గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 26, 2014

రాయల్టీ హాంఫట్...!

-విజిలెన్స్ నిఘాలో బయటపడిన భారీ కుంభకోణం
-బోర్డును ముంచిన ఏడు బడా కంపెనీలు.. మరో పదహారు కంపెనీలదీ అదే తీరు
-అగ్రిమెంట్ల రద్దుకు సీవీసీ సిఫారసు.. నివేదికను తొక్కిపట్టిన సీమాంధ్ర పాలకులు
-సొంతింటికి దూరమవుతున్న సాధారణ ప్రజలు

రాజధానిలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల సొంతింటి కల ఎందుకు నెరవేరటం లేదు? ఒకప్పడు నాలుగైదు లక్షల్లో లభించిన ఒక మోస్తరు ఫ్లాట్ ధర ఇప్పుడు ఒక్కసారిగా ఆకాశానికి ఎందుకు ఎగబాకింది? సాధారణ ప్రజలకు ఇండ్లు కట్టించే రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఎందుకు జీవచ్ఛవంలా పడి ఉంది? దానికి ఉన్న భారీ ల్యాండ్ బ్యాంకు ఎలా పరుల హస్తగతమైంది? నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలకు స్వయంగా విజిలెన్స్ కమిషన్ ఆదేశించినా ఎందుకు చర్యలు లేవు?..

RAMKYఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తే ఉమ్మడి రాష్ట్రంలో గత సీమాంధ్ర సర్కారులు హౌసింగ్ బోర్డును ఒక ఆదాయ వనరుగా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. బోర్డుకు రావాల్సిన సొమ్ములను ప్రభుత్వ ఖాతాలో జమ చేయించుకున్న ఉదంతం వెల్లడవుతుంది. తమవారికి దోచిపెట్టిన ప్రభుత్వ దోపిడీదందా సాక్షాత్కరిస్తుంది. నిబంధనలకు పాతరేసిన వైనం ఇండ్లులేని ప్రజలను పరిహసిస్తుంటుంది. బోర్డుకు కట్టాల్సిన రాయల్టీని దర్జాగా ఎగవేసిన బడా కంపెనీల అసలు స్వరూపం నగ్నంగా నిలబడుతుంది. అన్నింటికి మించి.. 1200 కోట్ల రూపాయల కుంభకోణం వికటాట్టహాసం చేస్తూ తాండవం చేస్తుంటుంది!

ఏపీ హౌసింగ్ బోర్డులో కళ్లు తిరిగే కుంభకోణం బయటపడింది. పెట్టుబడిదారులు, గత వలస పాలకులు కుమ్మక్కయిన ఫలితంగా ఏపీ హౌసింగ్‌బోర్డుకు 1200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. నిబంధనలకు బిల్డర్లు పాతరేయడం, కట్టాల్సిన రాయల్టీలు కట్టకపోవడం, చెల్లింపులలో జాప్యం, వడ్డీలు కలుపుకొంటే బోర్డుకు ఇంతటి నష్టం కలిగిందని సాక్షాత్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ పేర్కొంది. ఈ అక్రమాలను సరి చేసేందుకు సీవీసీ పలు సిఫారసులు చేసినా.. నాటి సీమాంధ్ర ప్రభుత్వాల్లోని పలువురు అధికారులు ప్రభుత్వ నేతల ఒత్తిళ్లతో ఫైలును తొక్కిపట్టారని సమాచారం.
ఏమిటీ హౌసింగ్‌బోర్డు?:

లాభాపేక్ష లేకుండా.. పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి, దిగువ మధ్యతరగతివర్గాలకు ఇండ్లు నిర్మించి, విక్రయించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా మార్కెట్‌లో తక్కువ ధరకు ఇండ్లను నిర్మించడం దీని లక్ష్యం. ఇందుకోసం ఈ సంస్థకు భారీ స్థాయిలో ల్యాండ్ బ్యాంకు కూడా ఉండేది. హౌసింగ్ బోర్డు ఇండ్ల నిర్మాణరంగంలో క్రియాశీల పాత్ర పోషించినంతకాలం నిర్మాణ ధరలు నియంత్రణలో ఉన్నాయి. 2004కు ముందు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, శ్రీనగర్‌కాలనీ, యూసఫ్‌గూడ, ముషీరాబాద్, ఆబిడ్స్, హిమాయత్‌నగర్‌వంటి కోర్ ఏరియాల్లో వెయ్యి గజాల ప్లాట్ కేవలం రూ.4.50లక్షల నుంచి 5.50 లక్షలకే ప్రైవేట్ బిల్డర్ల వద్ద లభించేవి. ఇలా నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను హౌసింగ్ బోర్డు నియంత్రణలో ఉంచగలిగింది.
ఉదారమైన లక్ష్యాలున్న ఈ సంస్థను మూసివేసేందుకు నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే.. మరో అడుగు ముందుకేసిన తర్వాతి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంస్థను మూసివేయలేదుకానీ..

జీవచ్ఛవంగా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
హౌసింగ్‌బోర్డు ల్యాండ్ బ్యాంకును రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎరగా వేశారు. నగరంలో భూమి, అపార్ట్‌మెంటు ఫ్లాట్‌ల ధరలను అమాంతంగా ఆకాశానికి పెంచేశారు. ఫలితంగా హైదరాబాద్‌లో సొంతిల్లు కొనడం కాదు కదా.. కనీసం కలగనే పరిస్థితి లేకుండా పోయింది. నిజాంకాలం నుంచి నగరంలో ఇండ్ల నిర్మాణం కోసం సేకరించిన ల్యాండ్ బ్యాంక్‌పై కన్నేసిన సీమాధ్ర భూ రాబందులు.. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో పావులు కదిపాయి. జాయింట్ వెంచర్ల పేరుతో కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకున్నాయి.

జాయింట్ వెంచర్ల పేరుతో శఠగోపం..

హౌసింగ్ బోర్డు ఇండ్లు నిర్మించి, విక్రయించే పద్ధతికి వైఎస్ ప్రభ్వుత్వం తెరదించింది. ఆ పనిని జాయింట్ వెంచర్లకు కట్టబెట్టారు. కొన్ని షరతులు విధించారు. వీటి ప్రకారం.. ఈ భూములు కొనుగోలు చేసిన జాయింట్ వెంచర్లు 30 నెలల్లో నిబంధనల ప్రకారం ఇండ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఎల్‌ఐజీలతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్‌లుకూడా నిర్మించుకోవడానికి అనుమతించారు. ఇలా నిర్మించిన వాటిని విక్రయించగా వచ్చిన ఆదాయం నుంచి 3.5% హౌసింగ్ బోర్డుకు రాయల్టీగా చెల్లించి కొనుగోలుచేసిన వారి పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించాలి. ఈ రిజిస్ట్రేషన్లను నేరుగా హౌసింగ్ బోర్డు నిర్వహించాలి. అయితే బిల్డర్లు మార్కెట్ చేసుకోవడానికి అనుకూలంగా సేల్ అగ్రిమెంట్లు చేసుకోవడానికి మాత్రం హౌసింగ్ బోర్డు అనుమతించింది. దీన్ని అడ్డుపెట్టుకున్న బడాబాబులు హౌసింగ్ బోర్డుకు రాయల్టీ ఎగవేసి, సేల్ అగ్రిమెంట్లద్వారా నిర్మాణాలను అమ్మేసుకున్నారు.

ఇప్పటివరకు ఒక్క నిర్మాణం కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. పైగా వీటిలో సామాన్యుల కోసం ఉద్దేశించిన ఎల్‌ఐజీ ఫ్లాట్లను నిర్మించకుండా ఇష్టారాజ్యంగా కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా
మధ్యతరగతి ప్రజలకు అపార్ట్‌మెంట్లు, కాలనీలుగా ఆవిర్భవించాల్సిన దాదాపు 186 ఎకరాల భూములు డెవలపర్స్ చేతిలో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, భారీ హోటళ్లుగా మారాయి. ఇక్కడే అసలు మెలికంతా ఉంది. ఆర్థిక వనరులు సమీకరించే పేరిట ప్రభుత్వం 2004-05 మధ్య కాలంలో హౌసింగ్‌బోర్డు భూములు విక్రయించి.. ఆ సొమ్మును బోర్డు ఖాతాలో కాకుండా ప్రభుత్వ ఖాతాలో జమచేసుకుంది. 

ఈ రకంగా దాదాపు 3వేల కోట్ల రూపాయలు బోర్డుకు కాకుండాపోయాయి. ఇదొక ఎత్తయితే.. ఈ భూములు కొనుగోలు చేసిన కంపెనీలు.. హౌసింగ్ బోర్డుకు కట్టాల్సిన రాయల్టీని ఎగ్గొట్టడం, చెల్లింపుల జాప్యం వంటి కారణాలతో హౌసింగ్‌బోర్డు దాదాపు 1200 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ లెక్క స్వయంగా విజిలెన్స్ కమిషన్ తేల్చినదే. ఈ ఎగవేతదారుల్లో రాంకీ ఇన్‌ప్రాస్ట్రక్చర్స్, ఇందూ ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్, డీఎల్‌ఎఫ్, మధుకాన్ వంటి బడాకంపెనీలు కూడా ఉన్నాయి.

కంపెనీలపై విజిలెన్స్ నిఘా..

జాయింట్ వెంచర్లతో కుంభకోణానికి పాల్పడ్డ హైదరాబాద్‌లోని ఏడు కంపెనీలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి నివేదిక రూపొందించింది. జాయింట్ వెంచర్ల పేరుతో వెలిసిన కంపెనీ బాగోతాలు, ప్రభుత్వానికి అవి చేసిన నష్టం, దానిని భర్తీ చేసేందుకు చర్యలను సుదర్ఘీంగా నివేదికలో పేర్కొంది.

జాయింట్ వెంచర్లు నిర్మించి స్థానిక మార్కెట్ విలువను పట్టించుకోకపోడం, జాయింట్‌వెంచర్ విధానాన్ని అమలు చేసే సమయంలో ఈక్విటీ నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధిపొందారని నివేదిక పేర్కొంది. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన డెవలపర్లతో కుదుర్చుకున్న అగ్రిమెంట్లను రద్దుచేయాలని, ఈ వ్యవహారంపై సీఐడీ లేదా సీబీఐ విచారణ జరుపాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నాలుగు నెలలక్రితం ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇలాగే జాయింట్ వెంచర్ల పేరుతో నిబంధనలు ఉల్లంఘించిన మరో 16 సంస్థలపై హౌసింగ్ బోర్డు అధికారులే స్వయంగా విచారణ జరిపి ఆ సంస్థల అగ్రిమెంట్లను రద్దు చేయాలని కూడా విజిలెన్స్ కమిషన్ తన నివేదికలో సిఫారసు చేసింది. అయితే.. ఈ నివేదిక బయటకు రాకుండా కొంతమంది బిల్డర్ల అడుగులకు మడుగులొత్తే అధికారులు తొక్కిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దానికి సీమాంధ్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లుకూడా కారణమని హౌసింగ్‌బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి