-రావిర్యాలలో కనిపించని 400 ఎకరాలు
-టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ రికార్డుల్లో వ్యత్యాసం
-1565 ఎకరాలు కేటాయించాం: రెవెన్యూశాఖ
-లేదు.. 1165 ఎకరాలే వచ్చాయి : టీఎస్‌ఐఐసీ
-సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వ నిర్ణయం
ఎవరైనా కన్నంవేసి ఎత్తుకెళితే బంగారం, డబ్బువంటివి మాయమవుతాయి! మరి భూమి మాయమైతే? రికార్డుల్లో ఉన్న భూమి.. క్షేత్రస్థాయిలో కనిపించకపోతే? ఆ భూమిని కూడా ఎత్తుకెళ్లారని భావించాలా? రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో జరిగిన బాగోతం గమనిస్తే అలానే భావించాల్సి వస్తుంది! ఇక్కడ ఏకంగా 400 ఎకరాల భూమి అదృశ్యమైపోయింది. ఇదేదో సాదాసీదా భూమి విషయం కానేకాదు.. ఎకరం యాభై లక్షల రూపాయల చొప్పున 200 కోట్ల రూపాయల విలువైన నేలకు సంబంధించిన మాయాజాలం.-టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ రికార్డుల్లో వ్యత్యాసం
-1565 ఎకరాలు కేటాయించాం: రెవెన్యూశాఖ
-లేదు.. 1165 ఎకరాలే వచ్చాయి : టీఎస్‌ఐఐసీ
-సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వ నిర్ణయం

కేటాయింపుల రికార్డుల్లోనే తేడా
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో సర్వే నం.1లోని 1565 ఎకరాల భూమిని 1970లో పశు సంవర్థక శాఖకు కేటాయించారు. కానీ ఆ భూములను వినియోగంలోకి తెచ్చుకోకుండా వృథాగా ఉంచారు. ఆ తర్వాత పారిశ్రామీకరణ ఊపందుకుంది. ఈ క్రమంలో ఏపీఐఐసీ దృష్టి ఆ భూములపై పడింది. పశు సంవర్థక శాఖకు ఆ స్థాయిలో భూమి అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. వెంటనే ఆ భూమిని 2002లో ఏపీఐఐసీకి బదలాయించారు. దాన్ని హార్డ్‌వేర్ పార్కుగా మార్చారు.
ఇప్పటికే చాలా వరకు వివిధ కంపెనీలకు కేటాయించారు. రెవెన్యూ రికార్డుల్లోనూ బదలాయింపుల తంతును ముగించారు. కానీ.. 12 ఏళ్ల తర్వాత తమకు కేటాయించినది 1165 ఎకరాలేనని టీఎస్‌ఐఐసీ అంటున్నది. రెవెన్యూశాఖ మాత్రం పశు సంవర్థక శాఖ పరిధిలోని మొత్తం భూమిని ఇచ్చేశామని పేర్కొంటున్నది. రికార్డుల్లో ఉన్న 1565 ఎకరాలకు, క్షేత్ర స్థాయిలో ఉన్న 1165 ఎకరాలకు మధ్య 400 ఎకరాలు తేడా ఉంది. మరి ఈ భూమి ఏమైనట్లు? ఎవరెత్తుకెళ్లినట్లు? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసిన లెక్కల్లో ఈ వ్యత్యాసం బయట పడింది.
కనిపించకుండా పోయిన 400 ఎకరాలపై దర్యాప్తు చేయడానికి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు సర్వే ల్యాండ్ రికార్డుల శాఖకు లేఖ రాసినట్లు మహేశ్వరం మండల తహసీల్దార్ గోపిరాంనాయక్ టీ మీడియాకు చెప్పారు. పశు సంవర్థక శాఖ ఆధీనంలోని మొత్తం భూమిని ఏపీఐఐసీకి కేటాయించినట్లుగా రికార్డులు ఉన్నట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకునేటప్పుడు ఎలాంటి సర్వే చేయకుండానే స్వీకరించి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. అత్యంత ఖరీదైన 400 ఎకరాల లెక్క తేలాలంటే డిజిటల్ సర్వే చేయాల్సి ఉంటుందని, అప్పుడే నిజానిజాలు బయటికి వస్తాయని చెప్పారు. త్వరలోనే ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఆ విషయం మాకు తెలియదన్న టీఎస్‌ఐఐసీ
రావిర్యాలలో తమకు కేటాయించిన భూముల్లో ఎలాంటి తేడాల్లేవని టీఎస్‌ఐఐసీ స్పష్టం చేస్తోంది. 2002లో నాటి ఏపీఐఐసీకి కేటాయించినది 1165 ఎకరాలేనని టీఎస్‌ఐఐసీ మహేశ్వరం జోనల్ మేనేజర్ కే సూరిబాబు చెప్పారు. పశు సంవర్థక శాఖ ఆధీనంలోని మొత్తం భూమిని కేటాయించలేదని, అప్పగించినదంతా పక్కాగా ఉన్నదని అన్నారు. 400 ఎకరాలు కనిపించడం లేదనే విషయం తమ పరిధిలోకి రాదన్నారు. కార్పొరేషన్‌కు ఈ విషయంపై ఎలాంటి అవగాహన లేదని వివరించారు. సర్వే చేయడం ద్వారా నిజానిజాలు వెల్లడవుతాయని ఆయన కూడా అభిప్రాయపడ్డారు. దర్యాప్తు జరిగితే ఇందులో లొసుగులు బయటపడతాయన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి