీఎస్‌పీహెచ్‌ఈ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి